10-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసాన్ని చేసినట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి, అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి, అపారమైన సంతోషం ఉంటుంది

ప్రశ్న:-

తమ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు మరియు అపారమైన సంతోషంలో ఉండేందుకు ఏ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి?

జవాబు:-

సదా స్మృతిలో ఉండాలి - మేము దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, మేము మృత్యులోకాన్ని వదిలి అమరలోకములోకి వెళ్తున్నాము - తద్వారా ఎంతో సంతోషము ఉంటుంది, నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది ఎందుకంటే అమరలోకమైన కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు దైవీ గుణాలు తప్పకుండా కావాలి. స్వరాజ్యం కొరకు అనేకుల కళ్యాణాన్ని కూడా చేయవలసి ఉంటుంది, అందరికీ దారిని తెలియజేయవలసి ఉంటుంది.

ఓంశాంతి

పిల్లలు తమను తాము ఈ ప్రపంచానికి చెందినవారిగా భావించకూడదు. మన రాజ్యమేదైతే ఉండేదో, దేనినైతే రామ రాజ్యము లేక సూర్యవంశీ రాజ్యం అని అంటారో, అందులో ఎంతటి సుఖ-శాంతులు ఉండేవి అనేది మీకు తెలిసింది. ఇప్పుడు మనం మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ఇంతకుముందు కూడా అలా అయ్యాము. మనమే సర్వ గుణ సంపన్నులుగా... దైవీ గుణాలు కలవారిగా ఉండేవారము. మనం మన రాజ్యంలో ఉండేవారము. ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నాము. మనం మన రాజ్యంలో ఎంతో సుఖంగా ఉండేవారము. కావున లోలోపల ఎంతో సంతోషము మరియు నిశ్చయము ఉండాలి ఎందుకంటే మీరు మళ్ళీ మీ రాజధానిలోకి వెళ్తున్నారు. రావణుడు మీ రాజ్యాన్ని దోచుకున్నాడు. మనకు మన సూర్యవంశీ రాజ్యముండేదని మీకు తెలుసు. మనం రామ రాజ్యానికి చెందినవారిగా ఉండేవారము, మనమే దైవీ గుణాలు కలవారిగా ఉండేవారము, మనమే ఎంతో సుఖవంతులుగా ఉండేవారము, తర్వాత రావణుడు మన రాజ్య భాగ్యాన్ని దోచుకున్నాడు. ఇప్పుడు తండ్రి వచ్చి మన మరియు పరాయి రాజ్యానికి సంబంధించిన రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అర్ధకల్పం మనం రామరాజ్యంలో ఉండేవారము, తర్వాత అర్ధకల్పం మనం రావణ రాజ్యంలో ఉన్నాము. పిల్లలకు ప్రతి విషయంపై నిశ్చయమున్నట్లయితే సంతోషంలో ఉంటారు మరియు నడవడిక కూడా బాగవుతుంది. ఇప్పుడు పరాయి రాజ్యంలో మనం చాలా దుఃఖితులుగా ఉన్నాము. మేము పరాయి రాజ్యంలో (విదేశీయుల రాజ్యంలో) దుఃఖితులుగా ఉండేవారమని, ఇప్పుడు స్వరాజ్యంలో సుఖంగా ఉన్నామని హిందువులైన భారతవాసులు భావిస్తారు. కానీ ఇది అల్పకాలికమైన, కాకిరెట్టతో సమానమైన సుఖము. పిల్లలైన మీరు ఇప్పుడు సదాకాలికమైన సుఖమయమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు కావున పిల్లలైన మీకు లోలోపల ఎంతో సంతోషముండాలి. జ్ఞానంలో లేకపోతే రాతిబుద్ధి కలవారిగా ఉన్నట్లే. మనం తప్పకుండా మన రాజ్యాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు, ఇందులో శ్రమ యొక్క విషయమేమీ లేదు. రాజ్యం తీసుకున్నాము, అప్పుడు అర్ధకల్పం రాజ్యం చేశాము, ఆ తర్వాత రావణుడు వచ్చి ఆత్మలోని విశేషతలను, శరీరములోని శక్తిని, అన్నింటినీ అంతం చేసేసాడు. ఎవరైనా మంచి పిల్లల యొక్క నడవడిక పాడైపోతే నీ ఆత్మలోని విశేషతలు, శరీరములోని శక్తి అన్నీ అంతమైపోయాయా అని అడుగుతారు. ఇవి అనంతమైన విషయాలు. మాయ మన ఆత్మలోని విశేషతలను, శరీరములోని శక్తిని అంతం చేసేసిందని భావించాలి. మనం పడిపోతూనే వచ్చాము. ఇప్పుడు అనంతమైన తండ్రి దైవీ గుణాలను నేర్పిస్తారు. కావున సంతోషపు పాదరసం పైకెక్కాలి. టీచర్ జ్ఞానాన్ని ఇస్తే విద్యార్థులకు సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానము. స్వయాన్ని చూసుకోవాలి - నాలో ఏ అసురీ గుణాలూ లేవు కదా? సంపూర్ణముగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. కానీ మనం అసలు శిక్షలను ఎందుకు అనుభవించాలి? అందుకే ఏ తండ్రి ద్వారానైతే ఈ రాజ్యం లభిస్తుందో, వారిని స్మృతి చేయాలి. మనలో ఏ దైవీ గుణాలైతే ఉండేవో, వాటిని ఇప్పుడు ధారణ చేయాలి. అక్కడ యథా రాజా, రాణి, తథా ప్రజ, అందరిలోనూ దైవీ గుణాలు ఉండేవి. దైవీ గుణాల అంటే ఏమిటో తెలుసు కదా. ఒకవేళ ఎవరికైనా వాటి గురించి తెలియకపోతే వాటిని స్వయంలోకి ఎలా తీసుకువస్తారు? సర్వ గుణ సంపన్నులు... అని గానం చేస్తారు కూడా. కావున పురుషార్థం చేసి ఆ విధంగా అవ్వాలి. అలా తయారవ్వడానికి కష్టపడవలసి ఉంటుంది. దృష్టి అశుద్ధంగా అయిపోతుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే అశుద్ధ దృష్టి దూరమైపోతుంది. యుక్తులనైతే తండ్రి ఎన్నో అర్థం చేయిస్తారు. ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉంటాయో వారిని దేవతలు అని అంటారు. ఎవరిలోనైతే అవి లేవో వారిని మనుష్యులు అని అంటారు. వాస్తవానికి ఇరువురూ మనుష్యులే. కానీ దేవతలను ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి మరియు ఈ మనుష్యుల కర్తవ్యాలు కోతుల వలె ఉన్నాయి. పరస్పరం ఎంతగా గొడవపడుతూ-పోట్లాడుకుంటూ ఉంటారు. సత్యయుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. ఇవి ఇక్కడే ఉంటాయి. తప్పకుండా తమ పొరపాటు ఉన్నట్లయితే సహనం చెయ్యవలసి ఉంటుంది. ఆత్మాభిమానులుగా లేకపోతే సహనం చెయ్యవలసి ఉంటుంది. మీరు ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో, అంతగా దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నాలో దైవీ గుణాలు ఉన్నాయా. తండ్రి సుఖదాత, కావున పిల్లల పని అందరికీ సుఖాన్ని ఇవ్వటము. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను ఎవ్వరికీ దుఃఖమునైతే ఇవ్వటం లేదు కదా? కానీ కొంతమందికి అలవాటు ఉంటుంది, వారు దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండలేరు, ఏమాత్రమూ బాగుపడరు, జైలు పక్షుల వలె ఉంటారు. వారు జైలులోనే తమను తాము సుఖముగా ఉన్నారని భావిస్తారు. తండ్రి అంటారు - అక్కడైతే జైలు మొదలైనవేవీ ఉండనే ఉండవు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేందుకు అక్కడ పాపాలు జరగనే జరగవు. ఇక్కడ జైలులో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన రాజ్యంలో ఉండేవారమో అప్పుడు చాలా షావుకారులుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ కులానికి చెందినవారెవరైతే ఉంటారో వారు, మేము మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము అని భావిస్తారు. అదొక్కటే మన రాజ్యముగా ఉండేది, దానిని దేవతల రాజ్యము అని అంటారు. ఆత్మకు ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు సంతోషము కలుగుతుంది. జీవాత్మ అని తప్పకుండా అనవలసి ఉంటుంది. జీవాత్మలమైన మనము ఎప్పుడైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారమో అప్పుడు మొత్తం విశ్వమంతటి పైనా మన రాజ్యం ఉండేది. ఈ జ్ఞానం మీ కొరకే ఉంది. మా రాజ్యం ఉండేది, మేము కూడా సతోప్రధానంగా ఉండేవారము అని భారతవాసులు ఏమైనా అర్థం చేసుకుంటారా. మీరే ఈ జ్ఞానమంతటినీ అర్థం చేసుకుంటారు. కావున మనమే దేవతలుగా ఉండేవారము మరియు మనమే ఇప్పుడు ఆ విధంగా తయారవ్వాలి. విఘ్నాలు వచ్చినా కానీ రోజురోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ, వీరు మంచి పని చేస్తున్నారు, దారి కూడా చాలా సహజమైనది తెలియజేస్తున్నారు అని అందరూ భావిస్తారు. మీరే సతోప్రధానులుగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు, మీ రాజధానిలో ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానులుగా అయిపోయారు అని అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ తమను రావణ రాజ్యం వారిగా భావించరు.

