13-02-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - విదేహీగా అయి తండ్రిని స్మృతి చేయండి, స్వధర్మములో స్థితులవ్వండి, అప్పుడు శక్తి లభిస్తుంది, సంతోషము మరియు ఆరోగ్యము ఉంటాయి, బ్యాటరీ ఫుల్ అవుతూ ఉంటుంది

ప్రశ్న:-

డ్రామాలో నిశ్చితమై ఉన్న ఏ విషయము గురించి తెలిసిన కారణముగా పిల్లలైన మీరు సదా అచలముగా ఉంటారు?

జవాబు:-

మీకు తెలుసు - ఈ బాంబులు మొదలైనవేవైతే తయారయ్యాయో, అవన్నీ తప్పకుండా ఉపయోగించబడనున్నాయి. వినాశనం జరుగుతుంది, అప్పుడే మన కొత్త ప్రపంచము వస్తుంది. ఇది డ్రామాలో అనాదిగా నిశ్చితమై ఉంది, అందరూ మరణించవలసిందే. మేము ఈ పాత శరీరాన్ని వదిలి రాజరికములో జన్మ తీసుకుంటాము అని మీకు సంతోషము ఉంది. మీరు డ్రామాను సాక్షీగా అయి చూస్తారు, ఇందులో చలించే విషయమేదీ లేదు, ఏడవవలసిన అవసరమేమీ లేదు.

ఓంశాంతి

తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమేదైతే ఉండేదో, దానిని హిందూ ధర్మములోకి ఎందుకు తీసుకువచ్చారు? ఆ కారణాన్ని వెలికి తీయాలి. మొదటైతే కేవలం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉండేది. తర్వాత ఎప్పుడైతే వికారులుగా అయ్యారో, అప్పుడు స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు, అందుకే స్వయాన్ని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారిగా పిలుచుకునేందుకు బదులుగా ఆది సనాతన హిందువులు అని పిలుచుకున్నారు. ఆది సనాతన అన్న పదాన్ని కూడా ఉంచారు, కేవలం దేవత అన్న పదాన్ని మార్చి హిందువు అన్న పదాన్ని పెట్టారు. ఆ సమయములో ఇస్లాములు వచ్చారు, అప్పుడు ఆ బయటివారు వచ్చి హిందూ ధర్మం అన్న పేరును పెట్టారు. పూర్వము హిందుస్థాన్ అన్న పేరు కూడా ఉండేది కాదు. కావున ఆది సనాతన హిందువులు, దేవతా ధర్మం వారే అని అర్థం చేసుకోవాలి. వారు చాలా వరకు ధర్మాత్ములుగానే ఉంటారు. అందరూ సనాతనులు కారు, ఎవరైతే తర్వాత వచ్చారో వారిని ఆది సనాతనులు అని అనరు. హిందువులలో కూడా తర్వాత వచ్చేవారు ఉంటారు. ఆది సనాతనులైన హిందువులకు ఇలా చెప్పండి - మీ ధర్మం ఆది సనాతన దేవతా ధర్మంగా ఉండేది, మీరే సతోప్రధానముగా, ఆది సనాతనులుగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ తమోప్రధానులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా సతోప్రధానులుగా అవ్వండి, ఇలా చెప్పండి. వారికి ఈ మెడిసిన్ మంచిగా అనిపిస్తుంది. బాబా సర్జన్ కదా. ఎవరికైతే ఈ మెడిసిన్ మంచిగా అనిపిస్తుందో వారికి ఇవ్వాలి. ఎవరైతే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారో, వారికి స్మృతిని కలిగించాలి. పిల్లలైన మీకు స్మృతి వచ్చినట్లుగా వారికీ వస్తుంది. మీరు సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా ఎలా అయ్యారు అనేది బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలి. పిల్లలైన మీరు స్మృతి యాత్ర ద్వారా సతోప్రధానులుగా అవుతున్నారు. ఆది సనాతన హిందువులు ఎవరైతే ఉంటారో, వారే నిజానికి దేవీ-దేవతలుగా ఉంటారు మరియు వారే దేవతలను పూజించేవారిగా కూడా అవుతారు. వారిలో కూడా ఎవరైతే - శివుడు లేక లక్ష్మీ-నారాయణులు, రాధా-కృష్ణులు, సీతా-రాములు మొదలైన దేవతల భక్తులు ఉంటారో, వారు దేవతా వంశానికి చెందినవారు. ఎవరైతే సూర్యవంశీయులుగా ఉంటారో, వారే చంద్రవంశీయులుగా అవుతారు అని ఇప్పుడు స్మృతి కలిగింది, కావున అటువంటి భక్తులను వెదకాలి. ఎవరైతే అర్థం చేసుకునేందుకు వస్తారో, వారి చేత ఫారం నింపించాలి. ముఖ్యమైన సెంటర్లలో నింపేందుకు ఫారంలు తప్పకుండా ఉండాలి. ఎవరు వచ్చినా వారికి పాఠాలైతే ప్రారంభం నుండే ఇస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఎవరికైతే తండ్రి గురించి తెలియదో, వారికి ఇలా అర్థం చేయించవలసి ఉంటుంది - మీకు మీ పెద్ద తండ్రి గురించి తెలియదు, మీరు వాస్తవానికి పారలౌకిక తండ్రికి చెందినవారు, ఇక్కడికి వచ్చి లౌకిక తండ్రికి చెందినవారిగా అయ్యారు, మీరు మీ పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. అక్కడ ఈ అనేక ధర్మాలు ఉండవు. కావున ఫారం ఏదైతే నింపుతారో దానిపైనే మొత్తం ఆధారపడి ఉండాలి. కొందరు పిల్లలు చాలా బాగా అర్థం చేయిస్తారు కానీ యోగము లేదు. అశరీరిగా అయి తండ్రిని స్మృతి చేయడం అనేది లేదు. స్మృతిలో నిలువలేరు. మేము బాగా అర్థం చేయిస్తున్నాము, మ్యూజియం మొదలైనవి కూడా తెరుస్తున్నాము అని భావించినా కానీ స్మృతి చాలా తక్కువగా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి, ఇందులోనే శ్రమ ఉంది. తండ్రి వార్నింగ్ ఇస్తారు. మేమైతే చాలా బాగా ఒప్పించగలము అని భావించకండి, దాని వల్ల లాభమేముంది? సరే, స్వదర్శన చక్రధారులుగా అయినా కానీ ఇందులోనైతే విదేహీగా అవ్వాలి. కర్మ చేస్తూ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ ఈ శరీరము ద్వారా కర్తవ్యము చేస్తుంది - ఇది స్మృతి చేయడం కూడా రాదు, ఇది ఆలోచనలో కూడా రాదు, అటువంటివారిని అవివేకులు అని అంటారు. తండ్రిని స్మృతి చేయలేరు! సేవ చేసే శక్తి లేదు. స్మృతి లేకుండా ఆత్మకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? బ్యాటరీ ఎలా నిండుతుంది? నడుస్తూ, నడుస్తూ ఆగిపోతారు, శక్తి ఉండదు.

