26-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి, అనంతమైన చదువును ఎంత మంచి రీతిలో చదువుతారో, అంత ఉన్నతి జరుగుతుంది’’

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో, ఇందులో అన్నింటికన్నా ఉన్నతమైన, కష్టతరమైన సబ్జెక్ట్ ఏమిటి?

జవాబు:-

ఈ చదువులో అన్నింటికన్నా ఉన్నతమైన సబ్జెక్ట్ - సోదర దృష్టిని పక్కా చేసుకోవటము. తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఏదైతే ఇచ్చారో ఆ నేత్రము ద్వారా ఆత్మా సోదరులను చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసం చేయకూడదు. ఏ దేహధారి యొక్క నామ-రూపాలలోకి బుద్ధి వెళ్ళకూడదు. బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారీ సంకల్పాలు నడవకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ సబ్జెక్టులో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అవుతారు.

ఓంశాంతి

అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. ప్రతి విషయము ఒకటేమో హద్దులోనిది ఉంటుంది, ఇంకొకటి అనంతమైనది కూడా ఉంటుంది. ఇంతకాలమూ మీరు హద్దులో ఉండేవారు, ఇప్పుడు అనంతములో ఉన్నారు. మీ చదువు కూడా అనంతమైనదే. అనంతమైన రాజ్యాధికారము కోసం ఈ చదువు ఉంది, ఇంతకన్నా పెద్ద చదువు ఇంకేదీ ఉండదు. దీనిని ఎవరు చదివిస్తారు? అనంతమైన తండ్రి అయిన భగవంతుడు. శరీర నిర్వహణార్థము కూడా అన్నీ చేయాలి. అంతేకాక స్వయం యొక్క ఉన్నతి కొరకు కూడా ఎంతోకొంత చేయవలసి ఉంటుంది. చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా తమ ఉన్నతి కొరకు చదువుతూ ఉంటారు. అక్కడ అది హద్దులోని ఉన్నతి, ఇక్కడ ఈ అనంతమైన తండ్రి వద్ద ఉన్నది అనంతమైన ఉన్నతి. హద్దు ఉన్నతి మరియు అనంతమైన ఉన్నతి, రెండింటి ఉన్నతినీ పొందండి అని తండ్రి అంటారు. మేము ఇప్పుడు అనంతమైన, సత్యమైన సంపాదనను చేసుకోవాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోనున్నది. ఎంతెంతగా మీరు అనంతమైన సంపాదనలో తీవ్రతను పెంచుతూ ఉంటారో, అంతగా హద్దులోని సంపాదనా విషయాలను మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక వినాశనము జరగనున్నది అని అందరూ అర్థం చేసుకుంటారు. వినాశనం దగ్గరకు వస్తే ఇక భగవంతుడిని కూడా వెతుకుతారు. వినాశనం జరుగుతుందంటే తప్పకుండా స్థాపన చేసేవారు కూడా ఉంటారు. ప్రపంచానికైతే ఏమీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా చదువును చదువుతూ ఉన్నారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు ఉంటారు. కానీ ఈ హాస్టల్ అయితే అతీతమైనది. ఈ హాస్టల్ లోనైతే కొంతమంది మామూలుగా కూడా ఉంటారు, ఎవరైతే ప్రారంభంలో వదిలి వచ్చేసారో వారు ఉండిపోయారు, ఏదో అలా వచ్చేసారు, వెరైటీ వచ్చారు. అలాగని అందరూ మంచివారే వచ్చారని కాదు. మీరు చిన్న-చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చారు. మీరు పిల్లలను కూడా సంభాళించేవారు. మళ్ళీ వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు! తోటలో పూలను కూడా చూడండి, పక్షులను కూడా చూడండి, అవి ఎలా కూస్తూ ఉంటాయో చూడండి. ఈ మనుష్య సృష్టి కూడా ఈ సమయంలో అలాగే ఉంది. ఇంతకుముందు మనలో ఎటువంటి సభ్యత ఉండేది కాదు, అప్పుడు సభ్యత ఉన్నవారి మహిమను గానం చేసేవారము. నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని అనేవారము. ఎంత గొప్ప వ్యక్తులు వచ్చినా సరే వారు - మాకు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని అనుభవం చేసుకుంటారు. మరి వారు ఎందుకు పనికొస్తారు. మీరు కూడా ఎందుకూ కొరగానివారిగానే ఉండేవారు. ఇప్పుడు మీరు అద్భుతమంతా తండ్రిదే అని అర్థం చేసుకున్నారు. తండ్రి విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. ఆ రాజ్యాన్ని మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు. కొద్దిగా కూడా ఎవ్వరూ విఘ్నాన్ని కలిగించలేరు. మనం ఎలా ఉన్నవారము ఎలా అవుతాము. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై తప్పకుండా నడవాలి. ప్రపంచంలో ఎన్ని నిందలు, గొడవలు మొదలైనవి జరిగినా అవేవీ కొత్త విషయాలు కావు. 5,000 సంవత్సరాల క్రితం కూడా అవి జరిగాయి. శాస్త్రాలలో కూడా ఉంది. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ భక్తి మార్గంలో చదువుతారని పిల్లలకు తెలియజేశారు. ఈ సమయంలో మీరు జ్ఞానం ద్వారా సుఖధామంలోకి వెళ్తారు. దీని కొరకు పూర్తి పురుషార్థాన్ని చేయాలి. ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేస్తారో, అంతగా అది కల్ప-కల్పమూ జరుగుతుంది. మేము ఎంతవరకు ఉన్నత పదవిని పొందుతాము అని స్వయాన్ని లోలోపల చెక్ చేసుకోవాలి. మేము ఎంత బాగా చదువుకుంటామో, అంత ఉన్నతిలోకి వెళ్తాము అని విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. వీరు నా కన్నా చురుకుగా ఉన్నారు, నేను కూడా చురుకుగా అవ్వాలి అని భావిస్తారు. వ్యాపారస్థులలో కూడా ఇలా ఉంటుంది, నేను ఇతనికన్నా ఇంకా పైకి వెళ్ళాలి అనగా చురుకుగా అవ్వాలి అని భావిస్తారు. అల్పకాలికమైన సుఖము కొరకు కష్టపడతారు. తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, నేను మీకు ఎంత గొప్ప తండ్రిని. సాకార తండ్రి కూడా ఉన్నారు మరియు నిరాకార తండ్రి కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇద్దరూ కలిసి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థం చేసుకున్నారు. ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. మొట్టమొదటి విషయమేమిటంటే - మనల్ని చదివించేది ఎవరు? భగవంతుడు ఏం చదివిస్తారు? రాజయోగము. మీరు రాజఋషులు. వారు హఠయోగులు. వారు కూడా ఋషులే కానీ వారు హద్దులోని వారు. మేము ఇళ్ళూ-వాకిళ్ళను వదిలేశాము అని వారు అంటారు, అదేమైనా మంచి పని చేశారా? ఇక్కడైతే, ఎప్పుడైతే మిమ్మల్ని వికారాల కోసం విసిగిస్తారో అప్పుడే మీరు మీ ఇళ్ళూ-వాకిళ్ళను వదిలేస్తారు. కానీ ఆ ఋషులనేమి విసిగించడం జరిగింది? మీకు దెబ్బలు పడ్డాయి, అప్పుడు మీరు పరుగుపెట్టారు. ఒక్కొక్కరినీ అడగండి, కుమారీలు, స్త్రీలు ఎన్ని దెబ్బలు పడ్డారు, అందుకే వారు వచ్చేసారు. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు. ఇక్కడ జ్ఞానామృతం లభించేది కావున ఆ జ్ఞానామృతాన్ని తాగేందుకు మేము ఓం రాధా వద్దకు వెళ్తున్నాము అని అనుమతి పత్రాన్ని తీసుకువచ్చారు. ఈ వికారాల విషయంలో గొడవలు, హంగామాలు మొదటి నుండీ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే అసురీ ప్రపంచము వినాశనమవుతుందో అప్పుడే ఇవి ఆగిపోతాయి. ఇక అర్ధకల్పం కొరకు ఇవి ఆగిపోతాయి.

ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రారబ్ధాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రారబ్ధాన్ని ఇస్తారు. హద్దులోని తండ్రి హద్దు ప్రారబ్ధాన్ని ఇస్తారు. అది కూడా కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది. ఇక్కడ తండ్రి అంటారు - మీరు కొడుకులైనా, కూతుళ్ళయినా ఇరువురూ వారసత్వానికి అధికారులే. ఆ లౌకిక తండ్రి వద్దనైతే భేదము ఉంటుంది, కేవలం కొడుకులనే వారసులుగా చేసుకుంటారు. స్త్రీని అర్ధ భాగస్వామి అని అంటారు కానీ, ఆమెకు కూడా భాగాన్ని ఇవ్వరు, అంతా కొడుకే సంభాళిస్తాడు. తండ్రికి అక్కడ కొడుకులపై మోహము ఉంటుంది. ఈ తండ్రి అయితే నియమానుసారంగా పిల్లలందరికీ (ఆత్మలకు) వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడ కొడుకులు మరియు కూతుళ్లు అన్న భేదము గురించి తెలియనే తెలియదు. మీరు ఎంతటి సుఖము యొక్క వారసత్వాన్ని అనంతమైన తండ్రి నుండి తీసుకుంటారు. అయినా కానీ పూర్తిగా చదవరు, చదువును వదిలేస్తారు. కుమార్తెలు వ్రాస్తారు - బాబా, ఫలానావారు రక్తముతో వ్రాసి ఇచ్చారు, కానీ ఇప్పుడు రావడం లేదు. రక్తముతో కూడా వ్రాస్తారు - బాబా, మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి కానీ మేం మిమ్మల్ని ఎప్పుడూ వదలము అని. కానీ పాలన తీసుకొని కూడా మళ్ళీ వెళ్ళిపోతారు. తండ్రి అర్థం చేయించారు - ఇదంతా డ్రామా. కొందరు ఆశ్చర్యము కలిగేలా పారిపోతారు. ఇక్కడ కూర్చున్నారు అంటే - ఇటువంటి అనంతమైన తండ్రిని మేం ఎలా వదలగలము అన్న నిశ్చయమున్నట్లు. ఇక్కడిది చదువు కూడా. నేను మిమ్మల్ని నాతోపాటు తీసుకువెళ్తాను అని గ్యారంటీ కూడా ఇస్తారు. సత్యయుగ ఆదిలో ఇంతమంది మనుష్యులు లేరు. ఇప్పుడు సంగమయుగంలో మనుష్యులందరూ ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్దిమందే ఉంటారు. ఇన్ని ధర్మాలవారెవ్వరూ ఉండరు. దాని ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళిపోతారు. లెక్కాచారాలను తీర్చుకొని, పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండైతే వచ్చామో అక్కడకు వెళ్ళిపోతాము. అదేమో రెండు గంటల నాటకము, ఇదేమో అనంతమైన నాటకము. మనము ఆ ఇంటి నివాసులమని మరియు ఒక్క తండ్రి పిల్లలమని మీకు తెలుసు. మనం ఉండే స్థానము నిర్వాణధామము, వాణికి అతీతమైన ధామము. అక్కడ శబ్దమనేది ఉండదు. మనుష్యులు బ్రహ్మములో లీనమైపోతాము అని భావిస్తారు. బాబా అంటారు, ఆత్మ అవినాశీ, అది ఎప్పుడూ వినాశనమవ్వదు. జీవాత్మలు ఎంతమంది ఉన్నారు. అవినాశీ అయిన ఆత్మ జీవము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మలన్నీ డ్రామాలోని పాత్రధారులు. ఆత్మలు ఉండే స్థానము ఆ బ్రహ్మాండము, అది ఇల్లు. ఆత్మ అండాకారములో కనిపిస్తుంది. అక్కడ బ్రహ్మాండములో ఆత్మల నివాస స్థానముంది. ప్రతి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోయినా ఒకవేళ వింటూనే ఉంటే, మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకవేళ వదిలేస్తే అసలేమీ అర్థం చేసుకోలేకపోతారు. ఈ పాత ప్రపంచము అంతమై కొత్త ప్రపంచము స్థాపనవుతుందని మీకు తెలుసు. తండ్రి అంటారు, నిన్న మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా అవ్వటానికి వచ్చారు. బాబా మమ్మల్ని ఎటువంటి యజమానులుగా తయారుచేస్తారంటే ఆ అధికారాన్ని మా నుండి ఎవ్వరూ లాక్కోలేరు, ఆకాశము, భూమి మొదలైనవాటిపై మాకు అధికారముంటుంది అని పాట కూడా ఉంది. ఈ ప్రపంచములో ఏమేమి ఉన్నాయో చూడండి. అందరూ అవసరానికి స్నేహం చేసేవారే. అక్కడైతే ఇలా ఉండరు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలతో - ఈ ధన-సంపదలన్నీ మీకు ఇచ్చేసి వెళ్తాను, వీటిని బాగా సంభాళించండి అని అంటారో, అలా అనంతమైన తండ్రి కూడా అంటారు - మీకు ధన-సంపదలన్నీ ఇస్తాను. మీరు పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని నన్ను పిలిచారు కావున తప్పకుండా పావనంగా తయారుచేసి విశ్వానికి యజమానులుగా చేస్తారు. తండ్రి ఎంత యుక్తిగా అర్థం చేయిస్తారు. దీని పేరు సహజ జ్ఞానము మరియు యోగము. ఇది క్షణము