01-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే సదా రిఫ్రెష్ గా ఉంటారు’’

ప్రశ్న:-
వివేకవంతులైన పిల్లల యొక్క ముఖ్యమైన గుర్తులేమిటి?

జవాబు:-
ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో, వారికి అపారమైన సంతోషముంటుంది. ఒకవేళ సంతోషము లేదు అంటే వారు వివేకహీనులు. వివేకవంతులు అనగా పారసబుద్ధి కలవారిగా అయ్యేవారు. వారు ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. ఆత్మిక సేవలో బిజీగా ఉంటారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా ఉండలేరు.

ఓంశాంతి
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే తండ్రి కూర్చుని దాదా ద్వారా అర్థం చేయిస్తారు. మీరు ఏ విధముగా అర్థం చేసుకుంటారో దాదా కూడా అలానే అర్థం చేసుకుంటారు. దాదాను భగవంతుడని అనరు. ఇది భగవానువాచ. తండ్రి ముఖ్యముగా దేహీ-అభిమానులుగా అవ్వండి అని అర్థం చేయిస్తారు. ఇలా ఎందుకు అంటారు? ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించడము ద్వారా మనము పతిత-పావనుడైన పరమపిత పరమాత్ముని ద్వారా పావనముగా తయారవ్వనున్నాము. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. దీనిని అందరికీ అర్థం చేయించాలి. మేము పతితులము అని పిలుస్తారు కూడా. కొత్త ప్రపంచము పావనముగా తప్పకుండా ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని తయారుచేసేవారు, స్థాపన చేసేవారు తండ్రియే. వారినే పతిత-పావన బాబా అని పిలుస్తారు. వారు పతిత-పావనుడు, అంతేకాక వారిని తండ్రి అని అంటారు. తండ్రిని ఆత్మలు పిలుస్తారు, శరీరము పిలవదు. మన ఆత్మల తండ్రి పారలౌకికమైనవారు, వారే పతిత-పావనుడు. ఈ విషయము మంచి రీతిలో గుర్తుండాలి. ఇది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అనేది అర్థం చేసుకోగలరు కదా. మాకు అపారమైన సుఖము ఉంది, మేము స్వర్గములో కూర్చొన్నట్లే ఉంది అని భావించే బుద్ధిహీనులు కూడా ఉన్నారు. కానీ కలియుగాన్ని ఎప్పుడూ స్వర్గమని అనరని కూడా అర్థం చేసుకోవాలి. దీని పేరే కలియుగము, పాత పతిత ప్రపంచము. తేడా ఉంది కదా. మనుష్యుల బుద్ధిలో ఈ విషయము కూడా కూర్చోదు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నారు. పిల్లలు చదవకపోతే - నీవు రాతిబుద్ధి కలవాడివి అని అంటారు కదా. అలాగే, బాబా కూడా వ్రాస్తారు - మీ గ్రామ నివాసులు పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు అని. వారు అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే ఇతరులకు అర్థం చేయించడం లేదు. స్వయం పారసబుద్ధి కలవారిగా అయినట్లయితే మరి ఇతరులను కూడా తయారుచేయాలి. పురుషార్థము చేయాలి. ఇందులో సిగ్గు పడడం మొదలైనవాటి విషయమేమీ లేదు. కానీ మనుష్యుల బుద్ధిలో అర్ధకల్పముగా వ్యతిరేక పదాలు ఉన్నాయి కావున వాటిని మర్చిపోవడము లేగ. మరి ఎలా మరపింపజేయాలి? మరపింపజేసే శక్తి కూడా ఒక్క తండ్రి వద్దనే ఉంది. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అనగా అందరూ అజ్ఞానులే అని అర్థము. జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి వినిపించనంత వరకు వారి జ్ఞానము ఎక్కడ నుండి లభిస్తుంది! తమోప్రధానము అంటేనే అజ్ఞానీ ప్రపంచము. సతోప్రధానము అనగా దైవీ ప్రపంచము. వ్యత్యాసము ఉంది కదా. దేవీ-దేవతలే పునర్జన్మలు తీసుకుంటారు. సమయము కూడా గడుస్తూ ఉంటుంది. బుద్ధి కూడా బలహీనమవుతూ ఉంటుంది. బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా ఏ శక్తి అయితే లభిస్తుందో అది మళ్ళీ సమాప్తమైపోతుంది.

ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు కావున మీరు ఎంత రిఫ్రెష్ అవుతారు. మీరు రిఫ్రెష్ గా ఉండేవారు మరియు విశ్రాంతిగా ఉండేవారు. పిల్లలూ, మీరు వచ్చి రిఫ్రెష్ కూడా అవ్వండి మరియు విశ్రాంతి కూడా పొందండి అని తండ్రి కూడా వ్రాస్తారు కదా. రిఫ్రెష్ అయిన తర్వాత మీరు సత్యయుగములో విశ్రాంతిపురిలోకి వెళ్తారు. అక్కడ మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది. అక్కడ మీకు సుఖము-శాంతి-సంపద మొదలైనవన్నీ లభిస్తాయి. కనుక రిఫ్రెష్ అయ్యేందుకు, విశ్రాంతి పొందేందుకు తండ్రి వద్దకు వస్తారు. రిఫ్రెష్ కూడా శివబాబాయే చేస్తారు. విశ్రాంతి కూడా బాబా వద్దనే తీసుకుంటారు. విశ్రాంతి అనగా శాంతి. అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు కదా! విశ్రాంతి తీసుకోవడానికి కొందరు ఒక చోటుకు, కొందరు మరో చోటుకు వెళ్తారు. అక్కడ రిఫ్రెష్మెంట్ విషయమే లేదు. ఇక్కడ మీకు తండ్రి రోజూ అర్థం చేయిస్తున్నారు కావున మీరు ఇక్కడకు వచ్చి రిఫ్రెష్ అవుతారు. స్మృతి చేయడము ద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. సతోప్రధానముగా అవ్వడానికే మీరు ఇక్కడకు వస్తారు. దాని కొరకు పురుషార్థము ఏమిటి? మధురాతి మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, మీకు విశ్రాంతి ఎలా లభిస్తుంది అని తండ్రి మొత్తము శిక్షణంతా ఇచ్చారు. ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియవు కావున వారికి కూడా అర్థం చేయించాలి, అప్పుడు వారు కూడా మీలా రిఫ్రెష్ అవుతారు. అందరికీ సందేశాన్ని ఇవ్వడమే మీ కర్తవ్యము. అవినాశీగా రిఫ్రెష్ అవ్వాలి. అవినాశీ విశ్రాంతిని పొందాలి. అందరికీ ఈ సందేశము ఇవ్వండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని ఇదే స్మృతిని ఇప్పించాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైన విషయము. అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. స్వర్గ వారసత్వాన్నే ఇస్తారు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. మాయ శాపము గురించి మరియు తండ్రి వారసత్వము గురించి మీకు తెలుసు. ఎప్పుడైతే మాయా రావణుడి శాపము లభిస్తుందో, అప్పుడు పవిత్రత కూడా సమాప్తమైపోతుంది, సుఖ-శాంతులు కూడా సమాప్తమైపోతాయి, అలాగే ధనము కూడా సమాప్తమైపోతుంది. నెమ్మది-నెమ్మదిగా ఎలా సమాప్తమైపోతాయి అన్నది కూడా తండ్రి అర్థం చేయించారు. ఎన్ని జన్మలు పడుతుంది, దుఃఖధామములో విశ్రాంతి ఏమైనా లభిస్తుందా. సుఖధామములో విశ్రాంతియే విశ్రాంతి. మనుష్యులను భక్తి ఎంతగా అలసిపోయేలా చేస్తుంది. జన్మ-జన్మాంతరాలు భక్తి అలసిపోయేలా చేస్తుంది. నిరుపేదలుగా చేస్తుంది. ఇది కూడా ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. కొత్త-కొత్తవారు వచ్చారంటే ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. ప్రతి విషయము గురించి మనుష్యులు చాలా ఆలోచిస్తారు. ఇంద్రజాలములో పడకూడదని భావిస్తారు. అరే, మీరు నన్ను ఇంద్రజాలికుడు అని అంటారు కావున నేను ఇంద్రజాలికుడిని అని నేను కూడా అంటాను. కానీ ఇంద్రజాలము అంటే గొర్రెలు మొదలైనవాటిలా తయారుచేసే ఇంద్రజాలమేమీ కాదు. మీరు జంతువులు కారు కదా. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అహంకారము ఉన్నవారిని దేహాభిమానము కల ఊసరవెల్లి అని అంటారు, అటువంటివారికి సురమండలము (దేవతల సమూహము) లోని దివ్యత్వము, స్వరాలు ఎలా అర్థమవుతాయి... అని గాయనము కూడా ఉంది. ఈ సమయములో మనుష్యులు గొర్రెల వలె ఉన్నారు. ఈ విషయాలు ఇక్కడికి సంబంధించినవే. సత్యయుగములో ఇలా అనరు, ఇది ఈ సమయములోని గాయనమే. చండికకు ఎంతగా మేళాలు జరుగుతాయి. ఆమె ఎవరు అని అడగండి. ఆమె దేవీ అని చెప్తారు. ఇటువంటి పేర్లు అయితే అక్కడ ఉండవు. సత్యయుగములోనైతే సదా శుభమైన పేర్లే ఉంటాయి. శ్రీరామ చంద్ర, శ్రీకృష్ణ... శ్రీ అని శ్రేష్ఠమైనవారినే అంటారు. సత్యయుగీ సాంప్రదాయాన్ని శ్రేష్ఠమైనదని అంటారు. కలియుగీ వికారీ సాంప్రదాయాన్ని శ్రేష్ఠమని ఎలా అంటారు. శ్రీ అనగా శ్రేష్ఠము. ఇప్పటి మనుష్యులైతే శ్రేష్ఠముగా లేరు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు... అని గాయనము కూడా ఉంది, మళ్ళీ దేవతల నుండి మనుష్యులుగా అవుతారు ఎందుకంటే 5 వికారాలలోకి వెళ్తారు. రావణ రాజ్యములో అందరూ మనుష్యులే. అక్కడ దేవతలు ఉంటారు. దానిని దైవీ ప్రపంచమని, దీనిని మనుష్య ప్రపంచమని అంటారు. దైవీ ప్రపంచాన్ని పగలు అని అంటారు. మనుష్యుల ప్రపంచాన్ని రాత్రి అని అంటారు. పగలు అని ప్రకాశాన్ని అంటారు. రాత్రి అని అజ్ఞాన అంధకారాన్ని అని అంటారు. ఈ వ్యత్యాసము గురించి మీకు తెలుసు. ఇంతకుముందు మనకు ఏమీ తెలియదని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అన్ని విషయాలు బుద్ధిలో ఉన్నాయి. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసా అని ఋషులు, మునులను అడిగితే వారు కూడా మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటూ వచ్చారు. పూర్వము మనము కూడా నాస్తికులుగా ఉండేవారమని, అప్పుడు మనకు అనంతమైన తండ్రి గురించి తెలియదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు అసలైన అవినాశీ తండ్రి, ఆత్మల తండ్రి. మనము ఆ అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు, వారు ఎప్పుడూ కాలిపోరు. ఇక్కడైతే అందరూ కాలిపోతారు, రావణుడిని కూడా కాలుస్తారు. శరీరము కదా. ఆత్మను అయితే ఎప్పుడూ ఎవరూ కాల్చలేరు. తండ్రి పిల్లలకు ఈ గుప్త జ్ఞానాన్ని వినిపిస్తారు, ఇది తండ్రి వద్దనే ఉంది. ఆత్మలో ఈ గుప్త జ్ఞానముంది. ఆత్మ కూడా గుప్తముగా ఉంది. ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది, అందుకే తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, దేహాభిమానులుగా అవ్వకండి, ఆత్మాభిమానులుగా అవ్వండి, లేకపోతే తలకిందులుగా అయిపోతారు. స్వయాన్ని ఆత్మ అని మర్చిపోతారు. డ్రామా రహస్యాన్ని కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. డ్రామానుసారముగా క్షణ-క్షణము ఏ విధముగా నడుస్తూ ఉంటుంది - ఈ జ్ఞానము కూడా బుద్ధిలో ఉంది. ఆకాశము ఎంతవరకు ఉంది అన్నది ఎవ్వరూ తెలుసుకోలేరు. భూమి ఎంతవరకు ఉంది అన్నదాని గురించి