01-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 09.03.2009


‘‘పరమాత్ముని సాంగత్యపు రంగు మరియు కంబైండ్ స్వరూపము యొక్క యథార్థ హోలీని జరుపుకోండి’’

ఈ రోజు హోలియెస్ట్ (అత్యంత పవిత్రమైన) బాబా తమ హోలీ (పవిత్రమైన) పిల్లలతో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. పిల్లలందరూ హోలీ పిల్లలే. మీరందరూ కూడా హోలీని జరుపుకోవడానికి వచ్చారు. ఆలోచించండి, హోలీ ఆత్మలైన మీపై ఏ రంగు అంటుకున్న కారణముగా మీరు హోలీగా అయ్యారు! రంగులైతే అనేకము ఉన్నాయి కానీ మీపై ఏ రంగు పడింది? అన్నింటికంటే శ్రేష్ఠమైన రంగు ఏది, దేని కారణముగా మీరు హోలీగా అయ్యారు? అన్నింటికంటే అత్యంత పెద్ద రంగు పరమాత్ముని సాంగత్యపు రంగు. పరమాత్ముని సాంగత్యపు రంగు అంటుకోవడముతో సహజముగానే హోలీగా అయ్యారు ఎందుకంటే పరమాత్ముని సాంగత్యము అవినాశీ సాంగత్యము యొక్క రంగు. మిగతా రంగులైతే కొద్ది సమయము కోసమే ఉంటాయి కానీ పరమాత్ముని సాంగత్యపు రంగు అంటుకోవడముతో సహజముగానే హోలీగా అనగా పవిత్రముగా అయిపోయారు. ఆత్మ రంగు అపవిత్రత నుండి పవిత్రముగా అయిపోయింది ఎందుకంటే మీరందరూ పరమాత్మను మీ సహచరునిగా చేసుకున్నారు, మీ తోడుగా పెట్టుకున్నారు, అందుకే కంబైన్డ్ గా అయ్యారు. ఈ కంబైన్డ్ స్వరూపము ప్రియముగా అనిపిస్తుంది కదా! ఈ కంబైన్డ్ రూపము ఎప్పుడూ కూడా వేరు కాలేదు. అనుభవము ఉంది కదా! సదా కంబైన్డ్ గా ఉంటున్నారు కదా! ఒంటరిగా కాదు. మాయ ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎవరైతే సదా కంబైన్డ్ గా ఉంటారో వారు ఎప్పుడూ కూడా వేరు కాలేరు ఎందుకంటే మాయ వేరు చేసి పాత సంస్కారాలను మళ్ళీ ఇమర్జ్ చేస్తుంది, మరియు పాత సంస్కారాలు ఇమర్జ్ అయ్యాయంటే శుద్ధ సంస్కారాలు మర్జ్ అయిపోతాయి. పాత సంస్కారాలు - నిర్లక్ష్యము మరియు సోమరితనము, ఇవి భిన్న-భిన్న రూపాలలో ఇమర్జ్ అయినట్లయితే కంబైన్డ్ రూపము విడిపోతుంది. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి - సదా కంబైన్డ్ గా ఉంటున్నారా లేక ఒక్కోసారి ఒంటరిగా కూడా అయిపోతున్నారా? మాయ యొక్క అనేక స్వరూపాలనైతే తెలుసుకున్నారు కదా! మాయ చతురతతో దాని రంగును అంటిస్తుంది. విడిపోవడము అంటే మాయ రంగు అంటుకోవటము. ఈ నిర్లక్ష్యము, సోమరితనము అనేవి చాలా భిన్న-భిన్న రూపాలలో వస్తాయి మరియు పిల్లలు కూడా వాటిని గుర్తించలేకపోతారు ఎందుకంటే మాయ తన వైపుకు ఆకర్షిస్తుంది. ఈ నిర్లక్ష్యము మరియు సోమరితనము రావణుడి ఖజానా, ఇవి