11-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది తయారై-తయారుచేయబడిన నాటకము, ఈ నాటకము నుండి ఒక్క ఆత్మ కూడా విముక్తి అవ్వలేదు, మోక్షము ఎవ్వరికీ లభించదు’’

ప్రశ్న:-

ఉన్నతోన్నతుడైన, పతిత-పావనుడైన తండ్రి భోళానాథుడు, అది ఎలా?

జవాబు:-

పిల్లలైన మీరు వారికి పిడికెడు బియ్యాన్ని ఇచ్చి మహళ్ళను తీసుకుంటారు, అందుకే తండ్రిని భోళానాథుడు అని అంటారు. మీరు - శివబాబా మా కొడుకు అని అంటారు, ఆ కొడుకు ఎటువంటివారంటే, వారు ఎప్పుడూ ఏమీ తీసుకోరు, ఎల్లప్పుడూ ఇస్తారు. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలాన్ని పొందుతారని భక్తిలో అంటారు. కానీ భక్తిలోనైతే అల్పకాలికమైనది లభిస్తుంది. జ్ఞానంలో అర్థం చేసుకుని చేస్తారు, అందుకే సదాకాలికమైనది లభిస్తుంది.

ఓంశాంతి

ఆత్మిక పిల్లలతో ఆత్మిక తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు లేక ఆత్మిక తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని అనడం జరుగుతుంది. మీరు అనంతమైన తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు, అందుకే బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. ఇది ఆత్మల కొరకు పరమాత్మ ఇచ్చే జ్ఞానం. ఇది సాలిగ్రామాల కొరకు భగవానువాచ. ఆత్మలే వినవలసి ఉంటుంది, అందుకే ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు. ఈ పురుషోత్తమ సంగమయుగములోనే తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. ఆత్మాభిమానులకు మరియు దేహాభిమానులకు మధ్యన తేడాను మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మయే శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుందని తండ్రే అర్థం చేయించారు. చదివేది ఆత్మ, శరీరము కాదు. కానీ దేహాభిమానమున్న కారణంగా ఫలానావారు చదివిస్తున్నారు అని భావిస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివించేవారు ఆ నిరాకారుడే. వారి పేరు శివ. శివబాబాకు తమ శరీరము ఉండదు. మిగిలినవారంతా ఇది నా శరీరము అని అంటారు. ఈ విధంగా ఎవరన్నారు? ఇది నా శరీరము అని ఆత్మయే అంది. మిగిలినవన్నీ దైహికమైన చదువులు. అందులో అనేక రకాల సబ్జెక్టులు ఉంటాయి. బి.ఎ మొదలైన పేర్లు ఎన్ని ఉన్నాయి. ఇందులో ఒకటే పేరు ఉంది, ఈ చదువును కూడా ఒక్కరే చదివిస్తారు. ఒక్క తండ్రే వచ్చి చదివిస్తారు. కావున తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తారు, వారి పేరు ఏమిటి? వారి పేరు శివ. అంతేకానీ వారు నామ-రూపాలకు అతీతుడు అని కాదు. మనుష్యులకు శరీరానికే పేరు ఉంటుంది. ఇది ఫలానావారి శరీరమని అంటారు. శివబాబాకు అటువంటి పేరేమీ లేదు. మనుష్యులకు శారీరానికి పేరు ఉంటుంది. నిరాకారుడైన తండ్రికొక్కరికే ‘శివ’ అని ఆత్మకు పేరుంది. వారు ఎప్పుడైతే చదివించడానికి వస్తారో, అప్పుడు కూడా శివ అన్న పేరే ఉంటుంది. ఈ శరీరమైతే వారిది కాదు. భగవంతుడు ఒక్కరే ఉంటారు, అంతేకానీ 10, 12 మంది కాదు. వారు ఒక్కరే, కానీ మనుష్యులు వారిని 24 అవతారాలు అని అనేస్తారు. తండ్రి అంటున్నారు, నన్ను ఎంతగానో భ్రమింపజేసారు. పరమాత్మను రాళ్లు-రప్పలు అన్నింటిలోనూ ఉన్నారని అనేసారు. ఏ విధంగా భక్తి మార్గంలో స్వయం భ్రమించారో, అలాగే నన్ను కూడా భ్రమింపజేసారు. డ్రామానుసారంగా వారు మాట్లాడే విధానము ఎంత శీతలమైనది. నాకు అందరూ ఎంతటి అపకారము చేసారు, నన్ను ఎంతగా గ్లాని చేసారు అని వారు అర్థం చేయిస్తారు. మనుష్యులు తాము నిష్కామ సేవను చేస్తున్నామని అంటారు. తండ్రి అంటారు, నేను తప్ప ఇంకెవ్వరూ నిష్కామ సేవను చేయలేరు. ఎవరెవరైతే చేస్తారో వారికి దానికి ప్రతిఫలము తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు మీకు ఫలము లభిస్తూ ఉంది. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అన్న గాయనముంది ఎందుకంటే భగవంతుడు జ్ఞాన సాగరుడు. భక్తిలో అర్ధకల్పము మీరు కర్మకాండలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జ్ఞానం చదువు. ఈ చదువు అనేది ఒకేసారి లభిస్తుంది మరియు ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. తండ్రి పురుషోత్తమ సంగమయుగములో ఒకేసారి వచ్చి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారుచేసి వెళ్తారు. ఇది జ్ఞానము మరియు అది భక్తి. అర్ధకల్పము మీరు భక్తి చేసేవారు. ఇప్పుడు ఎవరైతే భక్తి చేయరో వారికి అనుమానం కలుగుతుంది - మేము భక్తి చేయలేదు కాబట్టే ఫలానావారు మరణించారు, రోగగ్రస్థులుగా అయ్యారు అని. కానీ అలా జరుగదు.

