11-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 24-02-98


బాబా పట్ల, సేవ పట్ల మరియు పరివారము పట్ల ప్రేమను ఉంచినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు

ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లలు తమ తండ్రి జయంతిని జరుపుకోవటానికి వచ్చారు. సమ్ముఖంలో కూర్చుని ఉన్నా, ఆకారీ రూపములో ఉన్నా బాబా ఎదురుగా ఉన్నారు. బాబా పిల్లలందరినీ చూస్తున్నారు - ఒకవైపేమో మిలనాన్ని జరుపుకుంటున్న సంతోషము ఉంది, మరొకవైపు త్వరత్వరగా బాప్ దాదాను ప్రత్యక్షము చెయ్యాలి అన్న సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ వారికి కోటాను రెట్ల అభినందనలను తెలియజేస్తున్నారు. ఏ విధంగా పిల్లలు తండ్రి జయంతిని జరపడానికి మూలమూలల నుండి, దూరదూరాల నుండి వచ్చారో, అదే విధంగా బాప్ దాదా కూడా పిల్లల జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. అందరికంటే దూరదేశము వారు ఎవరు? బాబానా లేక మీరా? మీరు అంటారు - మేము చాలా దూరము నుండి వచ్చాము, కానీ బాబా అంటారు - నేను మీకంటే కూడా దూరదేశము నుండి వచ్చాను. కానీ రావటానికి మీకైతే సమయము పడుతుంది, బాబాకు సమయము పట్టదు. మీరందరూ విమానమునో, ట్రైన్ నో అందుకోవాల్సి ఉంటుంది, బాబాకైతే కేవలము రథాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం మీరు మాత్రమే బాబా జన్మదినాన్ని జరపడానికి రాలేదు, కానీ బాబా కూడా ఆదిలోని సహచరులైన బ్రాహ్మణ ఆత్మలు, జన్మ సహచరులైన పిల్లల జన్మదినాన్ని జరపడానికి వచ్చారు ఎందుకంటే బాబా ఒంటరిగా అవతరించరు, కానీ బ్రహ్మా, బ్రాహ్మణ పిల్లలతోపాటు దివ్య జన్మను తీసుకుంటారు అనగా అవతరిస్తారు. బ్రాహ్మణులు లేకుండా బాబా ఒంటరిగా యజ్ఞాన్ని రచించలేరు. కనుక యజ్ఞాన్ని రచించారు, బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచించారు, అప్పుడు మీరందరూ జన్మించారు. కనుక రెండు సంవత్సరాల వారైనా లేక రెండు నెలల వారైనా కానీ మీ అందరికీ దివ్య బ్రాహ్మణ జన్మకు శుభాకాంక్షలు. ఈ దివ్య జన్మ ఎంతటి శ్రేష్ఠమైనది. బాబా కూడా దివ్య జన్మధారీ బ్రాహ్మణ ఆత్మల ప్రతి ఒక్కరి భాగ్యపు సితార మెరుస్తూ ఉండటాన్ని చూసి హర్షిస్తారు. మరియు సదా ఇదే పాటను పాడుతూ ఉంటారు - వాహ్, వజ్రతుల్య