తండ్రి ఖజానా కాదు, ఈ రావణుడి ఖజానా గురించి పిల్లలు కూడా చాలా నషాతో చెప్తారు - నేను అలా కోరుకోవటము లేదు కానీ అది నా సంస్కారము. సంస్కారాన్ని నాది అని అనడము మొదలుపెడతారు. అది పరమాత్ముని ఖజానానా లేక రావణుడి ఖజానానా? దానిని నా సంస్కారము అని అనడము, ఆలోచించండి, రైటా? నాదిగా చేసెయ్యడము - ఇది మాయ తెలివి. తండ్రి ఖజానా ప్రియమైనదా లేక రావణుడి ఖజానా ప్రియమైనదా? సాధారణముగా పిల్లలు తమను తాము విడిపించుకోవడానికి ‘అది నా సంస్కారము, నేను అలా కోరుకోవటము లేదు’ అని అంటారు. మరి ఆలోచించండి, అది నాదా! తండ్రి అంటున్నారు, రావణుడి ఖజానాలను తమవిగా చేసుకోవడము వలన నెమ్మది-నెమ్మదిగా ఏవైతే శుభ సంస్కారాలు ఉన్నాయో అవి సమాప్తమైపోతూ ఉంటాయి. పరమాత్ముని సాంగత్యపు రంగు తగ్గుతూ ఉంటుంది మరియు మాయ రంగు ఇమర్జ్ అవుతుంది. కావున నడుస్తూ-నడుస్తూ స్వయాన్నే చెక్ చేసుకోవాలి - నాపై ఏ రంగు ఉంది? ప్రపంచమువారు కూడా హోలీలో ఏం చేస్తారు? ముందుగా చెడును కాల్చి వేస్తారు, ఆ తర్వాత రంగులు వేసుకుంటారు, జరుపుకుంటారు. మరి మీపై బాప్ దాదా సాంగత్యపు రంగును ఎలాగూ వేసారు, దానితో పాటు జ్ఞాన రంగును, శక్తుల రంగును, గుణాల రంగును వేస్తూ ఉంటారు.

మరి అందరికీ ఈ ఆత్మిక రంగు అంటుకుని ఉంది కదా! అంటుకుని ఉందా? చేతులెత్తండి. ఆత్మిక రంగు అంటుకుంది, మరి ఆ రంగు పోదు కదా! ఎవరిపైనైతే ఆత్మిక రంగు అంటుకుందో, అవినాశీ రంగు అంటుకుందో, వారికి మరే ఇతర రంగు అంటుకోలేదు. ఈ రంగుతో ఎంత హోలీగా (పవిత్రముగా) అయ్యారు? ఎంతగా అంటే పూర్తి కల్పములో మీ అంతటి హోలీగా, పవిత్రముగా మరెవ్వరూ అవ్వలేరు. మీ పవిత్రత, ప్రభువు యొక్క సాంగత్యపు రంగు, పరమాత్మునితో కంబైన్డ్ గా ఉండే అనుభవము అన్నింటికన్నా అతీతమైనది మరియు ప్రియమైనది. ఇతరులెవరైతే హోలీగా, పవిత్రముగా అవుతారో, వారి శరీరము పవిత్రముగా అవ్వదు, ఆత్మ పవిత్రముగా అవుతుంది. కానీ మీరు ఎంతటి హోలీగా, పవిత్రముగా అవుతారంటే మీ శరీరము మరియు ఆత్మ రెండూ పవిత్రముగా ఉంటాయి. పవిత్రతను సుఖ-శాంతులకు, ప్రేమ-ఆనందాలకు జనని అని అంటారు. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖ-శాంతులు తోడుగా ఉండనే ఉంటాయి ఎందుకంటే ఎక్కడైతే జనని ఉంటుందో అక్కడ పిల్లలు ఉంటారు ఎందుకంటే బాబా వచ్చి మిమ్మల్ని ఎంతటి హోలీగా చేస్తున్నారంటే మీ జడ చిత్రాలు ఎంత విధిపూర్వకముగా పూజించబడుతున్నాయి. కలియుగములోని చివరి జన్మలో కూడా మీరు మీ చిత్రాలను చూస్తున్నారు, ఎంత విధిపూర్వకముగా వాటికి పూజ జరుగుతుంది, ఇది పవిత్రత యొక్క విశేషత. ఎంతమంది మహానాత్మలు, ధర్మాత్ములు పవిత్రముగా అయినా కూడా మందిరాలు ఎవ్వరికీ తయారవ్వలేదు. ఇటువంటి విధిపూర్వకమైన పూజ ఎవ్వరికీ జరగదు కానీ చివరి జన్మ వరకు మీ చిత్రాలు కూడా ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాయి, కొద్ది సమయము కోసమైనా సుఖ-శాంతులను అనుభవము చేయిస్తాయి. కావున మీ హోలీకి మరియు ప్రపంచమువారి హోలీకి ఎంత తేడా ఉంది! మనోరంజనము కోసమని మీరు కూడా కొద్దొ-గొప్పో జరుపుకుంటారు కానీ సత్యమైన హోలీని అనగా పరమాత్ముని సాంగత్యపు రంగు మరియు కంబైన్డ్ స్వరూపము యొక్క యథార్థమైన హోలీని మీరు జరుపుకుంటారు. హోలీని ప్రపంచమువారు కూడా భిన్న-భిన్న రూపాలలో జరుపుకుంటారు. హోలీ అన్న మాట వెనుక కూడా ఒక రహస్యము ఉంది, అది మీకే తెలుసు, మీరే జరుపుకుంటారు. హోలీ అనగా అర్థము - హో లీ, గడిచిపోయిందేదో గడిచిపోయింది. కావున మీరందరూ పాత జీవితాన్ని, పాత విషయాలను, పాత సంస్కారాలను, పాత వ్యర్థ సంకల్పాలను హో లీ చేసేసారు కదా (సమాప్తము చేసేసారు కదా). గడిచిపోయిందేదో గడిచిపోయింది అని అనడము అంటే హో లీ. మరి ఇలా చేసారా? లేదా ఇప్పటికీ ఎప్పుడైనా పొరపాటున పాత సంస్కారాలు వచ్చేస్తూ ఉంటాయా? మన జన్మయే కొత్తది, మీరందరూ మరజీవాగా అయ్యారు కదా! అయ్యారా? మరజీవాగా అయ్యారా? చేతులెత్తండి. అచ్ఛా. కొత్త జన్మ జరిగింది అన్నప్పుడు మరి పాత జన్మ ఎలా గుర్తుకువస్తుంది? పాతది, పాతదైపోయింది. ఒకవేళ గడిచిపోయిన విషయాలు లేక సంకల్పాలు, సంస్కారాలు ఇమర్జ్ అయితే ఏమని అంటారు? హోలీని జరుపుకున్నట్లా? హో లీ చెయ్యలేదని (గతం గతః చెయ్యలేదని) అర్థము. పరమాత్ముని సాంగత్యపు రంగు మంచిగా అంటుకోలేదని అర్థము. పరమాత్ముని సాంగత్యపు రంగు అంటుకోవడమంటే పాత జన్మను మర్చిపోవడము, పాత విషయాలను మర్చిపోవడము ఎందుకంటే మరజీవాగా అయిపోయారు కదా. ఎలా అయితే శరీరము ద్వారా ఒక జన్మను విడిచి మరొకటి తీసుకున్నప్పుడు పాత జన్మ గుర్తుంటుందా? మరి మీరందరూ ఇప్పుడు బ్రాహ్మణ జన్మను ధారణ చేసినవారు. మరి గత జన్మలోని సంస్కారాలు, వాటిని పొరపాటుగా నా సంస్కారాలు అని అంటారు, అవి మీవా? అవి బ్రాహ్మణ జీవితము యొక్క సంస్కారాలా? ఒక్కోసారి నిర్లక్ష్యము, ఒక్కోసారి రాయల్ సోమరితనము. సోమరితనములో చాలా భిన్న-భిన్న రూపాలు ఉన్నాయి. ఎప్పుడైనా దీనిపై క్లాస్ చేయండి. సోమరితనము ఎన్ని రకాలుగా ఉంటుంది మరియు ఎన్ని రాయల్ రూపాలలో వస్తుంది!

