05-05-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.11.99


బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థము - ‘‘ఆజ్ఞాకారులుగా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా తమ హోలీహంసల మండలిని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ హోలీహంసలు. సదా మనసులో జ్ఞాన రత్నాలను మననం చేస్తూ ఉంటారు. హోలీహంసల పనే - వ్యర్థమనే రాళ్ళను విడిచిపెట్టడము మరియు జ్ఞాన రత్నాలను మననం చేయటము. ఒక్కొక్క రత్నము ఎంతటి అమూల్యమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞాన రత్నాల గనిగా అయ్యారు, జ్ఞాన రత్నాల ఖజానాతో సదా నిండుగా ఉంటారు.

ఈ రోజు బాప్ దాదా పిల్లలలోని ఒక విశేషమైన విషయాన్ని చెక్ చేస్తున్నారు. అది ఏమిటి? జ్ఞానం మరియు యోగము యొక్క సహజ ధారణకు సహజమైన సాధనము - బాప్ మరియు దాదాకు ఆజ్ఞాకారులుగా అయ్యి నడుచుకోవడము. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారులు, శిక్షకుని రూపంలో కూడా మరియు సద్గురువు రూపంలో కూడా ఆజ్ఞాకారులు. మూడు రూపాలలోనూ ఆజ్ఞాకారులుగా అవ్వటము అనగా సహజ పురుషార్థులుగా అవ్వటము ఎందుకంటే మూడు రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది. అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు ప్రతి సమయము, ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే ఏ రకమైన శ్రమ కానీ లేక కష్టము కానీ అనుభవమవ్వదు. ప్రతి సమయానికీ, మనసా సంకల్పాలు, వాణి మరియు కర్మలు, ఈ మూడింటికీ ఆజ్ఞ స్పష్టంగా లభించి ఉంది. ఇది చెయ్యాలా-వద్దా, ఇది తప్పా-ఒప్పా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఆలోచించాల్సిన శ్రమ కూడా లేదు. పరమాత్మ ఆజ్ఞ సదా శ్రేష్టంగానే ఉంటుంది. ఏ కుమారులంతా అయితే వచ్చారో వారిది చాలా మంచి సంగఠన. మరి ప్రతి ఒక్కరూ బాబాకు చెందినవారిగా అవ్వటంతోనే బాబాకు ప్రతిజ్ఞ చేసారా? బాబాకు చెందినవారిగా అయినప్పుడు అన్నింటికంటే ముందుగా ఏ ప్రతిజ్ఞను చేసారు? బాబా, తనువు-మనసు-ధనము అన్నీ ఏవైతే ఉన్నాయో, కుమారుల వద్ద ధనమైతే ఎక్కువ ఉండదు, అయినా కానీ ఏదైతే ఉందో అదంతా మీదే. ఈ ప్రతిజ్ఞను చేసారు కదా? తనువు కూడా, మనసు కూడా, ధనము కూడా మీవే మరియు సంబంధాలు కూడా అన్నీ మీతోనే - ఈ ప్రతిజ్ఞను కూడా పక్కాగా చేసారా? తనువు-మనసు-ధనము, సంబంధాలు అన్నీ మీవే అన్నప్పుడు ఇక నావి అనేవి ఏమున్నాయి! మరి నాది అన్న భావము ఏమైనా ఉందా? అసలు అలా ఉండేందుకేముంది? తనువు, మనసు, ధనము, జనము... అన్నీ బాబాకు అర్పించేసారు. ప్రవృత్తిలో ఉన్నవారు అర్పించారా? మధుబన్ వారు అర్పించారా? పక్కానే కదా! మనసు కూడా బాబాది అన్నప్పుడు ఇక నా మనసు అనేదే ఉండదు కదా! లేకపోతే మనసు నాదా? నాది అని అనుకుంటూ ఉపయోగించవచ్చా? మనసును బాబాకు ఇచ్చేసినప్పుడు ఇక మీ వద్ద ఉన్నది తాకట్టు పెట్టిన వస్తువు. మరి ఇక యుద్ధం ఎందులో చేస్తుంటారు? నా మనసు చింతలో ఉంది, నా మనసులో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, నా మనసు చంచలమవుతుంది... నాది అనేదే లేనప్పుడు, అది తాకట్టు పెట్టిన వస్తువు అన్నప్పుడు, మరి ఆ తాకట్టు పెట్టినదానిని నాదిగా భావించి ఉపయోగించుకోవటము, అది మోసము కాదా? మాయ వచ్చేందుకు ద్వారాలు - ‘‘నేను మరియు నాది’’. మరి తనువు కూడా మీది కాదు అన్నప్పుడు ఇక దేహాభిమానానికి సంబంధించిన ‘నేను’ అనేది ఎక్కడి నుండి వచ్చింది! మనసు కూడా మీది కాదు అన్నప్పుడు ఇక నాది-నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీదా లేక నాదా? బాబాదేనా లేక కేవలం చెప్పటం వరకే గానీ చేసేది లేదా? చెప్పటమేమో బాబాది అని, కానీ అనుకోవటం మాత్రం నాది అనా! కేవలం మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి - అందులో దేహాభిమానానికి చెందిన నేను అనేదీ లేదు, నాది అనేదీ లేదు. తనువును కూడా తాకట్టు వస్తువుగా భావించండి, మనసును కూడా తాకట్టు వస్తువుగా భావించండి అన్నది బాబా ఆజ్ఞ అన్నప్పుడు ఇక కష్టపడాల్సిన అవసరమేముంది? ఏ బలహీనత వచ్చినా ఈ రెండు పదాల ద్వారానే వస్తుంది - ‘‘నేను మరియు నాది’’. కనుక ఈ తనువూ మీది కాదు, అలాగే దేహాభిమానానికి చెందిన నేను అనేదీ లేదు. ఒకవేళ మీరు ఆజ్ఞాకారులైతే మనసులో వచ్చే సంకల్పాల విషయంలో బాబా ఆజ్ఞ ఏమని ఉంది? పాజిటివ్ ఆలోచించండి, శుభ భావనతో కూడిన సంకల్పాలను చెయ్యండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యండి అనేది బాబా ఆజ్ఞయా? కాదు. కనుక మనసు మీది కాదు అన్నప్పుడు మళ్ళీ వ్యర్థ సంకల్పాలను చేస్తుంటే బాబా ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకురాలేదనే కదా! కేవలం ఒక్క మాటను గుర్తు చేసుకోండి - నేను పరమాత్మకు ఆజ్ఞాకారీ బిడ్డను. ఇది బాబా ఆజ్ఞనా, కాదా అన్నదానిని ఆలోచించండి. ఎవరైతే ఆజ్ఞకారీ బిడ్డగా ఉంటారో వారు సదా బాబాకు స్వతహాగానే గుర్తు ఉంటారు, స్వతహాగానే ప్రియంగా ఉంటారు, స్వతహాగానే బాబాకు సమీపంగా ఉంటారు. కనుక చెక్ చేసుకోండి - నేను బాబాకు సమీపంగా ఉన్నానా, బాబాకు ఆజ్ఞాకారిగా ఉన్నానా? ఒక్క మాటనైతే అమృతవేళ గుర్తు చేసుకోగలరు - ‘‘నేను ఎవరిని?’’ ఆజ్ఞాకారినా లేక అప్పుడప్పుడు ఆజ్ఞాకారిగా ఉంటూ, అప్పుడప్పుడు ఆజ్ఞను అతిక్రమించేవాడినా?

