09-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీకు అన్ని వైపుల నుండి మోహం తొలగిపోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, బ్రాహ్మణ కులము యొక్క పేరును అప్రతిష్ఠపాలు చేసే వికర్మలేవీ జరగకూడదు’’

ప్రశ్న:-

బాబా ఏ పిల్లలను చూస్తూ-చూస్తూ ఎంతో హర్షిస్తారు? ఏ పిల్లలు బాబా నయనాలలో ఇమిడి ఉంటారు?

జవాబు:-

ఏ పిల్లలైతే అనేకులను సుఖమిచ్చేవారిగా తయారుచేస్తారో, సేవాధారులుగా ఉన్నారో, వారిని చూస్తూ-చూస్తూ బాబా కూడా హర్షిస్తారు. ఏ పిల్లల బుద్ధిలోనైతే - ఒక్క బాబాకే చెప్పాలి, బాబాతోనే మాట్లాడాలి... అని ఉంటుందో, అటువంటి పిల్లలు బాబా నయనాలలో ఇమిడి ఉంటారు. బాబా అంటారు - నా సేవను చేసే పిల్లలు నాకు అత్యంత ప్రియమైనవారు, అటువంటి పిల్లలను నేను స్మృతి చేస్తాను.

ఓంశాంతి

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు తెలుసు - మేము తండ్రి ముందు కూడా కూర్చున్నాము, ఆ తండ్రే మళ్ళీ టీచర్ రూపంలో చదివిస్తారు కూడా, ఆ తండ్రే పతిత-పావనుడు, సద్గతిదాత కూడా, వారే తమతో పాటు తీసుకువెళ్తురు కూడా మరియు మార్గము కూడా సహజమైనది తెలియజేస్తారు. పతితుల నుండి పావనులుగా తయారుచేయడానికి వారు శ్రమనేమీ ఇవ్వరు. ఎక్కడికైనా వెళ్ళినా, విహరిస్తున్నా, విదేశాలకు వెళ్తున్నా సరే, కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి. అలా భావిస్తున్నారు కూడా, అయినా కానీ వారు చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి, దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. మనం ఒక ఆత్మ, పాత్రను అభినయించేందుకు శరీరాన్ని తీసుకుంటాము, ఒక శరీరంతో పాత్రను అభినయించి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాము. కొందరి పాత్ర 100 సంవత్సరాలు ఉంటుంది, కొందరిది 80 సంవత్సరాలు ఉంటుంది, కొందరిది రెండు సంవత్సరాలు ఉంటుంది, కొందరిది ఆరు మాసాలు ఉంటుంది, కొందరైతే జన్మించడంతోనే అంతమైపోతారు, మరికొందరు జన్మ తీసుకోకముందే గర్భములోనే అంతమైపోతారు. ఇక్కడి పునర్జన్మలకు మరియు సత్యయుగపు పునర్జన్మలకు రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ గర్భము నుండి జన్మ తీసుకుంటారు, దీనిని గర్భ జైలు అని అంటారు. సత్యయుగములో గర్భ జైలు ఉండదు, అక్కడ వికర్మలే జరగవు, అసలు రావణ రాజ్యమే ఉండదు. తండ్రి అన్ని విషయాలనూ అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి కూర్చొని ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తారు. ఈ శరీరములో ఉన్న ఆత్మ కూడా వింటుంది. వినిపించేవారు జ్ఞానసాగరుడైన తండ్రి, వారికి తమ శరీరము లేదు. వారు ఎల్లప్పుడూ శివ అనే పిలువబడతారు. ఏ విధముగా వారు పునర్జన్మ రహితులో అలాగే నామ-రూపాలను తీసుకోవడం నుండి కూడా వారు అతీతులే. వారిని సదాశివ అని అంటారు. వారు ఎప్పటికీ శివుడే, వారికి దైహికమైన పేరు ఏదీ ఉండడు. వీరిలోకి ప్రవేశించినా సరే వీరి దేహము యొక్క పేరు వారికి రాదు. మీది అనంతమైన సన్యాసము. వారు హద్దులోని సన్యాసులు. వారి పేర్లు కూడా మారుతాయి. మీకు కూడా బాబా ఎంత మంచి-మంచి పేర్లు పెట్టారు. డ్రామానుసారంగా ఎవరికైతే పేర్లు పెట్టారో వారు మాయమైపోయారు. నా వారిగా అయ్యారు