08-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది, కావున దీనిపై అనంతమైన వైరాగ్యము ఉండాలి, తండ్రి మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నారు’’

ప్రశ్న:-

పిల్లలైన మీ సైలెన్స్ లో ఏ రహస్యము ఇమిడి ఉంది?

జవాబు:-

ఎప్పుడైతే మీరు సైలెన్స్ లో కూర్చుంటారో అప్పుడు శాంతిధామాన్ని గుర్తుచేస్తారు. సైలెన్స్ అనగా జీవిస్తూనే మరణించడము అని మీకు తెలుసు. ఇక్కడ తండ్రి మీకు సద్గురువు రూపములో సైలెన్స్ గా ఉండటాన్ని నేర్పిస్తారు. మీరు సైలెన్స్ లో ఉంటూ మీ వికర్మలను దగ్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అన్న జ్ఞానం మీకు ఉంది. ఇతర సత్సంగాలలో శాంతిగా కూర్చుంటారు కానీ వారికి శాంతిధామము గురించిన జ్ఞానము లేదు.

ఓంశాంతి

మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలతో శివబాబా మాట్లాడుతున్నారు. గీతలో శ్రీకృష్ణుడు వినిపించినట్లుగా ఉంది కానీ అది వినిపించింది శివబాబాయే, శ్రీకృష్ణుడిని బాబా అని అనరు. ఇద్దరు తండ్రులు ఉంటారు అని భారతవాసులకు తెలుసు, ఒకరు లౌకిక తండ్రి మరియు ఇంకొకరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రిని పరమపిత అని అంటారు. లౌకిక తండ్రిని పరమపిత అని అనలేరు. మీకు లౌకిక తండ్రి ఏమీ అర్థం చేయించడం లేదు. పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు, దానిని మీరు ముక్తిధామము, నిర్వాణధామము లేక వానప్రస్థము అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలూ, ఇప్పుడు ఇక శాంతిధామానికి వెళ్ళాలి. కేవలం దానిని మాత్రమే ‘‘టవర్ ఆఫ్ సైలెన్స్’’ అని అంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట శాంతిలో కూర్చోవాలి. ఏ సత్సంగములోనైనా మొట్టమొదట శాంతిలోనే కూర్చొంటారు, కానీ వారికి శాంతిధామము యొక్క జ్ఞానము లేదు. ఆత్మలమైన మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. ఏ సమయంలోనైనా శరీరము పోవచ్చు, అందుకే ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో, దానిని మంచి రీతిలో చదువుకోవాలి. వారు సుప్రీమ్ టీచర్ కూడా , అలాగే సద్గతిదాత, గురువు కూడా, వారితో యోగాన్ని జోడించాలి. వారొక్కరే మూడు సేవలను చేస్తారు. ఈ విధంగా ఇంకెవ్వరూ ఒక్కరే మూడు సేవలను చేయలేరు. ఈ ఒక్క తండ్రే సైలెన్స్ ను కూడా నేర్పిస్తారు. జీవిస్తూ మరణించడాన్ని సైలెన్స్ అని అంటారు. మనమిప్పుడు శాంతిధామమైన ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. ఎప్పటివరకైతే పవిత్ర ఆత్మలుగా తయారవ్వరో అప్పటివరకు తిరిగి ఇంటికి ఎవ్వరు వెళ్ళలేరు. వెళ్ళడమైతే అందరూ వెళ్ళాల్సిందే, అందుకే పాప కర్మలకు చివరిలో శిక్షలు లభిస్తాయి, ఇక అప్పుడు పదవి కూడా భ్రష్టమైపోతుంది. శిక్షలను తిని పదవిని పొందుతారు ఎందుకంటే మాయతో ఓడిపోతారు. తండ్రి మాయపై విజయాన్ని ప్రాప్తింపజేయడానికే వస్తారు. కానీ నిర్లక్ష్యం కారణంగా తండ్రిని స్మృతి చేయరు. ఇక్కడైతే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా ఎంతగానో భ్రమిస్తారు, ఎవరికైతే తల వంచి నమస్కరిస్తారో వారి గురించి తెలియదు. తండ్రి వచ్చి అలా భ్రమించడం నుండి విముక్తులను చేస్తారు. జ్ఞానము పగలు అని, భక్తి రాత్రి అని అర్థం చేయించడం జరుగుతుంది. రాత్రివేళలలోనే ఎదురుదెబ్బలు తినడం జరుగుతుంది. జ్ఞానము ద్వారా పగలు అనగా సత్య, త్రేతాయుగాలు. భక్తి అనగా రాత్రి, ద్వాపర-కలియుగాలు. ఇది మొత్తం డ్రామా యొక్క కాలపరిమితి. సగం సమయం పగలు, సగం సమయం రాత్రి. ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీల యొక్క పగలు మరియు రాత్రి. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి అనంతమైన సంగమములో వస్తారు, అందుకే శివరాత్రి అని అంటారు. శివరాత్రి అని దేనినంటారు అనేది మనుష్యులు అర్థం చేసుకోరు. మీకు తప్ప ఇంకెవ్వరికీ శివరాత్రి యొక్క మహత్వం గురించి తెలియదు ఎందుకంటే ఇది మధ్యలోని సమయం. ఎప్పుడైతే రాత్రి పూర్తయ్యి పగలు ప్రారంభమవుతుందో అప్పుడు దానిని ‘‘పురుషోత్తమ సంగమయుగము’’ అని అంటారు. ఇది పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి మధ్యలో ఉంటుంది. తండ్రి ప్రతి పురుషోత్తమ సంగమయుగములో వస్తారు, అంతేకానీ ప్రతి యుగములోనూ రారు. సత్య-త్రేతాయుగాల యొక్క సంగమాన్ని కూడా సంగమయుగము అనే అనేస్తారు, కానీ అది పొరపాటు అని తండ్రి అంటారు.

శివబాబా అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనమవుతాయి, దీనినే యోగాగ్ని అని అంటారు. మీరందరూ బ్రాహ్మణులు. పవిత్రముగా అయ్యేందుకు యోగాన్ని నేర్పిస్తారు. ఆ బ్రాహ్మణులు కామచితి పైకి ఎక్కిస్తారు. ఆ బ్రాహ్మణులకు మరియు బ్రాహ్మణులైన మీకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు కుఖవంశావళులు మరియు మీరు ముఖవంశావళులు. ప్రతి విషయము చాలా బాగా అర్థం చేసుకోవలసినది. ఎవరు వచ్చినా సరే వారికి - అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు అనంతమైన తండ్రి యొక్క వారసత్వము లభిస్తుంది అని అర్థం చేయించడం జరుగుతుంది. ఎంతెంతగానైతే దైవీ గుణాలను ధారణ చేస్తారో మరియు చేయిస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి పతితులను పావనంగా తయారుచేసేందుకే వస్తారు కావున మీరు కూడా ఈ సేవను చేయాలి. అందరూ పతితులే. గురువులు ఎవ్వరినీ పావనంగా చేయలేరు. పతిత-పావన అన్న పేరు శివబాబాదే. వారు ఇక్కడికే వస్తారు. ఎప్పుడైతే అందరూ పూర్తిగా పతితులుగా అయిపోతారో, అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి వస్తారు. మొట్టమొదటిగా అల్ఫ్ (భగవంతుడు) తన పిల్లలకు - నన్ను స్మృతి చేయండి అన్న విషయాన్ని అర్థం చేయిస్తారు. వారు పతిత-పావనుడు అని మీరు అంటారు కదా. ఆత్మిక తండ్రినే పతిత-పావన అని అంటారు. ఓ భగవంతుడా లేక ఓ బాబా అని అంటారు. కానీ పరిచయం ఎవ్వరికీ లేదు. ఇప్పుడు సంగమయుగవాసులైన మీకు పరిచయం లభించింది. వారు నరకవాసులు. మీరు నరకవాసులు కాదు. అయితే, ఒకవేళ ఎవరైనా ఓడిపోతే పూర్తిగా కింద పడిపోతారు. చేసుకున్న సంపాదనంతా నష్టమైపోతుంది. పతితుల నుండి పావనులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇది ఉన్నదే వికారీ ప్రపంచము. అది నిర్వికారీ ప్రపంచము, కొత్త ప్రపంచము, అక్కడ దేవతలు రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఇది పిల్లలైన మీకు తెలిసింది. మొట్టమొదట దేవతలే అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. అందులోనూ మొట్టమొదట సూర్యవంశీయులు ఎవరైతే ఉంటారో వారు మొదట వస్తారు, 21 తరాలు వారసత్వాన్ని పొందుతారు. ఇది పవిత్రత-సుఖ-శాంతుల యొక్క ఎంతటి అనంతమైన వారసత్వము. సత్యయుగాన్ని పూర్తి సుఖధామము అని అంటారు. త్రేతా సెమీ ఎందుకంటే రెండు కళలు తగ్గిపోతాయి. కళలు తగ్గిపోయిన కారణంగా ప్రకాశము తగ్గిపోతూ ఉంటుంది. చంద్రుని యొక్క కళలు తగ్గినప్పుడు కూడా ప్రకాశము తగ్గిపోతుంది. చివరికి ఒక చిన్న రేఖ మాత్రం మిగులుతుంది, పూర్తిగా శూన్యం అయిపోదు. మీది కూడా అలాగే, పూర్తిగా శూన్యం అయిపోదు. దీనినే పిండిలో ఉప్పంత అని అంటారు.

తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా. దీనిని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. పరమాత్మ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే అనేకమంది ఆత్మలు లేక అనేకమంది మనుష్యులు పెరిగిపోతారో అప్పుడు పరమాత్మ ఈ మేళాలోకి వస్తారు. ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళా ఎందుకు జరుగుతుంది? ఆ మేళాలైతే మాలిన్యముగా అయ్యేందుకే జరుగుతాయి. ఈ సమయంలో మీరు తోట యజమాని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎలా అవుతారు? స్మృతి బలంతో. తండ్రిని సర్వశక్తివంతుడు అని అంటారు. తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతుడో, అలాగే రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేమీ కాదు. మాయ చాలా శక్తివంతమైనది, ప్రబలమైనది అని తండ్రి స్వయమే అంటారు. పిల్లలు అంటారు - బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము కానీ మాయ మా స్మృతిని మరిపింపజేస్తుంది. ఒకరికొకరు శత్రువులు అయినట్లు కదా. తండ్రి వచ్చి మాయపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు, మాయ మళ్ళీ ఓడించేస్తుంది. దేవతలు మరియు అసురులకు మధ్యన యుద్ధాన్ని చూపించారు. కానీ వాస్తవానికి అటువంటిదేమీ లేదు. యుద్ధమైతే ఇదే. మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా దేవతలుగా అవుతారు. మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది, చదువులో విఘ్నాలను కలిగించదు. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. ఘడియ-ఘడియ మాయ మరిపింపజేస్తుంది. దేహాభిమానులుగా అవ్వడం వలన మాయ యొక్క దెబ్బ తగులుతుంది. కాముకులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో చాలా కఠినమైన పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఉన్నదే రావణ రాజ్యం. ఇక్కడ కూడా పావనంగా అవ్వమని అర్థం చేయించడం జరుగుతుంది, అయినా కానీ కొందరు అవ్వరు. తండ్రి అంటారు - పిల్లలూ, వికారాలలోకి వెళ్ళకండి, నల్ల ముఖాన్ని చేసుకోకండి. అయినా కానీ ఈ విధంగా వ్రాస్తారు - బాబా, మాయ ఓడించేసింది అనగా నల్ల ముఖం చేసుకొని కూర్చున్నాము. తెల్లనివారు, నల్లనివారు అని ఉంటారు కదా. వికారులు నల్లగా, నిర్వికారులు సుందరముగా ఉంటారు. శ్యామ-సుందరుడు అన్న పదం యొక్క అర్థము కూడా మీకు తప్ప ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడిని కూడా శ్యామ-సుందరుడు అని అంటారు. తండ్రి వారి పేరు యొక్క అర్థాన్నే అర్థం చేయిస్తారు. వారు స్వర్గం యొక్క మొదటి నంబరు యువరాజు. సౌందర్యములో నంబరువన్ గా వీరే పాసవుతారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు దిగిపోతూ-దిగిపోతూ నల్లగా అయిపోతారు. అందుకే శ్యామ-సుందరుడు అన్న పేరును పెట్టారు. ఈ అర్థాన్ని కూడా తండ్రియే అర్థం చేయిస్తారు. శివబాబా అయితే సదా సుందరముగా ఉంటారు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుందరముగా తయారుచేస్తారు. పతితులు నల్లగా, పావనులు సుందరముగా ఉంటారు. సహజ సిద్ధమైన సౌందర్యము ఉంటుంది. పిల్లలైన మీరు - మేము స్వర్గాధిపతులుగా అవ్వాలి అని ఇక్కడకు వచ్చారు. శివ భగవానువాచ అన్న గాయనము కూడా ఉంది. మాతలు స్వర్గ ద్వారాలను తెరుస్తారు, అందుకే వందేమాతరం అని గాయనం చేయడం జరుగుతుంది. వందేమాతరం అని అన్నప్పుడు తప్పకుండా తండ్రి కూడా ఉన్నారని అర్థమవుతుంది. తండ్రి మాతల మహిమను పెంచుతారు. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు, ఇక్కడ మొదట మిస్టర్, ఆ తర్వాత మిసెస్. డ్రామా రహస్యము ఈ విధంగా తయారుచేయబడి ఉంది. రచయిత అయిన తండ్రి మొదట వారి పరిచయాన్ని ఇస్తారు. ఒకరు హద్దులోని లౌకిక తండ్రి, ఇంకొకరు అనంతమైన పారలౌకిక తండ్రి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. హద్దులోని వారసత్వము లభిస్తున్నా కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచి మీ ఒక్కరితోనే జోడిస్తాము. ఈ విధంగా ఎవరు అన్నారు? ఆత్మ. ఆత్మయే ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మ ఎటువంటి కర్మలను చేస్తూ ఉంటుందో అటువంటి జన్మను తీసుకుంటూ ఉంటుంది. షావుకార్లు పేదవారిగా అవుతారు. కర్మలు కదా. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులు. వీరు ఏమి చేసారు అనేది కేవలం మీకే తెలుసు మరియు మీరే అర్థం చేయించగలరు.

