01-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఇప్పటివరకూ ఏదైతే చదివారో, అదంతా మర్చిపోండి, పూర్తిగా బాల్యములోకి వెళ్ళిపోండి, అప్పుడే ఈ ఆత్మిక చదువులో పాస్ అవ్వగలుగుతారు

ప్రశ్న:-

ఏ పిల్లలకైతే దివ్య బుద్ధి లభించిందో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-

ఆ పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఈ కళ్ళతో చూస్తూ కూడా చూడరు. పాత ప్రపంచం ఇక అంతమవ్వనున్నది అని వారి బుద్ధిలో సదా ఉంటుంది. ఈ శరీరము కూడా పాతది, తమోప్రధానమైనది, అలాగే ఆత్మ కూడా తమోప్రధానమైనది, వీటిపై ప్రీతిని ఏముంచాలి. ఇటువంటి దివ్య బుద్ధి కల పిల్లల పట్లే తండ్రి హృదయం కూడా జోడించబడి ఉంటుంది. ఇటువంటి పిల్లలే తండ్రి స్మృతిలో నిరంతరం ఉండగలరు. సేవలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు.

ఓంశాంతి

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. హద్దులోని సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు, ఎందుకంటే వారు - మేము బ్రహ్మములో లీనమైపోతాము కావున ఈ ప్రపంచము నుండి అభిరుచిని విడిచిపెట్టాలి అని భావిస్తారు. వారు అభ్యాసము కూడా అటువంటిదే చేస్తారు. వెళ్ళి ఏకాంతములో ఉంటారు. వారు హఠయోగులు, తత్వజ్ఞానులు. బ్రహ్మములో లీనమైపోతాము అని భావిస్తారు, అందుకే మమకారాన్ని తొలగించుకునేందుకు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. వైరాగ్యము వస్తుంది. కానీ మమకారము వెంటనే తొలగిపోదు. భార్య, పిల్లలు మొదలైనవారు గుర్తుకువస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు జ్ఞాన బుద్ధితో అన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది. దేని జ్ఞాపకము అంత త్వరగా పోదు. ఇప్పుడు మీరు ఈ అనంతమైన సన్యాసమును చేస్తారు. స్మృతి అయితే సన్యాసులందరికీ కూడా ఉంటుంది. కానీ బుద్ధి ద్వారా - మేము బ్రహ్మములో లీనమవ్వాలి కావున మేము దేహ భానాన్ని ఉంచుకోకూడదు అని వారు భావిస్తారు. అది హఠయోగ మార్గము. మేము ఈ శరీరాన్ని వదిలి బ్రహ్మములో లీనమైపోతాము అని భావిస్తారు. తాము శాంతిధామానికి ఎలా వెళ్ళగలరు అనేది వారికి తెలియనే తెలియదు. మనం మన ఇంటికి వెళ్ళాలి అని మీకు ఇప్పుడు తెలుసు. విదేశాల నుండి వచ్చేవారు - మేము వయా బాంబే వెళ్ళాలి... అని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు కూడా పక్కా నిశ్చయం ఉంది. వీరి పవిత్రత బాగుంది, జ్ఞానం బాగుంది, ఈ సంస్థ బాగుంది అని చాలా మంది అంటారు. మాతలు బాగా కష్టపడతారు ఎందుకంటే అలసట లేకుండా అర్థం చేయిస్తారు. వారు తమ తనువు, మనస్సు, ధనములను ఉపయోగిస్తారు, అందుకే వారు మంచిగా అనిపిస్తారు. కానీ, మేము కూడా ఇటువంటి అభ్యాసము చేయాలి అన్న ఆలోచన కూడా వారికి రాదు. అలా ఏ ఒక్కరో వెలువడుతారు. తండ్రి కూడా అంటారు - కోట్లాదిమందిలో ఏ ఒక్కరో అనగా మీ వద్దకు ఎవరైతే వస్తారో వారి నుండి ఏ ఒక్కరో వెలువడుతారు. ఇకపోతే ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. సాక్షాత్కారం జరిగినా, జరగకపోయినా అనంతమైన తండ్రి వచ్చారు అని వివేకం చెప్తుంది. తండ్రి ఒక్కరేనని, ఆ పారలౌకిక తండ్రే జ్ఞానసాగరుడని కూడా మీకు తెలుసు. లౌకిక తండ్రిని ఎప్పుడూ జ్ఞానసాగరుడు అని అనరు. ఇక్కడ కూడా తండ్రే వచ్చి పిల్లలైన మీకు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు పాత ప్రపంచం అంతమవ్వనున్నదని, మనం 84 జన్మల చక్రం పూర్తి చేసామని మీకు తెలుసు. ఇప్పుడు ఇక తిరిగి శాంతిధామము వయా, సుఖధామములోకి వెళ్ళేందుకు మనం పురుషార్థం చేస్తున్నాము. శాంతిధామానికైతే తప్పకుండా వెళ్ళాలి. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడకు తిరిగి రావాలి. మనుష్యులు ఈ విషయాలలో తికమకపడి ఉన్నారు. ఎవరైనా మరణిస్తే వైకుంఠానికి వెళ్ళారని భావిస్తారు. కానీ వైకుంఠము ఎక్కడ ఉంది? ఈ వైకుంఠము అనే పేరైతే భారతవాసులకే తెలుసు, ఇతర ధర్మాలవారికి తెలియనే తెలియదు. కేవలం పేరు విన్నారు, చిత్రాలను చూసారు. దేవతల మందిరాలు మొదలైనవాటిని ఎన్నో చూసారు. ఈ దిల్వాడా మందిరం ఉంది కదా. లక్షలాది, కోట్లాది రూపాయలను ఖర్చు చేసి తయారుచేసారు, అలా తయారుచేస్తూనే ఉంటారు. దేవీ-దేవతలను వైష్ణవులు అని అంటారు. వారు విష్ణువంశావళి. వారు పవిత్రమైనవారు. సత్యయుగాన్ని పావన ప్రపంచము అని అంటారు. ఇది పతిత ప్రపంచము. సత్యయుగ వైభవాలు మొదలైనవేవీ ఇక్కడ ఉండవు. ఇక్కడైతే ధాన్యము మొదలైనవన్నీ తమోప్రధానముగా అయిపోతాయి. ఇక్కడి రుచులు కూడా తమోప్రధానమైనవే. కుమార్తెలు ధ్యానములోకి వెళ్తారు, అలా వెళ్ళినప్పుడు - మేము శూభీ రసాన్ని తాగి వచ్చాము, అది ఎంతో రుచిగా ఉంది అని అంటారు. ఇక్కడ కూడా మీ చేతి వంట తిన్నప్పుడు - ఇది చాలా రుచిగా ఉంది అని అంటారు, ఎందుకంటే మీరు బాగా తయారుచేస్తారు. అందరూ తనివితీరా తింటారు. అలాగని మీరు యోగములో ఉంటూ తయారుచేస్తారు కాబట్టే రుచిగా ఉంటుందని కాదు! అలా కాదు. అది కూడా ఒక అభ్యాసమే. కొందరు భోజనం చాలా బాగా తయారుచేస్తారు. అక్కడైతే ప్రతి వస్తువూ సతోప్రధానముగా ఉంటుంది, అందుకే వాటిలో చాలా శక్తి ఉంటుంది. తమోప్రధానముగా అవ్వడం వల్ల శక్తి తగ్గిపోతుంది, దాని వల్ల రోగాలు, దుఃఖము మొదలైనవి కూడా కలుగుతూ ఉంటాయి. దీని పేరే దుఃఖధామము. సుఖధామములో దుఃఖము యొక్క విషయమే ఉండదు. మనమందరమూ ఎంతటి సుఖములోకి వెళ్తాము అంటే, వాటిని స్వర్గ సుఖాలు అని అంటారు. కేవలం మీరు పవిత్రముగా అవ్వాలి, అది కూడా ఈ జన్మ కొరకే. తర్వాత ఏమిటి అన్నదాని గురించి ఆలోచించకండి, ఇప్పుడైతే మీరు పవిత్రముగా అవ్వండి. అసలు మొదట - ఈ మాట చెప్తుంది