ధర్మములో శక్తి ఉంది అని అంటారు. ఆత్మ తన స్వధర్మములో స్థితి అయినప్పుడే శక్తి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడం రానివారు ఎంతోమంది ఉన్నారు. వారి ముఖము ద్వారా తెలిసిపోతుంది. మిగిలినవన్నీ గుర్తుకువస్తాయి కానీ బాబా స్మృతి నిలువదు. యోగము ద్వారానే బలము లభిస్తుంది. స్మృతి ద్వారా ఎంతో సంతోషము మరియు ఆరోగ్యము ఉంటాయి. అప్పుడు మరుసటి జన్మలో కూడా శరీరము అటువంటి తేజస్సు కలది లభిస్తుంది. ఆత్మ పవిత్రముగా ఉంటే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. 24 కారెట్ల బంగారము ఉంటే నగ కూడా 24 క్యారెట్లదే ఉంటుంది. ఈ సమయంలో అందరూ 9 క్యారెట్లు వారిగా అయిపోయారు. సతోప్రధానులను 24 క్యారెట్లు వారని, సతోను 22 క్యారెట్లు వారని అంటారు, ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మొదటైతే ఫారంను నింపించాలి, తద్వారా ఎంతవరకూ రెస్పాన్స్ ఇస్తున్నారు, ఎంతవరకూ ధారణ చేసారు అన్నది తెలుస్తుంది. వీటితో పాటు స్మృతి యాత్రలో ఉంటున్నారా అన్నది కూడా అందులో వస్తుంది. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా స్మృతి యాత్ర ద్వారానే తయారవ్వాలి. అవన్నీ భక్తిలోని దైహిక యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ యాత్ర చేస్తుంది. అక్కడ ఆత్మ మరియు దేహము, రెండూ యాత్ర చేస్తాయి. పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మలో ఆ శక్తి వస్తుంది. ఎవరైనా జిజ్ఞాసువులకు సత్తాను, శక్తిని చూపించవలసి ఉంటే బాబా ప్రవేశము కూడా జరుగుతుంది. మాత, పితలు ఇరువురూ, కొన్నిచోట్ల జ్ఞానం మరియు కొన్నిచోట్ల యోగం యొక్క సహాయాన్ని అందిస్తారు. తండ్రి అయితే సదా విదేహియే. శరీర భానము లేనే లేదు. కావున తండ్రి రెండు శక్తుల యొక్క సహాయాన్ని ఇవ్వగలుగుతారు. యోగము లేకపోతే శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? వీరు యోగీలా లేక జ్ఞానీలా అన్నది అర్థం చేసుకోవడం జరుగుతుంది. యోగం కొరకు రోజురోజుకు కొత్త-కొత్త విషయాలను కూడా అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఇలా అర్థం చేయించేవారు కాదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు బాబా దృఢంగా పైకి ఎత్తుతారు, తద్వారా సోదరీ-సోదరుల సంబంధం కూడా తొలగిపోయి కేవలం సోదర దృష్టియే ఉండిపోతుంది. ఆత్మలమైన మనం సోదరులము. ఇది చాలా ఉన్నతమైన దృష్టి. అంతిమం వరకూ ఈ పురుషార్థము నడవాలి. ఎప్పుడైతే సతోప్రధానులుగా అవుతారో, అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు, అందుకే ఎంత వీలైతే అంత పురుషార్థాన్ని పెంచాలి. వృద్ధులకు ఇది ఇంకా సహజము. ఇప్పుడు మనం తప్పకుండా తిరిగి వెళ్ళాలి. యువతకు ఎప్పుడూ ఇటువంటి ఆలోచనలు రావు. వృద్ధులు వానప్రస్థులుగా ఉంటారు. ఇప్పుడు మేము ఇక తిరిగి వెళ్ళాలి అని భావించడం జరుగుతుంది. కావున ఈ జ్ఞాన విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి. వృక్షము యొక్క వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృద్ధి పొందుతూ, పొందుతూ మొత్తం వృక్షమంతా తయారైపోతుంది. ముళ్ళ నుండి మారి, చిన్నని కొత్త పుష్పాల వృక్షముగా అవ్వాలి. కొత్తగా అయి మళ్ళీ పాతగా అవుతుంది. మొదట వృక్షము చిన్నగా ఉంటుంది, ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది. వృద్ధి పొందుతూ, పొందుతూ చివరిలో ముళ్ళుగా అయిపోతారు. మొదట పుష్పాలుగా ఉంటారు. దాని పేరే స్వర్గము. ఆ తర్వాత ఆ సుగంధము, ఆ శక్తి ఉండదు. ముళ్ళలో సుగంధము ఉండదు. కొన్ని సాధారణమైన పుష్పాలలో కూడా సుగంధము ఉండదు. తండ్రి తోట యజమాని మరియు నావికుడు కూడా, అందరి నావను ఆవలి తీరానికి చేరుస్తారు. నావను తీరానికి ఎలా చేరుస్తారు? ఎక్కడికి తీసుకువెళ్తారు? ఇవి కూడా తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు పురుషార్థము కూడా చేయరు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. కొన్ని-కొన్ని విమానాలైతే ధ్వని కన్నా వేగంగా వెళ్తాయి. ఆత్మ ఎలా పరిగెడుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అయితే రాకెట్ కన్నా కూడా వేగంగా వెళ్తుంది. ఆత్మ అంతటి వేగంగా ఇంకేదీ ఉండదు. ఆ రాకెట్లలో ఎటువంటి వస్తువులను వేస్తారంటే అవి త్వరగా తీసుకువెళ్ళిపోతాయి. వినాశనం కొరకు ఎన్ని బాంబులు మొదలైనవి తయారుచేస్తారు. స్టీమర్లు, విమానాలలో కూడా బాంబులు తీసుకువెళ్తారు. ఈ రోజుల్లో పూర్తి ఏర్పాట్లు చేసి పెట్టుకుంటారు. వార్తాపత్రికల్లో ఇలా వ్రాస్తూ ఉంటారు - మేము ఈ బాంబులను ఉపయోగించము అని చెప్పలేము, మేము ఈ బాంబులను వేయవచ్చు, ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వినాశనమైతే తప్పకుండా జరుగనున్నది. బాంబులు ఉపయోగించకుండా ఉండడం, వినాశనం జరుగకుండా ఉండడం అనేది జరుగదు. మీ కొరకు కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది, అందుకే మీకు ఎంతో సంతోషము ఉండాలి. వేటకు మృత్యువు, వేటగానికి వేట... డ్రామానుసారంగా అందరూ మరణించవలసిందే. పిల్లలైన మీకు డ్రామా జ్ఞానం ఉన్న కారణముగా మీరు చలించరు, సాక్షీగా అయి చూస్తారు. ఏడవవలసిన అవసరమేమీ లేదు. సమయమనుసారముగా శరీరమునైతే వదలవలసే ఉంటుంది. మీ ఆత్మకు తెలుసు - నేను మరుసటి జన్మను రాజరికములో తీసుకుంటాను, నేను రాజకుమారునిగా అవుతాను. ఇది ఆత్మకు తెలుసు, అందుకే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. సర్పములో కూడా ఆత్మ ఉంది కదా. నేను ఒక కుబుసమును వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని అంటుంది. ఎప్పుడో ఒకప్పుడు అది కూడా శరీరాన్ని వదులుతుంది, మళ్ళీ చిన్న పిల్లగా అవుతుంది. పిల్లలైతే జన్మిస్తారు కదా. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవాలి. ఇవన్నీ విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది.

అన్నింటికన్నా ముఖ్యమైన విషయము - తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయడము. ఏ విధముగా పిల్లలు తమ తల్లిదండ్రులకు పూర్తిగా అతుక్కుపోతారో, అలాగే బుద్ధియోగము ద్వారా తండ్రికి పూర్తిగా అతుక్కుపోవాలి. నేను ఎంతవరకూ ధారణ చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి కూడా. (నారదుని ఉదాహరణ) భక్తులు ఎప్పటివరకైతే జ్ఞానాన్ని తీసుకోరో అప్పటివరకూ దేవతలుగా అవ్వలేరు. ఇది కేవలం లక్ష్మిని వరించే విషయం కాదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. మేము సతోప్రధానులుగా ఉన్నప్పుడు విశ్వంపై రాజ్యం చేసేవారము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. ఈ కృషిని కల్పకల్పమూ మీరు యథా యోగము, యథా శక్తి చేస్తూనే వచ్చారు. మేము ఎంతవరకూ ఇతరులకు అర్థం చేయించగలము, దేహాభిమానం నుండి మేము ఎంతవరకూ బయట పడుతూ ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను. ఆత్మనైన నేను దీనిని ఉపయోగిస్తాను, ఇవి నా ఇంద్రియాలు. మనమందరమూ పాత్రధారులము. ఈ డ్రామాలో ఇది అనంతమైన పెద్ద నాటకము. అందులో నంబరువారుగా పాత్రధారులందరూ ఉన్నారు. ఇందులో ఎవరెవరు ముఖ్యమైన పాత్రధారులు, ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఎవరెవరు? అనేది మనం అర్థం చేసుకోగలము. పిల్లలైన మీరు తండ్రి ద్వారా డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. రచయిత ద్వారా రచన యొక్క జ్ఞానం లభిస్తుంది. రచయితయే వచ్చి తన మరియు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది వారి రథము, ఇందులోకి ప్రవేశించి వచ్చారు. అందుకే రెండు ఆత్మలు ఉన్నాయి అని అంటారు. ఇది కూడా సామాన్యమైన విషయమే. పితృలకు తినిపిస్తారు, అప్పుడు ఆత్మ వస్తుంది కదా. ఇంతకుముందు అలా ఎంతగానో వచ్చేవారు, వారిని ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడైతే తమోప్రధానంగా అయిపోయారు. కొందరు ఇప్పుడు కూడా, మేము ఇంతకుముందు జన్మలో ఫలానావారిగా ఉండేవారము అని చెప్తారు. కానీ భవిష్యత్తు గురించి ఎవ్వరూ చెప్పరు. గతాన్ని గురించే వినిపిస్తారు. అలాగని అలా చెప్పే వారందరినీ విశ్వసించరు.