యొక్క విషయము. క్షణములో ముక్తి మరియు జీవన్ముక్తి. మీరు ఇప్పుడు ఎంత దూరదృష్టితో కూడిన బుద్ధి కలవారిగా అయ్యారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నాము అని ఇదే చింతన జరుగుతూ ఉండాలి. మనం మన కొరకు రాజ్య స్థాపన చేసుకుంటున్నాము కావున అందులో మనం ఉన్నతమైన పదవిని ఎందుకు పొందకూడదు, తక్కువ ఎందుకు పొందాలి. రాజధాని స్థాపనవుతుంది. అందులో కూడా పదవులు ఉంటాయి కదా. దాస-దాసీలు ఎంతోమంది ఉంటారు. వారు కూడా ఎంతో సుఖాన్ని పొందుతారు. కలిసి మహళ్ళలోనే ఉంటారు. పిల్లలు మొదలైనవారిని సంభాళిస్తూ ఉండి ఉండవచ్చు. ఎంత సుఖంగా ఉంటారు. కేవలం పేరు మాత్రము దాస-దాసీలు అని ఉంటుంది. రాజు-రాణులు ఏదైతే తింటారో, అదే దాస-దాసీలు తింటారు. అది మళ్ళీ ప్రజలకైతే లభించదు. దాస-దాసీలకు కూడా ఎంతో గౌరవముంటుంది కానీ వారిలో కూడా నంబరువారుగా ఉంటారు. పిల్లలైన మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. దాస-దాసీలైతే ఇక్కడ కూడా రాజుల వద్ద ఉంటారు. రాజకుమారుల సభ జరిగినప్పుడు, వారు పరస్పరం కలుసుకున్నప్పుడు కిరీటము మొదలైనవాటితో పూర్తిగా అలంకరించబడి ఉంటారు. అందులో కూడా నంబరువారుగా గొప్ప శోభాయమానమైన సభలు జరుగుతాయి. అందులో రాణులు కూర్చోరు, వారు పరదా వెనుక ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. వారిని మీరు ప్రాణదాత అని కూడా అంటారు, వారు ప్రాణ దానాన్ని ఇచ్చేవారు. వారు ఘడియ-ఘడియ శరీరము వదిలేయడం నుండి రక్షించేవారు. అక్కడ మరణం యొక్క చింత ఉండదు. ఇక్కడ ఎంత చింత ఉంటుంది. కొద్దిగా ఏమైనా జరిగినా కానీ ఎక్కడ చనిపోతామో అని డాక్టరును పిలుస్తారు. అక్కడ భయం అనే విషయమే లేదు. మీరు కాలుడిపై విజయాన్ని పొందారు కావున ఎంతటి నషా ఉండాలి. చదివించేవారిని స్మృతి చేయండి, అది కూడా స్మృతి యాత్రయే. తండ్రి, టీచర్, సద్గురువును స్మృతి చేసినా మంచిది. ఎంతగా శ్రీమతంపై నడిస్తే అంత. మనసా, వాచా, కర్మణా పావనంగా అవ్వాలి. బుద్ధిలో వికారీ సంకల్పాలు కూడా రాకూడదు. అది కూడా ఎప్పుడైతే సోదరులుగా భావిస్తారో అప్పుడు సాధ్యమవుతుంది. సోదరీ-సోదరులుగా భావించినా కూడా ఛీ-ఛీ గా అయిపోతారు. అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేసేది ఈ కళ్ళు, అందుకే తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు, కావున స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులను చూడండి. దీనినే జ్ఞానము యొక్క మూడవ నేత్రము అని అంటారు. సోదరీ-సోదరుల సంబంధము కూడా ఫెయిల్ అవుతుంది కావున రెండవ యుక్తిని వెలికితీయడం జరుగుతుంది, అదేమిటంటే పరస్పరం సోదరులుగా భావించండి. ఇందులో చాలా శ్రమ ఉంది. సబ్జెక్టులు ఉంటాయి కదా. కొన్ని చాలా కష్టమైన సబ్జెక్టులు ఉంటాయి. ఇది చదువు, ఇందులో కూడా ఉన్నతమైన సబ్జెక్ట్ ఏమిటంటే - మీరు ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు. ఇది చాలా పెద్ద పరీక్ష. విశ్వానికి యజమానులుగా అవ్వాలి. తండ్రి చెప్పే ముఖ్యమైన విషయమేమిటంటే - పరస్పరం సోదరులుగా భావించండి. కావున పిల్లలు అంతటి పురుషార్థాన్ని చేయాలి. కానీ నడుస్తూ-నడుస్తూ ఎంతోమంది ద్రోహులుగా కూడా అయిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మంచి-మంచి పిల్లలను మాయ తనదిగా చేసుకుంటుంది. అప్పుడు తండ్రి అంటారు - నన్ను వదిలి వెళ్ళిపోతారు కూడా, విడాకులు కూడా ఇచ్చేస్తారు. వదిలి వెళ్ళిపోవడమంటే పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు మరియు విడాకులు అంటే భార్య-భర్తల మధ్యన జరుగుతుంది. తండ్రి అంటారు - నాకైతే రెండూ జరుగుతాయి. మంచి-మంచి కుమార్తెలు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళి రావణుడికి చెందినవారిగా అయిపోతారు. ఇది అద్భుతమైన ఆట కదా. మాయ చేయనిదంటూ ఏముంది. తండ్రి అంటారు, మాయ చాలా కఠినమైనది. ఏనుగును మొసలి తినేసింది అన్న గాయనము ఉంది. ఎంతోమంది పొరపాట్లు చేసి కూర్చొంటారు. తండ్రిని అగౌరవిస్తే మాయ పచ్చిగానే తినేస్తుంది. మాయ ఎటువంటిదంటే అది కొందరినైతే పూర్తిగా పట్టేసుకుంటుంది. అచ్ఛా!