ఎవరు అన్నది ఆలోచించండి! అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వము లభిస్తుంది. లౌకిక తండ్రి కూడా పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. పిల్లలైన మీరు ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో వారికి లోపల - ఈ ప్రపంచంలో మేము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము అన్నది ఉంటుంది. ఇది గవ్వతుల్యమైన శరీరము. ఆత్మ కూడా గవ్వతుల్యముగా అయిపోయింది. దీనిని వైరాగ్యము అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామాను తెలుసుకున్నారు. భక్తి మార్గం పాత్ర నడవవలసిందే. అందరూ భక్తిలో ఉన్నారు, ఇందులో ద్వేషము యొక్క అవసరమేమీ లేదు. సన్యాసులు ద్వేషాన్ని కలిగిస్తారు. ఇంట్లో అందరూ దుఃఖితులుగా అయిపోతారు, వారు వెళ్ళి కేవలం తమను తాము కాస్త సుఖవంతంగా చేసుకుంటారు. ముక్తిలోకి అయితే ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఎవరెవరైతే వచ్చారో వారిలో ఎవ్వరూ తిరిగి వెళ్ళలేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక్కరు కూడా నిర్వాణధామములోకి లేక బ్రహ్మములోకి వెళ్ళలేదు. వారు ఫలానావారు బ్రహ్మములో లీనమైపోయారు అని భావిస్తారు. ఇదంతా భక్తి మార్గపు శాస్త్రాల్లో ఉంది. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవాటిలో ఏదైతే ఉందో, అదంతా భక్తి మార్గానికి చెందినది. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తోంది, అందుకే మీరు ఏమీ చదవవలసిన అవసరం లేదు. కానీ కొందరు ఎలాంటి వారు ఉన్నారంటే వారికి నవలలు మొదలైనవి చదివే అలవాటు ఉంటుంది. జ్ఞానమైతే పూర్తిగా లేదు. వారిని కోడి వంటి జ్ఞాని అని అంటారు (కోడి వలె ఇతరులను లేపుతూ స్వయం మాత్రం అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారు). రాత్రి నవలలు చదివి నిదురించినట్లయితే వారి గతి ఏమవుతుంది? ఇక్కడైతే తండ్రి అంటారు, మీరు ఏదైతే చదివారో దానినంతటినీ మర్చిపోండి. ఈ ఆత్మిక చదువులో నిమగ్నమైపోండి. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు, దీని ద్వారా మీరు 21 జన్మల కొరకు దేవతలుగా అయిపోతారు. ఇప్పటివరకు ఏదైతే చదివారో దానినంతటినీ మర్చిపోవలసి ఉంటుంది. పూర్తిగా బాల్యములోకి వెళ్ళిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ కనులతో చూస్తున్నా కానీ చూస్తూ కూడా చూడకుండా ఉండండి. మీకు దివ్య దృష్టి, దివ్య బుద్ధి లభించాయి, కావున ఇదంతా పాత ప్రపంచము అని అర్థం చేసుకున్నారు. ఇది అంతమవ్వనున్నది. వీరంతా స్మశానయోగ్యులుగా ఉన్నారు, వీరిపై ఏం మనస్సు పెట్టుకుంటారు. ఇప్పుడు స్వర్గవాసులుగా అవ్వాలి. మీరు ఇప్పుడు స్మశానము మరియు సత్యయుగము, ఈ రెండింటికీ మధ్యలో కూర్చున్నారు. సత్యయుగము ఇప్పుడు తయారవుతోంది. ఇప్పుడు పాత ప్రపంచములో కూర్చొని ఉన్నారు. కానీ మధ్యలో బుద్ధియోగము అటువైపుకు వెళ్ళిపోయింది. మీరు కొత్త ప్రపంచము కొరకే పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు మధ్యలో కూర్చున్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరము యొక్క అర్థము కూడా అర్థం చేసుకోరు. పురుషోత్తమ సంగమయుగానికి చాలా కొద్ది సమయమే లభించింది. యూనివర్శిటీలోకి ఆలస్యంగా వస్తే ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. స్మృతి ఎంతో కష్టంగా నిలుస్తుంది, మాయ విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. తండ్రి ఇక్కడ కూర్చొని ఉన్నా, చూస్తూ ఉన్నా - ఇదంతా ఇక అంతమవ్వనున్నది, ఏదీ మిగలదు అని వారి బుద్ధిలో ఉంది. ఇది పాత ప్రపంచము, దీనిపై వైరాగ్యము కలుగుతుంది. శరీరధారులందరూ కూడా పాతవారే. శరీరము పాతదిగా, తమోప్రధానముగా ఉంది, ఆత్మ కూడా తమోప్రధానముగా ఉంది. అటువంటి దానిని మనం చూసి ఏం చేస్తాము. ఇదేదీ ఉండేది లేదు, వీటిపై ప్రీతి లేదు. పిల్లలలో కూడా - ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో, వారితోనే తండ్రి హృదయం కూడా జోడించబడుతుంది. వాస్తవానికి అందరూ పిల్లలే. ఎంత లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు. అందరూ వారిని చూడరు కూడా. ప్రజాపిత బ్రహ్మా గురించి అయితే తెలియను కూడా తెలియదు. ప్రజాపిత బ్రహ్మా అనే పేరునైతే విన్నారు కానీ వారి ద్వారా ఏమి లభిస్తుంది అన్నది ఏమాత్రమూ తెలియదు. బ్రహ్మా మందిరం ఉంది, గడ్డం ఉన్నవారిగా చూపించారు. కానీ వారిని ఎవ్వరూ స్మృతి చేయరు ఎందుకంటే వారి నుండి వారసత్వము లభించేది లేదు. ఆత్మలకు, ఒకటేమో లౌకిక తండ్రి నుండి, ఇంకొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మా గురించి అయితే ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఇది అద్భుతము. తండ్రి అయి ఉండి కూడా వారసత్వాన్ని ఇవ్వకపోతే మరి వారు అలౌకికమైనట్లే కదా. వారసత్వము హద్దులోనిది మరియు అనంతమైనది ఉంటుంది. మధ్యలో ఇంకే వారసత్వమూ ఉండదు. ప్రజాపిత అని అన్నా కానీ వారసత్వం అంటూ ఏదీ లేదు. ఈ అలౌకిక తండ్రికి కూడా పారలౌకిక తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది, కావున వారు ఎలా ఇస్తారు! పారలౌకిక తండ్రి ఇతని ద్వారా ఇస్తారు. వీరు రథము. వీరిని ఏం స్మృతి చేస్తారు. వీరు స్వయం కూడా ఆ తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. వీళ్ళు ఈ బ్రహ్మానే పరమాత్మగా భావిస్తున్నారు అని మనుష్యులు మన గురించి అనుకుంటారు. కానీ మనకు వీరి నుండి వారసత్వం లభించదు, వారసత్వమైతే శివబాబా నుండే లభిస్తుంది. వీరు మధ్యలో మధ్యవర్తి రూపములో ఉన్నారు. వీరు కూడా మన వంటి విద్యార్థియే. ఇందులో భయపడే విషయమేదీ లేదు.

