04-05-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఏదైతే వినిపిస్తారో, అది మీ హృదయములో ముద్రించుకుపోవాలి, సూర్యవంశములో ఉన్నత పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కావున ధారణ కూడా చేయాలి’’

ప్రశ్న:-

సదా రిఫ్రెష్ గా ఉండేందుకు సాధనము ఏమిటి?

జవాబు:-

ఏ విధంగా వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ తిరిగినట్లయితే అది రిఫ్రెష్ చేస్తుందో, అలా సదా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే రిఫ్రెష్ గా ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు - పిల్లలూ, ఒక్క క్షణము. పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులుగా తప్పకుండా అవ్వాలి ఎందుకంటే దీని ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రాన్ని తిప్పేవారు సూర్యవంశీయులుగా అవుతారు.

ఓంశాంతి

ఫ్యాన్లు కూడా తిరుగుతూ ఉంటాయి, అందరినీ రిఫ్రెష్ చేస్తూ ఉంటాయి. మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చున్నట్లయితే ఎంతో రిఫ్రెష్ అవుతారు. స్వదర్శన చక్రధారి యొక్క అర్థము గురించి కూడా ఎవ్వరికీ తెలియదు కావున వారికి అర్థం చేయించాలి. అర్థం చేసుకోకపోతే చక్రవర్తీ రాజులుగా అవ్వరు. స్వదర్శన చక్రధారికి - నేను చక్రవర్తీ రాజుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారిగా అయ్యాను అన్న నిశ్చయం ఉంటుంది. శ్రీకృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు, జంటగా ఉన్న లక్ష్మీ-నారాయణులకు కూడా అది చూపిస్తారు, అలాగే జంటగా లేకుండా ఒక్కరే ఉన్నప్పుడు కూడా అది చూపిస్తారు. స్వదర్శన చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి, అప్పుడే చక్రవర్తీ రాజులుగా అవుతారు. విషయమైతే చాలా సహజమైనది. బాబా, స్వదర్శన చక్రధారిగా అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. పిల్లలూ, ఒక్క క్షణము. ఆ తర్వాత మీరు విష్ణువంశీయులుగా అవుతారు. దేవతలను విష్ణువంశీయులు అనే అంటారు. విష్ణువంశీయులుగా అవ్వడానికి మొదటైతే శివవంశీయులుగా అవ్వవలసి ఉంటుంది, ఆ తర్వాత బాబా కూర్చొని సూర్యవంశీయులుగా తయారుచేస్తారు. ఈ పదాలైతే చాలా సహజమైనవి. మనం కొత్త విశ్వములో సూర్యవంశీయులుగా అవుతాము. మనం కొత్త ప్రపంచానికి యజమానులుగా, చక్రవర్తులుగా అవుతాము. స్వదర్శన చక్రధారుల నుండి విష్ణువంశీయులుగా అవ్వడానికి ఒక్క క్షణము పడుతుంది. అలా తయారుచేసేవారు శివబాబాయే. శివబాబా విష్ణువంశీయులుగా తయారుచేస్తారు, ఇంకెవ్వరూ ఆ విధముగా తయారుచేయలేరు. విష్ణువంశీయులు సత్యయుగములో ఉంటారే కానీ ఇక్కడ ఉండరు అనైతే పిల్లలకు తెలుసు. ఇది విష్ణువంశీయులుగా తయారయ్యే యుగము. మీరు ఇక్కడకు విష్ణువంశములోకి వచ్చేందుకనే వస్తారు, దానినే సూర్యవంశము అని అంటారు. జ్ఞాన సూర్యవంశీ అన్న పదము చాలా బాగుంది. విష్ణువు సత్యయుగానికి అధిపతిగా ఉండేవారు. వారిలో లక్ష్మీ-నారాయణులు ఇరువురూ ఉన్నారు. ఇక్కడకు పిల్లలు లక్ష్మీ-నారాయణులుగా లేక విష్ణువంశీయులుగా అవ్వడానికి వచ్చారు. ఇందులో సంతోషము కూడా ఎంతో కలుగుతుంది. కొత్త ప్రపంచములో, కొత్త విశ్వములో, స్వర్ణయుగ విశ్వములో విష్ణువంశీయులుగా అవ్వాలి. దీని కన్నా ఉన్నతమైన పదవి ఇంకేదీ లేదు, ఇందులో ఎంతో సంతోషము కలగాలి.

