02-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18.01.20


‘‘బ్రహ్మాబాబా సమానంగా త్యాగము, తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్లను విశ్వములో వ్యాపింపజెయ్యండి’’

ఈ రోజు సమర్థులైన బాప్ దాదా తమ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. నేటి ఈ రోజు స్మృతి దివసము మరియు సమర్థ దివసము. నేటి ఈ రోజు పిల్లలకు సర్వ శక్తులను వీలునామాగా ఇచ్చిన రోజు. ప్రపంచములో అనేక రకాల వీలునామాలు ఉంటాయి, కానీ బ్రహ్మాబాబా బాబా నుండి ప్రాప్తించిన సర్వ శక్తుల వీలునామాను పిల్లలకు ఇచ్చారు. ఇటువంటి అలౌకిక వీలునామాను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా బ్రహ్మాబాబాను సాకారములో నిమిత్తము చేసారు మరియు బ్రహ్మాబాబా పిల్లలకు నిమిత్త భవ అన్న వరదానాన్ని ఇచ్చి వీలునామా చేసారు. ఈ వీలునామా పిల్లలలో సహజ శక్తులను అనుభూతి చేయిస్తుంటుంది. ఒకటేమో తమ పురుషార్థము ద్వారా ప్రాప్తించే శక్తులు మరియు ఇదేమో పరమాత్ముని వీలునామా ద్వారా శక్తులు ప్రాప్తించడము. ఇది ప్రభువు కానుక, ప్రభువు వరదానము. ఈ ప్రభు వరదానము నడిపిస్తూ ఉంటుంది. వరదానములో పురుషార్థము యొక్క శ్రమ ఉండదు, అది సహజంగా మరియు స్వతహాగా నిమిత్తులుగా చేసి నడిపిస్తూ ఉంటుంది. ఎదురుగా అయితే కొద్దిమందే ఉన్నారు కానీ బాప్ దాదా ద్వారా, విశేషంగా బ్రహ్మాబాబా ద్వారా, విశేషమైన పిల్లలకు ఈ వీలునామా ప్రాప్తించింది మరియు బాప్ దాదా ఏం చూసారంటే - ఏ పిల్లలకైతే బాబా వీలునామాను అందించారో, ఆ పిల్లలందరూ (ఆది రత్నాలు మరియు సేవకు నిమిత్తులైన పిల్లలు) ఆ ప్రాప్తించిన వీలునామాను మంచి రీతిలో కార్యంలో ఉపయోగించారు. మరియు ఈ వీలునామా కారణంగా ఈ రోజు ఈ బ్రాహ్మణ పరివారం రోజురోజుకూ వృద్ధి చెందుతూనే ఉంటుంది. పిల్లల విశేషత కారణంగా ఈ వృద్ధి జరగాల్సే ఉంది మరియు జరుగుతూనే ఉంది.

బాప్ దాదా ఏం చూసారంటే - నిమిత్తమైనవారు మరియు తోడుగా ఉన్నవారు, ఈ రెండు రకాల పిల్లలలో రెండు విశేషతలు చాలా బాగా ఉన్నాయి. మొదటి విశేషత ఏమిటంటే - స్థాపన యొక్క ఆది రత్నాలైనా లేక సేవా రత్నాలైనా కానీ, ఇరువురిలోనూ సంగఠన యొక్క ఐక్యత చాలా-చాలా బాగుంది. ఎవ్వరిలోనూ కూడా ఎందుకు, ఏమిటి, ఎలా... అనేవి సంకల్పమాత్రంగా కూడా లేవు. రెండవ విశేషత ఏమిటంటే - ఒకరు చెప్పినదానిని మరొకరు అంగీకరించారు. ఈ ఎక్స్ ట్రా శక్తుల యొక్క వీలునామా యొక్క వాయుమండలములో విశేషత ఉంది, అందుకే నిమిత్తముగా అయిన ఆత్మలందరికీ బాబా-బాబాయే కనిపిస్తూ ఉండేవారు.

