01-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ప్రీత్ మరియు విపరీత్ (ప్రీతి మరియు ప్రీతి లేకపోవడం), ఇవి ప్రవృత్తి మార్గము యొక్క పదాలు, ఇప్పుడు మీ ప్రీతి ఒక్క తండ్రితో ఏర్పడింది, పిల్లలైన మీరు నిరంతరము తండ్రి స్మృతిలో ఉంటారు’’

ప్రశ్న:-
స్మృతి యాత్రకు మరో పేరు ఏమి పెట్టవచ్చు?

జవాబు:-
స్మృతి యాత్ర ప్రీతి యాత్ర. విపరీత బుద్ధి (ప్రీతి బుద్ధి లేని) వారి నుండి నామ-రూపాలలో చిక్కుకున్న దుర్గంధము వస్తుంది. వారి బుద్ధి తమోప్రధానమైపోతుంది. ఎవరి ప్రీతి అయితే ఒక్క తండ్రితో ఉందో, వారు జ్ఞాన దానము చేస్తూ ఉంటారు. ఏ దేహధారి పట్ల వారికి ప్రీతి ఉండదు.

పాట:-
ఈ సమయము గడిచిపోతోంది...

ఓంశాంతి
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు దీనిని స్మృతి యాత్ర అని కూడా అనవచ్చు, అలాగే ప్రీతి యాత్ర అని కూడా అనవచ్చు. మనుష్యులైతే ఆ యాత్రలకు వెళ్తూ ఉంటారు. వారు రచనను చూసే యాత్రలకు వెళ్తారు, భిన్న-భిన్నమైన రచనలు ఉన్నాయి కదా. రచయిత గురించైతే ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రి గురించి తెలుసు, ఆ తండ్రిని స్మృతి చేయడములో మీరు ఎప్పుడూ ఆగిపోకూడదు. మీకు స్మృతి యొక్క యాత్ర లభించింది. దీనిని స్మృతి యాత్ర లేక ప్రీతి యాత్ర అని అంటారు. ఎవరికైతే ఎక్కువ ప్రీతి ఉంటుందో వారు యాత్రను కూడా బాగా చేస్తారు. ఎంత ప్రేమగా యాత్రలో ఉంటారో అంతగా పవిత్రముగా కూడా తయారవుతూ ఉంటారు. వినాశ కాలే విపరీత బుద్ధి మరియు వినాశ కాలే ప్రీతి బుద్ధి అని శివ భగవానువాచ ఉంది కదా. ఇప్పుడు ఇది వినాశ కాలమని, ఇప్పుడు ఆ గీతా అధ్యాయమే నడుస్తోందని పిల్లలైన మీకు తెలుసు. బాబా శ్రీకృష్ణుని గీతకు మరియు త్రిమూర్తి శివుని గీతకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా తెలియజేశారు! ఇప్పుడు మరి గీతా భగవానుడు ఎవరు? పరమపిత శివ భగవానువాచ. వట్టి శివ అన్న పదాన్ని వ్రాయకూడదు ఎందుకంటే శివ అనే పేరు ఎంతోమందికి ఉంది, అందుకే పరమపిత పరమాత్మ అని వ్రాయడముతో వారు సుప్రీమ్ అవుతారు. పరమపిత అని ఎవరూ తమను తాము పిలుచుకోలేరు. సన్యాసులు శివోహం అని అంటారు, కానీ వారు తండ్రిని స్మృతి కూడా చేయలేరు. వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు, తండ్రి పట్ల ప్రీతి లేనే లేదు. ప్రీత్ మరియు విపరీత్ (ప్రీతి మరియు ప్రీతి లేకపోవడం) - ఈ పదాలు ప్రవృత్తి మార్గానికి చెందినవి. కొందరు పిల్లలకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంటుంది, కొందరికి విపరీత బుద్ధి కూడా ఉంటుంది. మీలో కూడా అలాగే ఉన్నారు. ఎవరైతే తండ్రి సేవలో తత్పరులై ఉన్నారో వారికి తండ్రి పట్ల ప్రీతి ఉంది. వారికి తండ్రి పట్ల తప్ప ఇంకెవ్వరి పట్ల ప్రీతి ఉండదు. బాబా, మేమైతే మీకే సహాయకులము అని శివబాబాతో అంటారు. ఇందులో బ్రహ్మా యొక్క విషయమేమీ లేదు. శివబాబా పట్ల ఏ ఆత్మలకైతే ప్రీతి ఉంటుందో వారు తప్పకుండా సహాయకులుగా ఉంటారు. వారు శివబాబాతోపాటు సేవ చేస్తూ ఉంటారు. ప్రీతి లేకపోతే విపరీత్ గా అయిపోతారు. విపరీత బుద్ధి వినశ్యంతి. ఎవరికైతే తండ్రి పట్ల ప్రీతి ఉంటుందో వారు సహాయకులుగా కూడా అవుతారు. ఎంతైతే ప్రేమ ఉంటుందో అంతగా సేవలో సహాయకులుగా అవుతారు. స్మృతియే చేయకపోతే మరి ప్రీతి లేనట్లే. అప్పుడిక దేహధారుల పట్ల ప్రీతి ఏర్పడుతుంది. మనుష్యులు మనుష్యులకు తమ జ్ఞాపికగా వస్తువులను కూడా ఇస్తారు కదా. అప్పుడు ఇచ్చినవారు తప్పకుండా గుర్తుకొస్తూ ఉంటారు.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అవినాశీ జ్ఞాన రత్నాల కానుకను ఇస్తారు, దీని ద్వారా మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేస్తున్నారంటే వారు ప్రీతి బుద్ధి కలవారు. బాబా సర్వుల కళ్యాణము చేయడానికి వచ్చారు అని తెలుసు కావున మనము కూడా సహాయకులుగా అవ్వాలి. ఇటువంటివారు ప్రీతి బుద్ధి విజయంతి అవుతారు. ఎవరైతే అసలు స్మృతియే చేయరో, వారు ప్రీతి బుద్ధి కలవారు కాదు. తండ్రి పట్ల ప్రీతి ఉంటే, స్మృతి చేస్తే, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి మరియు ఇతరులకు కూడా కళ్యాణము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. బ్రాహ్మణ పిల్లలైన మీలో కూడా ప్రీత్ మరియు విపరీత్ (ప్రీతి ఉండడం మరియు ప్రీతి లేకపోవడం) పై ఆధారపడి ఉంటుంది. తండ్రిని ఎక్కువ స్మృతి చేస్తున్నారు అంటే ప్రీతి ఉన్నట్లు. తండ్రి అంటారు, నన్ను నిరంతరము స్మృతి చేయండి, నాకు సహాయకులుగా అవ్వండి. రచనకు ఒక్క రచయిత అయిన తండ్రియే గుర్తుండాలి. ఇతర ఏ రచనను స్మృతి చేయకూడదు. ప్రపంచములోనైతే రచయిత గురించి ఎవరికీ తెలియదు, వారిని స్మృతి కూడా చేయరు. సన్యాసులు కూడా బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు, అది కూడా రచనయే కదా. రచయిత అయితే అందరికీ ఒక్కరే కదా. ఏయే వస్తువులనైతే ఈ కళ్ళతో చూస్తారో అవన్నీ రచన. ఎవరైతే ఈ కళ్ళకు కనిపించరో వారే రచయిత అయిన తండ్రి. బ్రహ్మా, విష్ణు, శంకరుల చిత్రము కూడా ఉంది. వారు కూడా రచనయే. బాబా ఏ చిత్రాలనైతే తయారుచేయమని చెప్పారో, వాటిలో పైన ఇలా వ్రాయాలి - పరమపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవానువాచ. ఎవరైనా తమను తాము భగవంతునిగా పిలుచుకున్నా కానీ పరమపిత అని పిలుచుకోలేరు. మీ బుద్ధి యోగము శివబాబాతో జోడింపబడి ఉంది, అంతేకానీ దేహధారులతో లేదు. తండ్రి అర్థం చేయించారు, స్వయాన్ని అశరీరి ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ప్రీతి ఉండడం మరియు ప్రీతి లేకపోవడంపై మొత్తము సేవ ఆధారపడి ఉంది. మంచి ప్రీతి ఉన్నట్లయితే తండ్రి యొక్క సేవను కూడా బాగా చేస్తారు, అప్పుడు వారిని విజయంతి అని అంటారు. ప్రీతి లేకపోతే సేవ కూడా జరుగదు, అప్పుడు పదవి కూడా తక్కువగా లభిస్తుంది. తక్కువ పదవి వస్తే - ఉన్నత పదవి నుండి వినశ్యంతి అని అంటారు. ఆ మాటకొస్తే వినాశనమైతే అందరిదీ జరుగుతుంది కానీ ఇది విశేషముగా ప్రీత్ మరియు విపరీత్ (ప్రీతి ఉండడం మరియు ప్రీతి లేకపోవడం) గురించిన విషయము. రచయిత అయిన తండ్రి అయితే ఒక్కరే, వారినే శివ పరమాత్మాయ నమః అని అంటారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శంకర జయంతి అని ఎప్పుడూ వినలేదు. ప్రజాపిత బ్రహ్మా పేరు కూడా ప్రసిద్ధిమైనది. విష్ణు జయంతిని జరుపుకోరు, శ్రీకృష్ణుని జయంతిని జరుపుకుంటారు. శ్రీకృష్ణునికి మరియు విష్ణువుకు మధ్యన తేడా ఏమిటి అనేది కూడా ఎవరికీ తెలియదు. మనుష్యులది వినాశకాలే విపరీత బుద్ధి. మీలో కూడా ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి కలవారు ఉన్నారు కదా. తండ్రి అంటారు, మీ ఈ ఆత్మిక వ్యాపారము చాలా మంచిది. ఉదయము మరియు సాయంత్రము ఈ సేవలో నిమగ్నమవ్వండి. సాయంత్రము ఆరు నుండి ఏడు వరకు ఉన్న సమయాన్ని మంచిది అంటారు. సత్సంగాలు మొదలైనవి కూడా సాయంత్రము మరియు ఉదయము చేసుకుంటారు. రాత్రి సమయములోనైతే వాయుమండలము అశుద్ధమవుతుంది. రాత్రివేళ ఆత్మ స్వయం శాంతిలోకి వెళ్ళిపోతుంది, దానినే నిద్ర అని అంటారు. మళ్ళీ ఉదయమే మేల్కొంటుంది. ఓ నా మనసా, ప్రభాత వేళలో రాముడిని స్మరించు అని అంటారు కూడా. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. శివబాబా ఎప్పుడైతే శరీరములోకి ప్రవేశిస్తారో, అప్పుడే చెప్పగలరు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని. మనము ఎంతగా తండ్రిని స్మృతి చేస్తున్నాము మరియు ఆత్మిక సేవ చేస్తున్నాము అనేది పిల్లలైన మీకు తెలుసు. అందరికీ ఇదే పరిచయము ఇవ్వాలి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు, మాలిన్యము తొలగిపోతుంది. ప్రీతిబుద్ధిలో కూడా పర్సెంటేజ్ ఉంటుంది. తండ్రి పట్ల ప్రీతి లేదు అంటే తప్పకుండా తమ దేహం పట్ల ప్రీతి ఉన్నట్లు లేక మిత్ర-సంబంధీకులు మొదలైనవారి పట్ల ప్రీతి ఉన్నట్లు. తండ్రి పట్ల ప్రీతి ఉన్నట్లయితే సేవలో నిమగ్నమైపోతారు. తండ్రి పట్ల ప్రీతి లేకపోతే సేవలో కూడా నిమగ్నమవ్వరు. ఎవరికైనా కేవలం తండ్రి మరియు వారసత్వము గురించి అర్థం చేయించడమైతే చాలా సహజము. ఓ భగవంతుడా, ఓ పరమాత్మా అని అంటూ తలచుకుంటారు కానీ వారి గురించి అసలు ఏమాత్రమూ తెలియదు. బాబా ఏమని అర్థం చేయించారంటే - ప్రతీ చిత్రముపైన పరమపిత త్రిమూర్తి శివ భగవానువాచ అని తప్పకుండా వ్రాయాలి, అప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేరు. ఇప్పుడు పిల్లలైన మీరైతే మీ అంటును కట్టుకుంటున్నారు. అందరికీ దారిని