29-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది పైకి ఎక్కేందుకు సత్యాతి-సత్యమైన సత్యమైనవారి యొక్క సాంగత్యము, మీరు ఇప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యంలోకి వచ్చారు, అందుకే అసత్యమైన సాంగత్యంలోకి ఎప్పుడూ వెళ్ళకండి’’

ప్రశ్న:-

పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారముపై సదా అనంతములో నిలిచి ఉండగలదు?

జవాబు:-

బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూ ఉండాలి, డ్రామాలో ఏదైతే నడుస్తుందో, అదంతా నిశ్చయించబడి ఉంది. ఒక్క క్షణము కూడా తేడా రాదు. ప్రపంచ చరిత్ర-భౌగోళము రిపీట్ అవ్వనున్నది. ఈ విషయం బుద్ధిలోకి మంచి రీతిలో వచ్చినట్లయితే అనంతములో నిలిచి ఉండగలుగుతారు. అనంతములో నిలిచి ఉండేందుకు సదా ధ్యాస ఉండాలి - ఇప్పుడిక వినాశనము అవ్వనున్నది, మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి, పావనంగా అయిన తర్వాతనే మనం ఇంటికి వెళ్తాము.

ఓంశాంతి

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఎవరైతే వివేకహీనులుగా ఉన్నారో, వారికే అర్థం చేయిస్తారు. స్కూల్ లో టీచర్ చదివిస్తారు ఎందుకంటే పిల్లలు వివేకహీనులుగా ఉంటారు. పిల్లలు చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. మనల్ని చదివించేవారు ఎవరు! దీనిని ఎప్పుడూ మర్చిపోకండి. చదివించే టీచర్ ఉన్నతోన్నతుడైన తండ్రి. కావున వారి మతముపై నడవాలి, శ్రేష్ఠంగా అవ్వాలి. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు సూర్యవంశీయులు. చంద్రవంశీయులు కూడా శ్రేష్ఠమైనవారే కానీ సూర్యవంశీయులు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. మీరు ఇక్కడికి శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అయ్యేందుకు వచ్చారు. మనం ఈ విధంగా అవ్వాలి అని పిల్లలైన మీకు తెలుసు. ఇటువంటి స్కూలు 5 వేల సంవత్సరాల తర్వాతనే తెరుచుకుంటుంది. ఇది నిజంగానే సత్యమైనవారి సాంగత్యము అని ఇక్కడ మీరు అర్థం చేసుకొని కూర్చున్నారు. సత్యమైనవారు ఉన్నతోన్నతులు, వారి సాంగత్యము మీకు ఉంది. వారు కూర్చొని సత్యయుగపు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన దేవతలుగా తయారుచేస్తారు అనగా పుష్పాలుగా తయారుచేస్తారు. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు. కొందరు వెంటనే తయారవుతారు, కొందరికి సమయం పడుతుంది. ఇది సంగమయుగమని పిల్లలకు తెలుసు. ఇది కూడా కేవలం పిల్లలకే తెలుసు, ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము అన్న నిశ్చయము ఉంది. పురుషోత్తములలో కూడా ఎవరు? ఉన్నతోన్నతమైన ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన మహారాజు-మహారాణులు ఎవరైతే ఉన్నారో, వారి వలె తయారయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సత్యయుగ సుఖాన్ని తీసుకునేందుకు మనం వచ్చామని మీరు అర్థం చేసుకుంటారు. హద్దులోని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. హద్దులోని తండ్రి, హద్దులోని సోదరులు, చిన్నాన్నలు, పెదనాన్నలు, మామయ్యలు, హద్దులోని పైసకు కొరగాని ఆస్తి మొదలైనవాటిలో ఎంతో మోహము ఉంటుంది, అవన్నీ అంతమవ్వనున్నాయి. ఈ ఆస్తి మొదలైనవన్నీ హద్దులోనివి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు అనంతములోకి వెళ్ళాలి. అనంతమైన ఆస్తిని ప్రాప్తి చేసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మిగిలినవన్నీ హద్దులోని వస్తువులే. శరీరము కూడా హద్దులోనిదే. శరీరం అనారోగ్యంపాలు అవుతుంది, అంతమైపోతుంది. అకాల మరణాలు సంభవిస్తాయి. ఈ రోజుల్లో ఏమేమి తయారుచేస్తూ ఉంటారో చూడండి! సైన్స్ కూడా అద్భుతం చేసింది. మాయ ఆడంబరం ఎంతగా ఉంది. సైన్స్ వారు ఎంతో సాహసం చేస్తున్నారు. ఎవరి వద్దనైతే ఎన్నో మహళ్ళు మొదలైనవి ఉన్నాయో, వారు - ఇప్పుడు మా కొరకు ఇదే సత్యయుగము అని భావిస్తారు. సత్యయుగములో ఒకే ధర్మం ఉంటుందని వారు అర్థం చేసుకోరు. అది కొత్త ప్రపంచముగా ఉంటుంది. తండ్రి అంటారు - పూర్తిగా వివేకహీనులుగా ఉన్నారు. మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు. పైకి ఎక్కుతారు, మళ్ళీ మెట్లు కిందకు దిగుతారు. సత్యయుగములో మీరు వివేకవంతులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ వివేకహీనులుగా అవుతారు. మళ్ళీ తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారుచేస్తారు, దానినే పారసబుద్ధి అని అంటారు. పారసబుద్ధి కలవారిమైన మనము ఎంతో వివేకవంతులుగా ఉండేవారమని మీకు తెలుసు. పాట కూడా ఉంది కదా! బాబా, మీరేదైతే వారసత్వాన్ని ఇస్తారో, ఆ మొత్తం భూమి, ఆకాశములకు మేము యజమానులుగా అవుతాము. వాటిని ఎవ్వరూ మా నుండి లాక్కోలేరు. ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు. తండ్రి ఎంతో-ఎంతో ఇస్తారు. ఇంతకన్నా ఎక్కువగా ఇంకెవ్వరూ జోలెను నింపలేరు. ఎవరినైతే అర్ధకల్పం స్మృతి చేసారో, అటువంటి తండ్రి ఇప్పుడు లభించారు. దుఃఖములో స్మరిస్తారు కదా. ఎప్పుడైతే సుఖము లభిస్తుందో, అప్పుడిక స్మరించవలసిన అవసరం ఉండదు. దుఃఖములో అందరూ - ఓ రామా... అంటూ స్మరిస్తారు. ఈ విధముగా అనేక రకాల పదాలను పలుకుతూ ఉంటారు. సత్యయుగములో ఇటువంటి పదాలేవీ ఉండవు. పిల్లలైన మీరు ఇక్కడికి తండ్రి సమ్ముఖములో చదువుకునేందుకు వచ్చారు. తండ్రి యొక్క డైరెక్టు మహావాక్యాలను వింటారు. తండ్రి జ్ఞానాన్ని ఇండైరెక్టుగా ఇవ్వరు. జ్ఞానము డైరెక్టుగానే లభిస్తుంది. తండ్రికి రావలసి ఉంటుంది. మధురాతి-మధురమైన పిల్లల వద్దకు వచ్చాను అని వారు అంటారు. నన్ను ‘ఓ బాప్ దాదా’ అని పిలుస్తారు. తండ్రి కూడా రెస్పాన్స్ ఇస్తారు - ‘ఓ పిల్లలూ’, ఇప్పుడు నన్ను మంచి రీతిలో స్మృతి చేయండి, మర్చిపోకండి. మాయ విఘ్నాలైతే ఎన్నో వస్తాయి. అవి మిమ్మల్ని చదువు నుండి దూరం చేసి దేహాభిమానములోకి తీసుకొస్తాయి, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇది పైకి ఎక్కేందుకు సత్యాతి-సత్యమైన సత్సంగము. ఆ సత్సంగాలు మొదలైనవన్నీ కిందకు తీసుకొచ్చేవి. సత్యమైనవారి సాంగత్యము ఒక్కసారే లభిస్తుంది, అసత్యమైన సాంగత్యాలు జన్మజన్మాంతరాలూ అనేక సార్లు ఉంటాయి. తండ్రి పిల్లలకు చెప్తారు - ఇది మీ అంతిమ జన్మ, ఎక్కడైతే అప్రాప్తి అనే వస్తువే ఉండదో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. దాని కొరకే మీరు పురుషార్థము చేస్తున్నారు. బాబా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, దానిని మీరు ఇప్పుడే వింటారు, అక్కడ ఇదేమీ తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? మీ సుఖధామములోకి. సుఖధామము మీదిగానే ఉండేది. మీరు సుఖధామములో ఉండేవారు, ఇప్పుడు దుఃఖధామములో ఉన్నారు. బాబా చాలా-చాలా సహజమైన మార్గాన్ని తెలియజేశారు, దానిని గుర్తు చేసుకోండి. మన ఇల్లు శాంతిధామము, అక్కడి నుండి మనం స్వర్గములోకి వస్తాము. మీరు తప్ప ఇంకెవ్వరూ స్వర్గములోకి రానే రారు. కావున మీరే స్మరిస్తారు. మనం మొదట సుఖములోకి వెళ్తాము, ఆ తర్వాత దుఃఖములోకి వస్తాము. కలియుగములో సుఖధామము ఉండనే ఉండదు. సుఖము లభించనే లభించదు. అందుకే, సుఖము కాకిరెట్టతో సమానమైనది అని సన్యాసులు కూడా అంటారు.

ఇప్పుడు బాబా మనల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని పిల్లలు అర్థం చేసుకుంటారు. పతితులైన మనల్ని పావనులుగా తయారుచేసి తీసుకువెళ్తారు. స్మృతియాత్ర ద్వారానే పావనంగా అవుతారు. యాత్రలలో ఎంతో కిందా-మీదా అవుతూ ఉంటారు. కొందరు అనారోగ్యంపాలు అవుతారు, ఇక తిరిగి వచ్చేస్తారు. ఇది కూడా అటువంటిదే. ఇది ఆత్మిక యాత్ర. అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. మనం మన శాంతిధామములోకి వెళ్తున్నాము. ఇది చాలా సహజము కానీ మాయ ఎంతగానో మరపింపజేస్తుంది. మీ యుద్ధము మాయతో జరుగుతుంది. తండ్రి ఎంతో సహజం చేసి అర్థం చేయిస్తారు, ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము. తండ్రినే స్మృతి చేస్తాము. దైవీ గుణాలను ధారణ చేస్తాము. పవిత్రముగా అవుతాము. 3-4 విషయాలు ముఖ్యమైనవి, వాటిని బుద్ధిలో ఉంచుకోవాలి, అవేమిటంటే - వినాశనమైతే జరగాల్సిందే, 5 వేల సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాము, మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాము. రాముడూ వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు... అన్న గాయనము కూడా ఉంది కదా. శాంతిధామములోకైతే అందరూ వెళ్ళాల్సిందే. మీరు ఏదైతే చదువుతారో, ఆ చదువు అనుసారంగానే పదవిని పొందుతారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. మేము సాక్షాత్కారాన్ని పొందాలి అని కొందరు అంటారు. ఈ చిత్రము (లక్ష్మీ-నారాయణులది) సాక్షాత్కారము కాకపోతే మరేమిటి! ఇది కాకుండా ఇంకే సాక్షాత్కారము కావాలి? అనంతమైన తండ్రి సాక్షాత్కారమా? ఇక వేరే సాక్షాత్కారాలు దేనికీ పనికిరావు. బాబా యొక్క సాక్షాత్కారాన్ని కోరుకుంటారు. బాబా కంటే మధురమైనది ఇంకేదీ లేదు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మొదట మీ సాక్షాత్కారాన్ని చేసుకున్నారా? బాబా సాక్షాత్కారాన్ని పొందాలని ఆత్మ అంటుంది. మరి మీ సాక్షాత్కారాన్ని చేసుకున్నారా? ఇదైతే పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు - మేము ఆత్మ, మా ఇల్లు శాంతిధామము, అక్కడి నుండి ఆత్మలమైన మేము పాత్రను అభినయించేందుకు వస్తాము అన్నది అర్థమయ్యింది. డ్రామా ప్లాన్ అనుసారంగా మొట్టమొదట సత్యయుగ ఆదిలో మనము వస్తాము. ఇది ఆది మరియు అంతిమము యొక్క పురుషోత్తమ సంగమయుగము. ఇందులో కేవలం బ్రాహ్మణులే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు. కలియుగములోనైతే అనేకానేక ధర్మాలు, కులాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగములో ఒకే వంశము ఉంటుంది. ఇది సహజమే కదా. ఈ సమయంలో మీరు సంగమయుగ ఈశ్వరీయ పరివారానికి చెందినవారిగా ఉన్నారు. మీరు సత్యయుగానికి చెందినవారూ కారు, కలియుగానికి చెందినవారూ కారు. కల్ప-కల్పమూ తండ్రి వచ్చి ఇటువంటి చదువును చదివిస్తారని కూడా మీకు తెలుసు. ఇక్కడ మీరు కూర్చున్నారు కావున మీకు ఇదే స్మృతిలోకి రావాలి. శాంతిధామము, సుఖధామము మరియు ఇది దుఃఖధామము. ఈ దుఃఖధామము పట్ల బుద్ధితో వైరాగ్యము ఉంది అనగా దీనిని బుద్ధితో సన్యసిస్తారు. వారేమీ బుద్ధితో సన్యాసము చేయరు. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి సన్యాసం చేస్తారు. మీకు ఎప్పుడూ తండ్రి ఇళ్ళు-వాకిళ్ళను వదలండి అని చెప్పరు. కానీ భారత్ సేవను లేక స్వయం యొక్క సేవను తప్పకుండా చేయాలి. సేవ అయితే ఇంట్లో కూడా చేయవచ్చు కానీ చదువుకునేందుకు తప్పకుండా రావాలి. అలా తెలివైనవారిగా అయి ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేయాలి. సమయమైతే చాలా కొద్దిగా ఉంది. ఎంతో గతించిపోయింది, కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అన్న గాయనము కూడా ఉంది కదా. ప్రపంచములోని మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు, ఇప్పుడు ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయని వారు భావిస్తారు. మీకు తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. మీరు అనంతములో నిలిచి ఉండాలి. మొత్తం ప్రపంచమంతటిలో ఏదేదైతే నడుస్తుందో, అదంతా నిశ్చయించబడి ఉంది. పేను వలె డ్రామా నడుస్తూ ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళము రిపీట్ అవ్వనున్నది. ఎవరైతే సత్యయుగములోకి వెళ్ళేవారు ఉంటారో, వారే వచ్చి చదువుకుంటారు. అనేక సార్లు మీరు చదువుకున్నారు. మీరు శ్రీమతముపై మీ స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు భారత్ లోకే వస్తారని కూడా మీకు తెలుసు. వారు కల్పపూర్వం కూడా వచ్చారు. కల్ప-కల్పమూ ఇటువంటి తండ్రి వస్తారని మీరు అంటారు. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పమూ ఇటువంటి స్థాపనను చేస్తాను. వినాశనాన్ని కూడా మీరు చూస్తారు. మీ బుద్ధిలో అంతా కూర్చుంటూ ఉంటుంది. స్థాపన, వినాశనము మరియు పాలన కర్తవ్యాలు ఎలా జరుగుతాయి అన్నది మీకు తెలుసు. మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ఇంతకుముందు ఇవేవీ తెలియవు. తండ్రిని తెలుసుకోవడం వలన తండ్రి ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. ప్రపంచ చరిత్ర-భౌగోళాల గురించి యథార్థ రీతిలో మీరు తెలుసుకుంటారు. మనుష్యులు ఏ విధంగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు అనేది తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి.