బాప్ దాదా ఇటువంటి సమయములో నిమిత్తులుగా అయిన పిల్లలకు మనస్ఫూర్తిగా ప్రేమను ఇస్తున్నారు. బాబా యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది కానీ పిల్లల అద్భుతము కూడా తక్కువేమీ కాదు. అంతేకాక ఆ సమయములోని సంగఠన, ఐక్యత, మనమంతా ఒక్కటే అన్న భావన - ఇవే ఈ రోజుకు కూడా సేవను పెంచుతూ ఉన్నాయి. ఎందుకని? నిమిత్తులుగా అయిన ఆత్మల యొక్క పునాది దృఢంగా ఉంది. కనుక బాప్ దాదా కూడా ఈ రోజు పిల్లల యొక్క అద్భుతాన్ని గానం చేస్తున్నారు. పిల్లలు నలువైపుల నుండి ప్రేమ మాలలను వేసారు మరియు బాబా ఏమో పిల్లల యొక్క అద్భుతాన్ని గుణగానం చేసారు. ఇంత సమయం నడవాల్సి ఉంటుందని ఆలోచించారా? ఎంత సమయమైపోయింది? అందరి నోటి నుండి, హృదయం నుండి ఇదే వెలువడుతుంది - ఇప్పుడిక వెళ్ళాలి, ఇప్పుడిక వెళ్ళాలి... కానీ ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ జరగాల్సి ఉంది అని బాప్ దాదాకు తెలుసు. సాకారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్ ను తయారుచేసారా? బాబాకు అతి ప్రియమైన డబల్ విదేశీయులు వచ్చారా? విశేషంగా డబల్ విదేశీయులకు అవ్యక్త పాలన ద్వారా అవ్యక్త జన్మ జరగాల్సే ఉంది, ఇంతమంది పిల్లలు రావాల్సే ఉంది. అందుకే బ్రహ్మాబాబాకు తమ సాకార శరీరాన్ని కూడా వదలాల్సి వచ్చింది. మేము అవ్యక్త పాలనకు పాత్రులము అన్న నషా డబల్ విదేశీయులకు ఉందా?

బ్రహ్మాబాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషంగా నిశ్చితమై ఉంది. ఆది నుండి బ్రహ్మాబాబా యొక్క త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము నిశ్చితమై ఉంది. అన్నింటికంటే నంబరువన్ త్యాగము యొక్క ఉదాహరణగా బ్రహ్మాబాబా అయ్యారు. అన్నీ లభిస్తున్నప్పటికీ త్యాగము చెయ్యటాన్నే త్యాగము అని అంటారు. సమయము అనుసారంగా, సమస్యల అనుసారంగా చేసే త్యాగము శ్రేష్ఠ త్యాగము కాదు. మొదటి నుండీ చూడండి, తనువు, మనసు, ధనము, సంబంధాలు, సర్వ ప్రాప్తులు అన్నీ ఉన్నా కూడా త్యాగము చేసారు. శరీరాన్ని కూడా త్యాగము చేసారు, అన్ని సాధనాలు ఉన్నా కూడా స్వయమైతే పాతదానిలోనే ఉన్నారు. సాధనాలు లభించటము అప్పటికి ప్రారంభమైపోయింది. సాధనాలు ఉన్నా కూడా సాధనలో స్థిరంగా-దృఢంగా ఉన్నారు. బ్రహ్మా యొక్క ఈ తపస్య పిల్లలైన మీ అందరి భాగ్యాన్ని తయారుచేసింది. డ్రామానుసారంగా త్యాగానికి ఉదాహరణగా బ్రహ్మాబాబాయే అయ్యారు మరియు ఈ త్యాగమే బాబాకు సంకల్ప శక్తి ద్వారా సేవ చేసే విశేష పాత్రను ఇచ్చింది. కొత్త-కొత్త పిల్లలు ఈ సంకల్ప శక్తి ద్వారా ఫాస్ట్ గా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. మరి బ్రహ్మాబాబా యొక్క ఈ త్యాగము యొక్క కథను విన్నారా.