ప్రదర్శనీలో మీరు అర్థం చేయిస్తారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. ఇది చాలా పెద్ద యూనివర్శిటీ అని చెప్పండి. దీనిని ఆత్మిక స్పిరిచ్యుయల్ యూనివర్శిటీ అని అంటారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఈ చిత్రములో ఉంది. పిల్లలు ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. పిల్లలు అర్థం చేయించేందుకు కేవలం ఒక్క క్షణమే పట్టాలంటే ఏ విధముగా వ్రాయాలి. మీరే అర్థం చేయించగలరు. అందులో కూడా, మేము తప్పకుండా విష్ణువంశీయులైన దేవీ-దేవతలుగా ఉండేవారమని అనగా దేవీ-దేవతా కులానికి చెందినవారిగా ఉండేవారమని, స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని వ్రాయబడి ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, భారత్ లో నేటికి 5000 సంవత్సరాల క్రితం మీరు సూర్యవంశీ దేవీ-దేవతలుగా ఉండేవారు. పిల్లలకు ఇప్పుడు ఇది బుద్ధిలోకి వచ్చింది. ఓ పిల్లలూ, మీరు సత్యయుగములో సూర్యవంశీయులుగా ఉండేవారు అని శివబాబా పిల్లలకు చెప్తున్నారు. సూర్యవంశమును స్థాపించేందుకు శివబాబా వచ్చారు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది, వారే పూజ్యులుగా ఉండేవారు, అక్కడ పూజారులెవ్వరూ లేరు, పూజ సామాగ్రి ఏదీ లేదు. ఈ శాస్త్రాలలోనే పూజల యొక్క ఆచార-వ్యవహారాలు వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ సామాగ్రి. అనంతమైన తండ్రియైన శివబాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు. బృహస్పతి దశ చాలా ఉన్నతోన్నతముగా ఉంటుంది. వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు - మీరు పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. ఏ దేవతలైతే నిర్వికారులుగా ఉండేవారో వారేమయ్యారు? తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు దిగిపోతారు. ఒక్కొక్క పదాన్ని నోట్ చేసుకోవాలి. మీ హృదయంలోనా, లేక కాగితం పైనా? ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? శివబాబా. వారే స్వర్గాన్ని రచిస్తారు. శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక తండ్రి అయితే దేహధారి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పారలౌకిక తండ్రిని ‘బాబా’ అంటూ స్మృతి చేస్తారు, అప్పుడు బాబా ‘ఓ పిల్లలూ’ అంటూ బదులిస్తారు. వారు అనంతమైన తండ్రి కదా. పిల్లలూ, మీరు సూర్యవంశీ దేవీ-దేవతలుగా, పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మీరు పూజారులుగా అయ్యారు. ఇది రావణ రాజ్యము. ప్రతి సంవత్సరమూ రావణుడిని కాలుస్తారు, అయినా కానీ అతను చనిపోడు. 12 నెలల తర్వాత మళ్ళీ రావణుడిని కాలుస్తారు, అనగా తాము రావణ సాంప్రదాయానికి చెందినవారమని వారు నిరూపించి చెప్తున్నారు. రావణుడు అనగా పంచ వికారాల రాజ్యము ఇప్పుడుంది. సత్యయుగములో అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు, ఇప్పుడిది కలియుగ పాత భ్రష్టాచారీ ప్రపంచముగా ఉంది, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మా వంశీయులైన మీరు సంగమయుగములో కూర్చున్నారు. మేము బ్రాహ్మణులము, ఇప్పుడు శూద్రకులము వారము కాము అని మీ బుద్ధిలో ఉంది. ఈ సమయములో ఉన్నది అసురీ రాజ్యమే. తండ్రిని - ఓ దుఃఖహర్తా, సుఖకర్తా అని పిలుస్తారు. ఇప్పుడు సుఖము ఎక్కడుంది? సత్యయుగములో. దుఃఖము ఎక్కడుంది? దుఃఖమైతే కలియుగములో ఉంది. దుఃఖహర్త, సుఖకర్త శివబాబాయే. వారు సుఖము యొక్క వారసత్వాన్నే ఇస్తారు. సత్యయుగాన్ని సుఖధామము అని అంటారు, అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. మీ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది, ఏడవవలసిన అవసరం ఉండదు. సమయమనుసారంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. ఇప్పుడు ఇక శరీరము వృద్ధాప్యములోకి వచ్చేసింది అని భావిస్తారు. మొదట బాల్యములో పిల్లలు సతోగుణీగా ఉంటారు, అందుకే పిల్లలను బ్రహ్మజ్ఞానుల కన్నా ఉన్నతులుగా భావిస్తారు ఎందుకంటే వాళ్ళు అయితే ఎంతైనా వికారీ గృహస్థుల నుండి సన్యాసులుగా అవుతారు కావున వారికి అన్ని వికారాల గురించి తెలుసు, చిన్నపిల్లలకైతే వికారాల గురించి తెలియదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతటిలోనూ రావణ రాజ్యము, భ్రష్టాచారీ రాజ్యము ఉంది. శ్రేష్టాచారీ దేవీ-దేవతల రాజ్యం సత్యయుగములో ఉండేది, ఇప్పుడు లేదు. చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది. శ్రేష్టాచారులుగా ఎవరు తయారుచేస్తారు? ఇక్కడైతే శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు. ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఇది ఉన్నదే పారసబుద్ధి కలవారిగా అయ్యే యుగము. తండ్రి వచ్చి రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు.

సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది అని అంటారు. సత్యమైన తండ్రి వద్ద తప్ప మిగిలిన ప్రపంచమంతటిలోనూ కుసాంగత్యమే ఉంది. తండ్రి అంటారు, నేను సంపూర్ణ నిర్వికారులుగా తయారుచేసి వెళ్తాను, మళ్ళీ సంపూర్ణ వికారులుగా ఎవరు తయారుచేస్తారు? మాకేమి తెలుసు అని అంటారు. అరే, నిర్వికారులుగా ఎవరు తయారుచేస్తారు? తప్పకుండా తండ్రే తయారుచేస్తారు. మరి వికారులుగా ఎవరు తయారుచేస్తారు? ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, మనుష్యులకైతే ఏమీ తెలియదు. ఇది రావణ రాజ్యము కదా. ఎవరి తండ్రి అయినా మరణిస్తే, ఎక్కడకు వెళ్ళారని అడిగితే, స్వర్గస్థులయ్యారు అని అంటారు. అచ్ఛా, దీని అర్థము, వారు అంతవరకు నరకములో ఉన్నారనే కదా. అంటే మీరు కూడా నరకవాసులే కదా. అర్థం చేయించవలసిన ఈ విషయం ఎంత సహజమైనది. తమను తాము ఎవ్వరూ నరకవాసులుగా భావించరు. నరకాన్ని వేశ్యాలయమని, స్వర్గాన్ని శివాలయమని అంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ దేవీ-దేవతల రాజ్యముండేది. మీరు విశ్వాధిపతులుగా, మహారాజు-మహారాణులుగా ఉండేవారు, మళ్ళీ పునర్జన్మలను తీసుకోవలసి వస్తుంది. అందరికన్నా ఎక్కువ పునర్జన్మలను మీరే తీసుకున్నారు. అందుకనే ఆత్మలు పరమాత్మ ఎంతోకాలం వేరుగా ఉన్నారన్న గాయనము ఉంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన మీరే వచ్చారని, మళ్ళీ 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ పావనులుగా అవ్వాలని మీకు గుర్తుంది. పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా కదా, అందుకే ఒక్క సద్గురు సుప్రీమ్ యే వచ్చి పావనంగా తయారుచేస్తారని సర్టిఫికెట్ ఇస్తారు. వీరిలో కూర్చొని నేను మిమ్మల్ని పావనంగా తయారుచేస్తాను అని వారు స్వయం అంటారు. ఇకపోతే 84 లక్షల యోనులు మొదలైనవేవీ లేవు. 84 జన్మలు ఉన్నాయి. ఈ లక్ష్మీ-నారాయణుల ప్రజలు సత్యయుగములో ఉండేవారు, ఇప్పుడు లేరు. వారు ఏమయ్యారు? వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి వస్తుంది. ఎవరైతే మొదటి నంబరులోకి వస్తారో, వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. కావున మళ్ళీ వారే మొదట వెళ్ళాలి. దేవీ-దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతమవుతుంది. సూర్యవంశీ-చంద్రవంశీ రాజ్యాలు తప్పకుండా పునరావృతమవ్వాలి. తండ్రి మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేస్తున్నారు. మేము ఈ పాఠశాల లేక యూనివర్సిటీలోకి వచ్చాము, ఇక్కడ నుండి మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము అని మీరు అంటారు. ఇదే మన లక్ష్యము-ఉద్దేశ్యము. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో, వారే పాస్ అవుతారు. ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారు ప్రజలలో కొందరు చాలా షావుకార్లుగా అవుతారు, కొందరు తక్కువగా అవుతారు. ఇక్కడ రాజధాని తయారవుతోంది. మనం శ్రీమతంపై శ్రేష్ఠముగా అవుతున్నామని మీకు తెలుసు. శ్రీ శ్రీ అయిన శివబాబా మతముపై శ్రీ లక్ష్మీ-నారాయణులుగా లేక దేవీ-దేవతలుగా అవుతారు. శ్రీ అనగా శ్రేష్ఠమైనవారు. వాస్తవానికి ఎవ్వరినీ అలా శ్రీ అని అనలేరు. కానీ ఇక్కడైతే ఎవరు వస్తే వారందరినీ శ్రీ అనేస్తారు. శ్రీ ఫలానా... అని అంటారు. వాస్తవానికి శ్రీ అనగా శ్రేష్ఠముగానైతే దేవీ-దేవతలు తప్ప ఇంకెవ్వరూ అవ్వలేరు. భారత్ శ్రేష్ఠాతి-శ్రేష్ఠముగా ఉండేది. రావణ రాజ్యములో భారత్ మహిమనే సమాప్తం చేసేసారు. భారత్ యొక్క మహిమ కూడా ఎంతో ఉంది, భారత్ యొక్క నింద కూడా ఎంతో ఉంది. భారత్ పూర్తిగా సుసంపన్నముగా ఉండేది, ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా అయ్యింది. దేవతల ముందుకు వెళ్ళి - నిర్గుణులమైన మాలో ఏ గుణమూ లేదు... అంటూ వారి మహిమను గానం చేస్తారు. దేవతలను ఆ విధంగా మహిమ చేస్తారు కానీ వారేమైనా దయార్ద్రహృదయులా. మనుష్యులను దేవతలుగా తయారుచేసే వారినొక్కరినే దయార్ద్రహృదయులు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు వారు మీకు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ జన్మజన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి మరియు నేను మిమ్మల్ని నాతోపాటు తీసుకువెళ్తాను అని వారు గ్యారంటీ ఇస్తారు. మీరు మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఇది 5000 సంవత్సరాల చక్రము. కొత్త ప్రపంచముండేది, మళ్ళీ అది తప్పకుండా తయారవుతుంది. ప్రపంచము పతితముగా అవుతుంది, మళ్ళీ తండ్రి వచ్చి పావనముగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, పతితముగా రావణుడు తయారుచేస్తాడు, పావనముగా నేను తయారుచేస్తాను. ఇకపోతే ఇదంతా బొమ్మల పూజ వలె చేస్తూ ఉంటారు. రావణుడికి 10 తలలను ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు. విష్ణువుకు కూడా 4 భుజాలను చూపిస్తారు. కానీ అటువంటి మనుష్యులు ఎక్కడైనా ఉంటారా. ఒకవేళ 4 భుజాలు కల మనుష్యులున్నట్లయితే వారికి పిల్లలు ఎవరైతే పుడతారో వారు కూడా అలాగే ఉండాలి కదా. ఇక్కడైతే అందరికీ 2 భుజాలున్నాయి. వారికేమీ తెలియదు. భక్తి మార్గపు శాస్త్రాలను కంఠస్థం చేస్తారు, వారికి కూడా ఎంతమంది అనుచరులు తయారవుతారు. ఇది విచిత్రము! ఇక్కడ తండ్రి జ్ఞానము యొక్క అథారిటీ. మానవమాత్రులెవ్వరూ జ్ఞానము యొక్క అథారిటీగా అవ్వలేరు. జ్ఞానసాగరుడు అని మీరు నన్నే అంటారు - ఆల్మైటీ అథారిటీ... అన్నది తండ్రి మహిమయే. మీరు తండ్రిని స్మృతి చేసినప్పుడు తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు, దాని ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు. మాలో చాలా శక్తి ఉండేది, మేము నిర్వికారులుగా ఉండేవారము అని మీరు భావిస్తారు. మొత్తం విశ్వమంతటిపైనా మీరొక్కరే రాజ్యం చేసేవారు అంటే మరి సర్వశక్తివంతులు అనే అంటారు కదా. ఈ లక్ష్మీ-నారాయణులు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఈ శక్తి వారికి ఎక్కడి నుండి లభించింది? తండ్రి నుండి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడే కదా. వారు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఈ 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సహజమే కదా. దీని ద్వారానే మీకు రాజ్యాధికారం లభిస్తుంది. పతితులకు విశ్వ రాజ్యాధికారం లభించదు. పతితులైతే వారి ముందు తల వంచుతారు. మేము భక్తులము అని భావిస్తారు. పావనుల ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారు. భక్తి మార్గము కూడా అర్ధకల్పం కొనసాగుతుంది. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, భక్తి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చాను. భగవంతుడు ఏదో ఒక రూపములో వచ్చేస్తారని అంటూ ఉంటారు కూడా. తండ్రి అంటారు, నేనేమైనా ఎడ్లబండి మొదలైనవాటిపై వస్తానా? ఎవరైతే ఉన్నతోన్నతునిగా ఉండేవారో, మళ్ళీ 84 జన్మలను పూర్తి చేసారో, అతనిలోకే వస్తాను. ఉత్తమ పురుషులు సత్యయుగములో ఉంటారు. కలియుగములో కనిష్ఠులు, తమోప్రధానులు ఉన్నారు. ఇప్పుడు మీరు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు. తండ్రి వచ్చి తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా చేస్తారు. ఇది ఒక ఆట. దీనిని అర్థం చేసుకోకపోతే స్వర్గములోకి ఎప్పుడూ రారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి సాంగత్యములో స్వయాన్ని పారసబుద్ధి కలవారిగా తయారుచేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. చెడు సాంగత్యము నుండి దూరంగా ఉండాలి.

2. సదా ఈ సంతోషంలోనే ఉండాలి - స్వదర్శన చక్రధారులమైన మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా, చక్రవర్తులుగా అవుతాము. శివబాబా మమ్మల్ని జ్ఞాన సూర్యవంశీయులుగా తయారుచేయడానికి వచ్చారు. మా లక్ష్యమే ఇది.

వరదానము:-

విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటి వేసే నిర్విఘ్న, విజయీ భవ

విఘ్నాలు రావడము అన్నది మంచి విషయమే కానీ విఘ్నాలు ఓడించకూడదు. విఘ్నాలు దృఢంగా చేయడం కోసమే వస్తాయి, అందుకే విఘ్నాలకు భయపడేందుకు బదులుగా వాటిని మనోరంజకమైన ఆటగా భావించి దాటి వేయండి, అప్పుడు నిర్విఘ్నులు, విజయీలు అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క తోడు ఉన్నప్పుడు ఇక భయపడాల్సిన విషయమే లేదు. కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నాలు మరియు మాయ వస్తాయి, బిజీగా ఉన్నట్లయితే మాయ మరియు విఘ్నాలు పక్కకు వెళ్ళిపోతాయి.

స్లోగన్:-

సుఖము యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా హృదయము నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి.