10-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు, ఇక్కడ మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరముగా సత్యమైనవారి యొక్క సత్యమైన సాంగత్యము లభిస్తుంది’’

ప్రశ్న:-

బాబా పిల్లల ఉన్నతి కొరకు సదా ఏ ఒక్క సలహాను ఇస్తారు?

జవాబు:-

మధురమైన పిల్లలూ, ఎప్పుడూ పరస్పరంలో ప్రాపంచిక పరచింతన విషయాలను మాట్లాడుకోకండి. ఎవరైనా వినిపిస్తే, వినీ-విననట్లుగా ఉండండి. మంచి పిల్లలు తమ సేవా డ్యూటీని పూర్తి చేసి, బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు అనవసరమైన వ్యర్థమైన మాటలను ఎంతో సంతోషముగా వింటూ-వినిపిస్తూ ఉంటారు, ఇందులో ఎంతో సమయం వృధా అవుతుంది, అప్పుడిక ఉన్నతి జరుగదు.

ఓంశాంతి

డబుల్ ఓం శాంతి అని అన్నా అదీ రైటే. పిల్లలకు అర్థమునైతే ముందే వివరించారు. నేను ఒక ఆత్మను, శాంతి స్వరూపమును. నా ధర్మమే శాంతి అయినప్పుడు ఇక అడవులు మొదలైన స్థానాల్లో భ్రమించడం ద్వారా శాంతి లభించదు. అలాగే నేను కూడా శాంతి స్వరూపాన్నే అని తండ్రి చెప్తున్నారు. వాస్తవానికి ఇది చాలా సహజమే కానీ మాయ యుద్ధం ఉన్న కారణముగా కాస్త కష్టమవుతుంది. అనంతమైన తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరని పిల్లలందరికీ తెలుసు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. దేహధారులను జ్ఞానసాగరులని ఎప్పుడూ అనలేరు. రచయితయే రచన ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. అది పిల్లలైన మీకు లభిస్తుంది. చాలామంది మంచి, అనన్యులైన పిల్లలు కూడా మర్చిపోతారు ఎందుకంటే బాబా స్మృతి పాదరసం వంటిది. స్కూల్లో తప్పకుండా నంబరువారుగా ఉంటారు కదా. నంబర్లు ఎల్లప్పుడూ స్కూల్లోనే లెక్కించబడతాయి. సత్యయుగములో ఎప్పుడూ ఇలా నంబర్లు లెక్కించబడవు. ఇది స్కూలు, దీనిని అర్థం చేసుకోవడానికి కూడా చాలా గొప్ప బుద్ధి కావాలి. అర్ధకల్పం భక్తి ఉంటుంది, మళ్ళీ భక్తి తర్వాత జ్ఞానాన్ని ఇవ్వడానికి జ్ఞానసాగరుడు వస్తారు. భక్తి మార్గం వారు ఎప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు ఎందుకంటే వారందరూ దేహధారులే. శివబాబా భక్తి చేస్తారు అని అయితే అనరు. వారు ఎవరికి భక్తి చేస్తారు! దేహము లేని తండ్రి వారొక్కరే. వారు ఎవరికీ భక్తి చేయరు. మిగిలిన దేహధారులు ఎవరైతే ఉన్నారో వారందరూ భక్తి చేస్తారు ఎందుకంటే వారు రచన కదా. రచయిత అయితే ఒక్క తండ్రే. ఇకపోతే ఈ కనులతో చిత్రాలు మొదలైనవి ఏవైతే చూస్తున్నారో అవన్నీ రచనయే. ఈ విషయాలను ఘడియ-ఘడియ మర్చిపోతారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీకు అనంతమైన వారసత్వము తండ్రి ద్వారా తప్ప ఇంకే విధముగానూ లభించదు. వైకుంఠ రాజ్యాధికారము మీకు లభిస్తుంది. 5,000 సంవత్సరాల క్రితం భారత్ లో వీరి రాజ్యం ఉండేది. 2,500 సంవత్సరాలు సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజధాని నడిచింది. ఇది నిన్నటి విషయమేనని పిల్లలైన మీకే తెలుసు. ఇది బాబా తప్ప ఇంకెవ్వరూ తెలియజేయలేరు. పతిత-పావనుడు ఆ తండ్రి ఒక్కరే. అర్థం చేయించడంలో కూడా ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కోట్లాదిమందిలో ఏ కొందరో అర్థం చేసుకుంటారు అని స్వయంగా తండ్రి కూడా అంటారు. ఈ చక్రం కూడా అర్థం చేయించబడింది. ఇది మొత్తం ప్రపంచమంతటి కోసమూ ఉన్న జ్ఞానం. మెట్ల చిత్రము కూడా చాలా బాగుంది, అయినా కానీ కొందరు కోపంతో ఏదో ఒకటి గొణుక్కుంటూ ఉంటారు. బాబా అర్థం చేయించారు - వివాహాల కొరకు హాళ్ళను తయారుచేస్తూ ఉంటారు, వారికి కూడా అర్థం చేయించి దృష్టిని ఇవ్వండి. మున్ముందు అందరికీ ఈ విషయాలు నచ్చుతాయి. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. బాబా అయితే ఎవరి వద్దకూ వెళ్ళరు. భగవానువాచ - పూజారులు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ పూజ్యులు అని అనలేరు. కలియుగములో పవిత్రులు ఒక్కరు కూడా ఉండరు. పూజ్య దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపనను కూడా అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజ్యునిగా ఎవరైతే ఉన్నారో వారే చేస్తారు. అర్ధకల్పం పూజ్యులుగా, మళ్ళీ అర్ధకల్పం పూజారులుగా ఉంటారు. ఈ బాబా ఎంతోమంది గురువుల వద్దకు వెళ్ళారు. అలా గురువులను ఆశ్రయించడమనేది భక్తి మార్గమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పూజ్యులుగా తయారుచేసే సద్గురువు లభించారు. కేవలం ఒక్కరినే కాదు, వారు అందరినీ తయారుచేస్తారు. అందరి ఆత్మలు పూజ్యముగా, సతోప్రధానముగా అవుతాయి. ఇప్పుడు తమోప్రధానముగా, పూజారులుగా ఉన్నారు. ఇవి అర్థం చేసుకోవలసిన పాయింట్లు. బాబా అంటారు - కలియుగములో పవిత్రులు, పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు. అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. ఇది రావణ రాజ్యము. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా పునర్జన్మలు తీసుకుంటారు కానీ వారు పూజ్యులు, ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. పదాలు ఉపయోగిస్తారు కానీ రామ రాజ్యం ఎప్పుడు ఉంటుంది మరియు రావణ రాజ్యం ఎప్పుడు ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో ఎన్ని సభలు ఉన్నాయో చూడండి. ఫలానా సభ, ఫలానా సభ... ఎక్కడి నుండైనా ఏదైనా లభిస్తే ఇక ఒకదానిని వదిలి ఇంకొక వైపుకు వెళ్ళిపోతారు. మీరు ఈ సమయంలో పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. మళ్ళీ ఇందులో కూడా కొందరు 20 శాతం అయ్యారు, కొందరు 50 శాతం అయ్యారు. ఈ రాజధాని స్థాపన అవుతోంది అని బాబా అర్థం చేయించారు. ఇప్పుడిక పై నుండి కూడా మిగిలి ఉన్న ఆత్మలు వస్తున్నాయి. సర్కస్ లో కొందరు మంచి, మంచి నటులూ ఉంటారు, కొందరు మామూలువారు కూడా ఉంటారు. ఇది అనంతమైన విషయము. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడకు పిల్లలైన మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు, అంతేకానీ ఏదో అలా తిరగడానికి కాదు. ఎవరైనా రాతిబుద్ధి కలవారిని తీసుకువస్తే వారు ప్రాపంచిక వైబ్రేషన్లలో ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతముపై మాయపై విజయాన్ని పొందుతారు. మాయ ఘడియ-ఘడియ మీ బుద్ధిని పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా ఆకర్షిస్తారు. బాబా ఎప్పుడూ ఏ తప్పు మాటనూ మాట్లాడరు. బాబా సత్యమైనవారు కదా. ఇక్కడ మీరు సత్యమైనవారి సాంగత్యములో కూర్చున్నారు. మిగిలినవారంతా అసత్యమైన సాంగత్యములో ఉన్నారు. దానిని సత్సంగము అని అనడం కూడా పెద్ద పొరపాటే. సత్యమైనవారు ఒక్క తండ్రేనని మీకు తెలుసు. మనుష్యులు సత్యమైన పరమాత్మను పూజిస్తారు కానీ తాము ఎవరి పూజను చేస్తున్నారు అనేది వారికి తెలియదు. కావున దానిని అంధశ్రద్ధ అని అంటారు. ఆగాఖాన్ కు ఎంతమంది అనుచరులు ఉన్నారో చూడండి. వారు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారికి ఎన్నో కానుకలు లభిస్తాయి. వారిని వజ్రాలతో తూకం వేస్తారు. వాస్తవానికి ఎవరినీ వజ్రాలతో తూకం వేయలేరు. సత్యయుగములో వజ్ర-వైఢూర్యాలు అనేవి మీ కొరకు రాళ్ళ సమానమైనవి, వాటిని మీరు ఇళ్ళకు పొదుగుతారు. ఇక్కడ వజ్రాలను దానంగా పొందేవారు ఎవరూ లేరు. మనుష్యుల వద్ద ఎంతో ధనము ఉంది కావుననే దానం చేస్తారు. కానీ ఆ దానాన్ని పాపాత్ములకు చేసిన కారణముగా ఆ దానమును ఇచ్చేవారికి కూడా పాపం వస్తుంది. అజామిళ్ వంటి పాపాత్ములుగా అయిపోతారు. ఇక్కడ భగవంతుడు కూర్చొని అర్థం చేయిస్తారు, అంతేకానీ మనుష్యులు కాదు, అందుకే బాబా అన్నారు - మీ చిత్రాలేవైతే ఉన్నాయో వాటిపై ఎల్లప్పుడూ భగవానువాచ అని వ్రాయబడి ఉండాలి. ఎల్లప్పుడూ త్రిమూర్తి శివ భగవానువాచ అని వ్రాయండి. కేవలం భగవాన్ అని అనడం వల్ల కూడా మనుష్యులు తికమకపడతారు. భగవంతుడు నిరాకారుడు, అందుకే త్రిమూర్తి అని తప్పకుండా వ్రాయాలి. అందులో కేవలం శివబాబా లేరు. బ్రహ్మా, విష్ణు, శంకర్, మూడు పేర్లూ ఉన్నాయి. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు, మళ్ళీ వారినే గురువు అని కూడా అంటారు. శివ-శంకరులు ఒక్కరే అని అనేస్తారు. ఇప్పుడు ఆ శంకరుడు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు. అమరకథ కూడా ఉంది. మీరందరూ పార్వతులు. తండ్రి పిల్లలైన మీ అందరినీ ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు. భక్తి ఫలాన్ని భగవంతుడే ఇస్తారు. ఒక్క శివబాబాయే ఉన్నారు. ఈశ్వరుడు, భగవంతుడు అని కూడా కాదు. శివబాబా అన్న పదము చాలా మధురమైనది. మధురమైన పిల్లలూ అని తండ్రి స్వయంగా అంటారు, కావున వారు బాబా అయ్యారు కదా.