24-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఉదయాన్నే షావుకార్లుగా అవుతారు, సాయంత్రానికి ఫకీరులుగా అవుతారు. ఫకీరుల నుండి షావుకార్లుగా, పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు రెండు పదాలను గుర్తుంచుకోండి - మన్మనాభవ, మధ్యాజీభవ’’

ప్రశ్న:-

కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-

1. స్మృతియాత్ర మరియు జ్ఞాన స్మరణ, 2. ఒక్కరితో సర్వ సంబంధాలు ఉండాలి, ఇతరులెవ్వరి వైపుకూ బుద్ధి వెళ్ళకూడదు, 3. సర్వశక్తివంతమైన బ్యాటరీ ఏదైతే ఉందో, ఆ బ్యాటరీతో యోగము జోడించబడి ఉండాలి. మీపై మీకు పూర్తి అటెన్షన్ ఉండాలి, దైవీ గుణాలు అనే రెక్కలు ఉండాలి, అప్పుడు కర్మబంధనాల నుండి ముక్తులుగా అవుతూ ఉంటారు.

ఓంశాంతి

తండ్రి కూర్చొని అర్థం చేయించారు - ఇది భారత్ కు సంబంధించిన కథ. ఏ కథ? ఉదయం షావుకారులుగా ఉంటారు, సాయంత్రం ఫకీరులుగా ఉంటారు. ఉదయం షావుకారుగా ఉండేవారు... అని దీనిపై ఒక కథ కూడా ఉంది. ఈ విషయాలను మీరు ఎప్పుడైతే షావుకారులుగా ఉంటారో అప్పుడు వినరు. ఫకీరులు మరియు షావుకారుల విషయాలను పిల్లలైన మీరు సంగమయుగములోనే వింటారు. వీటిని మీ హృదయములో ధారణ చేయాలి. తప్పకుండా భక్తి ఫకీరులుగా చేస్తుంది, జ్ఞానం షావుకారులుగా చేస్తుంది. రాత్రి మరియు పగలు కూడా అనంతమైనవే. ఫకీరుగా మరియు షావుకారుగా అవ్వడం కూడా అనంతమైన విషయమే మరియు తయారుచేసే వారు కూడా అనంతమైన తండ్రే. పతిత ఆత్మలందరి కొరకు పావనంగా తయారుచేసే బ్యాటరీ ఒక్కరే. ఇటువంటి విషయాలను గుర్తుంచుకున్నా సరే సంతోషములో ఉంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు ఉదయము షావుకారులుగా అవుతారు, సాయంత్రానికి ఫకీరులుగా అవుతారు. ఏ విధముగా అవుతారు అన్నది కూడా తండ్రే అర్థం చేయిస్తారు. మళ్ళీ పతితుల నుండి పావనులుగా, ఫకీరుల నుండి షావుకారులుగా అయ్యే యుక్తిని కూడా తండ్రే తెలియజేస్తారు. మన్మనాభవ, మధ్యాజీభవ - ఈ రెండే యుక్తులు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా పిల్లలకు తెలుసు. మీరు ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో, మీరంతా తప్పకుండా నంబరువారు పురుషార్థానుసారముగా స్వర్గములో షావుకారులుగా అవుతారు అన్న గ్యారంటీ ఉంది. స్కూల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది. నంబరువారుగా క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పరీక్షలు పూర్తి అయితే ఇక నంబరువారుగా వెళ్ళి కూర్చుంటారు. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. నంబరువారుగా రుద్రమాలలోకి వెళ్తారు. ఇది మాల లేక వృక్షము. బీజమైతే వృక్షముదే కదా. పరమాత్మ ఏమో మనుష్య సృష్టికి బీజము. వృక్షము ఏ విధంగా వృద్ధి చెందుతుంది, ఏ విధంగా పాతబడుతుంది అనేది పిల్లలకు తెలుసు. ఇంతకుముందు మీకు ఇది తెలిసేది కాదు, దీనిని తండ్రి వచ్చి అర్థం చేయించారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి. దైవీ గుణాల రూపీ రెక్కలను కూడా ధారణ చేయాలి. మీపై మీరు పూర్తి అటెన్షన్ ను ఉంచాలి. స్మృతియాత్ర ద్వారానే మీరు పావనముగా అవుతారు, ఇంకే ఉపాయమూ లేదు. సర్వశక్తివంతమైన బ్యాటరీయైన తండ్రి ఎవరైతే ఉన్నారో, వారితో పూర్తి యోగాన్ని జోడించాలి. వారి బ్యాటరీ ఎప్పుడూ ఖాళీ అవ్వదు. వారు సతో, రజో, తమోలలోకి రారు ఎందుకంటే వారిది సదా కర్మాతీత అవస్థ. పిల్లలైన మీరు కర్మబంధనాలలోకి వస్తారు. ఎంత కఠినమైన బంధనాలున్నాయి. ఈ కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఒకటే ఉపాయము ఉంది, అదే స్మృతియాత్ర. ఇది తప్ప ఇంకే ఉపాయము లేదు. ఈ జ్ఞానము ఉంది కదా, ఇది కూడా ఎముకలను మెత్తపరుస్తుంది. ఆ మాటకొస్తే భక్తి కూడా మెత్తపరుస్తుంది. పాపం అతను భక్తాత్మ, అతనిలో మోసము మొదలైనవేవీ లేవు అని అంటారు. కానీ భక్తులలో మోసం కూడా ఉంటుంది. బాబా అనుభవజ్ఞులు. ఆత్మ శరీరము ద్వారా వ్యాపారాలు మొదలైనవి చేస్తుంది కావున ఈ జన్మ విషయాలన్నీ కూడా స్మృతిలోకి వస్తాయి. 4-5 సంవత్సరాల వయస్సు నుండి తమ జీవన గాధ అంతా గుర్తుండాలి. కొందరు 10-20 సంవత్సరాల క్రితం విషయాన్ని కూడా మర్చిపోతారు. జన్మ-జన్మాంతరాలు నామ-రూపాలైతే గుర్తుండవు. ఒక్క జన్మవైతే ఎంతో కొంత చెప్పగలుగుతారు. ఫొటోలు మొదలైనవి ఉంచుకుంటారు. గత జన్మవైతే తెలియవు. ప్రతి ఆత్మ భిన్న-భిన్న నామ, రూప, దేశ, కాలాలలో పాత్రను అభినయిస్తుంది. నామ-రూపాలన్నీ మారుతూ ఉంటాయి. ఏ విధంగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటుంది అనేది కూడా బుద్ధిలో ఉంది. తప్పకుండా 84 జన్మలు, 84 పేర్లు, 84 తండ్రులు ఉండి ఉంటారు. ఆంతిమములో మళ్ళీ తమోప్రధాన సంబంధాలు తయారవుతాయి. ఈ సమయంలో ఎన్ని సంబంధాలైతే ఉంటాయో అన్ని సంబంధాలు ఇంకెప్పుడూ ఉండవు. కలియుగ సంబంధాలను బంధనాలుగానే భావించాలి. ఎంతమంది పిల్లలు ఉంటారు, మళ్ళీ వివాహాలు చేస్తారు, మళ్ళీ పిల్లలకు జన్మనిస్తారు. ఈ సమయంలో అన్నింటికన్నా ఎక్కువగా చిన్నాన్నలు, మామయ్యలు, పెదనాన్నలు మొదలైనవారి బంధనాలు ఉన్నాయి. ఎంత ఎక్కువ సంబంధాలుంటే అంత ఎక్కువ బంధనాలు ఉంటాయి. ఐదుమంది పిల్లలు కలిసి పుట్టారని, ఐదుగురూ ఆరోగ్యవంతులుగా ఉన్నారని వార్తాపత్రికల్లో వచ్చింది. వారికి ఎన్ని సంబంధాలు తయారవుతాయో లెక్కపెట్టండి. ఈ సమయంలో మీ సంబంధం అన్నింటికన్నా చిన్నది. కేవలం ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క తండ్రితో తప్ప ఇంకెవ్వరితోనూ మీ బుద్ధియోగము లేదు. సత్యయుగములో ఇప్పటికంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీది వజ్రతుల్యమైన జన్మ. ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలను దత్తత తీసుకుంటారు. వారసత్వాన్ని పొందేందుకు జీవిస్తూనే వారి ఒడిలోకి వెళ్ళాలి, అది ఇప్పుడే జరుగుతుంది. ఏ తండ్రి నుండైతే మీకు వారసత్వం లభిస్తుందో, మీరు అటువంటి తండ్రి ఒడిలోకి వచ్చారు. బ్రాహ్మణులైన మీ కన్నా ఉన్నతులు ఇంకెవ్వరూ లేరు. అందరి యోగము ఒక్కరితోనే ఉంది. మీకు పరస్పరం ఒకరితో ఒకరికి కూడా ఎటువంటి సంబంధమూ లేదు. సోదరీ, సోదరుల సంబంధం కూడా కింద పడేస్తుంది. సంబంధం కేవలం ఒక్కరితోనే ఉండాలి. ఇది కొత్త విషయము. పవిత్రముగా అయి తిరిగి వెళ్ళాలి. ఈ విధంగా విచార సాగర మంథనము చేయడం ద్వారా మీరు ఎంతో ప్రకాశించడం మొదలుపెడతారు. సత్యయుగీ ప్రకాశానికి మరియు కలియుగీ ప్రకాశానికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. భక్తిమార్గము సమయములో రావణుని రాజ్యమే ఉంటుంది. చివరిలో సైన్స్ అహంకారము కూడా ఎంతగానో ఉంటుంది. వారు సత్యయుగముతో పోటీ పడుతున్నట్లుగా చేస్తారు.

