28-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 23.10.99


‘‘సమయం యొక్క పిలుపు - దాతగా అవ్వండి’’

ఈ రోజు సర్వ శ్రేష్ఠ భాగ్యవిధాత, సర్వ శక్తుల దాత అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. మధుబన్ లో సమ్ముఖంగా ఉన్నా, దేశ-విదేశాలలో స్మృతిలో వింటున్నవారైనా, చూస్తున్నవారైనా, ఎక్కడ కూర్చున్నా సరే మనసుతో సమ్ముఖంగా ఉన్నారు, ఆ పిల్లలందరినీ చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. మీరందరూ కూడా హర్షిస్తున్నారు కదా! పిల్లలు కూడా హర్షితముగా ఉన్నారు మరియు బాప్ దాదా కూడా హర్షితముగా ఉన్నారు. మనసులోని ఈ సదాకాలికమైన సత్యమైన సంతోషము మొత్తము ప్రపంచములోని దుఃఖాలను దూరం చేసేటువంటిది. ఈ మనసులోని సంతోషము ఆత్మలకు బాబా యొక్క అనుభవాన్ని చేయిస్తుంది ఎందుకంటే బాబా కూడా సదా సర్వాత్మల పట్ల సేవాధారి మరియు పిల్లలైన మీరందరూ బాబాతోపాటు సేవ సహచరులు. సహచరులే కదా! బాబాకు సహచరులు మరియు విశ్వములోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్ని అందించే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. మీరు సదా సేవాధారులు. సేవ అంటే కేవలం నాలుగు గంటలో, ఆరు గంటలో చేసేవారు కాదు, మీరు ప్రతి సెకండ్ సేవా స్టేజ్ పై పాత్రను అభినయించే పరమాత్ముని సహచరులు. స్మృతి నిరంతరమైనది, అలాగే సేవ కూడా నిరంతరమైనది. మిమ్మల్ని మీరు నిరంతర సేవాధారులుగా అనుభవము చేస్తున్నారా? లేక 8-10 గంటల సేవాధారులా? ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నదే స్మృతి మరియు సేవ కొరకు. వేరే ఏమైనా చేసేది ఉందా? ఇదే కదా! ప్రతి శ్వాసలో, ప్రతి సెకండు స్మృతి మరియు సేవ తోడుతోడుగా ఉన్నాయా లేక సేవ గంటలు వేరుగా మరియు స్మృతి గంటలు వేరుగా ఉన్నాయా? అలా లేవు కదా! అచ్ఛా, బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100 శాతము సేవ ఉన్నట్లయితే 100 శాతము స్మృతి ఉందా? రెండింటి బ్యాలెన్స్ ఉందా? తేడా వచ్చేస్తుంది కదా? కర్మయోగి అంటే అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి - రెండింటి బ్యాలెన్స్ సమానంగా ఉండటము, ఇవి సమానంగా ఉండాలి. కొంత సమయం స్మృతి ఎక్కువగా ఉండి సేవ తక్కువగా ఉండటము లేక సేవ ఎక్కువగా ఉండి స్మృతి తక్కువగా ఉండటము, ఇలా ఉండకూడదు. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము ఎప్పటివరకైతే స్టేజిపై ఉంటాయో అప్పటివరకు తోడుతోడుగా ఉంటాయి కదా. వేరవ్వగలవా? అలా స్మృతి మరియు సేవ తోడుతోడుగా ఉండాలి. స్మృతి అనగా బాబా సమానము, స్వయము యొక్క స్వమానము యొక్క స్మృతి కూడా ఉండాలి. బాబా స్మృతి ఉంటే స్వతహాగానే స్వమానము యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఒకవేళ స్వమానములో లేకపోతే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు.

స్వమానము అనగా బాబా సమానము. సంపూర్ణ స్వమానములో ఉండటమే బాబా సమానంగా ఉండటము. ఇటువంటి స్మృతిలో ఉండే పిల్లలు ఎల్లప్పుడూ దాతలుగా ఉంటారు. వారు తీసుకునేవారిగా ఉండరు, దేవత అనగా ఇచ్చేవారు. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి దాతాతనపు స్థితిని చెక్ చేస్తున్నారు - దాత పిల్లలు ఎంతవరకు దాతలుగా అయ్యారు? బాబా ఎప్పుడూ తీసుకోవాలి అన్న సంకల్పాన్ని చెయ్యలేరు, వారు ఇవ్వాలి అన్న సంకల్పాన్నే చేస్తారు. ఒకవేళ మీ పాతవాటినన్నింటినీ ఇచ్చేయండి అని అన్నా సరే, మళ్ళీ ఆ పాతవాటికి బదులుగా కొత్తవాటిని ఇస్తారు. బాబా విషయములో తీసుకోవటము అనగా బాబా ఇవ్వటము. వర్తమాన సమయంలో బాప్ దాదాకు పిల్లలది ఒక టాపిక్ చాలా మంచిగా అనిపించింది. ఏ టాపిక్? విదేశీయుల టాపిక్ అది. అది ఏమిటి? కాల్ ఆఫ్ టైమ్ (సమయం యొక్క పిలుపు).