బ్రాహ్మణ జీవితము అనగా కొత్త జీవితము, ఇందులో పాతదేదీ ఉండజాలదు. మరి ఈ రోజు హోలీని జరుపుకోవడానికి వచ్చారు కదా! మరి హోలీ అనగా హో లీ (గతం గతః), మరి ఈ రోజు హోలీని జరుపుకోవడము అనగా పాత సంస్కారాల హోలీని కాల్చి వేయడము. కాల్చేసిన తర్వాతనే జరుపుకోవడము ఉంటుంది. మరి ఇప్పుడు మీది జరుపుకునే స్వరూపము. కాల్చి వేసారు, ఇప్పుడు జరుపుకోవాలి. మీరు ప్రభువు యొక్క సాంగత్యపు రంగులోని ఆనందాన్ని తీసుకునేవారు. మీరు కంబైన్డ్ గా ఉండే అనుభవాన్ని చేసేవారు. ఎందుకని? హోలియెస్ట్ తండ్రి మీపై హోలీగా అయ్యే, పవిత్రముగా అయ్యే రంగును వేసారు.

మరి ఈ రోజు ఎటువంటి హోలీని జరుపుకుంటున్నారు? ఈ రోజు నుండి విశేషముగా ఎటువంటి పాత సంస్కారాన్ని రానివ్వకండి, ఈ హోలీని జరుపుకోవాలి. జరుపుకోగలరా లేక అప్పుడప్పుడూ వచ్చేస్తూ ఉంటాయా? నేను చెయ్యాలని అనుకోవడము లేదు కానీ నా సంస్కారము అనే ఈ రాయల్ మాటను ఈ రోజు దృఢ సంకల్పము అనే విధితో సమాప్తము చెయ్యండి. మరి ఈ రోజు ఇటువంటి హోలీని సదా జరుపుకునేందుకు ధైర్యము చెయ్యగలరా? లేక అప్పుడప్పుడూ జరుపుకుంటారా? ఈ రోజు నుండి పాత సంస్కారాల హోలీ, హో లీ, గడిచిపోయిందేదో గడిచిపోయింది, జన్మ కొత్తది, ఆ పాత జన్మ సమాప్తము - ఇలా ధైర్యాన్ని ఉంచే మీరు బాబాకు మధురాతి మధురమైన ప్రియమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు కదా! మరి ఈ సంకల్పాన్ని సంకల్పముగా కాకుండా దృఢ సంకల్పముగా చేసే ధైర్యము ఉందా? చేతులెత్తండి. చూడండి, అందరూ ధైర్యము ఉంచారు. సరే, కొద్దిమంది ఉండిపోయారు కూడా, కానీ మీరందరూ అయితే తోడుగా ఉన్నారు కదా. పక్కా సహచరులా, రెండు చేతులెత్తండి. వీరందరి ఫోటోను తీయండి. అచ్ఛా. డబుల్ విదేశీయులు కూడా చేతులెత్తుతున్నారు.

బాప్ దాదా మీకు హోలీ సందర్భముగా మరియు గడిచిపోయిందేదో గడిచిపోయింది అన్నందుకు పదమాల, పదమాల రెట్లు అభినందనలను ఇస్తున్నారు. ఇప్పుడు పొరపాటున కూడా మీ నోటి నుండి ‘నా సంస్కారము’ అన్న మాటను రానివ్వకండి. రావణుడి సంస్కారాన్ని నాది అంటారు, విచిత్రము! రావణుడిని శత్రువు అని అంటారు, శత్రువు యొక్క ఖజానాను తమదిగా చేసుకోవడమంటే అది ఆశ్చర్యమనిపించే విషయము! మేము ఏమంటున్నాము అని మీకు కూడా ఆశ్యర్యమనిపిస్తుంది కదా! పొరపాటుగా అనేస్తుంటారు. అనేస్తారు కానీ తర్వాత లోలోపల మనసు తింటుంది కూడా, రియలైజ్ కూడా అవుతారు, బాబాతో మాట్లాడుతారు కూడా, క్షమాపణలు కూడా అడుగుతారు. బాబా, రేపటి నుండి చెయ్యను అని అంటారు, కానీ మళ్ళీ చేసేస్తారు. మరి ఇప్పుడు బాప్ దాదా ఏం చేయాలి? చూస్తూ ఉండాలా? ఇప్పుడు ఇటువంటి మాటలు అనే హోలీని కాల్చివేయండి. చూడండి, కాల్చివేయడములో కూడా చాలా మంచి విషయము ఒకటి చెప్తారు, కోకీని (స్వీట్ ను) తయారుచేసేటప్పుడు దానికి దారాన్ని కట్టి కాలుస్తారు, కోకీ తయారైపోయాక దానిని తీసినప్పుడు కోకీ తయారవుతుంది కానీ దారము మాత్రము కాలదు. ఆత్మ అవినాశీ మరియు శరీరము వినాశీ అని మీరు ఏదైతే మొదటి పాఠము చదువుకున్నారో, ఇది దానికి గుర్తుగా తయారుచేసారు. ఈ పండుగలు మరియు శాస్త్రాలు తయారుచేసే పిల్లల అద్భుతము కూడా తక్కువైనదేమీ కాదు అన్నది బాప్ దాదా చూసారు. వాస్తవానికి వారు కూడా బాబా పిల్లలే కానీ మీరు చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు. కావున పిండిలో ఉప్పంత ఉన్నా కానీ వాటిని చాలా రమణీకముగా తయారుచేసారు. మీరు చూడండి, ప్రతి పండుగకు ఒక స్మృతిచిహ్నాన్ని తయారుచేసారు కానీ కొన్ని సూక్ష్మమైన విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చేసారు. కానీ స్మృతిచిహ్నమునైతే తయారుచేసారు కదా! భక్తిలో కూడా తక్కువేమీ చెయ్యలేదు. భక్తి అనేది ద్వాపర, కలియుగాలలో గుర్తుంచుకోదగ్గ విషయాలను ఎన్నోకొన్ని ఉంచింది, అతి వికారులుగా అవ్వడము నుండి కాపాడింది. కావున బాప్ దాదా ఈ సామాగ్రిని, పండుగలను మరియు శాస్త్రాలను తయారుచేసినవారికి కూడా దాని ఫలాన్ని ఇస్తారు. ఎంతైనా భక్తిలో కొంతైనా గుర్తుచేసుకుంటారు, వికారాల నుండి కొద్ది సమయము కోసమైనా దూరంగా ఉంటారు.

మరి మీరు ఈ రోజు ఎటువంటి హోలీని జరుపుకున్నారు? ఎటువంటి హోలీని జరుపుకున్నారు? హో లీ (గడిచిపోయిందేదో గడిచిపోయింది). హో లీ అని అందరూ అనండి. హో లీ అని ఇలా అనండి (చేతితో సూచించారు) పక్కా కదా! జరుపుకున్నారా? జరుపుకున్నారా? అచ్ఛా. మరి రేపు మళ్ళీ మాయ వస్తుంది, ఎందుకంటే మాయ కూడా వింటుంది కానీ మీరు ఇలా అనకండి (మీ వైపుకు పిలవకండి). బాగుంది కదా, ఇందులో ఆనందము ఉంది కదా. కావున ఆనందములో ఉండండి.