జీవితము కల బ్రాహ్మణ పిల్లలూ, వాహ్. మీరు వాహ్, వాహ్ పిల్లలు కదా? బాబా వాహ్, వాహ్ పిల్లలుగా తయారుచేసారు. ఈ అలౌకిక జన్మ బాబాది కూడా అతీతమైనది మరియు పిల్లలైన మీది కూడా అతీతమైనది మరియు ప్రియమైనది. ఇటువంటి జన్మ లేక జయంతి కేవలం బాబా ఒక్కరికే మాత్రమే ఉంటుంది, మరెవ్వరికీ ఇటువంటి జన్మదినం జరగలేదు, జరగబోదు. వారు నిరాకారుడు, కానీ మళ్ళీ దివ్య జన్మ కలవారు. ఇతర ఆత్మలందరి జన్మ తమ-తమ సాకార శరీరము ద్వారా జరుగుతుంది, కానీ నిరాకార బాబా యొక్క జన్మ పరకాయ ప్రవేశము ద్వారా జరుగుతుంది. మొత్తము కల్పములో ఈ విధంగా ఇటువంటి విధితో ఎవరి జన్మ అయినా జరిగిందా? ఒక్క బాబాకు మాత్రమే ఇటువంటి అతీతమైన జన్మదినం ఉంటుంది, దీనినే శివ జయంతి రూపములో భక్తులు కూడా జరుపుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ దివ్య జన్మ మహత్వము గురించి మీకు తెలుసు, భక్తులకు తెలియదు, కానీ వారు ఏదైతే విన్నారో, దాని అనుసారంగా దీనిని ఉన్నతోన్నతమైనదిగా భావించి జరుపుకుంటూ వస్తున్నారు. పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాకుండా జరుపుకోవడంతోపాటు స్వయాన్ని బాబా సమానంగా తయారుచేసుకుంటారు కూడా. మీకు అలౌకిక దివ్య జన్మ యొక్క మహత్వము గురించి తెలుసు. మరెవ్వరికీ కూడా తండ్రితోపాటుగా పిల్లల జన్మ జరగదు, కానీ శివజయంతి అనగా బాబా యొక్క దివ్య జన్మతోపాటు పిల్లల యొక్క జన్మ కూడా జరిగింది, అందుకే డైమండ్ జూబ్లీని జరుపుకున్నారు కదా. కావున తండ్రితో పాటు పిల్లలది కూడా దివ్య జన్మ. కేవలం ఈ జయంతిని వజ్రతుల్యమైన జయంతి అని అంటారు, అంతేకాక వజ్రతుల్యమైన జయంతిని జరుపుకోవడంతో పాటు స్వయం కూడా వజ్రతుల్యమైన జీవితంలోకి వచ్చేస్తారు. ఈ రహస్యం గురించి పిల్లలందరికీ బాగా తెలుసు కూడా మరియు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. పిల్లలు తండ్రి యొక్క దివ్య జన్మ మహత్వాన్ని ఎంత ఉల్లాస-ఉత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు అన్న సమాచారాన్ని బాప్ దాదా వింటూ ఉంటారు మరియు చూస్తూ ఉంటారు కూడా. బాప్ దాదా నలువైపులా ఉన్న సేవాధారీ పిల్లలకు ధైర్యానికి రిటర్న్ లో సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ధైర్యము పిల్లలది మరియు సహాయము తండ్రిది.