బ్రహ్మాబాబా చేసిన తపస్య యొక్క ఫలం పిల్లలైన మీకు లభిస్తూ ఉంది. తపస్య యొక్క ప్రభావము ఈ మధుబన్ భూమిలో ఇమిడి ఉంది. తోడుగా పిల్లలు కూడా ఉన్నారు, పిల్లల యొక్క తపస్య కూడా ఉంది కానీ నిమిత్తము అనైతే బ్రహ్మాబాబానే అంటారు. ఈ మధుబన్ తపస్వీ భూమికి ఎవరు వచ్చినా కానీ, బ్రాహ్మణ పిల్లలు కూడా ఏమని అనుభవం చేస్తారంటే - ఇక్కడి వాయుమండలము, ఇక్కడి వైబ్రేషన్లు సహజయోగిగా తయారుచేస్తాయి. యోగాన్ని జోడించేందుకు శ్రమ ఉండదు, సహజంగానే యోగం కుదురుతుంది మరియు ఎటువంటి ఆత్మలు వచ్చినా సరే, వారు ఏదో ఒక అనుభవం చేసుకునే వెళ్తారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోయినా కానీ అలౌకిక ప్రేమ మరియు శాంతిని అనుభవం చేసే వెళ్తారు. ఏదో ఒకటి పరివర్తన చేసుకోవాలి అన్న సంకల్పాన్ని చేసే వెళ్తారు. ఇది బ్రహ్మా మరియు బ్రాహ్మణ పిల్లల యొక్క తపస్య యొక్క ప్రభావము. దానికి తోడుగా సేవ యొక్క విధిలో కూడా రకరకాల సేవలను పిల్లల ద్వారా ప్రాక్టికల్ గా చేయించి చూపించారు. ఆ విధులనే ఇప్పుడు విస్తారములోకి తీసుకువస్తున్నారు. కావున ఎలాగైతే బ్రహ్మాబాబా యొక్క త్యాగము, తపస్య మరియు సేవ యొక్క ఫలం పిల్లలైన మీ అందరికీ లభిస్తూ ఉందో, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ తమ త్యాగము, తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్లను విశ్వములో వ్యాపింపజేయాలి. ఏ విధంగా సైన్స్ బలము తన ప్రభావాన్ని ప్రత్యక్ష రూపములో చూపిస్తూ ఉందో, అలా సైన్స్ కు కూడా రచయిత సైలెన్స్ బలము. సైలెన్స్ బలాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించే సమయము ఇది. సైలెన్స్ బలము యొక్క వైబ్రేషన్లను తీవ్రగతితో వ్యాపింపజేసేందుకు సాధనము మనస్సు-బుద్ధి యొక్క ఏకాగ్రత. ఈ ఏకాగ్రతా అభ్యాసము పెరగాలి. ఏకాగ్రతా శక్తుల ద్వారానే వాయుమండలాన్ని తయారుచెయ్యగలరు. అలజడి కారణంగా శక్తిశాలీ వైబ్రేషన్లు తయారవ్వలేకపోతున్నాయి.

ఏకాగ్రతా శక్తి ఇప్పుడు ఎక్కువగా కావాలి అన్నదానిని బాప్ దాదా ఈ రోజు చూస్తున్నారు. పిల్లలందరికీ ఒకటే దృఢ సంకల్పము ఉండాలి, అదేమిటంటే - ఇప్పుడు మా సోదరీ-సోదరుల దుఃఖపు పరిస్థితులు పరివర్తన అయిపోవాలి. మనసు నుండి దయ ఇమర్జ్ అవ్వాలి. సైన్స్ శక్తి అలజడిని కలిగించగలుగుతున్నప్పుడు మరి ఇంతమంది బ్రాహ్మణుల యొక్క సైలెన్స్ శక్తి - దయాహృదయ భావన ద్వారా మరియు సంకల్పము ద్వారా అలజడిని పరివర్తన చెయ్యలేదా! చెయ్యాల్సిందే, జరగాల్సిందే అన్నప్పుడు మరి ఈ విషయముపై విశేష అటెన్షన్ పెట్టండి. మీరు గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క పిల్లలు, వీరందరూ మీ వంశము వారే, మీ శాఖలే, మీ పరివారమే, మీరే భక్తులకు ఇష్ట దేవతలు. మేమే ఇష్ట దేవతలము అన్న ఈ నషా ఉందా? మరి భక్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు, మీరు వింటున్నారు! ఓ ఇష్ట దేవతలారా అని వారు పిలుస్తున్నారు, మరి మీరు కేవలం వింటున్నారా, అంతేనా, వారికి జవాబు ఇవ్వటం లేదా? అందుకే బాప్ దాదా అంటారు - భక్తుల యొక్క ఓ ఇష్ట దేవతలారా, ఇప్పుడు వారి పిలుపును వినండి, వారికి జవాబునివ్వండి, కేవలం విని ఊరుకోకండి. ఏం జవాబు ఇస్తారు? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారుచెయ్యండి. మీ జవాబు వారికి లభించకపోతే వారు కూడా నిర్లక్ష్యులైపోతారు. బాధతో ఆర్తనాదాలు చేస్తారు, ఇక తర్వాత మౌనంగా ఉండిపోతారు.