బాప్ దాదా సదా ఏమంటారంటే - ఏ రూపంలోనైనా ఒకవేళ ఒక్క బాబాతో ఉన్న సంబంధమే గుర్తుంటే, మనస్ఫూర్తిగా ‘బాబా’ అని వెలువడితే సమీపతను అనుభవము చేస్తారు. ‘‘బాబా-బాబా’’ అని కేవలం ఒక మంత్రంలా అనకండి. బయటివారు రామ-రామ అని అంటారు, అలా మీరు బాబా-బాబా అని అంటారు, అలా కాకుండా బాబా అన్న మాట మనసులో నుండి రావాలి. ప్రతి కర్మ చేసే కంటే ముందు చెక్ చేసుకోండి - మనసు కోసము, తనువు కోసము మరియు ధనం కోసము బాబా ఆజ్ఞ ఏమిటి? కుమారుల వద్ద ఎంత తక్కువ ధనం ఉన్నా కానీ ధనం విషయంలో లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోమని బాబా ఆజ్ఞను ఇచ్చారో అలానే పెట్టుకున్నారా? లేకపోతే ఎలా తోస్తే అలా ఉపయోగిస్తున్నారా? కుమారులు ప్రతి ఒక్కరూ ధనము యొక్క లెక్కల ఖాతాను కూడా పెట్టుకోవాలి. ధనాన్ని ఎక్కడ మరియు ఎలా ఉపయోగించాలి, మనసును కూడా ఎక్కడ మరియు ఎలా ఉపయోగించాలి, తనువును కూడా ఎక్కడ ఉపయోగించాలి, ఈ అన్ని విషయాలలో లెక్కల ఖాతా ఉండాలి. దాదీలైన మీరు ధారణా క్లాస్ చేయించేటప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా లెక్కల ఖాతా పెట్టుకోవాలి అన్నదానిని అర్థం చేయిస్తారు కదా! కుమారులకు తెలుసా లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోవాలి, ఎక్కడ ఉపయోగించాలి అన్నది తెలుసా? కొద్దిమంది చేతులు ఎత్తుతున్నారు. కొత్త కొత్తవారు కూడా ఉన్నారు, వారికి తెలియదు. ఏమేమి చెయ్యాలి అన్నది వారికి తప్పకుండా చెప్పండి! అప్పుడు నిశ్చింతులుగా అయిపోతారు, భారము అనిపించదు ఎందుకంటే మీ అందరి లక్ష్యము ఏమిటంటే - కుమార్ అంటే లైట్, డబల్ లైట్. మేము నంబర్ వన్ లోకి రావాలి అని కుమారులకు లక్ష్యం ఉంది కదా? మరి లక్ష్యముతోపాటు లక్షణాలు కూడా కావాలి. లక్ష్యము చాలా ఉన్నతంగా ఉండి, లక్షణాలు లేకపోతే లక్ష్యానికి చేరుకోవటము కష్టము, అందుకే బాబా ఆజ్ఞ ఏదైతే ఉందో, దానిని సదా బుద్ధిలో ఉంచుకుని ఆ తరువాత కార్యములోకి రండి.

