20-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు యోగబలముతో ఈ ఉప్పునీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి, అందుకే ఎక్కడికైతే వెళ్ళాలో దానినే స్మృతి చేయండి, మేము ఇప్పుడు ఫకీరుల నుండి సంపన్నులుగా అవుతాము అన్న సంతోషములోనే ఉండండి’’

ప్రశ్న:-

దైవీ గుణాల సబ్జెక్టుపై ఏ పిల్లలకైతే అటెన్షన్ ఉంటుందో, వారి గుర్తులు ఎలా ఉంటాయి?

జవాబు:-

వారి బుద్ధిలో ఏముంటుందంటే - నేను ఎటువంటి కర్మలను చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. వారు ఎప్పుడూ ఎవ్వరినీ విసిగించరు. వారి నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడవు. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. బాబా సమానముగా సుఖమిచ్చే లక్ష్యముంటుంది. అప్పుడే దైవీ గుణాల సబ్జెక్టుపై అటెన్షన్ ఉంది అని అనడం జరుగుతుంది.

ఓంశాంతి

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు స్మృతియాత్రను కూడా నేర్పిస్తున్నారు. స్మృతియాత్ర అర్థాన్ని కూడా పిల్లలు అర్థం చేసుకొని ఉంటారు. భక్తి మార్గములో కూడా దేవతలందరినీ, శివబాబాను స్మృతి చేస్తారు. కానీ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయని అప్పుడు తెలియదు. తండ్రి పతిత-పావనుడని, వారే పావనముగా తయారుచేయడానికి యుక్తిని తెలియజేస్తారని పిల్లలకు తెలుసు. ఆత్మయే పావనంగా అవ్వాలి. ఆత్మయే పతితముగా అవుతుంది. భారత్ లోకే తండ్రి వచ్చి స్మృతియాత్రను నేర్పిస్తారని, ఇంకెక్కడా నేర్పించలేరని పిల్లలకు తెలుసు. దైహికమైన యాత్రలనైతే పిల్లలు ఎన్నో చేసారు. ఈ యాత్రను కేవలం ఒక్క తండ్రే నేర్పించగలరు. మాయ కారణంగా అందరి బుద్ధికి బుద్ధిహీనత అనే తాళం పడిందని ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. మీరు ఎంత వివేకవంతులుగా, షావుకార్లుగా మరియు పవిత్రులుగా ఉండేవారు అనేది ఇప్పుడు బాబా ద్వారా తెలిసింది. మనం మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు మనం మళ్ళీ అలా అవుతున్నాము. తండ్రి ఎంత గొప్ప అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తారు. లౌకిక తండ్రి మహా అయితే ఏ లక్షో లేక కోటో ఇస్తారు. ఇక్కడైతే మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందుకే మీరు ఇక్కడకు చదువు చదువుకునేందుకు వచ్చారు. ఎవరి వద్దకు వచ్చారు? అనంతమైన తండ్రి వద్దకు. బాబా అన్న పదము మమ్మా అన్న పదము కన్నా మధురమైనది. తల్లి పాలన చేసినా కానీ తండ్రి ఎంతైనా తండ్రే కదా, వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. మీరు సదా సుఖవంతులుగా మరియు సదా సౌభాగ్యవతులుగా అవుతున్నారు. బాబా మనల్ని మళ్ళీ ఎలా తయారుచేస్తారు! ఇది కొత్త విషయమేమీ కాదు. ఉదయం సంపన్నులుగా ఉండేవారు, రాత్రి ఫకీరులుగా ఉండేవారు అన్న గాయనము కూడా ఉంది. మీరు కూడా ఉదయం