ఒక కుమార్తె సమాచారము వ్రాసారు - మీరు స్వర్గములో ఉన్నారా లేక నరకములో ఉన్నారా అని నేను ప్రశ్న అడిగాను, అప్పుడు నలుగురైదుగురు మేము స్వర్గములో ఉన్నాము అని సమాధానము ఇచ్చారు. బుద్ధిలో రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. కొందరు తాము నరకములో ఉన్నారని భావిస్తారు. అప్పుడు వారికి అర్థం చేయించాలి - మరి మీరు స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటున్నారా? స్వర్గాన్ని ఎవరు స్థాపిస్తారు? ఇవి చాలా మధురాతి మధురమైన విషయాలు. మీరు నోట్ చేసుకుంటారు, కానీ ఆ పుస్తకాలలోనే నోట్స్ ఉండిపోతుంది. సమయం వచ్చినప్పుడు గుర్తుకురావు. ఇప్పుడు పతితుల నుండి పావనులుగా తయారుచేసేవారు పరమపిత పరమాత్మ అయిన శివుడే. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి అని వారు అంటారు. స్మృతిలో ఎంతో కొంత సంపాదనైతే ఉంటుంది కదా. స్మృతి అనే ఆచారము ఇప్పుడు వెలువడింది. స్మృతి ద్వారానే మీరు ఎంతో ఉన్నతముగా, స్వచ్ఛముగా అవుతారు. ఎవరు ఎంతగా కష్టపడతారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. బాబాను కూడా అడుగవచ్చు. ప్రపంచములోనైతే సంబంధాలు మరియు ఆస్తుల వెనుక అన్నీ గొడవలే గొడవలు. ఇక్కడైతే ఏ సంబంధాలు లేవు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. తండ్రి అనంతమైన అధిపతి. ఈ విషయం చాలా సహజమైనది. అటువైపు స్వర్గము ఉంది, ఇటువైపు నరకము ఉంది. నరకవాసులుగా ఉండటం మంచిదా లేక స్వర్గవాసులుగా ఉండటం మంచిదా? తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు స్వర్గవాసులుగా ఉండటమే మంచిది అని అంటారు. కొందరేమో, నరకవాసులైనా లేక స్వర్గవాసులైనా, ఈ విషయాలతో మాకు సంబంధమేమీ లేదు అని అంటారు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. కొందరేమో మళ్ళీ తండ్రి ఒడి నుండి బయటకొచ్చి మళ్ళీ మాయ ఒడిలోకి వెళ్ళిపోతారు. ఇది విచిత్రము కదా. తండ్రి కూడా అద్భుతమైనవారు, అలాగే జ్ఞానము కూడా అద్భుతమైనది, అన్నీ అద్భుతమైనవి. ఈ అద్భుతాలను అర్థం చేసుకునేవారు కూడా ఆ విధంగా ఉండాలి, వారి బుద్ధి ఆ అద్భుతాలలోనే నిమగ్నమై ఉండాలి. రావణుడైతే అద్భుతమైనవాడు కాదు, అలాగే అతని రచనా అద్భుతమైనది కాదు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. శాస్త్రాలలో - కాళిందిలోకి వెళ్ళారని, సర్పం కాటేసిందని, నల్లగా అయిపోయారని వ్రాసారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేయించగలరు. శ్రీకృష్ణుని చిత్రాన్ని ఎవరైనా తీసుకుని దానిపై వ్రాసినది చదివితే రిఫ్రెష్ అయిపోతారు. ఇది 84 జన్మల కథ. శ్రీకృష్ణునిది ఎలా ఉంటుందో మీది కూడా అలాగే ఉంటుంది. స్వర్గములోకైతే మీరు వస్తారు కదా. తర్వాత త్రేతాలోకి కూడా వస్తూ ఉంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. త్రేతాలో రాజులు ఎవరైతే ఉంటారో, వారు త్రేతాలోకే వస్తారని కాదు. చదువుకున్నవారి ముందు చదువుకోనివారు సేవకులుగా అవ్వవలసి ఉంటుంది. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రే తెలుసుకోగలరు. మీ మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ నరకవాసులని ఇప్పుడు మీకు తెలుసు. మనం పురుషోత్తమ సంగమయుగ వాసులము. ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము. బయట ఉండటానికి మరియు ఇక్కడ ఏడు రోజులు వచ్చి ఉండటానికి ఎంతో తేడా ఉంటుంది. హంసల సాంగత్యము నుండి బయటకొచ్చి కొంగల సాంగత్యములోకి వెళ్తారు. చాలా చెడగొట్టేవారు కూడా ఉన్నారు. చాలామంది పిల్లలు మురళిని లెక్కచేయరు. తండ్రి అంటారు - నిర్లక్ష్యము చేయకండి. మీరు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. మీకు స్మృతియాత్ర ఒక్కటే చాలు. ఇక్కడ మీకు బ్రాహ్మణుల సాంగత్యమే ఉంది. ఉన్నతోన్నతమైనవారు ఎక్కడ, నీచులు ఎక్కడ? బాబా, కొంగల గుంపులో హంసగా ఉన్న మేము ఒక్కరమూ ఏమి చేయగలము? అని పిల్లలు వ్రాస్తారు. కొంగలు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు. ఎంత కష్టపడవలసి ఉంటుంది. తండ్రి శ్రీమతముపై నడవడం ద్వారా పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. ఎల్లప్పుడూ హంసలుగానే ఉండండి. కొంగల సాంగత్యములో కొంగలుగా అవ్వకండి. ఆశ్చర్యవంతులై వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు... అన్న గాయనము కూడా ఉంది. కొద్దిగా జ్ఞానం ఉన్నా స్వర్గములోకి వస్తారు. కానీ రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా వచ్చేస్తుంది. చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు. తండ్రి అంటారు, నా మతముపై నడవకుండా పతితులుగా అయినట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది. అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. ఈ విషయాలను మర్చిపోతారు. ఇది గుర్తున్నా సరే ఉన్నత పదవిని పొందే పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. చేయకపోతే ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేస్తారు అని భావించడం జరుగుతుంది. తండ్రితో యోగము ఉండదు. ఇక్కడ ఉంటూ కూడా బుద్ధియోగము పిల్లా, పాపల వైపు ఉంటుంది. తండ్రి అంటారు, అన్నింటినీ మర్చిపోవాలి, దీనినే వైరాగ్యము అని అంటారు. అందులో కూడా పర్సెంటేజ్ ఉంటుంది. ఎక్కడో అక్కడకు ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడినా బుద్ధి వ్రేలాడుతూ ఉంటుంది.

