02-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలు - ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి, సోదర దృష్టితో చూసినట్లయితే దేహాన్ని చూడరు, దృష్టి పాడవ్వదు, వాణిలో శక్తి ఉంటుంది’’

ప్రశ్న:-

తండ్రి పిల్లలకు ఋణపడి ఉన్నారా లేక పిల్లలు తండ్రికి ఋణపడి ఉన్నారా?

జవాబు:-

పిల్లలైన మీరైతే అధికారులు, తండ్రి మీకు ఋణపడి ఉన్నారు. పిల్లలైన మీరు దానమిచ్చినప్పుడు, దానికి ఒకటికి 100 రెట్లు తండ్రి మీకు ఇవ్వవలసి ఉంటుంది. ఈశ్వరార్థము మీరు ఏదైతే ఇస్తారో మరుసటి జన్మలో దానికి రిటర్న్ లభిస్తుంది. మీరు పిడికెడు బియ్యాన్ని ఇచ్చి విశ్వానికి యజమానులుగా అవుతారు కావున మీరు ఎంతటి విశాలహృదయులుగా ఉండాలి. నేను బాబాకు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు.

ఓంశాంతి

ఇది పురుషోత్తమ సంగమయుగమని మ్యూజియంలలో, ప్రదర్శనీలలో అర్థం చేయించాలి. కేవలం మీరు మాత్రమే వివేకవంతులు, కావున అందరికీ - ఇది పురుషోత్తమ సంగమయుగము అని ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువ సేవ జరిగే స్థానము మ్యూజియం. అక్కడికి ఎంతోమంది వస్తారు, మంచి సేవాధారులైన పిల్లలు తక్కువగా ఉన్నారు. సెంటర్లు అన్నీ సర్వీస్ స్టేషన్లు. ఢిల్లీలో స్పిరిచ్యువల్ మ్యూజియం అని వ్రాయబడి ఉంది, కానీ ఆ పదముతో కూడా యథార్థ అర్థం రాదు. మీరు భారత్ కు ఏ సేవ చేస్తున్నారని చాలా మంది ప్రశ్నిస్తారు. భగవానువాచ ఉంది కదా - ఇది అడవి. మీరు ఈ సమయంలో సంగమయుగములో ఉన్నారు. మీరు అడవికి చెందినవారు కాదు, అలాగే పుష్పాలతోటకు చెందినవారూ కాదు. ఇప్పుడు పుష్పాలతోటలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. మీరు ఈ రావణరాజ్యాన్ని రామరాజ్యముగా తయారుచేస్తున్నారు. ఇంత ఖర్చు ఎక్కడి నుండి వస్తుందని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు ఇలా చెప్పండి - బి.కే.లమైన మేమే చేస్తున్నాము, ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది, మీరు కొద్ది రోజులు వచ్చి అర్థం చేసుకోండి - మేము ఏమి చేస్తున్నాము, మా లక్ష్యము-ఉద్దేశ్యము ఏమిటి అని. వారు రాజ్యాలను అంగీకరించరు, అందుకే రాజుల రాజ్యాలను సమాప్తం చేసేసారు. ఈ సమయంలో వారు కూడా తమోప్రధానముగా అయిపోయారు, అందుకే బాగా అనిపించరు. డ్రామానుసారంగా వారి దోషము కూడా లేదు. డ్రామాలో ఏదైతే జరుగుతుందో, ఆ పాత్రను మనం అభినయిస్తున్నాము. కల్పకల్పమూ తండ్రి ద్వారా స్థాపన యొక్క ఈ పాత్ర నడుస్తుంది. ఇక్కడ ఖర్చు కూడా పిల్లలైన మీరు మీ కొరకే చేస్తారు. శ్రీమతమనుసారంగా మీ ఖర్చు మీరు చేసి మీ కొరకు సత్యయుగ రాజధానిని తయారుచేసుకుంటున్నారు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు కూడా. గుప్త యోధులు అన్న మీ పేరు ప్రసిద్ధమైనది. వాస్తవానికి ఆ సైన్యములో గుప్త యోధులు అంటూ ఎవరూ ఉండరు. సిపాయిలకు రిజిస్టర్ ఉంటుంది. తమ పేరు, నంబరు రిజిస్టర్ లో లేకపోవడము అనేది జరగదు. వాస్తవానికి గుప్త యోధులు మీరు. మీ పేరు ఏ రిజిస్టర్ లోనూ లేదు. మీకు ఆయుధాల శక్తి ఏమీ లేదు. ఇందులో దైహిక హింస అయితే లేదు. యోగబలం ద్వారా మీరు విశ్వముపై విజయాన్ని పొందుతారు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు కదా. స్మృతి ద్వారా మీరు శక్తిని తీసుకుంటున్నారు. సతోప్రధానులుగా అయ్యేందుకు మీరు తండ్రితో యోగము జోడిస్తున్నారు. మీరు సతోప్రధానముగా అయితే రాజ్యం కూడా సతోప్రధానమైనదే కావాలి. దానిని మీరు శ్రీమతముపై స్థాపన చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారు కానీ కనిపించరో, వారిని గుప్తమైనవారు అని అంటారు. మీరు శివబాబాను కూడా ఈ కనుల ద్వారా చూడలేరు. మీరు కూడా గుప్తమైనవారు, అలాగే మీరు శక్తిని కూడా గుప్తముగా తీసుకుంటున్నారు. మీరు పతితుల నుండి పావనులుగా అవుతున్నారని మరియు పావనమైనవారిలోనే శక్తి ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగములో మీరందరూ పావనంగా ఉంటారు. వారి 84 జన్మల కథనే తండ్రి తెలియజేస్తారు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకొని, పవిత్రంగా అయి మళ్ళీ పవిత్ర ప్రపంచంలో రాజ్యభాగాన్ని పొందుతారు. బాహుబలంతో ఎప్పుడూ ఎవ్వరూ విశ్వముపై విజయాన్ని పొందలేరు. ఇది యోగబలం యొక్క విషయము. వారు యుద్ధాలు చేస్తారు, కానీ రాజ్యం మీ చేతిలోకి రానున్నది. తండ్రి సర్వశక్తివంతుడు కావున వారి నుండి శక్తి లభించాలి. మీకు తండ్రి గురించి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు.

మనమే స్వదర్శన చక్రధారులమని మీకు తెలుసు. ఇది అందరికీ గుర్తుండదు. పిల్లలైన మీకు ఇది గుర్తుండాలి ఎందుకంటే పిల్లలైన మీకే ఈ జ్ఞానం లభిస్తుంది. బయటివారు ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు, అందుకే వారిని సభలో కూర్చోబెట్టడం జరుగదు. పతిత-పావనుడైన తండ్రిని అందరూ పిలుస్తారు, కానీ తమను తాము పతితులుగా ఎవ్వరూ భావించరు, ‘పతిత-పావనా సీతారామ్’ అంటూ ఏదో నామమాత్రంగా పాడుతూ ఉంటారు. మీరందరూ వధువులు, తండ్రి వరుడు. సర్వుల సద్గతిని చేసేందుకే వారు వస్తారు. పిల్లలైన మిమ్మల్ని అలంకరిస్తారు. మీకు డబల్ ఇంజిన్ లభించింది. రోల్స్ రాయస్ లో ఇంజిన్ చాలా బాగుంటుంది. తండ్రి కూడా అటువంటివారే. పతిత-పావనా రండి, మమ్మల్ని పావనంగా తయారుచేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటారు. మీరందరూ శాంతిగా కూర్చున్నారు. ఎటువంటి చిడతలు, వాయిద్యాలు మొదలైనవి మ్రోగించరు. ఇక్కడ కష్టతరమైన విషయమేదీ లేదు. నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, ఎవరు కలిస్తే వారికి మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. తండ్రి అంటారు - నా భక్తులు లేక లక్ష్మీ-నారాయణులు, రాధే-కృష్ణులు మొదలైనవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, వారికి ఈ జ్ఞానాన్ని దానమివ్వాలి, దీనిని వ్యర్థంగా పోనివ్వకూడదు. పాత్రులకే దానమివ్వడం జరుగుతుంది. పతిత మనుష్యులు, పతితులకే దానమిస్తూ ఉంటారు. తండ్రి సర్వశక్తివంతుడు, వారి నుండి మీరు శక్తిని తీసుకొని ఉత్తములుగా అవుతారు. రావణుడు వచ్చినప్పుడు కూడా - అది త్రేతా-ద్వాపర యుగాల సంగమము. ఇది కలియుగము మరియు సత్యయుగము యొక్క సంగమము. జ్ఞానం ఎంత సమయము నడుస్తుంది మరియు భక్తి ఎంత సమయము నడుస్తుంది అన్న విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని అర్థం చేయించాలి. ముఖ్యమైన విషయము ఏమిటంటే - అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఎప్పుడైతే అనంతమైన తండ్రి వస్తారో, అప్పుడు వినాశనం కూడా జరుగుతుంది. మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారో, అప్పుడు. కొత్త ప్రపంచము యొక్క ఆది మరియు పాత ప్రపంచం యొక్క అంతము అంటే వినాశనము జరగనున్నదని అర్థమవుతుంది. ప్రపంచము ఘోర అంధకారంలో పడి ఉంది, ఇప్పుడు దానిని మేల్కొల్పాలి. అర్ధకల్పం నుండి నిదురించి ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడండి, అప్పుడు మీరు ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే మీ వాణిలో శక్తి వస్తుంది. ఆత్మయే పావనంగా మరియు పతితంగా అవుతుంది. ఆత్మ పావనంగా అయినప్పుడే శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. ఇప్పుడైతే లభించదు. అందరూ పావనంగా అవ్వాలి. కొందరు యోగబలముతో, కొందరు శిక్షల ద్వారా అవుతారు. స్మృతియాత్రలో శ్రమ ఉంది. బాబా ప్రాక్టీస్ కూడా చేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా బాబా స్మృతిలో వెళ్ళండి. ఫాదర్లు కూడా శాంతిగా క్రైస్టు స్మృతిలో వెళ్తారు మరియు క్రైస్టును తలచుకుంటారు. భారతవాసులైతే అనేకులను స్మృతి చేస్తారు. తండ్రి అంటారు, ఒక్కరిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. అనంతమైన తండ్రి ద్వారా మనం ముక్తి మరియు జీవన్ముక్తులకు హక్కుదారులుగా అవుతాము. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. సత్యయుగములో అందరూ జీవన్ముక్తిలో ఉండేవారు, కలియుగంలో అందరూ జీవనబంధనంలో ఉన్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు, ఈ విషయాలన్నింటినీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. అన్ని వైపులా చుట్టి వస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము అని, అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని మనుష్యమాత్రులకు ఈ సందేశాన్ని ఇవ్వడము మీ కర్తవ్యము. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. పాపాలు అంతమవుతాయి. ఇదే సత్యమైన గీత, దీనిని తండ్రి నేర్పిస్తారు. మనుష్య మతము ద్వారా మీరు పడిపోయారు, భగవంతుని మతము ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యమైన విషయము ఏమిటంటే - లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి మరియు పరిచయాన్ని ఇస్తూ ఉండండి. బ్యాడ్జీలైతే మీ వద్ద ఉన్నాయి, వాటిని ఉచితంగా ఇవ్వడానికి ఏం పర్వాలేదు. కానీ పాత్రులను చూసి ఇవ్వాలి.

తండ్రి పిల్లలకు ఫిర్యాదు చేస్తున్నారు - మీరు లౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కానీ పారలౌకిక తండ్రినైన నన్ను మర్చిపోతున్నారు. మీకు సిగ్గు అనిపించడం లేదా. మీరే పవిత్ర ప్రవృత్తి మార్గపు గృహస్థ వ్యవహారములో ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారవ్వాలి. మీరు భగవంతునితో ఒప్పందం కుదుర్చుకున్నవారు. మీ లోపల చూసుకోండి - బుద్ధి ఎక్కడా భ్రమించడం లేదు కదా? తండ్రిని ఎంత సమయం స్మృతి చేసాను? తండ్రి అంటారు - ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి. ఇందులో పొరపాటు చేయకూడదు. సోదర దృష్టితో చూసినట్లయితే దేహాన్ని చూడరు, దృష్టి పాడవ్వదు అని కూడా అర్థం చేయించారు. గమ్యము ఇదే కదా. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. మేము సోదరులము అని అందరూ అంటారు, మనుష్యులు బ్రదర్ హుడ్ (సోదర భావము) అని అంటారు. అది సరే. మనం పరమపిత పరమాత్ముని సంతానము. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఈ విధంగా అర్థం చేయిస్తూ ఉన్నతిని పొందుతూ ఉండండి. తండ్రికి సేవాధారులైన కుమార్తెలు ఎందరో కావాలి. సెంటర్లు తెరుచుకుంటూ ఉంటాయి. పిల్లలకు అభిరుచి ఉంది, అనేకుల కళ్యాణం జరుగుతుందని భావిస్తారు. కానీ సంభాళించే టీచర్లు కూడా మంచి మహారథులై ఉండాలి. టీచర్లు కూడా నంబరువారుగా ఉన్నారు. బాబా అంటారు - ఎక్కడైతే లక్ష్మీ-నారాయణుల మందిరము ఉంటుందో, శివుని మందిరము ఉంటుందో, గంగా తీరము ఉంటుందో, ఎక్కడైతే చాలా పెద్ద గుంపు ఉంటుందో అక్కడ సేవ చేయాలి. కామం మహాశత్రువు అని భగవంతుడు చెప్తున్నారని అర్థం చేయించండి. మీరు శ్రీమతం అనుసారంగా సేవ చేస్తూ ఉండండి. ఇది మీ ఈశ్వరీయ పరివారము, ఇక్కడికి 7 రోజులు భట్టీలోకి వచ్చి పరివారంతో పాటు ఉంటారు. పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. అనంతమైన తండ్రి ద్వారా మీరు పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు. భగవంతుడు కూడా చదివించగలరని ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరు చదువుతున్నారు కావున మీకు ఎంత సంతోషము ఉండాలి. మనం ఉన్నతోన్నతముగా అయ్యేందుకు చదువుతున్నాము. ఎంతటి విశాలహృదయులుగా ఉండాలి. మీరు తండ్రిని ఋణపడేలా చేస్తున్నారు. ఈశ్వరార్థం ఏదైతే ఇస్తారో, దానికి ప్రతిఫలం మరుసటి జన్మలో తీసుకుంటారు కదా. బాబాకు మీరు సర్వస్వాన్ని ఇచ్చారు కావున బాబా కూడా మీకు సర్వస్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నేను బాబాకు ఇచ్చాను అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాకూడదు. చాలామందికి లోలోపల నడుస్తుంది - మేము ఇంత ఇచ్చాము, కానీ మాకు ప్రత్యేకమైన పాలన ఎందుకు జరుగలేదు అని. మీరు పిడికెడు బియ్యమును ఇచ్చి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. బాబా అయితే దాత కదా. రాజులు రాయల్ గా ఉంటారు, మొట్టమొదటసారిగా కలిసినప్పుడు వారికి కానుకను ఇస్తాము కానీ వారు ఎప్పుడూ చేతికి తీసుకోరు. సెక్రెటరీ వైపుకు సైగ చేస్తారు. మరి శివబాబా అయితే దాత, వారెలా తీసుకుంటారు. వీరు అనంతమైన తండ్రి కదా. వీరి ముందు మీరు కానుకను పెడతారు. కానీ బాబా అయితే అందుకు ప్రతిఫలంగా 100 రెట్లు ఇస్తారు. కావున - నేను ఇచ్చాను అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. ఎల్లప్పుడూ - మేమైతే తీసుకుంటున్నాము అని భావించండి. అక్కడ మీరు పదమపతులుగా అవుతారు. మీరు ప్రాక్టికల్ గా పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు. చాలామంది పిల్లలు విశాలహృదయులుగా కూడా ఉన్నారు. అలాగే కొందరు పిసినారులు కూడా ఉన్నారు. పదమాపదమపతులుగా మేమే అవుతాము, మేమే చాలా సుఖవంతులుగా అవుతాము అన్నది అర్థమే చేసుకోరు. ఎప్పుడైతే పరమాత్మ తండ్రి హాజరై ఉండరో, అప్పుడు ఇన్ డైరెక్టుగా, అల్పకాలికంగా ఫలాన్ని ఇస్తారు. వారు హాజరై ఉన్నప్పుడు 21 జన్మల కొరకు ఇస్తారు. శివబాబా భండారా నిండుగా ఉంటుంది అన్న గాయనము ఉంది. చూడండి, లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు. కానీ ఎవరు ఏమిస్తున్నారు అన్నది ఎవ్వరికీ తెలియదు. అది తండ్రికి తెలుసు మరియు తండ్రి యొక్క సంచికి (బ్రహ్మాకు) తెలుసు. వారిలో తండ్రి ఉంటారు, వారు పూర్తిగా సాధారణంగా ఉన్నారు. దీని కారణంగా పిల్లలు ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే ఆ నషా మాయమైపోతుంది. జ్ఞాన-యోగాలు లేకపోతే గొడవలు జరుగుతూ ఉంటాయి. మంచి-మంచి పిల్లలను కూడా మాయ ఓడించేస్తుంది. మాయ విముఖులుగా చేసేస్తుంది. ఏ శివబాబా వద్దకైతే మీరు వస్తారో, వారిని మీరు స్మృతి చేయలేరా! లోలోపల అపారమైన సంతోషము ఉండాలి. మీరు వస్తే మేము మీ వారిగా అవుతామని మీరు ఏ రోజు గురించైతే అన్నారో, ఆ రోజు నేడు వచ్చింది. భగవంతుడు వచ్చి దత్తత తీసుకుంటారంటే, మరి వారిని ఎంతటి అదృష్టవంతులు అని అంటారు. ఎంతటి సంతోషములో ఉండాలి. కానీ మాయ సంతోషాన్ని పోగొట్టేస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. భగవంతుడు మనల్ని దత్తత తీసుకున్నారు, వారే మనల్ని టీచరుగా అయి చదివిస్తున్నారు, అలా మీ పదమాపదమ భాగ్యాన్ని తలచుకుంటూ సంతోషముగా ఉండాలి.