ఈ రోజుల్లో బాప్ దాదా వద్దకు పిల్లలందరి ఒక స్నేహ సంకల్పము పదే-పదే చేరుకుంటూ ఉంది, అదేమిటంటే - ఇప్పుడు బాబా సమానంగా త్వరత్వరగా అవ్వాల్సిందే. బాబా కూడా అంటారు - ఓ మధురమైన పిల్లలూ, అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరికీ ఈ దృఢ నిశ్చయము ఉంది మరియు ఇంకా అండర్ లైన్ చెయ్యండి - మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు. మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము మరియు మేమే ప్రతి కల్పములో అలా అవుతూ ఉంటాము. ఈ విషయంలో పక్కా నిశ్చయము ఉంది కదా?

డబుల్ విదేశీయులు కూడా శివ జయంతిని జరుపుకోవడానికి వచ్చారా? మంచిది, డబుల్ విదేశీయులు చేతులెత్తండి. బాప్ దాదా చూస్తున్నారు - డబుల్ విదేశీయులకు విశ్వంలోని ఏ మూల ఉండిపోకూడదు అన్న ఉల్లాస-ఉత్సాహమే అన్నింటికన్నా ఎక్కువ ఉంది. భారత్ కైతే సేవ కొరకు చాలా సమయము లభించింది మరియు భారత్ కూడా పల్లె-పల్లెలో సందేశాన్ని ఇచ్చింది, కానీ డబుల్ విదేశీయులకు భారత్ తో పోలిస్తే సేవా సమయం తక్కువ లభించింది. అయినా కూడా ఉల్లాస-ఉత్సాహాల కారణంగా బాప్ దాదా ఎదురుగా సేవా ఋజువును మంచిగా తీసుకువచ్చారు మరియు తీసుకొస్తూ ఉంటారు. భారత్ లో వర్తమాన సమయములో వర్గీకరణ సేవలు ఏవైతే ప్రారంభమయ్యాయో, వాటి కారణంగా కూడా అన్ని వర్గాలకు సందేశము లభించటము సహజమయ్యింది ఎందుకంటే ప్రతి వర్గము తమ వర్గములో ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు, కనుక ఈ వర్గీకరణ ఆవిష్కారము మంచిగా ఉంది. దీని వలన భారత్ లోని సేవలలో భాగంగా విశేష ఆత్మలు రావటము మంచి ఆకర్షణగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది కదా! వర్గీకరణ సేవ మంచిగా అనిపిస్తుందా? విదేశాల వారు కూడా తమ మంచి-మంచి గ్రూపులను తీసుకువస్తారు, రిట్రీట్ చేయిస్తారు, ఈ విధంగా మంచి పద్ధతిని పెట్టుకున్నారు. ఏ విధంగానైతే భారత్ లో వర్గీకరణ ద్వారా సేవలో అవకాశము లభించిందో, అలాగే వీరి ఈ విధి కూడా చాలా బాగుంది. బాప్ దాదాకు ఈ రెండు వైపుల సేవలు ఇష్టము, బాగున్నాయి. జగదీష్ బిడ్డ మంచి ఆవిష్కరణను చేసారు. విదేశాలలో ఈ రిట్రీట్ లను, డైలాగ్ లను ఎవరు ప్రారంభించారు? (అందరూ కలిసి చేసారు) భారత్ లో కూడా కలిసి చేసారు, అయినప్పటికీ వారు నిమిత్తము అయ్యారు. మంచిది, ప్రతి ఒక్కరికీ తమ సమానమైనవారి సంగఠనలో ఉండటము మంచిగా అనిపిస్తుంది. కనుక రెండు వైపుల ఉన్న సేవలలో అనేక ఆత్మలను సమీపంగా తీసుకువచ్చేందుకు అవకాశము లభిస్తుంది. రిజల్టు మంచిగా అనిపిస్తుంది కదా? రిట్రీట్ రిజల్టు మంచిగా ఉందా? వర్గీకరణ రిజల్టు కూడా మంచిగా ఉంది, దేశ-విదేశాల వారు ఏదో ఒక కొత్త ఆవిష్కరణను చేస్తూ ఉంటారు మరియు మున్ముందు కూడా చేస్తారు. భారత్ లోనైనా, విదేశాలలోనైనా సేవల ఉల్లాసము మంచిగా ఉంది. బాప్ దాదా చూస్తున్నారు - ఎవరైతే సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్తూ ఉంటారో, వారి ఖాతాలో పుణ్య ఖాతా చాలా బాగా జమ అవుతూ ఉంటుంది. చాలా మంది పిల్లలకు - ఒకటేమో తమ పురుషార్థపు ప్రారబ్ధము యొక్క ఖాతా, రెండవది సంతుష్టంగా ఉంటూ సంతుష్టం చెయ్యటం ద్వారా ఆశీర్వాదాల ఖాతా మరియు మూడవది యథార్థ యోగయుక్త, యుక్తియుక్తమైన సేవకు రిటర్నులో పుణ్య ఖాతా జమ అవుతుంది. ప్రతి ఒక్కరి ఈ మూడు ఖాతాలను బాప్ దాదా చూస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా ఈ మూడు ఖాతాలలోనూ జమ అయినట్లయితే దానికి గుర్తు ఏమిటంటే - వారు సదా సహజ పురుషార్థులుగా స్వయం కూడా అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా ఆ ఆత్మ నుండి సహజ పురుషార్థము యొక్క ప్రేరణ స్వతహాగా లభిస్తుంది. వారు సహజ పురుషార్థానికి సింబల్ (గుర్తు). శ్రమ చెయ్యాల్సిన అవసరము ఉండదు, బాబా పట్ల, సేవ పట్ల మరియు పరివారం అందరి పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఈ మూడు రకాల ప్రేమ, శ్రమ నుండి విముక్తులుగా చేస్తుంది.