కావున తప్పకుండా నిలిచి ఉంటారు, వదిలి వెళ్ళిపోరు అని తండ్రి భావించారు. కానీ వదిలి వెళ్ళిపోతే ఇక పేరు పెట్టడం వల్ల లాభమేముంది. సన్యాసులు కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతే వారి పాత పేరే నడుస్తుంది. ఇంటికైతే తిరిగి వెళ్తారు కదా. సన్యాసం చేసినంత మాత్రాన వారికి మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరూ గుర్తుండరని కాదు. కొందరికైతే మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ గుర్తుకువస్తారు. మోహంలో చిక్కుకుపోతారు. మోహపు బంధము జోడింపబడి ఉంటుంది. కొందరి విషయంలోనైతే కనెక్షన్ వెంటనే తెగిపోతుంది. తప్పకుండా తెంచవలసిందే. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలని తండ్రి అర్థం చేయించారు. తండ్రి స్వయం కూర్చొని తెలియజేస్తారు. ఉదయం కూడా తండ్రి తెలియజేసారు కదా. చూస్తూ, చూస్తూ మనసులో సుఖము కలుగుతుంది... ఎందుకు? ఎందుకంటే, కనులలో పిల్లలు ఇమిడి ఉన్నారు. ఆత్మలు ఎలాగూ బిందువులే కదా. తండ్రి కూడా పిల్లలను చూస్తూ, చూస్తూ సంతోషిస్తారు కదా. కొందరు చాలా మంచి పిల్లలు ఉన్నారు, సెంటర్లు సంభాళిస్తారు, మరికొందరు బ్రాహ్మణులుగా అయి మళ్ళీ వికారాలలోకి వెళ్ళిపోతారు, అటువంటివారు ఆజ్ఞాకారులు కారు. ఈ తండ్రి కూడా సేవాధారులైన పిల్లలను చూస్తూ, చూస్తూ హర్షిస్తారు. ఇతడైతే కుల కళంకితుడిగా పుట్టాడు, బ్రాహ్మణ కులం పేరును అప్రతిష్టపాలు చేస్తున్నాడు అని అనంతమైన తండ్రి అంటారు. ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు, అటువంటివారిని కూడా సెమీ కుల-కళంకితులు అనే అంటారు అని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అలా సెమీ కుల కళంకితుల నుండి పూర్తి కుల కళంకితులుగా కూడా అయిపోతారు. బాబా, మేము పడిపోయాము, మేము నల్ల ముఖం చేసుకున్నాము, మాయ మోసగించేసింది అని స్వయమే వ్రాస్తారు కూడా. మాయ తుఫానులు ఎన్నో వస్తాయి. కామ ఖడ్గాన్ని ఉపయోగించినట్లయితే ఇది కూడా ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకోవడమేనని తండ్రి చెప్తారు. అందుకే ప్రతిజ్ఞ చేయిస్తారు, రక్తం తీసి కూడా దానితో పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు. కానీ ఈ రోజు వారు లేరు. తండ్రి అంటారు - ఓహో మాయ! నీవు ఎంత శక్తివంతమైముగా ఉన్నావు, ఏ పిల్లలైతే రక్తంతో కూడా వ్రాసి ఇస్తారో అటువంటి పిల్లలను కూడా నీవు తినేస్తావే. ఏ విధంగా తండ్రి సమర్థులో అలాగే మాయ కూడా సమర్థమైనది. అర్ధకల్పం తండ్రి యొక్క సామర్థ్య వారసత్వం లభిస్తుంది, మళ్ళీ అర్ధకల్పం మాయ ఆ సామర్థ్యాన్ని పోగొట్టేస్తుంది. ఇది భారత్ విషయము. దేవీ-దేవతా ధర్మం వారే సుసంపన్నుల నుండి దీవాలా తీసినవారిగా అవుతారు. ఇప్పుడు మీరు లక్ష్మీ-నారాయణుల మందిరంలోకి వెళ్తారు. మేము ఈ వంశానికి చెందినవారిగానే ఉండేవారము, ఇప్పుడు మేము చదువుకుంటున్నాము అని మీరు ఆశ్చర్యపోతారు. ఇతని ఆత్మ కూడా బాబా నుండి చదువుకుంటుంది. ఇంతకుముందు మీరు ఎక్కడపడితే అక్కడ తల వంచి నమస్కరిస్తూ ఉండేవారు. ఇప్పుడు జ్ఞానం లభించింది. ప్రతి ఒక్కరి యొక్క పూర్తి 84 జన్మల చరిత్ర గురించి మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తారు.