పిల్లల కొరకు సమయం యొక్క పిలుపు ఏది అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు! విశ్వము కొరకు, సేవ కొరకు బాప్ దాదా అయితే సేవా సహచరునిగా ఉండనే ఉన్నారు. కానీ పిల్లల కొరకు ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నది మీకు కూడా అర్థమవుతుంది కదా. మీ కోసం ఆలోచించండి. సేవ కొరకైతే భాషణ చేసారు, చేస్తున్నారు కదా! కానీ మీ కోసం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి - మా కొరకు సమయం యొక్క పిలుపు ఏమిటి? వర్తమాన సమయంలోని పిలుపు ఏమిటి? బాప్ దాదా చూస్తున్నారు - ఇప్పటి సమయమనుసారంగా ప్రతి సమయం, పిల్లలు ప్రతి ఒక్కరూ దాతాతనపు స్మృతిని ఇంకా పెంచుకోవాలి. స్వ ఉన్నతి పట్ల దాతాతనపు భావము, సర్వుల పట్ల స్నేహము ఇమర్జ్ రూపములో కనిపించాలి. ఎవరెలా ఉన్నా కానీ, ఎటువంటివారైనా కానీ, నేను ఇవ్వాలి. దాత ఎల్లప్పుడూ అనంతమైన వృత్తి కలవారిగా ఉంటారు, హద్దులోని వృత్తి కలవారిగా కాదు, అంతేకాక దాత సదా సంపన్నులుగా, నిండుగా ఉంటారు. దాత ఎల్లప్పుడూ క్షమాభావములో మాస్టర్ సాగరులుగా ఉంటారు. ఈ కారణంగా హద్దులోని తమ సంస్కారాలేవైతే ఉంటాయో లేక ఇతరుల సంస్కారాలు ఏవైతే ఉంటాయో, అవి ఇమర్జ్ అవ్వవు, మర్జ్ అయి ఉంటాయి. నేను ఇవ్వాల్సిందే. ఎవరు ఇచ్చినా, ఇవ్వకపోయినా కానీ నేను దాతగా అవ్వాలి. ఏ సంస్కారానికైనా వశమైన పరవశ ఆత్మ అయినా కానీ, ఆ ఆత్మకు నేను సహయోగాన్ని ఇవ్వాలి, అప్పుడు ఎవరి హద్దు సంస్కారాలూ మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు. ఎవరైనా గౌరవాన్ని ఇచ్చినా, ఇవ్వకపోయినా కానీ, నేనైతే ఇవ్వాలి. ఇటువంటి దాతాతనము ఇప్పుడు ఇమర్జ్ అయి ఉండాలి. మనసులో భావన అయితే ఉంది కానీ... ఈ కానీ అనే మాట రాకూడదు. నేను చెయ్యాల్సిందే. ఎవరైనా అలాంటి-ఇలాంటి నడవడిక నడుస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా, ఒకవేళ అవి మీకు పనికిరాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోనే తీసుకోకండి. చెడిపోయిన వస్తువును తీసుకోవటం జరుగుతుందా ఏమిటి? మనసులో ధారణ చెయ్యటము అనగా తీసుకోవటము. అది బుద్ధిలోకి కూడా రాకూడదు. బుద్ధిలోకి కూడా విషయము వచ్చేసింది కదా, అలా కూడా రాకూడదు. అది ఉన్నదే చెడిపోయిన వస్తువు అన్నప్పుడు, అది మంచిది కాదు అన్నప్పుడు దానిని బుద్ధిలోకి మరియు మనసులోకి తీసుకోకండి అనగా దానిని ధారణ చెయ్యకండి. తీసుకునేందుకు బదులుగా ఇంకా శుభ భావన, శుభ కామనలను దాతగా అయ్యి ఇవ్వండి. చెడు విషయాలను తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు సమయమనుసారంగా ఒకవేళ బుద్ధి మరియు మనసు ఖాళీగా లేకపోతే నిరంతర సేవాధారులుగా అవ్వలేరు. మనసు మరియు బుద్ధి ఇతర విషయాలలో బిజీ అయిపోయినట్లయితే ఇక సేవ ఏం చేస్తారు? అప్పుడిక లౌకికములో ఎలాగైతే కొందరు 8 గంటలు, కొందరు 10 గంటలు పని చేస్తారో, ఇక్కడ కూడా అలాగే అయిపోతుంది. 8 గంటల సేవాధారి, 6 గంటల సేవాధారిగా అవుతారు, నిరంతర సేవాధారులుగా అవ్వలేరు. మనసా సేవ అయినా చెయ్యండి, వాచా సేవ అయినా చెయ్యండి లేక కర్మల ద్వారా అనగా సంబంధ-సంపర్కాల ద్వారా అయినా సేవ చెయ్యండి, ప్రతి సెకండూ దాత అనగా సేవాధారి. బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటే బాబాకు సేవ సహచరులుగా అవ్వగలరు. మనసును సదా స్వచ్ఛంగా ఉంచుకోవటం ద్వారా నిరంతరం బాబా యొక్క సేవ సహచరులుగా అవ్వగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? మీతో పాటు ఉంటాము, మీతో పాటే వస్తాము అని. ప్రతిజ్ఞ ఉంది కదా? లేక మీరు ముందు ఉండండి, మేము వెనుక-వెనుక వస్తాము అని అంటారా? అలా కాదు కదా? తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు కదా? బాబా సేవ లేకుండా ఉంటారా? అలాగే స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా మీరు కూడా ఉంటారు కానీ మీరు శ్రమతో ఉంటారు. స్మృతిలో ఉంటున్నారు కానీ శ్రమతో, అటెన్షన్ తో ఉంటున్నారు. బాబాకు ఉన్నవారే ఎవరు? పరమాత్మకు ఉన్నవారు ఆత్మలే. ఆత్మలు నంబరువారుగా ఉన్నారు. పిల్లల స్మృతి లేకుండా బాబా ఉండనే ఉండలేరు. బాబా పిల్లల స్మృతి లేకుండా ఉండగలరా? మీరు ఉండగలరా? అప్పుడప్పుడు అల్లరి పిల్లలుగా అయిపోతారు.

మరి ఏం విన్నారు? సమయం యొక్క పిలుపు ఏమిటంటే - దాతగా అవ్వండి. దీని యొక్క అవసరము ఎంతో ఉంది. మొత్తం విశ్వములోని ఆత్మలందరి పిలుపు ఉంది - ఓ మా ఇష్ట దేవతలారా... మీరు ఇష్ట దేవతలే కదా! ఏదో ఒక రూపంలో మీరు సర్వాత్మలకు ఇష్టులు. ఇప్పుడు ఆత్మలందరి పిలుపు ఏమిటంటే - ఓ ఇష్టదేవులు, ఇష్టదేవీలు, పరివర్తన చెయ్యండి. వారి ఈ పిలుపు వినిపిస్తుందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తుందా? మరి విని ఏం చేస్తున్నారు? వినిపిస్తుంది అన్నప్పుడు వారికి పరిష్కారము ఇస్తారా లేక ఆ, చేస్తాములే అని అలోచిస్తారా? పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపునేమో ఇతరులకు వినిపిస్తున్నారు కానీ మీరు ఆత్మల పిలుపును కేవలం విని ఊరుకుంటారా? కనుక ఇష్టదేవులు, ఇష్టదేవీలు - ఇప్పుడు మీ దాతాతనపు రూపాన్ని ఇమర్జ్ చెయ్యండి. ఇవ్వాలి, ఏ ఆత్మ కూడా వంచితముగా ఉండిపోకూడదు. లేదంటే ఫిర్యాదుల మాలలు మెడలో పడతాయి. ఫిర్యాదైతే చేస్తారు కదా! మరి మీరు ఫిర్యాదుల మాలలను ధరించే ఇష్ట దేవతలా లేక పూల మాలలను ధరించే ఇష్ట దేవతలా? ఎటువంటి ఇష్ట దేవతలు? మీరు పూజ్యులు కదా! మేమైతే వెనక వచ్చినవారము, పెద్ద-పెద్దవారెవరైతే ఉన్నారో, వారే దాతలుగా అవుతారు, మేమెక్కడ అవుతాము అని ఇలా భావించకండి. అలా కాదు. అందరూ దాతలుగా అవ్వాలి.

ఎవరైతే మొదటిసారిగా మధుబన్ కు వచ్చారో, వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చినవారు దాతగా అవ్వగలరా లేక రెండో సంవత్సరం, మూడో సంవత్సరంలో దాతగా అవుతారా? ఒక సంవత్సరం వారు దాతగా అవ్వగలరా? (అవ్వగలము) చాలా మంచి తెలివైనవారు. బాప్ దాదా ధైర్యాన్ని చూసి సదా సంతోషిస్తారు. ఒక నెలవారైనా, ఒక సంవత్సరంవారైనా లేక 6 నెలలవారైనా, బాప్ దాదాకు తెలుసు, మీరు ఒక సంవత్సరంవారైనా లేక ఒక నెలవారైనా, ఒక్క నెలవారైనా సరే స్వయాన్ని బ్రహ్మాకుమార్ లేక బ్రహ్మాకుమారి అనే పిలుచుకుంటారు కదా! మరి బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారి అనగా బ్రహ్మాబాబా వారసత్వానికి అధికారులు అయినట్లు. బ్రహ్మాను తండ్రిగా స్వీకరించారు కనుకనే కుమార, కుమారీలుగా అయ్యారు కదా? అందుకే బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు బ్రహ్మాతండ్రి మరియు శివతండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారులుగా అయ్యారు కదా! లేక ఒక నెలవారికి వారసత్వము లభించదని అనుకుంటున్నారా? ఒక నెలవారికి వారసత్వము లభిస్తుందా? మరి వారసత్వము లభించినప్పుడు అది ఇవ్వడానికి దాతలుగానైతే అవుతారు కదా! ఏదైతే లభిస్తుందో, దానిని ఇవ్వడమైతే ప్రారంభించాలి కదా.

