04-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31-01-98


పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క అకౌంట్ ను చెక్ చేసుకుని జమ చేసుకోండి

ఈ రోజు బాప్ దాదా దేశ-విదేశాలలో నలువైపులా ఉన్న చిన్న-పెద్ద పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇటువంటి భాగ్యము మొత్తము కల్పములో బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ ఉండదు. దేవతలు కూడా బ్రాహ్మణ జీవితాన్ని శ్రేష్ఠంగా భావిస్తారు. జన్మిస్తూనే మా భాగ్యము ఎంత శ్రేష్ఠముగా ఉంది అని ప్రతి ఒక్కరూ తమ జీవితం యొక్క ఆది నుండి చూసుకోండి. జీవితంలో జన్మిస్తూనే తల్లిదండ్రుల పాలన యొక్క భాగ్యము లభిస్తుంది. ఆ తర్వాత చదువు యొక్క భాగ్యము లభిస్తుంది. ఆ తర్వాత గురువు ద్వారా మతము మరియు వరదానము లభిస్తుంది. పిల్లలైన మీకు పాలనను, చదువును మరియు శ్రీమతాన్ని, వరదానాలను ఇచ్చేవారు ఎవరు? పరమ ఆత్మ ద్వారా ఈ మూడూ ప్రాప్తిస్తాయి. పాలనను చూడండి - పరమాత్మ పాలన ఎంత కొద్దిమందికి, కోట్లలో కొద్దిమందికి లభిస్తుంది. శిక్షకుడైన పరమాత్ముని చదువు మీకు తప్ప ఇంకెవ్వరికీ లభించదు. సద్గురువు ద్వారా శ్రీమతము, వరదానాలు మీకే ప్రాప్తిస్తాయి. మరి మీ భాగ్యము గురించి మంచి రీతిలో తెలుసా? భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని ఊయలలో ఊగినట్లు ఊగుతూ ఉంటారా, వాహ్ నా భాగ్యము అన్న పాటను పాడుతూ ఉంటారా?

అమృతవేళ ఎప్పుడైతే మేల్కొంటారో, అప్పుడు పరమాత్మ ప్రేమలో లవలీనులై మేల్కొంటారు. పరమాత్మ ప్రేమ మేల్కొలుపుతుంది. దినచర్య యొక్క ఆది పరమాత్ముని ప్రేమతో జరుగుతుంది. ప్రేమ లేకపోతే లేవలెరు. ప్రేమయే మీకు సమయము యొక్క అలారము. ప్రేమ అనే అలారము మిమ్మల్ని మేల్కొలుపుతుంది. మొత్తము రోజంతటిలో పరమాత్ముని తోడు ప్రతి కార్యాన్ని చేయిస్తుంది. స్వయంగా తండ్రి తమ పరంధామాన్ని వదిలి మీకు శిక్షణను ఇవ్వడానికి వస్తారు, ఇది ఎంతటి గొప్ప భాగ్యము. భగవంతుడు రోజూ తమ ధామాన్ని వదిలి చదివించటానికి వస్తారు అని ఎప్పుడైనా విన్నారా! ఆత్మలు ఎంత దూరదూరాల నుండి వచ్చినా కానీ, పరంధామము కన్నా దూరమైన దేశము మరేదీ లేదు. ఉందా ఏదైనా దేశము? అమెరికా, ఆఫ్రికా దూరమా? పరంధామము ఉన్నతోన్నతమైన ధామము. ఉన్నతోన్నతమైన ధామము నుండి ఉన్నతోన్నతుడైన భగవంతుడు, ఉన్నతోన్నతులైన పిల్లలను చదివించేందుకు వస్తారు. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవము చేస్తున్నారా? సద్గురువు రూపంలో ప్రతి కార్యానికి సంబంధించి శ్రీమతాన్ని కూడా ఇస్తారు మరియు తోడును కూడా అందిస్తారు. కేవలము మతాన్ని మాత్రమే ఇవ్వరు, తోడును కూడా అందిస్తారు. మీరు ఏ పాటను పాడుతారు? నాతో పాటు ఉన్నారు అనా లేక దూరంగా ఉన్నారు అనా? మీతో పాటే ఉన్నారు కదా? ఒకవేళ విన్నా పరమాత్మ టీచరు నుండే వింటారు, ఒకవేళ తిన్నా కూడా బాప్ దాదాతో కలిసి తింటారు. ఒంటరిగా తిన్నారంటే అది మీ తప్పు. బాబా అయితే నాతో కలిసి తినండి అని అంటారు. పిల్లలైన మీ ప్రతిజ్ఞ కూడా ఏమిటంటే - తోడుగా ఉంటాము, తోడుగా తింటాము, తోడుగా త్రాగుతాము, తోడుగా నిద్రపోతాము మరియు తోడుగా నడుస్తాము... నిద్రించటము కూడా ఒంటరిగా నిద్రించకూడదు. ఒంటరిగా నిద్రిస్తే చెడు కలలు లేక చెడు ఆలోచనలు కలలో కూడా వస్తాయి. కానీ బాబాకు ఎంత ప్రేమ ఉందంటే వారు సదా అంటారు - నాతో పాటు నిద్రించండి, ఒంటరిగా నిద్రించకండి. కావున లేచినా కూడా తోడుగానే లేవండి, నిద్రించినా కూడా తోడుగానే, తిన్నా కూడా తోడుగానే, నడుస్తున్నా కూడా తోడుగానే. ఒకవేళ ఆఫీసుకు వెళ్ళినా, వ్యాపారం చేసినా, మీరు వ్యాపారానికి ట్రస్టీలు, దానికి యజమాని బాబా. ఆఫీసుకు వెళ్ళినా కానీ మీకు తెలుసు - మా డైరెక్టర్, బాస్ బాప్ దాదా, అక్కడున్నవారు నిమిత్తమాత్రులు, బాబా డైరెక్షన్ అనుసారంగా మేము పని చేస్తాము. ఎప్పుడైనా ఉదాసీనులుగా అయితే బాబా స్నేహితునిగా అయ్యి ఆహ్లాదపరుస్తారు. స్నేహితునిగా కూడా అవుతారు. ఎప్పుడైనా ప్రేమలో ఏడ్చారనుకోండి, అశ్రువులు వచ్చాయనుకోండి, బాబా వాటిని తుడిచేందుకు కూడా వస్తారు మరియు మీ అశ్రువులను హృదయమనే డిబ్బీలో ముత్యాల వలె ఇముడ్చుకుంటారు. ఒకవేళ అప్పుడప్పుడు అల్లరితనంతో అలిగితే, ఆ అలగటం కూడా చాలా మధురాతి మధురంగా అలుగుతారు, అప్పుడు అలిగినవారిని బుజ్జగించటానికి కూడా బాబా వస్తారు. పిల్లలూ, ఏం ఫర్వాలేదు, ముందుకు నడవండి. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి, గతం గతః అనుకోండి - అని ఈ విధంగా బుజ్జగిస్తారు కూడా. కనుక మీ దినచర్య అంతా ఎవరితో పాటు ఉంది? బాప్ దాదాతో పాటు ఉంది. బాప్ దాదాకు అప్పుడప్పుడు పిల్లల విషయాలకు నవ్వు వస్తుంది. బాబా, మిమ్మల్ని మర్చిపోతున్నాము అని అంటారు, ఒకవైపేమో కంబైండ్ గా ఉన్నాము అని అంటారు, కంబైండ్ గా ఉన్నవారిని ఎప్పుడైనా మర్చిపోతారా? తోడుతోడుగా ఉన్నారు అన్నప్పుడు తోడుగా ఉన్నవారిని మర్చిపోతారా? అప్పుడు బాబా అంటారు - శభాష్, పిల్లలలో ఎంత శక్తి ఉందంటే కంబైండ్ గా ఉన్నవారిని కూడా వేరు చేసేస్తారు! ఉన్నదేమో కంబైండ్ గా (కలిసి), కానీ కొంచెం మాయ కంబైండ్ గా ఉన్నవారిని కూడా వేరు చేసేస్తుంది.

బాప్ దాదా పిల్లల ఆటను చూస్తూ ఇదే అంటారు - పిల్లలూ, మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. కానీ జరిగేది ఏమిటి? అవును, నా భాగ్యము చాలా ఉన్నతమైనది అని ఆలోచిస్తారు కానీ ఆలోచనా స్వరూపులుగా అవుతారే కానీ స్మృతి స్వరూపులుగా అవ్వరు. నేనైతే అది, నేనైతే ఇది, నేనైతే అది... అని ఆలోచించటమైతే చాలా బాగా ఆలోచిస్తారు, చెప్పటం కూడా చాలా బాగా చెప్తారు. కానీ ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే చెప్తారో ఆ స్వరూపముగా అవ్వండి. స్వరూపముగా అవ్వటములో తేడా వచ్చేస్తుంది. ప్రతి విషయము యొక్క స్వరూపముగా అవ్వండి. ఏదైతే ఆలోచిస్తారో, ఆ స్వరూపాన్ని కూడా అనుభవము చెయ్యండి. అన్నింటికన్నా గొప్ప విషయం అనుభవీమూర్తిగా అవ్వటము. అనాది కాలంలో పరంధామములో ఉన్నప్పుడు మీరు ఆలోచనా స్వరూపులుగా లేరు, స్మృతి స్వరూపులుగా ఉన్నారు. నేను ఆత్మను, నేను ఆత్మను అని ఇలా కూడా ఆలోచించాల్సిన అవసరము లేదు, స్వరూపమే అలా ఉంటుంది. ఆది కాలములో కూడా ఈ సమయములోని పురుషార్థము యొక్క ప్రారబ్ధ స్వరూపులుగా ఉంటారు. నేను దేవతను, నేను దేవతను... అని ఆలోచించాల్సిన అవసరము ఉండదు, స్వరూపము ఉంటుంది. కనుక అనాది కాలములో, ఆది కాలములో స్వరూపముగా ఉన్నారు కావున ఇప్పుడు కూడా అంతిమములో స్వరూపముగా అవ్వండి. స్వరూపముగా అవ్వటముతో మీ గుణాలు, శక్తులు స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. ఏదైనా ఉద్యోగం చేసేవారు తమ సీట్ పై సెట్ అయినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన గుణాలు, కర్తవ్యాలు ఆటోమేటిక్ గా ఇమర్జ్ అవుతాయి. అదే విధంగా మీరు సదా స్వరూపము అనే సీట్ పై సెట్ అయ్యి ఉన్నట్లయితే ప్రతి గుణము, ప్రతి శక్తి, అన్ని రకాల నషా స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. శ్రమించాల్సిన అవసరము ఉండదు. దీనినే బ్రాహ్మణత్వపు న్యాచురల్ నేచర్ (సహజ స్వభావము) అని అంటారు, ఇందులో మిగిలిన అనేక జన్మల స్వభావాలు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జీవితము యొక్క సహజ స్వభావమే గుణ స్వరూపము, సర్వ శక్తి స్వరూపము, ఇతర పాత స్వభావాలు ఏవైతే ఉన్నాయో, అవి బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావాలు కాదు. నా స్వభావమే అటువంటిది అని అంటారు, కానీ నా స్వభావము అని అంటుంది ఎవరు? బ్రాహ్మణులా లేక క్షత్రియులా? లేక గత జన్మలోని స్మృతి స్వరూప ఆత్మ అంటుందా? బ్రాహ్మణుల స్వభావము ఏమిటంటే - బ్రహ్మాబాబా