బ్రహ్మాబాబాకు ప్రతి కార్యంలో ఉన్న ఉత్సాహాన్ని అయితే చూసారు కదా. తాళంచెవి కావాలి అని మొదట్లో ఉత్సాహం ఉండేది. ఇప్పుడు కూడా బ్రహ్మాబాబా శివబాబాను ఇదే అడుగుతున్నారు - ఇప్పుడు ఇంటి తలుపును తెరిచే తాళంచెవిని ఇవ్వండి అని. కానీ తోడుగా వెళ్ళేవారు కూడా సిద్ధముగా ఉండాలి కదా. ఒక్కరే వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు! మరి ఇప్పుడు కలిసే వెళ్ళాలా లేక వెనక-వెనుక వెళ్ళాలా? కలిసే వెళ్ళాలి కదా? బ్రహ్మాబాబా అంటున్నారు - పిల్లలను అడగండి, ఒకవేళ బాబా తాళంచెవిని ఇచ్చినట్లయితే మీరు ఎవర్రెడీగా ఉన్నారా? ఎవర్రెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా? రెడీగా కాదు, ఎవర్రెడీగా ఉండాలి. త్యాగము, తపస్య, సేవ - ఈ మూడు పరీక్షలకు తయారైపోయారా? బ్రహ్మాబాబా నవ్వుతారు, ప్రేమతో చాలా అశ్రువులు కారుస్తారు మరియు బ్రహ్మాబాబా ఆ అశ్రువులను ముత్యాల సమానంగా తమ మనస్సులో దాచుకుంటారు కూడా, కానీ ఒక సంకల్పమైతే తప్పకుండా నడుస్తుంది - అందరూ ఎవర్రెడీగా ఎప్పుడు అవుతారు! డేట్ ఇవ్వండి. మేమైతే ఎవర్రెడీగా ఉన్నాము అని మీరు అంటారు కానీ మీ సహచరులు ఎవరైతే ఉన్నారో, వారిని కూడా తయారుచెయ్యండి, లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా? మరి బ్రహ్మాబాబా కూడా వెళ్ళిపోయారు కదా అని మీరు అంటారు కానీ వారికైతే ఈ రచనను రచించాల్సి ఉంది. ఫాస్ట్ గా వృద్ధిని చేసే బాధ్యత ఉంది. మరి అందరూ ఎవర్రెడీనేనా, ఒక్కరే కాదు. అందరినీ తోడుగా తీసుకువెళ్ళాలి కదా, లేక ఒక్కొక్కరూ ఒంటరిగా వెళ్తారా? మరి అందరూ ఎవర్రెడీగా ఉన్నారా లేక అలా అవుతారా? చెప్పండి. తక్కువలో తక్కువ 9 లక్షల మందైతే తోడుగా వెళ్ళాలి. లేదంటే రాజ్యం ఎవరిపై చేస్తారు? మీపై మీరే రాజ్యం చేస్తారా? కనుక బ్రహ్మాబాబాకు పిల్లలందరి పట్ల ఏ శుభ కామన ఉందంటే - ఎవర్రెడీగా అవ్వండి మరియు ఎవర్రెడీగా తయారుచెయ్యండి.

ఈ రోజు వతనములో కూడా విశేషంగా అందరు ఆది రత్నాలు మరియు సేవ యొక్క ఆది రత్నాలు ఇమర్జ్ అయ్యారు. మేమైతే సిద్ధముగా ఉన్నాము అని అడ్వాన్స్ పార్టీ వారు అంటున్నారు. ఏ విషయం కోసం సిద్ధముగా ఉన్నారు? వారు ఏమంటున్నారంటే - వీళ్ళు ప్రత్యక్షతా నగారాను మ్రోగించినట్లయితే మేమందరమూ ప్రత్యక్షమై కొత్త సృష్టి యొక్క రచనకు నిమిత్తులుగా అవుతాము. కొత్త సృష్టిని రచించేవారు రావాలి అని మేమైతే ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు పని అంతా మీపైనే ఆధారపడి ఉంది. నగారాను మ్రోగించండి. వచ్చేసారు, వచ్చేసారు... అన్న నగారాను మ్రోగించండి. నగారాను మ్రోగించడం వచ్చా? మ్రోగించాల్సిందే కదా! ఇప్పుడు బ్రహ్మాబాబా అంటున్నారు - డేట్ ను తీసుకురండి. డేట్ ఫిక్స్ చేయకపోతే పని జరగదు అని మీరు కూడా అంటూ ఉంటారు కదా. మరి దీనికి కూడా డేట్ ను ఫిక్స్ చేయండి. డేట్ ను ఫిక్స్ చేయగలరా? మీరు ఫిక్స్ చేయండి అని బాబా అంటారు. బాబా అంటారు - ఈ రోజే ఫిక్స్ చేయండి. కాన్ఫరెన్స్ డేట్ ను ఫిక్స్ చేసారు కదా, అలాగే దీని గురించి కూడా కాన్ఫరెన్స్ చెయ్యండి కదా! విదేశీయులు ఏమనుకుంటున్నారు, డేట్ ఫిక్స్ చేయగలరా? డేట్ ను ఫిక్స్ చేస్తారా? చేస్తారా, చెయ్యరా! అచ్ఛా, జానకి దాదీ నుండి సలహా తీసుకుని చెయ్యండి. అచ్ఛా.

దేశ-విదేశాలలో నలువైపుల ఉన్న బాప్ దాదాకు అతి సమీపమైనవారికి, అతి ప్రియమైనవారికి మరియు అతీతమైనవారికి, పిల్లలందరూ లగనములో నిమగ్నమై లవలీన స్వరూపములో కూర్చున్నారు, వింటున్నారు మరియు మిలనము యొక్క ఊయలలో ఊగుతున్నారు అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు. దూరంగానూ లేరు, నయనాల ఎదురుగానూ లేరు, నయనాలలో ఇమిడి ఉన్నారు. సమ్ముఖంగా మిలనాన్ని జరుపుకునే ఇటువంటి పిల్లలకు మరియు అవ్యక్త రూపములో లవలీనులైన పిల్లలకు, సదా బాబా సమానంగా త్యాగము, తపస్య మరియు సేవల యొక్క ఋజువును చూపించే సుపుత్రులైన పిల్లలకు, సదా ఏకాగ్రతా శక్తి ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులైన పిల్లలకు, సదా బాబా సమానంగా తీవ్ర పురుషార్థము ద్వారా ఎగిరే డబల్ లైట్ పిల్లలకు బాప్ దాదా యొక్క చాలా చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.

రాజస్థాన్ సేవాధారులతో:- రాజస్థాన్ వారికి చాలా మంచి సేవా అవకాశము లభించింది. రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా రాజస్థాన్ నుండి రాజా క్వాలిటీ వారిని తయారుచెయ్యండి. ప్రజలు కాదు, రాజ్య వంశానికి చెందిన రాజులను తయారుచెయ్యండి. అప్పుడు రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా, పేరుకు తగిన సేవా క్వాలిటీ వెలువడుతుంది. దాగి ఉన్న అలాంటి రాజులు ఎవరైనా ఉన్నారా లేక ఇప్పుడింకా మబ్బులలో దాగి ఉన్నారా? అటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, వారి సేవ పట్ల విశేష అటెన్షన్ పెట్టండి. ఈ మంత్రులు మరియు సెక్రటరీలు అయితే మారుతూనే ఉంటారు. కానీ వ్యాపారవేత్తలు బాబా కంటే కూడా వ్యాపారం చెయ్యటంలో ముందుకు వెళ్ళగలరు. అంతేకాక, వ్యాపారవేత్తల సేవ చెయ్యటం ద్వారా వారి పరివారములోని మాతలు కూడా సహజంగా రాగలరు. మాతలు ఒంటరిగా నడవలేరు కానీ ఒకవేళ ఇంటి యొక్క స్తంభము వచ్చారంటే పరివారము దానంతటదే నెమ్మది-నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది, అందుకే రాజస్థాన్ వారు రాజా క్వాలిటీ వారిని తయారుచెయ్యాలి. అటువంటివారు ఎవ్వరూ లేరు అని అనకండి. ఉంటారు కాకపోతే కాస్త వెతకాల్సి ఉంటుంది. వారి వెనుక కాస్త సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వారు బిజీగా ఉంటారు కదా! వారు సమీపంగా వచ్చే అటువంటి విధిని ఏదైనా తయారుచెయ్యవలసి ఉంటుంది. ఇకపోతే అంతా మంచిగా ఉంది, సేవా అవకాశాన్ని తీసుకున్నారు, ప్రతి జోన్ అవకాశాన్ని తీసుకుంటుంది, సమీపంగా వచ్చేందుకు మరియు ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఇది చాలా మంచి సాధనము. మిమ్మల్ని అందరూ చూసినా, చూడకపోయినా కానీ, తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా కానీ, ఎంత మంచి సేవ జరుగుతుందంటే అందరి నుండి ఆశీర్వాదాలు స్వతహాగానే వెలువడుతాయి మరియు ఆ ఆశీర్వాదాలు చాలా త్వరగా చేరుకుంటాయి. మనసు నుండి వెలువడే ఆశీర్వాదాలు కదా! అందుకే మనసుకు త్వరగా చేరుకుంటాయి. బాప్ దాదా ఏమంటారంటే - అన్నిటికంటే సహజ పురుషార్థము - ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఆశీర్వాదాలతో ఖాతా ఎప్పుడైతే నిండుగా అవుతుందో, అప్పుడు ఆ నిండుగా ఉన్న ఖాతాను మాయ కూడా డిస్టర్బ్ చెయ్యదు. జమ చేసుకున్న బలము లభిస్తుంది. సంతుష్టంగా ఉండండి మరియు అందరినీ సంతుష్టపరచండి. ప్రతి ఒక్కరి స్వభావము యొక్క రహస్యాన్ని తెలుసుకుని సంతుష్టపరచండి. వీరైతే అసంతుష్టంగానే ఉంటారు అని అనకండి. మీరు స్వయం రహస్యాన్ని తెలుసుకోండి, వారి నాడిని తెలుసుకోండి, ఆ తరువాత ఆశీర్వాదమనే ఔషధాన్ని ఇవ్వండి, అప్పుడు సహజమైపోతుంది. రాజస్థాన్ వారు, సరేనా! రాజస్థాన్ టీచర్లు లేవండి. సేవకు అభినందనలు. సహజ పురుషార్థము చెయ్యండి, ఆశీర్వాదాలను ఇస్తూ వెళ్ళండి. తీసుకోవాలి అన్న సంకల్పాన్ని చెయ్యకండి, ఇస్తూ ఉన్నట్లయితే లభిస్తూ ఉంటాయి. ఇవ్వటమే తీసుకోవటము. సరేనా! అంతే కదా! దాత పిల్లలు కదా! ఎవరైనా ఇస్తే ఇవ్వటము... ఇలా ఉండకూడదు, దాతగా అయ్యి ఇస్తూ వెళ్ళినట్లయితే వాటంతటవే లభిస్తాయి. అచ్ఛా!