సంపన్నులుగా, మళ్ళీ తర్వాత అనంతమైన రాత్రిలో ఫకీరులుగా అయిపోతారు. బాబా ప్రతిరోజూ స్మృతిని కలిగిస్తారు - పిల్లలూ, నిన్న మీరు విశ్వాధిపతులుగా, సంపన్నులుగా ఉండేవారు, ఈ రోజు మీరు ఫకీరులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఉదయం వచ్చినప్పుడు మీరు సంపన్నులుగా అయిపోతారు. ఇది ఎంత సహజమైన విషయము. పిల్లలైన మీకు అలా సంపన్నులుగా అవుతున్నామని ఎంతో సంతోషము ఉండాలి. బ్రాహ్మణుల పగలు మరియు బ్రాహ్మణుల రాత్రి. ఇప్పుడు పగలులో మీరు సంపన్నులుగా అవుతూ ఉన్నారు మరియు తప్పకుండా అవుతారు కూడా. కానీ నంబరువారు పురుషార్థానుసారంగా అవుతారు. తండ్రి అంటారు - ఇది ఉప్పునీటి కాలువ, దీనిని మీరే దాటుతారు - యోగబలముతో. ఎక్కడికైతే వెళ్ళాలో ఆ స్మృతిని ఉంచుకోవాలి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మనల్ని తీసుకువెళ్ళేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారు ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, మీరే పావనముగా ఉండేవారు, 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పతితముగా అయ్యారు, మళ్ళీ పావనముగా అవ్వాలి. పావనముగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు. పతిత-పావనుడు వస్తారని మరియు మీరు వారి మతముపై నడిచి పావనముగా అవుతారని మీకు తెలుసు. పిల్లలైన మీకు, మేము ఈ పదవిని పొందుతాము అని ఎంతో సంతోషము ఉంటుంది. తండ్రి అంటారు, మీరు 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా అవుతారు. తండ్రి సుఖధామము యొక్క మరియు రావణుడు దుఃఖధామము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. రావణుడు మీ పాత శత్రువని, అతను మిమ్మల్ని పంచ వికారాల రూపీ పంజరములో పడేసాడని, తండ్రి వచ్చి బయటకు తీస్తారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఎవరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, వారు అంతగా ఇతరులకు కూడా పరిచయాన్ని ఇస్తారు. స్మృతి చేయనివారు దేహాభిమానంలో ఉంటారు. వారు తండ్రిని స్మృతీ చేయలేరు, అలాగే తండ్రి పరిచయాన్నీ ఇవ్వలేరు. ఆత్మలమైన మనం సోదరులము, భిన్న-భిన్న పాత్రలను అభినయించడానికి ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము. మొత్తం పాత్ర అంతా ఎలా అభినయించబడుతుంది అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. ఎవరికైతే పక్కా నిశ్చయముంటుందో, వారు వచ్చి ఇక్కడ రిఫ్రెష్ అవుతారు. ఇది మీరు టీచర్ తో పాటే ఉండి చదువుకోవలసిన చదువేమీ కాదు. మీరు మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదువుకోవచ్చు. కేవలం ఒక వారం రోజులు బాగా అర్థం చేసుకోండి, ఆ తర్వాత బ్రాహ్మణీలు కొందరిని ఒక నెలలో, కొందరిని ఆరు నెలల్లో, కొందరిని 12నెలల తర్వాత తీసుకువస్తారు. నిశ్చయం కలగగానే పరుగెడతారని బాబా అంటారు.