బాప్ దాదా ఇంతకుముందు కూడా అర్థం చేయించారు, బ్రాహ్మణ జీవితము యొక్క ముఖ్య ఖజానాలు - సంకల్పము, సమయము మరియు శ్వాస. మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది. ఒక్క శ్వాస కూడా సాధారణంగా ఉండకూడదు, వ్యర్థంగా ఉండకూడదు. శ్వాస శ్వాసలోనూ మీ ఇష్టదేవతను గుర్తు చేసుకోండి అని భక్తిలో అంటారు. శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా... ఇవైతే ఉండనే ఉన్నాయి. కానీ సంకల్పము, సమయము మరియు శ్వాస - ముఖ్యమైన ఈ మూడు ఖజానాలు ఆజ్ఞ ప్రమాణంగా సఫలమవుతున్నాయా? వ్యర్థమైతే అవ్వటం లేదు కదా? ఎందుకంటే వ్యర్థంగా పోతే జమ అవ్వదు. అంతేకాక జమ ఖాతాను ఈ సంగమములోనే జమ చేసుకోవాలి. సత్య, త్రేతా యుగాలలో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవాలన్నా, ద్వాపర, కలియుగాలలో పూజ్య పదవిని పొందాలన్నా, రెండింటి జమ ఈ సంగమములోనే చేసుకోవాలి. ఆ లెక్కన ఆలోచించండి - సంగమ సమయములోని జీవితము, ఈ చిన్న జన్మలోని సంకల్పాలు, సమయము, శ్వాస ఎంత అమూల్యమైనవి? ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఎలా పడితే అలా రోజు గడిచిపోయింది అన్నట్లు కాదు, ఒక రోజే కదా అలా గడిచిపోయింది అని కాదు, ఒక్క రోజులో చాలా, చాలా పోగొట్టుకున్నారు. ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు వస్తే, వ్యర్థంగా సమయము గడిచిపోతే, పోనీలే 5 నిమిషాలే కదా పోయింది అని అనుకోకండి. దానిని కాపాడుకోండి. సమయమనుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి, ఏదో ఒక ఆటను చూపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఆటను చూపిస్తూ ఉంటుంది. కానీ ప్రకృతిపతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే - ఎగిరే కళ ఆట. ప్రకృతి అయితే ఆటను చూపిస్తుంది కానీ బ్రాహ్మణులు తమ ఎగిరే కళ ఆటను చూపిస్తున్నారా?

ఒక బిడ్డ - ఇలా జరిగింది, అలా జరిగింది అని ఒరిస్సాలోని సముద్ర తుఫాను రిజల్టు గురించి వ్రాసి ఇచ్చారు. మరి ఆ ప్రకృతి ఆటనైతే చూసారు కదా. అయితే బాప్ దాదా అడుగుతున్నారు - మీరు కేవలం ప్రకృతి ఆటనే చూసారా లేక మీ ఎగిరే కళ ఆటలో బిజీగా ఉన్నారా? లేక కేవలం సమాచారాన్ని వింటూ ఉన్నారా? సమాచారాన్ని అయితే అందరూ వినాల్సి ఉంటుంది కూడా, కానీ సమాచారాన్ని వినటంలో ఎంతైతే అభిరుచి ఉంటుందో అంతగా మీ ఎగిరే కళ ఆటలో ఉండటానికి అభిరుచి ఉంటుందా? కొంతమంది పిల్లలు గుప్త యోగులుగా కూడా ఉన్నారు, అటువంటి గుప్త యోగీ పిల్లలకు బాప్ దాదా సహాయము కూడా ఎంతగానో లభించింది మరియు అటువంటి పిల్లలు స్వయము కూడా అచలంగా, సాక్షీగా ఉన్నారు మరియు వాయుమండలములో కూడా అవసరమైన సమయానికి సహయోగాన్ని ఇచ్చారు. ప్రభుత్వం వారు, చుట్టుప్రక్కల ప్రజలు ఏ విధంగా స్థూల సహయోగాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతారో, అలా బ్రాహ్మణ ఆత్మలు కూడా తమ సహయోగముగా శక్తిని, శాంతిని, సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ఠ కార్యము ఏదైతే ఉందో అది చేసారా? ఆ ప్రభుత్వము ఇది చేసింది, ఫలానా దేశము అది చేసింది... అని వాళ్ళు వెంటనే ప్రకటించటం మొదలుపెడతారు. మరి బాప్ దాదా అడుగుతున్నారు - బ్రాహ్మణులైన మీరు కూడా మీ ఈ కార్యాన్ని చేసారా? మీరు కూడా అలర్ట్ గా (జాగరూకులై) ఉండాలి. స్థూల సహయోగాన్ని ఇవ్వటము కూడా అవసరము, బాప్ దాదా దానిని చెయ్యవద్దు అని అనరు, కానీ బ్రాహ్మణ ఆత్మల విశేష కార్యము ఏదైతే ఉందో, ఇతరులెవ్వరూ ఇవ్వలేని సహయోగమేదైతే ఉందో, ఆ సహయోగాన్ని మీరు అలర్ట్ గా అయ్యి (జాగరూకులై) ఇచ్చారా? ఇవ్వాలి కదా! లేక వారికి కేవలం వస్త్రాలు, బియ్యమే కావాలా? ముందైతే మనసులో శాంతి కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. మరి స్థూల సహయోగముతోపాటు సూక్ష్మ సహయోగాన్ని బ్రాహ్మణులే ఇవ్వగలరు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు జరిగినది అసలేమీ కాదు, ఇది కేవలం రిహార్సల్ మాత్రమే. అసలైనవైతే మున్ముందు రానున్నాయి. ఆ రిహార్సల్ ను మీకు కూడా బాబా మరియు సమయము చేయిస్తున్నాయి. కావున మీ వద్ద ఏ శక్తులు మరియు ఖజానాలైతే ఉన్నాయో, వాటిని అవసరమైన సమయములో ఉపయోగించటము వస్తుందా?

కుమారులు ఏం చేస్తారు? శక్తులు జమ అయి ఉన్నాయా? శాంతి జమ అయి ఉందా? ఉపయోగించటము వస్తుందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతారు, ఇప్పుడు ప్రాక్టికల్లో చూపించండి. సాక్షీగా అయ్యి చూడాలి కూడా, వినాలి కూడా మరియు సహయోగాన్ని ఇవ్వాలి కూడా. చివర్లో అసలైనవి వాటి పాత్రను పోషించినప్పుడు, ఆ సమయములో వాటిని సాక్షీగా మరియు నిర్భయులుగా అయ్యి చూడాలి కూడా మరియు పాత్రను కూడా పోషించాలి. ఏ పాత్ర? దాత పిల్లలు, దాతగా అయ్యి ఆత్మలకు ఏది కావాలంటే అది ఇస్తూ ఉండాలి. మరి మీరు మాస్టర్ దాతలే కదా? స్టాక్ ను జమ చేసుకోండి, మీ వద్ద ఎంత స్టాక్ ఉంటే అంతగానే దాతగా అవ్వగలరు. అంతిమము వరకు మీ కోసమే జమ చేసుకుంటూ ఉన్నట్లయితే దాతగా అవ్వలేరు. అనేక జన్మలు ఏ శ్రేష్ఠ పదవినైతే పొందాలో, దానిని ప్రాప్తి చేసుకోలేరు. అందుకే ఒక విషయంలో మీ వద్ద స్టాక్ ను జమ చేసుకోండి. శుభ భావన, శ్రేష్ఠ కామన యొక్క భండారా సదా నిండుగా ఉండాలి. రెండవది - విశేష శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తులను ఏ సమయములో, ఎవరికి ఏవి కావాలో వాటిని ఇవ్వగలగాలి. ఇప్పుడు సమయమనుసారంగా కేవలము - మీ పురుషార్థానికీ మీ సంకల్పాలను మరియు సమయాన్ని ఉపయోగించండి, దానితోపాటుగా దాతగా అయ్యి విశ్వానికి కూడా సహయోగాన్ని ఇవ్వండి. మీరు చెయ్యాల్సిన పురుషార్థమునైతే వినిపించాము - అమృతవేళలోనే ‘నేను ఆజ్ఞాకారీ బిడ్డను’ అని అనుకోండి! ప్రతి కర్మకూ ఆజ్ఞ లభించి ఉంది. మేల్కొనేందుకు, నిద్రించేందుకు, తినేందుకు, కర్మయోగిగా అయ్యేందుకు, ఇలా ప్రతి కర్మకు ఆజ్ఞ లభించి ఉంది. ఆజ్ఞాకారిగా అవ్వటము, ఇదే బాబా సమానంగా అవ్వటము. కేవలం శ్రీమతంపైనే నడవండి, మన్మతము వద్దు, పరమతము వద్దు. ఏదీ కలపకండి. ఒక్కోసారి మన్మతముపై, ఒక్కోసారి పరమతముపై నడిచినట్లయితే శ్రమించాల్సి ఉంటుంది, సహజం అనిపించదు, ఎందుకంటే మన్మతము, పరమతము ఎగరనివ్వవు. మన్మతము, పరమతము భారమైనవి మరియు ఆ భారము ఎగరనివ్వదు. శ్రీమతము డబల్ లైట్ గా చేస్తుంది. శ్రీమతముపై నడవటం అనగా సహజంగా బాబా సమానంగా అవ్వటము. శ్రీమతముపై నడిచేవారిని ఏ పరిస్థితి కూడా కిందకు తీసుకురాలేదు. మరి శ్రీమతముపై నడవటం వస్తుందా?

అచ్ఛా, మరి కుమారులు ఇప్పుడు ఏం చేస్తారు? ఆహ్వానం లభించింది. విశేషమైన పాలన లభించింది. చూడండి, మీరు ఎంత ప్రియమైన పిల్లలైపోయారు! మరి ఇప్పుడిక మున్ముందు ఏం చేస్తారు? రెస్పాన్స్ ఇస్తారా లేక అక్కడకు వెళ్తే అక్కడివారిగా, ఇక్కడికి వస్తే ఇక్కడివారిగా ఉంటారా? అలా అయితే లేరు కదా? ఇక్కడైతే చాలా ఆనందములో ఉన్నారు, మాయ దాడి నుండి రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ మధుబన్ లో కూడా మాయ వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా? మధుబన్ లో కూడా శ్రమించాల్సి వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా? సురక్షితంగా ఉన్నారు, మంచిది. బాప్ దాదా కూడా సంతోషిస్తారు. ప్రభుత్వము వారికి కూడా యూత్ గ్రూప్ వైపుకు అటెన్షన్ వెళ్లే సమయము వస్తుంది, కానీ మీరు ఎప్పుడైతే విఘ్న-వినాశకులుగా అవుతారో అప్పుడే వారి అటెన్షన్ వెళ్తుంది. విఘ్న-వినాశక్ అనేది ఎవరి పేరు? మీదే కదా! ఏ కుమార్ నైనా ఎదుర్కొనేందుకు విఘ్నాలకు ధైర్యము ఉండకూడదు, అప్పుడు విఘ్న-వినాశకులు అని అంటారు. విఘ్నము ఓడిపోవాలే కానీ అది దాడి చెయ్యకూడదు. విఘ్న-వినాశకులుగా అయ్యే ధైర్యము ఉందా? లేకపోతే అక్కడకు వెళ్ళిన తరువాత - దాదీ, చాలా మంచిగా ఉండేవారము కానీ ఏమైపోయిందో తెలియదు అని ఇలా ఉత్తరం వ్రాస్తారా! ఇలా అయితే వ్రాయరు కదా? ఈ శుభవార్తను వ్రాయండి - ఓ.కే, వెరీ గుడ్, విఘ్న-వినాశకుడిని. కేవలం ఒక్క మాట వ్రాయండి, అంతే. చాలా పెద్ద ఉత్తరము వద్దు. ఓ.కే. అచ్ఛా.

