05-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఈ చదువు ది బెస్ట్ (ఉత్తమోత్తమమైనది), దీనినే సంపాదనకు ఆధారము అని అంటారు, ఈ చదువులో పాసవ్వాలంటే టీచర్ ఇచ్చే మతముపై నడుస్తూ ఉండండి

ప్రశ్న:-

తండ్రికి డ్రామా రహస్యము తెలిసి ఉన్నా కూడా తమ పిల్లలతో ఏ పురుషార్థం చేయిస్తారు?

జవాబు:-

పిల్లలందరూ నంబరువారుగానే సతోప్రధానంగా అవుతారని బాబాకు తెలుసు, కానీ పిల్లలతో సదా ఇదే పురుషార్థం చేయిస్తారు - పిల్లలూ, శిక్షలు అనుభవించవలసిన అవసరం రానటువంటి పురుషార్థమును చెయ్యండి. శిక్షల నుండి విముక్తులయ్యేందుకు, ఎంత వీలైతే అంత ప్రేమగా తండ్రిని స్మృతి చేయండి. నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ స్మృతిలో ఉండండి, అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది, ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతుంది.

ఓంశాంతి

బాబా మనకు జ్ఞాన-యోగాలను నేర్పిస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. తమ యోగము ఎలా ఉంది అనేది పిల్లలకే తెలుసు. ఇంతకుముందు పవిత్రముగా ఉన్న మనమే ఇప్పుడు అపవిత్రముగా అయ్యాము, ఎందుకంటే 84 జన్మల లెక్క అయితే కావాలి కదా. ఇది 84 జన్మల చక్రము. ఇది కూడా ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో, వారే తెలుసుకుంటారు. పిల్లలైన మీకు ఇది తండ్రి ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇటువంటి తండ్రి చెప్తుంది కూడా నమ్మకపోతే మరి ఇంకెవరు చెప్పింది నమ్ముతారు! తండ్రి మతము లభిస్తుంది. ఏమాత్రమూ నమ్మనివారు కూడా ఎందరో ఉన్నారు. కోట్లలో ఏ ఒక్కరో నమ్ముతారు. తండ్రి శిక్షణను కూడా ఎంత స్పష్టంగా ఇస్తారు. నంబరువారు పురుషార్థానుసారంగా పిల్లలైన మీరే స్వీకరిస్తారు. అందరూ ఒకే విధంగా స్వీకరించరు. టీచర్ చెప్పే చదువును కూడా అందరూ ఒకేవిధంగా స్వీకరించరు లేక చదవరు. నంబరువారుగా కొందరు 20 మార్కులు తీసుకుంటారు, కొందరు వేరే మార్కులు తీసుకుంటారు, కొందరైతే ఫెయిలైపోతారు. ఫెయిల్ ఎందుకు అవుతారు? ఎందుకంటే టీచర్ మతముపై నడవరు. అక్కడ అనేక మతాలు లభిస్తాయి. ఇక్కడ ఒకే మతము లభిస్తుంది. ఇది అద్భుతమైన మతము. తప్పకుండా తాము 84 జన్మలు తీసుకుంటారని పిల్లలకు తెలుసు. తండ్రి అంటారు - నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో... ఈ విధంగా ఎవరన్నారు? శివబాబా అన్నారు. నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో, ఎవరినైతే భగీరథుడు అని అంటారో, వారికి తమ జన్మలను గురించి ఇంతకుముందు తెలియదు. పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు తెలియదు. మీకు ఇప్పుడు అర్థం చేయిస్తాను. మీరు ఇన్ని జన్మలు సతోప్రధానంగా ఉండేవారు, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తూ కిందకు దిగిపోతూ వచ్చారు. ఇప్పుడు మీరు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చారు. చదువు అనేది సంపాదన, సంపాదనకు ఆధారము. ఈ చదువు ది బెస్ట్ (ఉత్తమోత్తమమైనది). ఆ చదువులో ఐ.సి.ఎస్. ది బెస్ట్ అని అంటారు. ఒకప్పుడు 16 కళల సంపూర్ణులైన దేవతలుగా ఉన్న మీలో ఇప్పుడు ఏ గుణాలూ లేవు. నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు అని గానం చేస్తారు. అందరూ ఇలానే అంటూ ఉంటారు. సర్వత్రా భగవంతుడు ఉన్నారు, దేవతలలో కూడా భగవంతుడు ఉన్నారు అని భావిస్తారు, అందుకే ఆ దేవతల ముందు కూర్చొని - నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు... మీరే దయ చూపించాలి అని అంటారు. బాబా దయాసాగరుడు, దయాళువు, మనపై దయ చూపిస్తారు అని గానం చేస్తారు కూడా. ఓ ఈశ్వరా, దయ చూపించు అని అంటారు. తండ్రిని పిలుస్తారు, ఇప్పుడు ఆ తండ్రే మీ ఎదురుగా వచ్చారు. ఇటువంటి తండ్రి గురించి ఎవరికైతే తెలుసో, వారికి ఎంత సంతోషముండాలి! అనంతమైన తండ్రి మనకు ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొత్తం విశ్వ రాజ్యాన్ని ఇస్తారు కావున ఎంత అపారమైన సంతోషం ఉండాలి!

