03-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి స్మృతిలో సదా హర్షితముగా ఉండండి, పాత దేహము యొక్క భానాన్ని వదులుతూ వెళ్ళండి, ఎందుకంటే మీరు యోగబలముతో వాయుమండలాన్ని శుద్ధముగా తయారుచేసే సేవను చేయాలి’’

ప్రశ్న:-

స్కాలర్షిప్ ను తీసుకునేందుకు మరియు మీకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు ఏ పురుషార్థము అవసరము?

జవాబు:-

ఎప్పుడైతే స్మృతి యాత్ర యొక్క పురుషార్థము చేస్తారో అప్పుడే రాజ్య తిలకము లభిస్తుంది. పరస్పరం సోదరులుగా భావించే అభ్యాసాన్ని చేసినట్లయితే నామ-రూపాల భానము తొలగిపోతుంది. వ్యర్థమైన విషయాలను ఎప్పుడూ వినకండి. తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినండి, ఇతర విషయాలను వినడం నుండి చెవులను మూసి వేయండి. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ను పెట్టండి, అప్పుడు స్కాలర్షిప్ లభించగలదు.

ఓంశాంతి

తాము శ్రీమతము ఆధారముగా తమ కొరకు రాజధానిని స్థాపించుకుంటున్నారని పిల్లలకు తెలుసు. ఎవరు ఎంతగా మనసా, వాచా, కర్మణా సేవ చేస్తారో, అంతగా తమ కల్యాణమునే చేసుకుంటారు. ఇందులో హంగామాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. ఈ పాత దేహము యొక్క భానాన్ని వదులుతూ, వదులుతూ మీరు అక్కడకు వెళ్ళి చేరుకుంటారు, అంతే. బాబా స్మృతి చేయడం ద్వారా సంతోషము కూడా ఎంతగానో కలుగుతుంది, ఇక ఎల్లప్పుడూ స్మృతి ఉన్నట్లయితే అంతా సంతోషమే సంతోషము ఉంటుంది. తండ్రిని మర్చిపోవడంతో వాడిపోతారు. పిల్లలు ఎప్పుడూ హర్షితముగా ఉండాలి. మనం ఒక ఆత్మ. ఆత్మయైన మన తండ్రి ఈ నోటి ద్వారా మాట్లాడుతారు, ఆత్మయైన మనం ఈ చెవుల ద్వారా వింటాము. ఈ విధంగా అలవాటు చేసుకునేందుకు శ్రమించవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతియాత్రయే ఎంతో శక్తిని ఇస్తుంది. మీకు ఎంతటి శక్తి లభిస్తుందంటే, దాని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు నాశనమవుతాయని తండ్రి అంటారు. ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి. అంతిమంలో ఈ వశీకరణ మంత్రమే ఉపయోగపడుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఈ శరీరము నశ్వరమైనది అని సందేశము కూడా అందరికీ ఇదే ఇవ్వాలి. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. దానితోపాటు జ్ఞానం కూడా ఉంది ఎందుకంటే మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి కూడా తెలుసు. స్వయం ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు స్వదర్శన చక్రధారులు కదా. మీకు ఇక్కడ కూర్చుని-కూర్చుని ఉండగా ఎంతో సంపాదన జరుగుతుంది. మీకు రాత్రింబవళ్ళు అంతా సంపాదనే సంపాదన. మీరు ఇక్కడకు సత్యమైన సంపాదనను చేసుకునేందుకే వస్తారు. ఈ విధంగా మీ తోడుగా వెళ్ళే సత్యమైన సంపాదన ఇంకెక్కడా జరుగదు. ఇక్కడ మీకు ఇంకే వ్యాపార వ్యవహారాలూ లేవు. వాయుమండలము కూడా ఈ విధంగా ఉంది. మీరు యోగబలముతో వాయుమండలాన్ని కూడా శుద్ధం చేస్తారు. మీరు ఎంతో సేవను చేస్తున్నారు. ఎవరైతే తమ సేవను చేసుకుంటారో వారే భారత్ సేవను కూడా చేస్తారు. తర్వాత ఈ పాత ప్రపంచము కూడా ఉండదు, అలాగే మీరు కూడా ఉండరు. ప్రపంచమే కొత్తగా అయిపోతుంది. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. కల్పక్రితము ఏ సేవనైతే చేసారో, దానినే ఇప్పుడూ చేస్తూ ఉంటారని కూడా మీకు తెలుసు. రోజురోజుకు అనేకమందిని తమ సమానులుగా తయారుచేస్తూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని విని ఎంతో సంతోషము కలుగుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ ఎవ్వరి ద్వారా వినలేదు అని అంటారు. బ్రాహ్మణులైన మీ ద్వారానే వింటారు. భక్తి మార్గములోనైతే ఎటువంటి కష్టమూ లేదు. ఇందులో మొత్తం పాత ప్రపంచమునంతటినీ మర్చిపోవలసి ఉంటుంది. ఈ అనంతమైన సన్యాసాన్ని ఒక్క తండ్రే చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. సంతోషము కూడా నంబరువారుగా ఉంటుంది, అది ఒకే విధముగా ఉండదు. జ్ఞాన-యోగాలు కూడా ఒకే విధంగా ఉండవు. మిగిలిన మనుష్యమాత్రులందరూ దేహధారుల వద్దకు వెళ్తారు. ఇక్కడ మీరు - ఎవరికైతే తమదంటూ దేహము లేదో, వారి వద్దకు వస్తారు.

