01-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ ఆత్మిక యూనివర్శిటీ యొక్క విద్యార్థులు, మీ పని మొత్తం విశ్వమంతటికీ తండ్రి సందేశాన్ని ఇవ్వడము’’

ప్రశ్న:-
ఇప్పుడు పిల్లలైన మీరు ఏ దండోరాను వేయిస్తారు మరియు ఏ విషయాన్ని అర్థం చేయిస్తారు?

జవాబు:-
మీరు ఏమని దండోరా వేయిస్తారంటే - ఈ కొత్త దైవీ రాజధాని మళ్ళీ స్థాపన అవుతోంది, ఇప్పుడు అనేక ధర్మాల వినాశనము జరగనున్నది అని. మీరు అందరికీ ఇలా అర్థం చేయిస్తారు - అందరూ నిశ్చింతగా ఉండండి, ఇది అంతర్జాతీయ సమస్య, యుద్ధము తప్పకుండా జరగనున్నది, దాని తర్వాత దైవీ రాజధాని వస్తుంది.

ఓంశాంతి
ఇది ఆత్మిక యూనివర్శిటీ. మొత్తం విశ్వములో ఎంతమంది ఆత్మలైతే ఉన్నారో, యూనివర్శిటీలో ఆత్మలే చదువుకుంటారు. యూనివర్స్ అనగా విశ్వము. ఇప్పుడు నియమము పరంగా అయితే యూనివర్శిటీ అనే పదము పిల్లలైన మీకే వర్తిస్తుంది. ఇది ఆత్మిక యూనివర్శిటీ. దైహిక యూనివర్శిటీ అనేది ఉండనే ఉండదు. ఇది ఒక్కటే గాడ్ ఫాదర్లీ యూనివర్శిటీ. ఆత్మలందరికీ ఇక్కడ పాఠాలు అందుతాయి. మీ ఈ సందేశము ఏదో ఒక రకముగా అందరికీ తప్పకుండా చేరుకోవాలి. సందేశాన్ని అందించాలి కదా మరియు ఈ సందేశము చాలా సింపుల్ అయినది. వారు మన అనంతమైన తండ్రి అని, అందరూ వారినే తలచుకుంటారని పిల్లలకు తెలుసు. వారు మన అనంతమైన ప్రియుడు అని కూడా అనవచ్చు. విశ్వములోని ఏయే జీవాత్మలైతే ఉన్నారో, వారు ఆ ప్రియుడిని తప్పకుండా తలచుకుంటారు. ఈ పాయింట్లను బాగా ధారణ చేయాలి. ఫ్రెష్ బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు బాగా ధారణ చేయగలరు. విశ్వములో ఎంతమంది ఆత్మలైతే ఉన్నారో, వారందరికీ తండ్రి ఒక్కరే. యూనివర్శిటీలోనైతే మనుష్యులే చదువుకుంటారు కదా. మనమే 84 జన్మలు తీసుకుంటాము అని కూడా ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. 84 లక్షల జన్మలు అన్న విషయమే లేదు. విశ్వములో ఏయే ఆత్మలైతే ఉన్నారో, ఈ సమయములో అంతా పతితముగా ఉన్నాయి. ఇది ఉన్నదే ఛీ-ఛీ ప్రపంచము, దుఃఖధామము. వారిని సుఖధామానికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారిని ముక్తిప్రదాత అని కూడా అంటారు. మీరు మొత్తం యూనివర్స్ కు లేక విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. ఈ సందేశాన్ని అందించి రండి అని తండ్రి అందరికీ చెప్తారు. తండ్రిని అందరూ తలచుకుంటారు, వారిని మార్గదర్శకుడు, ముక్తిప్రదాత, దయార్ద్ర హృదయుడు అని కూడా అంటారు. అనేక భాషలు ఉన్నాయి కదా. ఆత్మలందరూ ఒక్కరినే పిలుస్తారు, కావున వారొక్కరే మొత్తము విశ్వానికి టీచరుగా కూడా అయ్యారు కదా. వారు ఎలాగూ తండ్రియే, కానీ వారు ఆత్మలమైన మనందరికీ టీచరు కూడా, గురువు కూడా అని ఎవ్వరికీ తెలియదు. వారు అందరినీ గైడ్ కూడా చేస్తారు. ఈ అనంతమైన గైడ్ గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆత్మ అంటే ఏమిటి అని ఆత్మ గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఆత్మ అంటే ఏమిటి అన్న విషయము తెలిసిన మనుష్యులు ప్రపంచములో ఒక్కరు కూడా లేరు, విశేషముగా భారత్ లో మరియు మిగిలిన ప్రపంచములో కూడా ఆత్మ అంటే ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము వలె మెరుస్తుంది అని అనడం అంటారు కానీ దాని అర్థమేమీ తెలియదు. ఆత్మ అయితే అవినాశీ అని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ ఎప్పుడూ పెద్దదిగా లేక చిన్నదిగా అవ్వదు. ఏ విధముగా ఆత్మ అయిన మీరు ఉన్నారో, తండ్రి కూడా అదే విధముగా బిందువు వలె ఉన్నారు. అంతేకానీ వారు మీకంటే పెద్దగా లేక చిన్నగా లేరు. వారు కూడా ఆత్మయే, కాకపోతే వారు పరమ ఆత్మ, సుప్రీమ్. ఆత్మలంతా తప్పకుండా పరంధామములో నివసించేవారు. పాత్ర అభినయించడానికి ఇక్కడకు వస్తారు. మళ్ళీ తమ పరంధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. పరమపిత పరమాత్మను అందరూ తలచుకుంటారు ఎందుకంటే ఆత్మలను పరమపితయే ముక్తిలోకి పంపించారు, కావున వారినే తలచుకుంటారు. ఆత్మయే తమోప్రధానముగా అయ్యింది. స్మృతి ఎందుకు చేస్తారు, ఈ మాత్రము కూడా తెలియదు. ఏ విధముగానైతే పిల్లలు ‘‘బాబా’’ అని అంటారు కదా, అంతే. అంతకుమించి వారికేమీ తెలియదు. మీరు కూడా బాబా, మమ్మా అని అంటారు, కానీ ఏమీ తెలియదు. భారత్ లో ఒకే నేషనాలిటీ (జాతీయత) ఉండేది, దానిని దైవీ నేషనాలిటీ అని అంటారు. ఆ తర్వాత ఇతరులు కూడా ఇందులోకి ప్రవేశించారు. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు, అందుకే ఇన్ని కొట్లాటలు మొదలైనవి జరుగుతున్నాయి. ఎక్కడెక్కడైతే ఇతరులు ఎక్కువగా దూరిపోయారో, అక్కడ నుండి వారిని పంపించేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. గొడవలు ఎక్కువ అయిపోయాయి. అంధకారము కూడా చాలా ఏర్పడింది. దానికి ఎంతోకొంత లిమిట్ కూడా ఉండాలి కదా. పాత్రధారులకు లిమిట్ ఉంటుంది. ఇది కూడా తయారై, తయారుచేయబడిన నాటకము. ఇందులో ఎంతమంది పాత్రధారులైతే ఉన్నారో, ఆ సంఖ్య ఎక్కువ, తక్కువ అవ్వదు. ఎప్పుడైతే పాత్రధారులందరూ స్టేజి పైకి వస్తారో, అప్పుడిక వారి తిరిగి వెళ్ళాలి కూడా. ఏయే పాత్రధారులైతే మిగిలిపోయి ఉన్నారో, వారు వస్తూ ఉంటారు. కంట్రోల్ చేసేందుకు ఎంతగా కష్టపడినా కానీ చేయలేకపోతారు. మీరు ఇలా చెప్పండి - బి.కె.లైన మేము ఎలా బర్త్ కంట్రోల్ చేస్తామంటే, ఇక 9 లక్షల మంది మాత్రమే మిగులుతారు, మొత్తము జనాభా సంఖ్య అంతా తగ్గిపోతుంది, మేము మీకు సత్యము చెప్తున్నాము, ఇప్పుడు స్థాపన చేస్తున్నాము. కొత్త ప్రపంచము, కొత్త వృక్షము తప్పకుండా చిన్నదిగానే ఉంటుంది. ఇక్కడైతే కంట్రోల్ చేయలేకపోతారు ఎందుకంటే ప్రపంచము ఇంకా తమోప్రధానముగా అవుతూ ఉంటుంది, జనాభా సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఏయే పాత్రధారులైతే రానున్నారో, వారంతా ఇక్కడికే వచ్చి శరీరాలను ధారణ చేస్తారు. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు. రాజధానిలో అన్ని రకాల పాత్రధారులు ఉంటారని తెలివైన బుద్ధి కలవారు అర్థం చేసుకుంటారు. సత్యయుగములో ఏ రాజధాని అయితే ఉండేదో, అది మళ్ళీ స్థాపనవుతోంది. ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు ఇప్పుడు తమోప్రధాన క్లాస్ నుండి సతోప్రధాన క్లాస్ లోకి ట్రాన్స్ఫర్ అవుతారు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్తారు. మీ చదువు ఈ ప్రపంచము కోసము కాదు. ఇటువంటి యూనివర్శిటీ ఇంకేదీ ఉండదు. గాడ్ ఫాదర్ యే చెప్తున్నారు - నేను మిమ్మల్ని అమరలోకము కోసం చదివిస్తున్నాను, ఈ మృత్యులోకము సమాప్తమవ్వనున్నది. సత్యయుగములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉండేది. ఇది ఎలా స్థాపన అయ్యింది అనేది ఎవ్వరికీ తెలియదు.

బాబా ఎప్పుడూ చెప్తుంటారు - మీరు ఎక్కడైతే భాషణ చేస్తారో, అక్కడ ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని తప్పకుండా పెట్టుకోండి. ఇందులో తారీఖు కూడా తప్పకుండా వ్రాసి ఉండాలి. కొత్త విశ్వము యొక్క ప్రారంభము నుండి 1250 సంవత్సరాల వరకు ఈ వంశస్థుల రాజ్యము ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు. ఉదాహరణకు క్రిస్టియన్ వంశావళి యొక్క రాజ్యము ఉండేది అని అంటారు కదా. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ఈ దేవతా వంశావళి ఉన్నప్పుడు వేరే వంశావళి ఏదీ ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఈ వంశావళి స్థాపన అవుతోంది. మిగిలినవన్నీ వినాశనమవ్వనున్నాయి. యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. భాగవతము మొదలైనవాటిలో దీనిపై కూడా కథ వ్రాశారు. చిన్నతనములో ఈ కథలు మొదలైనవి వింటూ ఉండేవారు. ఈ రాజ్యము ఎలా స్థాపన అవుతుంది అన్న విషయము ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా తండ్రియే రాజయోగాన్ని నేర్పించారు. ఎవరైతే పాస్ అవుతారో, వారు విజయమాలలోని మణులుగా అవుతారు, ఇంకెవ్వరికీ ఈ మాల గురించి తెలియదు. దీని గురించి మీకు మాత్రమే తెలుసు. మీది ప్రవృత్తి మార్గము. పైన బాబా నిలబడి ఉన్నారు, వారికి తమదంటూ శరీరము లేదు. ఆ తర్వాత బ్రహ్మా-సరస్వతులు, వారే లక్ష్మీ-నారాయణులు. మొదట తండ్రి ఉండాలి, ఆ తర్వాత జంటపూసలు ఉండాలి. రుద్రాక్షలు ఉంటాయి కదా. నేపాల్ లో ఒక వృక్షముంది, అక్కడ నుండి ఈ రుద్రాక్షలు వస్తాయి. అందులో సత్యమైనవి కూడా ఉంటాయి. ఎంత చిన్నవిగా ఉంటాయో, అంత ఎక్కువ ధర ఉంటుంది. ఇప్పుడు మీరు దీని అర్థాన్ని తెలుసుకున్నారు. ఇది విష్ణువు యొక్క విజయమాలగా లేక రుండమాలగా అవుతుంది. వారైతే కేవలము మాలను తిప్పుతూ-తిప్పుతూ రామ-రామ అని అంటూ ఉంటారు, అర్థమేమీ తెలియదు. మాలను జపిస్తారు. ఇక్కడైతే తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఇది అజపాజపము. నోటితో ఏమీ మాట్లాడకూడదు. వాస్తవానికి పాటలు కూడా స్థూలమైనవే. పిల్లలైతే కేవలం తండ్రిని స్మృతి చేయాలి. లేకపోతే మళ్ళీ పాటలు మొదలైనవి గుర్తుకువస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయము స్మృతియే. మీరు శబ్దము నుండి అతీతముగా వెళ్ళాలి. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - మన్మనాభవ. పాటలు పాడండి, ఆర్తనాదాలు చేయండి అని తండ్రి ఏమీ చెప్పరు. నా మహిమను గాయనము చేయవలసిన అవసరము కూడా లేదు. వారు జ్ఞాన సాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు అన్న విషయము మీకు తెలుసు, మనుష్యులకు తెలియదు. ఊరికే అలా పేర్లు పెట్టేసారు. మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను ఎలా ఉన్నాను, ఆత్మ అయిన మీరు ఎలా ఉన్నారు అని తండ్రియే వచ్చి తన నామ-రూపాలు మొదలైన విషయాలను తెలియజేస్తారు! పాత్రను అభినయించేందుకు మీరు చాలా కృషి చేస్తారు. అర్ధకల్పము భక్తి చేశారు, నేనైతే అటువంటి పాత్రలోకి రాను. నేను సుఖ-దుఃఖాలకు అతీతమైనవాడిని. మీరే దుఃఖాన్ని అనుభవిస్తారు, సత్యయుగములో మళ్ళీ మీరే సుఖాన్ని అనుభవిస్తారు. మీ పాత్ర నా పాత్ర కన్నా ఉన్నతమైనది. నేనైతే అర్ధకల్పము అక్కడే వానప్రస్థములో ప్రశాంతముగా కూర్చుని ఉంటాను. మీరు నన్ను పిలుస్తూ ఉంటారు. నేను అక్కడ కూర్చుని మీ పిలుపులు వింటానని కాదు. నా పాత్ర ఈ సమయములోనే ఉంది. డ్రామా పాత్ర గురించి నాకు తెలుసు. ఇప్పుడు డ్రామా పూర్తయ్యింది, నేను వెళ్ళి పతితులను పావనముగా తయారుచేసే పాత్రను అభినయించాలి. వేరే ఏ విషయమూ లేదు. పరమాత్మ సర్వశక్తివంతుడని, అంతర్యామి అని, అందరి లోపల ఏమేమి నడుస్తుందో వారికి తెలుసు అని మనుష్యులు భావిస్తారు. తండ్రి అంటారు, అటువంటిదేమీ లేదు. మీరు ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానమైపోతారో - అప్పుడు ఏక్యురేట్ సమయానికి నేను రావలసి ఉంటుంది. నేను సాధారణ శరీరములోకే వస్తాను. నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని దుఃఖము నుండి విడిపిస్తాను. బ్రహ్మా ద్వారా ఏక ధర్మ స్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనము... హాహాకారాల తర్వాత జయజయకారాలు జరుగుతాయి. ఎన్ని హాహాకారాలు జరుగుతాయి. ఆపదలలో మరణిస్తూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు సహాయము కూడా చాలా ఉంటుంది. లేకపోతే మనుష్యులు చాలా రోగగ్రస్థులుగా, దుఃఖితులుగా అయిపోతారు. తండ్రి అంటారు, పిల్లలు అలా దుఃఖితులుగా పడి ఉండకూడదు, అందుకే ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎంత తీవ్రముగా వస్తాయంటే, అవి అందరినీ సమాప్తము చేసేస్తాయి. బాంబులు అసలేమీ కావు, ప్రకృతి వైపరీత్యాలు చాలా సహాయము చేస్తాయి. భూకంపాలలో అనేకమంది సమాప్తమైపోతారు. నీరు ఒకటి రెండు సార్లు పొంగిదంటే సమాప్తము. సముద్రము కూడా తప్పకుండా పొంగుతుంది. అది