తెలుసుకోగలరు. ఆకాశము సూక్ష్మమైనది, భూమి స్థూలమైనది. చాలా వస్తువుల గురించి సంపూర్ణముగా తెలుసుకోలేము. అందుకే ఆకాశమే ఆకాశము, పాతాళమే పాతాళము అని కూడా అంటూ ఉంటారు, శాస్త్రాలలో విన్నారు కదా, అందుకే పైకి కూడా వెళ్ళి చూస్తారు. అక్కడ కూడా ఒక ప్రపంచాన్ని తయారుచేసి విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రపంచాన్ని ఇప్పటికే ఎంతో విస్తరింపజేసారు కదా. భారత్ లో కేవలం ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, అప్పుడు ఇతర ఖండాలు మొదలైనవి లేవు, ఆ తర్వాత ఎంతగా విస్తరింపజేసారు. మీరు ఆలోచించండి. భారత్ లో కూడా ఎంత చిన్న భాగములో దేవతలుంటారు. యమునా నది తీరముంటుంది. ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేది. ఇప్పుడు ఉన్న దీనిని శ్మశానవాటిక అని అంటారు, ఇక్కడ అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. అమరలోకాన్ని పరిస్తాన్ అని అంటారు. అక్కడ చాలా సహజ సౌందర్యము ఉంటుంది. వాస్తవానికి భారత్ ను పరిస్తాన్ అని అనేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు పరిస్తాన్ కు యజమానులు కదా. వారు ఎంత శోభనీయముగా ఉంటారు. వారు సతోప్రధానమైనవారు కదా. సహజ సౌందర్యముండేది. వారి ఆత్మ కూడా మెరుస్తూ ఉంటుంది. కృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అనేది పిల్లలకు చూపించారు. మొత్తము గది అంతా చమత్కారము జరిగినట్లుగా అయిపోతుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పరిస్తాన్ లోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. నంబరువారుగా అయితే తప్పకుండా ఉండాలి. అందరూ ఒకే విధముగా ఉండలేరు. ఇంత చిన్నని ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుంది అనేది ఆలోచించడం జరుగుతుంది. శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరము పరిస్థితి ఏమవుతుంది. ప్రపంచములోని పాత్రధారులందరూ అనాదిగా రచింపబడిన పాత్రనే అభినయిస్తారు. ఈ సృష్టి కూడా అనాది అయినదే, ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా అనాది అయినదే. ఇది సృష్టి రూపీ వృక్షము అని తెలుసుకున్నప్పుడే దీనిని మీరు అద్భుతమని అంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. కానీ డ్రామాలో అర్థం చేసుకునేందుకు ఎవరెంత సమయము తీసుకోవాలో అంత సమయము తీసుకుంటారు. ప్రతి ఒక్కరి బుద్ధికీ తేడా ఉంటుంది కదా. ఆత్మ మనసు-బుద్ధి సహితముగా ఉంది కదా, కావున ఆత్మలలో ఎంత తేడా ఉంటుంది. మేము స్కాలర్షిప్ తీసుకునేది ఉంది అని పిల్లలకు తెలుసు. కావున హృదయములో సంతోషము కలుగుతుంది కదా. ఇక్కడ కూడా లోపలికి రాగానే లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా కనిపిస్తుంది, అప్పుడు తప్పకుండా సంతోషము కలుగుతుంది కదా! ఈ విధముగా తయారయ్యేందుకు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చామని మీకు ఇప్పుడు తెలుసు. లేకపోతే ఎప్పుడూ ఎవ్వరూ రాలేరు. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. మరుసటి జన్మ యొక్క లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని చూడగలిగే స్కూల్ మరెక్కడా ఉండదు. వీరు స్వర్గానికి యజమానులు, మనమే ఇలా తయారవ్వబోతున్నాము అని మీరు చూస్తున్నారు. మనము ఇప్పుడు సంగమయుగములో ఉన్నాము. మనము ఆ రాజ్యానికి చెందినవారము కాదు, ఈ రాజ్యానికి చెందినవారము కాదు. మనము మధ్యలో ఉన్నాము, వెళ్తూ ఉన్నాము. నావికుడు (తండ్రి) కూడా నిరాకారుడే. నావ (ఆత్మ) కూడా నిరాకారియే. నావను లాక్కొని పరంధామానికి తీసుకువెళ్తారు. నిరాకారీ తండ్రి నిరాకారీ పిల్లలను తీసుకువెళ్తారు. తండ్రియే పిల్లలను తనతో పాటు తీసుకువెళ్తారు. ఈ చక్రము పూర్తవుతుంది, మళ్ళీ యథావిధిగా రిపీట్ అవ్వాలి. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. చిన్నవారిగా అయ్యి మళ్ళీ పెద్దవారిగా అవుతారు. ఏ విధముగా మామిడి టెంకను భూమిలో నాటితే దాని నుండి మళ్ళీ మామిడి చెట్టు వెలువడుతుంది, అది హద్దులోని వృక్షము, అలా ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము, దీనిని వెరైటీ వృక్షమని అంటారు. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు అందరూ పాత్రను అభినయిస్తూ ఉంటారు. అవినాశీ ఆత్మ 84 జన్మల చక్రము యొక్క పాత్రను అభినయిస్తుంది. లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు, చక్రములో తిరిగి ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతారు. పూర్వము వీరు లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారు, ఇది వారికి లాస్ట్ జన్మ బ్రహ్మా-సరస్వతి అని చెప్తారు. ఇప్పుడు అందరూ తప్పకుండా తిరిగి వెళ్ళాలి. స్వర్గములోనైతే ఇంతమంది మనుష్యులు ఉండేవారు కాదు. ఇస్లామ్ ధర్మస్థులు గాని, బౌద్ధ ధర్మస్థులు గాని... ఉండేవారు కాదు. దేవీ-దేవతల ధర్మమువారు తప్ప ఇతర ధర్మానికి చెందిన పాత్రధారులెవ్వరూ ఉండేవారు కాదు. ఈ జ్ఞానము కూడా ఎవ్వరిలోనూ లేదు. వివేకవంతులకు టైటిల్ లభించాలి కదా. ఎవరెంతగా చదువుకుంటారో అంతగా నంబరువారు పురుషార్థము ద్వారా పదవిని పొందుతారు. కనుక పిల్లలైన మీకు ఇక్కడకు రావడముతోనే ఈ లక్ష్యము-ఉద్దేశ్యమును చూసి సంతోషము కలగాలి. సంతోషము యొక్క అవధులే లేవు. పాఠశాల లేక స్కూల్ అంటే ఇలా ఉండాలి. ఇది ఎంత గుప్తమైనది, కానీ చాలా గొప్ప పాఠశాల. ఎంత పెద్ద చదువో, అంత పెద్ద కాలేజ్. అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఆత్మ చదువుకోవాలి, ఆ తర్వాత బంగారు సింహాసనము పైనైనా, చెక్క సింహాసనము పైనైనా కూర్చోవాలి. పిల్లలకు ఎంత సంతోషము కలగాలి ఎందుకంటే ఇది శివ భగవానువాచ కదా. ఈ విశ్వరాకుమారుడు మొదటి నంబరులో ఉన్నారు. పిల్లలకు ఇప్పుడు తెలిసింది. కల్ప-కల్పము తండ్రే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. నేను వీరిలో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను. దేవతలలో ఈ జ్ఞానము ఉండదు. జ్ఞానము ద్వారా దేవతలుగా అయిన తర్వాత ఇక ఈ చదువు యొక్క అవసరముండదు, ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యసించి పాత దేహాన్ని మరియు దేహ సంబంధీకులను మరచి తమ బుద్ధిని తండ్రి వైపు మరియు స్వర్గము వైపు జోడించాలి.

2. అవినాశీ విశ్రాంతిని అనుభవము చేసేందుకు తండ్రి మరియు వారసత్వము యొక్క స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి సందేశాన్ని ఇచ్చి రిఫ్రెష్ చేయాలి. ఆత్మిక సేవ చేసేందుకు సిగ్గుపడకూడదు.

వరదానము:-
సంగఠనలో ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన స్నేహీ భవ

సంగఠనలో ఒకరు చెప్పారు మరియు ఇంకొకరు స్వీకరించారు - ఇదే సత్యమైన స్నేహానికి రిటర్న్. ఇటువంటి స్నేహీ పిల్లల ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కములోకి వచ్చేందుకు ధైర్యము ఉంచుతారు. సంగఠన కూడా సేవకు సాధనముగా అవుతుంది. వీరి ఐక్యత బాగుంది, వీరు కలిసి ఉమ్మడిగా ఉన్నారు అని మాయ చూసినప్పుడు, ఇక అక్కడికి రావడానికి అది ధైర్యము చేయదు. ఏకమతము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారాలే సత్యయుగములో ఏక రాజ్యాన్ని స్థాపన చేస్తాయి.

స్లోగన్:-
కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ ఉంచేవారే సఫలమైన యోగీలు.

సంగమయుగీ తీవ్ర పురుషార్థీ సోదరీ-సోదరులకు కొత్త యుగముతో పాటుగా కొత్త సంవత్సరము కొరకు చాలా-చాలా శుభ అభినందనలు

కొత్త సంవత్సరములోని ఈ మొదటి మాసమైన జనవరి మాసము మధురమైన సాకార బాబా యొక్క స్మృతుల మాసము, బాబా పిల్లలమైన మనమందరము అవ్యక్త వతనము యొక్క సూక్ష్మ లీలలను అనుభవము చేసేందుకు మరియు స్వయాన్ని బ్రహ్మాబాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా తయారుచేసుకునేందుకు, ఈ మాసమంతా బంధనముక్త, జీవన్ముక్త స్థితిని తయారుచేసుకునేందుకు మనసు మరియు నోటి యొక్క మౌనము పెట్టుకుందాము. బుద్ధిబలముతో అవ్యక్త వతనములో విహరిద్దాము, ఈ లక్ష్యముతోనే ఈ నెల అవ్యక్త సూచనలను పంపిస్తున్నాము:-

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవనముక్త స్థితిని అనుభవము చేయండి

బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే - నా ఒక్కొక్క బిడ్డ ముక్తి-జీవనముక్తుల వారసత్వానికి అధికారులుగా అవ్వాలి. ఇప్పటి అభ్యాసముతో సత్యయుగములో సహజసిధమైన జీవితము ఉంటుంది కానీ వారసత్వానికి అధికారము అనేది ఇప్పుడు సంగమయుగములో ఉంది. అందుకే ఒకవేళ ఏదైనా బంధనము లాగుతుందంటే దానికి కారణము ఆలోచించండి మరియు నివారణ చేయండి.