22-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే, తండ్రి వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ కూడా చేయలేరు’’

ప్రశ్న:-

కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి తండ్రి ఏ శ్రమను చేయాల్సి ఉంటుంది?

జవాబు:-

పూర్తిగా అజామిళ్ వంటి పాపులను మళ్ళీ లక్ష్మీ-నారాయణుల వలె పూజ్య దేవతలుగా తయారుచేసే శ్రమను తండ్రి చేయవలసి ఉంటుంది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారుచేసే శ్రమను చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి తిరిగి వెళ్తారు. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని యోగ్యులుగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి... (ఇస్ పాప్ కీ దునియా సే...)

ఓంశాంతి

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇది పాపపు ప్రపంచమని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచము పుణ్య ప్రపంచము. అక్కడ పాపమనేది ఉండదు. అది రామరాజ్యం, ఇది రావణరాజ్యం. ఈ రావణరాజ్యంలో అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. కావుననే - ఓ పతిత పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు. అన్ని ధర్మాలవారూ పిలుస్తారు - ఓ గాడ్ ఫాదర్, మీరు వచ్చి మమ్మల్ని విముక్తులుగా చేయండి, మార్గదర్శకునిగా అవ్వండి అని, అనగా తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు సృష్టి అంతటిలోనూ ఏ ధర్మాలైతే ఉన్నాయో వారందరినీ తీసుకువెళ్తారు. ఈ సమయంలో అందరూ రావణరాజ్యంలో ఉన్నారు. అన్ని ధర్మాల వారిని తిరిగి శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. వినాశనమైతే అందరిదీ జరగవలసిందే. తండ్రి ఇక్కడకు వచ్చి పిల్లలను సుఖధామానికి యోగ్యులుగా తయారుచేస్తారు. సర్వుల కళ్యాణాన్ని చేస్తారు, కావున వారొక్కరినే సర్వుల సద్గతిదాత, సర్వుల కళ్యాణాన్ని చేసేవారు అని పిలవడం జరుగుతుంది. తండ్రి అంటారు, ఇప్పుడు ఇక మీరు తిరిగి వెళ్ళాలి. అన్ని ధర్మాలవారు శాంతిధామంలోకి, నిర్వాణధామంలోకి వెళ్ళాలి, అక్కడ ఆత్మలందరూ శాంతిలో ఉంటారు. రచయిత అయిన అనంతమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారే వచ్చి అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తులను ఇస్తారు. కావున మహిమ కూడా ఆ ఒక్క గాడ్ ఫాదర్ నే చేయాలి. ఎవరైతే వచ్చి సర్వుల యొక్క సేవను చేస్తారో వారినే స్మృతి చేయాలి. నేను దూరదేశంలో పరంధామంలో ఉండేవాడినని తండ్రే స్వయంగా అర్థం చేయిస్తారు. అన్నింటికన్నా ముందు ఏ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమైతే ఉండేదో అది ఇప్పుడు లేదు, అందుకే నన్ను ఇప్పుడు పిలుస్తారు. నేను వచ్చి పిల్లలందరినీ తిరిగి తీసుకువెళ్తాను. ఇప్పుడు హిందూ అనేది ధర్మమేమీ కాదు. వాస్తవానికి అది దేవీ-దేవతా ధర్మము. కానీ పవిత్రంగా లేని కారణంగా స్వయాన్ని దేవతలకు బదులుగా హిందువులని పిలుచుకుంటున్నారు. హిందూ ధర్మాన్ని స్థాపన చేసేవారు ఎవ్వరూ లేరు. గీతయే సర్వ శాస్త్ర శిరోమణి. అది భగవంతుని ద్వారా గానం చేయబడ్డది. భగవంతుడు అని ఒక్కరినే పిలవడం జరుగుతుంది, వారే గాడ్ ఫాదర్. శ్రీకృష్ణుడిని లేక లక్ష్మీ-నారాయణులను గాడ్ ఫాదర్ లేక పతిత-పావనులు అని అనరు. వారు రాజా-రాణులు. వారిని ఆ విధంగా ఎవరు తయారుచేసారు? తండ్రి. తండ్రి మొదట కొత్త ప్రపంచాన్ని రచిస్తారు, దానికి వీరు యజమానులుగా అవుతారు. అలా ఎలా అయ్యారు అన్నది మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. గొప్ప-గొప్ప లక్షాధికారులు మందిరాలు మొదలైనవాటిని నిర్మిస్తారు. వారిని అడగాలి - వీరు ఈ విశ్వ రాజ్యాధికారాన్ని ఎలా పొందారు, యజమానులుగా ఎలా అయ్యారు? అది ఎప్పుడూ ఎవ్వరూ తెలియజేయలేరు. ఏ కర్మలు చేసిన కారణంగా ఇంతటి ఫలాన్ని పొందారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము గురించి తెలియని కారణంగా అందరూ ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారెవరైతే ఉన్నారో, వారు మళ్ళీ తమ ధర్మంలోకి వచ్చేస్తారు. క్రిస్టియన్ ధర్మానికి చెందినవారైతే మళ్ళీ క్రిస్టియన్ ధర్మంలోకి వచ్చేస్తారు. ఆ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క అంటు కట్టబడుతోంది. ఎవరెవరు ఏయే ధర్మానికి చెందినవారో, వారు ఆ ధర్మంలోకి రావలసి ఉంటుంది. ఇది వృక్షము, దీనికి మూడు శాఖలున్నాయి, మళ్ళీ వాటి నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు మీ ధర్మంలోకి వచ్చేయండి. కొందరు - నేను సన్యాస ధర్మంలోకి వెళ్తాను, సన్యాసి అయిన రామకృష్ణ పరమహంసుని అనుచరుడిని అని అంటారు. వాస్తవానికి వారు నివృత్తి మార్గానికి చెందినవారు, మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. గృహస్థ మార్గము వారు నివృత్తి మార్గము వారికి అనుచరులుగా ఎలా అవ్వగలరు! మీరు మొదట ప్రవృత్తి మార్గములో పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ రావణుడి ద్వారా మీరు అపవిత్రంగా అయ్యారు. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. మీరు గృహస్థాశ్రమానికి చెందినవారు, భక్తిని కూడా మీరే చేయాలి. తండ్రి వచ్చి భక్తి ఫలమైన సద్గతిని ఇస్తారు. ధర్మమే శక్తి అని అంటారు. తండ్రి ధర్మస్థాపనను చేస్తారు. మీరు మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు. తండ్రి ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుంది. ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రే వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తారు, ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు, అలాగే పొందలేరు కూడా. ఇక్కడే వృద్ధి చెందుతూ ఉంటారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. తండ్రి అంటారు - నేను సర్వ ధర్మాలకు సేవకుడిని, వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. సద్గతి అని సత్యయుగాన్ని అంటారు. ముక్తి అనేది శాంతిధామములో ఉంటుంది. మరి అందరికన్నా ఉన్నతమైనవారు ఎవరైనట్లు? తండ్రి అంటారు - ఓ ఆత్మలారా, మీరందరూ సోదరులు. మీ అందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. నేను వచ్చి అందరినీ తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా చేస్తాను. యోగ్యులుగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. లెక్కాచారాలను తీర్చుకొని మళ్ళీ తిరిగి వెళ్తారు. అది శాంతిధామము మరియు ఇది సుఖధామము.