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆత్మలలోనే సంస్కారాలు నిండుతాయి. ఆత్మ నిర్లేపి కాదు. నిర్ణేపి అయినట్లయితే పతితముగా ఎందుకు అవుతుంది! తప్పకుండా కర్మల ప్రభావం పడుతుంది, అందుకే పతితముగా అవుతుంది. భ్రష్టాచారులు అని కూడా అంటారు. దేవతలు శ్రేష్ఠాచారులు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము అని వారి మహిమ పాడుతారు, అందుకే స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. ఇప్పుడు తండ్రి కూర్చొని మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు. గురునానక్ కూడా గ్రంథ్ లో మహిమ చేసారు. సిక్కులు సత్ శ్రీ అకాల్ అని అంటారు. అకాలమూర్తి ఎవరైతే ఉన్నారో, వారే సత్యమైన సద్గురువు. అందుకే వారొక్కరినే విశ్వసించాలి. చెప్తుంది ఒకటి, చేస్తుంది ఇంకొకటి. వారికి దాని అర్థమేమీ తెలియదు. ఇప్పుడు సద్గురువు, అకాలమూర్తి అయిన తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. సమ్ముఖముగా కూర్చున్నా కానీ ఏమీ అర్థం చేసుకోరు. కొందరు ఇక్కడి నుండి వెళ్ళగానే సమాప్తమైపోతారు. పిల్లలూ, ఎప్పుడూ ప్రాపంచిక పరచింతన విషయాలను వినకండి అంటూ బాబా వద్దని చెప్తున్నారు. కొందరైతే ఎంతో సంతోషముగా ఇటువంటి విషయాలను వింటారు మరియు వినిపిస్తారు. బాబా మహావాక్యాలను మర్చిపోతారు. వాస్తవానికి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తమ సేవా డ్యూటీని పూర్తి చేసుకుని ఇక తమ ఆనందములో నిమగ్నమై ఉంటారు. శ్రీకృష్ణునికి మరియు క్రిస్టియన్లకు చాలా మంచి సంబంధం ఉంది అని బాబా అర్థం చేయించారు. శ్రీకృష్ణుని రాజ్యం ఉంటుంది కదా. లక్ష్మీ-నారాయణ అన్న పేర్లు తర్వాత వస్తాయి. వైకుంఠం అని అన్నప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు గుర్తుకువస్తారు, లక్ష్మీ-నారాయణులు గుర్తుకు రారు, ఎందుకంటే శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడు. చిన్న పిల్లలు పవిత్రముగా ఉంటారు. పిల్లలు ఏ విధముగా జన్మ తీసుకుంటారు అనేది కూడా మీరు సాక్షాత్కారములో చూసారు. నర్సు నిలబడి ఉంటారు, వెంటనే ఎత్తుకొని సంభాళిస్తారు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము... ఇలా వేర్వేరు పాత్రలు అభినయిస్తారు, ఏది జరిగినా అది డ్రామాయే. ఇందులో సంకల్పం ఏమీ నడవదు. ఇది డ్రామాగా రచింపబడి ఉంది కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా నా పాత్ర కూడా నడుస్తోంది. మాయ ప్రవేశము కూడా జరుగుతుంది మరియు తండ్రి ప్రవేశము కూడా జరుగుతుంది. కొందరు తండ్రి మతముపై నడుస్తారు, కొందరు రావణుని మతముపై నడుస్తారు. రావణుడు ఎటువంటివాడు? అతడిని ఎప్పుడైనా చూసారా? కేవలం చిత్రాన్నే చూస్తారు. శివబాబాకైతే ఈ రూపము ఉంది, రావణునికి రూపమేమిటి! పంచ వికారాల రూపీ భూతాలు ఎప్పుడైతే వచ్చి ప్రవేశిస్తాయో అప్పుడు రావణుడు అని అంటారు. ఇది భూతాల ప్రపంచము, అసురుల ప్రపంచము, మన ఆత్మ ఇప్పుడు బాగుపడుతోందని మీకు తెలుసు. ఇక్కడ శరీరము కూడా అసురీగానే ఉంది. ఆత్మ బాగవుతూ, బాగవుతూ పావనమైపోతుంది. అప్పుడిక ఈ శరీరాన్ని వదిలేస్తారు. ఇక మీకు సతోప్రధానమైన శరీరము లభిస్తుంది. కాంచన కాయ లభిస్తుంది. అదీ ఎప్పుడైతే ఆత్మ కూడా కాంచనముగా అవుతుందో అప్పుడే లభిస్తుంది. బంగారము మేలిమిగా ఉంటే నగలు కూడా మేలిమిగా అవుతాయి. బంగారములో లోహాన్ని కూడా కలుపుతారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆదిమధ్యాంతాల జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. మనుష్యులకు ఏమీ తెలియదు. ఋషులు, మునులు అందరూ నేతి, నేతి (తెలియదు, తెలియదు) అనే అంటారు. మనమంటాము - ఈ లక్ష్మీ-నారాయణులను అడిగినా సరే, వారు కూడా తెలియదు, తెలియదు అనే అంటారు కానీ వారిని అడుగడం జరుగదు. ఎవరు అడుగుతారు? గురువులనే అడుగడం జరుగుతుంది. మీరు వారిని ఈ ప్రశ్న అడుగవచ్చు. మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీ గొంతు పాడైపోతుంది. పిల్లలెవరైతే అర్థం చేసుకున్నారో బాబా వారికే వినిపిస్తారు కదా. అంతేకానీ మిగిలినవారి వెనుక వ్యర్థంగా ఎందుకు కష్టపడతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవా డ్యూటీని పూర్తి చేసి ఇక మీ ఆనందంలో నిమగ్నమై ఉండాలి. వ్యర్థమైన విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఒక్క తండ్రి మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి. వాటిని మర్చిపోకూడదు.