ఎవరైతే ఈ కల్పములో మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. సగంమంది ముందు వచ్చినవారు వస్తారు, సగంమంది కొత్తవారు వస్తారు. అచ్ఛా - వెనుక ఉన్నవారు, పక్క వైపుల కూర్చొన్నవారు, అందరూ సహజయోగీలేనా? సహజయోగీలైనట్లయితే ఒక చేతిని ఎత్తండి. అచ్ఛా!

వీడ్కోలు సమయంలో:- (బాప్ దాదాకు రథయాత్రల సమాచారాన్ని వినిపించారు) నలువైపులా జరుగుతున్న యాత్రల సమాచారము ఎప్పటికప్పుడు బాప్ దాదా వద్దకు వస్తూ ఉంటుంది. అచ్ఛా, అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో సేవా పాత్రను అభినయిస్తున్నారు. భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి మరియు ఏ భక్తుల భక్తి అయితే పూర్తయిందో, వారికి బాబా పరిచయము లభిస్తుంది మరియు ఆ పరిచయము అందినవారి నుండి ఎవరైతే పిల్లలుగా తయారయ్యేది ఉందో, వారు కూడా కనిపిస్తుంటారు. ఇకపోతే, సేవ చాలా బాగా జరుగుతూ ఉంది మరియు సాధనాలను ఏవైతే తయారుచేసారో ఆ సాధనాలు అందరినీ చాలా బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రిజల్టులో ఎవరెవరు ఏయే కేటగిరీలో వెలువడుతారు అనేది కూడా తెలిసిపోతుంది కానీ భక్తులకు కూడా మీ అందరి నుండి దృష్టి లభించింది, పరిచయము లభించింది - ఇది కూడా మంచి సాధనము. ఇప్పుడు ముందుకు వెళ్ళి వారి సేవను చేసి వారిని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఎవరెవరైతే రథయాత్రలో సేవ చేస్తున్నారో, వారు అలసిపోనివారిగా అయి సేవ చేస్తున్నారు, వారందరికీ ప్రియస్మృతులు. బాప్ దాదా అందరినీ చూస్తుంటారు మరియు సఫలత అయితే జన్మసిద్ధ అధికారము. అచ్ఛా!

మారిషస్ లో మన ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి నేషనల్ యూనిటీ అవార్డు ప్రైమ్ మినిస్టర్ ద్వారా లభించింది:- మారిషస్ లో మామూలుగా కూడా వి.ఐ.పి.ల.తో మంచి కనెక్షన్ ఉంది మరియు ప్రభావము కూడా మంచిగా ఉంది, అందుకే గుప్త సేవ యొక్క ఫలము లభించి, అందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. అచ్ఛా, ఓం శాంతి.

వరదానము:-

శ్వాస శ్వాసలోనూ స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్సు ద్వారా బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలను) ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్నచిత్త భవ

ఏ విధంగా స్మృతి యొక్క లింక్ సదా జోడించబడి ఉండాలని అటెన్షన్ పెడతారో, అదే విధంగా సేవలో కూడా సదా లింక్ జోడించబడి ఉండాలి. శ్వాస శ్వాసలోనూ స్మృతి మరియు శ్వాస శ్వాసలోనూ సేవ ఉండాలి - దీనినే బ్యాలెన్స్ అని అంటారు, ఈ బ్యాలెన్స్ ద్వారా సదా ఆశీర్వాదాలను అనుభవం చేస్తూ ఉంటారు మరియు ఆశీర్వాదాలతో పాలింపబడుతున్నాము అన్న ఈ మాటే మనసు నుండి వెలువడుతుంది. శ్రమ నుండి, యుద్ధము నుండి విముక్తులవుతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అన్న ప్రశ్నల నుండి ముక్తులుగా అయి సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. అప్పుడు సఫలత జన్మ సిద్ధ అధికారము రూపములో అనుభవమవుతుంది.

స్లోగన్:-

తండ్రి నుండి బహుమతిని తీసుకోవాలంటే స్వయము నుండి మరియు సహచరుల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికేట్ మీతో పాటు ఉండాలి.