బాబా అంటారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీరు శాంతిలో ఉండాలి. మీరు ఎంతెంతగా జ్ఞాన-యోగాలలో దృఢంగా ఉంటారో అంతగా పక్కాగా, సాలిడ్ గా (శక్తివంతముగా) అయిపోతారు. ఇప్పుడైతే చాలామంది పిల్లలు అమాయకులుగా ఉన్నారు. భారతవాసులైన దేవీ-దేవతలు ఎంత సాలిడ్ గా (శక్తివంతముగా) ఉండేవారు, ధనము పరంగా కూడా సంపన్నముగా ఉండేవారు. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు. వారు సుసంపన్నులుగా, మీరు దివాలా తీసినవారిగా ఉన్నారు. భారత్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది స్వయం మీకు కూడా తెలుసు. ఆకలితో చనిపోవలసే ఉంటుంది. ధాన్యము, నీరు మొదలైనవేవీ లభించవు. ఒక్కో చోట వరదలు వస్తాయి, ఒక్కో చోట నీటి చుక్క కూడా ఉండదు. ఈ సమయంలో దుఃఖపు మేఘాలు ఉన్నాయి, సత్యయుగములో సుఖపు మేఘాలు ఉంటాయి. ఈ ఆటను పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు, ఇంకెవ్వరికీ తెలియదు. బ్యాడ్జిపై అర్థం చేయించడం కూడా చాలా మంచిది. వారు లౌకిక హద్దులోని తండ్రి, వీరు పారలౌకిక అనంతమైన తండ్రి. ఈ తండ్రి ఒకేసారి సంగమములో అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. కొత్త ప్రపంచము తయారైపోతుంది. ఇది ఇనుప యుగము, మళ్ళీ బంగారు యుగము తప్పకుండా తయారవనున్నది. మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. హృదయము స్వచ్ఛంగా ఉంటే సర్వ మనోకామనలు స్వతహాగా నెరవేరుతాయి. ప్రతిరోజూ స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను తప్పుడు పనినైతే చేయలేదు కదా? ఎవరి గురించీ లోపల వికారీ ఆలోచనలైతే రాలేదు కదా? నా నషాలోనే ఉన్నానా లేక పరచింతన, వ్యర్ధ చింతనలో సమయాన్ని వృధా చేసానా? తండ్రి ఆజ్ఞ ఇచ్చారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఒకవేళ స్మృతి చేయకపోతే ఆజ్ఞను తిరస్కరించినవారైపోతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన-యోగాల నషాలో ఉండాలి, హృదయాన్ని స్వచ్ఛముగా ఉంచుకోవాలి. పరచింతన (వ్యర్థ చింతన) లో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు.