బాబా మాపై ఎంతటి ఆత్మిక రంగును వేస్తున్నారు అని బాబాను గుర్తుంచుకోండి, దాని ద్వారా మీరు హోలీహంసలుగా అయిపోయారు. హోలీహంస అనగా నిర్ణయశక్తి కల హోలీహంస. ఏ పని చేసినా సరే, ఒక సీట్ ను ఫిక్స్ చేసుకోండి, ముందుగా ఆ సీట్ పై సెట్ అయ్యి అప్పుడు నిర్ణయము తీసుకోండి, ఆ సీట్ ఏమిటో తెలుసు కదా, ఆ సీట్ ఏమిటంటే త్రికాలదర్శీ సీట్. ముందుగా త్రికాలదర్శీ సీట్ పై సెట్ అయ్యి మూడు కాలాలను చూడండి, కేవలం వర్తమానాన్నే కాదు, ఆది మధ్య అంతిమము, మూడు కాలాలను చూడండి, మూడు కాలాలలోనూ లాభముందా లేక నష్టముందా? కొంతమంది పిల్లలు చాలా తెలివి కలవారు. ఆ తెలివి ఏమిటో వినిపించమంటారా? ఏమంటారంటే - ఆ పనిని కానివ్వాలి కదా, అందుకే కానిచ్చేసాను, అయితే అది చేయకూడదు అని నాకు అర్థమవుతుంది కానీ చేసేసాను. కానీ, చేసేసారు అంటే మరి ఆ కర్మకు ఫలమైతే లభిస్తుంది కదా! అందుకే తెలివి చూపించకండి. బాబాను కూడా చాలా మెప్పించడానికి ప్రయత్నిస్తారు. పొరపాటు చేస్తారు కదా, అప్పుడు బాప్ దాదాకు ఎలాంటి మాటలు వినిపిస్తారంటే - బాబా, మీరైతే దయార్ద్ర హృదయులు కదా! మీరైతే క్షమా సాగరులు కదా! బాబా ఎవరు అనేది బాబాకు కూడా గుర్తు తెప్పిస్తారు! మీరే చెప్పారు కదా, నాకు వినిపించేసి సమాప్తము చేసెయ్యండి అని. కానీ రియలైజేషన్ తో వినిపించి సమాప్తము చెయ్యండి. ఒక్క మాటను పక్కా చేసుకుంటారు, వినిపిస్తారు, కానీ ముందుగా దృఢ సంకల్పముతో స్వయాన్ని పరివర్తన చేసుకుని అప్పుడు వినిపించండి. మెప్పించడానికి చాలా ప్రయత్నిస్తారు. మీరే చెప్పారు కదా! అని అంటారు. మీరే చెప్పారు కదా, మీరే చెప్పారు కదా అని బాబాకు కూడా గుర్తు చేయిస్తారు. చాలా తెలివి చూపిస్తారు. ఇప్పుడిక తెలివి చూపించకండి, ధైర్యము ఉంచండి. చెయ్యాల్సిందే. చేస్తాములే, చేస్తాములే అనవద్దు.

బాప్ దాదా రోజంతటిలో చేస్తాములే, చేస్తాములే అనే పాటను చాలా వింటూ ఉంటారు. చేస్తాములే, చూపిస్తాములే, అవుతాములే, కానీ స్పీడ్ ఎంత ఉంది? ఇలా లే, లే అని అనేవారు బాబాతోపాటు వెళ్ళగలరా? బాబా అయితే ఎవర్రెడీగా ఉన్నారు, మరి లే, లే అని అనేవారు ఎవర్రెడీ అవ్వలేదు. మరి బాబాతోపాటు ఎలా వెళ్ళగలరు? అందరూ బాబాతోపాటు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు. బాబాకు ఒక్కొక్క బిడ్డ పట్ల పదమాల రెట్ల ప్రేమ ఉంది. నా పిల్లలై ఉండి నాతోపాటు రాకపోవడమనేది జరగాలని బాబా కోరుకోవడము లేదు. ఇంటికి తిరిగి వెళ్ళే సమయము వచ్చినప్పుడు ఇంటికి రారా? ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజ్యములోకి రావాలి. కలిసి ఇంటికి వెళ్ళకపోతే బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యములోకి కూడా రారు, తర్వాత వస్తారు. మరి మీ ప్రతిజ్ఞ ఏమిటి? కలిసి వస్తారా లేక తర్వాత వస్తాములే అని అంటారా... ఇందులో కూడా లే, లే అని అంటారా? చేరుకుంటాములే, చూడండి బాబా, తప్పకుండా చేరుకుంటాము, ఇప్పుడు ఈ భాషను సమాప్తము చేయండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న పిల్లలందరినీ కూడా బాప్ దాదా