బాప్ దాదా పిల్లలందరి పట్ల ఏ శ్రేష్ఠమైన ఆశను పెట్టుకుంటారంటే - పిల్లలందరూ సహజ పురుషార్థులుగా సదా ఉండాలి. 63 జన్మలు భక్తిలో, చిక్కులలో భ్రమించే శ్రమ చేసారు, ఇప్పుడు ఈ ఒక్క జన్మయే శ్రమ నుండి విముక్తులుగా అయ్యే జన్మ. ఒకవేళ చాలాకాలం నుండి శ్రమిస్తూనే ఉన్నట్లయితే ప్రేమ ద్వారా సహజ పురుషార్థీ అన్న ఈ సంగమయుగ వరదానాన్ని ఎప్పుడు తీసుకుంటారు? యుగము సమాప్తమైతే వరదానము కూడా సమాప్తమైపోతుంది. కనుక సదా కొరకు ఈ వరదానాన్ని త్వరత్వరగా తీసేసుకోండి. అత్యంత పెద్ద కార్యమైనా, అత్యంత పెద్ద సమస్య అయినా కానీ ప్రతి కార్యాన్ని, ప్రతి సమస్యను ఎలా దాటి వేయాలంటే వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా అని మీరు అంటుంటారు కదా. బాప్ దాదా చాలామంది పిల్లల ఆటను చూస్తారు, నవ్వుకుంటారు కూడా మరియు పిల్లలను చూసి జాలి పడతారు కూడా. ఎప్పుడైనా ఏదైనా సమస్య లేక ఏదైనా పెద్ద కార్యము ఎదురుగా వస్తే అప్పుడప్పుడు పిల్లల ముఖంపై కొద్దిగా ఆ సమస్య లేక కార్యం యొక్క అల కనిపిస్తుంది. ముఖం కొద్దిగా మారిపోతుంది. అప్పుడు ఎవరైనా - ఏమైంది అని అడిగితే, పని చాలా ఉంది కదా అని అంటారు! విఘ్న వినాశకుల ఎదురుగా విఘ్నాలు రాకపోతే విఘ్న వినాశకులు అన్న టైటిల్ ను ఎలా మహిమ చెయ్యగలరు? ముఖంపై కొద్దిగా అలసట లేక కొద్దిగా మూడ్ మారిన గుర్తులు రాకూడదు. ఎందుకు? అర్ధకల్పము పూజింపబడే మీ జడ చిత్రాలలో ఎప్పుడైనా కొద్దిగా అలసట కానీ లేక మూడ్ మారిన గుర్తులు కానీ కనిపిస్తాయా? మీ జడ చిత్రాలు సదా నవ్వుతూ ఉంటాయి కదా, మరి అవి ఎవరి చిత్రాలు? మీవే కదా? అవి చైతన్యమైనవారి యొక్క స్మృతిచిహ్న చిత్రాలే, అందుకే కొద్దిగా అలసట కానీ, లేక చికాకు పడటము అని మీరంటారు కదా, అవి రాకూడదు. సదా చిరునవ్వుతో ఉన్న ముఖము బాప్ దాదాకు మరియు అందరికీ ఇష్టమనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చికాకు-చికాకుగా ఉంటే వారి ఎదురుగా వెళ్తారా? ఇప్పుడు చెప్పాలా, వద్దా అని ఆలోచిస్తారు. మీ జడ చిత్రాల వద్దకు భక్తులు చాలా ఉల్లాసంతో వస్తారు, మరి చైతన్యములో ఎవరైనా భారీతనంతో ఉంటే మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరి ముఖముపై సదా ఫరిశ్తా రూపాన్ని, వరదానీ రూపాన్ని, దాతా రూపాన్ని, దయార్ద్ర హృదయ రూపాన్ని, అలసట లేని రూపాన్ని, సహజయోగీ మరియు సహజ పురుషార్థీ రూపాన్ని చూడాలనుకుంటున్నారు. విషయమే అటువంటిది కదా అని అనకండి. విషయం ఎటువంటిదైనా కానీ రూపము చిరునవ్వుతో కూడినదిగా, శీతలంగా ఉండాలి, గంభీరత మరియు రమణీకత, ఈ రెండింటి బ్యాలెన్స్ కలదిగా ఉండాలి. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే, మరియు ఆ సమయంలో మీరు సమస్య కారణంగానో లేక కార్యం కారణంగానో సహజ పురుషార్థీ రూపంలో లేకపోతే వారు ఏం చూస్తారు? మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్నే వారు తీసుకుంటారు. ఏ సమయములోనైనా, ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి మీ ముఖచిత్రాన్ని తీసుకున్నట్లయితే వారు ఒక నెలవారైనా, రెండు నెలలవారైనా సరే బాప్ దాదా వినిపించినట్లుగా మీ ముఖచిత్రము ఉండాలి. దాతగా అవ్వండి. తీసుకునేవారిగా కాదు, దాతగా అవ్వాలి. ఎవరు ఏమిచ్చినా కానీ, మంచి ఇచ్చినా లేక చెడు ఇచ్చినా కానీ, మీరు అత్యంత పెద్ద తండ్రికి పిల్లలు, పెద్ద మనసు కలవారు, ఒకవేళ చెడును ఇచ్చినా కూడా మీరు పెద్ద మనసుతో ఆ చెడును మీలోకి స్వీకరించకుండా దాతగా అయ్యి మీరు వారికి సహయోగాన్ని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా వారికి కానుకగా ఇవ్వండి. ఇంత పెద్ద మనసు కల అత్యంత పెద్ద తండ్రి పిల్లలు మీరు. దయ చూపండి. మనసులో ఆ ఆత్మ పట్ల ఇంకా ఎక్కువ స్నేహాన్ని ఇమర్జ్ చేయండి. మీ ఈ స్నేహ శక్తి ద్వారా వారు స్వయం పరివర్తన అయిపోవాలి. ఇటువంటి పెద్ద మనసు కలవారా లేక చిన్న మనసు కలవారా? ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగరంలో ఎంత చెత్త వేస్తారు, కానీ ఆ వేసినవారికి సాగరము తిరిగి చెత్తను ఇవ్వదు. మీరైతే జ్ఞాన సాగరుడు, శక్తుల సాగరుడు అయిన తండ్రి పిల్లలు, మాస్టర్లు.

