08-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - బ్రాహ్మణులమైన మేము పిలక స్థానములో ఉన్నాము, పురుషోత్తములుగా అవుతున్నాము అని సదా గుర్తుంచుకున్నట్లయితే హర్షితముగా ఉంటారు, మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకున్నట్లయితే అపారమైన సంతోషము ఉంటుంది

ప్రశ్న:-

బాబా శరణులోకి ఎవరు రాగలుగుతారు? బాబా ఎవరికి శరణు ఇస్తారు?

జవాబు:-

ఎవరైతే పూర్తిగా నష్టోమోహులుగా ఉంటారో, ఎవరి బుద్ధియోగమైతే అన్ని వైపుల నుండీ తెగిపోయి ఉంటుందో, వారే బాబా శరణులోకి రాగలుగుతారు. మిత్ర-సంబంధీకులు మొదలైనవారివైపు బుద్ధి యొక్క మోహము ఉండకూడదు. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి. ఇటువంటి పిల్లలే సేవ చేయగలుగుతారు. బాబా కూడా ఇటువంటి పిల్లలకే శరణును ఇస్తారు.

ఓంశాంతి

వీరు ఆత్మిక తండ్రి, టీచర్, గురువు. ఈ విషయాన్ని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు, ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. సన్యాసులు శివోహం అని అన్నా కానీ, నేనే తండ్రిని, టీచరును, గురువును అని ఎప్పుడూ అనరు. వారు కేవలం శివోహం, తతత్వం అని అంటారు. పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ప్రతి ఒక్కరూ తండ్రి, టీచర్, గురువుగా అవ్వాలి. ఈ విధంగా ఎవరూ అనుకోరు కూడా. మనుష్యులు స్వయాన్ని భగవంతునిగా, పరమాత్మగా పిలుచుకోవడం అనేది పూర్తిగా తప్పు. పిల్లలకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, అది బుద్ధిలో ధారణ అవుతుంది కదా. ఆ చదువులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, అలాగని అన్ని సబ్జెక్టులూ విద్యార్థుల బుద్ధిలో ఉంటాయని కాదు. ఇక్కడ తండ్రి ఏదైతే చదివిస్తారో అది ఒక్క క్షణములో పిల్లల బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరే త్రికాలదర్శులుగా మరియు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఆ భౌతికమైన చదువులోని సబ్జెక్టులు పూర్తిగా వేరు. సర్వుల సద్గతిదాత ఆ ఒక్క తండ్రేనని మీరు నిరూపించి అర్థం చేయిస్తారు. ఆత్మలందరూ పరమాత్మను తలచుకుంటారు. వారు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి తప్పకుండా తండ్రి నుండి వారసత్వము లభిస్తూ ఉండవచ్చు. ఆ వారసత్వాన్ని పోగొట్టుకోవడముతో దుఃఖములోకి వచ్చేస్తారు. ఇది సుఖ-దుఃఖాల ఆట. ఈ సమయములో అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. పవిత్రముగా అవ్వటముతో సుఖము తప్పకుండా లభిస్తుంది. సుఖపు ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు. మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నాలెడ్జ్ ఫుల్ ఆ ఒక్క తండ్రేనని పిల్లలకు బుద్ధిలో ఉండాలి. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు. మిగిలిన ధర్మాలేవైతే స్థాపన అయ్యాయో, అవన్నీ తమ సమయమనుసారంగా వస్తాయి. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. పిల్లలైన మీ కొరకు తండ్రి ఈ చదువును పూర్తిగా సహజముగా ఉంచారు. కేవలం కాస్త విస్తారముగా అర్థం చేయిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. యోగానికి మహిమ ఎంతగానో ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగము అని అంటూ ఉంటారు. కానీ యోగము ద్వారా కలిగిన లాభమేమిటి అన్నది ఎవరికీ తెలియదు. ఇది నిరాకారుడైన భగవంతుడు నేర్పించే ఆ గీతలోని యోగమే. మిగిలినవన్నీ నేర్పించేది మనుష్యులే. దేవతల వద్దనైతే యోగము యొక్క విషయమే లేదు. ఈ హఠయోగము మొదలైనవాటన్నింటినీ మనుష్యులే నేర్పిస్తారు. దేవతలు నేర్చుకోరు, నేర్పించరు. దైవీ ప్రపంచములో యోగము యొక్క విషయమే లేదు. యోగముతో అందరూ పావనముగా అవుతారు, ఆ విధముగా తప్పకుండా ఇక్కడే అవుతారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారుచేయడానికి సంగమములోనే వస్తారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం కూడా అద్భుతమే. బ్రాహ్మణులమైన మనం పిలకగా ఉన్నాము, సత్యయుగానికి మరియు కలియుగానికి మధ్యలో పిలక స్థానములో ఉన్న బ్రాహ్మణులు ఉన్నారు. దీనినే సంగమయుగము అని అంటారు, ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. మేము పురుషోత్తములుగా అవుతున్నాము అని పిల్లల బుద్ధిలో ఉండాలి, అప్పుడు సదా హర్షితముగా ఉంటారు. ఎంతగా సేవ చేస్తారో అంతగా హర్షితముగా ఉంటారు. సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. ఎంతగా ప్రదర్శనీలో సేవ చేస్తారో, అంతగా వినేవారికి కూడా సుఖము లభిస్తుంది. తమ మరియు ఇతరుల కళ్యాణము జరుగుతుంది. చిన్న సెంటర్లలో కూడా ముఖ్యమైన 5, 6 చిత్రాలు తప్పకుండా ఉండాలి. వాటిపై అర్థం చేయించడం సహజము. రోజంతా సేవయే సేవ. మిత్ర-సంబంధీకుల వైపు ఏ విధమైన మోహము ఉండకూడదు. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనమవ్వనున్నది. ఇకపోతే దివ్య దృష్టి ద్వారా ఏదైతే చూస్తారో దాని స్థాపన జరుగుతోంది. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకున్నట్లయితే మీరు పక్కా అయిపోతారు. అనంతమైన తండ్రిని కలుసుకున్న సంతోషము ఉండాలి. ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకుంటే వారు ఎంత నషాలో ఉంటారు. పిల్లలైన మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము కష్టపడుతున్నారు. తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు - కామ చితిపై కూర్చొని మీరు నల్లగా అయిపోయారు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చున్నట్లయితే తెల్లగా అవుతారు. బుద్ధిలో ఈ చింతనయే నడుస్తూ ఉండాలి. ఆఫీసులో పని చేస్తూ ఉండండి కానీ స్మృతి చేస్తూ ఉండండి. ఖాళీ లేదు అన్నట్లు ఉండకూడదు. ఎంత ఖాళీ దొరికితే అంత ఆత్మిక సంపాదనను చేసుకోండి. ఇది ఎంత పెద్ద సంపాదన. ఆరోగ్యము, సంపద రెండూ ఒకేసారి లభిస్తాయి. అర్జునుడు మరియు ఏకలవ్యుని కథ ఒకటి ఉంది. అదే విధముగా గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా జ్ఞాన-యోగాలలో లోపల ఉండేవారికన్నా ముందుకు వెళ్ళవచ్చు. మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. అందరూ ఇక్కడే కూర్చుండిపోతే సేవ ఎలా చేస్తారు. రిఫ్రెష్ అయి సేవలో నిమగ్నమైపోవాలి. సేవ గురించి ఆలోచించాలి. బాబా అయితే ప్రదర్శనీలోకి వెళ్ళలేరు, ఎందుకంటే బాప్ దాదాలిరువురూ కలిసి ఉన్నారు. బాబా ఆత్మ మరియు వీరి ఆత్మ కలిసి ఉన్నారు. వీరు అద్భుతమైన యుగళులు. ఈ యుగళుల గురించి పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు. వీరు స్వయాన్ని యుగళ్ గానూ భావిస్తారు, అంతేకాక, నేను బాబాకు చాలాకాలం తర్వాత కలిసిన ఏకైక బిడ్డను అని కూడా అంటారు. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూస్తే ఎంతో సంతోషము కలుగుతుంది. ఇది నా మరుసటి జన్మ, నేను సింహాసనముపై తప్పకుండా కూర్చుంటాను. మీరు కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు, మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. నేను బాబా యొక్క చాలాకాలం తర్వాత కలిసిన బిడ్డను అని వీరికైతే సంతోషము ఉంది. అయినా కానీ స్మృతి సదా నిలవదు. ఆలోచనలు వేరే-వేరే వైపులకు వెళ్ళిపోతాయి. స్మృతి పూర్తిగా స్థిరమైపోయి, వేరే ఆలోచనలేవి రాకుండా ఉండడమనేది డ్రామా నియమం కాదు. మాయ తుఫానులు స్మృతి చేయనివ్వవు. నాకు ఇది చాలా సహజమని తెలుసు ఎందుకంటే బాబా నాలో ప్రవేశించారు. నేను బాబాకు నంబర్ వన్ సికీలధే బిడ్డను. మొదటి నంబర్ లో రాజకుమారునిగా అవుతాను, అయినా కానీ స్మృతిని మర్చిపోతాను. అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఇది మాయ. ఎప్పుడైతే ఈ బాబాకు అనుభవమవుతుందో, అప్పుడే పిల్లలైన మీకు అర్థం చేయించగలుగుతారు. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు ఈ ఆలోచనలు ఆగుతాయి. ఆత్మ సంపూర్ణము అయిపోతే ఇక ఈ శరీరము ఉండదు. శివబాబా అయితే సదా పవిత్రమైనవారు. పతిత ప్రపంచము మరియు పతిత శరీరములోకి వచ్చి పావనముగా తయారుచేసే పాత్ర కూడా వీరిదే. డ్రామాలో బంధింపబడి ఉన్నారు. మీరు పావనముగా అయిపోతే ఇక కొత్త శరీరము కావాలి. శివబాబాకు తమ శరీరము లేదు. ఈ తనువులో ఈ ఆత్మకు మహత్వము ఉంది. వారిదేముంది! వారు మురళీని వినిపించి వెళ్ళిపోతారు. వారు స్వతంత్రులు. వారు ఒకసారి ఒక చోటుకు, మరోసారి మరోచోటుకు వెళ్తారు. శివబాబా మురళీని వినిపిస్తున్నారని పిల్లలకు కూడా అనుభవమవుతుంది. మేము బాబాకు సహాయం చేయడానికి ఈ ఈశ్వరీయ సేవలో నిలబడ్డాము అని పిల్లలు భావిస్తారు. తండ్రి అంటారు, నేను కూడా నా మధురమైన ఇంటిని వదిలి వచ్చాను. పరంధామము అనగా అన్నింటికన్నా పైన ఉన్న ధామము, మూలవతనము. ఇకపోతే ఆట అంతా సృష్టిపైనే నడుస్తుంది. ఇది అద్భుతమైన ఆట అని మీకు తెలుసు. ఇకపోతే ప్రపంచమైతే ఒకటే ఉంటుంది.

ఆ వ్యక్తులు చంద్రునిపైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు, అది సైన్స్ బలము. సైలెన్స్ బలముతో మనం ఎప్పుడైతే సైన్స్ పై విజయాన్ని పొందుతామో, అప్పుడు సైన్స్ కూడా సుఖాన్ని ఇచ్చేదిగా అవుతుంది. ఇక్కడ సైన్స్ సుఖాన్ని కూడా ఇస్తుంది, అలాగే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అక్కడైతే అంతా సుఖమే సుఖము. దుఃఖము అన్న మాటే లేదు. ఇటువంటి విషయాలు రోజంతా బుద్ధిలో ఉండాలి. బాబాకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి. బంధనములో ఉన్నవారు విషము కొరకు ఎన్ని దెబ్బలు తింటారు. కొందరైతే మోహానికి వశమై ఇక చిక్కుకుపోతారు. నిశ్చయబుద్ధి కలవారైతే - మేము అమృతాన్ని త్రాగాలి అని వెంటనే అంటారు. దీని కొరకు నష్టోమోహులుగా ఉండాలి. పాత ప్రపంచము నుండి మనస్సు తొలగిపోవాలి. ఇటువంటి సేవాధారులైనవారే హృదయము పైకి ఎక్కగలుగుతారు. వారికి శరణాగతి ఇవ్వవచ్చు. కన్య పతి శరణులోకి వెళ్తుంది, ఆమెను విషం లేకుండా ఉంచరు. అప్పుడు బాబా తమ శరణులోకి తీసుకోవలసి వస్తుంది. కానీ ఇందులో వారు పూర్తిగా నష్టోమోహులుగా ఉండాలి. పతులకే పతి లభించారు, ఇప్పుడు వారితో మనము బుద్ధియోగపు నిశ్చితార్థము చేసుకుంటాము. నాకైతే ఆ ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు, అంతే. ఏ విధంగా కన్యకు పతితో ప్రీతి జోడింపబడుతుందో, అలా ఇది ఆత్మకు పరమాత్మ పట్ల ప్రీతి. అతడి నుండి దుఃఖము లభిస్తుంది, వీరి నుండి సుఖము లభిస్తుంది. ఇది సంగమము, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మీకు ఎంత సంతోషము ఉండాలి. మనకు నావికుడు మరియు తోట యజమాని లభించారు, వారు మనల్ని పూలతోటలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో మనుష్యులందరూ ముళ్ళలా అయిపోయారు. అన్నింటికన్నా పెద్ద ముల్లు కామ వికారము యొక్క ముల్లు. మొదట మీరు నిర్వికారీ పుష్పాలుగా ఉండేవారు, మెల్లమెల్లగా కళలు తగ్గిపోయాయి, ఇప్పుడైతే పెద్ద ముళ్ళలా అయిపోయారు. బాబాను బబుల్ నాథ్ అని కూడా అంటారు. వారి యథార్థమైన నామము శివ అని మీకు తెలుసు. బబుల్ నాథ్ అన్న పేరును పెడతారు ఎందుకంటే వారు ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. భక్తి మార్గములో ఎన్నో పేర్లను పెడతారు. వాస్తవానికి శివ అన్న పేరొక్కటే ఉంది. రుద్ర జ్ఞాన యజ్ఞము అన్నా లేక శివ జ్ఞాన యజ్ఞము అన్నా విషయమొక్కటే. రుద్ర యజ్ఞము నుండి వినాశ జ్వాల వెలువడింది మరియు శ్రీకృష్ణపురి లేక ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరిగింది. మీరు ఈ యజ్ఞము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రాలను కూడా అద్భుతముగా తయారుచేస్తారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చూపిస్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. బ్రహ్మా, సరస్వతులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఈ నిశ్చయం ఉంది. లక్ష్మీ-నారాయణులే 84 జన్మల తర్వాత బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. మనుష్యులు ఇటువంటి విషయాలను విని ఆశ్చర్యపోతారు. వారు సంతోషపడుతూ ఉండవచ్చు కూడా. కానీ మాయ తక్కువేమీ కాదు. కామము మహాశత్రువు. మాయ నామ-రూపాలలో చిక్కుకునేలా చేసి కింద పడవేస్తుంది. తండ్రిని స్మృతి చేయనివ్వదు. అప్పుడు ఆ సంతోషము తగ్గిపోతుంది. మేము చాలామందికి అర్థం చేయిస్తాము అని ఇందులోనే సంతోషపడిపోకూడదు. మొదట చూసుకోవాలి - నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను? రాత్రివేళలో బాబాను స్మృతి చేసి పడుకుంటున్నానా లేక మర్చిపోతున్నానా? కొందరు పిల్లలైతే పక్కా నియమధారులుగా కూడా ఉన్నారు.

పిల్లలైన మీరు చాలా అదృష్టవంతులు. బాబాపైనైతే ఎంతో భారము ఉంది, కానీ రథానికి ఎంతైనా కొంత రాయితీ లభిస్తుంది. జ్ఞానం మరియు యోగము కూడా ఉన్నాయి, ఇవి లేకుండా లక్ష్మీ-నారాయణుల పదవిని ఎలా పొందుతారు. సంతోషమైతే ఉంటుంది, బాబాకు నేనొక్కడినే కొడుకును, ఆపై నాకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఈ నషా కూడా ఉంటుంది, కానీ మాయ విఘ్నాలను కూడా కలిగిస్తుంది. పిల్లలకు కూడా మాయ విఘ్నాలు వస్తూ ఉండవచ్చు. కర్మాతీత అవస్థ అనేది ముందుకు వెళ్లే కొద్దీ రానున్నది. ఇక్కడ బాప్ దాదాలిరువురూ కలిసి ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలూ... అని అంటారు. తండ్రి ప్రేమసాగరుడు. వీరి ఆత్మ వారితో కలిసి ఉన్నారు. వీరు కూడా ప్రేమిస్తారు. ఎటువంటి కర్మను నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని భావిస్తారు. చాలా మధురముగా ఉండాలి. పిల్లలు చాలా తెలివైనవారిగా ఉండాలి. ఈ లక్ష్మీ-నారాయణులలో ఎంత తెలివి ఉందో చూడండి. ఆ తెలివితో విశ్వ రాజ్యాన్ని తీసుకున్నారు. ప్రదర్శనీ ద్వారా ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. భారత్ చాలా పెద్దది, అంత సేవ చేయాలి. ఇంకొకటి స్మృతిలో ఉంటూ వికర్మలను కూడా వినాశనం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద చింత. మనం తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా ఎలా అవ్వాలి? ఇందులో శ్రమ ఉంది. సేవా అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ట్రైన్ లో బ్యాడ్జిపై సేవ చేయవచ్చు. వీరు బాబా, ఇది వారసత్వము. తప్పకుండా 5,000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. మళ్ళీ తప్పకుండా వీరి రాజ్యం రావాలి. మనం బాబా స్మృతితో పావన ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము. ట్రైన్ లో ఎంతో సేవ జరుగవచ్చు. ఒక బోగిలో సేవ చేసి మళ్ళీ ఇంకొక బోగిలోకి వెళ్ళాలి. ఈ విధముగా సేవ చేసేవారే హృదయముపైకి ఎక్కుతారు. ఇలా చెప్పండి - మేము మీకు సంతోషకరమైన వార్తను వినిపిస్తాము, మీరు పూజ్య దేవతలుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలను తీసుకొని పూజారులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవ్వండి. మెట్ల వరుస బాగుంది, దీని ద్వారానే సతో, రజో, తమో స్థితులను నిరూపించాలి. స్కూల్లో చివరిలో త్వరత్వరగా ముందుకు వెళ్ళిపోవాలి అనే అభిరుచి కలుగుతుంది. అలా ఇక్కడ కూడా ఎవరైతే సమయాన్ని వ్యర్థం చేసుకున్నారో వారు త్వరత్వరగా ముందుకు వచ్చి సేవలో నిమగ్నమైపోవాలి అని అర్థం చేయించడం జరుగుతుంది. సేవకు అవకాశము ఎంతో ఉంది. సేవాధారులైన పిల్లలు ఎంతోమంది వెలువడాలి, వారిని బాబా ఎక్కడికైనా పంపించగలగాలి. మందిరాలలో సేవ బాగా జరుగుతుంది. దేవతా ధర్మంవారు వెంటనే అర్థం చేసుకుంటారు. గంగా స్నానాల వద్ద కూడా మీరు అర్థం చేయించవచ్చు, అప్పుడు వారి హృదయానికి తప్పకుండా హత్తుకుంటుంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా హర్షితముగా ఉండేందుకు ఆత్మిక సేవను చేయాలి, సత్యమైన సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. తమ మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. ట్రైన్ లో కూడా బ్యాడ్జిపై సేవ చేయాలి.