ఒకవేళ తండ్రిగా భావించి కనెక్షన్ ను జోడించినట్లయితే ఒక్క రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోగలరు. అవును, బాగుంది, ఏదో శక్తి ఉంది, అర్థమైతే అవుతుంది... అని కేవలం ఇలా అనటం కాదు. వారసత్వానికి అధికారులుగా పిల్లలు అవుతారు, అంతేకానీ అర్థం చేసుకునేవారు, చూసేవారు వారసత్వానికి అధికారులుగా అవ్వరు. ఒకవేళ ఒక్క రోజులోనైనా మనస్ఫూర్తిగా తండ్రి అని స్వీకరిస్తే వారసత్వానికి అధికారులుగా అవ్వగలరు. మీరందరూ అధికారులే కదా! మీరందరూ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలే కదా లేక ఇప్పుడు అవుతున్నారా? అయిపోయారా లేక అవ్వడానికి వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా మార్చగలరా? బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలకు బదులుగా కేవలం కుమారులు, కుమారీలుగా అవ్వండి అంటే అవ్వగలరా? బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలుగా అవ్వటంలో ఎంత లాభం ఉంది? లాభం ఒక్క జన్మకు కాదు, అనేక జన్మలకు లాభం. పురుషార్థం చేసేదేమో సగం జన్మ లేక పావు జన్మ కానీ ప్రారబ్ధము మాత్రం అనేక జన్మలకు లభిస్తుంది. లాభమే లాభం కదా! బాప్ దాదా సమయమనుసారంగా వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు ఎందుకంటే బాప్ దాదా పిల్లల రిజల్టునైతే చూస్తుంటారు కదా! రిజల్టులో ధైర్యము చాలా బాగుంది అన్నది చూసారు. లక్ష్యము కూడా చాలా బాగుంది. లక్ష్యము అనుసారంగా చూస్తే ఇప్పటికీ లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యమైతే అందరిదీ నంబర్ వన్ గానే ఉంది. మీ లక్ష్యము 21 జన్మల రాజ్యభాగ్యము తీసుకోవాలనా, సూర్యవంశీయులుగా అవ్వాలనా లేక చంద్రవంశీయులుగా అవ్వాలనా అని బాప్ దాదా ఎవరిని అడిగినా, అందరూ ఎందులో చేతులెత్తుతారు? సూర్యవంశీయులుగా అవ్వాలనే కదా! చంద్రవంశీయులుగా అవ్వాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. (ఒక్కరు చేతులెత్తారు) మంచిది, లేదంటే ఆ సీట్ ఖాళీగా ఉండిపోతుంది. మరి లక్ష్యమైతే అందరిదీ చాలా బాగుంది. లక్ష్యము మరియు లక్షణాల యొక్క సమానత - దీనిపై అటెన్షన్ పెట్టడము చాలా అవసరము. దీనికి కారణం ఏమిటి? ఈ రోజు వినిపించాము కదా, అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారు. ఇది అవ్వాలి, వీరు చెయ్యాలి, వీరు సహాయము చెయ్యాలి, వీరు మారితే నేను మారుతాను, ఈ విషయం సరిగ్గా ఉంటే నేను కూడా సరిగ్గా ఉంటాను - ఇలా అనటం అంటే తీసుకునేవారిగా అవ్వటము, ఇది దాతాతనము కాదు. ఎవరు ఇచ్చినా, ఇవ్వకపోయినా బాబా అయితే మొత్తము ఇచ్చేసారు. బాబా ఏమైనా కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇచ్చారా? ఒకటే కోర్సు కదా! 60 సంవత్సరాలవారికైనా, ఒక నెలవారికైనా కోర్సు అయితే ఒకటే కదా. లేదా 60 సంవత్సరాలవారి కోర్సు వేరుగా, ఒక నెలవారి కోర్సు వేరుగా ఉందా? వారు కూడా అదే కోర్సు తీసుకున్నారు మరియు ఇప్పుడు కూడా అదే కోర్సు ఉంది. అదే జ్ఞానము, అదే ప్రేమ, అవే సర్వశక్తులు. అన్నీ ఒకేలా ఉన్నాయి. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు అన్నట్లు లేవు. అందరికీ ఒకే విధమైన వారసత్వము ఉంది. మరి బాబా అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతారు, తీసుకునేవారిగా అవ్వరు. నేను ఇవ్వాలి. ఎవరైనా ఇచ్చినా, ఇవ్వకపోయినా, వారు తీసుకునే కోరిక కలవారిగా ఉండరు, ఇచ్చే కోరిక కలవారిగా ఉంటారు. అంతేకాక ఎంతైతే ఇస్తారో, దాతగా అవుతారో, అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా స్వమానాన్ని ఇచ్చారనుకోండి, అలా ఇతరులకు ఇవ్వటము అనగా మీ స్వమానాన్ని పెంచుకోవటము. అది ఇచ్చినట్లు అవ్వదు, ఇవ్వడం అనగా తీసుకోవడము. తీసుకోకండి, ఇవ్వండి, అప్పుడది తీసుకోవటముగానే అవుతుంది. మరి సమయం యొక్క పిలుపు ఏమిటో అర్థమైందా? దాతగా అవ్వండి. ఒక్క మాట గుర్తు ఉంచుకోండి. ఏం జరిగినా కానీ ‘‘దాత’’ అన్న పదాన్ని సదా గుర్తుంచుకోండి. కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా ఉండాలి. సూక్ష్మంగానూ తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు, స్థూలంగానూ తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు. దాత అన్నదాని అర్థమే - కోరిక అంటే ఏమిటో తెలియనివారు, సంపన్నులు. తీసుకోవాలి అన్న కోరిక కలగటానికి అసలు వారికి అప్రాప్తి అనేదే అనుభవమవ్వదు. సర్వ ప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. మరి మీ లక్ష్యము ఏమిటి? సంపన్నముగా అవ్వాలనే కదా? లేక ఎంత లభిస్తే అంతే చాలా? సంపన్నముగా అవ్వటమే సంపూర్ణముగా అవ్వటము.