తండ్రి అంటారు - పిల్లలూ, మీరు వచ్చి పతితులను పావనులుగా తయారుచేసి అందరి సద్గతిని చేయండి అని మీరు నన్ను పిలిచారు కావున ఇప్పుడు నేను వచ్చాను. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి ద్వారా అర్ధకల్పము రాత్రి ఉంటుంది. జ్ఞానం ద్వారా అర్ధకల్పం కొరకు పగలు ఉంటుంది. రామరాజ్యం మరియు రావణరాజ్యం, రెండూ విశాలమైనవే. రెండింటి సమయము ఖచ్చితంగా ఉంది. ఈ సమయంలో భోగులుగా ఉన్న కారణంగా ప్రపంచ వృద్ధి ఎక్కువగా జరుగుతుంది, ఆయువు కూడా తగ్గిపోతుంది. వృద్ధి ఎక్కువగా జరగకుండా ఉండేందుకని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంత పెద్ద ప్రపంచాన్ని తగ్గించడమనేది ఒక్క తండ్రి పనేనని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి తగ్గించడానికే వస్తారు. బాబా, మీరు వచ్చి అధర్మాన్ని వినాశనం చేయండి అనగా సృష్టిని తగ్గించండి అని పిలుస్తారు కూడా. తండ్రి ఎంతగా తగ్గిస్తారు అనేది ప్రపంచానికి తెలియదు, కొద్దిమంది మనుష్యులు మిగులుతారు, మిగిలిన ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నంబరువారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు. నాటకంలో పాత్ర ఎంత ఆలస్యంగా ఉంటే అంతగా వారు ఇంటి నుండి కూడా ఆలస్యంగా వస్తారు. వారు తమ వ్యాపారాలను పూర్తి చేసుకొని తర్వాత వస్తారు. నాటకాలు వేసేవారు కూడా తమ వ్యాపారాలను చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు పాత్రను అభినయించడానికి నాటకంలోకి వచ్చేస్తారు. మీ పాత్ర కూడా అటువంటిదే. ఎవరి పాత్ర అయితే చివరిలో ఉంటుందో వారు చివరిలో వస్తారు. ఎవరైతే మొట్టమొదట ప్రారంభంలోని పాత్రధారులుగా ఉంటారో వారు సత్యయుగ ఆదిలో వస్తారు. చివరిలోనివారిని చూడండి, వారు ఇప్పటికీ వస్తూనే ఉంటారు. శాఖోపశాఖలు చివరి వరకూ పెరుగుతూనే ఉంటాయి.

ఈ సమయంలో పిల్లలైన మీకు జ్ఞాన విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది మరియు ఉదయం వేళ స్మృతిలో కూర్చుంటారు కదా, అది డ్రిల్. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. యోగము అన్న పదాన్ని వదలేయండి. ఇందులోనే తికమకపడతారు. మా యోగము కుదరడం లేదు అని అంటారు. తండ్రి అంటారు - అరే, తండ్రిని మీరు స్మృతి చేయలేరా! ఇదేమన్నా మంచి విషయమా! స్మృతి చేయకపోతే పావనులుగా ఎలా అవుతారు? తండ్రి పతిత-పావనుడు. తండ్రి వచ్చి డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వివరిస్తారు. ఇది వెరైటీ ధర్మాలు మరియు వెరైటీ మనుష్యుల వృక్షము. మొత్తం సృష్టిలోని మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా పాత్రధారులు. ఎంతమంది మనుష్యులున్నారు, ఒక్క సంవత్సరములో ఇన్ని కోట్లమంది జన్మిస్తారు అని లెక్క తీస్తారు. కానీ అంత స్థలం ఎక్కడుంది? అందుకే తండ్రి అంటున్నారు - నేను సంఖ్యను తగ్గించడానికి వస్తాను. ఎప్పుడైతే ఆత్మలందరూ పై నుండి వచ్చేస్తారో, అప్పుడు మన ఇల్లు ఖాళీ అయిపోతుంది. మిగిలినవారెవరైతే ఉంటారో వారు కూడా వచ్చేస్తారు. అయితే, వృక్షం ఎప్పుడూ ఎండిపోదు, అది నడుస్తూనే వస్తుంది. చివరిలో ఎప్పుడైతే అక్కడ ఎవ్వరూ ఉండరో, అప్పుడు అందరూ అక్కడకు వెళ్తారు. కొత్త ప్రపంచములో ఎంత తక్కువమంది ఉండేవారు, ఇప్పుడు ఎంత ఎక్కువమంది ఉన్నారు. శరీరమైతే అందరిదీ మారుతూ ఉంటుంది. ఎవరైతే కల్పకల్పమూ జన్మ తీసుకుంటారో వారే మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఈ ప్రపంచ డ్రామా ఏ విధంగా నడుస్తుంది అనేది తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఈ అనంతమైన నాటకం ఎంత పెద్దది. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. అనంతమైన తండ్రి అయితే జ్ఞానసాగరుడు, మిగిలినవారంతా హద్దులలోని జ్ఞానం తెలిసినవారే. వేద-శాస్త్రాలు మొదలైనవాటిని కొన్నిటిని తయారుచేస్తారు, అవి ఎక్కువగానేమీ తయారవ్వవు. కానీ మీరు మొదటి నుండీ ఇప్పటిదాకా విన్నది వ్రాస్తూ వచ్చినట్లయితే అది ఎంతపెద్ద గీతగా అవుతుంది. అన్నీ ముద్రించబడుతూ ఉన్నట్లయితే అది ఇంటి కన్నా పెద్ద సైజు గీతగా అయిపోతుంది. అందుకే - సాగరమును సిరాగా చేసుకున్నా... అని మహిమ చేసారు. మళ్ళీ ఇంకొకవైపు సాగరాన్ని పిచ్చుకలు మ్రింగేసాయని అంటారు. మీరే ఆ పిచ్చుకలు, మొత్తం జ్ఞానసాగరమంతటినీ మ్రింగేస్తున్నారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. జ్ఞానం ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకున్నారు. కల్పకల్పమూ మీరు ఇక్కడ చదువును చదువుతారు, అందులో ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా వారి ప్రారబ్ధము తయారవుతుంది. మేము ఎంత పురుషార్థం చేస్తూ ఎంతటి పదవిని పొందేందుకు యోగ్యులుగా అవుతున్నాము అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. స్కూల్లో కూడా నంబరువారుగా పరీక్షను పాసవుతారు. సూర్యవంశీయులు-చంద్రవంశీయులు ఇరువురూ తయారవుతారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారు చంద్రవంశీయులుగా అవుతారు. రాముడికి బాణాలు ఎందుకు చూపించారు అనేది ఎవరికీ తెలియదు. మారణహోమము యొక్క చరిత్రను తయారుచేసారు. ఈ సమయంలో అంతా మారణహోమమే. ఎవరు ఎటువంటి కర్మను చేస్తే వారికి అటువంటి ఫలము లభిస్తుందని మీకు తెలుసు. ఎవరైనా ఆసుపత్రులను నిర్మిస్తే మరుసటి జన్మలో వారి ఆయువు ఎక్కువగా ఉంటుంది, వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎవరైనా ధర్మశాలలను, స్కూళ్ళను నిర్మిస్తే వారికి అర్ధకల్పము యొక్క సుఖము లభిస్తుంది. ఇక్కడకు పిల్లలు వచ్చినప్పుడు, మీకు ఎంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు. అప్పుడు వారు ముగ్గురు లౌకికము, ఒకరు శివబాబా అని అంటారు ఎందుకంటే వారు వారసత్వాన్ని ఇస్తారు కూడా మరియు తీసుకుంటారు కూడా, లెక్క ఉంది. వారు తీసుకునేదేమీ లేదు, వారు దాత. పిడికెడు బియ్యాన్ని ఇచ్చి మీరు మహళ్ళను తీసుకుంటారు, అందుకే వారు భోళానాథుడు. జ్ఞానసాగరుడే పతిత-పావనుడు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - ఈ భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సారాన్ని అర్థం చేయిస్తాను. భక్తి ఫలము అర్ధకల్పం కొరకు ఉంటుంది. సన్యాసులు ఈ సుఖము కాకిరెట్టతో సమానమైనది అని అంటారు, అందుకే ఇళ్ళూ-వాకిళ్ళను వదలి అడవులలోకి వెళ్ళిపోతారు. మాకు స్వర్గ సుఖాలు వద్దు ఎందుకంటే మళ్ళీ నరకంలోకి రావలసి ఉంటుంది, మాకు మోక్షం కావాలి అని అంటారు. కానీ ఇది అనంతమైన నాటకమని గుర్తుంచుకోండి. ఈ నాటకం నుండి ఒక్క ఆత్మ కూడా విముక్తి అవ్వలేదు. ఇది తయారై-తయారైచేయబడినది. అందుకే ఏమని గానం చేస్తారంటే - ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉంది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగరానిది ఏమీ జరగటం లేదు కావున ఇందులో చింతించాల్సిన అవసరమేమీ లేదు. కానీ భక్తి మార్గంలో చింతించవలసి ఉంటుంది. ఏదైతే గతించిందో అదంతా మళ్ళీ జరుగుతుంది. 84 జన్మల చక్రాన్ని మీరు చుట్టి వస్తారు. ఇది ఎప్పుడూ ఆగిపోదు, ఇది తయారై-తయారుచేయబడినది. ఇందులో మీరు మీ పురుషార్థాన్ని ఎలా ఆపుచేస్తారు? మీరు అలా అన్నంతమాత్రాన మీరు వదిలి వెళ్ళిపోలేరు. మోక్షము పొందడము, జ్యోతి జ్యోతిలో కలిసిపోవడము, బ్రహ్మములో లీనమైపోవడము - వీటి అర్థం ఒక్కటే. అనేక మతాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. అయినా ఏమంటారంటే - మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము మీకే తెలుసు, మీ శ్రీమతం ద్వారా సద్గతి లభిస్తుంది. మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము కూడా తెలుసుకుంటాము మరియు మేము కూడా పావనంగా అవుతాము. చదువును చదువుకుంటే మనకు సద్గతి లభిస్తుంది. ఎప్పుడైతే సద్గతి లభిస్తుందో అప్పుడు ఎవ్వరూ పిలవనే పిలవరు. ఈ సమయంలో అందరిపైనా దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. రక్తసిక్తమైన ఆటను చూపిస్తారు మరియు గోవర్ధన పర్వతాన్ని కూడా చూపిస్తారు. చిటికెనవేలుతో పర్వతాన్ని ఎత్తినట్లుగా చూపించారు. మీకు దీని అర్థము గురించి తెలుసు. కొద్దిమంది పిల్లలైన మీరు ఈ దుఃఖాల పర్వతాన్ని పక్కకు తప్పిస్తారు. దుఃఖాలను కూడా సహిస్తారు.

మీరు వశీకరణ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. తులసీదాసు చందనాన్ని అరగదీశారు... అని అంటారు. రాజ్యతిలకము మీ మీ పురుషార్థము ద్వారా మీకు లభిస్తుంది. మీరు రాజ్యం కొరకు చదువుతున్నారు. ఏ రాజయోగాము ద్వారానైతే రాజ్యం లభిస్తుందో దానిని చదివించేవారు ఒక్క తండ్రే. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు, ఇది దర్బారు కాదు. ఎక్కడైతే రాజులు, మహారాజులు కలుసుకుంటారో దానినే దర్బారు అని అంటారు. ఇది పాఠశాల. ఏ బ్రాహ్మణీ కూడా వికారులను తీసుకురావడానికి వీల్లేదు అని అర్థం చేయించడం జరుగుతుంది. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు, అందుకే వారిని అనుమతించడం జరగదు. ఎప్పుడైతే పవిత్రులుగా అవుతారో అప్పుడే అనుమతించడం జరుగుతుంది. ఇప్పుడైతే కొందరిని అనుమతించవలసి వస్తోంది. ఒకవేళ ఇక్కడి నుండి వెళ్ళి పతితులుగా అయినట్లయితే ధారణ జరగదు. అది తమను తాము శపించుకోవడం వంటిది. వికారాలు రావణుని మతము. రాముని మతాన్ని వదిలి, రావణుని మతము ద్వారా వికారులుగా అయి రాయిలా అయిపోతారు. ఈ విధంగా గరుడ పురాణంలో ఎన్నో రోచకమైన విషయాలను వ్రాసేసారు. తండ్రి అంటారు, మనుష్యులు మనుష్యులగానే అవుతారు, అంతేకానీ జంతువులు మొదలైనవాటిగా అవ్వరు. చదువులో అంధశ్రద్ధ విషయమేదీ ఉండదు. ఇది మీ చదువు. విద్యార్థులు చదువుకొని పాసై సంపాదించుకుంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వశీకరణ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. చదువుకునే కృషి చేసి రాజ్య తిలకాన్ని తీసుకోవాలి. ఈ దుఃఖాల పర్వతాలను తొలగించడంలో మీ వేలును అందించాలి.

2. సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థము చేయాలి. తండ్రిని స్మృతి చేసే డ్రిల్ చేయాలి. యోగము-యోగము అంటూ తికమకపడకూడదు.

వరదానము:-

సేవలో విఘ్నాలను ఉన్నతికి మెట్లుగా భావించి ముందుకు వెళ్ళే నిర్విఘ్న, సత్యమైన సేవాధారీ భవ

సేవ బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నముగా తయారుచేయడానికి సాధనము కూడా, అలాగే సేవలోనే విఘ్నాల పరీక్ష కూడా ఎక్కువగా వస్తుంది. నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అని అంటారు. విఘ్నాలు రావటము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అవి రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పరీక్షలు అనుభవజ్ఞులుగా చేస్తాయి. వీటిని విఘ్నాలుగా భావించకుండా, అనుభవములో ఉన్నతి జరుగుతోంది అన్న ఈ భావముతో చూసినట్లయితే ఉన్నతికి మెట్లుగా అనుభవమవుతాయి మరియు ముందుకు వెళ్తూ ఉంటారు.

స్లోగన్:-

విఘ్నరూపులుగా కాదు, విఘ్న-వినాశకులుగా అవ్వండి.