స్వభావమే బ్రాహ్మణుల స్వభావము. కావున ఆలోచించండి, ఎప్పుడైతే నా నేచర్, నా స్వభావము ఇటువంటిది అని అంటారో, బ్రాహ్మణ జీవితంలో - నా నేచర్, నా స్వభావము... అన్న ఇటువంటి పదాలు ఉండగలవా? ఒకవేళ ఇప్పటివరకూ వాటిని తొలగిస్తూనే ఉంటే, గతము యొక్క స్వభావము ఇమర్జ్ అవుతూనే ఉంటే, ఆ సమయములో నేను బ్రాహ్మణుడిని కాను, క్షత్రియుడిని, తొలగించుకునేందుకు యుద్ధం చేస్తున్నాను అని భావించాలి. మరి ఒక్కోసారి బ్రాహ్మణులుగా, ఒక్కోసారి క్షత్రియులుగా అవుతారా? ఏమని పిలిపించుకుంటారు? క్షత్రియ కుమార్ అనా లేక బ్రహ్మాకుమార్ అనా? మీరెవరు? క్షత్రియ కుమారులా? మీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు. రెండవ పేరు లేనే లేదు. ఓ క్షత్రియ కుమారుడా, రా అని ఎవరినైనా ఈ విధంగా పిలుస్తారా? నేను బ్రహ్మాకుమార్ ను కాను, క్షత్రియ కుమార్ ను అని అంటారా లేక స్వయాన్ని అనుకుంటారా? కావున బ్రాహ్మణులు అనగా బ్రహ్మాబాబా స్వభావము ఏదైతే ఉందో, అదే బ్రాహ్మణుల స్వభావము. ఏం చేయాలి, ఇది నా స్వభావము! అన్న మాటను ఇకపై ఎప్పుడూ అనకండి, పొరపాటున కూడా అనకండి, ఆలోచించకండి. ఇవి సాకులు. ఇలా అనటము కూడా తమను తాము విడిపించుకునేందుకు చెప్పే సాకులు. కొత్త జన్మను తీసుకున్నారు, కొత్త జన్మలో పాత నేచర్, పాత స్వభావము ఎక్కడి నుండి ఇమర్జ్ అవుతుంది? అంటే పూర్తిగా మరణించలేదు, కొంచెం బ్రతికి, కొంచెం చనిపోయి ఉన్నారా ఏమిటి? బ్రాహ్మణ జీవితము అనగా బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగు ఏదైతే ఉందో, అదే బ్రాహ్మణుల అడుగు అయి ఉండాలి.

బాప్ దాదా భాగ్యాన్ని కూడా చూస్తున్నారు, ఇది ఎంతటి శ్రేష్ఠమైన భాగ్యము, ఈ భాగ్యము ఉన్నప్పుడు ఈ మాటలు మంచిగా అనిపించవు. ఈ సారి ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా - ఏం క్లాస్ చేయిస్తారు? ఇది ముక్తి సంవత్సరము. మరి ఇది ముక్తి సంవత్సరమా లేక 99లో రావాలా? 98వ సంవత్సరము ముక్తి సంవత్సరమేనా? ఈ సంవత్సరమే ముక్తి సంవత్సరము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులు ఊపండి. చూడండి, చేతులు ఊపటము చాలా సహజము. అసలు ఏం జరుగుతుందంటే, వాయుమండలములో కూర్చున్నారు కదా, సంతోషంలో ఊగుతున్నారు, కనుక చేతులు ఊపుతారు, కానీ మనసుతో చేతులు ఊపండి, ప్రతిజ్ఞ చెయ్యండి - ఏం జరిగినా కానీ ముక్తి సంవత్సరం యొక్క ప్రతిజ్ఞను వదలము. ఇటువంటి పక్కా ప్రతిజ్ఞ ఉందా? చూడండి, జాగ్రత్తగా చేతులెత్తండి. ఈ టి.