మరి బాప్ దాదా ఏం చూడాలని కోరుకుంటున్నారో విన్నారా? ఈ సంవత్సరములో పరివర్తన అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని మెజారిటీ పిల్లలు పెట్టుకున్నారు. చేస్తాములే, ఆలోచిస్తాములే అని కాదు. చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందేనా లేక అక్కడకు వెళ్ళి ఆలోచిస్తారా? చెయ్యాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి (అందరూ చేతులూపారు) చాలా మంచిది. కేవలం ఈ చేతిని ఎత్తటము కాదు, మనసుతో దృఢ సంకల్పమనే చేతిని ఎత్తండి. ఈ చేతిని ఎత్తటమైతే సహజమే. మనస్సుతో దృఢ సంకల్పమనే చెయ్యి సదా సఫలతా స్వరూపులుగా చేస్తుంది. ఏదైతే ఆలోచించారో, అలా అవ్వాల్సిందే. పాజిటివ్ యే ఆలోచిస్తారు కదా! నెగెటివ్ అయితే అలోచించకూడదు. నెగెటివ్ ఆలోచించే దారి సదా కొరకు మూసివేయబడాలి. మూసివేయడం వస్తుందా లేక మళ్ళీ తెరుచుకుంటుందా? ఇప్పుడు తుఫాను వచ్చింది కదా, అప్పుడు తలుపులు వాటికవే తెరుచుకున్నాయి, అలా అయితే జరగదు కదా? తలుపులు మూసి వచ్చాము కదా అని మీరనుకుంటారు. కానీ తుఫాను వాటిని తెరిచే విధంగా అలా ఢీలాగా వెయ్యవద్దు. అచ్ఛా.

