06-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - మీ గెలుపు-ఓటముల చరిత్రను గుర్తు తెచ్చుకోండి, ఇది సుఖదుఃఖాల ఆట, ఇందులో మూడొంతులు సుఖము, ఒక వంతు దుఃఖము ఉంది, అంతేకానీ సమానంగా లేవు

ప్రశ్న:-

ఈ అనంతమైన డ్రామా ఎంతో అద్భుతమైనది - అది ఎలా?

జవాబు:-

ఈ అనంతమైన డ్రామా ఎంత అద్భుతమైనదంటే ప్రతి క్షణము మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో, అది మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది. ఈ డ్రామా పేను వలె నడుస్తూనే ఉంటుంది, టిక్-టిక్ అంటూ ఉంటుంది. ఒకటి ఇంకొకదానితో కలవదు, అందుకే ఇది చాలా అద్భుతమైన డ్రామా. మనుష్యుల మంచి లేక చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో, అదంతా నిశ్చయించబడి ఉంది. ఈ విషయాలను కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు.

ఓంశాంతి

ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. నేను ఆత్మను అని ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. ఆత్మ స్వధర్మము శాంతి. ఇప్పుడు ఆత్మలందరికీ ఇంటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. ఈ ఇంటికి వెళ్ళే ప్రోగ్రామ్ గురించి ఎవరు తెలియజేస్తారు? తప్పకుండా తండ్రే తెలియజేస్తారు. హే ఆత్మల్లారా, ఇప్పుడు పాత ప్రపంచం అంతమవ్వనున్నది, పాత్రధారులందరూ వచ్చేసారు, ఇంకా కొంత మంది ఆత్మలే మిగిలి ఉన్నారు, ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి, మళ్ళీ పాత్రలను రిపీట్ చేయాలి. పిల్లలైన మీరు నిజానికి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, మొట్టమొదట సత్యయుగంలోకి వచ్చారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చారు. ఇది కేవలం ఆత్మలైన మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మీరు ఒక్క తండ్రికి పిల్లలు. మధురాతి-మధురమైన పిల్లలతో తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు మీరు పరాయి రావణ రాజ్యంలోకి వచ్చి పడ్డారు. మీ రాజ్యభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. సత్యయుగంలో దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, అది గడిచి 5,000 సంవత్సరాలు అవుతుంది. అర్ధ కల్పం మీరు రాజ్యం చేసారు ఎందుకంటే తప్పకుండా మెట్లు కిందకు కూడా దిగవలసి ఉంటుంది. సత్యయుగం నుండి త్రేతా, ఆ తర్వాత ద్వాపర-కలియుగాలలోకి రావాలి - ఇది మర్చిపోకండి. మీ గెలుపు-ఓటముల చరిత్ర ఏదైతే ఉందో, అది గుర్తు తెచ్చుకోండి. పిల్లలకు తెలుసు - సత్యయుగంలో మేము సతోప్రధానంగా ఉండేవారము, సుఖధామ వాసులుగా ఉండేవారము, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ దుఃఖధామంలో శిథిలావస్థకు చేరుకున్నాము అని. ఇప్పుడు మళ్ళీ ఆత్మలైన మీకు తండ్రి నుండి శ్రీమతం లభిస్తుంది ఎందుకంటే ఆత్మ-పరమాత్మ బహుకాలం వేరుగా ఉన్నారు... పిల్లలైన మీరు ఎంతోకాలము వేరుగా ఉన్నారు. మొట్టమొదట మీరే వేరయ్యారు, ఆ తర్వాత సుఖపు పాత్రను అభినయిస్తూ వచ్చారు. అప్పుడు మీ రాజ్యభాగ్యాన్ని లాక్కోవడం జరిగింది, దుఃఖపు పాత్రలోకి వచ్చేసారు. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్ళీ సుఖశాంతుల రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని ఆత్మలు అంటూ ఉంటారు. ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్న కారణంగా విశ్వంలో అశాంతి ఉంది. ఇది కూడా శాంతి మరియు అశాంతి, సుఖము మరియు దుఃఖము యొక్క ఆట. 5,000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేదని మీకు తెలుసు. మూలవతనము అంటేనే శాంతిధామము, అక్కడ ఆత్మలు నివసిస్తాయి, అక్కడ అశాంతి అన్న ప్రశ్నే లేదు. సత్యయుగంలో విశ్వంలో శాంతి ఉండేది, మళ్ళీ పడిపోతూ-పడిపోతూ అశాంతి ఏర్పడింది. ఇప్పుడు మొత్తం విశ్వములో అందరూ శాంతిని కోరుకుంటున్నారు. బ్రహ్మ మహతత్వాన్ని విశ్వము అని అనరు. దానిని బ్రహ్మాండము అని అంటారు, అక్కడ ఆత్మలైన మీరు నివసిస్తారు. ఆత్మ స్వధర్మము శాంతి. శరీరము నుండి ఆత్మ వేరైతే శాంతిగా అయిపోతుంది, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకున్నప్పుడు కదలికలు ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు? బాబా, మా శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. శాంతిధామము లేక ముక్తిధామములో సుఖదుఃఖాల పాత్ర లేదు. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. మరి ఎలా దిగుతారు? అది మెట్ల చిత్రములో చూపించారు. మీరు మెట్లు దిగుతారు, మళ్ళీ ఒకేసారి ఎక్కుతారు. పావనులుగా అయి మెట్లు ఎక్కుతారు మళ్ళీ పతితులుగా అయి దిగుతారు. పావనులుగా అవ్వకుండా మెట్లు ఎక్కలేరు అందుకే - బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు.

మీరు మొదట పావన శాంతిధామంలోకి వెళ్ళి, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తారు. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. సుఖపు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. రెండూ సమానంగా ఉంటే లాభమేమీ ఉండదు. అది వృధా అయిపోయినట్లే. తండ్రి అర్థం చేయిస్తారు - ఈ డ్రామా ఏదైతే తయారుచేయబడి ఉందో, అందులో మూడొంతుల సుఖముంది, మిగిలిన ఒక వంతు ఎంతో కొంత దుఃఖము ఉంది, అందుకే దీనిని సుఖదుఃఖాల ఆట అని అంటారు. తండ్రినైన నన్ను పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు అని తండ్రికి తెలుసు. నేనే మీకు నా పరిచయాన్ని ఇచ్చాను మరియు సృష్టి ఆదిమధ్యాంతాల పరిచయాన్ని కూడా ఇచ్చాను. మిమ్మల్ని నాస్తికుల నుండి ఆస్తికులుగా తయారుచేసాను. మూడు లోకాల గురించి కూడా మీకు తెలుసు. భారతవాసులకు కల్పం యొక్క ఆయుష్షు గురించి కూడా తెలియదు. ఇప్పుడు మీకే తెలుసు - బాబా మమ్మల్ని మళ్ళీ చదివిస్తున్నారు. బాబా గుప్త వేషంలో పరాయి దేశంలోకి వచ్చారు. బాబా కూడా గుప్తమైనవారే. మనుష్యులకు తమ దేహము గురించి తెలుసు కానీ ఆత్మ గురించి తెలియదు. ఆత్మ అవినాశీ, దేహము వినాశీ. ఆత్మను మరియు ఆత్మ యొక్క తండ్రిని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో, అప్పుడే వారసత్వం లభిస్తుంది. ఈ రావణ రాజ్యంలో మీరు పతితులుగా ఉన్నారు, అందుకే తండ్రిని పిలుస్తారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు. పరమపిత పరమాత్మ ఆత్మలందరికీ ఏకైక తండ్రి. అంతేకానీ సోదరులందరూ తండ్రులు అని కాదు. ఎప్పుడెప్పుడైతే భారత్ లో అతి ధర్మగ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే సర్వ ధర్మాల పారలౌకిక తండ్రిని మర్చిపోతారో, అప్పుడే తండ్రి వస్తారు. ఇది కూడా ఆటయే. ఏదైతే జరుగుతుందో అదంతా ఒక ఆటగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మలైన మీరు ఎన్ని సార్లు పాత్రను అభినయించేందుకు వస్తారు-వెళ్తారు. ఈ నాటకము అనాదిగా, పేను వలె నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ ఆగదు. టిక్-టిక్ అవుతూ ఉంటుంది కానీ ఒకదానితో మరొకటి కలవదు. ఇది ఎంత అద్భుతమైన నాటకము. క్షణ-క్షణము మొత్తం సృష్టి అంతటిలో ఏదైతే జరుగుతుందో, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రతి ధర్మంలోని ముఖ్య పాత్రధారులెవరైతే ఉంటారో, వారి గురించి తెలియజేస్తారు. వారందరూ తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. వారు రాజధానిని స్థాపన చేయరు. ఒక్క పరమపిత పరమాత్మయే ధర్మాన్ని కూడా స్థాపన చేస్తారు మరియు వంశావళిని కూడా స్థాపన చేస్తారు. వారు ధర్మ స్థాపన చేస్తారు, వారి వెనుక అందరూ రావలసి ఉంటుంది. అందరినీ ఎవరు తీసుకువెళ్తారు? తండ్రి. కొందరు చాలా కొద్ది పాత్రను అభినయిస్తారు మరియు వెళ్ళిపోతారు. ఏ విధంగా జీవ-జంతువులు జన్మిస్తాయి మళ్ళీ చనిపోతాయి. వాటి విషయం అసలు డ్రామాలో లేనట్లుగానే ఉంటుంది. అటెన్షన్ ఎవరి వైపుకి వెళ్తుంది? ఒకటేమో రచయిత వైపుకి వెళ్తుంది, వారిని అందరూ ఓ గాడ్ ఫాదర్, ఓ పరమపిత పరమాత్మా అని అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి. మొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేది. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము. ఎన్ని మత-మతాంతరాలు ఉన్నాయి, ఎన్ని వెరైటీ వస్తువులు వెలువడ్డాయి. లెక్క పెట్టడం కష్టమైపోతుంది. వాటి పునాది లేదు. మిగిలినవన్నీ ఉన్నాయి. తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, ఎప్పుడైతే అనేక ధర్మాలు ఉంటాయో, ఒక్క ధర్మం ఉండదో, అప్పుడే నేను వస్తాను. పునాది కనుమరుగైపోయింది. కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆది సనాతనమైనది ఒక్క ధర్మమే. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. స్వర్గంలోకి రానివారు త్రేతాయుగంలో ఎందరో ఉన్నారు.

మేము కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలని మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తారు. తండ్రి అంటారు - ఎప్పుడైతే నన్ను స్మృతి చేసి పావనంగా అవుతారో మరియు దైవీ గుణాలను ధారణ చేస్తారో, అప్పుడే స్వర్గంలోకి వస్తారు. ఇకపోతే వృక్షము యొక్క శాఖోపశాఖలైతే అనేకము ఉన్నాయి. ఆది సనాతన దేవీ-దేవతలు స్వర్గములో ఉండేవారని పిల్లలకు వృక్షము గురించి కూడా తెలిసింది. ఇప్పుడు స్వర్గం లేదు. ఇప్పుడు నరకము ఉంది. అందుకే బాబా ప్రశ్నావళిని తయారుచేసారు, మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - మేము సత్యయుగ స్వర్గవాసులమా లేక కలియుగ నరకవాసులమా? సత్యయుగం నుండి క్రిందికి కలియుగంలోకి దిగుతారు, మళ్ళీ పైకి ఎలా వెళ్తారు? తండ్రి శిక్షణను ఇస్తారు. మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. కల్పక్రితం కూడా మీకు జ్ఞానం నేర్పించి దేవతలుగా తయారుచేసాను, ఇప్పుడు మీరు తమోప్రధానంగా అయిపోయారు. మళ్ళీ తప్పకుండా సతోప్రధానముగా తయారుచేసేవారు ఉంటారు. మనుష్యులు ఎవరూ కూడా పతితపావనులు కాలేరు. ఓ పతితపావనా, ఓ భగవంతుడా అని అన్నప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. వారు నిరాకారుడు, మిగిలినవారంతా పాత్రధారులు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. నేను పునర్జన్మ రహితుడను. ఈ డ్రామా తయారై ఉంది, దీని గురించి ఎవరికీ తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. మీరు మీ స్వ ఆత్మ యొక్క ధర్మంలో స్థితులవ్వండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో తండ్రి అర్థం చేయిస్తారు, అందుకే మీకు స్వదర్శన చక్రధారి అన్న పేరు ఉంది, ఇంకెవ్వరికీ ఈ జ్ఞానం లేదు. కావున మీకు ఎంతో సంతోషము ఉండాలి. బాబా మనకు శిక్షకుడు కూడా. వారు చాలా మధురమైన బాబా. బాబా వంటి మధురమైనవారు ఇంకెవ్వరూ లేరు. మీరు పారలౌకిక తండ్రికి పిల్లలు, పరలోకంలో నివసించేటువంటి ఆత్మలు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చి, పాలన చేసి చివర్లో అన్నీ ఇచ్చి వెళ్ళిపోతారు ఎందుకంటే పిల్లలు వారసులు, ఇది ఒక నియమము. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అవుతారు. తండ్రి అంటారు - ఇప్పుడు అందరూ తిరిగి వాణి నుండి అతీతంగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ సైలెన్స్ ఉంటుంది, తర్వాత మూవీ, ఆ తర్వాత టాకీ ఉంటుంది. పిల్లలు సూక్ష్మ వతనంలోకి వెళ్తారు, సాక్షాత్కారము కలుగుతుంది. ఆత్మ బయటకు వెళ్ళిపోదు. డ్రామాలో ఏదైతే నిశ్చయించబడి ఉంటుందో, అది క్షణక్షణం రిపీట్ అవుతుంది. ఒక క్షణము ఇంకొక క్షణంతో కలవదు. మనుష్యుల మంచి లేక చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో, అంతా నిశ్చయించబడి ఉంది. సత్యయుగంలో మంచి పాత్రను, కలియుగంలో చెడు పాత్రను అభినయిస్తారు. కలియుగంలో మనుష్యులు దుఃఖితులుగా ఉంటారు. రామరాజ్యంలో అశుద్ధమైన విషయాలు ఉండవు. రామ రాజ్యం మరియు రావణ రాజ్యం రెండూ కలిసి ఉండవు. డ్రామా గురించి తెలియని కారణంగా సుఖము-దుఃఖము పరమాత్మయే ఇస్తారని అంటారు. ఏ విధంగా శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదో, అలాగే రావణుడి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని ప్రతి సంవత్సరము జరుపుకుంటారు, అలాగే రావణుడి మరణాన్ని కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు అనంతమైన తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. తండ్రి చాలా మధురమైనవారు. బాబా తమ మహిమను ఏమైనా చేసుకుంటారా. ఎవరికైతే సుఖము లభిస్తుందో వారు మహిమ చేస్తారు.

పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రి ప్రేమసాగరుడు. మళ్ళీ సత్యయుగంలో మీరు ప్రియమైనవారిగా, మధురమైనవారిగా అవుతారు. అక్కడ కూడా వికారాలు మొదలైనవి ఉన్నాయి అని ఎవరైనా అంటే, అసలు అక్కడ రావణ రాజ్యమే లేదు అని చెప్పండి. రావణ రాజ్యం ద్వాపరయుగం నుండి ఉంటుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఇంకెవ్వరికీ తెలియదు. ఈ సమయంలోనే మీకు అర్థం చేయిస్తారు. మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు. దేవతలకన్నా ఉన్నతమైనవారు ఇంకెవ్వరూ లేరు, అందుకే అక్కడ గురువులను ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. ఇక్కడైతే అనేకమంది గురువులు ఉన్నారు, కానీ సద్గురువు ఒక్కరే. సిక్కులు కూడా సద్గురువు అకాలుడు అని అంటారు. ఆకాలమూర్తి ఆ సద్గురువే. వారు కాలుడికే కాలుడు మహాకాలుడు. ఆ కాలుడు ఒక్కరినే తీసుకువెళ్తుంది, తండ్రి అంటారు - నేనైతే అందరినీ తీసుకువెళ్తాను. పవిత్రముగా తయారుచేసి మొదట అందరినీ శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్తాను. ఒకవేళ నాకు చెందినవారిగా అయి మళ్ళీ మాయకు చెందినవారిగా అయినట్లయితే గురువుకు నింద తీసుకొచ్చినవారికి నిలవడానికి నీడ కూడా ఉండదు అని అంటారు. వారు స్వర్గము యొక్క సంపూర్ణ సుఖాన్ని పొందలేరు, ప్రజలలోకి వెళ్ళిపోతారు. తండ్రి అంటారు - పిల్లలూ, నన్ను నిందింపజేయకండి. నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారుచేస్తాను కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేసేందుకే నేను వచ్చాను అని తండ్రి అంటారు. తండ్రి ప్రేమసాగరుడు, మనుష్యులు దుఃఖమిచ్చే సాగరులు. కామ ఖడ్గాన్ని ఉపయోగించి ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. అక్కడ ఈ విషయాలేవీ లేవు. అక్కడ ఉన్నది రామ రాజ్యము. యోగబలంతో పిల్లలు జన్మిస్తారు. ఈ యోగబలం ద్వారా మీరు మొత్తం విశ్వమంతటినీ పవిత్రంగా చేస్తారు. మీరు యోధులు కానీ అందులోనూ గుప్తమైన యోధులు. మీరు ఎంతో ప్రసిద్ధమైనవారిగా అవుతారు, మళ్ళీ భక్తి మార్గంలో దేవీల మందిరాలు ఎన్ని తయారవుతాయి. అమృత కలశాన్ని మాతల తలపై పెట్టారు అని అంటారు. గోమాత అని అంటారు, ఇది జ్ఞానము. నీటి విషయమేమీ కాదు. మీరు శివశక్తి సైన్యము. వారు మళ్ళీ దీనిని కాపీ చేసి ఎంతమంది గురువులుగా అయి కూర్చున్నారు. ఇప్పుడైతే మీరు సత్యము అనే నావలో కూర్చున్నారు. నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు. ఇప్పుడు ఆవలి తీరాన్ని చేర్చేందుకు నావికుడు లభించారు. వారు వేశ్యాలయం నుండి శివాలయంలోకి తీసుకువెళ్తారు. వారిని తోట యజమాని అని కూడా అంటారు, వారు ముళ్ళ అడవిని పుష్పాలతోటగా తయారుచేస్తారు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. ఇక్కడ దుఃఖము ఉంది. బాబా ఏ కరపత్రాలనైతే ముద్రించమని చెప్పారో, వాటిలో - నేను స్వర్గవాసినా లేక నరకవాసినా అని మీ హృదయాన్ని ప్రశించుకోండి అని వ్రాయబడి ఉంది. ఎన్నో ప్రశ్నలు అడుగవచ్చు. భ్రష్టాచారము ఉంది అని అందరూ అంటారు, అంటే తప్పకుండా ఒకానొక సమయంలో శ్రేష్ఠాచారులు కూడా ఉండి ఉంటారు. ఆ దేవతలు ఉండేవారు, వారు ఇప్పుడు లేరు. ఎప్పుడైతే దేవీ-దేవతా ధర్మం కనుమరుగైపోతుందో, అప్పుడు భగవంతుడు ఏక ధర్మ స్థాపన చేయడానికి రావలసి ఉంటుంది. అనగా మీరు శ్రీమతము ద్వారా మీ కొరకు స్వర్గాన్ని స్థాపన చేసుకుంటున్నారు.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా ప్రేమసాగరులుగా అవ్వాలి, దుఃఖసాగరులుగా కాదు. తండ్రిని నిందింపజేసే కర్మలేవీ చేయకూడదు. చాలా మధురమైనవారిగా, ప్రియమైనవారిగా అవ్వాలి.

2. యోగబలముతో పవిత్రంగా అయి ఇతరులను కూడా పవిత్రంగా తయారుచేయాలి. ముళ్ళ అడవిని పుష్పాలతోటగా తయారుచేసే సేవను చేయాలి. సదా సంతోషంలో ఉండాలి - మా మధురమైన బాబా మాకు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా, వారి వంటి మధురమైనవారు ఇంకెవ్వరూ లేరు.

వరదానము:-

పరమాత్మ ప్రేమ-అనురాగాలను ప్రాప్తి చేసుకునే వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క అత్యంత ప్రియమైన రాజకుమారునిగా కండి

సంగమయుగములో భాగ్యశాలీ పిల్లలైన మీరే హృదయాభిరాముని ప్రేమ-అనురాగాలకు పాత్రులు. ఈ పరమాత్మ ప్రేమ-అనురాగాలు కోట్లలో కొద్దిమంది ఆత్మలకే ప్రాప్తిస్తాయి. ఈ దివ్యమైన ప్రేమ-అనురాగాల ద్వారా అత్యంత ప్రియమైన రాజకుమారులుగా అవుతారు. రాజకుమారులు అనగా ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులు. భవిష్యత్తు కన్నా ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యారు. ఏ విధంగా భవిష్య రాజ్యానికి ఒకే రాజ్యం, ఒకే ధర్మం... అన్న మహిమ ఉందో, అదే విధంగా ఇప్పుడు ఆత్మకు ఒకే గొడుగు కింద సర్వ కర్మేంద్రియాలపై రాజ్యం ఉంది.

స్లోగన్:-

తమ ముఖము ద్వారా తండ్రి గుణాలను చూపించేవారే పరమాత్మ స్నేహీలు.