స్మృతి యొక్క పురుషార్థాన్ని ఎంతగా చేస్తూ ఉంటారో, అంతగా సతోప్రధానముగా అవుతూ ఉంటారు. సంతోషము పెరుగుతూ ఉంటుంది. ఇది ఆత్మ మరియు పరమాత్మల శుద్ధమైన ప్రేమ. వారు నిరాకారుడు. మీ నుండి ఎంతగా తుప్పు తొలగిపోతూ ఉంటే అంతగా ఆకర్షణ కలుగుతుంది. మేము ఎంత సంతోషములో ఉంటున్నామని మీ డిగ్రీని మీరే చూసుకోగలరు. ఇందులో ఆసనాలు మొదలైనవి వేయవలసిన విషయం లేదు. ఇది హఠయోగం కాదు. విశ్రాంతిగా కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చారబడి కూడా స్మృతి చేయవచ్చు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అవుతారు మరియు పాపాలు అంతమవుతాయని అనంతమైన తండ్రి అంటున్నారు. అనంతమైన తండ్రి ఎవరైతే మీకు టీచరుగా కూడా ఉన్నారో మరియు సద్గురువుగా కూడా ఉన్నారో వారిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. నేను తండ్రి స్మృతిలో ఉంటూ హర్షితముగా భోజనం చేసానా అని స్వయాన్ని చూసుకోవాలి. ప్రియురాలికి ప్రియుడు లభిస్తే తప్పకుండా సంతోషము కలుగుతుంది కదా. స్మృతిలో ఉండడం ద్వారా మీది ఎంతగానో జమ అవుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద గమ్యము. మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు! మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు చాలా వివేకవంతులుగా అయ్యారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎంత ఫస్ట్ క్లాస్ అయినవి. మేము తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ కొత్తది తీసుకుంటామని మీకు తెలుసు. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక ఈ శరీరాన్ని వదిలేస్తారు. సమీపంగా రావడంతో ఇంటి స్మృతి కలుగుతూ ఉంటుంది. బాబా జ్ఞానము చాలా మధురమైనది. పిల్లలకు నషా ఎంతగా ఎక్కాలి. భగవంతుడు ఈ రథములో కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు. ఇప్పుడు మీది పైకి ఎక్కే కళ. మీ పైకి ఎక్కే కళ ద్వారా సర్వులకూ మేలు జరుగుతుంది. మీరు కొత్త విషయాలనేవీ వినడం లేదు. అనేక సార్లు మేము ఇది విన్నాము, అదే మళ్ళీ వింటున్నామని మీకు తెలుసు. వినడం ద్వారా లోలోపలే పులకరించిపోతూ ఉంటారు. మీరు (అన్నోన్ మరియు వెరీ వెల్ నోన్ వారియర్స్) గుప్తమైన యోధులు మరియు బాగా ప్రసిద్ధులైన యోధులు కూడా. మీరు మొత్తం విశ్వాన్ని స్వర్గముగా తయారుచేస్తారు, కావుననే దేవతలకు అంతటి పూజ జరుగుతుంది. చేసేవారు మరియు చేయించువారు, ఇరువురి పూజా జరుగుతుంది. దేవీ-దేవతా ధర్మము వారి అంటు కట్టబడుతోందని పిల్లలకు తెలుసు. ఈ ఆచారము ఇప్పుడే ఉంది. మీరు స్వయానికి తిలకము దిద్దుకుంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు తమను తాము స్కాలర్షిప్ కు యోగ్యులుగా తయారుచేసుకుంటారు. పిల్లలు స్మృతి యాత్ర యొక్క పురుషార్థాన్ని ఎంతగానో చేయాలి. పరస్పరం సోదరులుగా భావించినట్లయితే నామ-రూపాల భానము తొలగిపోతుంది, ఇందులోనే శ్రమ ఉంది. ఎంతో అటెన్షన్ పెట్టాలి. వ్యర్థమైన విషయాలను ఎప్పుడూ వినకూడదు. తండ్రి అంటారు, నేను ఏదైతే వినిపిస్తానో, అదే వినండి, పరచింతన విషయాలను వినకండి, చెవులు మూసేసుకోండి. అందరికీ శాంతిధామానికి మరియు సుఖధామానికి మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. ఎవరు ఎంతగా అనేకులకు మార్గాన్ని తెలియజేస్తూ ఉంటారో, అంతగా వారికి లాభం కలుగుతుంది, సంపాదన జరుగుతుంది. అందరినీ అలంకరించడానికి మరియు ఇంటికి తీసుకువెళ్లడానికి తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలకు సదా సహాయకులుగా అవుతారు. ఎవరైతే తండ్రికి సహాయకులుగా అయ్యారో, వారిని తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. ఎవరైతే అనేకులకు మార్గాన్ని తెలియజేస్తారో, వారిని బాబా కూడా ఎంతగానో స్మృతి చేస్తారు. వారికి కూడా బాబా స్మృతి యొక్క ఆకర్షణ కలుగుతుంది. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడం అనగా ఇంటిని స్మృతి చేయడం. ఎల్లప్పుడూ బాబా, బాబా అని అంటూ ఉండండి. ఇది బ్రాహ్మణుల ఆత్మిక యాత్ర. పరమ ఆత్మను స్మృతి చేస్తూ-చేస్తూ ఇంటికి చేరుకుంటారు. ఎంతగా దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారో, అంతగా కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు స్మృతి యాత్ర ఒక్కటే ఉపాయం. మీరు ఆత్మిక స్వదర్శన చక్రధారీ బ్రాహ్మణ కుల భూషణులు. ఇది మీ సర్వోత్తమమైన శ్రేష్ఠ కులము. బ్రాహ్మణ కులం దేవతల కులం కన్నా ఉన్నతమైనది ఎందుకంటే మిమ్మల్ని తండ్రి చదివిస్తారు. బాబా నుండి విశ్వ రాజ్యాధికార వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు. బాబా అని అనడంతోనే వారసత్వపు సుగంధం వస్తుంది. శివుడిని ఎల్లప్పుడూ బాబా, బాబా అనే అంటారు. శివబాబా సద్గతిదాత, ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. సత్యమైన సద్గురువు ఒక్క నిరాకారుడే, వారు అర్ధకల్పం కొరకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్తారు. కావున ముఖ్యమైన విషయము స్మృతి. అంత్యకాలములో శరీర భానము లేక ధనము, సంపద గుర్తుకు రాకూడదు. లేకపోతే పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. భక్తిలో కాశీలో కత్తుల బావిలోకి దూకి బలిహారమవుతారు, మీరు కూడా బలిహారమయ్యారు అనగా తండ్రికి చెందినవారిగా అయ్యారు. భక్తి మార్గములో కూడా కాశీలో బలిహారమై తమ పాపాలన్నీ అంతమైపోయాయని భావిస్తారు. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఎప్పుడైతే అందరూ పై నుండి వచ్చేస్తారో అప్పుడు వినాశనం జరుగుతుంది. తండ్రి కూడా తిరిగి వెళ్తారు, మీరు కూడా వెళ్తారు. పాండవులు పర్వతాలపై కరిగిపోయారని అంటారు. అది ఆత్మహత్య వలె అవుతుంది. తండ్రి బాగా అర్థం చేయిస్తారు. పిల్లలూ, సర్వుల సద్గతిదాతను నేనొక్కడినే, ఏ దేహధారులూ మీ సద్గతి చేయలేరు. భక్తితో మెట్లు కిందకు దిగుతూనే వచ్చారు, అంతిమంలో తండ్రి వచ్చి బాగా పైకి ఎక్కిస్తారు. దీనినే ఒక్కసారిగా అనంతమైన సుఖము యొక్క లాటరీ లభించడమని అంటారు. అక్కడ గుర్రపు పందాలు ఉంటాయి, ఇక్కడ ఇది ఆత్మల పరుగు పందెము. కానీ మాయ కారణముగా ప్రమాదాలు జరుగుతాయి లేక విడాకులిచ్చేస్తారు. మాయ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. కామముతో ఓడిపోతే చేసిన సంపాదనంతా అంతమైపోతుంది. కామము పెద్ద భూతము, కామముపై విజయాన్ని పొందడం ద్వారా జగత్ జీతులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులు జగత్ జీతులుగా ఉండేవారు. తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మలో పవిత్రముగా తప్పకుండా అవ్వాలి, అప్పుడే విజయం లభిస్తుంది. లేకపోతే ఓడిపోతారు. ఇది మృత్యులోకపు అంతిమ జన్మ. అమరలోకపు 21 జన్మలు మరియు మృత్యులోకపు 63 జన్మల రహస్యాన్ని తండ్రే అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నేను లక్ష్మీ-నారాయణులను వారించేందుకు అర్హునిగా ఉన్నానా? ఎంతగా ధారణ జరుగుతూ ఉంటుందో, అంతగా సంతోషము కూడా ఉంటుంది. కానీ భాగ్యములో లేకపోతే మాయ నిలువనివ్వదు.