మనం ఎంత స్వచ్ఛంగా ఉండేవారము అనేది మీకు తెలుసు, ఇప్పుడు తుచ్ఛంగా అయిపోయాము. పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ బంగారు బుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అయిపోయాము. ఇప్పుడు మనం మన రాజ్య స్థాపనను చేసుకుంటున్నాము కావున మీరు సంతోషముతో ఉప్పొంగిపోవాలి, పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. ఎవరైతే కల్పపూర్వము నిమగ్నమైపోయారో వారు ఇప్పుడూ కూడా తప్పకుండా నిమగ్నమవుతారు. నంబరువారు పురుషార్థానుసారంగా మనం మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని కూడా మీరు ఘడియ, ఘడియా మర్చిపోతారు. లేదంటే లోలోపల చాలా సంతోషము ఉండాలి. పరస్పరం ఒకరికొకరు మన్మనాభవ అన్న మాటనే గుర్తు చేసుకోండి. తండ్రిని స్మృతి చేయండి, వారి ద్వారానే ఇప్పుడు రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము మనకు బాబా శ్రీమతాన్ని ఇస్తారు, తద్వారా మనము దైవీ గుణాలను ధారణ చేస్తాము. లేదంటే శిక్షలు అనుభవించి తక్కువ పదవిని పొందుతాము. ఇది చాల పెద్ద లాటరీ. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందారంటే ఇక కల్పకల్పాంతరాలూ పొందుతూనే ఉంటారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. భారతవాసులైన మీరే దేవతల రాజధానికి చెందినవారిగా ఉండేవారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ, మెట్లు కిందకు దిగుతూ, దిగుతూ ఈ విధంగా అయ్యారు అని ప్రదర్శనీలో కూడా ఇదే అర్థం చేయిస్తూ ఉండండి. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. వీరు సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ శిక్షకుడు మరియు సుప్రీమ్ గురువు కదా. విద్యార్థులైన మీరు ఎంతమంది ఉన్నారు, పరుగులు తీస్తూ ఉంటారు. ఎంతమంది నిర్వికారులుగా, పవిత్రులుగా అయ్యారు అని బాబా కూడా లిస్టు తెప్పించుకుంటూ ఉంటారు.

