07-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 01.03.99


‘‘సంపూర్ణ పవిత్రులుగా అయ్యి సంస్కారాల మిలనమును జరుపుకోవటము - ఇదే సత్యమైన హోలి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ హోలియెస్ట్ (అత్యంత పవిత్రమైన) మరియు హైయ్యెస్ట్ (అత్యంత ఉన్నతమైన) పిల్లలను చూస్తున్నారు. విశ్వంలో అందరికంటే హైయ్యెస్ట్, ఉన్నతోన్నతమైన, శ్రేష్ఠమైన ఆత్మలు పిల్లలైన మీరు తప్ప మరెవరైనా ఉన్నారా? ఎందుకంటే మీరందరూ ఉన్నతోన్నతుడైన బాబా పిల్లలు. మొత్తం కల్పమంతా తిరిగి చూస్తే అందరికంటే ఉన్నతమైన పదవి కలవారు మరెవరైనా కనిపిస్తారా? రాజ్యాధికారి స్వరూపంలో కూడా మీకంటే ఉన్నతమైన రాజ్యాధికారిగా మరెవరైనా తయారయ్యారా? అలాగే, పూజ మరియు గాయనము విషయంలో చూడండి, ఆత్మలైన మీకు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుందో అంతకంటే ఎక్కువగా మరెవరికైనా జరుగుతుందా? డ్రామాలోని అద్భుతమైన రహస్యం ఎంత శ్రేష్ఠమైనదంటే - మీరు స్వయం చైతన్య స్వరూపంలో ఉన్నారు, ఈ సమయంలో మీ పూజ్య స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు కూడా మరియు చూస్తున్నారు కూడా. ఒక వైపు చైతన్య ఆత్మలైన మీరు ఉన్నారు, మరొక వైపు మీ జడచిత్రాలు పూజ్య రూపంలో ఉన్నాయి. మీ పూజ్య స్వరూపాన్ని చూస్తున్నారు కదా? మీరు ఇప్పుడు జడ రూపంలో కూడా ఉన్నారు మరియు చైతన్య రూపంలో కూడా ఉన్నారు. కనుక ఇది అద్భుతమైన ఆట కదా! మరియు రాజ్యము లెక్కలో కూడా, మొత్తం కల్పం నిర్విఘ్నమైన, అఖండమైన, స్థిరమైన రాజ్యము ఆత్మలైన మీ ఒక్కరిదే నడుస్తుంది. రాజులుగానైతే చాలామందే అవుతారు కానీ విశ్వ రాజులు మరియు విశ్వ రాజుల రాయల్ కుటుంబానికి చెందినవారైన మీరు అందరికంటే శ్రేష్ఠమైనవారు. కనుక రాజ్యములో కూడా హైయ్యెస్ట్, పూజ్య రూపంలో కూడా హైయ్యెస్ట్. అంతేకాక, ఇప్పుడు సంగమములో పరమాత్మ వారసత్వానికి అధికారులుగా, పరమాత్మ మిలనానికి అధికారులుగా, పరమాత్మ ప్రేమకు అధికారులుగా, పరమాత్మ పరివారానికి చెందిన ఆత్మలుగా మరెవరైనా అవుతారా? మీరే అలా అయ్యారు కదా? అలా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? అలా అయ్యారు కూడా, అంతేకాక ఇప్పుడైతే వారసత్వాన్ని తీసుకుని సంపన్నంగా అయ్యి బాబాతోపాటుగా మీ ఇంటికి కూడా వెళ్ళబోతున్నారు. సంగమయుగ సుఖము, సంగమయుగ ప్రాప్తులు, సంగమయుగ సమయము చాలా మంచిగా అనిపిస్తాయి కదా! చాలా ప్రియంగా అనిపిస్తాయి. రాజ్యము చేసే సమయము కంటే కూడా ఈ సంగమ సమయము ప్రియంగా అనిపిస్తుంది కదా? ప్రియంగా అనిపిస్తుందా లేక త్వరగా వెళ్ళాలనుకుంటున్నారా? మరి అటువంటప్పుడు బాబా, వినాశనం ఎప్పుడు అవుతుంది అని ఎందుకు అడుగుతారు? ఆలోచిస్తుంటారు కదా - వినాశనం ఎప్పుడు అవుతుందో, ఏమవుతుందో, మేము ఎక్కడ ఉంటామో? బాప్ దాదా అంటారు - ఎక్కడ ఉన్నా సరే స్మృతిలో ఉంటారు, బాబాతో పాటు ఉంటారు. సాకారములోనైనా లేక ఆకారములోనైనా తోడుగా ఉన్నారంటే ఏమీ అవ్వదు. సాకారములో కథను వినిపించారు కదా. పిల్లి పిల్లలు ఇటుకల బట్టీలో ఉన్నా కానీ సురక్షితంగా ఉన్నాయి కదా! లేక కాలిపోయాయా? అన్నీ సురక్షితంగా ఉన్నాయి. అలాగే పరమాత్మ పిల్లలైన మీరెవరైతే వారితో పాటు ఉంటారో, వారు సురక్షితంగా ఉంటారు. ఒకవేళ బుద్ధి ఇంకెక్కడైనా ఉంటే ఎంతో కొంత సెగ తగులుతుంది, ఏదో ఒక ప్రభావం పడుతుంది. బాబాతోపాటు కంబైండ్ గా ఉంటే, ఒక్క క్షణం కూడా ఒంటరిగా లేకుండా ఉంటే సురక్షితంగా ఉంటారు. అప్పుడప్పుడు కార్య-వ్యవహారాలలో లేక సేవలలో ఒంటరివారిగా అనుభవం చేస్తున్నారా? ఏం చెయ్యను, ఒంటరిగా ఉన్నాను, పనేమో చాలా ఉంది అని అనుకుంటారా! అలా అయితే అలసిపోతారు కూడా. మరి బాబాను ఎందుకని సహచరునిగా చేసుకోరు! రెండు భుజాలు కలవారిని సహచరులుగా చేసుకుంటారు, వేయి భుజాలు కలవారిని ఎందుకు సహచరునిగా చేసుకోరు. ఎవరు ఎక్కువ సహయోగాన్ని ఇస్తారు? వేయి భుజాలు కలవారా లేక రెండు భుజాలు కలవారా?

సంగమయుగంలో బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు ఒంటరిగా ఉండజాలరు. ఏం జరుగుతుందంటే - సేవలలో, కర్మయోగంలో చాలా బిజీ అయిపోతారు కదా, అప్పుడు తోడుగా ఉన్నవారిని కూడా మర్చిపోతారు, ఇక అలసిపోతారు. అప్పుడు - అలసిపోయాము, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటారు! బాప్ దాదా మీకు సదా తోడును ఇవ్వటానికి వచ్చారు కావున అలసిపోకండి, పరంధామాన్ని వదిలి ఎందుకు వచ్చారు? నిద్ర పోతున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, కర్మలు చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు తోడును ఇవ్వడానికే కదా బాబా వచ్చారు. బ్రహ్మాబాబా కూడా మీ అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికే అవ్యక్తమయ్యారు. వ్యక్త రూపంలో కంటే అవ్యక్త రూపంలో సహయోగాన్ని ఇచ్చే వేగం చాలా తీవ్రముగా ఉంటుంది, అందుకే బ్రహ్మాబాబా కూడా తమ వతనాన్ని మార్చుకున్నారు. కనుక శివబాబా మరియు బ్రహ్మాబాబా, ఇరువురూ ప్రతి సమయమూ మీ అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికి సదా హాజరై ఉన్నారు. మీరు ‘బాబా’ అని అనుకోగానే సహయోగాన్ని అనుభవం చేస్తారు. ఒకవేళ సేవ, సేవ, సేవ అని అదే గుర్తుంటే, బాబాను పక్కన కూర్చుని చూడమని వేరు చేస్తే, మరి బాబా కూడా సాక్షీగా అయ్యి చూస్తారు. వీరు ఎంతవరకు ఒంటరిగా చేస్తారో చూద్దాము, ఎంతైనా రావలసిందైతే ఇక్కడికే కదా అని అనుకుంటారు. అందుకే తోడును వదలకండి. మీ అధికారము మరియు ప్రేమ అనే సూక్ష్మ బంధముతో బంధించి ఉంచుకోండి. ఢీలాగా వదిలేస్తారు. స్నేహాన్ని ఢీలా చేసేస్తారు, అధికారాన్ని స్మృతిలో నుండి కాస్త పక్కన పెట్టేస్తారు. అలా చెయ్యకండి. సర్వశక్తివంతుడు తోడును ఆఫర్ చేస్తున్నప్పుడు, మరి అటువంటి ఆఫర్ మొత్తము కల్పములో మరెప్పుడైనా దొరుకుతుందా? దొరకదు కదా? మరి బాప్ దాదా కూడా సాక్షీగా అయ్యి చూస్తారు - సరే, ఎంతవరకు ఒంటరిగా చేస్తారో చూద్దాము!