భూమిని మింగేస్తుంది, నీరు 100 అడుగుల ఎత్తుకు పొంగితే ఏమవుతుంది. ఇవి హాహాకారాల దృశ్యాలు. ఇటువంటి దృశ్యాలను చూడటానికి ధైర్యము కావాలి. కృషి కూడా చేయాలి, నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీలో అహంకారము ఏ మాత్రము ఉండకూడదు. దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహీ-అభిమానులుగా ఉండేవారు చాలా మధురముగా ఉంటారు. తండ్రి అంటారు - నేనైతే నిరాకారుడిని మరియు విచిత్రుడిని. సేవ చేయడం కోసం ఇక్కడికి వస్తాను. నన్ను ఎంతగా మహిమ చేస్తారో చూడండి. జ్ఞాన సాగరా... ఓ బాబా, అని అంటారు, మళ్ళీ పతిత ప్రపంచములోకి రండి అని పిలుస్తారు. మీరు ఆహ్వానము చాలా బాగా ఇస్తారు. స్వర్గములోకి వచ్చి సుఖాన్ని చూడండి కదా అని కూడా అనరు. ఏమంటారంటే - ఓ పతిత-పావనా, మేము పతితముగా ఉన్నాము, మమ్మల్ని పావనముగా చేయడానికి రండి. ఆహ్వానము ఎలా ఉందో చూడండి. పూర్తిగా తమోప్రధానమైన పతిత ప్రపంచములోకి మరియు పతిత శరీరములోకి పిలుస్తారు. భారతవాసులు చాలా మంచి ఆహ్వానము ఇస్తారు! డ్రామాలో రహస్యమే ఇలా ఉంది. ఇది నా అనేక జన్మల అంతిమ జన్మ అని వీరికి కూడా తెలియదు. బాబా ప్రవేశించినప్పుడు తెలియజేస్తారు. బాబా ప్రతి విషయము యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. బ్రహ్మాయే పత్నిగా అయ్యేది ఉంది. వీరు నా పత్ని అని బాబా స్వయముగా చెప్తారు. నేను వీరిలోకి ప్రవేశించి వీరి ద్వారా మిమ్మల్ని నావారిగా చేసుకుంటాను. వీరు సత్యాతి-సత్యమైన పెద్ద తల్లి మరియు వారు దత్తత తీసుకోబడిన తల్లి. తల్లి-తండ్రి అని మీరు వీరిని అనవచ్చు. శివబాబాను కేవలం తండ్రి అని మాత్రమే అంటారు. వీరు బ్రహ్మాబాబా. మమ్మా గుప్తముగా ఉన్నారు. బ్రహ్మా మనకు తల్లి, కానీ తనువు పురుషునిది. వీరు సంభాళించలేరు, అందుకే కుమార్తెను దత్తత తీసుకున్నారు. ఆమెకు మాతేశ్వరి అని పేరు పెట్టారు. ఆమె హెడ్ అయ్యారు. డ్రామానుసారముగా సరస్వతి ఒక్కరే ఉన్నారు. ఇకపోతే దుర్గ, కాళీ మొదలైన అనేక పేర్లు ఉన్నాయి. తల్లి-తండ్రి అయితే ఒక్కరే ఉంటారు కదా. మీరంతా పిల్లలు. బ్రహ్మాకు పుత్రిక సరస్వతి అని గాయనము కూడా ఉంది. మీరు బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు కదా. మీకు చాలా పేర్లు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు. చదువులో కూడా నంబరువారుగానే ఉంటారు కదా. ఒకరు మరొకరితో కలవరు. ఇక్కడ రాజధాని స్థాపనవుతోంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. దీనిని విస్తారముగా అర్థం చేసుకోవాలి. లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయి. బ్యారిస్టరీ చదువుతారు, వారిలో కూడా నంబరువారుగా ఉంటారు. కొంతమంది బ్యారిస్టర్లు అయితే 2-3 లక్షలు సంపాదిస్తారు, కొంతమందిని చూడండి, చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తారు. ఇక్కడ కూడా అలానే ఉన్నారు.