భృకుటి మధ్యలో ఆత్మ మెరుస్తూ ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. తండ్రి అంటారు, నేను కూడా ఇక్కడకు వచ్చి కూర్చుంటాను, నా పాత్రను అభినయిస్తాను. పతితులను పావనంగా తయారుచేయడమే నా పాత్ర. నేను జ్ఞానసాగరుడను. పిల్లలు జన్మిస్తారు, కొందరు చాలా మంచిగా ఉంటారు, కొందరు చెడ్డవారిగా కూడా అవుతారు. అప్పుడు ఆశ్చర్యము కలిగించేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. అరే మాయా, నీవు ఎంత శక్తివంతముగా ఉన్నావు. అయినా కానీ తండ్రి అంటారు, వారు పారిపోయి కూడా ఎక్కడికి వెళ్తారు? ఈ తండ్రి ఒక్కరే తీరానికి చేర్చేవారు. ఒక్క తండ్రే సద్గతిదాత, ఇకపోతే ఈ జ్ఞానము గురించి కొందరికి ఏమాత్రమూ తెలియదు. ఎవరైతే కల్పపూర్వము అంగీకరించారో, వారే అంగీకరిస్తారు. ఇందులో తమ నడవడికను చాలా తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది, సేవ చేయవలసి ఉంటుంది. అనేకుల కళ్యాణమును చేయాలి. అనేకులకు వెళ్ళి దారిని చూపించాలి. భారతవాసులైన మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఈ విధంగా మీ రాజ్యాన్ని తీసుకోవచ్చు అని చాలా చాలా మధురమైన పదాలతో, మాటలతో చెప్పాలి. బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారో, ఆ విధంగా ఇంకెవ్వరూ అర్థం చేయించలేరని మీకు తెలుసు, అయినా కానీ నడుస్తూ, నడుస్తూ మాయతో ఓడిపోతారు. వికారాలపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు జగత్ జీతులుగా అవుతారు అని స్వయంగా తండ్రియే అంటారు. ఈ దేవతలు జగత్ జీతులుగా అయ్యారు. తప్పకుండా వారు అటువంటి కర్మలను చేసారు. తండ్రి కర్మల గతిని కూడా తెలియజేశారు. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతాయి, రామరాజ్యంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. ముఖ్యమైన విషయము కామముపై విజయాన్ని పొంది జగత్ జీతులుగా అవ్వడమే. తండ్రిని స్మృతి చేయండి, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం మన రాజ్యాన్ని తీసుకొనే తీరుతాము అని మనకు 100 శాతము నమ్మకము ఉంది. కానీ రాజ్యము ఇక్కడ చెయ్యము, ఇక్కడ రాజ్యాన్ని తీసుకుంటాము. అమరలోకంలో రాజ్యం చేస్తాము. ఇప్పుడు మృత్యులోకానికి మరియు అమరలోకానికి మధ్యలో ఉన్నాము, ఈ విషయాన్ని కూడా మర్చిపోతారు, అందుకే తండ్రి ఘడియ-ఘడియ గుర్తు చేయిస్తూ ఉంటారు. మేము మా రాజధానిలోకి వెళ్తాము అని ఇప్పుడు పక్కా నిశ్చయముంది. ఈ పాత రాజధాని తప్పకుండా అంతమవ్వనున్నది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి ఎందుకంటే ఇప్పుడే మనం తిరిగి వెళ్ళాలి కావున స్వయాన్ని ఆత్మగా కూడా ఇప్పుడే భావించాలి, ఈ జ్ఞానం తర్వాత లభించడానికి ఇంకెప్పుడూ తిరిగి వెళ్ళేదే లేదు. మనం యోగాన్ని జోడించేందుకు అక్కడ అసలు పంచ వికారాలే ఉండవు. పావనులుగా అయ్యేందుకు యోగాన్ని ఈ సమయంలోనే జోడించవలసి ఉంటుంది. అక్కడ అందరూ తీర్చిదిద్దబడి ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది చాలా సహజము. క్రోధము కూడా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తుంది కదా. ముఖ్యమైనది దేహాభిమానము. అక్కడ అసలు దేహాభిమానమే ఉండదు. ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే అశుద్ధ దృష్టి ఉండదు, దృష్టి శుద్ధంగా అవుతుంది. రావణ రాజ్యంలో దృష్టి అశుద్ధముగా అవుతుంది. మనం మన రాజ్యంలో చాలా సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అక్కడ కామమూ ఉండదు, క్రోధమూ ఉండదు. దీనిపై ప్రారంభంలో ఒక పాట కూడా తయారై ఉన్నది. అక్కడ ఈ వికారాలు ఉండవు. అనేక సార్లు మన ఈ గెలుపు-ఓటములు జరిగాయి. సత్యయుగం నుండి కలియుగం వరకు ఏదైతే జరిగిందో అదంతా పునరావృతమవ్వనున్నది. తండ్రి మరియు టీచర్ వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీకు వినిపిస్తూ ఉంటారు. ఈ ఆత్మిక టీచర్ కూడా అద్భుతమైనవారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఉన్నతోన్నతమైన టీచర్ కూడా మరియు మనల్ని కూడా ఉన్నతోన్నతులైన దేవతలుగా తయారుచేస్తారు. తండ్రి ఏ విధంగా దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు అనేది మీరు స్వయం కూడా చూస్తున్నారు. మీరు స్వయమే దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడైతే అందరూ తమను తాము హిందువులుగా పిలుచుకుంటూ ఉంటారు. వాస్తవానికి అది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమేనని వారికి కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మిగిలినవారందరి ధర్మాలు నడుస్తూ ఉంటాయి, దేవీ-దేవతా ధర్మం ఒక్కటే కనుమరుగైపోయింది. ఇది చాలా పవిత్రమైన ధర్మము. ఇటువంటి పవిత్ర ధర్మము ఇంకేదీ ఉండదు. ఇప్పుడు పవిత్రంగా లేని కారణంగా ఎవ్వరూ తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. మనం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని, కావుననే దేవతలను పూజిస్తున్నామని మీరు అర్థం చేయించవచ్చు. క్రైస్టును పూజించేవారు క్రిస్టియన్లు, బుద్ధుడిని పూజించేవారు బౌద్ధులు, దేవతలను పూజించేవారు దేవతలే అవుతారు. మరి అలాంటప్పుడు స్వయాన్ని హిందువులుగా ఎందుకు పిలుచుకుంటున్నారు? యుక్తిగా అర్థం చేయించాలి. హిందూ ధర్మం వాస్తవానికి ధర్మం కాదు అని కేవలం ఈ ఒక్క మాటే చెప్తే డిస్టర్బ్ అవుతారు. హిందువులు ఆది సనాతన ధర్మానికి చెందినవారు అని చెప్పండి, అప్పుడు ఆది సనాతన ధర్మము హిందూ ధర్మమేమీ కాదు అని కొంతైనా అర్థం చేసుకుంటారు. ఆది సనాతన అన్న పదము సరైనది. దేవతలు పవిత్రంగా ఉండేవారు, వీరు అపవిత్రులుగా ఉన్నారు, అందుకే స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. కల్పకల్పము ఇలా జరుగుతుంది. వీరి రాజ్యంలో ఎంత షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు నిరుపేదలుగా అయ్యారు. వారు పదమాపదమపతులుగా ఉండేవారు. తండ్రి చాలా మంచి యుక్తులను ఇస్తారు. మీరు సత్యయుగ నివాసులా లేక కలియుగ నివాసులా అని అడగడం జరుగుతుంది. కలియుగవాసులైనట్లయితే తప్పకుండా నరకవాసులే. సత్యయుగంలో ఉండేవారు స్వర్గవాసులైన దేవతలుగా ఉంటారు. ఇటువంటి ప్రశ్నలను అడిగినట్లయితే, ఈ ప్రశ్నలు అడిగేవారు స్వయం ట్రాన్స్ఫర్ చేసి దేవతలుగా తయారుచేయగలరేమోనని భావిస్తారు. ఇంకెవ్వరూ ఇలా అడగలేరు. ఆ భక్తి మార్గమే వేరు. భక్తి ఫలమేమిటి? అది జ్ఞానము. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానముతో అర్ధకల్పము పగలు ఉంటుంది, భక్తి వలన అర్ధకల్పము రాత్రి ఉంటుంది. వీటిని ఒప్పుకునేవారు ఒప్పుకుంటారు, ఒప్పుకోనివారు జ్ఞానాన్ని కూడా అంగీకరించరు, అలాగే భక్తిని కూడా అంగీకరించరు. కేవలం ధనాన్ని సంపాదించడమే వారికి తెలుసు.

