01-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శాంతిధామము పావన ఆత్మల ఇల్లు, ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనముగా అవ్వండి’’

ప్రశ్న:-
తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తారు?

జవాబు:-
మధురమైన పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను - ఏ శిక్షలూ అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు. మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి, ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి, ఈ ప్రపంచములో ఉంటూ పవిత్రముగా అయి చూపించండి, అప్పుడు బాబా మీకు విశ్వ రాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు - ఇప్పుడు తండ్రి పిల్లలైన మనల్ని తమ ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు, మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మనసు కలుగుతోందా? అది సర్వాత్మల ఇల్లు. ఇక్కడ జీవాత్మలందరి ఇల్లు ఒకటి కాదు. తండ్రి వచ్చి ఉన్నారనైతే అర్థం చేసుకున్నారు. తండ్రిని ఆహ్వానమునిచ్చి పిలిచారు. మమ్మల్ని ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - ఓ ఆత్మల్లారా, పతితులైన మీరు ఎలా వెళ్ళగలరు అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. పావనముగానైతే తప్పకుండా అవ్వాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, వారు ఇంకేమీ చెప్పరు. భక్తి మార్గములో మీరు ఇంత సమయం పురుషార్థము చేసారు, దేని కోసము? ముక్తి కోసము. కావున ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు - ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా? పిల్లలు అంటారు - బాబా, దీని కొసమే కదా మేము ఇంత భక్తిని చేసాము. జీవాత్మలు ఎవరైతే ఉన్నారో, వారందరినీ తీసుకువెళ్ళవలసిందేనని కూడా తెలుసు. కానీ, పవిత్రముగా అయి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ పవిత్ర ఆత్మలే మొట్టమొదట వస్తారు. అపవిత్ర ఆత్మలు ఇంట్లో ఉండలేరు. ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఏవరైతే ఉన్నారో, వారందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటిని శాంతిధామము లేక వానప్రస్థ్ అని అంటారు. ఆత్మలమైన మనము పావనముగా అయి పావన శాంతిధామానికి వెళ్ళాలి. అంతే. ఇది ఎంత సహజమైన విషయము. అది ఆత్మల యొక్క పావన శాంతిధామము. ఆ తర్వాతది జీవాత్మల యొక్క పావన సుఖధామము. ఇప్పుడు ఇది జీవాత్మల యొక్క పతిత దుఃఖధామము. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. శాంతిధామములో అన్ని పవిత్ర ఆత్మలూ నివసిస్తాయి. అది ఆత్మల పవిత్ర ప్రపంచము - అది నిర్వికారీ మరియు నిరాకారీ లోకము. ఇది జీవాత్మలందరి యొక్క పాత ప్రపంచము. అందరూ పతితముగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి - ఆత్మలను పావనముగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇందులో ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, వారే పావన సుఖధామములోకి వెళ్తారు. ఇది చాలా సహజము, ఇందులో ఏ విషయము గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఆత్మలైన మన తండ్రి మనల్ని పావన శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అక్కడికి వెళ్ళే దారిని ఏదైతే మనం మర్చిపోయామో, దానిని ఇప్పుడు తండ్రి తెలియజేశారు. కల్ప-కల్పమూ నేను వచ్చి ఇలాగే చెప్తాను - ఓ పిల్లలూ, శివబాబానైన నన్ను స్మృతి చేయండి. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువే. వారే వచ్చి పిల్లలకు - పిల్లలూ, ఇప్పుడు మీరు ఏమి చేయాలి అని చెప్తూ సందేశాన్ని లేక శ్రీమతాన్ని ఇస్తారు. అర్ధకల్పం మీరు ఎంతో భక్తిని చేసారు, దుఃఖాన్ని అనుభవించారు. ఖర్చు చేస్తూ-చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు. ఆత్మ కూడా సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయిపోయింది. ఈ చిన్న విషయాన్నే అర్థం చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలా? లేదా? అవును బాబా, తప్పకుండా వెళ్ళాలి. అది మా స్వీట్, సైలెన్స్ హోమ్ (మధురమైన, నిశ్శబ్దమైన ఇల్లు). తప్పకుండా ఇప్పుడు మనము పతితులుగా ఉన్నాము కావుననే అక్కడికి వెళ్ళలేము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. నేను కల్ప-కల్పమూ ఇదే సందేశాన్ని ఇస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఈ దేహమైతే అంతమైపోనున్నది. ఇకపోతే ఆత్మలు తిరిగి వెళ్ళాలి. దానిని నిరాకారీ లోకము అని అంటారు. నిరాకారీ ఆత్మలందరూ అక్కడ ఉంటారు. అది ఆత్మల ఇల్లు. నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి అందరికన్నా చివరిలో వస్తారు ఎందుకంటే మళ్ళీ అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి. అప్పుడిక ఒక్క పతిత ఆత్మ కూడా ఇక్కడ ఉండదు. ఇందులో ఎటువంటి తికమకపడే విషయము లేక కష్టతరమైన విషయము లేదు. ఓ పతితపావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేసి మీతోపాటు తీసుకువెళ్ళండి అని గానం చేస్తారు కూడా. వారు సర్వులకూ తండ్రి కదా. మళ్ళీ ఎప్పుడైతే మనము కొత్త ప్రపంచములోకి పాత్రను అభినయించడానికి వస్తామో, అప్పుడు చాలా కొద్దిమందే ఉంటారు. మిగిలిన ఈ కోట్లాదిమంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సత్యయుగములో కొద్దిమంది జీవాత్మలే ఉంటారని, అక్కడ వృక్షము చిన్నగా ఉండేదని, ఆ తర్వాత అది వృద్ధి పొందిందని కూడా మీకు తెలుసు. వృక్షములో అనేక ధర్మాల వెరైటీ ఉంది. దానినే కల్పవృక్షము అని అంటారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. కొంతమంది ఏమంటారంటే - బాబా, మేము కల్పం ఆయువు 5000 సంవత్సరాలు అని ఎలా నమ్మాలి? అరే, తండ్రి అయితే సత్యమే వినిపిస్తారు కదా. చక్రం లెక్కను కూడా చెప్పారు.

ఈ కల్పము యొక్క సంగమయుగములోనే తండ్రి వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు, అది ఇప్పుడు లేదు. సత్యయుగములో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది. ఈ సమయములో మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ కల్పము యొక్క సంగమయుగములో వస్తాను, కొత్త ప్రపంచ స్థాపనను చేస్తాను. పాత ప్రపంచము అంతమైపోనున్నది. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తగా అవుతుంది. దీనిలో పూర్తి నాలుగు భాగాలున్నాయి, దానినే స్వస్తికము అని కూడా అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గములోనైతే బొమ్మలాటను ఆడినట్లుగా చేస్తుంటారు. ఎన్నో చిత్రాలు ఉన్నాయి, దీపావళి నాడు విశేషముగా చిత్రాల దుకాణము పెడతారు, అనేకానేక చిత్రాలున్నాయి. ఒకరేమో శివబాబా మరియు ఆ తర్వాత పిల్లలైన మనము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడకు వస్తే లక్ష్మీ-నారాయణుల రాజ్యము, ఆ తర్వాత సీతా-రాముల రాజ్యము, ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. వాటితో పిల్లలైన మీకు ఏ సంబంధము లేదు. వారు తమ-తమ సమయమనుసారముగా వస్తారు, మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచమంతా వినాశనమవ్వనున్నది. ఇప్పుడిక ఇందులో ఉండేదేముంది? ఈ ప్రపంచము వైపుకు అసలు మనసే కలగదు. ఒక్క ప్రియునితోనే మనసు పెట్టుకోవాలి, వారేమంటారంటే - ఒక్క నాతోనే మీ మనసును జోడించినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. ఇప్పుడు ఎంతో గడిచిపోయింది, ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది, సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. యోగములో ఉండకపోతే ఇక అంతిమంలో వారు చాలా పశ్చాత్తాపపడతారు, శిక్షలు అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. మన ఇంటిని వదిలి ఎంత కాలమయ్యింది అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఇంటికి వెళ్ళడం కోసమే కష్టపడుతుంటారు కదా. తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు. వారు సత్యయుగములో లభించరు. ముక్తిధామములోకి వెళ్ళేందుకు మనుష్యులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. దానిని భక్తి మార్గము అని అంటారు. ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి మార్గము అంతమవ్వనున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరు ఎంతగా పావనముగా అవుతారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేయండి, నేను గ్యారంటీ ఇస్తాను, మీరు ఏ శిక్షలూ అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి నేను అనేకానేక సార్లు వచ్చాను. పిల్లలైన మీరే గెలుపు-ఓటముల పాత్రను అభినయిస్తారు, అప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను. ఇది పతిత ప్రపంచము, అందుకే - పతితపావనా రండి, మేము వికారీ పతితులము, మీరు వచ్చి నిర్వికారీ పావనులుగా తయారుచేయండి అని పిలుస్తారు. ఇది వికారీ ప్రపంచము. ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ఎవరైతే చివరిలో వస్తారో, వారు శిక్షలు అనుభవించి వెళ్తారు, అందుకే వారు రావడము కూడా 2 కళలు తక్కువగా ఉన్న ప్రపంచములోకి వస్తారు. వారిని సంపూర్ణ పవిత్రులు అని అనరు, అందుకే ఇప్పుడు పురుషార్థము కూడా పూర్తిగా చేయాలి. తక్కువ పదవి లభించే విధముగా ఉండకూడదు. అక్కడ రావణ రాజ్యము లేకపోయినా కానీ పదవి అయితే నంబరువారుగా ఉంటుంది కదా. ఆత్మలో మాలిన్యము చేరితే ఇక శరీరము కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మ స్వర్ణయుగము నుండి వెండియుగానికి చెందినదిగా అయిపోతుంది. అక్కడ వెండి యొక్క మాలిన్యము ఆత్మలో కలుస్తుంది, ఇక తర్వాత రోజు-రోజుకు ఎక్కువ ఛీ-ఛీ మాలిన్యము కలుస్తూ ఉంటుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం కాకపోతే చేతులెత్తండి. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని తిరిగారో వారికే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, వీరి 84 జన్మల అంతిమములో నేను వచ్చి ప్రవేశిస్తాను. వీరే మళ్ళీ మొదటి నెంబరులోకి వచ్చేది ఉంది. ఎవరైతే మొదట ఉండేవారో, వారు ఇప్పుడు చివరిలో ఉన్నారు. వారే మొదటి నెంబరులోకి వెళ్ళాలి. ఎవరైతే అనేక జన్మల అంతిమములో పతితునిగా అయిపోయారో, వారి శరీరములోకే పతిత-పావనుడినైన నేను వస్తాను. వారిని పావనంగా తయారుచేస్తాను. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తాను.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. గీతా జ్ఞానాన్ని అయితే మీరు ఎంతో విన్నారు మరియు వినిపించారు, కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతిని పొందలేదు. ఎంతోమంది సన్యాసులు మీకు తియ్యతియ్యని మాటలతో శాస్త్రాలను వినిపించారు, ఆ మాటలు విని గొప్ప-గొప్ప వ్యక్తులు వెళ్ళి పోగవుతారు. అది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది కదా. భక్తి మార్గమంతా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మార్గము ఇప్పుడు పూర్తవుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాను, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. నేనే జ్ఞానసాగరుడిని. జ్ఞానము అని నాలెడ్జ్ ను అంటారు. మీకు అంతా చదివిస్తారు. 84 జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు, మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది. స్థూలవతనము నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్ళీ మూలవతనములోకి వెళ్తారు. మొట్టమొదట లక్ష్మీ-నారాయణుల వంశము ఉంటుంది, అక్కడ వికారీ పిల్లలు ఉండరు, అక్కడ రావణ రాజ్యమే లేదు. యోగబలముతో అంతా జరుగుతుంది. ఇప్పుడిక కొడుకుగా అయి గర్భమహలులోకి వెళ్ళాలని మీకు సాక్షాత్కారమవుతుంది. సంతోషముగా వెళ్తారు. ఇక్కడైతే మనుష్యులు ఎంతగా ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. ఇక్కడైతే గర్భజైలులోకి వెళ్తారు కదా. అక్కడ రోదించే విషయమే లేదు. శరీరాన్ని అయితే తప్పకుండా మార్చవలసి ఉంటుంది. సర్పము ఉదాహరణ ఉంది కదా. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. అలాగే ఎక్కువగా అడగవలసిన అవసరమూ లేదు. పూర్తిగా పావనముగా అయ్యే పురుషార్థములో నిమగ్నమైపోవాలి. తండ్రిని స్మృతి చేయడము కష్టమవుతుందా ఏమిటి? మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా. మీ తండ్రినైన నేను మీకు సుఖ వారసత్వాన్ని ఇస్తాను. మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో స్మృతిలో ఉండలేరా! ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా, అయినా కానీ ఇంటికి వెళ్ళి భార్య మొదలైనవారి ముఖాన్ని చూడడంతోనే మాయ తినేస్తుంది. తండ్రి అంటారు, ఎవరి పైనా మమకారాన్ని పెట్టుకోకండి. అదంతా అంతమైపోవలసిందే. స్మృతి ఒక్క తండ్రినే చేయాలి. నడుస్తూ-తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సత్యయుగములో ఈ అశుద్ధమైన వస్తువులు, మాంసము మొదలైనవేవీ ఉండనే ఉండవు. తండ్రి అంటారు, వికారాలను కూడా వదిలివేయండి. నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను, ఇందులో ఎంత సంపాదన ఉంది. మరి మీరు పవిత్రముగా ఎందుకు ఉండరు. కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఎంత భారీ సంపాదన జరుగుతుంది. కలిసే ఉండండి కానీ జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉండాలి. పవిత్రముగా ఉండి చూపించినట్లయితే అందరి కంటే ఉన్నత పదవిని పొందుతారు. ఎందుకంటే మీరు బాల బ్రహ్మచారులు కదా. ఇంకా జ్ఞానం కూడా కావాలి. ఇతరులను మీ సమానముగా తయారుచేయాలి. ఏ విధముగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రముగా ఉంటున్నారో సన్యాసులకు చూపించాలి. అప్పుడు, వీరిలో ఎంతో శక్తి ఉంది అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఈ ఒక్క జన్మ పవిత్రముగా ఉండడం ద్వారా 21 జన్మలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది, మరి పవిత్రముగా ఉండి ఎందుకు చూపించకూడదు. సమయం చాలా తక్కువగా ఉంది. శబ్దము కూడా వ్యాపిస్తూ ఉంటుంది, వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. రిహార్సల్ అయితే చూసారు కదా. ఒక్క ఆటమ్ బాంబుతో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఇంకా హాస్పిటల్లోనే పడి ఉన్నారు. ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారుచేస్తారంటే, వాటి ద్వారా ఎటువంటి కష్టమూ ఉండదు, వెంటనే అంతమైపోతారు. మొదట ఈ రిహార్సల్ జరిగి, ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. వెంటనే మరణిస్తారా, లేదా? అని చూస్తారు. ఆ తర్వాత ఇంకా యుక్తులను రచిస్తారు. హాస్పిటళ్ళు మొదలైనవేవీ ఉండవు. ఎవరు కూర్చొని సేవ చేస్తారు. తద్దిన భోజనాలు తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైనవారెవ్వరూ ఉండరు. బాంబు వేయగానే అంతమైపోతారు. భూకంపాలలో అంతా కూరుకుపోతుంది. పెద్ద సమయం కూడా పట్టదు. ఇక్కడ ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. సత్యయుగములో చాలా కొద్దిమందే ఉంటారు. మరి ఇంతమంది ఎలా వినాశనమవుతారు! మున్ముందు చూస్తారు, అక్కడైతే ప్రారంభములో 9 లక్షల మంది ఉంటారు.