పిల్లలకు అర్థం చేయించడం జరిగింది - ఇది అంతర్జాతీయ సమస్య. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు - అందరూ నిశ్చింతగా ఉండండి, యుద్ధమైతే తప్పకుండా జరగనున్నది. కొత్త దైవీ రాజధాని మళ్ళీ స్థాపనవుతోందని మీరు దండోరా వేయిస్తారు. అనేక ధర్మాల వినాశనము జరుగుతుంది. ఇది ఎంత స్పష్టముగా ఉంది. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఈ ప్రజలు రచింపబడతారు. వీరు నా ముఖవంశావళి అని అంటారు. మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు కుఖవంశావళి బ్రాహ్మణులు. వారు పూజారులు, మీరు ఇప్పుడు పూజ్యులుగా అవుతున్నారు. మనమే పూజ్య దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మీపై లైట్ కిరీటము లేదు. మీ ఆత్మ ఎప్పుడైతే పవిత్రముగా అవుతుందో, అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తుంది. మీకు ఈ శరీరముపై లైట్ కిరీటము ఇవ్వలేరు, అది శోభించదు. ఈ సమయములో మీరు గాయన యోగ్యులుగా ఉన్నారు. ఈ సమయములో ఎవరి ఆత్మ కూడా పవిత్రముగా లేదు, అందుకే ఈ సమయములో ఎవరి పైనా కూడా లైట్ ఉండకూడదు. లైట్ సత్యయుగములో ఉంటుంది. రెండు కళలు తక్కువ ఉన్నవారికి కూడా ఈ లైట్ ను చూపించకూడదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ స్థితిని ఎంత అచలముగా మరియు నిర్భయముగా తయారుచేసుకోవాలంటే - అంతిమ వినాశన దృశ్యాన్ని చూడగలగాలి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి.

2. కొత్త రాజధానిలో ఉన్నత పదవిని పొందేందుకు చదువుపై పూర్తి ధ్యానమును ఉంచాలి. పాస్ అయి విజయమాలలోని మణులుగా అవ్వాలి.

వరదానము:-
సదా భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతిలో ఉండే సర్వ శ్రేష్ఠ భాగ్యవాన్ భవ

సంగమయుగములో చైతన్య స్వరూపములో భగవంతుడు పిల్లల సేవను చేస్తున్నారు. భక్తి మార్గములో అందరూ భగవంతుడి సేవను చేస్తారు కానీ ఇక్కడ చైతన్య మూర్తుల సేవను స్వయముగా భగవంతుడు చేస్తున్నారు. వారు అమృతవేళ లేపుతారు, భోగ్ తినిపిస్తారు, పడుకోబెడతారు. మనము పాటతో పాటు నిద్రపోతాము మరియు గౌరవముతో లేస్తాము, బ్రాహ్మణులమైన మనము ఇటువంటి ప్రియమైనవారము, సర్వ శ్రేష్ఠ భాగ్యవంతులము - ఈ భాగ్యము యొక్క సంతోషములోనే సదా ఊగుతూ ఉండండి. కేవలం బాబాకు ప్రియమైనవారిగా అవ్వండి, మాయకు కాదు. ఎవరైతే మాయకు ప్రియమైనవారిగా అవుతారో, వారు చాలా ఆకతాయితనాన్ని చూపిస్తారు.

స్లోగన్:-
తమ హర్షిత ముఖము ద్వారా సర్వ ప్రాప్తుల అనుభూతిని చేయించటము - ఇదే సత్యమైన సేవ.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

అశరీరిగా అవ్వటము అనగా శబ్దము నుండి అతీతముగా అవ్వటము. శరీరము ఉన్నట్లయితే శబ్దము ఉంటుంది. శరీరము నుండి అతీతముగా అయినట్లయితే సైలెన్స్. ఒక్క క్షణములో సేవా సంకల్పాలలోకి రావాలి మరియు ఒక్క క్షణములో సంకల్పాలకు అతీతమైన స్వరూపములో స్థితులవ్వాలి. కార్యము కోసం శారీరక భానములోకి రావాలి, మళ్ళీ క్షణములో అశరీరిగా అయిపోవాలి. ఎప్పుడైతే ఈ డ్రిల్ పక్కా అవుతుందో, అప్పుడు అన్ని పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు.