02-05-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానం యొక్క బుల్ బుల్ గా అయి తమ సమానముగా తయారుచేసే సేవను చేయండి, ఎంతమందిని నా సమానముగా తయారుచేసాను, స్మృతి చార్టు ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోండి’’

ప్రశ్న:-

భగవంతుడు తన పిల్లలతో మనుష్యులు చేయలేని ఏ ప్రతిజ్ఞను చేస్తారు?

జవాబు:-

భగవంతుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తారంటే - పిల్లలూ, నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. మీరు శ్రీమతముపై నడుస్తూ పావనముగా అయినట్లయితే ముక్తి మరియు జీవన్ముక్తిలోకి వెళ్తారు. ముక్తిలోకైతే ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. ఎవరు కోరుకున్నా, కోరుకోకపోయినా కానీ, బలవంతంగానైనా లెక్కాచారాలను సమాప్తం చేయించి తీసుకువెళ్తాను. బాబా అంటారు - నేను ఎప్పుడైతే వస్తానో, అప్పుడు మీ అందరూ వానప్రస్థావస్థకు చేరుకుంటారు, నేను అందరినీ తీసుకువెళ్తాను.

ఓంశాంతి

పిల్లలు ఇప్పుడు చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... అన్న గాయనం ఏదైతే ఉందో, ఆ గుణాలన్నింటినీ ధారణ చేయాలి. నాలో ఈ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ విధంగా తయారవుతారో, వారివైపుకే పిల్లలైన మీ అటెన్షన్ వెళ్తుంది. ఇప్పుడు ఇదంతా చదవడం మరియు చదివించడంపై ఆధారపడి ఉంది. నేను ఎంతమందిని చదివిస్తున్నాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. సంపూర్ణ దేవతలుగా అయితే ఎవ్వరూ తయారవ్వలేదు. చంద్రుడు సంపూర్ణతను చేరుకున్నప్పుడు ఎంతటి ప్రకాశాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా - నంబరువారు, పురుషార్థం అనుసారంగా ఉన్నారా అన్నది చూడడం జరుగుతుంది. ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. టీచర్ కూడా అర్థం చేసుకుంటారు. వీరు ఏమి చేస్తున్నారు? నా కొరకు ఏ సేవను చేస్తున్నారు? అని ఒక్కొక్క బిడ్డ వైపుకు దృష్టి వెళ్తుంది. ఈ విధంగా అన్ని పుష్పాలను చూస్తారు. అందరూ పుష్పాలే. ఇది పుష్పాల తోట కదా. ప్రతి ఒక్కరికీ తమ అవస్థ గురించి తెలుసు, తమ సంతోషం గురించి తెలుసు. అతీంద్రియ సుఖమయమైన జీవితము ప్రతి ఒక్కరికీ ఎవరికి వారికి అనుభవమవుతుంది. ఒకటేమో తండ్రిని చాలా-చాలా స్మృతి చేయాలి. స్మృతి చేయడం ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు పిల్లలైన మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తాను, అదేమిటంటే - స్మృతియాత్ర. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నా స్మృతి చార్ట్ సరిగ్గా ఉందా? ఎవరెవరిని తమ సమానంగా తయారుచేస్తున్నాను? ఎందుకంటే మీరు జ్ఞానం యొక్క బుల్ బుల్ కదా. కొందరు చిలుకలు ఉన్నారు, కొందరు ఇంకెలాగో ఉన్నారు! మీరు పావురాలుగా కాదు, చిలుకలుగా అవ్వాలి. స్వయాన్ని లోలోపల ప్రశ్నించుకోవడం చాలా సహజము. తండ్రి నాకు ఎంతవరకు గుర్తున్నారు? అతీంద్రియ సుఖములో ఎంతవరకు ఉంటున్నాను? మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. మనుష్యులైతే మనుష్యులే. స్త్రీ-పురుషులు ఇరువురూ చూడడానికైతే మనుష్యులుగానే ఉంటారు. మళ్ళీ మీరు దైవీగుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు. మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఇంకెవరూ లేరు. దైవీ వంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. అక్కడ కూడా మీరు దైవీ వంశం యొక్క సభ్యులుగా ఉంటారు. అక్కడ మీలో ఎటువంటి రాగద్వేషాల గుర్తులు ఉండవు. ఇటువంటి దైవీ పరివారానికి చెందినవారిగా అయ్యేందుకు ఎంతగానో పురుషార్థం చేయాలి. చదవడము కూడా నియమానుసారంగా చదువుకోవాలి, ఎప్పుడూ మిస్ చేయకూడదు. అనారోగ్యంగా ఉన్నా కానీ బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి. ఇందులో నోటిని ఉపయోగించాల్సిన పని లేదు. ఆత్మకు తెలుసు - మేము శివబాబా పిల్లలము, బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు అని. ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉండాలి. ఎక్కడ ఉన్నా కానీ తండ్రి స్మృతిలో ఉండండి. శాంతిధామంలోకి-సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఇది ఎంత సహజము. ఎక్కువగా ధారణ చేయలేనివారు చాలామంది ఉన్నారు. అయితే సరే, స్మృతి చేయండి. ఇక్కడ పిల్లలందరూ కూర్చుని ఉన్నారు, ఇందులో కూడా నంబరువారుగా ఉన్నారు. అవును, అలా తప్పకుండా తయారవ్వాలి. శివబాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. అందరూ ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తారు. ఇంకెవ్వరి స్మృతి ఉండకపోవచ్చు. కానీ ఇందులో చివరి వరకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. శ్రమించాల్సి ఉంటుంది. లోలోపల ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. ఎక్కడికైనా విహరించడానికి వెళ్ళినా కానీ లోలోపల తండ్రి స్మృతియే ఉండాలి. నోటిని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఇది సహజమైన చదువు. మిమ్మల్ని చదివించి తమ సమానంగా తయారుచేస్తారు. ఇటువంటి అవస్థలోనే పిల్లలైన మీరు వెళ్ళాలి. ఏ విధముగా సతోప్రధాన అవస్థ నుండి వచ్చారో, మళ్ళీ అదే అవస్థలోకి వెళ్ళాలి. ఇది అర్థం చేయించడం ఎంత సహజము. ఇంటి పనులు చేస్తూ, నడుస్తూ-తిరుగుతూ స్వయాన్ని పుష్పాలుగా తయారుచేసుకోవాలి. నాలో గడబిడగా ఏమీ లేదు కదా అని చెక్ చేసుకోవాలి. స్వయాన్ని చెక్ చేసుకోవడానికి వజ్రము ఉదాహరణ కూడా చాలా బాగుంటుంది. మీరు స్వయమే భూతద్దం వంటివారు. కావున, నాలో దేహాభిమానము అంశమాత్రము కూడా లేదు కదా అన్నది చెక్ చేసుకోవాలి. ఈ సమయంలో అందరూ పురుషార్థులే, కానీ లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఎదురుగా ఉంది కదా. మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. బాబా చెప్పారు - ఖర్చు అయినా కానీ వార్తాపత్రికల ద్వారా ఈ సందేశము అందరికీ లభించాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు పవిత్రముగా అవుతారు అని చెప్పండి. ఇప్పుడు ఎవరూ పవిత్రంగా లేరు. తండ్రి అర్థం చేయించారు - పవిత్ర ఆత్మలు కొత్త ప్రపంచంలోనే ఉంటారు. ఈ పాత ప్రపంచము అపవిత్రమైనది. ఇందులో పవిత్రమైనవారు ఒక్కరు కూడా ఉండరు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రముగా అయిపోతుందో, అప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది. శరీరాన్ని వదలాల్సిందే. స్మృతి చేస్తూ-చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రముగా అయిపోతుంది. శాంతిధామం నుండి మనం పూర్తి పవిత్ర ఆత్మలుగా వచ్చాము, వచ్చి గర్భ మహల్ లో కూర్చొన్నాము. ఆ తర్వాత ఇంతటి పాత్రను అభినయించాము. ఇప్పుడు చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆత్మలైన మీరు తమ ఇంటికి వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. అక్కడ గర్భ మహల్ ఉంటుంది. అయినా, ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఇది చదువు. ఇప్పుడు నరకము, వేశ్యాలయం వినాశనమై శివాలయం స్థాపనవుతుంది. ఇప్పుడైతే అందరూ తిరిగి వెళ్ళాలి.

మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త ప్రపంచంలో రాకుమారులుగా-రాకుమారీలుగా అవుతాము అని మీరు కూడా భావిస్తారు. కొందరేమో, మేము ప్రజలలోకి వెళ్ళిపోతాము అని భావిస్తారు. ఇందులో పూర్తిగా లైన్ క్లియర్ గా ఉండాలి. ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి, ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అటువంటివారిని పవిత్రమైనవారు, బికారులు అని అంటారు. శరీరము కూడా గుర్తు రాకూడదు. ఇది పాత ఛీ-ఛీ శరీరము కదా! ఇక్కడ జీవిస్తూనే మరణించాలి అన్నది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం మన ఇంటిని మర్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్మృతిని ఇప్పించారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు - మీరందరూ వానప్రస్థులే. మొత్తం విశ్వమంతటిలోనూ మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో, అందరిదీ ఈ సమయంలో వానప్రస్థావస్థయే. నేను వచ్చాను, ఆత్మలందరినీ వాణి నుండి అతీతంగా తీసుకువెళ్తాను. తండ్రి అంటారు - ఇప్పుడు మీలో చిన్నా-పెద్దా అందరిదీ వానప్రస్థావస్థయే. వానప్రస్థము అని దేనిని అంటారో కూడా మీకు తెలిసేది కాదు. తెలియకుండానే వెళ్ళి గురువులను ఆశ్రయించేవారు. మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు, కానీ జ్ఞానమేమీ లేదు. ఇప్పుడు తండ్రి స్వయంగా అంటారు - మీలో చిన్నా-పెద్దా అందరిదీ వానప్రస్థావస్థయే. ముక్తి అయితే అందరికీ లభించనున్నది. చిన్నా-పెద్దా అందరూ అంతమైపోతారు. అందరినీ ఇంటికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఇందులో పిల్లలకు ఎంతో సంతోషము ఉండాలి. ఇక్కడ దుఃఖము అనుభవమవుతుంది, అందుకే తమ ఇంటిని, స్వీట్ హోమ్ ను స్మృతి చేస్తారు. ఇంటికి వెళ్ళాలనుకుంటారు కానీ వివేకమైతే లేదు. ఆత్మలైన మాకు ఇప్పుడు శాంతి కావాలి అని అంటారు. ఎంత సమయం కొరకు కావాలి అని తండ్రి అడుగుతారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయించాలి. ఇక్కడ శాంతిగా ఎవరైనా ఉండగలరా. అర్ధకల్పం ఈ గురువులు మొదలైనవారు మీ చేత ఎంతో శ్రమ చేయించారు. మీరు శ్రమిస్తూ, భ్రమిస్తూ-భ్రమిస్తూ ఇంకా అశాంతిగా అయిపోయారు. ఇప్పుడు శాంతిధామం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో, వారు వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. వారు చదివిస్తూ ఉంటారు కూడా. భక్తిని - నిర్వాణధామంలోకి వెళ్ళడం కోసము, ముక్తి కోసమే చేస్తారు. మేము సుఖధామంలోకి వెళ్ళాలి అని ఎప్పుడూ ఎవరి హృదయంలోకి రాదు. అందరూ వానప్రస్థములోకి వెళ్ళేందుకే పురుషార్థం చేస్తారు. మీరైతే సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. మొదట వాణి నుండి అతీతమైన అవస్థ తప్పకుండా కావాలి అని మీకు తెలుసు. భగవంతుడు కూడా పిల్లలతో ప్రతిజ్ఞ చేస్తారు - నేను పిల్లలైన మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. దాని కొరకే మీరు అర్ధకల్పం భక్తి చేసారు. ఇప్పుడు శ్రీమతంపై నడిచినట్లయితే ముక్తి-జీవన్ముక్తిలోకి వెళ్తారు. లేకపోతే శాంతిధామంలోకైతే అందరూ వెళ్ళాల్సిందే. ఎవరైనా వెళ్ళాలనుకున్నా, వెళ్ళాలి అనుకోకపోయినా, డ్రామానుసారంగా అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే నేను వచ్చాను. బలవంతంగానైనా కూడా లెక్కాచారాలను సమాప్తం చేయించి తీసుకువెళ్తాను. మీరు సత్యయుగంలోకి వెళ్తారు, మిగిలినవారంతా వాణి నుండి అతీతంగా, శాంతిధామంలో ఉంటారు. ఎవ్వరినీ వదిలేది లేదు. రాకపోయినా సరే శిక్షలను ఇచ్చి, దేబ్బలు వేసి అయినా సరే తీసుకువెళ్తాను. డ్రామాలో పాత్రయే ఆ విధంగా ఉంది, అందుకే మీరు మీ సంపాదన చేసుకుని వెళ్ళాలి, అప్పుడు పదవి కూడా మంచిది లభిస్తుంది. చివరిలో వచ్చేవారు ఏ సుఖాన్ని పొందుతారు. తప్పకుండా వెళ్ళాలి అని తండ్రి అందరికీ చెప్తారు. శరీరాలకు నిప్పు అంటించి ఆత్మలందరినీ తీసుకువెళ్తాను. నాతోపాటు కలిసి-కలిసి రావాల్సింది ఆత్మలే. నా మతముపై సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా అయినట్లయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది. మీరు వచ్చి మా అందరికీ మృత్యువును ఇవ్వండి అని మీరు పిలిచారు కదా. ఇప్పుడిక మృత్యువు వచ్చేసింది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ ఛీ-ఛీ శరీరాలు ఇక మిగలవు. మమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళండి అనే మీరు పిలిచారు. కావున ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. మీ స్మృతిచిహ్నము కూడా ఉంది. దిల్వాడా మందిరం ఉంది కదా - అది హృదయాన్ని గెలుచుకునే వారి మందిరము, ఆది దేవుడు కూర్చుని ఉన్నారు. శివబాబా కూడా ఉన్నారు, బాప్ దాదా ఇరువురూ ఉన్నారు, వీరి శరీరంలో బాబా విరాజమానమై ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆది దేవుడిని చూస్తారు. ఇక్కడ బాప్ దాదా కూర్చుని ఉన్నారని మీ ఆత్మకు తెలుసు.

ఈ సమయంలో మీరు ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో, దానికి గుర్తుగా స్మృతిచిహ్నాలు ఉన్నాయి. మహారథులు, గుర్రపు స్వారీ, పాదచారులు కూడా ఉన్నారు. అది జడమైనది, ఇక్కడ ఇది చైతన్యము. పైన వైకుంఠం కూడా ఉంది. మీరు మోడల్ ను చూసి వస్తారు. దిల్ వాడా మందిరము ఎలా ఉందో మీకు తెలుసు, కల్పకల్పమూ ఈ మందిరము ఇదే విధంగా తయారవుతుంది, మీరు వెళ్ళి దానిని చూస్తారు. కొందరు తికమకపడతారు. ఈ పర్వతాలు మొదలైనవన్నీ పడిపోయి మళ్ళీ తయారవుతాయి! అదెలా జరుగుతుంది? ఈ ఆలోచనలు చేయకూడదు. ఇప్పుడైతే స్వర్గం లేదు, అది మళ్ళీ ఎలా వస్తుంది! పురుషార్థం ద్వారా అంతా తయారవుతుంది కదా. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు తికమకలోకి వచ్చి చదువునే వదిలేస్తారు. తండ్రి అంటారు - ఇందులో తికమకపడే అవసరమే లేదు. అక్కడ అంతా మనకు మనం తయారుచేసుకుంటాము. ఆ ప్రపంచమే సతోప్రధానంగా ఉంటుంది. అక్కడి ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ చూసి వస్తారు, శూబీరసాన్ని తాగుతారు. సూక్ష్మవతనము, మూలవతనములలో ఇవేవీ ఉండవు. ఇవన్నీ వైకుంఠంలో ఉంటాయి. ప్రపంచ చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతుంది. ఈ నిశ్చయము పక్కాగా ఉండాలి. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే, వారు ఈ విధంగా అడుగుతారు - అదెలా జరుగుతుంది! వజ్రవైఢూర్యాలు ఇప్పుడు ఏవైతే కనిపించడం లేదో, అవి మళ్ళీ ఎలా వస్తాయి! పూజ్యులుగా ఎలా అవుతారు? తండ్రి అంటారు - పూజ్యులు మరియు పూజారుల యొక్క ఈ ఆట తయారుచేయబడి ఉంది. బ్రాహ్మణులమైన మనమే, దేవతలుగా, క్షత్రియులుగా... అవుతాము. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. మీరు అర్థం చేసుకున్నారు కావుననే ఈ విధంగా అంటారు - బాబా, కల్పక్రితము కూడా మిమ్మల్ని కలుసుకున్నాము. మా స్మృతిచిహ్న మందిరమే ఎదురుగా నిలబడి ఉంది. దీని తర్వాతనే స్వర్గ స్థాపన జరుగుతుంది. మీ ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో, వీటిలో అద్భుతము ఉంది. వీటిని ఎంత అభిరుచితో వచ్చి చూస్తారు. మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ, ఎక్కడా ఈ చిత్రాలను చూడలేదు. అలాగే ఎవరూ ఇటువంటి చిత్రాలను తయారుచేసే జ్ఞానాన్ని ఇవ్వలేరు. వీటిని కాపీ చేయలేరు. ఈ చిత్రాలు ఖజానా వంటివి, వీటితో మీరు పదమాపదమ భాగ్యశాలులుగా అవుతారు. మా అడుగడుగులోనూ పదమాలు ఉన్నాయని మీరు భావిస్తారు. అది చదువు అనే అడుగు. ఎంతగా యోగాన్ని జోడిస్తారో, ఎంతగా చదువుకుంటారో అంతగా పదమాలు లభిస్తాయి. ఇంకొకవైపు మాయ కూడా ఫుల్ ఫోర్సుతో వస్తుంది. మీరు ఈ సమయంలోనే శ్యామసుందరులుగా అవుతారు. సత్యయుగంలో మీరు సుందరంగా, బంగారుయుగం వారిగా ఉండేవారు, కలియుగంలో శ్యామంగా, ఇనుప యుగం వారిగా ఉన్నారు. ప్రతి వస్తువూ అలాగే ఉంటుంది. ఇక్కడైతే భూమి కూడా బంజరు భూమి వలె ఉంది. అక్కడైతే భూమి కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ప్రతి వస్తువూ సతోప్రధానంగా ఉంటుంది. ఇటువంటి రాజధానికి మీరు యజమానులుగా అవుతున్నారు. అనేక సార్లు అలా అయ్యారు. అయినా కానీ, అటువంటి రాజధానికి యజమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పురుషార్థం లేకుండా ప్రారబ్ధాన్ని ఎలా పొందుతారు. ఇందులో కష్టమేమీ లేదు.

మురళి ముద్రించబడుతుంది, ఇక మున్ముందు లక్షలు-కోట్ల సంఖ్యలో ముద్రించబడతాయి. ధనము ఏదైతే మిగిలి ఉందో, దానిని యజ్ఞములో ఉపయోగిస్తాము, మా వద్ద అలా పెట్టుకుని ఏం చేసుకుంటాము? అని పిల్లలు అంటారు. ఇక మున్ముందు ఏమి జరుగుతుందో చూడండి. వినాశన ఏర్పాట్లను కూడా చూస్తూ ఉంటారు. రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత శాంతిస్తుంది. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది చాలా సహజము. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి పూర్తిగా పవిత్రంగా, బికారులుగా అవ్వాలి. లైన్ క్లియర్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తయింది, మేము మా మధురమైన ఇంటికి వెళ్తాము అన్నది బుద్ధిలో ఉండాలి.

2. చదువు యొక్క ప్రతి అడుగులోనూ పదమాలు ఉన్నాయి, అందుకే ప్రతి రోజూ మంచి రీతిలో చదువుకోవాలి. దేవతా వంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి - నాకు అతీంద్రియ సుఖము ఎంతవరకు అనుభవమవుతుంది? సంతోషం ఉంటుందా? అని.

వరదానము:-

బుద్ధి యొక్క తోడు మరియు సహయోగము అనే చేయి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మ భవ

ఎలాగైతే సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారో, అలాగే సదా తండ్రికి సహయోగులుగా అవ్వడము - ఇదే చేతిలో చేయి వేయడము మరియు సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండటము అనగా మనస్సు యొక్క లగనము, ప్రేమ ఒక్కరిపై ఉండటము. గాడ్లీ గార్డెన్ (భగవంతుని పుష్పాల తోట) లో చేతిలో చేయి వేసి కలిసి-కలిసి నడుస్తున్నాము అన్న ఈ స్మృతియే సదా ఉండాలి. దీని ద్వారా సదా మనోరంజనంలో ఉంటారు, సదా సంతోషంగా మరియు సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునేందుకు సాధనము - సంతుష్టంగా ఉండటము మరియు సంతుష్ట పర్చటము.