సంగమయుగ సుఖాన్ని మరియు సంబరాలను ఇమర్జ్ చేసుకోండి. బుద్ధి బిజీగా ఉంటుంది కదా, బిజీగా ఉన్న కారణంగా స్మృతి మర్జ్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, మొత్తం రోజంతటిలో ఎవరినైనా - బాబా స్మృతి ఉంటుందా లేక బాబా స్మృతిని మర్చిపోతున్నారా అని అడిగితే ఏమంటారు? మర్చిపోవటం లేదు అని అంటారు. స్మృతి ఉంటుంది అన్నది కరక్టే, కానీ అది ఇమర్జ్ రూపంలో ఉంటుందా లేక మర్జ్ అయి ఉంటుందా? స్థితి ఎలా ఉంటుంది? ఇమర్జ్ రూపం యొక్క స్థితికి మరియు మర్జ్ రూపం యొక్క స్థితికి తేడా ఏమిటి? స్మృతిని ఇమర్జ్ రూపంలో ఎందుకు ఉంచుకోరు? ఇమర్జ్ రూపములోని నషా, శక్తి, సహయోగము, సఫలత చాలా గొప్పవి. స్మృతినైతే మర్చిపోలేరు ఎందుకంటే ఇది ఒక్క జన్మ యొక్క సంబంధము కాదు కదా, శివబాబా సత్యయుగములో తోడుగా లేకపోయినా కానీ బంధం అయితే ఇదే ఉంటుంది కదా! అందుకే వారిని మర్చిపోలేరు, అది కరక్టే. అయితే, ఒకవేళ ఏదైనా విఘ్నానికి వశమైతే మర్చిపోతారు కూడా, కానీ మామూలుగా న్యాచురల్ రూపంలో ఉన్నప్పుడైతే మర్చిపోరు కానీ స్మృతి మర్జ్ అయ్యి ఉంటుంది, అందుకే బాప్ దాదా అంటున్నారు - పదే-పదే చెక్ చేసుకోండి, తోడు యొక్క అనుభవము మర్జ్ రూపంలో ఉందా లేక ఇమర్జ్ రూపంలో ఉందా? ప్రేమ అయితే తప్పకుండా ఉంది. ప్రేమ తెగిపోగలదా? తెగిపోలేదు కదా? మరి ప్రేమ అనేది తెగిపోలేనప్పుడు ఆ ప్రేమ యొక్క లాభాన్ని అయితే పొందండి, లాభాన్ని పొందే పద్ధతిని నేర్చుకోండి.

బాప్ దాదా చూస్తారు - ప్రేమయే బాబావారిగా చేసింది. ప్రేమయే మధుబన్ నివాసిగా చేస్తుంది. మీ-మీ స్థానాలలో ఎలా ఉన్నా, ఎంత శ్రమ చేసినా కానీ, మధుబన్ కు అయితే చేరుకుంటారు. బాప్ దాదాకు తెలుసు మరియు చూస్తుంటారు కూడా - చాలామంది పిల్లలకు కలియుగ పరిస్థితుల ఉన్న కారణంగా టికెట్ తీసుకోవటం కూడా కష్టమవుతుంటుంది కానీ ప్రేమ అనేది వారిని ఎలాగైనా చేరుస్తుంది, అంతే కదా? ఆ ప్రేమ వలన చేరుకుంటారు, కానీ పరిస్థితులైతే రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉంటాయి. సత్యమైన హృదయంపై సాహెబ్ ఎలాగూ తప్పకుండా సంతోషిస్తారు, కానీ స్థూల సహయోగము కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా లభిస్తుంది. డబుల్ విదేశీయులనైనా, భారతవాసులనైనా, అందరినీ బాబా యొక్క ఈ ప్రేమ పరిస్థితులనే గోడను దాటించేస్తుంది. అంతే కదా? మీ మీ సెంటర్లలో కూడా చూడండి - కొంతమంది పిల్లలు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు, వచ్చే సంవత్సరం రాగలమో, లేదో అని అనుకుంటారు, అయినా కానీ ఎలాగైనా చేరుకుంటారు. ఇదే ప్రేమకు నిదర్శనం. అచ్ఛా.