తండ్రి అంటారు, నేను వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను, ఇందులో కష్టపడవలసి ఉంటుంది. పూర్తిగా అజామిళ్ వంటి పాపులను నేను వచ్చి ఈ విధంగా దేవీ-దేవతలుగా తయారుచేస్తాను. మీరు ఎప్పటినుండైతే వామ మార్గములోకి వెళ్ళారో, అప్పటినుండి మెట్లు దిగుతూ వచ్చారు. ఈ 84 జన్మల మెట్లు కిందకు దిగే మెట్లే. సతోప్రధానము నుండి సతో, రజో, తమో... ఇప్పుడు ఇది సంగమము. తండ్రి అంటారు, నేను ఒకేసారి వస్తాను. నేనేమీ ఇబ్రహీం, బుద్ధుడు మొదలైనవారి తనువులలోకి రాను. నేను పురుషోత్తమ సంగమయుగములోనే వస్తాను. ఇప్పుడిక తండ్రిని ఫాలో చేయండి అని చెప్పడం జరుగుతుంది. తండ్రి అంటారు, ఆత్మలైన మీరందరూ నన్నే ఫాలో చేయాలి. మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు యోగాగ్నిలో భస్మమవుతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. మీరు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. మీరు కామ చితి నుండి జ్ఞాన చితిపై కూర్చుంటారు. ఈ విషయాలన్నింటినీ ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు. క్రైస్టు, బుద్ధుడు మొదలైనవారందరూ వారొక్కరినే స్మృతి చేస్తారు కానీ వారి గురించి ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. రచయితను మరియు రచనను మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఋషులు, మునులు మొదలైనవారందరూ మాకు తెలియదు, మాకు తెలియదు అని అనేవారు. స్వర్గము సత్యఖండము, అక్కడ దుఃఖమన్న మాటే లేదు. ఇక్కడ ఎంతటి దుఃఖముంది. ఆయువు కూడా చాలా తక్కువగా ఉంది. దేవతల ఆయువు ఎంత ఎక్కువగా ఉంది. వారు పవిత్ర యోగీలు. ఇక్కడ అపవిత్ర భోగులుగా ఉన్నారు. మెట్లు దిగుతూ-దిగుతూ ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. అకాల మృత్యువులు కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి మిమ్మల్ని ఎలా తయారుచేస్తారంటే, ఇక మీరు 21 జన్మలు ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు. కావున ఇటువంటి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మ ఎంత తెలివైనదిగా అవ్వాలి. తండ్రి ఎటువంటి వారసత్వాన్ని ఇస్తారంటే దాని ద్వారా అక్కడ ఎటువంటి దుఃఖమూ ఉండదు. మీ ఏడవడమూ, ఆర్తనాదాలు చేయడము అన్నీ ఆగిపోతాయి. అందరూ పాత్రధారులే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇది కూడా డ్రామాయే. బాబా కర్మ, అకర్మ, వికర్మల గతులను కూడా అర్థం చేయిస్తారు. బ్రహ్మా పగలు మరియు రాత్రి మహిమ చేయబడ్డాయి. బ్రహ్మా పగలు మరియు రాత్రే బ్రాహ్మణుల పగలు మరియు రాత్రి. ఇప్పుడు మీ పగలు రానున్నది. మహాశివరాత్రి అని అంటారు. ఇప్పుడిక భక్తి యొక్క రాత్రి పూర్తయి జ్ఞానము యొక్క ఉదయం జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగమము. మీరు ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతున్నారు. అంధకారమయమైన రాత్రిలో ఎదురుదెబ్బలు కూడా తిన్నారు, నుదుటిని కూడా అరగదీసుకున్నారు, ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. మీరు ఒకప్పుడు సుఖధామ నివాసులుగా ఉండేవారు. 84 జన్మల తర్వాత దుఃఖధామంలోకి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు - బాబా, మీరు ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచం కాదు. మీరు ఇప్పుడు యోగబలముతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు ఇప్పుడు డబుల్ అహింసకులుగా అవ్వాలి. కామ ఖడ్గాన్ని ఉపయోగించకూడదు, గొడవలు-కొట్లాటలు చేయకూడదు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఈ కల్పము 5,000 సంవత్సరాలది, అంతేకానీ లక్షల సంవత్సరాలది కాదు. ఒకవేళ ఇది లక్షల సంవత్సరాలది అయి ఉన్నట్లయితే ఇక్కడ ఎంతో జనాభా పెరిగిపోయి ఉండేది. కేవలం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అందుకే తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ వస్తాను, నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా నేను ఏమీ చేయలేను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే ఖచ్చితంగా వస్తాను. మన్మనాభవ. కానీ దీని అర్థము కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, దేహపు సర్వ సంబంధాలను వదలి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అంతా పావనంగా అయిపోతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేసే శ్రమను చేస్తూ ఉంటారు.

ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇటువంటి విద్యాలయము ఇంకెక్కడా ఉండదు. ఇక్కడకు ఈశ్వరుడైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేస్తారు. నరకాన్ని స్వర్గముగా చేస్తారు, దానిపై మీరు రాజ్యం చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు నన్ను స్మృతి చేసినట్లయితే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు. ఇది బాబా యొక్క భాగ్యశాలి రథము, ఇందులోకి తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. శివజయంతి గురించి ఎవ్వరికీ తెలియదు. వారైతే పరమాత్మ నామ-రూపాలకు అతీతుడు అని అనేస్తారు. అరే, నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఇది ఆకాశం అని అంటారు కదా, మరి అది కూడా పేరు కదా. అదంతా ఆకాశమే కానీ పేరైతే ఉంది కదా. అలాగే ఈ తండ్రికి కూడా కళ్యాణకారీ అన్న పేరు ఉంది. మళ్ళీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లను పెట్టారు. బాబురీనాథ్ అని కూడా అంటారు. వారు వచ్చి కామ ఖడ్గము నుండి విడిపించి పావనంగా తయారుచేస్తారు. నివృత్తిమార్గము వారు బ్రహ్మతత్వమునే పరమాత్మగా భావిస్తారు, దానినే స్మృతి చేస్తారు. వారు బ్రహ్మయోగులు, తత్వయోగులుగా పిలువబడతారు. కానీ అది కేవలం నివసించే స్థానం మాత్రమే, దానిని బ్రహ్మాండమని అంటారు. వారేమో బ్రహ్మతత్వమునే భగవంతునిగా భావిస్తారు. తాము అందులో లీనమైపోతామని భావిస్తారు. అనగా ఆత్మను వినాశీగా చేసేస్తారు. తండ్రి అంటారు - నేనే వచ్చి సర్వుల సద్గతిని చేస్తాను, అందుకే ఒక్క శివబాబా జయంతియే వజ్రతుల్యమైనది. మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవి. శివబాబాయే సర్వుల సద్గతిని చేస్తారు. కావున వారు వజ్రతుల్యమైనవారు. వారే మిమ్మల్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్తారు. ఈ జ్ఞానాన్ని మీకు తండ్రే వచ్చి చదివిస్తారు, దీని ద్వారా మీరు దేవీ-దేవతలుగా అవుతారు. తర్వాత ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. ఈ లక్ష్మీ-నారాయణులలో రచయిత మరియు రచనల జ్ఞానం లేదు.

పిల్లలు పాట విన్నారు, అందులో ఏమంటారంటే - ఎక్కడైతే శాంతి మరియు విశ్రాంతి ఉంటుందో, మమ్మల్ని అటువంటి స్థానానికి తీసుకువెళ్ళండి అని. అదే శాంతిధామము మరియు సుఖధామము. అక్కడ అకాల మృత్యువనేది ఉండదు. కావున పిల్లలను ఆ సుఖ-శాంతుల ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్:-

ఇప్పుడు మీ సూర్యవంశము, చంద్రవంశము, రెండు వంశాలు తయారవుతాయి. ఎంతగా మీరు తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో, అంతగా ఇంకెవ్వరూ తెలుసుకోలేరు, అలాగే పవిత్రముగా కూడా అవ్వలేరు. ఇకపోతే తండ్రి వచ్చారు అన్నది తెలుసుకుంటే తండ్రిని స్మృతిని చేయడం మొదలుపెడతారు. మున్ముందు లక్షలాదిమంది, కోట్లాదిమంది అర్థం చేసుకోవడం కూడా మీరు చూస్తారు. వాయుమండలమే అలా ఉంటుంది. చివరి సమయంలోని యుద్ధంలో అందరూ హోప్ లేస్ అయిపోతారు (ఏ ఆశ లేనివారిగా). అందరికీ టచ్ అవుతుంది. మీ శబ్దం కూడా వ్యాపిస్తుంది. స్వర్గ స్థాపన జరుగుతోంది. మిగిలినవారందరి మృత్యువు సిద్ధంగా ఉంది. కానీ ఆ సమయం ఎలా ఉంటుందంటే, ఇక గుటకలు మింగడానికి కూడా సమయం ఉండదు. ఎవరైతే మిగిలి ఉంటారో, వారు మున్ముందు ఎంతో అర్థం చేసుకుంటారు. అలాగని వీరందరూ ఆ సమయంలో ఉంటారని కాదు. కొందరు మరణిస్తారు కూడా. ఎవరైతే కల్ప-కల్పమూ ఉంటారో, వారే ఉంటారు. ఆ సమయంలో ఒక్క తండ్రి స్మృతిలో ఉంటారు. శబ్దము కూడా తగ్గిపోతుంది. ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం మొదలుపెడతారు. మీరందరూ సాక్షీగా అయి చూస్తారు. చాలా దుఃఖమయమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడిక వినాశనం జరగనున్నదని, ప్రపంచం మారనున్నదని అందరికీ తెలిసిపోతుంది. ఎప్పుడైతే బాంబులు పడతాయో అప్పుడు వినాశనం జరుగుతుందని వివేకం చెప్తుంది. ఇప్పుడు పరస్పరం - షరతులు పెట్టండి, మేము బాంబులు వేయమని ప్రతిజ్ఞ చేయండి అని చెప్పుకుంటూ అంటారు. కానీ ఈ వస్తువులన్నీ వినాశనం కొరకే తయారై ఉన్నాయి.

పిల్లలైన మీకు సంతోషం కూడా ఎంతో ఉండాలి. కొత్త ప్రపంచం తయారవుతోందని మీకు తెలుసు. తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. దాని పేరే ప్యారడైజ్. ఏ విధంగా మీకు నిశ్చయముందో, అలాగే మున్ముందు ఎంతోమందికి ఉంటుంది. ఏమి అవుతుందంటే, ఎవరైతే అనుభవాన్ని పొందేది ఉందో, వారు మున్ముందు ఎంతో పొందుతారు. చివరి సమయంలో స్మృతియాత్రలో కూడా ఎంతగానో ఉంటారు. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. పురుషార్థం పూర్తిగా చేయకపోతే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేయడం ద్వారా పదవి కూడా మంచిది లభిస్తుంది. ఆ సమయంలో మీ అవస్థ కూడా చాలా బాగుంటుంది. సాక్షాత్కారాలు కూడా పొందుతారు. కల్ప-కల్పము ఏ విధంగా వినాశనం జరిగిందో అదే విధంగా జరుగుతుంది. ఎవరిలోనైతే నిశ్చయం ఉంటుందో, చక్రం యొక్క జ్ఞానముంటుందో, వారు సంతోషముగా ఉంటారు. అచ్ఛా. ఆత్మిక పిల్లలకు గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. డబుల్ అహింసకులుగా అయి యోగబలముతో ఈ నరకాన్ని స్వర్గముగా తయారుచేయాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి.

2. ఒక్క తండ్రిని పూర్తి-పూర్తిగా ఫాలో చేయాలి. సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులుగా అయి, యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధము చేసుకోవాలి. అందరినీ కామ చితి నుండి దించి జ్ఞాన చితిపై కూర్చోబెట్టాలి.

వరదానము:-

నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతామూర్త భవ

సేవలో సఫలతకు ఆధారము మీ నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు, మరియు వారి ద్వారా ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. సేవలో సంగఠన ఉంటుంది మరియు సంగఠనలో భిన్న-భిన్న విషయాలు, భిన్న-భిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అనేకతలో తికమకపడకండి. ఎవరిది ఒప్పుకోవాలి, ఎవరిది ఒప్పుకోకూడదు అని ఇలా ఆలోచించకండి. నిస్వార్థ మరియు నిర్వికల్ప భావముతో నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవ్వరికీ కూడా వ్యర్థ సంకల్పాలు రావు మరియు సఫలతాముర్తులుగా అవుతారు.

స్లోగన్:-

ఇప్పుడు సకాష్ ద్వారా బుద్ధులను పరివర్తన చేసే సేవను ప్రారంభించండి.