పిల్లలైన మీరైతే యోగబలముతో ఇప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తున్నారు, శ్రీమతము ఆధారముగా. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకుంటారు కూడా. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనేకుల కళ్యాణాన్ని చేయడానికి మీ మాటలను చాలా మధురంగా చేసుకోవాలి. మధురమైన మాటలతో సేవ చేయాలి. సహనశీలురుగా అవ్వాలి.

2. కర్మల గుహ్య గతిని అర్థం చేసుకొని వికారాలపై విజయాన్ని పొందాలి. జగత్ జీతులైన దేవతలుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా అయి అశుద్ధ దృష్టిని శుద్ధమైన పవిత్ర దృష్టిగా మార్చుకోవాలి.

వరదానము:-

శ్రేష్ఠ కర్మల ద్వారా దివ్య గుణాల రూపీ ప్రభు ప్రసాదాన్ని పంచే ఫరిశ్తా సో దేవతా భవ

వర్తమాన సమయంలో అజ్ఞానీ ఆత్మలకైనా లేక బ్రాహ్మణ ఆత్మలకైనా, ఇరువురుకి గుణదానము యొక్క అవసరము ఉంది. కావున ఇప్పుడు ఈ విధిని స్వయంలో మరియు బ్రాహ్మణ పరివారంలో తీవ్రతరం చేయండి. ఈ దివ్య గుణాలు అన్నింటికన్నా శ్రేష్ఠమైన ప్రభు ప్రసాదము, ఈ ప్రసాదాన్ని బాగా పంచండి. ఏ విధంగా స్నేహానికి గుర్తుగా ఇతరులకు టోలీ తినిపిస్తారో, అలా దివ్య గుణాల టోలీని తినిపించినట్లయితే ఈ విధి ద్వారా ఫరిశ్తా సో దేవతగా అయ్యే లక్ష్యము సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

స్లోగన్:-

యోగము రూపీ కవచమును ధరించి ఉన్నట్లయితే మాయా రూపీ శత్రువు దాడి చేయలేదు.