పిల్లలకు ఎంతగా వినిపించాను, ఇంకెంత వినిపించను. ముఖ్యమైన విషయము అల్ఫ్ కు (భగవంతునికి) సంబంధించినది. ముసల్మానులు కూడా - ఉదయముదయమే లేచి అల్ఫ్ ను స్మృతి చేయండి, అది నిదురించే వేళ కాదు అని అంటారు. ఈ ఉపాయముతోనే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఇతర ఉపాయము లేదు. తండ్రి పిల్లలైన మీతో ఎంత విశ్వాసపాత్రునిగా ఉన్నారు. వారు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. వారు వచ్చిందే మిమ్మల్ని తీర్చిదిద్ది తమతోపాటు తీసుకువెళ్ళేందుకు. స్మృతియాత్రతోనే మీరు సతోప్రధానంగా అవుతారు. అటువైపు జమా అవుతూ ఉంటుంది. తండ్రి అంటారు, ఎంతగా స్మృతి చేస్తున్నారు, ఎంతగా సేవ చేస్తున్నారు అని మీ లెక్కాపత్రాన్ని పెట్టుకోండి. వ్యాపారస్థులు నష్టం కలిగినట్లు చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. నష్టపోకూడదు. అలా జరిగితే కల్ప-కల్పాంతరాలకు నష్టం కలుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా, వాచా, కర్మణా పావనంగా అవ్వాలి, బుద్ధిలోకి వికారీ సంకల్పాలు కూడా రాకూడదు, దీని కొరకు ఆత్మలు పరస్పరం సోదరులు అనే అభ్యాసాన్ని చేయాలి. ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు.