ఈ మధుబన్ ప్రభావము రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యమైన బ్యాటరీ ఇక్కడ ఉన్నారు. సేవాధారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తండ్రికి ఎంతో ప్రియంగా అనిపిస్తారు. మంచి సేవాధారులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ఎంచుకుని-ఎంచుకుని బాబా సెర్చ్ లైట్ ను ఇస్తారు. వారు కూడా తప్పకుండా బాబాను స్మృతి చేస్తారు. సేవాధారులైన పిల్లలను బాప్ దాదా ఇరువురూ స్మృతి చేస్తారు, సెర్చ్ లైట్ ను ఇస్తారు. మధురముగా తయారైతే అందరూ మీతో మధురముగానే వ్యవహరిస్తారు అని అంటారు, అలా స్మృతి చేసినట్లయితే స్మృతికి రెస్పాన్స్ లభిస్తుంది. ఒకవైపు మొత్తం ప్రపంచమంతా ఉంది, ఇంకొకవైపు సత్యమైన బ్రాహ్మణులైన మీరు ఉన్నారు. ఉన్నతోన్నతుడైన తండ్రికి మీరు పిల్లలు, ఆ తండ్రి సర్వుల సద్గతిదాత. మీ ఈ దివ్య జన్మ వజ్రతుల్యమైనది. మనల్ని గవ్వ నుండి వజ్రతుల్యంగా కూడా వారే తయారుచేస్తారు. అర్ధకల్పం కొరకు ఎంతటి సుఖాన్ని ఇస్తారంటే ఇక వారిని స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. బాబా అంటారు - పిల్లలూ, లెక్కలేనంత ధనాన్ని మీకు ఇస్తాను. దానిని మీరు పోగొట్టుకుని కూర్చున్నారు. మీరు నా మందిరాలలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలను పొదుగుతారు. ఇప్పుడు వజ్రాలు ఎంత ఖరీదైపోయాయో చూడండి! ఇంతకుముందు వజ్రాలకు కూడా కొసరు లభించేది (వజ్రాలతో పాటు ఏదైనా వేరే కానుకను ఇచ్చేవారు), ఇప్పుడైతే కూరగాయలకు కూడా కొసరు (కూరగాయలతో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర మొదలైనవి) లభించడం లేదు. ఏ విధంగా రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ ఏ విధంగా పోగొట్టుకున్నారు అనేది మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. ఇది ఎవరి బుద్ధిలోనైనా కష్టం మీద నిలుస్తుంది. రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటే శ్రీమతంపై పూర్తిగా నడవాలి. మీ మతము ఇక్కడ పని చేయదు. జీవిస్తూనే వానప్రస్థంలోకి వెళ్ళాలంటే సర్వస్వాన్ని వారికి ఇచ్చివేయవలసి ఉంటుంది, వారిని వారసునిగా చేసుకోవలసి ఉంటుంది. భక్తి మార్గములో కూడా వారసునిగా చేసుకుంటారు. అక్కడ దానం చేస్తారు కానీ అది అల్పకాలం కొరకే. ఇక్కడైతే వీరిని జన్మ-జన్మాంతరాల కొరకు వారసునిగా చేసుకోవలసి ఉంటుంది. ఫాలో ఫాదర్ అన్న గాయనము కూడా ఉంది. ఎవరైతే ఫాలో చేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు. అనంతమైన తండ్రికి చెందినవారిగా అవ్వడం ద్వారానే అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. శివబాబా అయితే దాత. ఈ భాండాగారము వారిదే. భగవంతుని పేరు మీద ఏదైతే దానం చేస్తారో దానికి బదులుగా మరుసటి జన్మలో అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. అది ఇన్ డైరెక్టుగా దానం చేయడం, ఇక్కడ ఇది డైరెక్ట్. శివబాబా 21 జన్మల కొరకు ఇస్తారు. కొందరికి బుద్ధిలో - మేము శివబాబాకు ఇస్తున్నాము అని వస్తుంది, అది అవమానపరచడం వంటిది. తీసుకోవడం కోసం మీరు వారికి ఇస్తారు. ఇది బాబా భాండాగారము. కష్టాలు, దుఃఖాలు అన్నీ దూరమైపోతాయి. పిల్లలు అమరలోకం కొరకు చదువుకుంటారు. ఇది ముళ్ళ అడవి. బాబా పుష్పాలతోటలోకి తీసుకువెళ్తారు. కావున పిల్లలకు ఎంతో సంతోషము ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి ఎంత ప్రేమగా పిల్లలను పుష్పాల వలె తయారుచేస్తారు. బాబా ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. మీ కళ్యాణాన్ని చేసుకోవాలనుకుంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయండి మరియు ఎవరి అవగుణాలనూ చూడకండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన తండ్రి నుండి సెర్చ్ లైట్ ను తీసుకునేందుకు వారికి సహాయకులుగా అవ్వాలి. ముఖ్యమైన బ్యాటరీతో మీ కనెక్షన్ ను జోడించి పెట్టుకోవాలి. ఏ విషయములోనూ సమయాన్ని వృధా చేసుకోకూడదు.