2. ఆత్మలమైన మనం సోదరులము, ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి - ఈ అభ్యాసమును పక్కా చేసుకోవాలి. విదేహీగా అయి స్వధర్మములో స్థితులై తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-

స్వ స్వరూపమును మరియు తండ్రి యొక్క సత్య స్వరూపమును గుర్తించి సత్యతా శక్తిని ధారణ చేసే దివ్యతా సంపన్న భవ

ఏ పిల్లలైతే తమ స్వ స్వరూపమును మరియు తండ్రి యొక్క సత్య పరిచయమును యథార్థముగా తెలుసుకుంటారో మరియు అదే స్వరూపము యొక్క స్మృతిలో ఉంటారో, వారిలోకి సత్యతా శక్తి వస్తుంది. వారి ప్రతి సంకల్పము సదా సత్యత మరియు దివ్యతా సంపన్నంగా ఉంటుంది. సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధ-సంపర్కములు అన్నింటిలోనూ దివ్యత యొక్క అనుభూతి కలుగుతుంది. సత్యతను నిరూపించాల్సిన అవసరము ఉండదు. ఒకవేళ సత్యతా శక్తి ఉన్నట్లయితే సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

సకాష్ ను ఇచ్చే సేవను చేసినట్లయితే సమస్యలు సహజంగానే పారిపోతాయి.