వి. లో వచ్చినా, రాకపోయినా బాప్ దాదా వద్దనైతే మీ ఫోటో తీయడం జరుగుతుంది. కనుక ఇటువంటి బలహీన మాటల నుండి కూడా ముక్తులుగా అవ్వండి. మాటలు ఎంతో మధురంగా ఉండాలి, బాబా సమానంగా ఉండాలి, సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనతో కూడిన మాటలు ఉండాలి, వీటినే యుక్తియుక్తమైన మాటలు అని అంటారు. నడుస్తూ-తిరుగుతూ కూడా సాధారణ మాటలు ఉండకూడదు. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే, ఇవి మాటలా లేక ముత్యాలా అన్నట్లు అనుభవము చెయ్యాలి. శుభ భావన కల మాటలు వజ్రాలు, ముత్యాలతో సమానమైనవి ఎందుకంటే బాప్ దాదా ఎన్నో సార్లు ఈ సూచనను ఇచ్చారు - సమయం అనుసారంగా సర్వ ఖజానాలను జమ చేసుకోవడానికి ఇప్పుడు కొద్ది సమయమే ఉంది. ఒకవేళ ఈ సమయంలో - సమయము యొక్క ఖజానాను, సంకల్పాల ఖజానాను, మాటల ఖజానాను, జ్ఞాన ధనము యొక్క ఖజానాను, యోగ శక్తుల ఖజానాను, దివ్య జీవితములోని సర్వ గుణాల ఖజానాను జమ చేసుకోకపోతే మళ్ళీ ఈ విధంగా జమ చేసుకునే సమయము లభించటము సహజమవ్వదు (సులువు అవ్వదు). మొత్తము రోజంతటిలో మీ ఈ ఒక్కొక్క ఖజానా యొక్క అకౌంట్ ను చెక్ చేసుకోండి. ఏ విధంగా, ఇంత జమ అయ్యింది... అని స్థూల ధనం యొక్క అకౌంట్ ను చెక్ చేసుకుంటారు కదా, అదే విధంగా ప్రతి ఖజానా యొక్క అకౌంట్ను జమ చేసుకోండి. చెక్ చేసుకోండి. అన్ని ఖజానాలూ కావాలి. ఒకవేళ పాస్ విత్ ఆనర్ గా అవ్వాలనుకుంటే ప్రతి ఖజానా యొక్క జమ ఖాతా ఎంత నిండుగా ఉండాలంటే, ఆ జమ అయిన ఖాతాతో 21 జన్మలు ప్రారబ్ధాన్ని అనుభవించగలగాలి. ఇప్పుడు సమయము యొక్క టూ లేట్ (చాలా ఆలస్యమైంది) గంట ఇంకా మ్రోగలేదు, కానీ మ్రోగనున్నది. ఏ రోజు మరియు ఏ తారీఖు అనేది చెప్పము. అకస్మాత్తుగా టూ లేట్ అన్నది అవుట్ అవుతుంది (చెప్పడం జరుగుతుంది). అప్పుడేమి చేస్తారు? ఆ సమయములో జమ చేసుకుంటారా? ఎంత చేసుకుందామనుకున్నా సమయము లభించదు, అందుకే బాప్ దాదా ఎన్నో సార్లు సూచనను ఇస్తున్నారు - జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు కూడా - సర్వశక్తివంతులు అన్న టైటిల్ యే ఉంది, శక్తివంతులు అని కాదు, సర్వశక్తివంతులు. భవిష్యత్తులో కూడా సర్వగుణ సంపన్నులు, అంతేకానీ కేవలం గుణ సంపన్నులు కారు. ఈ ఖజానాలన్నింటినీ జమ చేసుకోవటము అనగా గుణాలు మరియు శక్తులు జమ అవుతున్నాయని అర్థము. ఒక్కొక్క ఖజానాకు గుణాలు మరియు శక్తులతో సంబంధము ఉంది. సాధారణంగా లేవు మాటలు అంటే అర్థము మధురంగా మాట్లాడే గుణము ఉందని. ఇలా ప్రతి ఒక్క ఖజానాకు కనెక్షన్ ఉంది.