బాబా రోజూ అర్థం చేయిస్తారు - ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో, అదంతా అంతమవ్వనున్నది. మీ బుద్ధియోగము కొత్త ప్రపంచములో ఉండాలి మరియు అనంతమైన సంబంధీకులతో బుద్ధియోగాన్ని ఉంచాలి. ఈ ప్రియుడు అద్భుతమైనవారు. మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము అని భక్తిలో గానం చేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, కావున ఇప్పుడు మీరు అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించవలసి ఉంటుంది కదా. ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది. మీ బుద్ధియోగము మట్టితో ఉన్నట్లుగా ఉంది. నాతో బుద్ధియోగము ఉన్నట్లయితే యజమానులుగా అయిపోతారు. తండ్రి ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. భక్తి అంటే ఏమిటో మరియు జ్ఞానమంటే ఏమిటో మనుష్యులకు తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావుననే మీరు భక్తిని కూడా అర్థం చేసుకుంటారు. భక్తిలో ఎంత దుఃఖము ఉంది అని ఇప్పుడు మీకు ఫీలింగ్ వస్తుంది. మనుష్యులు భక్తిని చేస్తారు మరియు స్వయాన్ని చాలా సుఖవంతులుగా భావిస్తారు. మళ్ళీ భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు అని కూడా అంటారు. ఎవరికి ఇస్తారు మరియు ఎలా ఫలాన్ని ఇస్తారు అన్నది ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి భక్తి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. విశ్వ రాజధాని యొక్క ఫలము ఏ తండ్రి నుండైతే లభిస్తుందో, ఆ తండ్రి ఏ డైరెక్షన్లు అయితే ఇస్తారో దానిపై నడవవలసి ఉంటుంది. దానిని ఉన్నతోన్నతమైన మతము అని అంటారు. మతమైతే అందరికీ లభిస్తుంది. దానిపై కొందరు నడవగలుగుతారు, కొందరు నడవలేరు. అనంతమైన రాజ్యాధికారము స్థాపన అవ్వనున్నది. మనం ఎలా ఉండేవారము, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మాయ పూర్తిగా అంతం చేసేస్తుంది. ఇది శవాల ప్రపంచము వలె ఉంది. భక్తి మార్గములో మీరు ఏదైతే వినేవారో, దానినంతా సత్యం, సత్యం అని అనేవారు. కానీ సత్యాన్ని అయితే ఒక్క తండ్రే వినిపిస్తారు అని మీకు తెలుసు. అటువంటి తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ బయటివారు ఎవరైనా కూర్చుంటే వారికి ఏమీ అర్థం కాదు. వీరేమి వినిపిస్తున్నారో తెలియదు, పరమాత్మ సర్వవ్యాపి అని మొత్తం ప్రపంచమంతా అంటుంది కానీ వీరేమో పరమాత్మ మా తండ్రి అని అంటున్నారే అని అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటారు. మీ లోపల నుండి అవును, అవును అని వెలువడుతూ ఉంటుంది, అందుకే కొత్త వారినెవ్వరినీ అనుమతించడం జరుగదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సుగంధభరితమైన పుష్పాలుగా అయ్యేందుకు సాంగత్యాన్ని ఎంతగానో సంభాళించుకోవాలి. హంసల సాంగత్యము చేయాలి, హంసలుగా అయ్యి ఉండాలి. ఎప్పుడూ మురళిని లెక్కచేయనివారిగా అవ్వకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు.

2. కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు సంగమయుగములో మీ సర్వ సంబంధాలనూ ఒక్క తండ్రితో జోడించాలి. పరస్పరం ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోకూడదు. ఏ హద్దు సంబంధము పట్ల ప్రేమను ఉంచుకొని బుద్ధియోగాన్ని వ్రేలాడదీయకూడదు. ఒక్కరినే స్మృతి చేయాలి.

వరదానము:-

పరమాత్మ ప్రేమలో లీనమయ్యే మరియు మిలనములో మగ్నమయ్యే సత్యమైన స్నేహీ భవ

స్నేహానికి గుర్తు ఏం చేప్తారంటే - ఇద్దరు ఉన్నప్పటికీ ఇద్దరుగా ఉండరు, కలిసి ఒక్కరిగా అయిపోతారు, దీనినే ఇమిడిపోవడము అని అంటారు. భక్తులు ఈ స్నేహమయమైన స్థితినే ఇమిడిపోవడము లేక లీనమైపోవడము అని అన్నారు. ప్రేమలో లీనమవ్వటము అనేది ఒక స్థితి, కానీ స్థితికి బదులుగా వారు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదా కొరకు సమాప్తమవ్వటముగా భావించారు. పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రి లేక ఆత్మిక ప్రియుని యొక్క మిలనములో మగ్నమవుతారో, అప్పుడు సమానంగా అవుతారు.

స్లోగన్:-

ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనసును మౌనంగా ఉంచుకుంటారో, వారే అంతర్ముఖులు.