డబుల్ విదేశీయుల ఉత్సవము మంచిగా జరిగింది కదా! (10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయము నుండి జ్ఞానంలో నడుస్తున్న సుమారు 400 మంది డబుల్ విదేశీ సోదరీ-సోదరుల సన్మాన సమారోహము జరిగింది) మంచిగా అనిపించిందా? ఎవరైతే జరుపుకున్నారో మరియు మంచిగా అనిపించిందో వారు చేతులెత్తండి. పాండవులు కూడా ఉన్నారు. దీని మహత్వము ఏమిటి? జరుపుకోవడం యొక్క మహత్వము ఏమిటి? జరుపుకోవడము అనగా తయారవ్వడము. సదా ఇటువంటి కిరీటధారులు, స్వ పురుషార్థము మరియు సేవ యొక్క బాధ్యతే అనాలా, ఆనందమే అనాలా, సేవల ఆనందాన్ని జరుపుకునే కిరీటాన్ని సదా ధరించి ఉండాలి. మరియు బంగారు చున్నీ కూడా అందరూ వేసుకున్నారు కదా! మరి బంగారు చున్నీని ఎందుకు వేసారు? సదా బంగారు యుగ స్థితి, వెండి కాదు, బంగారు యుగ స్థితి. అంతేకాక రెండు-రెండు హారాలను కూడా వేసుకున్నారు. ఏ రెండు హారాలను వేసుకుంటారు? ఒకటేమో సదా బాబా మెడలోని హారము. అది సదా ఉండాలి, ఎప్పుడూ మెడలో నుండి తియ్యవద్దు. మెడలోనే వేసుకుని ఉండాలి. మరియు రెండవది, సదా సేవ ద్వారా ఇతరులను కూడా బాబా మెడలోని హారంగా తయారుచెయ్యటము, ఇవి రెండు హారాలు. జరుపుకునేవారికి కూడా చాలా మంచిగా అనిపించింది మరియు చూసేవారికి కూడా చాలా మంచిగా అనిపించింది. కనుక ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న సదాకాలికమైన ఉత్సవము యొక్క రహస్యాన్ని తెలియజేసారు. అంతేకాక జరుపుకోవడం అనగా ఉల్లాస-ఉత్సాహాలను పెంచుకోవటము. అందరి అనుభవాలను బాప్ దాదా అయితే చూసారు. మంచి అనుభవాలు ఉన్నాయి. సంతోషము మరియు నషా అందరి ముఖాలలోనూ కనిపిస్తూ ఉంది. అంతే, ఇలాగే మీ శక్తిశాలి, చిరునవ్వుతో ఉన్న రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని సదా ఇమర్జ్ గా ఉంచుకుంటూ వెళ్ళండి ఎందుకంటే నేటి సమయంలోని పరిస్థితుల అనుసారంగా ఎక్కువ వినేవారు, అర్థం చేసుకునేవారు తక్కువ ఉన్నారు, చూసి అనుభవం చేసేవారు ఎక్కువ ఉన్నారు. మీ ముఖంలో బాబా పరిచయము వినిపించేందుకు బదులుగా కనిపించాలి. బాగా చేసారు. బాప్ దాదా కూడా చూసి-చూసి హర్షిస్తున్నారు. ఈ సంవత్సరమును లేక ఈ సీజన్ ను విశేషంగా ఉత్సవాల సీజన్ గా జరుపుకున్నారు. అన్ని వేళలా ఒకేలా ఉండదు.

