12-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రికైతే పిల్లలందరి పైనా ప్రేమ ఉంది, కానీ ఎవరైతే తండ్రి సలహాను వెంటనే అంగీకరిస్తారో వారి పట్ల ఆకర్షణ కలుగుతుంది, గుణవంతులైన పిల్లలు ప్రేమను ఆకర్షించుకుంటారు’’

ప్రశ్న:-

తండ్రి ఏ కాంట్రాక్టును తీసుకున్నారు?

జవాబు:-

అందరినీ పుష్పాలుగా తయారుచేసి తిరిగి తీసుకువెళ్ళే కాంట్రాక్ట్ ఒక్క తండ్రిదే. తండ్రి వంటి కాంట్రాక్టర్ ప్రపంచములో ఇంకెవ్వరూ లేరు. వారే సర్వుల సద్గతిని చేయడానికి వస్తారు. తండ్రి సేవ చేయకుండా ఉండలేరు. కావున పిల్లలు కూడా సేవకు ఋజువును చూపించాలి. వినీ విననట్లుగా ఉండకూడదు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఈ విషయాన్ని ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు, ఇది ఇంకే మనుష్యమాత్రులూ ఇతరులకు అర్థం చేయించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని 5,000 సంవత్సరాల తర్వాత తండ్రే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు. ఇది పురుషోత్తమ సంగమయుగమని ఇంకెవ్వరికీ తెలియదు. మేము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నామని పిల్లలైన మీకు గుర్తుండాలి, ఇది కూడా మన్మనాభవయే. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. 84 జన్మలు ఇప్పుడు పూర్తయ్యాయి, ఇప్పుడు సతోప్రధానముగా అయ్యి తిరిగి వెళ్ళాలి. కొందరైతే ఏ మాత్రమూ స్మృతి చేయరు. తండ్రికైతే ప్రతి ఒక్కరి పురుషార్థము గురించి బాగా తెలుసు. అందులోనూ విశేషముగా ఇక్కడా ఉన్నారు మరియు బయట కూడా ఉన్నారు. బాబాకు తెలుసు - నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నా కానీ మధురాతి మధురమైన సేవాధారీ పిల్లలెవరైతే ఉన్నారో నేను వారినే స్మృతి చేస్తాను. చూడడం కూడా నేను వారినే చూస్తాను, వీరు ఎటువంటి పుష్పము, వీరిలో ఏయే గుణాలు ఉన్నాయి అన్నది చూస్తాను. ఏ గుణాలూ లేనివారు కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు అటువంటివారిని చూసి తండ్రి ఏమి చేస్తారు. తండ్రి అయస్కాంతము, పవిత్ర ఆత్మ, కావున తప్పకుండా ఆకర్షిస్తారు. కానీ బాబాకు లోలోపల తెలుసు. తండ్రి తన పూర్తి లెక్కాపత్రాన్ని తెలియజేస్తారు కావున పిల్లలు కూడా తెలియజేయాలి. తండ్రి అంటున్నారు - నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను, ఇక ఆపై ఎవరు ఎటువంటి పురుషార్థము చేస్తే అలా. ఎవరు ఏ పురుషార్థము చేస్తున్నారు అన్నది కూడా తెలియాలి. అందరి ఆక్యుపేషన్ ను (వృత్తిని) వ్రాసి పంపించండి లేక వారితో