మేము వికారాలలోకి వెళ్ళము అని రాఖీని కూడా కట్టుకోవాలి. మనం శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తాము. శివబాబాయే అంటారు - పిల్లలూ, మీరు నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి. ఒకవేళ వికారాలలోకి వెళ్తే చేసిన సంపాదనంతా అంతమైపోతుంది, 100 రెట్ల శిక్ష పడుతుంది. 63 జన్మలు మీరు మునకలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక పవిత్రులుగా అవ్వండని బాబా చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. ఆత్మలు పరస్పరం సోదరులు. ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు. ఒకవేళ ఎవరైనా రెగ్యులర్ గా చదువుకోకపోతే వారిని తొందరపాటుతో తీసుకురాకూడదు. ఒక్క రోజులో కూడా బాణం తగులవచ్చునని బాబా అంటారు, కానీ బుద్ధిని కూడా ఉపయోగించాలి. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు. మీది చాలా ఉన్నతమైన కులము. అక్కడ ఎటువంటి సత్సంగాలు మొదలైనవి ఉండవు. సత్సంగాలు భక్తి మార్గంలో ఉంటాయి. సత్యమైనవారి సాంగత్యము తీరాన్ని చేరుస్తుందని మీకు తెలుసు, ఎప్పుడైతే సత్యయుగ స్థాపన జరగవలసి ఉంటుందో అప్పుడే సత్యమైనవారి సాంగత్యము లభిస్తుంది. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు ఎందుకంటే బుద్ధికి తాళం వేసి ఉంది. ఇప్పుడు ఇక సత్యయుగములోకి వెళ్ళాలి. పురుషోత్తమ సంగమయుగములోనే సత్యమైనవారి సాంగత్యము లభిస్తుంది. ఆ గురువులు సంగమయుగానికి చెందినవారు కారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు పిల్లలూ, పిల్లలూ అని అంటూ పిలుస్తారు. ఆ గురువులను మీరు ఏమైనా బాబా (తండ్రి) అని అంటారా. బుద్ధికి పూర్తిగా గోద్రెజ్ తాళం పడి ఉంది. బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు. మనుష్యులు వచ్చి వజ్రతుల్యమైన జీవితాన్ని తయారుచేసుకోవాలని బాబా ఎన్ని యుక్తులను రచిస్తారో చూడండి. మ్యాగజైన్లు, పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణము జరిగినట్లయితే అనేకుల ఆశీర్వాదము కూడా లభిస్తుంది. ప్రజలను తయారుచేసుకునే పురుషార్థాన్ని చేయాలి. స్వయాన్ని బంధనాల నుండి విముక్తులుగా చేసుకోవాలి. శరీర నిర్వహణార్థం ఉద్యోగం అయితే తప్పకుండా చేయాలి. ఈశ్వరీయ సేవ కేవలం ఉదయం మరియు సాయంత్రం జరుగుతుంది. ఆ సమయంలో అందరికీ ఖాళీ ఉంటుంది. ఎవరితోనైతే మీరు లౌకిక ఉద్యోగం చేస్తారో వారికి కూడా - మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు అన్న పరిచయాన్ని ఇస్తూ ఉండండి. లౌకిక తండ్రి అందరికీ వేర్వేరు. పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే. వారు సుప్రీమ్. బాబా అంటారు - నాకు కూడా పాత్ర ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు నా పరిచయాన్ని తెలుసుకున్నారు. ఆత్మను కూడా మీరు తెలుసుకున్నారు. ఆత్మను గురించి - భృకుటి మధ్యలో ఒక అద్భుత సితార మెరుస్తూ ఉంటుంది అని అంటారు. అది అకాల సింహాసనం కూడా. ఆత్మను ఎప్పుడూ మృత్యువు కబళించదు. అది కేవలం మురికిగా మరియు శుభ్రంగా అవుతుంది. ఆత్మ యొక్క ఆసనము భృకుటి మధ్యలోనే శోభిస్తుంది. తిలకము గుర్తును కూడా అక్కడే చూపిస్తారు. తండ్రి అంటున్నారు - మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు యోగ్యులుగా తయారుచేసుకోండి. నేను అందరికీ రాజ్యతిలకాన్ని ఇస్తానని కాదు. మీకు మీరే ఇప్పించుకోండి. ఎవరెవరు చాలా సేవ చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు. మ్యాగజైన్లలో కూడా చాలా మంచి వివరణలు వస్తూ ఉంటాయి. దానితోపాటు యోగము యొక్క శ్రమ కూడా చేయాలి, తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. రోజురోజుకు మీరు మంచి రాజయోగులుగా అవుతారు. ఇప్పుడు శరీరాన్ని వదిలేస్తాము, దానితో ఇక మేము వెళ్ళిపోతాము అని భావిస్తారు. సూక్ష్మవతనము వరకైతే పిల్లలు వెళ్తారు, మూలవతనము గురించి కూడా, అది ఆత్మలైన మన ఇల్లు అన్నది పిల్లలకు బాగా తెలుసు. మనుష్యులు శాంతిధామం కొరకే భక్తి చేస్తారు. సుఖధామము గురించైతే వారికి తెలియనే తెలియదు. స్వర్గములోకి వెళ్ళే శిక్షణనైతే తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇది ప్రవృత్తి మార్గము. ఇరువురూ ముక్తిధామములోకి వెళ్ళాలి. వారైతే తప్పుడు మార్గాన్ని చెప్తారు, అలా ఎవ్వరూ వెళ్ళరు. అందరినీ చివరిలో తండ్రియే తీసుకువెళ్తారు. ఇది వారి బాధ్యత. కొందరు బాగా చదువుకొని రాజ్యభాగాన్ని తీసుకుంటారు. మిగిలినవారంతా ఎలా చదువుతారు. వారు ఏ విధముగా నంబరువారుగా వస్తారో అలాగే నంబరువారుగా వెళ్తారు. ఈ విషయాలలో ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోకండి.

బాబాను స్మృతి చేయడానికి కూడా ఖాళీ లభించటం లేదు అని అంటారు, మరి అటువంటి విషయాలలో సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు. వీరు అనంతమైన తండ్రి, టీచర్ మరియు గురువు కూడా అన్న నిశ్చయమైతే ఉంది. మరి ఇంకెవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరం లేదు. కల్పక్రితం కూడా శ్రీమతంపై నడిచి పావనంగా అయ్యామని మీకు తెలుసు. ఘడియ-ఘడియ చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. మీ పేరు స్వదర్శన చక్రధారి. (బావి నుండి నీటిని తోడడం మరియు ఆ నీటిని ఒంపడంతో పోలుస్తూ) జ్ఞానసాగరుడి నుండి మీరు నింపుకోవడంలో పెద్ద సమయం పట్టదు, ఖాళీ అవ్వడంలో సమయం పడుతుంది. మీరు చాలాకాలం తర్వాత కలిసిన మధురమైన పిల్లలు ఎందుకంటే కల్పం తర్వాత వచ్చి కలుసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. మనం 84 జన్మల తర్వాత మళ్ళీ వచ్చి తండ్రిని కలుసుకున్నాము. తండ్రి అంటారు, ఎవరైతే మొదట భక్తిని చేసారో వారే మొదట జ్ఞానాన్ని తీసుకునేందుకు కూడా యోగ్యులుగా అయ్యారు ఎందుకంటే భక్తి యొక్క ఫలము కావాలి. కావున ఎల్లప్పుడూ మీ ఫలాన్ని లేక వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఫలము అన్న పదము భక్తి మార్గానికి చెందినది. వారసత్వము అన్నది సరిగ్గా సరిపోతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వము లభిస్తుంది, ఇంకే ఉపాయమూ లేదు. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. మేము భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని నేర్చుకుంటామని వారు భావిస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు - వారు డ్రామానుసారంగా హఠయోగులుగా అవుతారు. రాజయోగాన్ని ఇప్పుడు మీరు నేర్చుకుంటారు ఎందుకంటే ఇప్పుడిది సంగమయుగము. వారి ధర్మము వేరు. వాస్తవానికి వారు గురువులను ఆశ్రయించకూడదు. కానీ అది కూడా డ్రామానుసారంగా మళ్ళీ చేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు ధర్మయుక్తముగా అవ్వాలి. ధర్మములోనే శక్తి ఉంది. మిమ్మల్ని నేను ఏ దేవీ-దేవతలుగానైతే తయారుచేస్తానో, ఆ ధర్మం ఎంతో సుఖాన్ని ఇచ్చే ధర్మము. ఎవరైతే నాతో యోగాన్ని జోడిస్తారో, నా శక్తి కూడా వారికే లభిస్తుంది. కావున తండ్రి స్వయం ఏ ధర్మాన్ని అయితే స్థాపిస్తారో అందులో ఎంతో శక్తి ఉంది. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇందులో ఎంతో శక్తి ఉంది అని తండ్రి ఈ ధర్మాన్ని మహిమ చేస్తారు. సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తి అనేకులకు లభిస్తుంది. వాస్తవానికి శక్తి అందరికీ లభిస్తుంది కానీ నంబరువారుగా లభిస్తుంది. మీకు ఎంత శక్తి కావాలనుకుంటే అంత బాబా నుండి తీసుకోండి, దానితో పాటు దైవీ గుణాల సబ్జెక్ట్ కూడా కావాలి. ఎవరినీ విసిగించకూడదు, దుఃఖాన్నివ్వకూడదు. వీరు ఎప్పుడూ ఎవరితోనూ తప్పుడు మాటలను మాట్లాడరు. ఎటువంటి కర్మలను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని వారికి తెలుసు. అసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి రావాలి. నేను ఎవరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వడం లేదు కదా అని చూసుకోవాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వనివారు ఎవ్వరూ ఉండరు. ఏవో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండే అవస్థ అంతిమంలోనే వస్తుంది. ఈ సమయంలో మనం పురుషార్థీ అవస్థలో ఉన్నాము. ప్రతి విషయమూ నంబరువారు పురుషార్థానుసారంగా జరుగుతుంది. అందరూ సుఖము కొరకే పురుషార్థము చేస్తారు. కానీ తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుఖాన్ని ఇవ్వలేరు. సోమనాథ మందిరములో ఎన్ని వజ్ర-వైఢూర్యాలున్నాయో గమనించడం జరుగుతుంది. అవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి, షావుకార్లుగా ఎలా అయ్యారు? రోజంతా ఈ చదువు యొక్క చింతనలోనే ఉండాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి. మీరు ఈ పురుషార్థాన్ని చేసారు కావుననే మాల తయారైంది. అది కల్ప-కల్పమూ తయారవుతూ ఉంటుంది. మాల ఎవరి స్మృతిచిహ్నము అన్నది కూడా మీకు తెలుసు. వారైతే మాలను స్మరించి ఎంతో నషాలో నిమగ్నమైపోతారు. భక్తిలో ఏం జరుగుతుంది మరియు జ్ఞానంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మీకే తెలుసు. మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. పురుషార్థం చేస్తూ-చేస్తూ చివరికి అంతిమ సమయము యొక్క రిజల్టు కల్పక్రితం వలె వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకుంటూ ఉండాలి. మేము ఈ విధముగా తయారవ్వాలని మీరు భావిస్తారు. పురుషార్థము కోసం అవకాశం లభించింది. నంబరువారు పురుషార్థానుసారంగా తండ్రి కూడా మీకు స్వాగతం పలుకుతారు. పిల్లలైన మీరు ఏ స్వాగతమునైతే చేస్తారో దాని కన్నా ఎక్కువగా తండ్రి మీకు స్వాగతం చేస్తారు. మీకు స్వాగతం పలుకడమే తండ్రి పని. స్వాగతమనగా సద్గతి. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన స్వాగతం. మీ అందరికీ స్వాగతం పలికేందుకే తండ్రి వస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనేకుల ఆశీర్వాదాన్ని తీసుకునేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ కూడా స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని ఉదయము-సాయంత్రము ఈశ్వరీయ సేవను తప్పకుండా చేయాలి.

2. ఇతర విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రిని స్మృతి చేసి శక్తిని తీసుకోవాలి. సత్యమైనవారి సాంగత్యములోనే ఉండాలి. మనసా-వాచా-కర్మణా అందరికీ సుఖాన్ని ఇచ్చే పురుషార్థాన్నే చేయాలి.

వరదానము:-

పవిత్రతా వరదానాన్ని నిజ సంస్కారముగా చేసుకొని పవిత్ర జీవితాన్ని తయారుచేసుకునే శ్రమ నుండి ముక్త భవ

కొంతమంది పిల్లలకు పవిత్రతలో కష్టము అనిపిస్తుంది, తద్వారా వారు వరదాత తండ్రి నుండి జన్మ వరదానాన్ని తీసుకోలేదని నిరూపణ అవుతుంది. వరదానములో కష్టము అనిపించదు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మ యొక్క మొదటి వరదానము - ‘‘పవిత్ర భవ, యోగీ భవ’’. ఏ విధంగా జన్మతో వచ్చిన సంస్కారాలు చాలా దృఢంగా ఉంటాయో, అదే విధంగా పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారము, నిజ సంస్కారము. ఈ స్మృతి ద్వారానే పవిత్ర జీవితాన్ని తయారుచేసుకోండి. శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి.

స్లోగన్:-

ఎవరిలోనైతే సేవ యొక్క శుద్ధమైన భావన ఉంటుందో, వారే ట్రస్టీలు.