2. సదా సంతోషముగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అనగా ఆ జ్ఞానం యొక్క స్మరణయే జరుగుతూ ఉండాలి. ఏ విషయములోనూ సంకల్పాలు నడవకూడదు, దాని కొరకు డ్రామాను మంచి రీతిలో అర్థం చేసుకుని పాత్రను అభినయించాలి.

వరదానము:-

‘నేను’ అన్నదానిని ‘‘బాబా’’ లో ఇముడ్చే నిరంతర యోగీ, సహజయోగీ భవ

ఏ పిల్లలకైతే తండ్రిపై ప్రతి శ్వాసలోనూ ప్రేమ ఉంటుందో, ప్రతి శ్వాసలోనూ బాబా-బాబా అని ఉంటుందో, వారికి యోగములో శ్రమించాల్సిన అవసరము ఉండదు. స్మృతికి ఋజువు ఏమిటంటే - ఎప్పుడూ నోటి నుండి ‘‘నేను’’ అన్న మాట వెలువడదు, ‘‘బాబా-బాబా’’ అనే వెలువడుతుంది. ‘‘నేను’’ అన్నది బాబాలో ఇమిడిపోవాలి. బాబా బ్యాక్ బోన్ (వెన్నుముక) గా ఉన్నారు, బాబా చేయించారు, బాబా సదా తోడుగా ఉన్నారు, మీతోనే ఉండాలి, తినాలి, నడవాలి, తిరగాలి... ఇవి ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉండాలి, అప్పుడే సహజయోగీ అని అంటారు.

స్లోగన్:-

నేను-నేను అని అనటం అనగా మాయా రూపీ పిల్లిని ఆహ్వానించటము, బాబా-బాబా అని అన్నట్లయితే మాయ పారిపోతుంది.