ఈ రోజు విదేశీయులకు విశేషంగా అవకాశము లభించింది. మంచిది. మొదటి అవకాశాన్ని విదేశీయులు తీసుకున్నారు, ప్రియమైన పిల్లలయ్యారు కదా. అందరినీ వద్దన్నారు కానీ విదేశీయులకు ఆహ్వానమునిచ్చారు. బాప్ దాదాకు కూడా పిల్లలందరి స్మృతి ఉంటుంది, అయినా కానీ డబుల్ విదేశీయులను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషమనిపిస్తుంది. ఇప్పుడు వర్తమాన సమయంలో అంతగా అలజడిలోకి రావటం లేదు. ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రారంభములో ప్రశ్నలు ఉండేవి కదా - అది భారతీయ కల్చర్ (సంస్కృతి), ఇది విదేశీ కల్చర్ అని... ఇప్పుడు అంతా అర్థమయ్యింది. ఇప్పుడు బ్రాహ్మణ కల్చర్ లోకి వచ్చేసారు. భారతీయ కల్చర్ లేదు, విదేశీ కల్చర్ లేదు, బ్రాహ్మణ కల్చర్ లోకి వచ్చేసారు. భారతీయ కల్చర్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ బ్రాహ్మణ కల్చర్ అయితే సహజము కదా! బ్రాహ్మణ కల్చర్ అంటేనే స్వమానములో ఉండండి మరియు స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఇదే బ్రాహ్మణ కల్చర్. ఇదైతే ఇష్టమే కదా? భారతీయ కల్చర్ ఎలా వస్తుంది, కష్టం కదా అని ఇప్పుడు ప్రశ్నలైతే ఏమీ లేవు కదా? సహజం అయిపోయింది కదా? మరి చూడండి, అక్కడకు వెళ్ళిన తరువాత మళ్ళీ ఇది కాస్త కష్టము అని అనకండి! అక్కడకు వెళ్ళిన తర్వాత ఇలా వ్రాయకండి. సహజము అని అనేశాము కానీ ఇది కాస్త కష్టము అని అనకండి! ఇది సహజమేనా లేక కొంచెం-కొంచెం కష్టమా? కొంచెం కూడా కష్టము కాదు. ఇది చాలా సహజము. ఇప్పుడు మొత్తం ఆట అంతా పూర్తయిపోయింది, అందుకే నవ్వు వస్తుంది. ఇప్పుడు పక్కాగా అయిపోయారు. చిన్ననాటి ఆటలు ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయారు. బాప్ దాదా చూస్తున్నారు - పాతవారు ఎంతగా పక్కాగా అవుతూ ఉంటారో, అంతగానే కొత్త-కొత్తగా వచ్చేవారు కూడా పక్కా అయిపోతారు. మంచిది, ఒకరినొకరు మంచిగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. మంచిగా శ్రమిస్తున్నారు. ఇప్పుడిక దాదీల వద్దకు కథలనైతే తీసుకుపోవటం లేదు కదా. కథలు, వృత్తాంతాలను దాదీల వద్దకు తీసుకువెళ్తున్నారా? తగ్గింది కదా! మార్పు వచ్చింది కదా? (జానకి దాదీతో) మరి మీరు ఇప్పుడు అనారోగ్యంగా లేరు కదా? కథలు-వత్తాంతాలతో అనారోగ్యం వస్తుంది, అవి ఇప్పుడు సమాప్తమైపోయాయి. మంచిది, అందరిలో అన్నింటికంటే మంచి విశేషమైన గుణముంది, అదేమిటంటే - మనసు యొక్క స్వచ్ఛత బాగుంది. లోపల ఉంచుకోరు, బయటకు చెప్పేస్తారు. ఏదుంటే అది నిజం చెప్పేస్తారు. ఇలా కాదు అలా, ఇలా-అలా అని అనరు, ఏదుంటే అది చెప్పేస్తారు, ఈ విశేషత బాగుంది. అందుకే బాబా అంటున్నారు - సత్యమైన మరియు స్వచ్ఛమైన మనసుపై బాబా సంతుష్టులవుతారు. అవునంటే అవును అని చెప్తారు, కాదంటే కాదు అని చెప్తారు. అలా కాకుండా, చూస్తాములే... అని ఇలా అనరు! తప్పదు కదా అని నడవరు, నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకపోతే లేదు.