చూపించినట్లయితే వారు వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. తండ్రిని గురించి తెలియనే తెలియదు కావుననే ప్రీతి బుద్ధి లేదు. పాపము పెరుగుతూ, పెరుగుతూ పూర్తిగా తమోప్రధానముగా అయిపోయారు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో, వారికి తండ్రి పట్ల ప్రీతి ఉంటుంది. వారికే బంగారుయుగ బుద్ధి ఉంటుంది. ఒకవేళ వేరేవైపులకు బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే తమోప్రధానముగానే ఉంటారు. ఒకవేళ తండ్రి ఎదురుగా కూర్చున్నా కూడా వారిని ప్రీతి బుద్ధి కలవారు అని అనరు ఎందుకంటే స్మృతే చేయరు. ప్రీతి బుద్ధికి గుర్తు స్మృతి. వారు స్వయమూ ధారణ చేస్తారు, అలాగే తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు అని చెప్తూ ఇతరులపై కూడా దయ చూపిస్తూ ఉంటారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి స్వర్గ రాజ్యాధికారపు వారసత్వాన్ని పిల్లలకే ఇస్తారు. తప్పకుండా శివబాబా ఒకప్పుడు వచ్చారు కావుననే శివ జయంతిని కూడా జరుపుకుంటారు కదా. కృష్ణుడు, రాముడు అందరూ ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళినవారు కావుననే వారి జయంతిని జరుపుకుంటారు. శివబాబాను కూడా స్మృతి చేస్తారు ఎందుకంటే వారు వచ్చి పిల్లలకు రాజ్యాధికారాన్ని ఇస్తారు. కొత్తవారు ఎవరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు, భగవంతుడు వచ్చి వారసత్వాన్ని ఎలా ఇస్తారు అనేది వారు అర్థం చేసుకోలేరు, పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. స్మృతి చేయగలిగే బుద్ధి లేదు. మీరు అర్ధకల్పపు ప్రేయసులు అని స్వయంగా తండ్రియే అంటారు. నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను. భక్తి మార్గములో మీరు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. కానీ భగవంతుడైతే ఎవరికీ లభించనే లేదు. తండ్రి భారత్ లోనే వచ్చారని మరియు ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేసారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. శ్రీకృష్ణుడైతే ఈ మార్గాన్ని తెలియజేయరు. భగవంతునితో ప్రీతిని ఎలా జోడించాలి అన్నది భారతవాసులకే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. వారు రావడము కూడా భారత్ లోనే వస్తారు. శివజయంతిని జరుపుకుంటారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడేనని, వారి పేరు శివ అని పిల్లలైన మీకు తెలుసు, అందుకే మీరు శివ జయంతియే వజ్రతుల్యమైనదని, మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవని వ్రాస్తారు. ఇలా వ్రాయడం వల్ల వారు డిస్టర్బ్ అవుతారు. అందుకే ఒకవేళ ప్రతీ చిత్రములో శివ భగవానువాచ అని ఉన్నట్లయితే మీరు సురక్షితముగా ఉంటారు. కొందరు పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వలన డిస్టర్బ్ అవుతారు. మాయా గ్రహచారము మొదటి దాడి బుద్ధి పైనే చేస్తుంది. తండ్రి నుండే బుద్ధియోగాన్ని తెంచేస్తుంది, దానితో ఒక్కసారిగా పై నుండి కిందకి పడిపోతారు. దేహధారులలో బుద్ధియోగము చిక్కకుంటే తండ్రి పట్ల ప్రీతి లేనట్లే కదా. మీరు ఒక్క విచిత్రుడైన, విదేహీ అయిన తండ్రితోనే ప్రీతి కలిగి ఉండాలి. దేహధారుల పట్ల ప్రీతి కలిగి ఉండడం నష్టము కలిగిస్తుంది. బుద్ధి పై నుండి తెగిపోతే ఒక్కసారిగా కింద పడిపోతారు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామాయే, అయినా కానీ మరి అర్థం చేయించడమైతే చేస్తారు కదా. విపరీత బుద్ధి కలవారి నుండి నామ-రూపాలలో చిక్కుకున్న దుర్గంధము వెలువడుతున్నట్లు ఉంటుంది. లేదంటే నిజానికి సేవ కోసం నిలబడాలి. గీతా భగవానుడు ఎవరు అన్నదే ముఖ్యమైన విషయము అని బాబా నిన్న కూడా బాగా అర్థం చేయించారు. ఇందులోనే మీ విజయము ఉంది. గీతా భగవానుడు శివుడా లేక శ్రీకృష్ణుడా, సుఖమిచ్చేది ఎవరు అని మీరు అడుగుతారు. సుఖమిచ్చేవారైతే శివుడు కావున వారికే ఓటు వేయాలి. వారికే మహిమ ఉంది. ఇప్పుడు ఓటు వేయండి - గీతా భగవానుడు ఎవరు? శివునికి ఓటు వేసేవారిని ప్రీతి బుద్ధి కలవారి అని అంటారు. ఇది చాలా పెద్ద ఎలక్షన్. ఈ యుక్తులన్నీ ఎవరి బుద్ధిలోకి వస్తాయంటే ఎవరైతే రోజంతా విచార సాగర మంథనము చేస్తూ ఉంటారో వారికి.

కొంతమంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ ఉండగా అలుగుతారు. ఇప్పుడే ప్రీతి కలిగి ఉంటారు, కాసేపటికి తర్వాత చూస్తే ప్రీతి తెగిపోతుంది, అలుగుతారు. ఏదైనా విషయములో డిస్టర్బ్ అయితే ఇక స్మృతి కూడా చేయరు. ఉత్తరము కూడా వ్రాయరు. అంటే ప్రీతి లేదు. అప్పుడు బాబా కూడా 6-8 మాసాలు వరకు ఉత్తరము వ్రాయరు. బాబా కాలుడికే కాలుడు కదా! వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. తండ్రిని స్మృతి చేసే తీరిక లేకపోతే మీరు ఏ పదవిని పొందుతారు. పదవి భ్రష్టమైపోతుంది. ప్రారంభములో బాబా చాలా యుక్తిగా పదవులను తెలియజేసారు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు మళ్ళీ మాల తయారవ్వనున్నది. సేవాధారులైన పిల్లలను బాబా కూడా మహిమ చేస్తుంటారు. ఎవరైతే స్వయం చక్రవర్తులుగా అవుతారో, వారు - మా తోటివారు కూడా అలా తయారవ్వాలి, వారు కూడా మాలాగా రాజ్యము చేయాలి అని అంటారు. రాజును అన్నదాత, మాత, పిత అని అంటారు. ఇప్పుడు మాత అయితే జగదంబ, వారి ద్వారా మీకు అపారమైన సుఖము లభిస్తుంది. మీ పురుషార్థము ద్వారా ఉన్నత పదవిని పొందాలి. ఎవరెవరు ఏ విధంగా తయారవుతారు అనేది పిల్లలైన మీకు రోజురోజుకు తెలుస్తూ ఉంటుంది. సేవ చేస్తే తండ్రి కూడా వారిని తలచుకుంటారు. సేవయే చేయకపోతే తండ్రి ఎందుకు తలచుకోవాలి! ఎవరైతే ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో తండ్రి ఆ పిల్లలనే తలచుకుంటారు.