ఫకీరులు కూడా మీరే, భగవంతుడు కూడా మీకే ప్రియమైనవారు. ఇప్పుడు అందరినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించారు. ఇటువంటి ఫకీరులకు తండ్రి ప్రియమనిపిస్తారు. సత్యయుగములో చాలా చిన్న వృక్షము ఉంటుంది. విషయాలనైతే ఎన్నో అర్థం చేయిస్తారు. పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, ఆ ఆత్మలందరూ అవినాశీయే. వారు తమ-తమ పాత్రను అభినయించడానికి వస్తారు. కల్ప-కల్పమూ మీరే వచ్చి విద్యార్థులుగా అయి తండ్రి ద్వారా చదువుకుంటారు. బాబా మనల్ని పవిత్రముగా తయారుచేసి తమతోపాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. బాబా కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు, అందరినీ తప్పకుండా తిరిగి తీసుకువెళ్తారు, కావుననే పాండవ సైన్యము అన్న పేరు ఉంది. పాండవులైన మీరు ఏమి చేస్తున్నారు? మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని అచ్చంగా కల్పపూర్వము వలె, నంబరువారు పురుషార్థానుసారముగా తీసుకుంటున్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రికి ప్రియమైనవారిగా అయ్యేందుకు పూర్తి ఫకీరులుగా అవ్వాలి. దేహాన్ని కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీరులుగా అవ్వడము. తండ్రి నుండి అతి పెద్ద ప్రైజ్ ను తీసుకునేందుకు సంపూర్ణ పావనముగా అయి చూపించాలి.

2. తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే పాత ప్రపంచముపై మనస్సు పెట్టుకోకూడదు. ఒక్క ప్రియునిపైనే మనస్సు పెట్టుకోవాలి. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయాలి.

వరదానము:-

బ్రాహ్మణ జీవితములో సదా చియర్ ఫుల్ మరియు కేర్ ఫుల్ మూడ్ లో ఉండే కంబైండ్ రూపధారీ భవ

ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నతా మూడ్ మారిపోయినట్లయితే, దానిని సదాకాలపు ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితములో సదా చియర్ ఫుల్ మరియు కేర్ ఫుల్ మూడ్ (సంతోషకరమైన మరియు జాగ్రత్త కలిగిన మూడ్) ఉండాలి. మూడ్ మారిపోకూడదు. మూడ్ మారిపోయినట్లయితే, నాకు ఏకాంతము కావాలి అని అంటారు. ఈ రోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. ఒంటరివారిగా ఉన్నప్పుడే మూడ్ మారిపోతుంది, సదా కంబైండ్ రూపములో ఉన్నట్లయితే మూడ్ మారిపోదు.

స్లోగన్:-

ఏ ఉత్సవమునైనా జరుపుకోవటము అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహములో ఉండటము.