శ్రీమతంపై మనము శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా అవుతున్నామని మీకు తెలుసు. ఒకవేళ శ్రీమతంపై నడుస్తే శ్రేష్ఠముగా అవుతారు. అర్ధకల్పము రావణుడి మతము నడుస్తుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు, మీరే సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు మీరు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఇది రావణ రాజ్యం. ఎప్పుడైతే ఈ రావణుడిపై విజయాన్ని పొందుతారో, అప్పుడే రామరాజ్యం స్థాపన అవుతుంది. తండ్రి అంటారు, మీరు నన్ను గ్లాని చేస్తారు. తండ్రి పేరును మహిమ చేయడానికి బదులుగా గ్లాని చేస్తారు! తండ్రి అంటారు, మీరు నాకు ఎంత అపకారము చేసారు. ఇది కూడా డ్రామాగా తయారుచేయబడి ఉంది. ఇప్పుడిక ఈ అన్ని విషయాల నుండి బయటకు రండి, ఒక్కరినే స్మృతి చేయండి అని అర్థం చేయించడం జరుగుతుంది. సత్యమైన సాంగత్యము 21 జన్మలు తీరాన్ని చేరుస్తుంది అని అంటారు. మరి ముంచింది ఎవరు? మిమ్మల్ని సాగరంలో ఎవరు ముంచారు? పిల్లలనే ప్రశ్న అడుగుతారు కదా. తోట యజమాని, నావికుడు అన్న పేర్లు నావే అని మీకు తెలుసు. అర్థము తెలియని కారణంగా అనంతమైన తండ్రిని ఎంతో గ్లాని చేసారు. కానీ అనంతమైన తండ్రి వారికి అనంతమైన సుఖాన్ని ఇస్తారు, అపకారము చేసినవారికి ఉపకారము చేస్తారు. తాము అపకారము చేస్తున్నారు - అన్నది వారికి తెలియదు. ఎంతో సంతోషంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు అదైతే సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి తమ-తమ పాత్ర లభించి ఉంది. ఎప్పుడైతే దేవీ-దేవతల రాజ్యం ఉండేదో, అప్పుడు వేరే ఏ రాజ్యం ఉండేది కాదు అని కూడా మీకు తెలుసు. భారత్ సతోప్రధానంగా ఉండేది. ఇప్పుడు తమోప్రధానంగా ఉంది. ప్రపంచాన్ని సతోప్రధానంగా తయారుచేయడానికే తండ్రి వస్తారు. అది కూడా పిల్లలైన మీకే తెలుసు. ఒకవేళ మొత్తం ప్రపంచమంతటికీ తెలిసినట్లయితే చదువుకునేందుకు ఇక్కడకు ఎలా వస్తారు. కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. సంతోషం వంటి ఔషధం లేదు. సత్యయుగంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. దేవతల అన్నపానాదులు మొదలైనవి చాలా సూక్ష్మముగా ఉంటాయి. ఎంతో సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీకు సంతోషం లభిస్తోంది. మనం సతోప్రధానంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనకు మళ్ళీ అటువంటి ఫస్ట్ క్లాస్ యుక్తిని తెలియజేస్తున్నారు. గీతలో కూడా మొట్టమొదటి పదము మన్మనాభవ. ఇది గీతా అధ్యాయమే కదా. గీతలో శ్రీకృష్ణుని పేరును వేసి మొత్తం తికమకపర్చేసారు. అది భక్తి మార్గము. తండ్రి కూడా జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు, ఇందులో ఘర్షణ విషయమేమీ లేదు. కేవలం తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఇది తమోప్రధాన ప్రపంచం. కలియుగంలో చూడండి, మనుష్యుల పరిస్థితి ఎలా అయిపోయిందో. లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయారు. సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే భాష మరియు ఒకే కొడుకు ఉంటారు, ఒకే రాజ్యం నడుస్తుంది. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. కావున ఒకటేమో, సృష్టి చక్ర జ్ఞానము, ఇంకొకటి యోగము. జ్ఞానము యొక్క ధురియా మరియు హోలీ. తండ్రి అర్థం చేయిస్తున్న ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఈ సమయంలో అందరిదీ తమోప్రధాన శిథిలావస్థ, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మమ్మల్ని పావనంగా తయారుచేయడానికి రండి అనే మీరు నన్ను పిలిచారు. మీరు పతితంగా అయిపోయారు. పతిత-పావనా అని నన్నే అంటారు. ఇప్పుడు నాతో యోగాన్ని జోడించండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను మీకు అంతా రైట్ యే వినిపిస్తాను. ఇకపోతే జన్మజన్మాంతరాలు మీరు అధర్మయుక్తంగా అవుతూనే వచ్చారు. సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అయిపోయారు.