తండ్రి అంటారు - పిల్లలూ, ఎల్లప్పుడూ హర్షితముగా ఉండండి. ఇక్కడి హర్షితముఖ సంస్కారాలను మీతోపాటు తీసుకువెళ్తారు. మనం ఏమవుతాము అనేది మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు, దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీ-నారాయణులు ఏమయ్యారు అనేది తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఎక్కడి నుండైతే వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు అని భావిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - భక్తి మార్గంలో కూడా మీరు వేద-శాస్త్రాలను చదివేవారు, ఇప్పుడు నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నాను, ఇక మీ బుద్ధితో భక్తి యథార్థమైనదా లేక నేను వినిపిస్తున్నది యథార్థమా అన్నది మీరే నిర్ణయించండి. తండ్రియైన రాముడు ధర్మయుక్తమైనవారు, రావణుడు అధర్మయుక్తమైనవాడు. ప్రతి విషయములోనూ అసత్యాన్నే చెప్తారు. ఇలా జ్ఞాన విషయాలను గురించే చెప్పడం జరుగుతుంది. మొదట మనమందరమూ అసత్యమే చెప్పేవారము, దానపుణ్యాదులు మొదలైనవి చేస్తున్నా కూడా మెట్లను కిందకే దిగుతూ వచ్చాము అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు దానం కూడా ఆత్మలకే ఇస్తారు. పాపాత్ములు పాపాత్ములకు దానం చేస్తే మరి ఇక పుణ్యాత్ములుగా ఎలా తయారవుతారు? అక్కడ ఆత్మల మధ్యన ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. ఇక్కడైతే లక్షల రూపాయల అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఈ రావణరాజ్యంలో అడుగడుగులోనూ మనుష్యులకు దుఃఖం ఉంది. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. మీ అడుగడుగులోనూ పదమాలు ఉన్నాయి. దేవతలు పదమపతులుగా ఎలా అయ్యారు? ఇది ఎవ్వరికీ తెలియదు. స్వర్గమైతే తప్పకుండా ఉండేది, దాని గుర్తులు కూడా ఉన్నాయి. కానీ ఏ కర్మలు చేసిన కారణముగా మరుసటి జన్మలో రాజ్యం లభించింది అన్నది వారికి తెలియదు. అది కొత్త సృష్టి. కావున వ్యర్థమైన ఆలోచనలు ఉండనే ఉండవు. దానిని సుఖధామము అని అంటారు. ఇది 5,000 సంవత్సరాల విషయం. మీరు సుఖము కొరకు, పావనంగా అయ్యేందుకు చదువుతారు. అపారమైన యుక్తులు వెలువడతాయి. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు, శాంతిధామము ఆత్మలు ఉండే స్థానము, దానిని స్వీట్ హోం అని అంటారు. విదేశాల నుండి వచ్చినప్పుడు, ఇప్పుడు మేము మా స్వీట్ హోం కు వెళ్తున్నాము అని భావిస్తారు. మీ స్వీట్ హోం శాంతిధామము. తండ్రి కూడా శాంతిసాగరుడు కదా, వారి పాత్ర చివరిలో ఉంటుంది, కావున ఎంత సమయం వారు శాంతిలో ఉంటారు. బాబా పాత్ర చాలా తక్కువ సమయముంటుంది. ఈ డ్రామాలో మీది హీరో, హీరోయిన్ పాత్ర. మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఈ నషా ఎప్పుడూ ఎవరిలోనూ ఉండదు. ఇంకెవ్వరి భాగ్యములోనూ స్వర్గ సుఖాలు లేనే లేవు. ఇవైతే పిల్లలైన మీకే లభిస్తాయి. ఏ పిల్లలనైతే తండ్రి చూస్తారో వారు - బాబా, మేము మీకే చెప్తాము, మీతోనే మాట్లాడుతాము... అని అంటారు. తండ్రి కూడా అంటారు - నేను పిల్లలైన మిమ్మల్ని చూస్తూ, చూస్తూ ఎంతో హర్షిస్తాను. నేను 5,000 సంవత్సరాల తర్వాత వచ్చాను. పిల్లలను దుఃఖధామము నుండి సుఖధామములోకి తీసుకువెళ్తాను ఎందుకంటే కామ చితిపైకి ఎక్కుతూ-ఎక్కుతూ కాలిపోయి భస్మమైపోయారు. ఇప్పుడు వారిని సమాధి నుండి బయటకు తీయాలి. ఆత్మలందరూ అయితే హాజరై ఉన్నారు కదా. వారిని పావనంగా తయారుచేయాలి.