ఏ పిల్లలైతే ప్రియస్మృతులను పంపారో, ఉత్తరాల ద్వారానైనా లేదా ఇంకే రకంగానైనా ఏవైతే ప్రియస్మృతులను పంపారో బాప్ దాదాకు అవన్నీ అందాయి. బాప్ దాదా వాటికి బదులుగా పిల్లలందరికీ దాతతనపు (దాతా స్థితి) వరదానాన్ని ఇస్తున్నారు. అచ్ఛా! ఒక్క సెకండులో ఎగరగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా? బాబా అని అనగానే ఎగిరిపోతారు. (డ్రిల్).

నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ బాబా సమానంగా దాతాతనపు భావనను ఉంచుకునేవారికి, శ్రేష్ఠ ఆత్మలకు, నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండేవారికి, పరమాత్మ సేవా సహచరులైన పిల్లలకు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానం చేసుకునేవారికి, సదా బాబా యొక్క స్నేహీలు మరియు సమానులకు, సమీపంగా చేరుకునే బాప్ దాదా నయన సితారలకు, సదా విశ్వ కళ్యాణ భావనలో ఉండే దయార్ద్ర హృదయులకు, మాస్టర్ క్షమాసాగరులైన పిల్లలకు, దూరంగా కూర్చున్నవారికి, మధుబన్ లో కింద కూర్చున్నవారికి మరియు బాప్ దాదా ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

హృదయములో ఒక్క హృదయాభిరాముడిని ఇముడ్చుకొని ఒక్కరితో సర్వ సంబంధాల అనుభూతిని చేసే సంతుష్ట ఆత్మా భవ

జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానము - బుద్ధి, కానీ ప్రియుడిని ఇముడ్చుకునే స్థానము - హృదయము. కొంతమంది ప్రేయసులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు కానీ బాప్ దాదా సత్యమైన హృదయం కలవారిపై సంతుష్టులవుతారు, అందుకే హృదయం యొక్క అనుభవము హృదయానికే తెలుస్తుంది, హృదయాభిరామునికే తెలుస్తుంది. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో మరియు స్మృతి చేస్తారో, వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువగా లభిస్తుంది. హృదయము కలవారు సదా సంతుష్టతతో కూడిన పాటలను పాడుతారు. వారికి సమయమనుసారంగా ఒక్కరితోనే సర్వ సంబంధాల అనుభూతి కలుగుతుంది.

స్లోగన్:-

అమృతవేళలో ప్లెయిన్ (స్పష్టమైన) బుద్ధి కలవారిగా అయ్యి కూర్చున్నట్లయితే సేవ యొక్క కొత్త విధులు టచ్ అవుతాయి.