తండ్రి పిల్లలతో మాట్లాడుతున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీ ఆత్మ తమోప్రధానంగా అయ్యింది. అలా ఎవరు తయారుచేసారు? పంచ వికారాలు. మనుష్యులు ఎన్ని ప్రశ్నలు అడుగుతారంటే దానితో అసలు బుద్ధిని పాడు చేసేస్తారు. శాస్త్రవాదం చేసినప్పుడు పరస్పరం పోట్లాడుకుంటారు. ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు కూడా. ఇక్కడైతే తండ్రి మిమ్మల్ని పతితం నుండి పావనంగా తయారుచేస్తారు, ఇందులో శాస్త్రాలేం చేస్తాయి? పావనంగా అవ్వాలి కదా. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం తప్పకుండా రానున్నది. సతోప్రధానంగా కూడా తప్పకుండా అవ్వాలి. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ ఆత్మ తమోప్రధానంగా అయ్యింది కావున శరీరము కూడా తమోప్రధానమైనదే లభిస్తుంది. బంగారము ఎన్ని క్యారెట్లతో ఉంటుందో, ఆభరణం కూడా అలాగే తయారవుతుంది. మలినాలు కలుస్తాయి కదా. ఇప్పుడు మీరు 24 క్యారెట్ల బంగారముగా అవ్వాలి. దేహీ-అభిమానీ భవ. దేహాభిమానంలోకి రావడం వల్ల మీరు ఛీ-ఛీ గా అయిపోయారు. ఏ విధమైన సంతోషమూ లేదు. వ్యాధులు, అనారోగ్యము మొదలైనవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పతిత-పావనుడను నేనొక్కడినే. నన్ను మీరు పిలిచారు. నేను సాధు-సన్యాసిని ఏమీ కాదు. ఎవరైనా వచ్చినప్పుడు గురువుగారిని దర్శించుకుంటాము అని అంటే, వారికి చెప్పండి - ఇక్కడ గురువుగారైతే లేరు మరియు దర్శనం వల్ల కూడా లాభమేమీ లేదు. తండ్రి అయితే ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేయిస్తారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు, అప్పుడు దేవతలుగా అయిపోతారు. మీరు ఇక్కడకు మళ్ళీ దేవతలుగా, సతోప్రధానులుగా అవ్వడానికి వచ్చారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయడం ద్వారా మీ తుప్ప తొలగిపోతుంది, సతోప్రధానంగా అయిపోతారు. పురుషార్థం ద్వారానే అలా అవుతారు కదా. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. స్నానం చేస్తూ తండ్రిని స్మృతి చేయలేరా? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు వదులుతుంది మరియు సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. మీకు ఎంత ధనాన్ని ఇస్తాను. మీరు విశ్వాధిపతులుగా అవ్వడానికి వచ్చారు. అక్కడ మీరు బంగారు మహళ్ళను నిర్మిస్తారు. ఎన్ని వజ్ర-వైఢూర్యాలు ఉంటాయి. భక్తిలో ఏ మందిరాలనైతే నిర్మిస్తారో, వాటిలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలు ఉంటాయి. ఎంతోమంది రాజులు మందిరాలను నిర్మిస్తారు. అన్ని వజ్రాలు, బంగారము ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పుడైతే లేవు కదా. చక్రము ఏ విధంగా తిరుగుతుంది, ఈ డ్రామాను గురించి కూడా మీకు తెలుసు. ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తిని చేసారో, ఇది వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. నంబరువారుగానే అర్థం చేసుకుంటారు. ఎవరెవరు చాలా సేవ చేస్తారు, ఎంతో సంతోషంగా ఉంటారు, యోగంలో ఉంటారు అనేది తెలుస్తుంది. ఆ అవస్థ చివరిలో ఉంటుంది. యోగం కూడా తప్పనిసరి. సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి వచ్చి ఉన్నారు కావున వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వీరు కూడా అంటారు - బాబా అయితే నాతో పాటు ఉన్నారు, నేను వింటున్నాను, మీకు వినిపించేటప్పుడు నేను కూడా వింటూ ఉంటాను, ఎవరికైనా వినిపిస్తారు కదా. జ్ఞానామృత కలశము మాతలైన మీకు లభిస్తుంది. మాతలు అందరికీ పంచుతారు, సేవ చేస్తారు. మీరందరూ సీతలు, రాముడు ఒక్కరే. మీరందరూ పెళ్లి కుమార్తెలు, నేను పెళ్లి కొడుకును. మిమ్మల్ని అలంకరించి అత్తవారింటికి పంపిస్తారు. వారు తండ్రులకే తండ్రి, పతులకే పతి అని గానం చేస్తారు కూడా. ఒకవైపు మహిమ చేస్తారు, ఇంకొకవైపు గ్లాని చేస్తారు. శివబాబా మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. పొజిషన్ అందరిదీ వేర్వేరు. ఇక్కడ అందరినీ కలిపేసి ఒకటిగా చేసేసారు. ఇది అంధకారమయమైన నగరము... మీరు ఇప్పుడు బాబాకు చెందినవారిగా అయ్యారు, మీరు శివబాబా మనుమలు, మనుమరాళ్ళు. మీ అందరికీ హక్కు ఉంటుంది, ఈ బాబా వద్దనైతే ఆస్తి లేదు. ఆస్తి హద్దులోని తండ్రి నుండి, అనంతమైన తండ్రి నుండి లభిస్తుంది, మూడవవారెవ్వరి నుండీ ఆస్తి లభించదు. నేను కూడా వారి నుండే వారసత్వాన్ని తీసుకుంటాను అని వీరు అంటారు. పారలౌకిక పరమపిత పరమాత్మను అందరూ తలచుకుంటారు. సత్యయుగంలో తలచుకోరు. సత్యయుగంలో ఉండేది ఒక తండ్రి మరియు రావణ రాజ్యంలో ఉండేది ఇద్దరు తండ్రులు. సంగమయుగంలో ముగ్గురు తండ్రులు ఉన్నారు - లౌకిక, పారలౌకిక మరియు మూడవవారు అద్భుతమైన అలౌకిక తండ్రి. వీరి ద్వారా ఆ తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. వీరికి కూడా వారి నుండే వారసత్వం లభిస్తుంది. బ్రహ్మాను ఆడమ్ అని కూడా అంటారు, వారు గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివుడినైతే ఫాదర్ అనే అంటారు. మనుష్యుల వృక్షము బ్రహ్మా నుండి ప్రారంభమవుతుంది, కావుననే వారిని గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. మీరు 84 జన్మలు తీసుకున్నారు. అర్థం చేయించేందుకు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో తలక్రిందుల ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. ఋషులను, మునులను అడిగితే వారు కూడా తెలియదు, తెలియదు అని అనేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. మరి ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి.

ఇప్పుడు మెల్లమెల్లగా పిల్లలైన మీరు డ్రామానుసారంగా పైకి ఎక్కుతారు. కల్పకల్పము నంబరువారుగా కొందరు సతోప్రధానంగా, కొందరు సతో, రజో, తమోగా అవుతారు. అటువంటి పదవియే అక్కడ లభిస్తుంది, అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, శిక్షలు అనుభవించకుండా ఉండేందుకు బాగా పురుషార్థం చేయండి. పురుషార్థం తప్పకుండా చేయిస్తారు. ఎవరైతే కల్పపూర్వము తయారయ్యారో వారే తయారవుతారు అని తెలిసినా కానీ పురుషార్థం తప్పకుండా చేయిస్తారు. ఎవరైతే సమీపంగా ఉంటారో పూజను కూడా బాగా వారే చేస్తారు. మొట్టమొదట మీరు నా పూజనే చేస్తారు, ఆ తర్వాత దేవతల పూజను చేస్తారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవ్వాలి. మీరు మీ రాజ్యాన్ని యోగబలము ద్వారా స్థాపన చేస్తున్నారు. యోగబలము ద్వారా మీరు విశ్వ రాజ్యాధికారమును తీసుకుంటారు. బాహుబలం ద్వారా ఎవ్వరూ విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోలేరు. వారు సోదరులను పరస్పరం పోట్లాడుకునేలా చేస్తారు. ఎన్ని ఆయుధాలను తయారుచేస్తారు. ఒకరికొకరు అప్పుగా ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ ఆయుధాలు ఉన్నది వినాశనం కొరకే. కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు ఎందుకంటే వారు కల్పము లక్షల సంవత్సరాలు ఉంటుంది అని భావిస్తారు. ఘోర అంధకారంలో ఉన్నారు. వినాశనం జరిగిపోతుంది మరియు అందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉంటారు, మేల్కోరు. మీరు ఇప్పుడు మేల్కొన్నారు. తండ్రి సదా వెలిగే జ్యోతి వంటివారు, నాలెడ్జ్ ఫుల్. పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా తయారుచేస్తారు. అది భక్తి, ఇది జ్ఞానము. జ్ఞానము ద్వారా మీరు సుఖవంతులుగా అవుతారు. మేము మళ్ళీ సతోప్రధానులుగా అవుతున్నాము అని మీకు లోపల అనిపించాలి. తండ్రిని స్మృతి చేయాలి. దీనినే అనంతమైన సన్యాసము అని అంటారు. ఈ పాత ప్రపంచము వినాశనమవ్వనున్నది. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. ఆ సమయంలో మీకు భోజనం కూడా పూర్తిగా లభించదు. మనము మన సంతోషమనే ఔషధముతో ఉంటాము. ఇవన్నీ అంతమవ్వనున్నాయని మీకు తెలుసు, ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. నేను పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ సతోప్రధానంగా తయారుచేసేందుకే వస్తాను. ఇది కల్పకల్పము నా పని మాత్రమే. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయంగా భగవంతుడు మాపై దయ చూపించారు, వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న ఈ నషాలో ఉండాలి. చదువు సంపాదనకు ఆధారము, అందుకే దానిని మిస్ చేయకూడదు.