తండ్రి అంటారు - పిల్లలూ, బుద్ధి ద్వారా ఒక్క సద్గురువునే స్మృతి చేయండి మరియు మిగిలినవారందరినీ మర్చిపోండి. ఇలా ఒక్కరితోనే సంబంధాన్ని పెట్టుకోవాలి. మీరు వచ్చినట్లయితే మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు, మీ మతమనుసారముగానే నడుచుకుంటాము, శ్రేష్ఠముగా అవుతాము అని మీరు అన్నారు కూడా. ఉన్నతోన్నతుడు భగవంతుడేనని గానం కూడా చేస్తారు. వారి మతము కూడా ఉన్నతోన్నతమైనదే. బాబా స్వయంగా చెప్తున్నారు - ఈ జ్ఞానమునేదైతే మీకు ఇప్పుడు ఇస్తానో, అది మళ్ళీ కనుమరుగైపోతుంది. భక్తి మార్గపు శాస్త్రాలైతే పరంపరగా నడుస్తూ వస్తాయి, రావణుడు కూడా పరంపరగా ఉన్నాడు అని అంటారు. రావణుడిని ఎప్పటి నుండి కాలుస్తున్నారు, ఎందుకు కాలుస్తున్నారు? అని మీరు అడగండి. వారికేమీ తెలియదు. అర్థం తెలియని కారణముగా ఎంత ఆర్భాటం చేస్తూ ఉంటారు. ఎంతోమంది అతిథులు మొదలైనవారిని పిలుస్తూ ఉంటారు. రావణుడిని కాల్చే ఉత్సవము చేస్తున్నట్లు చేస్తారు. రావణుడిని ఎప్పటి నుండి తయారుచేస్తూ వచ్చారు అన్నది మీరు అర్థం చేసుకోలేరా? రోజురోజుకూ పెద్దగా తయారుచేస్తూ ఉంటారు. ఇది పరంపరగా నడుస్తూ వచ్చింది అని అంటారు. కానీ అలా జరుగదు. చివరికి రావణుడిని ఎప్పటివరకని కాలుస్తూ ఉంటారు? ఇంకా కొద్ది సమయమే ఉందని, ఆ తర్వాత ఇతని రాజ్యమే ఉండదని మీకు తెలుసు. తండ్రి అంటారు - ఈ రావణుడు అందరికన్నా పెద్ద శత్రువు, ఇతనిపై విజయాన్ని పొందాలి. మనుష్యుల బుద్ధిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ డ్రామాలో క్షణక్షణమూ ఏదైతే నడుస్తూ వస్తుందో అదంతా రచింపబడి ఉందని మీకు తెలుసు. మీరు తిథి, తారీఖు అన్నింటి లెక్కను తీయగలరు అనగా ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు మన పాత్ర నడుస్తుంది అనే లెక్కను మీరు తీయగలరు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. బాబా మనకు ఇది అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను పతిత-పావనుడను. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని మీరు నన్ను పిలుస్తారు. పావన ప్రపంచము శాంతిధామము మరియు సుఖధామములో ఉంటుంది. ఇప్పుడైతే అందరూ పతితులుగా ఉన్నారు. ఎల్లప్పుడూ బాబా-బాబా అని అంటూ ఉండండి. ఇది మర్చిపోకూడదు. అప్పుడు ఎల్లప్పుడూ శివబాబా గుర్తుకొస్తారు. వీరు మన బాబా. మొట్టమొదట ఈ అనంతమైన బాబా ఉన్నారు. బాబా అని అనడంతోనే వారసత్వము యొక్క సంతోషములోకి వస్తారు. కేవలం భగవంతుడు లేక ఈశ్వరుడు అని అంటే ఎప్పుడూ ఇటువంటి ఆలోచనలు రావు. అనంతమైన తండ్రి బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తారు అని అందరికీ చెప్పండి. ఇది వారి రథము. నేను పిల్లలైన మిమ్మల్ని ఈ విధంగా తయారుచేస్తాను అని ఇతని ద్వారా చెప్తారు. ఈ బ్యాడ్జిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. చివరి సమయంలో మీకు శాంతిధామము మరియు సుఖధామమే గుర్తుంటాయి, దుఃఖధామాన్ని అయితే మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ నంబరువారుగా అందరూ తమ-తమ సమయమనుసారముగా వస్తారని కూడా మీకు తెలుసు. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారు ఎంతమంది ఉన్నారు. అనేక భాషలు ఉన్నాయి. మొదట ఒకే ధర్మం ఉండేది, తర్వాత దాని నుండి ఎన్ని వెలువడ్డాయి. ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి. అందరూ కొట్లాడుకుంటూనే ఉంటారు ఎందుకంటే అనాథలుగా అయిపోతారు కదా. ఇప్పుడు తండ్రి అంటున్నారు - నేను మీకు ఏ రాజ్యాన్ని అయితే ఇస్తానో దానిని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, దానిని ఎవ్వరూ లాక్కోలేరు. ఇందులో అఖండముగా, స్థిరముగా, అచంచలముగా ఉండాలి. మాయ తుఫానులైతే తప్పకుండా వస్తాయి. ఎవరైతే ముందు ఉంటారో వారు అన్నీ మొదట అనుభవం చేస్తారు కదా. రోగాలు మొదలైనవన్నీ సదాకాలికముగా అంతమవ్వనున్నాయి, అందుకే కర్మల లెక్కాచారాలు, రోగాలు మొదలైనవి ఎక్కువ వస్తే అందులో భయపడకూడదు. ఇవన్నీ చివరి సమయానికి చెందినవే, ఇవి మళ్ళీ ఉండవు. ఇప్పుడన్నీ బయటకు వస్తాయి. వృద్ధులను కూడా మాయ యవ్వనులుగా చేస్తుంది. మనుష్యులు వానప్రస్థాన్ని తీసుకున్నప్పుడు అక్కడ స్త్రీలు ఉండరు. సన్యాసులు కూడా అడవులలోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా స్త్రీలు ఉండరు. వారు ఎవరి వైపూ చూడరు కూడా. భిక్ష తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతకుముందైతే స్త్రీల వైపు ఏమాత్రమూ చూసేవారు కూడా కాదు. తప్పకుండా బుద్ధి వెళ్తుంది అని భావించేవారు. సోదరి-సోదరుల సంబంధములో కూడా బుద్ధి వెళ్తుంది, అందుకే తండ్రి అంటారు - సోదర దృష్టితో చూడండి. శరీరం మాటే ఉండకూడదు. ఇది చాలా పెద్ద గమ్యము. పూర్తిగా శిఖరంపైకి వెళ్ళాలి. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతాము అని అంటారు. తండ్రి అంటారు - అవ్వండి, శ్రీమతముపై నడవండి. మాయ తుఫానులైతే వస్తాయి. కర్మేంద్రియాలతో ఏమీ చేయకూడదు. దివాలా మొదలైనవైతే మామూలుగా కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకానీ జ్ఞానంలోకి రావడం వల్ల దివాలా తీసారని కాదు. ఇది నడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేయడానికే నేను వచ్చాను అని తండ్రి అంటారు. కాసేపు చాలా బాగా సేవ చేస్తారు, ఇతరులకు అర్థం చేయిస్తారు, మళ్ళీ దివాలా తీసేస్తారు... మాయ చాలా శక్తివంతమైనది, మంచి-మంచి వారు కూడా పడిపోతారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - నా సేవను చేసే పిల్లలే నాకు ప్రియమనిపిస్తారు, వారు అనేకులను సుఖమిచ్చేవారి చేస్తారు, అటువంటి పిల్లలనే నేను స్మృతి చేస్తూ ఉంటాను. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకొని కుల కళంకితులుగా అవ్వకూడదు. మాయ మోసములోకి వచ్చి పరస్పరం ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. తండ్రి నుండి సమర్థత యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి.