బాప్ దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది, అందుకే మళ్ళీ పదే-పదే సూచనను ఇస్తున్నారు ఎందుకంటే ఈ రోజు సభలో అన్ని వెరైటీల వారు ఉన్నారు. చిన్న పిల్లలూ ఉన్నారు, టీచర్లు కూడా ఉన్నారు ఎందుకంటే టీచర్లే సమర్పణ అయ్యారు కదా. కుమారీలూ ఉన్నారు, ప్రవృత్తిలోని వారూ ఉన్నారు. అన్ని వెరైటీల వారు ఉన్నారు. మంచిది. అందరికీ అవకాశాన్ని ఇచ్చారు, ఇది చాలా బాగుంది. మాకు కలుసుకునే అవకాశము ఎప్పుడు లభిస్తుంది అని చాలా సమయము నుండి పిల్లల దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు. పెట్టుకున్నారు కదా పిల్లలూ? కనుక మంచిది - అన్ని వెరైటీలతో కూడిన పుష్పగుచ్ఛము బాబా ఎదురుగా ఉంది.

అచ్ఛా - బాప్ దాదాకు మొత్తము విశ్వములో నిమిత్తులైన టీచర్ల పట్ల ఒక శుభ భావన ఉంది, ఈ సంవత్సరము ఎవరి గురించి ఎటువంటి ఫిర్యాదు రాకూడదు. ఫిర్యాదుల ఫైల్ సమాప్తమైపోవాలి. బాప్ దాదా వద్ద ఇప్పటి వరకు చాలా ఫైల్స్ ఉన్నాయి. కనుక ఈ సంవత్సరము ఫిర్యాదుల ఫైల్ సమాప్తము. అందరూ ఫైన్ (మంచి) గా అవ్వాలి. ఫైన్ కంటే కూడా రిఫైన్ గా అవ్వాలి. ఇష్టమే కదా? ఎవరు ఎలా ఉన్నా కానీ వారితో కలిసి నడుచుకునే విధానాన్ని నేర్చుకోండి. ఎవరు ఏం చేసినా కానీ, పదే-పదే విఘ్న రూపంగా అయ్యి ఎదురుగా వచ్చినా కానీ ఆ విఘ్నాలలో సమయాన్ని వెచ్చించడము కూడా ఎప్పటివరకు? దీని సమాప్తి సమారోహం కూడా జరగాలి కదా? కనుక, వీరు ఇలా చేస్తున్నారు అని ఇతరులను చూడకండి. నేనేమి చెయ్యాలి? ఒకవేళ వారు పర్వతమైతే నేను పక్కకు తప్పుకోవాలి, పర్వతము పక్కకు తప్పుకోదు. వీరు మారితే నేను మారుతాను - అంటే పర్వతం పక్కకు తప్పుకుంటే నేను ముందుకు వెళ్తాను అన్నట్లు. అప్పుడు పర్వతమూ పక్కకు తప్పుకోదు, అలాగే మీరు గమ్యానికి చేరుకోలేరు. అందుకే ఒకవేళ ఆ ఆత్మ పట్ల శుభ భావన ఉన్నట్లయితే, వారికి సూచనను ఇవ్వండి, ఇక ఆ తర్వాత మనసు-బుద్ధితో ఖాళీ అయిపోండి. స్వయాన్ని ఆ విఘ్న స్వరూపంగా అయినవారి యొక్క ఆలోచనలలో పడేసుకోకండి. నంబరువారుగా ఉన్నారు అన్నప్పుడు నంబరువారులో స్థితి కూడా నంబరువారుగానే ఉంటుంది కానీ మనము నంబరువన్ గా అవ్వాలి. ఇలా విఘ్నాలను లేక వ్యర్థ సంకల్పాలను కలిగించే ఆత్మల పట్ల స్వయం పరివర్తన అయ్యి వారి పట్ల శుభ భావనను ఉంచుతూ నడవండి. ఇందుకు కొంచెం సమయం పడుతుంది, కాస్త కష్టమనిపిస్తుంది, కానీ చివరికి ఎవరైతే స్వ పరివర్తన చెందుతారో, విజయమాల వారి మెడలోనే పడుతుంది. ఒకవేళ శుభ భావనతో వారిని పరివర్తన చెయ్యగలిగితే చెయ్యండి, లేదంటే వారికి సూచనను ఇచ్చి మీ బాధ్యతను పూర్తి చేసుకోండి మరియు స్వ పరివర్తన చేసుకుని ముందుకు ఎగురుతూ వెళ్ళండి. ఈ విఘ్న రూపము కూడా మోహము అనే బంగారు దారం వంటిది. ఇది కూడా ఎగరనివ్వదు. ఇది చాలా సూక్ష్మమైనది మరియు సత్యత అనే పరదా వెనుక ఉన్న దారము. ఎలా ఆలోచిస్తారంటే - ఇదే సత్యమైన విషయము కదా, ఇలా అయితే జరుగుతుంది కదా, ఇలా జరగకూడదు కదా... కానీ ఎప్పటివరకు అలా చూస్తూ, ఎప్పటి వరకు అలా ఆగుతూ ఉంటారు? ఇప్పుడైతే స్వయాన్ని ఈ సూక్ష్మ దారాల నుండి కూడా విముక్తులుగా చేసుకోండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. అందుకే పిల్లల ఆశలు, ఉత్సాహాలు, ఉల్లాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బాప్ దాదా ఫంక్షన్లు చేసి పూర్తి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరములోని చివరి ఫంక్షన్ ముక్తి సంవత్సరము యొక్క ఫంక్షన్ అవ్వాలి. ఫంక్షన్ లో దాదీలకు కానుకను కూడా ఇస్తారు. మరి బాప్ దాదాకు ఈ ముక్తి సంవత్సరము యొక్క ఫంక్షన్ లో స్వయము యొక్క సంపూర్ణత అనే కానుకను ఇవ్వండి. అచ్ఛా.

నలువైపులా ఉన్న పరమాత్మ పాలన, చదువు మరియు శ్రీమతము అనే భాగ్యానికి అధికారులైన విశేష ఆత్మలకు, సదా ఆలోచించటము మరియు స్వరూపముగా అవ్వటము, ఈ రెండింటినీ సమానముగా చేసే బాబా సమానులైన ఆత్మలకు, సదా పరమాత్మ విల్ పవర్ ద్వారా స్వయములో మరియు సేవలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే నిమిత్త సేవాధారీ పిల్లలకు, సదా బాబాను కంబైండ్ రూపములో అనుభవము చేసేవారికి, సదా తోడును నిర్వర్తించే సహచరులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

సంబంధ-సంపర్కములో సంతుష్టత యొక్క విశేషత ద్వారా మాలలో కూర్చబడే సంతుష్టమణి భవ

సంగమయుగము సంతుష్టతా యుగము. ఎవరైతే స్వయముతో కూడా సంతుష్టంగా ఉంటారో మరియు సంబంధ-సంపర్కములో కూడా సదా సంతుష్టంగా ఉంటారో మరియు సంతుష్టం చేస్తారో, వారే మాలలో కూర్చబడతారు ఎందుకంటే మాల సంబంధముతో తయారవుతుంది. ఒకవేళ పూసకు పూసతో సంపర్కము లేనట్లయితే మాల తయారవ్వదు, అందుకే సంతుష్టమణులుగా అయ్యి సదా సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టం చెయ్యండి. పరివారము అంటేనే అర్థము సంతుష్టంగా ఉండటము మరియు సంతుష్టం చెయ్యటము. ఏ విధమైన ఘర్షణ ఉండకూడదు.

స్లోగన్:-

విఘ్నాల పని రావటము మరియు మీ పని విఘ్న-వినాశకులుగా అవ్వటము.