ఈ రోజు హోలీని జరుపుకున్నారా? జరుపుకున్నారా హోలీని? బాప్ దాదా అయితే హోలీని జరుపుకునే హోలీహంసలను చూస్తున్నారు. పిల్లలందరికీ కల ఒకే టైటిల్ హోలీయెస్ట్ (అత్యంత పవిత్రమైనవారు). ద్వాపరము నుండి తీసుకుంటే ఏ ధర్మాత్మలు గానీ లేక మహాత్ములు గానీ సర్వులనూ హోలీయెస్ట్ గా తయారుచెయ్యలేదు. స్వయం పవిత్రులుగా అవుతారు కానీ తమ అనుచరులను, సహచరులను హోలీయెస్ట్ గా, పవిత్రులుగా తయారుచెయ్యరు కానీ ఇక్కడ పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి ముఖ్య ఆధారము. మీ చదువు కూడా ఏమిటి? మీ స్లోగన్ కూడా ‘‘పవిత్ర భవ-యోగీ భవ’’. ఈ స్లోగన్ ఉంది కదా? పవిత్రతయే మహానత. పవిత్రతయే యోగీ జీవితానికి ఆధారము. అప్పుడప్పుడు పిల్లలకు ఇలా అనుభవమవుతుంది - నడుస్తూ-నడుస్తూ ఉండగా ఒకవేళ మనసులోనైనా కూడా అపవిత్రత అనగా వ్యర్థము లేక నెగెటివ్, పరచింతనతో కూడిన సంకల్పాలు నడుస్తుంటే యోగాన్ని ఎంత శక్తిశాలిగా చెయ్యాలనుకున్నా గానీ చెయ్యలేరు, ఎందుకంటే సంకల్పాలలో కొద్దిగానైనా అంశమాత్రమైనా ఎటువంటి అపవిత్రత ఉన్నా సరే, ఎక్కడైతే అపవిత్రత యొక్క అంశము ఉంటుందో, అక్కడ పవిత్రమైన బాబా యొక్క స్మృతి ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అలా ఉండదు. ఏ విధంగానైతే రాత్రి మరియు పగలు కలిసి ఉండవు కదా. అందుకే బాప్ దాదా వర్తమాన సమయములో పవిత్రత విషయములో పదే-పదే అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు. కొంతకాలం ముందు బాప్ దాదా కేవలం కర్మలలోని అపవిత్రత గురించే సూచనను ఇచ్చేవారు, కానీ ఇప్పుడు సమయము సంపూర్ణతకు సమీపంగా వస్తూ ఉంది, అందుకే మనసులో కూడా అపవిత్రత యొక్క అంశమనేది మోసం చేసేస్తుంది. కనుక మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలు అన్నింటిలోనూ పవిత్రత చాలా అవసరము. మనసాను తేలికగా వదిలేయకండి ఎందుకంటే మనసా బయటకు కనిపించదు కానీ మనసా చాలా మోసం చేస్తుంది. బ్రాహ్మణ జీవితంలో ఆంతరిక వారసత్వమైన సదా సుఖ స్వరూపము, శాంతి స్వరూపము, మనస్సు యొక్క సంతుష్టత, వీటిని అనుభవం చేసుకోవడానికి మనసా పవిత్రత కావాలి. బాహ్య సాధనాల ద్వారా లేక సేవ ద్వారా మిమ్మల్ని మీరు సంతోషపరచుకోవటమంటే - ఇది కూడా మిమ్మల్ని మీరు మోసగించుకోవటమే.