(డ్రిల్) అందరిలో రూలింగ్ పవర్ (పరిపాలన శక్తి) ఉందా? కర్మేంద్రియాలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిపాలన చెయ్యగలరా? స్వరాజ్య అధికారులుగా అయ్యారా? ఎవరైతే స్వరాజ్య అధికారులో, వారే విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎటువంటి వాతావరణంలోనైనా ఒకవేళ మనసు-బుద్ధికి స్టాప్ అని ఆర్డర్ ఇస్తే అవి స్టాప్ అవుతాయా లేక సమయం పడుతుందా? ఈ అభ్యాసాన్ని పతి ఒక్కరూ మొత్తం రోజంతటిలో మధ్యమధ్యలో తప్పకుండా చెయ్యాలి. మరియు ప్రయత్నించండి, ఏ సమయంలోనైతే మనసు-బుద్ధి చాలా బిజీగా ఉంటాయో, అటువంటి సమయములో కూడా ఒకవేళ ఒక్క క్షణం కొరకు వాటిని స్టాప్ చెయ్యాలనుకుంటే స్టాప్ చెయ్యగలరా? స్టాప్ అవ్వాలని ఆలోచించారు కానీ స్టాప్ అవ్వటానికి 3 నిమిషాలు, 5 నిమిషాలు పట్టకూడదు. ఈ అభ్యాసము అంతిమములో చాలా పనికొస్తుంది. ఈ ఆధారంతోనే పాస్ విత్ ఆనర్లుగా అవ్వగలుగుతారు. అచ్ఛా!

సదా మనసు యొక్క ఉల్లాస-ఉత్సాహాల ఉత్సవాన్ని జరుపుకునే స్నేహీ ఆత్మలు, సదా వజ్రతుల్యమైన జీవితాన్ని అనుభవము చేసేవారు, అనుభవమనే అథారిటీ కల విశేష ఆత్మలు, సదా తమ ముఖము ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తూ బాబాను ప్రత్యక్షము చేసే సేవాధారీ ఆత్మలు, సదా గంభీరత మరియు రమణీకత రెండింటి బ్యాలెన్సును ఉంచుతూ అందరి బ్లెస్సింగ్స్ కు అధికారీ ఆత్మలు, నలువైపులా దేశ-విదేశాలలో ఉన్న ఇటువంటి పిల్లలకు శివరాత్రి యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అలాగే బాప్ దాదా యొక్క, మనోభిరాముని యొక్క మనస్ఫూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

తమ రాజ్యాధికారీ మరియు పూజ్య స్వరూపపు స్మృతితో దాతగా అయ్యి ఇచ్చేటువంటి సర్వ ఖజానాలతో సంపన్న భవ

సదా ఇదే స్మృతిలో ఉండండి - పూజ్య ఆత్మనైన నేను ఇతరులకు ఇచ్చే దాతను, తీసుకునేవారిని కాను, దేవతను. ఏ విధంగా బాబా మీ అందరికీ తమంతట తామే ఇచ్చారో, అదే విధంగా మీరు కూడా మాస్టర్ దాతలుగా అయ్యి ఇస్తూ వెళ్ళండి, అడగకండి. మీ రాజ్యాధికారీ మరియు పూజ్య స్వరూపపు స్మృతిలో ఉండండి. ఈ రోజు వరకు మీ జడ చిత్రాల వద్దకు వెళ్ళి అడుగుతూ ఉంటారు, మమ్మల్ని రక్షించండి అని అంటారు. కనుక మీరు రక్షించేవారు, అంతేకానీ రక్షించండి-రక్షించండి అని అడిగేవారు కారు. కానీ దాతగా అయ్యేందుకు స్మృతి ద్వారా, సేవ ద్వారా, శుభభావన, శుభకామనల ద్వారా సర్వ ఖజానాలలో సంపన్నులుగా అవ్వండి.

స్లోగన్:-

నడవడిక మరియు ముఖములోని ప్రసన్నతయే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు.