21-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 30.03.99


‘‘తీవ్ర పురుషార్థము యొక్క తపనను జ్వాలా రూపంగా చేసి అనంతమైన వైరాగ్యము యొక్క అలను వ్యాపింపజేయండి’’

ఈ రోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై మూడు రేఖలను చూస్తున్నారు. వాటిలోని మొదటి రేఖ - పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ. ఈ పరమాత్మ పాలనా భాగ్యము మొత్తము కల్పములో ఇప్పుడు ఒక్కసారే లభిస్తుంది, ఈ సంగమయుగములో తప్ప ఈ పరమాత్మ పాలన మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. రెండవ రేఖ - పరమాత్మ చదువు యొక్క భాగ్యపు రేఖ. పరమాత్మ చదువు, ఇది ఎంతటి భాగ్యము, ఎందుకంటే స్వయంగా పరమాత్మ శిక్షకునిగా అయ్యి చదివిస్తున్నారు. మూడవ రేఖ - పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులు ఉన్నాయో ఆలోచించండి. అందరికీ గుర్తుంది కదా - ప్రాప్తుల లిస్టు ఎంత పెద్దది! ప్రతి ఒక్కరి మస్తకముపై ఈ మూడు రేఖలు మెరుస్తూ ఉన్నాయి. స్వయాన్ని ఇటువంటి భాగ్యవంతులైన ఆత్మలుగా భావిస్తున్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు. అలాగే బాప్ దాదా పిల్లల నిశ్చయము ఆధారంగా కలిగే ఆత్మిక నషాను కూడా చూస్తున్నారు. పరమాత్ముని పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతటి ఆత్మిక నషా కల ఆత్మలు! మొత్తము విశ్వములో మరియు మొత్తము కల్పములో అందరికంటే హైయ్యెస్ట్ (అతి ఉన్నతమైనవారు) కూడా, గొప్పవారు కూడా మరియు హోలియెస్ట్ (అతి పవిత్రమైనవారు) కూడా. మీ వలె తనువు ద్వారా కూడా, మనస్సు ద్వారా కూడా పవిత్ర ఆత్మలుగా మరియు దేవతా రూపంలో సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఇంకెవ్వరూ అవ్వరు. అంతేకాక మీరు హైయ్యెస్ట్ కూడా, హోలియెస్ట్ కూడా, అలాగే రిచెస్ట్ కూడా (అతి ఉన్నతులు, అతి పవిత్రులు, అతి సంపన్నులు). బాప్ దాదా స్థాపనా సమయంలో కూడా పిల్లలకు ఈ స్మృతిని ఇప్పించేవారు మరియు వార్తాపత్రికలలో కూడా ‘‘ఓం మండలి రిచెస్ట్ ఇన్ ద వరల్డ్’’ (ప్రపంచంలోకల్లా ధనవంతమైనది ఓం మండలి) అని శుద్ధమైన నషాతో వేయించారు. స్థాపనా సమయంలో ఇది మీ అందరి మహిమ. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా కానీ ఒక్క రోజులో మీ అంతటి రిచెస్ట్ గా అవ్వలేరు. ఇంత రిచెస్ట్ గా అయ్యేందుకు సాధనము ఏమిటి? అది చాలా చిన్న సాధనము. లోకులు చాలా రిచెస్ట్ గా అయ్యేందుకు ఎంతగా కష్టపడుతుంటారు కానీ మీరు ఎంత సహజంగా సంపన్నులుగా అవుతూ ఉంటారు! సాధనము ఏమిటో తెలుసు కదా! కేవలం ఒక చిన్న బిందువును పెట్టాలి, అంతే. బిందువును పెట్టారు, సంపాదన కలిగింది. ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు మరియు డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టడము, అది కూడా బిందువే. కనుక బిందువైన ఆత్మను గుర్తు చేసారు, సంపాదన పెరిగింది. మామూలుగా లౌకికములో కూడా చూడండి, బిందువును పెట్టడం వల్ల సంఖ్య విలువ పెరుగుతుంది. 1 పక్కన బిందువు (సున్నా) పెట్టడం వల్ల ఏమవుతుంది? 10 అవుతుంది, రెండు బిందువులు పెట్టండి, మూడు బిందువులు పెట్టండి, నాలుగు బిందువులు పెట్టండి, అలా సంఖ్య విలువ పెరుగుతూ ఉంటుంది. మరి మీ సాధనము ఎంత సహజమైనది! ‘‘నేను ఆత్మను’’ - ఈ స్మృతి బిందువును పెట్టడము అనగా ఖజానా జమ అవ్వటము. అలాగే ‘‘బాబా’’ అన్న బిందువును పెట్టండి, ఖజానా జమ అవుతుంది. కర్మలలో, సంబంధ-సంపర్కాలలో డ్రామా అన్న ఫుల్ స్టాప్ ను పెట్టండి, గతానికి ఫుల్ స్టాప్ పెట్టారంటే ఖజానా పెరుగుతుంది. మరి చెప్పండి, మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు బిందువును పెడుతున్నారు? బిందువును పెట్టడము కూడా ఎంత సహజము! కష్టమా? బిందువు జారిపోతుందా ఏమిటి?

బాప్ దాదా సంపాదనకు సాధనంగా కేవలం ఇదే నేర్పించారు - బిందువును పెడుతూ వెళ్ళండి, మరి అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? ఒకవేళ వస్తుంది అని అనుకుంటే ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. పక్కానే కదా! లేకపోతే ఒక్కోసారి జారిపోతుంది, ఒక్కోసారి పెడుతున్నారా? అన్నింటికన్నా సహజము - బిందువును పెట్టడము. ఎవరికైనా ఈ నేత్రాల పరంగా కళ్ళు కనిపించకపోయినా, వారు కూడా ఒకవేళ కాగితంపై పెన్సిల్ పెడితే బిందువు పడుతుంది, మరి మీరైతే త్రినేత్రులు, అందుకే ఈ మూడు బిందువులను సదా ఉపయోగించండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది. వ్రాసి చూడండి, వంకరగా ఉంటుంది కదా? కానీ బిందువు ఎంత సహజమైనది. అందుకే బాప్ దాదా రకరకాల రూపాలలో పిల్లలకు సమానులుగా అయ్యే విధిని వినిపిస్తుంటారు. బిందువే విధి. మరే విధి లేదు. ఒకవేళ విదేహీగా అయినా, దానికి కూడా విధి - బిందువుగా అవ్వటమే, అశరీరిగా అయినా లేక కర్మాతీతులుగా అయినా అన్నింటికీ విధి - బిందువే. అందుకే బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - అమృతవేళ బాప్ దాదాతో మిలనము జరుపుకుంటూ, ఆత్మిక సంభాషణ చేస్తూ, ఎప్పుడైతే కార్యంలోకి వస్తారో, అప్పుడు మొదట 3 బిందువుల తిలకాన్ని మస్తకముపై పెట్టుకోండి, ఆ ఎరుపు రంగు బిందువులు కల తిలకాన్ని పెట్టుకోవటము మొదలుపెట్టకండి, స్మృతి అనే తిలకాన్ని పెట్టుకోండి. మరియు చెక్ చేసుకోండి - ఏ కారణం చేత కూడా ఈ స్మృతి తిలకము చెరిగిపోవటం లేదు కదా. ఇది అవినాశీ చెరిగిపోని తిలకము కదా?

బాప్ దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తారు, మిలనాన్ని జరుపుకోవటానికి ఎంత ప్రేమతో పరుగు పరుగున వస్తారు! ఈ రోజు హాల్లో కూడా మిలనాన్ని జరుపుకునేందుకు ఎంత శ్రమతో, ఎంత ప్రేమతో నిద్ర, దప్పికలను కూడా మర్చిపోయి మొదటి నంబరులో సమీపంగా కూర్చునేందుకు ఎంతో పురుషార్థం చేస్తారు! ఏమేమి చేస్తున్నారో అవన్నీ బాప్ దాదా చూస్తారు. ఆ డ్రామా అంతా చూస్తారు. బాప్ దాదా పిల్లల ప్రేమపై బలిహారమవుతారు కూడా మరియు పిల్లలతో ఇదే చెప్తారు - ఏ విధంగా సాకారముగా మిలనము జరుపుకునేందుకు పరుగు పరుగున వస్తారో, అదే విధంగా బాబా సమానంగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థము చెయ్యండి. అందరికంటే ముందు స్థానంలో కూర్చోవాలని అనుకుంటారు కదా. కానీ అది అందరికీ లభించదు, ఎందుకంటే ఇక్కడిది సాకారీ ప్రపంచము కదా, కనుక సాకారీ ప్రపంచపు నియమాలను పాటించవలసే ఉంటుంది. అందరూ ముందు ముందు స్థానాలలో కూర్చోవాలనే ఆ సమయంలో బాప్ దాదా అనుకుంటారు కానీ అది సాధ్యమవుతుందా? సాధ్యమవుతూ ఉంది కూడా, కానీ ఎలా? వెనుక ఉన్నవారిని బాప్ దాదా సదా నయనాలలో ఇమిడి ఉన్నట్లుగా చూస్తారు. అన్నింటికంటే సమీపమైనవి నయనాలు. కనుక మీరు వెనుక కూర్చోలేదు కానీ బాప్ దాదా నయనాలలో కూర్చున్నారు. మీరు కంటి రత్నాలు. వెనుక ఉన్నవారు విన్నారా? మీరు దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. శరీర పరంగా వెనుక కూర్చున్నారు కానీ ఆత్మ అందరికన్నా సమీపంగా ఉంది. మరియు బాప్ దాదా అయితే అందరికంటే ఎక్కువగా వెనుక ఉన్నవారినే చూస్తారు. చూడండి, దగ్గరగా కూర్చున్నవారికి ఈ స్థూల నయనాల ద్వారా చూసేందుకు అవకాశము ఉంది మరియు వెనుక ఉన్నవారికైతే ఈ నయనాలతో దగ్గరగా చూసే అవకాశము లేదు, అందుకని బాప్ దాదా వారిని తమ నయనాలలో ఇముడ్చుకుంటారు.

బాప్ దాదా నవ్వుకుంటూ ఉంటారు - మధ్యాహ్నం 2 గం. లు అవ్వగానే లైన్ మొదలైపోతుంది. బాప్ దాదాకు పిల్లలు నిలబడి-నిలబడి అలసిపోతారు కూడా అని అర్థమవుతుంది కానీ బాప్ దాదా పిల్లలందరికీ ప్రేమ యొక్క మసాజ్ చేస్తారు. కాళ్ళకు మసాజ్ అయిపోతుంది. బాప్ దాదా చేసే మసాజ్ ను చూసారు కదా - అది చాలా అతీతమైనది మరియు ప్రియమైనది. మరి ఈ రోజు అందరూ ఈ సీజన్ లోని చివరి అవకాశాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి పరుగు పరుగున చేరుకున్నారు. మంచిది. బాబాతో మిలనము జరుపుకోవాలన్న ఉల్లాస-ఉత్సాహాలు సదా ముందుకు తీసుకువెళ్తాయి. కానీ బాప్ దాదా అయితే పిల్లలను ఒక్క క్షణం కూడా మర్చిపోరు. బాబా ఒక్కరే మరియు పిల్లలు అనేకులు, అయినా కానీ అనేకులైన పిల్లలను కూడా బాప్ దాదా ఒక్క క్షణం కూడా మర్చిపోరు ఎందుకంటే మీరు చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు. చూడండి, ఎక్కడెక్కడి నుండో, దేశ-విదేశాలలోని మూల-మూలల నుండి బాబాయే మిమ్మల్ని వెతికారు. మీరు బాబాను వెతకగలిగారా? భ్రమిస్తూనే ఉన్నారు కానీ కలుసుకోలేకపోయారు కానీ బాబా అయితే భిన్న-భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాలు ఎక్కడెక్కడైతే బాబా పిల్లలు ఉన్నారో అక్కడి నుండి వెతికారు, తమవారిగా చేసుకున్నారు. ‘నేను బాబా వాడిని మరియు బాబా నా వారు’ అని పాట పాడుతారు కదా! జాతినీ చూడలేదు, దేశాన్నీ చూడలేదు, రంగునూ చూడలేదు, అందరి మస్తకముపై ఒకే ఆత్మిక రంగును చూసారు - జ్యోతిర్బిందువు. డబుల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు? బాబా జాతిని చూసారా? నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, శ్యామంగా ఉన్నారు, సుందరంగా ఉన్నారు అని చూసారా? అవేమీ చూడలేదు. ‘నా వారు’ అన్నదానినే చూసారు. మరి చెప్పండి, బాబాకు ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? (ఇద్దరికీ ఉంది). పిల్లలు కూడా సమాధానం చెప్పటంలో తెలివైనవారు. పిల్లలు అంటారు - బాబా, ప్రేమతో ప్రేమ ఆకర్షిస్తుంది అని మీరే చెప్పారు కదా, మరి మీకు ప్రేమ ఉంటే మాకు కూడా ఉంటుంది కదా, అదే కదా ఆకర్షిస్తుంది. పిల్లలు కూడా తెలివైనవారు మరియు నా పిల్లలు ఇంతటి ధైర్యాన్ని మరియు ఉల్లాస-ఉత్సాహాన్ని చూపించేవారు అని బాబాకు కూడా సంతోషంగా ఉంది.

బాప్ దాదా వద్దకు చాలామంది పిల్లలది 15 రోజుల చార్టు యొక్క రిజల్టు చేరుకుంది. ఒక విషయాన్ని అయితే బాప్ దాదా నలువైపుల నుండి వచ్చిన రిజల్టులో చూసారు, అదేమిటంటే - మెజారిటీ పిల్లలలో అటెన్షన్ ఉంది. కానీ పర్సెంటేజ్ అనేది స్వయం ఎంత కోరుకుంటున్నారో అంతైతే లేదు, కానీ అటెన్షన్ ఉంది. అంతేకాక తీవ్ర పురుషార్థీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు తమ మనసు లోలోపలే ప్రతిజ్ఞను పూర్తి చెయ్యాలన్న లక్ష్యముతో ముందుకు వెళ్తున్నారు కూడా మరియు ముందుకు వెళ్తూ-వెళ్తూ గమ్యానికి తప్పకుండా చేరుకుంటారు. కొద్దిమంది మాత్రం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యానికి, సోమరితనానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా పెడుతున్నారు. అటువంటివారిది ఒక విశేషమైన స్లోగన్ ఉంటుంది - అయిపోతాములే, అయిపోతాములే... అని అంటారు. అయిపోవాల్సిందే అని అనరు, అయిపోతాములే అని అంటారు. అయిపోతుందిలే అని అనుకోవటమంటే అది నిర్లక్ష్యము. అవ్వాల్సిందే అని అనుకుంటే అది తీవ్ర పురుషార్థము. బాప్ దాదా ప్రతిజ్ఞలను చాలానే వింటారు, పదే-పదే ప్రతిజ్ఞలనైతే చాలా మంచివి చేస్తారు. పిల్లలు ఈ ప్రతిజ్ఞలను ఎంత మంచి ధైర్యంతో చేస్తారంటే, ఆ సమయంలో పిల్లలు బాప్ దాదాకు కూడా దిల్ ఖుష్ మిఠాయిని తినిపించేస్తారు, బాబా కూడా తినేస్తారు. కానీ ప్రతిజ్ఞ అనగా పురుషార్థములో ఎక్కువలో ఎక్కువ లాభాన్ని పొందటము. ఒకవేళ లాభం లేదంటే ఆ ప్రతిజ్ఞ సమర్థవంతమైనది కాదు. కనుక ప్రతిజ్ఞనైతే చెయ్యండి, ఎంతైనా దిల్ ఖుష్ మిఠాయినైతే తినిపిస్తారు కదా! దీనితోపాటుగా తీవ్ర పురుషార్థము యొక్క తపనను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలాముఖులుగా అవ్వండి. సమయమనుసారంగా మనసు యొక్క, సంబంధ-సంపర్కాల యొక్క లెక్కాచారాలు ఏవైతే మిగిలి ఉన్నాయో, వాటిని జ్వాలా స్వరూపముతో భస్మం చెయ్యండి. తపన ఉంది, ఈ విషయంలో బాప్ దాదా కూడా పాస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ తపనను అగ్ని రూపములోకి తీసుకురండి.

విశ్వములో ఒకవైపు భ్రష్టాచారము, అత్యాచారము అనే అగ్ని ఉంటుంది, మరొకవైపు పిల్లలైన మీ యొక్క శక్తిశాలీ యోగము అనగా తపన యొక్క అగ్ని జ్వాలారూపములో ఉండటము అవసరము. ఆ జ్వాలా రూపము ఈ భ్రష్టాచారము, అత్యాచారము అనే అగ్నిని సమాప్తం చేస్తుంది మరియు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. మీ తపన జ్వాలా రూపముదై ఉండాలి అనగా శక్తిశాలి యోగము ఉండాలి, అప్పుడు ఈ స్మృతి యొక్క అగ్ని, ఆ అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు ఇంకొకవైపు ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని, శీతల స్వరూపాన్ని అనుభూతి చేయిస్తుంది. ఇది అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రజ్వలితము చేయిస్తుంది. ఒకవైపు భస్మము చేస్తుంది, మరొకవైపు శీతలంగా కూడా చేస్తుంది. అనంతమైన వైరాగ్యము యొక్క అలను వ్యాపింపజేస్తుంది. పిల్లలు ఏమంటారంటే - నా యోగమైతే ఉంది, నాకు బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇది చాలా మంచిదే కానీ సమయమనుసారంగా ఇప్పుడు జ్వాలా రూపులుగా అవ్వండి. ఏ విధంగా స్మృతి చిహ్నాలలో శక్తుల శక్తి రూపాన్ని, మహాశక్తి రూపాన్ని, సర్వ శస్త్రధారి రూపాన్ని చూపించారో, ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి. పాండవులైనా, శక్తులైనా అందరూ సాగరము నుండి వెలువడిన జ్ఞాన నదులే. మీరు సాగరము కాదు, మీరు నదులు, మీరు జ్ఞాన గంగలు. కనుక జ్ఞాన గంగలైన మీరు ఇప్పుడు ఆత్మలను మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చెయ్యండి. ఇది వర్తమాన సమయంలోని బ్రాహ్మణుల కార్యము.

ఈ సంవత్సరములో ఏ సేవ చెయ్యాలి అని పిల్లలందరూ అడుగుతుంటారు. బాప్ దాదా మొదటి సేవ ఇదే చెప్తున్నారు - ఇప్పుడు సమయమనుసారంగా పిల్లలందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు, మరి వానప్రస్థులు తమ సమయాన్ని, సాధనాలను పిల్లలందరికీ ఇచ్చేసి స్వయం వానప్రస్థులైపోతారు. కనుక మీరందరూ కూడా మీ సమయము యొక్క ఖజానాను, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల కోసం వినియోగించండి. మీ కొరకు సమయాన్ని, సంకల్పాలను తక్కువగా ఉపయోగించండి. ఇతరుల కొరకు వినియోగించడం ద్వారా స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు నిమిత్తులుగా అవుతారు. మనసా సేవ, వాచా సేవ చేయండి మరియు అన్నింటికంటే ఎక్కువగా - బ్రాహ్మణులకైనా లేక ఇతరులెవరైతే సంబంధ-సంపర్కంలోకి వస్తారో వారికైనా, మీరు మాస్టర్ దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇస్తూ వెళ్ళండి. నిస్వార్థులుగా అయ్యి సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందాన్ని అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి. ఇవ్వాలి, మరియు ఇవ్వటము అంటే స్వతహాగానే తీసుకోవటము. ఎవరు ఏ సమయములో, ఏ రూపముతో సంబంధ-సంపర్కములోకి వచ్చినా వారు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చినవారు ఖాళీగా వెళ్ళకూడదు. బ్రహ్మాబాబాను చూసారు కదా - నడుస్తూ-తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పిల్లలు ఎవరైనా ఎదురుగా వస్తే, వారు ఏదో ఒక అనుభూతిని చేసుకోకుండా ఖాళీగా వెళ్ళేవారు కాదు. కనుక చెక్ చేసుకోండి - మీ వద్దకు ఎవరు వచ్చినా, మిమ్మల్ని ఎవరు కలిసినా వారికి ఏదైనా ఇచ్చారా లేక ఖాళీగా వెళ్ళిపోయారా? ఎవరైతే ఖజానాలతో నిండుగా ఉంటారో, వారు ఇవ్వకుండా ఉండలేకపోతారు. తరగని, అఖండ దాతగా అవ్వండి. ఎవరో అడగాలి అని కాదు. దాత ఎప్పుడూ కూడా - వీరు అడిగితే ఇద్దాము అని చూడరు. అఖండ మహాదానులు, మహాదాతలు తమంతట తామే ఇస్తారు. కనుక ఈ సంవత్సరము మొదట మహాదాతగా అయ్యే సేవ చెయ్యండి. మీరు దాత ద్వారా లభించినదానిని ఇస్తారు. బ్రాహ్మణులు ఎవ్వరూ బికారులు కాదు, వారు సహయోగులు. కనుక పరస్పరంలో బ్రాహ్మణులు ఒకరికొకరు దానమిచ్చుకోకూడదు, సహయోగాన్ని ఇచ్చుకోవాలి. ఇది మొదటి నంబరు సేవ. అలాగే బాప్ దాదా విదేశీ పిల్లల నుండి శుభవార్తను విన్నారు. ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపచెయ్యటానికి నిమిత్తులైనవారు ఎవరైతే ఉన్నారో, వారికి బాప్ దాదా మైక్ అనే పేరును పెట్టారు. విదేశీ పిల్లలు పరస్పరం కలిసి ఈ కార్యాన్ని చేసారు అన్నదానిని బాప్ దాదా చూసారు. మరియు ప్లాన్ తయారుచేసారంటే అది ప్రత్యక్షం రూపంలో జరిగేదే ఉంది. భారత్ లో 13 జోన్లు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రతి ఒక్క జోన్ నుండి తక్కువలో తక్కువ ఒక విశేషమైన నిమిత్త సేవాధారి తయారవ్వాలి, వారిని మైక్ అనండి లేక ఇంకేమైనా అనండి, కానీ ధ్వనిని వ్యాపింపజేయడానికి ఎవరినైనా నిమిత్తులను తయారుచెయ్యండి. బాప్ దాదా తక్కువలో తక్కువ చెప్పారు. కానీ ఒకవేళ పెద్ద-పెద్ద దేశాలలో ఇలా నిమిత్తులుగా అయ్యేవారు ఉన్నట్లయితే కేవలం జోన్వారే కాదు కానీ పెద్ద దేశాల నుండి కూడా ఏర్పాట్లు చేసుకుని అటువంటి ప్రోగ్రామ్ ను తయారుచెయ్యాలి. బాప్ దాదా విదేశీ పిల్లలకు మనసులోనే అభినందనలు అందించారు, ఇప్పుడు నోటి ద్వారా కూడా ఇస్తున్నారు ఎందుకంటే ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే ప్లాన్ ను మొదట బాప్ దాదా ఎదురుగా తీసుకువచ్చారు. ఆ మాటకొస్తే భారత్ లోనైతే ఇంకా సహజము అన్నది బాప్ దాదాకు తెలుసు కానీ ఇప్పుడు క్వాలిటీ సేవ చేసి సహయోగులను సమీపంగా తీసుకురండి. చాలామంది సహయోగులుగా ఉన్నారు కానీ వారిని సంగఠనలోకి ఇంకా సమీపంగా తీసుకురండి.

అలాగే బ్రాహ్మణ ఆత్మలను మరింత సమీపంగా తీసుకువచ్చేందుకు, ప్రతి చోటా మరియు మధుబన్ లో నలువైపులా జ్వాలా స్వరూపము యొక్క వాయుమండలాన్ని తయారుచేయడానికి, భట్టీలనైనా పెట్టండి లేక సంగఠనలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుని జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నమైపోతారో, అప్పుడు చిన్న-చిన్న విషయాలేవైతే ఉంటాయి కదా, వేటి వెనుకైతే సమయం పడుతుందో, శ్రమించాల్సి వస్తుందో, నిరాశ చెందుతారో, అవన్నీ ఎలా అనిపిస్తాయంటే - జ్వాలాముఖి ఉన్నతమైన స్థితి ఎదురుగా ఆ సమయాన్ని ఇవ్వడము, శ్రమించడము అనేది ఒక బొమ్మలాటలా అనుభవమవుతుంది. స్వతహాగానే సహజంగానే సురక్షితులైపోతారు. బాప్ దాదా చెప్పారు కదా - మీరు ఉన్నదేమో మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలుగా, కానీ చిన్న-చిన్న విషయాల వెనుక శ్రమిస్తున్నారంటే, అది చూసి బాప్ దాదాకు అన్నింటికన్నా ఎక్కువగా దయ కలుగుతుంది. జ్వాలాముఖి రూపము యొక్క ప్రేమ తక్కువ ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ పడటము నుండి విముక్తులవ్వండి, నిర్లక్ష్యులుగా అవ్వకండి కానీ శ్రమ నుండి విముక్తులుగా అవ్వండి. అలాగని శ్రమించనవసరం లేదంటే హాయిగా నిద్రపోదాము అని అనుకోకండి. ప్రేమతో శ్రమను సమాప్తము చెయ్యండి, అంతేకానీ నిర్లక్ష్యముతో కాదు. ఏం చెయ్యాలో అర్థమైందా?

ఇప్పుడు బాప్ దాదా అయితే రావాల్సిందే. ఇకముందు ఏమవుతుంది, బాప్ దాదా వస్తారా, రారా అని అడుగుతుంటారు. బాప్ దాదా రాను అనైతే అనరు, హాజీ-హాజీ అనే అంటారు. పిల్లలు ‘హజూర్ (స్వామీ)’ అని పిలవగానే బాబా ‘హాజరయ్యాను’ అని అంటారు. మరి అర్థమైందా ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో. శ్రమను ప్రేమతో సమాప్తం చేయండి. ఇప్పుడు శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి, కానీ ప్రేమతో జరుపుకోండి, సోమరితనంతో కాదు. పక్కాగా గుర్తుంచుకోండి - సోమరితనం ఉండకూడదు.

సరేనా, అన్ని సంకల్పాలు పూర్తయ్యాయా? ఏదైనా మిగిలిపోయిందా? (జానకి దాదీతో) ఏదైనా మిగిలిపోయిందా అని జనక్ ను అడుగుతున్నాను. దాది అయితే చిరునవ్వు నవ్వుతున్నారు. ఆట పూర్తయిపోయిందా? ఈ ఆపరేషన్ కూడా ఏమిటి? ఆటలో ఆట. ఆట బాగా జరిగింది కదా!

(డ్రిల్) క్షణంలో బిందు స్వరూపులుగా అయ్యి మనసు-బుద్ధిని ఏకాగ్రము చేసే అభ్యాసాన్ని పదే-పదే చెయ్యండి. స్టాప్ అని అనగానే క్షణంలో వ్యర్థమైన దేహభానము నుండి మనను-బుద్ధి ఏకాగ్రమైపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను మొత్తము రోజంతటిలో ఉపయోగించి చూడండి. కంట్రోల్ అవ్వమని ఆర్డర్ ఇచ్చాక - 2 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వటం, 5 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వటం కాదు, అందుకే మధ్యమధ్యలో కంట్రోలింగ్ పవర్ను ఉపయోగించి చూసుకుంటూ ఉండండి. క్షణంలో కంట్రోల్ అవుతుందా, నిమిషంలో కంట్రోల్ అవుతుందా, ఎక్కువ నిమిషాలు పడుతుందా, ఇదంతా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అందరూ మూడు మాసాల చార్టును ఇంకా పక్కా చేసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోవాలి. ముందుగా స్వయానికి స్వయం సర్టిఫికేట్ ను ఇచ్చుకోవాలి, ఆ తరువాత బాప్ దాదా ఇస్తారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారులైన ఆత్మలకు, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలకు, సదా బిందువు యొక్క విధి ద్వారా తీవ్ర పురుషార్థులైన ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులై ఉంటూ ప్రేమలో మునిగిపోయి ఉండే పిల్లలకు, జ్వాలా స్వరూప విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

శుద్ధమైన మరియు సమర్థవంతమైన సంకల్పాల యొక్క శక్తితో వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసే సత్యమైన సేవాధారీ భవ

సంకల్పము కూడా సృష్టిని తయారుచేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే బలహీనమైన మరియు వ్యర్థ సంకల్పాలను చేస్తారో, అప్పుడు వ్యర్థ వాయుమండలముతో కూడిన సృష్టి తయారవుతుంది. ఎవరైతే తమ శుద్ధ శక్తిశాలి సంకల్పాల ద్వారా పాత వైబ్రేషన్లను కూడా సమాప్తం చేస్తారో, వారే సత్యమైన సేవాధారులు. ఏ విధంగా సైన్సువారు ఆయుధాలతో ఆయుధాలను సమాప్తం చేస్తారో, ఒక విమానముతో మరొక విమానాన్ని పడేస్తారో, అదే విధంగా మీ శుద్ధ, సమర్థ సంకల్పాల వైబ్రేషన్లు, వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేయాలి, ఇప్పుడు ఇటువంటి సేవను చెయ్యండి.

స్లోగన్:-

విఘ్నాల రూపీ సూక్ష్మ బంగారు దారాల నుండి ముక్తులుగా అవ్వండి, ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి.

సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, అంతర్జాతీయ యోగా దివసము, బ్రాహ్మా వత్సలందరూ సంగఠిత రూపంలో సాయంత్రం 6.30 గం. నుండి 7.30 గం. వరకు విశేషంగా తమ పూజ్య స్వరూపంలో స్థితులై, స్వయాన్ని ఇష్టదేవులుగా, ఇష్టదేవీలుగా భావించి తమ భక్తుల మనోకామనలను పూర్తి చేయండి, దృష్టితో తృప్తి పరిచే మరియు దర్శనీయ మూర్తులుగా అయ్యి సర్వులకు దర్శనం చేయిస్తూ ప్రసన్నులుగా చేసే సేవను చేయండి.