బాప్ దాదా చూస్తుంటారు - అప్పుడప్పుడు పిల్లలు వీటి ఆధారంగా తమను తాము మంచివారుగా, సంతోషం కలవారిగా భావించి స్వయాన్ని మోసగించుకుంటారు, అలా మోసగించుకుంటున్నారు కూడా. మోసగించుకుంటారు, అలా మోసగించుకుంటున్నారు కూడా. ఇది కూడా ఒక గుహ్య రహస్యం. ఏమవుతుందంటే, బాబా దాత, మీరు దాత పిల్లలు, కనుక సేవ యుక్తియుక్తంగా లేకపోయినా కూడా, వేరే ఏదైనా మిక్స్ అయినా కూడా, కొంత స్మృతి ఆధారంగా, మరికొంత బాహ్య సాధనాలు లేక సంతోషం ఆధారంగా ఉన్నా కానీ, మనను ఆధారంపై కాకుండా బుద్ధి ఆధారంపై సేవ చేసినా, వారికి కూడా సేవ యొక్క ప్రత్యక్ష ఫలమైతే లభిస్తుంది, ఎందుకంటే బాబా దాత, కావున వాళ్ళు - ఓహో, మాకైతే ఫలం లభించేసింది, మేము చేసిన సేవ మంచిది అని పిల్లలు ఆ మాత్రానికే సంతోషపడిపోతారు, కానీ మనసులోని ఆ సంతుష్టత సదాకాలము ఉండదు, అంతేకాక ఆత్మ యోగయుక్తమైన శక్తిశాలి స్మృతిని అనుభవము చెయ్యలేకపోతుంది, ఆ అనుభవము నుండి వంచితులైపోతారు. ఏమీ లభించదు అని కాదు, ఏదో ఒకటి అయితే లభిస్తుంది, కానీ జమ అవ్వదు. సంపాదించుకున్నారు, తిన్నారు మరియు సమాప్తమైపోయింది అన్నట్లు ఉంటుంది, అందుకే ఈ అటెన్షన్ ను కూడా పెట్టండి. సేవను చాలా మంచిగా చేస్తున్నారు, ఫలము కూడా మంచిగా లభించింది, కావున తిన్నారు మరియు సమాప్తమైపోయింది, జమ ఏమైంది? మంచి సేవ చేసారు, మంచి రిజల్టు వచ్చింది, కానీ అక్కడ సేవకు ఫలము లభించింది, అంతేకానీ జమ ఏమీ అవ్వదు. అందుకే జమ చేసుకునేందుకు విధి - మనసా-వాచా-కర్మణా పవిత్రత. పవిత్రతయే పునాది. సేవలో కూడా పునాది పవిత్రత. స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండాలి. మరే ఇతర భావాలు అందులో కలవకూడదు. భావములో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత. హోలీ అంటేనే అర్థము - పవిత్రత. అపవిత్రతను కాల్చేయటము. అందుకే ముందు కాలుస్తారు, ఆ తరువాత జరుపుకుంటారు, ఆ తరువాత పవిత్రంగా అయ్యి సంస్కారాల మిలనాన్ని జరుపుకుంటారు. కనుక హోలీకి కల అర్థమే - కాల్చటము, జరుపుకోవటము. బయటివారైతే ఆలింగనము చేసుకుంటారు కానీ ఇక్కడ సంస్కారాల మిలనం, ఇదే మంగళ మిలనం. మరి ఇటువంటి హోలీని జరుపుకున్నారా లేక కేవలం డ్యాన్స్ చేసారా? పన్నీరు చల్లుకున్నారా? అది కూడా మంచిదే, బాగా జరుపుకోండి. బాప్ దాదా సంతోషిస్తారు, పన్నీరు చల్లుకోండి, డ్యాన్స్ చెయ్యండి కానీ సదా డ్యాన్స్ చెయ్యండి. కేవలం 5-10 నిమిషాల డ్యాన్స్ కాదు. పరస్పరంలో గుణాల వైబ్రేషన్లను వ్యాపింపజేయటము - ఇదే పన్నీరు చల్లటము. మరియు కాల్చటం విషయంలోనైతే ఏం కాల్చాలో మీకు ఎలాగూ తెలుసు! ఇప్పటివరకు కూడా కాలుస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం చెయ్యి ఎత్తి వెళ్తారు, దృఢ సంకల్పం చేసేసాం అని అనుకుంటారు. ధైర్యమైతే పెడతారు, బాప్ దాదా సంతోషిస్తారు. ఆ ధైర్యానికి బాప్ దాదా అభినందిస్తారు కూడా. ధైర్యం పెట్టడము కూడా మొదటి అడుగు. కానీ బాప్ దాదా యొక్క శుభ ఆశ ఏమిటి? సమయము యొక్క డేట్ ను చూడకండి. 2000లో అవుతుందా, 2001లో అవుతుందా, 2005లో అవుతుందా అన్నదానిని ఆలోచించకండి. సరే, ఎవర్రెడీగా కాకపోయినా సరే, దీనిని కూడా బాప్ దాదా వదిలేస్తున్నారు, కానీ ఆలోచించండి, బహుకాలపు సంస్కారమైతే కావాలి కదా! బహుకాలపు పురుషార్థము బహుకాలపు రాజ్యాధికారిగా తయారుచేస్తుంది అని మీరే వినిపిస్తారు కదా. ఒకవేళ సమయము వచ్చినప్పుడు దృఢ సంకల్పము చేస్తే అది బహుకాలముదైందా లేక అల్పకాలముదైందా? ఎందులో లెక్కించబడుతుంది? అల్పకాలములో లెక్కించబడుతుంది కదా! మరి అవినాశీ తండ్రి నుండి ఏ వారసత్వాన్ని తీసుకున్నారు? అల్పకాలపు వారసత్వాన్ని తీసుకున్నారు. ఇది మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా! కనుక బహుకాలపు అభ్యాసము కావాలి. ఎంత కాలము ఉంది అని దాని గురించి ఆలోచించకండి. ఎంతగా బహుకాలపు అభ్యాసము ఉంటుందో, అంతగా అంతిమంలో కూడా మోసపోరు. బహుకాలపు అభ్యాసము లేనట్లయితే ఇప్పటి బహుకాలవు సుఖము, బహుకాలపు శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవము నుండి కూడా వంచితులైపోతారు, అందుకే ఏం చెయ్యాలి? బహుకాలముది చెయ్యాలి కదా? ఒకవేళ ఎవరి బుద్ధిలోనైనా డేట్ గురించి ఎదురుచూస్తూ ఉన్నారంటే, అలా ఎదురుచూడకండి, ఏర్పాట్లను చేసుకోండి. బహుకాలపు ఏర్పాట్లను చేసుకోండి. డేట్ ను కూడా మీరే తీసుకురావాలి. సమయమైతే ఇప్పుడు కూడా ఎవర్రెడీగా ఉంది, రేపు కూడా కావచ్చు, కానీ సమయము మీ కొరకు ఆగి ఉంది. మీరు సంపన్నమైనట్లయితే సమయమనే పరదా తప్పకుండా పక్కకు తొలగాల్సిందే. మీరు ఆపటం వలనే ఆగి ఉంది. రాజ్యాధికారి అయితే తయారై ఉన్నారు కదా? సింహాసనమైతే ఖాళీగా ఉండకూడదు కదా! మరి విశ్వ మహారాజు ఒక్కరే సింహాసనంపై కూర్చుంటారా! ఇలా అయితే అది శోభిస్తుందా? రాయల్ ఫ్యామిలీ కావాలి, ప్రజలు కావాలి, అందరూ కావాలి. కేవలం విశ్వమహారాజు ఒక్కరే సింహాసనంపై కూర్చుంటే, నా కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది అని అతను చూస్తుంటారు. అందుకే బాప్ దాదాకు ఒకే శుభ ఆశ ఉంది - పిల్లలందరూ, వారు క్రొత్తవారైనా, పాతవారైనా, ఎవరెవరైతే తమను తాము బ్రహ్మాకుమారీ లేక బ్రహ్మాకుమార్ గా పిలుచుకుంటారో, వారు మధుబన్ నివాసులైనా, విదేశీ వాసులైనా, భారతవాసులైనా సరే, పిల్లలు ప్రతి ఒక్కరూ బహుకాలపు అభ్యాసము చేసి బహుకాలపు అధికారిగా అవ్వాలి, అప్పుడప్పుడు వారిగా కాదు. ఇష్టమేనా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి. వెనుక ఉన్నవారు తెలివైనవారు, అటెన్షన్ తో వింటున్నారు. బాప్ దాదా వెనుక ఉన్నవారిని తమ ఎదురుగా ఉన్నట్లు చూస్తున్నారు. ముందు ఉన్నవారైతే ఎలాగూ ముందు ఉన్నారు. (కొంతమంది మెడిటేషన్ హాల్లో కూర్చుని మురళిని వింటున్నారు) కింద ఉన్నవారు బాప్ దాదా యొక్క శిరోకిరీటాలుగా అయ్యి కూర్చుని ఉన్నారు. వారు కూడా చప్పట్లు కొడుతున్నారు. కింద ఉన్నవారికైతే త్యాగమునకు భాగ్యము లభించాల్సిందే. మీకు సమ్ముఖంగా కూర్చునే భాగ్యము లభించింది మరియు వారికి త్యాగము యొక్క భాగ్యము జమ అవుతూ ఉంది. అచ్ఛా, బాప్ దాదాకు ఉన్న ఒక ఆశ ఏమిటో విన్నారా! ఇష్టమేనా! మరి తరువాత సంవత్సరం ఏం చూస్తారు? అప్పుడు కూడా ఇలాగే మరలా చేతులు ఎత్తుతారా? చేతులు ఎత్తండి, రెండేసి చేతులూ ఎత్తండి, కానీ మనస్సు యొక్క చేతిని కూడా ఎత్తండి. దృఢ సంకల్పం అనే చేతిని సదా కొరకు ఎత్తండి.

బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో సంపూర్ణ పవిత్రత యొక్క మెరుస్తున్న మణిని చూడాలనుకుంటున్నారు. నయనాలలో పవిత్రతా మెరుపు, పవిత్రత యొక్క రెండు కంటితారలు ఆత్మికతతో మెరుస్తూ ఉండటాన్ని చూడాలనుకుంటున్నారు. మాటలలో మధురత, విశేషత, అమూల్యమైన మాటలను వినాలనుకుంటున్నారు. కర్మలలో సంతుష్టతను, నిర్మానతను సదా చూడాలనుకుంటున్నారు. భావనలో సదా శుభభావన మరియు భావములో సదా ఆత్మిక భావము, సోదర భావము ఉండాలి. సదా మీ మస్తకము నుండి ప్రకాశముతో కూడిన ఫరిశ్తాతనపు కిరీటము కనిపించాలి. కనిపించాలి అంటే అర్థము అనుభవమవ్వాలి. ఇలా అలంకరించబడిన మూర్తిని చూడాలనుకుంటున్నారు. మరియు ఇటువంటి మూర్తియే శ్రేష్ఠంగా, పూజ్యంగా అవుతుంది. వారైతే మీ జడ చిత్రాలను తయారుచేస్తారు కానీ బాబా చైతన్య చిత్రాన్ని చూడాలనుకుంటున్నారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న సదా బాప్ దాదాతోపాటు ఉండేవారికి, సమీపంగా ఉండే సదా సహచరులకు, సదా బహుకాలపు పురుషార్థం ద్వారా బహుకాలపు సంగమయుగ అధికారాన్ని మరియు భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునే అతి తెలివైన ఆత్మలకు, సదా స్వయాన్ని శక్తులతో, గుణాలతో అలంకరించుకుని ఉండేవారికి, బాబా యొక్క ఆశా దీపాలకు, సదా స్వయాన్ని హోలియెస్ట్ మరియు హైయ్యెస్ట్ స్థితిలో స్థితి చేసుకునే బాబా సమానమైన అతి స్నేహీ ఆత్మలకు, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. దేశ, విదేశాలలో దూరంగా కూర్చుని కూడా సమ్ముఖంగా అనుభవం చేసుకునే వారందరికీ బాప్ దాదా యొక్క చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు.

వరదానము:-

సమయాన్ని శిక్షకునిగా చేసుకునేందుకు బదులుగా తండ్రిని శిక్షకునిగా చేసుకునే మాస్టర్ రచయితా భవ

చాలా మంది పిల్లలకు సేవ యొక్క ఉల్లాసము ఉంది కానీ వైరాగ్య వృత్తి పట్ల అటెన్షన్ లేదు, అందులో నిర్లక్ష్యము ఉంది. నడుస్తుందిలే... జరుగుతుందిలే... అయిపోతుందిలే... సమయము వచ్చినప్పుడు బాగైపోతుందిలే... ఇలా ఆలోచించడము అనగా సమయాన్ని తమ శిక్షకునిగా చేసుకోవటము. పిల్లలు బాబాకు కూడా ఊరటను ఇస్తారు - చింత చెయ్యకండి, సమయానికి బాగైపోతుంది, చేసేస్తాము, ముందుకు వెళ్ళిపోతాము. కానీ మీరు మాస్టర్ రచయిత, సమయము మీ రచన. రచన, మాస్టర్ రచయితకు శిక్షకునిగా అవ్వడమనేది శోభించదు.

స్లోగన్:-

తండ్రి పాలనకు రిటర్న్ ఏమిటంటే - స్వయాన్ని మరియు సర్వులను పరివర్తన చెయ్యటంలో సహయోగులుగా అవ్వటము.