మధుబన్ యొక్క విశేషత కూడా బాప్ దాదా వద్దకు చేరుకుంది. మధుబన్ వారు తమ చార్టు పంపారు. అది బాప్ దాదా వద్దకు చేరుకుంది. బాప్ దాదా పిల్లలందరినీ, ఆజ్ఞను పాటించే ఆజ్ఞాకారీ పిల్లలు అన్న దృష్టితో చూస్తారు. విశేష కార్యము లభించింది మరియు ఎవర్రెడీగా అయ్యి చేసారు, ఇందుకు విశేషంగా అభినందనలను ఇస్తున్నాము. అచ్ఛా, ప్రతి ఒక్కరూ తమది స్పష్టంగా వ్రాసారు. (దాదీతో) మీరు కూడా రిజల్టు చూసి క్లాస్ చేయించండి. వారి అవస్థ గురించిన చార్టు బాగా వ్రాసారు. బాప్ దాదా అయితే అభినందనలు ఇస్తూనే ఉన్నారు. సత్యమైన హృదయముపై సత్యమైన సాహెబ్ రాజీ అవుతారు. అచ్ఛా.

నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క ఆజ్ఞాకారీ పిల్లలకు, సదా విఘ్న-వినాశక పిల్లలకు, సదా శ్రీమతముపై సహజంగా నడిచేవారికి, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా ఆనందములో ఎగిరే మరియు ఎగిరింపజేసేవారికి, సర్వ ఖజానాల భండారాతో నిండుగా ఉండేవారికి, ఇటువంటి బాబాకు సమీపముగా మరియు సమానముగా ఉండే పిల్లలకు చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. కుమారులకు కూడా, విశేషంగా అలసిపోనివారిగా మరియు ఎవర్రెడీగా ఉంటూ సదా ఎగిరే కళలో ఎగిరేవారికి బాప్ దాదా యొక్క విశేష ప్రియస్మృతులు.

(బాప్ దాదా డైమండ్ హాల్లో కూర్చుని ఉన్న సోదర-సోదరీలందరికీ దృష్టి ఇవ్వడానికి హాలులో తిరిగారు)

బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల చాలా-చాలా-చాలా ప్రేమ ఉంది. మాపై బాప్ దాదాకు తక్కువ ప్రేమ ఉంది అని అనుకోకండి. మీరు మర్చిపోయినా కానీ బాబా నిరంతరము పిల్లలు ప్రతి ఒక్కరి మాలను జపిస్తూ ఉంటారు ఎందుకంటే బాప్ దాదాకు ప్రతి బిడ్డ యొక్క విశేషత సదా ముందు ఉంటుంది. ఏ బిడ్డ కూడా విశేషముగా లేరు అన్నది లేదు. ప్రతి బిడ్డ విశేషమైనవారే. బాబా ఎప్పుడూ ఒక్క బిడ్డను కూడా మర్చిపోరు. కనుక అందరూ స్వయాన్ని - నేను విశేష ఆత్మను మరియు విశేష కార్యము కొరకు నిమిత్తమై ఉన్నాను అని భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా!

వరదానము:-

సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ

ఆత్మిక గులాబీ అంటే వారిలో సదా ఆత్మిక సుగంధము ఉంటుంది. ఆత్మిక సుగంధము కలవారు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఆత్మనే చూస్తారు, శరీరాన్ని కాదు. కావున స్వయము కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి మరియు ఇతరులలో కూడా ఆత్మనే చూడండి. ఏ విధంగా బాబా ఉన్నతోన్నతమైనవారో, అదే విధంగా వారి పుష్పాల తోట కూడా ఉన్నతోన్నతమైనది, ఆ తోటకు విశేషమైన అలంకారము ఆత్మిక గులాబీలైన పిల్లలైన మీరే. మీ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కళ్యాణము చేస్తుంది.

స్లోగన్:-

మర్యాదను ఉల్లంఘించి ఎవరికైనా సుఖాన్ని ఇచ్చారంటే అది కూడా దుఃఖము యొక్క ఖాతాలో జమ అవుతుంది.