2. పాత ప్రపంచము నుండి మీ మనస్సును తొలగించివేయాలి. నష్టోమోహులుగా అవ్వాలి, ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని ఉంచాలి.

వరదానము:-

సంగమయుగపు మహత్వాన్ని తెలుసుకొని అన్నివేళలా విశేష అటెన్షన్ ను ఉంచే హీరో పాత్రధారీ భవ

ప్రతి కర్మను చేస్తూ - నేను హీరో పాత్రధారిని అన్న వరదానము సదా స్మృతిలో ఉండాలి, అప్పుడు ప్రతి కర్మ విశేషంగా ఉంటుంది, ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి సంకల్పం శ్రేష్ఠంగా ఉంటుంది. కేవలం 5 నిమిషాలే సాధారణంగా గడిచాయి కదా అని అనడానికి వీల్లేదు. సంగమయుగములో 5 నిమిషాలు కూడా ఎంతో మహత్వపూర్ణమైనవి. 5 నిమిషాలు అనేవి 5 సంవత్సరాల కంటే ఎక్కువ, అందుకే అన్నివెళలా అంతటి అటెన్షన్ ఉండాలి. సదాకాలికమైన రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే అటెన్షన్ కూడా సదాకాలికమైనది ఉండాలి.

స్లోగన్:-

ఎవరి సంకల్పాలలోనైతే దృఢతా శక్తి ఉందో, వారి కొరకు ప్రతి కార్యము సంభవము.