చూస్తున్నారు, దూరముగా కూర్చుని ఉన్నా కూడా సైన్స్ సాధనాల ద్వారా మెజారిటీ స్థానాలలో, సెంటర్లలో వారు కూడా బాప్ దాదాను చూస్తూ ఉంటారు, మీరు టోలీ తింటారు కదా, అప్పుడు వారు కూడా టోలీని పంచుతారు. కావున అందరినీ బాప్ దాదా కూడా చూస్తున్నారు - దూరముగా కూర్చుని కూడా సామీప్యతను ఎలా అనుభవం చేస్తున్నారు అని. నలువైపులా ఉన్న పిల్లలెవరైతే సదా బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వాలో, ఎవరైతే ఈ సంకల్పాన్ని ధారణ చేసి ఉన్నారో మరియు ఎప్పటికప్పుడు ఈ సంకల్పానికి దృఢతా శక్తిని ఇస్తూ ఉంటారో, ఇలా నలువైపులా శుభ సంకల్పాన్ని ధారణ చేసినవారికి, దానితోపాటు బాబా ఆశలను పూర్తి చేసే ఆశా సితారలకు, అలాగే దాదీ మాటలు - కర్మాతీతముగా అవ్వాల్సిందే, అవ్వాల్సిందే, అవ్వాల్సిందే... మరియు మమ్మా మాటలు - సదా ఏది చెయ్యాలన్నా అది ఈ రోజే చెయ్యండి, రేపటికి వదలద్దు... మరియు దీదీ మాటలు - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి... ఇవి చెవులలో మారుమ్రోగుతూ ఉండాలి. పదే-పదే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కావున కర్మాతీతముగా అవ్వాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్న ఒక్క ధ్యాసే పెట్టుకోండి. ఈ మాటలను పదే-పదే స్మృతిలోకి తెచ్చుకునే సమర్థ ఆత్మలకు, హోలీ పిల్లలకు బాప్ దాదా తరఫున హోలీ శుభాకాంక్షలు, దీనితో పాటు అందరికీ బాప్ దాదా ముందుగానే గేవర్ (స్వీట్ ను) తినిపిస్తున్నారు, మధుబన్ యొక్క గేవర్ తినే కంటే ముందు అందరూ నోరు తెరవండి మరియు గేవర్ తినండి, తిన్నారా, అందరికీ చాలా-చాలా పదమాల రెట్లు బాప్ దాదా మరియు ఎడ్వాన్స్ పార్టీలోని పిల్లలందరి ప్రియస్మృతులు మరియు తండ్రి యొక్క నమస్తే.

వరదానము:-
సర్వాత్మల పట్ల స్నేహమును మరియు శుభచింతక భావనను ఉంచుకునే దేహీ-అభిమానీ భవ

ఏ విధముగా మహిమ చేసే ఆత్మ పట్ల స్నేహ భావన ఉంటుందో, అదే విధముగా ఎప్పుడైనా ఎవరైనా శిక్షణతో కూడిన సూచనలు ఇచ్చినా, ఆ ఆత్మ పట్ల కూడా అదే విధమైన స్నేహము మరియు శుభచింతన యొక్క భావన ఉండాలి. వీరు నా పట్ల అందరికంటే పెద్ద శుభచింతకులు అన్న భావన ఉండాలి - అటువంటి స్థితిని దేహీ-అభిమానీ స్థితి అని అంటారు. ఒకవేళ దేహీ-అభిమానులుగా లేరంటే తప్పకుండా అభిమానము ఉంది. అభిమానము కలవారు ఎప్పుడూ తమ అవమానాన్ని సహనము చేయలేరు.

స్లోగన్:-
సదా పరమాత్ముని ప్రేమలో మైమరచిపోయి ఉన్నట్లయితే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ఎప్పుడైనా పెద్దవారి చేతిలో తమ చెయ్యి ఉన్నప్పుడు ఆ చిన్నవారి స్థితి ఏ చింత లేకుండా నిశ్చింతగా ఉంటుంది. ప్రతి కర్మలోనూ బాప్ దాదా నా తోడుగా కూడా ఉన్నారు మరియు నా ఈ అలౌకిక జీవితము యొక్క చెయ్యి వారి చేతిలో ఉంది అని మీకు నిశ్చయము ఉంది అనగా జీవితాన్ని వారికి అర్పించేసారు, అప్పుడిక దాని బాధ్యత కూడా వారిదే అవుతుంది. అన్ని భారాలను బాబాపై పెట్టి స్వయాన్ని తేలికగా చేసుకున్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు మరియు ప్రతి కార్యము ఏక్యురేట్ గా అవుతుంది.