2. ఆత్మలమైన మనము సోదరులము అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి, దేహాన్ని చూడకూడదు. భగవంతునితో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత మళ్ళీ ఇక బుద్ధిని భ్రమింపజేయకూడదు.

వరదానము:-

ఈ అలౌకిక జీవితములో సంబంధాల శక్తి ద్వారా అవినాశీ స్నేహాన్ని మరియు సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మా భవ

ఈ అలౌకిక జీవితములో సంబంధాల శక్తి పిల్లలైన మీకు డబుల్ రూపములో ప్రాప్తించింది. ఒకటేమో - తండ్రితో సర్వ సంబంధాలు, రెండవది - దైవీ పరివారముతో సంబంధాలు. ఈ సంబంధాల ద్వారా సదా నిస్వార్థ స్నేహము, అవినాశీ స్నేహము మరియు సహయోగము సదా ప్రాప్తిస్తూ ఉంటాయి. కావున మీ వద్ద సంబంధాల శక్తి కూడా ఉంది. మీరు ఇటువంటి శ్రేష్ఠ అలౌకిక జీవితము కల శక్తి సంపన్న వరదానీ అత్మలు కావున అర్జీ పెట్టేవారిగా కాకుండా, సదా రాజీగా ఉండేవారిగా అవ్వండి.

స్లోగన్:-

ఏ ప్లాన్ ను అయినా విదేహీగా, సాక్షీగా అయ్యి ఆలోచించండి మరియు క్షణములో ప్లెయిన్ స్థితిని తయారుచేసుకుంటూ వెళ్ళండి.