2. అపారమైన సంతోషాన్ని అనుభవం చెయ్యాలి మరియు చేయించాలి. నడుస్తూ-తిరుగుతూ దేహీ-అభిమానిగా అయి తండ్రి స్మృతిలో ఉంటూ ఆత్మను సతోప్రధానంగా తప్పకుండా తయారుచేసుకోవాలి.

వరదానము:-

సమయ ప్రమాణంగా ప్రతి శక్తి యొక్క అనుభవమును ప్రాక్టికల్ స్వరూపములో చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ

మాస్టర్ అనగా అర్థము - ఏ శక్తిని ఏ సమయములో ఆహ్వానిస్తే, ఆ శక్తి అదే సమయములో ప్రాక్టికల్ స్వరూపములో అనుభమవ్వాలి. ఆర్డర్ చేసారు మరియు హాజరైపోయింది. అలా కాకుండా, ఆర్డర్ చేసిందేమో సహనశక్తిని కానీ వచ్చిందేమో ఎదుర్కొనే శక్తి అన్నట్లు ఉండకూడదు, అటువంటివారిని మాస్టర్ అని అనరు. కనుక ట్రయల్ చెయ్యండి - ఏ సమయములో ఏ శక్తి అవసరమో, ఆ సమయములో అదే శక్తి కార్యములోకి వస్తుందా? ఒక్క సెకండు తేడా వచ్చినా సరే విజయానికి బదులుగా ఓటమి కలుగుతుంది.

స్లోగన్:-

బుద్ధిలో ఎంతటి ఈశ్వరీయ నషా ఉంటుందో, కర్మలో అంతే నమ్రత ఉండాలి.