2. సత్యమైన సంపాదనను చేసుకునేందుకు మరియు భారత్ యొక్క సత్యమైన సేవను చేసేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి ఎందుకంటే స్మృతితో వాయుమండలము శుద్ధమవుతుంది, ఆత్మ సతోప్రధానముగా అవుతుంది, అపారమైన సంతోషము యొక్క అనుభవం కలుగుతుంది, కర్మేంద్రియాలు వశమవుతాయి.

వరదానము:-

స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన యొక్క కార్యములో మనసుకు నచ్చిన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ

ప్రతి ఒక్కరూ స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఒక్కరి మనస్సులో - ఈ విశ్వాన్ని పరివర్తన చెయ్యాల్సిందే అన్న ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి మరియు పరివర్తన అయ్యేదే ఉంది అన్న నిశ్చయము కూడా ఉంది. ఎక్కడైతే ధైర్యము ఉంటుందో, అక్కడ ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి. స్వ పరివర్తన ద్వారానే విశ్వ పరివర్తనా కార్యములో మనసుకు నచ్చిన సఫలత ప్రాప్తిస్తుంది. కానీ ఈ సఫలత ఎప్పుడు లభిస్తుందంటే - ఒకే సమయములో వృత్తి, వైబ్రేషన్ మరియు వాణి, ఈ మూడూ శక్తిశాలిగా ఉన్నప్పుడు.

స్లోగన్:-

ఎప్పుడైతే మాటలలో స్నేహము మరియు నిగ్రహం ఉంటుందో, అప్పుడే వాణి యొక్క శక్తి జమ అవుతుంది.