ఇతరులెవరైనా ఇచ్చిన వస్తువులను ధరిస్తే వారి స్మృతి తప్పకుండా కలుగుతుందని తండ్రి అర్థం చేయించారు. బాబా భండారము నుండి తీసుకున్నట్లయితే శివబాబాయే గుర్తుకొస్తారు. బాబా స్వయం తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఇచ్చినవారి స్మృతి తప్పకుండా కలుగుతుంది, అందుకే ఇతరులెవరైనా ఇచ్చిన వస్తువులు తమ వద్ద ఉంచుకోకూడదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క విదేహీయైన విచిత్రుడైన తండ్రితో హృదయము యొక్క సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. మాయా గ్రహచారము ఎప్పుడూ బుద్ధిపై దాడి చేయకుండా సదా అటెన్షన్ ఉండాలి.

2. ఎప్పుడూ తండ్రిపై అలగకూడదు. సర్వీసబుల్ గా (సేవా యోగ్యులుగా) అయి తమ భవిష్యత్తును ఉన్నతముగా తయారుచేసుకోవాలి. ఎవరైనా ఇచ్చిన వస్తువులను తమ వద్ద ఉంచుకోకూడదు.

వరదానము:-
శుద్ధి యొక్క విధి ద్వారా కోటను దృఢముగా చేసే సదా విజయీ మరియు నిర్విఘ్న భవ

ఈ కోటలో ప్రతి ఆత్మ సదా విజయీగా మరియు నిర్విఘ్నముగా అవ్వాలి, దీని కొరకు విశేషమైన సమయములో నలువైపులా ఒకేసారి యోగము యొక్క ప్రోగ్రామ్ పెట్టండి. అప్పుడు ఎవ్వరూ ఈ బంధాన్ని తెంచలేరు, ఎందుకంటే ఎంతగా సేవను పెంచుతూ వెళ్తారో, అంతగా మాయ తనదిగా చేసుకునే ప్రయత్నము కూడా చేస్తుంది. అందుకే ఏ కార్యమునైనా మొదలుపెట్టే సమయములో ఏ విధంగా శుద్ధి యొక్క విధులను ఉపయోగిస్తారో, అలా సంగఠిత రూపములో సర్వ శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఒకటే శుద్ధ సంకల్పము ఉండాలి - విజయీ, ఇదే శుద్ధి యొక్క విధి, దీని ద్వారా కోట దృఢముగా అవుతుంది.

స్లోగన్:-
యుక్తియుక్తమైన మరియు యథార్థమైన సేవకు ప్రత్యక్ష ఫలము సంతోషము.

అవ్యక్త సూచనలు:- సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

బ్రాహ్మణ జీవితములో ఫస్ట్ నంబర్ కల్చర్ ‘‘సత్యత మరియు సభ్యత’’. కావున ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలో ఈ బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షమవ్వాలి. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరి సంపర్కములోకి రావాలి. ఎవరు ఎలా ఉన్నా సరే మీరు మీ ఈ కల్చర్ ను ఎప్పుడూ వదలకండి, అప్పుడు సహజముగా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తులవుతారు.