2. ఏ విధంగా తండ్రి విశ్వాసపాత్రునిగా ఉన్నారో, పిల్లలను తీర్చిదిద్ది తమతోపాటు తీసుకువెళ్తారో, అలా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళకూడదు లేక విడాకులు ఇవ్వకూడదు.

వరదానము:-

సదా తేలికగా ఉంటూ తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజయోగీ భవ

సంగమయుగంలో సంతోషాల గని ఏదైతే లభిస్తుందో, అది ఏ ఇతర యుగములోనూ లభించదు. ఈ సమయములో తండ్రి మరియు పిల్లల మిలనము ఉంది, వారసత్వము ఉంది, వరదానము ఉంది. వారసత్వము మరియు వరదానము, ఈ రెండింటిలోనూ శ్రమ అనిపించదు, అందుకే మీ టైటిల్ - సహజయోగి. బాప్ దాదా పిల్లల కష్టాన్ని చూడలేరు, వారంటారు - పిల్లలూ, మీ భారాన్నంతటినీ తండ్రికి ఇచ్చి మీరు స్వయం తేలికగా అయిపోండి. ఎంత తేలికగా అవ్వాలంటే తండ్రి తమ నయనాలలో కూర్చోబెట్టుకొని తమతోపాటు తీసుకువెళ్ళాలి. తండ్రి పట్ల స్నేహానికి గుర్తు - సదా తేలికగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోవటము.

స్లోగన్:-

నెగెటివ్ ఆలోచించే మార్గాన్ని మూసి వేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అయిపోతారు.