వ్రాయించి పంపించండి అని బాబా వ్రాస్తారు. చురుకైన వివేకవంతులైన బ్రాహ్మణీలు ఎవరైతే ఉంటారో, వారు అన్నీ వ్రాయించి పంపిస్తారు - ఏ వ్యాపారము చేస్తున్నారు, ఎంత సంపాదన ఉంటుంది అని అంతా వ్రాయించి పంపిస్తారు. తండ్రి తనకు సంబంధించినదంతా తెలియజేస్తారు మరియు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారికి అందరి అవస్థ గురించి తెలుసు. రకరకాల వెరైటీ పుష్పాలు ఉన్నాయి కదా. (ఒక్కొక్క పుష్పాన్ని చూపిస్తూ) చూడండి - ఇది ఎటువంటి రాయల్ పుష్పము. ఇప్పుడే ఇటువంటి సుగంధము ఉంది కావున ఎప్పుడైతే పూర్తిగా వికసిస్తుందో అప్పుడిక ఫస్ట్ క్లాస్ శోభ ఉంటుంది. మీరు కూడా ఈ లక్ష్మీ-నారాయణుల వలె యోగ్యులుగా అవుతారు. తండ్రి చూస్తుంటారు. అలాగని వారు అందరికీ సెర్చ్ లైట్ ను ఇస్తారని కాదు. ఎవరు ఎలా ఉంటారో అలా ఆకర్షిస్తూ ఉంటారు. ఎవరిలోనైతే ఏ గుణాలూ లేవో వారేమి ఆకర్షిస్తారు. అటువంటివారు అక్కడకు వెళ్ళి పైసా విలువ చేసే పదవినే పొందుతారు. బాబా ప్రతి ఒక్కరి గుణాలనూ చూస్తారు మరియు ప్రేమిస్తారు కూడా. ఆ ప్రేమలో నయనాలు చెమ్మగిల్లుతాయి. ఈ సేవాధారులు ఎంతటి సేవను చేస్తున్నారు, వీరికి సేవ లేకుండా విశ్రాంతియే లేదు అని భావిస్తారు. కొందరికైతే సేవ చేయడమే తెలియదు, యోగములో కూర్చోరు, జ్ఞానము యొక్క ధారణ లేదు. వారు ఏం పదవిని పొందుతారు అని బాబా అనుకుంటారు. ఎవ్వరూ దాగి ఉండలేరు. మంచి వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, సెంటర్లను సంభాళిస్తున్నారో, వారు ఒక్కొక్కరి యొక్క లెక్కాపత్రాన్ని పంపించాలి. తద్వారా ఎవరు ఎటువంటి పురుషార్థులు అన్నది బాబా అర్థం చేసుకుంటారు. బాబా అయితే జ్ఞానసాగరుడు. వారు పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఎవరెంత జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, గుణవంతులు అవుతున్నారు అన్నది వెంటనే తెలిసిపోతుంది. బాబా ప్రేమ అందరిపైనా ఉంది. దీనికి సంబంధించి - నీ ముళ్ళ పైనా ప్రేమ ఉంది, నీ పుష్పాల పైనా ప్రేమ ఉంది... అని ఒక పాట కూడా ఉంది. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. కావున తండ్రిపై ప్రేమ ఎంత మంచిగా ఉండాలి. బాబా ఏదైతే చెప్తారో, దానిని వెంటనే చేసి చూపిస్తే, అప్పుడు బాబా కూడా - వీరికి బాబా పట్ల ప్రేమ ఉంది అని భావిస్తారు. వారికి ఆకర్షణ కలుగుతుంది. తండ్రిలో ఏ విధమైన ఆకర్షణ ఉందంటే, ఇక వారికి పూర్తిగా అతుక్కుపోవాలి. కానీ ఎప్పటివరకైతే తుప్పు వదలదో, అప్పటివరకూ ఆకర్షణ కూడా కలగదు. నేను ఇలా ఒక్కొక్కరినీ చూస్తాను.

బాబాకు సేవాధారులైన పిల్లలు కావాలి. తండ్రి అయితే సేవ కొరకే వస్తారు. వారు పతితులను పావనంగా తయారుచేస్తారు. ఇది మీకే తెలుసు, ప్రపంచములోని వారికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా కొద్దిమందే ఉన్నారు. ఎప్పటివరకైతే యోగము ఉండదో అప్పటివరకూ ఆకర్షణ కలగదు. ఆ కృషిని చాలా కొద్దిమందే చేస్తారు. ఏదో ఒక విషయములో వ్రేలాడుతూ ఉంటారు. ఏది వింటే అది సత్యం, సత్యం అని అనేటువంటి సత్సంగం కాదు ఇది. సర్వ శాస్త్రమయి శిరోమణి ఒక్క గీతయే. గీతలోనే రాజయోగము ఉంది. విశ్వాధిపతి అయితే ఒక్క తండ్రే. గీత ద్వారానే ప్రభావము వెలువడుతుందని పిల్లలకు చెప్తూ ఉంటాను. కానీ అంతటి శక్తి కూడా ఉండాలి కదా. యోగబలము యొక్క పదును చాలా బాగుండాలి, అందులో చాలా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. మీరు మధురంగా ఉన్నట్లయితే మీతో అందరూ మధురంగా ఉంటారు అని అంటారు... నన్ను ప్రేమించినట్లయితే నేను కూడా ప్రేమిస్తాను. ఇది ఆత్మ యొక్క ప్రేమ. ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి, ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కొందరైతే ఏమాత్రమూ స్మృతి చేయరు. తండ్రి అర్థం చేయిస్తారు -ఇక్కడ భక్తి యొక్క విషయము లేదు. ఇది బాబా రథము, వీరి ద్వారా శివబాబా చదివిస్తారు. శివబాబా నా పాదాలను కడిగి తాగండి అని అనరు. బాబా అయితే కాళ్ళను ముట్టుకోనివ్వరు కూడా. ఇది చదువు. అలా కాళ్ళను పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? తండ్రి సర్వుల సద్గతిని చేస్తారు. కోట్లాదిమందిలో ఏ ఒక్కరో మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కల్పక్రితం వారు ఎవరైతే ఉంటారో, వారే అర్థం చేసుకుంటారు. భోళానాథుడైన తండ్రి వచ్చి అమాయకులైన మాతలకు జ్ఞానాన్నిచ్చి పైకి లేపుతారు. బాబా పూర్తిగా ముక్తి మరియు జీవన్ముక్తుల వైపుకు ఎక్కిస్తారు. తండ్రి కేవలం - వికారాలను వదలండి అని మాత్రమే చెప్తున్నారు. ఈ విషయములోనే గొడవలు జరుగుతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నాలో ఏయే అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోండి. వ్యాపారస్థులు రోజూ తమ లాభ-నష్టాల లెక్కాపత్రాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు కూడా లెక్కాపత్రం పెట్టుకోండి - అతి ప్రియమైన బాబా ఎవరైతే మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తున్నారో వారిని ఎంత సమయము స్మృతి చేసాను. మేము తక్కువగా స్మృతి చేసాము అని చూసుకున్నప్పుడు, ఇటువంటి తండ్రిని నేను స్మృతి చేయలేదా అని తమకు తామే సిగ్గుపడతారు. మన బాబా అందరికన్నా అద్భుతమైనవారు. స్వర్గము కూడా మొత్తం సృష్టి అంతటిలోకీ అన్నింటికన్నా అద్భుతమైనది. వారైతే స్వర్గాన్ని లక్షల సంవత్సరాలు అని అనేస్తారు మరియు మీరు 5,000 సంవత్సరాలని అంటారు. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. అతి పురాతన భక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై బాబా బలిహారమవుతారు. వారు అతి భక్తిని చేసారు కదా. బాబా ఈ జన్మలో కూడా గీతను చదివేవారు మరియు నారాయణుడి చిత్రాన్ని కూడా పెట్టుకునేవారు. లక్ష్మిని దాస్యత్వము నుండి విముక్తి చేసినప్పుడు ఎంత సంతోషము కలిగింది. మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి సత్యయుగములో ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. బాబాకు కూడా - నేను వెళ్ళి యువరాజుగా, సుందరముగా అవుతాను అన్న సంతోషము ఉంటుంది. పురుషార్థాన్ని కూడా చేయిస్తూ ఉంటారు. ఊరికే ఎలా అవుతారు? మీరు కూడా తండ్రిని బాగా స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. కొందరైతే చదవరు, అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చేయరు. వారు లెక్కాపత్రాన్నే పెట్టరు. ఎవరైతే ఉన్నతముగా తయారయ్యేవారు ఉంటారో, వారే సదా తమ లెక్కాపత్రాన్ని వ్రాస్తారు. లేదంటే కేవలం షో చేస్తారు. 15-20 రోజుల తరువాత వ్రాయడం మానేస్తారు. ఇక్కడైతే పరీక్షలు మొదలైనవన్నీ గుప్తమైనవి. ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ గురించి తండ్రికి తెలుసు. బాబా చెప్పినదానిని వెంటనే చేస్తే ఆజ్ఞాకారులని అంటారు. బాబా అంటారు, ఇప్పుడు పిల్లలు ఎంతో పని చేయాలి. ఎంతో మంచి-మంచి పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోతారు. బాబా ఎప్పుడూ ఎవరినీ వదిలివేయరు లేక విడాకులు ఇవ్వరు. వీరు డ్రామానుసారంగా చాలా పెద్ద కాంట్రాక్ట్ ను తీసుకునేందుకే వచ్చారు. నేను అందరికన్నా పెద్ద కాంట్రాక్టరును. అందరినీ పుష్పాల వలె తయారుచేసి తిరిగి తీసుకువెళ్తాను. పతితులను పావనంగా తయారుచేసే కాంట్రాక్టర్ ఒక్కరేనని పిల్లలైన మీకు తెలుసు. వారు మీ ముందు కూర్చున్నారు. కొందరికి ఎంతో నిశ్చయం ఉంది, కొందరికి ఏమాత్రమూ లేదు. ఈ రోజు ఇక్కడ ఉన్నారు, రేపు వెళ్ళిపోతారు, నడవడిక ఆ విధంగా ఉంది. మేము బాబా వద్ద ఉంటూ బాబాకు చెందినవారిగా అయి ఏమి చేస్తున్నామని లోలోపల మనసు తింటుంది. ఏమీ సేవ చేయకపోతే ఏమి లభిస్తుంది? రొట్టెలు చేయడము, కూరలు వండడము అయితే ఇంతకుముందు కూడా చేసేవారు. కొత్తగా ఏమి చేసారు? ఇంతమందికి దారిని చూపించాము అని సేవ యొక్క ఋజువును ఇవ్వాలి.

ఈ డ్రామా చాలా అద్భుతముగా తయారై ఉంది. ఏదైతే జరుగుతుందో దానిని మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. శాస్త్రాలలోనైతే శ్రీకృష్ణుని చరిత్రను వ్రాసేసారు, కానీ చరిత్ర అనేది ఒక్క తండ్రిదే. వారే సర్వులకూ సద్గతిని ఇస్తారు. వీరి వంటి చరిత్ర ఇంకెవ్వరికీ ఉండదు. చరిత్ర అనేది చాలా మంచిగా ఉండాలి కదా. అంతేకానీ ఎత్తుకుపోవడమూ, అదీ ఇదీ చేయడమూ - ఇదేమీ చరిత్ర కాదు. సర్వుల సద్గతిని చేసేవారు ఒక్క తండ్రే. వారు కల్పకల్పమూ వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. లక్షల సంవత్సరాల విషయమనేది లేనే లేదు.

పిల్లలు అశుద్ధమైన అలవాట్లను వదిలివేయాలి. లేదంటే ఏం పదవి లభిస్తుంది? ప్రియుడు కూడా గుణాలను చూసే ప్రేమిస్తారు కదా! ఎవరైతే వారి సేవను చేస్తారో వారినే ప్రేమిస్తారు. ఎవరైతే సేవ చేయరో వారు ఎందుకు పనికొస్తారు. ఈ విషయాలు ఎంతో అర్థం చేసుకోవలసినవి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు మహాన్ భాగ్యశాలులు, మీ వంటి భాగ్యశాలి ఇంకెవ్వరూ లేరు. స్వర్గములోకైతే మీరు వెళ్తారు కానీ ప్రారబ్ధాన్ని ఉన్నతముగా తయారుచేసుకోవాలి. ఇది కల్పకల్పాంతరాల విషయము. పొజిషన్ తగ్గిపోతుంది. ఏది లభిస్తే అదే మంచిది అని సంతోషపడిపోకూడదు. పురుషార్థము చాలా బాగా చేయాలి. సేవ యొక్క ఋజువు కావాలి - ఎంతమందిని మీ సమానముగా తయారుచేసారు? మీ ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఈ తండ్రి, టీచర్ అందరి చేతా పురుషార్థము చేయిస్తారు. కానీ ఇది భాగ్యములో కూడా ఉండాలి కదా. అన్నింటికన్నా పెద్ద ఆశీర్వాదము ఏమిటంటే - తండ్రి తమ శాంతిధామాన్ని వదిలి పతిత ప్రపంచములోకి మరియు పతిత శరీరములోకి వస్తారు. లేదంటే మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఎవరు వినిపిస్తారు? సత్యయుగములో రామరాజ్యము మరియు కలియుగములో రావణరాజ్యము ఉంటాయని కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. రామరాజ్యములో ఒకే రాజ్యం ఉండేది, రావణరాజ్యములో అనేక రాజ్యాలు ఉన్నాయి. అందుకే మీరు అడుగుతారు - మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని. కానీ మనుష్యులు తాము ఎక్కడ ఉన్నారు అన్నది అర్థం చేసుకోరు. ఇది ముళ్ళ అడవి, అది పూల తోట. కావున ఇప్పుడు మాతా పితలను మరియు అనన్యులైన పిల్లలను ఫాలో చేయాలి, అప్పుడే ఉన్నతులుగా అవుతారు. తండ్రి అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు. కానీ అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. కొందరైతే విని చాలా బాగా విచార సాగర మంథనము చేస్తారు. కొందరైతే వినీ విననట్లుగా వదిలేస్తారు. శివబాబా గుర్తు ఉన్నారా - అని అనేక చోట్ల వ్రాయబడి ఉంది. అప్పుడు వారసత్వము కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. దైవీ గుణాలు ఉన్నట్లయితే దేవతలుగా అవుతారు. ఒకవేళ క్రోధము ఉంటే, అసురీ అవగుణాలు ఉంటే ఉన్నత పదవిని పొందలేరు. అక్కడ ఎటువంటి భూతమూ ఉండదు. రావణుడే లేనప్పుడు ఇక రావణుడి భూతాలెక్కడ నుండి వస్తాయి. దేహాభిమానము, కామము, క్రోధము... ఇవి పెద్ద భూతాలు. వీటిని తొలగించేందుకు ఏకైక ఉపాయము - బాబా స్మృతి. బాబా స్మృతి ద్వారానే అన్ని భూతాలూ పారిపోతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్:-
మేము కూడా అనేకులను మా సమానముగా తయారుచేసే సేవను చేయాలి, మా ప్రజలను తయారుచేసుకోవాలి, మా సోదరులు ఏ విధముగా సేవ చేస్తున్నారో అలాగే మేము కూడా చేయాలి అని చాలామంది పిల్లలకు మనసులో అనిపిస్తుంది. మాతలు ఎక్కువమంది ఉన్నారు. కలశము కూడా మాతల పైనే పెట్టబడింది. ఇకపోతే ఇది ప్రవృత్తి మార్గము. ఇందులో ఇరువురూ కావాలి కదా. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని బాబా అడుగుతారు. వీరు సరైన జవాబు చెప్తారా లేదా అని చూస్తారు. ఐదుగురు పిల్లలు మరియు ఒక్కరు శివబాబా అని అంటారు. కొందరైతే ఏదో నామమాత్రంగా అంటారు, కొందరు నిజంగానే అలా తయారుచేసుకుంటారు. ఎవరైతే వారసునిగా చేసుకుంటారో వారు విజయమాలలో కూర్చబడతారు. ఎవరైతే సత్యంగా వారసునిగా చేసుకుంటారో, వారు స్వయం కూడా వారసులుగా అవుతారు. సత్యమైన హృదయముపై స్వామి సంతుష్టులవుతారు... ఇకపోతే మిగిలినవారంతా ఏదో నామమాత్రంగా అంటారు. ఈ సమయంలో అందరికీ వారసత్వాన్ని ఇచ్చేది ఒక్క పారలౌకిక తండ్రే, అందుకే స్మృతి కూడా వారినే చేయాలి. వారి నుండి 21 జన్మల వారసత్వము లభిస్తుంది. వీరంతా అయితే ఉండేది లేదని బుద్ధిలో జ్ఞానం ఉంది. వీరు నిజంగా వారసునిగా తయారుచేసుకున్నారా లేక తయారుచేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అని తండ్రి ప్రతి ఒక్కరి అవస్థను చూస్తారు. వారసునిగా తయారుచేసుకోవడం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటారు. ఎంతోమంది అర్థం చేసుకొని కూడా వారసునిగా చేసుకోలేకపోతారు ఎందుకంటే మాయకు వశమై ఉన్నారు. ఈ సమయంలో ఈశ్వరునికైనా వశమై ఉన్నారు లేక మాయకైనా వశమై ఉన్నారు. ఈశ్వరునికి ఎవరైతే వశమై ఉంటారో వారు వారసునిగా చేసుకుంటారు. మాల 8 మందిది కూడా ఉంటుంది మరియు 108 మందిది కూడా ఉంటుంది. 8 మందైతే తప్పకుండా అద్భుతం చేస్తారు. నిజముగానే వారసునిగా చేసుకునే తీరుతారు. వారసునిగా కూడా చేసుకుంటారు, అలాగే వారసత్వాన్ని కూడా తప్పకుండా తీసుకుంటారు. అయినా ఇటువంటి ఉన్నతమైనవారిని వారసునిగా చేసుకునేవారి కర్మలు కూడా అలా ఉన్నతముగా ఉంటాయి. ఎటువంటి వికర్మలు జరుగకూడదు. వికారాలేవైతే ఉన్నాయో అవన్నీ వికర్మలే కదా. తండ్రిని వదిలి ఇంకెవ్వరినైనా స్మృతి చేయడం - ఇది కూడా వికర్మయే. తండ్రి అంటే తండ్రే. మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఆ తండ్రి నోటి ద్వారా చెప్తున్నారు. డైరెక్షన్ లభించింది కదా. కావున వెంటనే స్మృతి చేయాలి - ఇందులోనే ఎంతో శ్రమ ఉంది. ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే మాయ అంతగా విసిగించదు. ఇకపోతే మాయ కూడా చాలా శక్తివంతమైనది. మాయ చాలా వికర్మలను చేయిస్తుందని అర్థమవుతుంది. పెద్ద-పెద్ద మహారథులను కూడా పడేసి నేలపాలు చేస్తుంది. రోజురోజుకు సెంటర్లు వృద్ధి చెందుతూ ఉంటాయి. గీతా పాఠశాలలు మరియు మ్యూజియంలు తెరుచుకుంటూ ఉంటాయి. మొత్తం ప్రపంచములోని మనుష్యులు తండ్రి చెప్పింది కూడా అంగీకరిస్తారు, అలాగే బ్రహ్మా చెప్పింది కూడా అంగీకరిస్తారు. బ్రహ్మానే ప్రజాపిత అని అంటారు. ఆత్మలనైతే ప్రజ అని అనరు. మనుష్య సృష్టిని ఎవరు రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మా అని పేరు వస్తుంది అనగా వారు సాకారుడు. బాబా నిరాకారుడు, వారు అనాది. వీరిని కూడా అనాది అనే అంటారు. ఇరువురి పేర్లు ఉన్నతోన్నతమైనవి. వారు ఆత్మిక తండ్రి, వీరు ప్రజాపిత. ఇరువురూ కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు. వీరు ఎంత ఉన్నతోన్నతులైనట్లు! పిల్లలకు ఎంతటి నషా ఎక్కాలి! సంతోషము ఎంత ఉండాలి. కానీ మాయ సంతోషములో లేక నషాలో ఉండనివ్వదు. ఈ విధంగా విద్యార్థులు విచార సాగర మంథనము చేస్తూ ఉన్నట్లయితే సేవను కూడా చేయగలుగుతారు, సంతోషము కూడా ఉండగలదు, కానీ బహుశా ఇప్పుడింకా సమయం ఉన్నట్లుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు సంతోషము కూడా ఉండగలదు. అచ్ఛా - ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్ దాద యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అతి మధురమైన బాబాను రోజంతటిలో ఎంత స్మృతి చేసాను? అని రోజూ రాత్రివేళలో లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. ఏదో స్వయాన్ని షో చేసుకోవడానికి లెక్కాపత్రాన్ని పెట్టుకోకూడదు, గుప్త పురుషార్థం చేయాలి.

2. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిపై విచార సాగర మంథనం చేయాలి, సేవకు ఋజువును చూపించాలి. వినీ, విననట్లుగా ఉండకూడదు. లోలోపల ఏదైనా అసురీ అవగుణము ఉంటే దానిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి.

వరదానము:-

వైరాగ్య వృత్తి ద్వారా ఈ నిస్సార ప్రపంచము నుండి ఆకర్షణా ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ

రాజఋషి అనగా రాజ్యం ఉంటూ కూడా అనంతమైన వైరాగిగా ఉండటము, దేహము మరియు దేహము యొక్క పాత ప్రపంచములో కొద్దిగా కూడా మోహము లేకుండా ఉండటము, ఎందుకంటే ఈ పాత ప్రపంచము నిస్సార ప్రపంచంగా ఉంది, ఇందులో ఎటువంటి సారమూ లేదు అన్న విషయం తెలుసు. ఈ నిస్సార ప్రపంచములో బ్రాహ్మణుల యొక్క శ్రేష్ఠ ప్రపంచము లభించింది, అందుకే ఆ ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము ఉండాలి అనగా ఎటువంటి మోహము ఉండకూడదు. ఎప్పుడైతే ఎవరి పట్ల లేక దేని పట్ల మోహము లేక ఆధీనత ఉండదో, అప్పుడే రాజఋషి లేక తపస్వీ అని అంటారు.

స్లోగన్:-

ఏ మాటలైతే మధురంగా మరియు శుభ భావనా సంపన్నంగా ఉంటాయో, అవే యుక్తియుక్తమైన మాటలు.