తండ్రి అంటారు, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తమోప్రధానముగా ఉంది. మీరు యోగబలం ద్వారా సతోప్రధానముగా అవ్వాలి. లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది. మీరు ఇప్పుడు మీ బుద్ధిని అనంతములో జోడించాలి. తండ్రి అంటారు, ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి ఏమీ లభించేది లేదు. దేవతలే అయినా కానీ, ఈ సమయంలో అందరూ తమోప్రధానముగా ఉన్నారు. లౌకిక తండ్రి నుండి వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. మరి ఈ లక్ష్మీ-నారాయణుల నుండి మీరు ఏమి కోరుకుంటున్నారు? వీరు అమరులని, ఎప్పుడూ మరణించరని, తమోప్రధానముగా అవ్వరని వారు భావిస్తారు, కానీ మీకు తెలుసు, ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారే తమోప్రధానతలోకి వస్తారు. శ్రీకృష్ణుడిని లక్ష్మీ-నారాయణుల కన్నా ఉన్నతునిగా భావిస్తారు ఎందుకంటే ఎంతైనా వారైతే వివాహం చేసుకున్నారు. శ్రీకృష్ణుడైతే జన్మ నుండే పవిత్రముగా ఉన్నారు, అందుకే శ్రీకృష్ణునికి ఎంతో మహిమ ఉంది. ఊయలలో కూడా శ్రీకృష్ణుడినే ఊపుతారు. జయంతి కూడా శ్రీకృష్ణునిదే జరుపుతారు. లక్ష్మీ-నారాయణులది ఎందుకు జరపరు? జ్ఞానం లేని కారణముగా శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. గీతా జ్ఞానాన్ని ద్వాపరయుగములో ఇచ్చారు అని అంటారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం ఎంత కఠినము! జ్ఞానమైతే పరంపరగా నడుస్తూ వస్తోంది అని అంటారు. కానీ పరంపర కూడా ఎప్పటి నుండి? ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అన్నది కూడా తెలియదు, అందుకే రచయిత మరియు సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి మాకు తెలియదు అని అంటారు. కల్పము యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు అని అనడంతో వారు ఇక పరంపర అని అనేస్తారు. తిథి, తారీఖు మొదలైనవేవీ తెలియవు. లక్ష్మీ-నారాయణుల జన్మదినాన్ని జరుపుకోరు. దీనిని అజ్ఞానాంధకారము అని అంటారు. మీలో కూడా కొందరికి ఈ విషయాల గురించి యథార్థముగా తెలియదు. అందుకే మహారథులు, గుర్రపు స్వారీ వారు మరియు పాదచారులు అని అనడం జరుగుతుంది. ఏనుగును మొసలి తిన్నది. మొసళ్ళు పెద్దగా ఉంటాయి, ఒక్కసారిగా మింగేస్తాయి. సర్పం కప్పను మింగినట్లుగా మింగేస్తాయి.

భగవంతుడిని తోట యజమాని, తోట మాలి, నావికుడు అని ఎందుకు అంటారు? ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చి విషయ సాగరం నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు, అందుకే నా నావను తీరానికి చేర్చండి అని అంటారు. మనం ఏ విధంగా ఆవలి తీరానికి వెళ్తున్నాము అన్నది మీకు కూడా ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని క్షీర సాగరములోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖము, బాధ యొక్క విషయమేమీ లేదు. మీరు ఈ విషయాలను విని ఇతరులకు కూడా ఏమని చెప్తారంటే - నావను తీరానికి చేర్చే నావికుడు చెప్తున్నారు - ఓ పిల్లలూ, మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి, మీరు మొదట క్షీర సాగరములో ఉండేవారు, ఇప్పుడు విషయ సాగరములోకి వచ్చి చేరుకున్నారు. ఇంతకుముందు మీరు దేవతలుగా ఉండేవారు. స్వర్గము ప్రపంచములోని అద్భుతము. మొత్తం ప్రపంచమంతటిలోని ఆత్మిక అద్భుతము స్వర్గమే. ఆ పేరు వినడంతోటే సంతోషం కలుగుతుంది. స్వర్గములో మీరు ఉంటారు. ఇక్కడ ఏడు అద్భుతాలను చూపిస్తారు. తాజ్ మహల్ ను కూడా అద్భుతము అని అంటారు కానీ అందులో నివసించేది అయితే లేదు. మీరైతే ప్రపంచ అద్భుతానికి యజమానులుగా అవుతారు. మీరు నివసించేందుకు తండ్రి ఎంత అద్భుతమైన వైకుంఠాన్ని తయారుచేసారు, 21 జన్మల కొరకు పదమపతులుగా అవుతారు, కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషము ఉండాలి. మనం ఆవలి తీరానికి వెళ్తున్నాము. అనేక సార్లు పిల్లలైన మీరు స్వర్గములోకి వెళ్ళి ఉంటారు. ఈ చక్రములో మీరు తిరుగుతూనే ఉంటారు. పురుషార్థము ఎలా చేయాలంటే, దాని ద్వారా మనం కొత్త ప్రపంచములోకి మొట్టమొదటగా రావాలి. పాత ఇంట్లోకి వెళ్ళాలి అన్న ఆశ ఏమైనా ఉంటుందా. పురుషార్థము చేసి కొత్త ప్రపంచములోకి వెళ్ళండి అని బాబా విశేషంగా చెప్తున్నారు. బాబా మనల్ని ప్రపంచ అద్భుతానికి యజమానులుగా చేస్తారు. మరి అటువంటి తండ్రిని మనం ఎందుకు స్మృతి చేయము. ఎంతగానో కష్టపడాలి. దీనిని చూస్తూ కూడా చూడకండి. తండ్రి అంటారు, నేను చూస్తున్నా కానీ నేను కొద్ది రోజుల యాత్రికుడినే అన్న జ్ఞానం నాలో ఉంది. అలాగే మీరు కూడా ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు. అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించివేయండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక చదువులో సదా బిజీగా ఉండాలి. ఎప్పుడూ నవలలు మొదలైనవి చదివే అశుద్ధమైన అలవాటును చేసుకోకూడదు, ఇప్పటివరకూ ఏదైతే చదివారో, దానిని మరచి తండ్రిని స్మృతి చేయాలి.

2. ఈ పాత ప్రపంచములో స్వయాన్ని అతిథిగా భావిస్తూ ఉండాలి. దీనిపై ప్రీతిని ఉంచుకోకూడదు, దీనిని చూస్తూ కూడా చూడకూడదు.

వరదానము:-

ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళలో ఎగిరే తీవ్ర పురుషార్థీ భవ

ఎగిరే కళకు రెండు రెక్కలు ఉన్నాయి - ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలు. ఏ కార్యములోనైనా సఫలతను పొందేందుకు ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలు ఎంతో తప్పనిసరి. ఎక్కడైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉండవో, అక్కడ అలసట ఉంటుంది మరియు అలిసిపోయినవారు ఎప్పుడూ సఫలతను పొందరు. వర్తమాన సమయమనుసారంగా ఎగిరే కళ లేకుండా గమ్యానికి చేరుకోలేరు ఎందుకంటే పురుషార్థము ఒక్క జన్మది కానీ ప్రాప్తి 21 జన్మలకే కాదు, మొత్తం కల్పానికి సంబంధించినది. కావున ఎప్పుడైతే సమయం యొక్క విలువ స్మృతిలో ఉంటుందో, అప్పుడు పురుషార్థము స్వతహాగానే తీవ్రగతితో కూడినదిగా అవుతుంది.

స్లోగన్:-

సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారే కామధేనువు.