తండ్రి అంటారు - ఈ కనుల ద్వారా మీరు ఏదైతే చూస్తారో దానిపై వైరాగ్యము ఉండాలి. ఇవన్నీ అంతమైపోనున్నాయి. కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పాత ఇంటిపై వైరాగ్యము కలుగుతుంది. పిల్లలు అంటారు - మా తండ్రిగారు కొత్త ఇంటిని తయారుచేసారు, మేము అందులోకి వెళ్తాము, ఈ పాత ఇల్లు అయితే శిథిలమైపోతుంది. ఇది అనంతమైన విషయము. బాబా స్వర్గ స్థాపన చేయడానికి వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది పాత ఛీ-ఛీ ప్రపంచము.

పిల్లలైన మీరు ఇప్పుడు త్రిమూర్తి శివుని ఎదురుగా కూర్చున్నారు. మీరు విజయం పొందుతారు. వాస్తవానికి ఈ త్రిమూర్తి మీ రాజముద్రిక. బ్రాహ్మణులైన మీ ఈ కులము అన్నింటికన్నా ఉన్నతమైనది. ఇది పిలకవంటిది. ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతుంది. ఈ రాజముద్రిక గురించి బ్రాహ్మణులైన మీకే తెలుసు. శివబాబా మనల్ని దేవీ-దేవతలుగా తయారుచేయడానికి బ్రహ్మా ద్వారా చదివిస్తారు. వినాశనమైతే జరగాల్సిందే, ప్రపంచం తమోప్రధానముగా అయిపోతుంది కావున ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. బుద్ధి ద్వారా ఎంతటి సైన్స్ ను ఆవిష్కరిస్తూ ఉంటారు. కడుపు నుండి ముసలాలు ఏమీ వెలువడలేదు, అవి సైన్స్ ద్వారా వెలువడ్డాయి, వాటితో మొత్తం కులమంతటినీ అంతం చేసేస్తారు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా అని పిల్లలకు అర్థం చేయించారు. పూజ కూడా ఒక్క శివబాబాకు మరియు దేవతలకే చేయాలి. బ్రాహ్మణులకు పూజ జరుగదు ఎందుకంటే మీ ఆత్మ పవిత్రముగా ఉన్నా కానీ శరీరమైతే పవిత్రముగా లేదు, అందుకే పూజకు యోగ్యం కారు. మీరు మహిమాయోగ్యులు. ఎప్పుడైతే మీరు మళ్ళీ దేవతలుగా అవుతారో అప్పుడు ఆత్మా కూడా పవిత్రముగా ఉంటుంది, అలాగే శరీరము కూడా కొత్తగా, పవిత్రమైనది లభిస్తుంది. ఈ సమయంలో మీరు మహిమాయోగ్యులుగా ఉన్నారు. వందేమాతరం అని గాయనం చేయబడుతుంది. మాతల సైన్యం ఏమి చేసారు? మాతలే శ్రీమతమనుసారముగా జ్ఞానాన్ని ఇచ్చారు. మాతలు అందరికీ శ్రీమతమనుసారముగా జ్ఞానాన్ని ఇస్తారు. మాతలు అందరికీ జ్ఞానామృతాన్ని తాగిస్తారు. యథార్థ రీతిగా మీరే అర్థం చేసుకుంటారు. శాస్త్రాలలోనైతే ఎన్నో కథలను వ్రాసేసారు. వారు కూర్చొని వినిపిస్తారు. మీరు సత్యం, సత్యం అని అంటూ ఉండేవారు. మీరు కూర్చుని ఇది వినిపించినట్లయితే సత్యం-సత్యం అని అంటారు. ఇప్పుడు మీరు అలా ఎవరు ఏది చెప్పినా సత్యం, సత్యం అని అనరు. మనుష్యులు ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే, ఏది వింటే దానిని వారు సత్యం, సత్యం అని అంటూనే ఉంటారు. రాతిబుద్ధి మరియు పారసబుద్ధి అన్న గాయనము కూడా ఉంది. పారసబుద్ధి అనగా పారసనాథ్. నేపాల్ లో పారసనాథుని చిత్రము ఉంది అని అంటారు. పారసపురికి నాథులు ఈ లక్ష్మీ-నారాయణులే. వారి రాజ్యవంశము ఉంది. ఇప్పుడు ముఖ్యమైన విషయమేమిటంటే, రచయిత మరియు రచనల రహస్యమును తెలుసుకోవడము, దాని గురించే ఋషులు, మునులు కూడా నేతి, నేతి (మాకు తెలియదు, తెలియదు) అని అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అన్నింటినీ తెలుసుకుంటారు అనగా ఆస్తికులుగా అవుతారు. మాయా రావణుడు నాస్తికులుగా చేస్తాడు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా స్మృతిలో ఉండాలి - మేము బ్రహ్మాముఖవంశావళి బ్రాహ్మణులము, మాది అన్నింటికన్నా ఉన్నతమైన కులము, మేము పవిత్రముగా అవ్వాలి మరియు తయారుచేయాలి, పతిత-పావనుడైన తండ్రికి సహాయకులుగా అవ్వాలి.

2. స్మృతిలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేహాభిమానం కారణముగానే మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది, అందుకే మొదట దేహాభిమానాన్ని వదలాలి. యోగాగ్ని ద్వారా పాపాలను అంతం చేసుకోవాలి.

వరదానము:-

సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే అనంతమైన వైరాగీ భవ

సాధనాలు లభించినట్లయితే వాటిని పెద్ద మనస్సుతో ఉపయోగించండి, ఈ సాధనాలు ఉన్నది మీ కొరకే, కానీ సాధనను మర్జ్ చెయ్యకండి. పూర్తి బ్యాలెన్సు ఉండాలి. సాధనాలు చెడ్డవి కావు, సాధానాలనేవి మీ కర్మకు, యోగానికి ఫలము. కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతులుగా మరియు తండ్రికి ప్రియులుగా అవ్వండి. వాటిని ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావంలోకి రాకండి. సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మర్జ్ అవ్వకూడదు. వైరాగ్య వృత్తిని మొదటగా స్వయములో ఇమర్జ్ చెయ్యండి, ఆ తర్వాత విశ్వములో ఆ వాయుమండలాన్ని వ్యాపింపజేయండి.

స్లోగన్:-

వ్యాకులతలో ఉన్నవారిని తమ స్వమానములో స్థితి చెయ్యటమే అన్నింటికన్నా మంచి సేవ.