పిల్లలైన మీరు ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. సత్యయుగములో పారసబుద్ధి కలవారే ఉంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. దీనిని గీతా అధ్యాయము అని అంటారు. ఇప్పుడు మీరు రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. గీతను వినిపించేవారైతే స్వయంగా భగవంతుడే, మనుష్యులు వినిపించరు. ఆత్మలైన మీరు వింటారు, మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు, దీనిని ఆత్మిక సోదరులకు వినిపిస్తారు. మీరు వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా వచ్చి సూర్యవంశాన్ని, చంద్రవంశాన్ని స్థాపన చేస్తారని మీకు తెలుసు. ఎవరి ద్వారా? బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కుల భూషణుల ద్వారా. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. మీ హృదయంలో దీనిని నోట్ చేసుకోవాలి, ఇది చాలా సహజము. ఇది దుఃఖధామము, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. కలియుగము తర్వాత సత్యయుగము ఉంటుంది. విషయమైతే చాలా చిన్నది మరియు సహజమైనది. మీరు చదువుకున్న వారు కాకపోయినా సరే ఏమీ పర్వాలేదు. ఎవరికైతే చదవడం తెలుసో, వారి నుండి వినాలి. శివబాబా ఆత్మలందరికీ తండ్రి. ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిపై నిశ్చయం ఏర్పరచుకున్నట్లయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది. మీ లోపల నిరంతర జపము నడుస్తూ ఉండాలి. శివబాబా నుండి అనంతమైన సుఖము, స్వర్గ వారసత్వము లభిస్తుంది, అందుకే శివబాబాను తప్పకుండా స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు అందరికీ ఉంది. ఏ విధముగా హద్దులోని జన్మసిద్ధ అధికారము లభిస్తుందో, అలాగే ఇది అనంతమైనది. శివబాబా నుండి మీకు మొత్తం విశ్వరాజ్యము లభిస్తుంది. చిన్న-చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి. తండ్రి నుండి జన్మసిద్ధ అధికారాన్ని తీసుకునే హక్కు ప్రతి ఒక్క ఆత్మకూ ఉంది. కల్ప-కల్పమూ తప్పకుండా తీసుకుంటారు కూడా. మీరు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఎవరికైతే ముక్తి యొక్క వారసత్వము లభిస్తుందో, వారు కూడా తప్పకుండా జీవన్ముక్తిలోకి వస్తారు. మొదటి జన్మ అయితే సుఖముతో కూడినదే ఉంటుంది. ఇది మీ 84వ జన్మ. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, ఇది మర్చిపోకండి. దేహధారులు ఎప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారిలో ఆత్మిక జ్ఞానం ఉండదు. మీరు పరస్పరం సోదరులుగా భావించండి అని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇతర మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో, వారెవ్వరికీ కూడా ఈ శిక్షణ లభించదు. భగవానువాచ, కామం మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు అంటూ గీతను కూడా వినిపిస్తారు కానీ అర్థం చేసుకోరు. వాస్తవానికి భగవంతుడు సత్యము. దేవతలు కూడా భగవంతుడి నుండే సత్యాన్ని నేర్చుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడి నుండి పొందారు? లక్ష్మీ-నారాయణులుగా ఎలా అయ్యారు? వారు ఏ కర్మలను చేసారు? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఈ విషయాలు మీకే తెలుసు, నిరాకారుడైన తండ్రి వారికి బ్రహ్మాబాబా ద్వారా అటువంటి కర్మలను నేర్పించారు. ఇది సృష్టి కదా. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు. మీ వద్ద ఆత్మిక తండ్రి గురించిన జ్ఞానం ఉంది. మేము భగవంతుడిని తెలుసుకున్నాము అని మీరు భావిస్తారు. ఉన్నతోన్నతమైనవారు ఆ నిరాకారుడు. వారికి సాకార రూపము లేదు. మిగిలినవారు ఎవరినైతే చూస్తారో, వారంతా సాకారమైనవారు. మందిరాలలో కూడా లింగాన్ని చూస్తారు అనగా వారికి శరీరము లేదు. అలాగని వారు నామ-రూపాలకు అతీతమైనవారు అని కాదు. అయితే, మిగిలిన దేహధారులందరికీ పేరు ఉంటుంది, జన్మపత్రి ఉంటుంది. శివబాబా అయితే నిరాకారుడు. వారికి జన్మపత్రి లేదు. శ్రీకృష్ణుని జన్మపత్రి నంబరువన్. శివజయంతిని కూడా జరుపుకుంటారు. శివబాబా నిరాకారుడు, కళ్యాణకారి. తండ్రి వచ్చినప్పుడు తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు. వారి పేరు శివ. వారు తండ్రి, టీచర్, సద్గురువు - ముగ్గురూ ఒక్కరే. వారు ఎంత మంచి రీతిలో చదివిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ దుఃఖధామాన్ని బుద్ధితో సన్యసించి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. భారత్ మరియు స్వయం యొక్క సత్యమైన సేవను చేయాలి. అందరికీ ఆత్మిక జ్ఞానాన్ని వినిపించాలి.

2. మీ సత్యయుగ జన్మసిద్ధ అధికారాన్ని తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయాన్ని ఉంచాలి. లోపల నుండి నిరంతర జపము చేస్తూ ఉండాలి. చదువును రోజూ తప్పకుండా చదువుకోవాలి.

వరదానము:-

సర్వ సంబంధాల అనుభూతితోపాటు ప్రాప్తుల సంతోషాన్ని అనుభవం చేసే తృప్త ఆత్మా భవ

సత్యమైన ప్రేయసులు ఎవరైతే ఉంటారో, వారు ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తుల సంతోషంలో ఉంటారు. కొంతమంది పిల్లలు - అవును, వారు నా తండ్రి, ప్రియుడు, కొడుకు... అని అనుభూతి చేస్తారు కానీ ప్రాప్తి ఎంతైతే కోరుకుంటారో, అంత కలగదు. కావున అనుభూతితోపాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తుల అనుభవం కలగాలి. ఈ విధంగా ప్రాప్తిని మరియు అనుభూతిని పొందేవారు సదా తృప్తిగా ఉంటారు. వారికి ఏ వస్తువు యొక్క అప్రాప్తి అనుభవమవ్వదు. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో, అక్కడ తృప్తి తప్పకుండా ఉంటుంది.

స్లోగన్:-

నిమిత్తులుగా అయినట్లయితే సేవా సఫలతలో భాగము లభిస్తుంది.