2. సదా హర్షితముగా ఉండే సంస్కారాన్ని ఇక్కడి నుండే నింపుకోవాలి. ఇప్పుడు పాపాత్ములతో ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలూ చేయకూడదు. వ్యాధులు మొదలైనవాటికి భయపడకూడదు, అన్ని లెక్కాచారాలనూ ఇప్పుడే తీర్చుకోవాలి.

వరదానము:-

విల్ పవర్ ద్వారా క్షణములో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టే అశరీరి భవ

క్షణములో అశరీరిగా అయ్యేందుకు పునాది - ఈ అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యము ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే, అందులో ఏమి వేసినా సరే, దాని ఫలం వెంటనే వెలువడుతుంది. ఇప్పుడు ఎటువంటి విల్ పవర్ ఉండాలంటే - వ్యర్థం సమాప్తమవ్వాలి అని సంకల్పం చేయగానే, క్షణంలో అది సమాప్తమైపోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో క్షణములో సెట్ చేసుకోండి, సేవ లాగకూడదు. క్షణంలో ఫుల్ స్టాప్ పడినట్లయితే సహజంగానే అశరీరులుగా అవుతారు.

స్లోగన్:-

తండ్రి సమానంగా అవ్వాలంటే పాడైనదానిని బాగుచేసేవారిగా అవ్వండి.