02-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు వికారాలను దానమిచ్చినట్లయితే
రాహు గ్రహణము తొలగిపోతుంది, దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది’’
ప్రశ్న:-
వృక్షపతి అయిన
తండ్రి తమ భారతవాసీ పిల్లలపై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు ఏ స్మృతిని
ఇప్పిస్తున్నారు?
జవాబు:-
ఓ భారతవాసీ
పిల్లలూ, మీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అతి శ్రేష్ఠమైనదిగా ఉండేది. మీరు సర్వగుణ
సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. సాగరుడినైన నా పిల్లలైన మీరు కామ చితిపై
కూర్చుని నల్లగా అయిపోయారు, మీకు గ్రహణము పట్టింది. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ
సుందరముగా తయారుచేయడానికి వచ్చాను, ఈ స్మృతి కలగడముతో బృహస్పతి దశ కూర్చుంటుంది.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
బాప
ఇందులో ఎవరి మహిమను విన్నారు? అనంతమైన తండ్రిది. ఉన్నతోన్నతమైన తండ్రి పరమపిత
పరమాత్మయే. లౌకిక తండ్రి గురించైతే ఇలా ఎవరూ చెప్పరు. ఆత్మలందరి పారలౌకిక తండ్రి
ఉన్నతోన్నతమైనవారని పిల్లలకు తెలుసు. వారి పేరే శివ. నామ-రూపాలు లేని వస్తువంటూ ఏదీ
ఉండదు. ఈ సమయములో అందరికీ రాహు గ్రహణము పట్టి ఉంది, అందుకే దీనిని ఇనుప యుగపు
ప్రపంచమని అంటారు. దశలు కూడా ఉంటాయి. బృహస్పతి దశ, శుక్ర దశ... ఇప్పుడు మీపై
బృహస్పతి దశ ఉంది. శివబాబా ఉన్నతోన్నతమైన భగవంతుడు, వారి మహిమను విన్నారు. వారి అసలు
పేరు శివ. ఇకపోతే, అనేక రకాల పేర్లు పెట్టేసారు. అసలు పేరు శివబాబా. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, నేను బీజరూపుడిని, చైతన్యుడిని. వారిని సత్యమైనవారు, చైతన్యమైనవారు
అని అంటారు, అలాగే వారిని సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు అని కూడా అంటారు.
మహిమ అంతా ఆ ఒక్కరిదే. భారతవాసులు మహిమను పాడుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు.
పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. రాతిబుద్ధి కలవారిగా ఎవరు తయారుచేసారు?
రావణుడు తయారుచేసాడు. సత్యయుగములో భారతవాసులు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. నేటికి
5 వేల సంవత్సరాల క్రితం, ఈ భారత్ పారసపురిగా ఉండేది, అందులో దేవీ-దేవతలు ఉండేవారు.
భారత్ యే అవినాశీ ఖండముగా గాయనము చేయబడింది. భారత్ లోనే పారసబుద్ధి గల దేవతలు
ఉండేవారు, ఈ సమయములో రాతిబుద్ధి గల పతితులు ఉన్నారు. పతితులుగా ఎలా అవుతారు, ఇది
కూడా తండ్రి అర్థం చేయించారు. ద్వాపరము నుండి కామ చితిపై కూర్చున్నప్పటి నుండి
నల్లగా అయిపోతారు. కామాగ్నిలో అందరూ భస్మమైపోయారు. అందులో కూడా విశేషముగా ఇది భారత్
కు చెందిన విషయము. భారత్ లో పారసబుద్ధి గల దేవతల రాజ్యము ఉండేది. దానిని విష్ణుపురి,
రామ రాజ్యము అని కూడా అనేవారు. ఈ విషయాన్ని తండ్రి వచ్చి తెలియజేస్తారు. మధురాతి
మధురమైన ప్రియమైన పిల్లలూ, మీరు సత్యయుగములో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నులుగా
ఉండేవారు. ఇది మీ మహిమ. అక్కడ వికారాలు ఉండవు. ద్వాపరము నుండి రావణుడి 5 వికారాల
రాజ్యము ప్రారంభమయ్యింది. అప్పుడు రామ రాజ్యము మారి రావణ రాజ్యముగా అవుతుంది.
ఇప్పుడు గ్రహణము పట్టి ఉంది. భారత్ పూర్తిగా నల్లగా అయిపోయింది. బృహస్పతి దశ
అన్నింటికంటే బాగుంటుంది. భారత్ పై బృహస్పతి దశ సత్యయుగములో ఉండేది, తర్వాత త్రేతాలో
శుక్ర దశ వస్తుంది, అప్పుడు 2 కళలు తగ్గిపోయాయి. దానిని వెండి యుగము అని అంటారు.
తర్వాత ద్వాపర, కలియుగాలు వచ్చాయి. మెట్లు దిగుతూ వచ్చారు, శని దశ ఏర్పడింది. ఈ
సమయములో అందరిపై రాహు దశ ఉంది. సూర్యునికి గ్రహణము పట్టినప్పుడు, దానమిస్తే గ్రహణము
తొలగిపోతుందని అంటారు.
ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇది ఆత్మిక జ్ఞానము. ఇది
శాస్త్రాల జ్ఞానమేమీ కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గమని అంటారు. సత్య,
త్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము మరియు భక్తి, తర్వాత వైరాగ్యము అనగా ఈ పాత
ప్రపంచాన్ని వదలాల్సి ఉంటుంది. ఇది శూద్ర వర్ణము. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య,
శూద్ర వర్ణాలను విరాట రూపములో చూపిస్తారు. ఇది భారత్ యొక్క కథనే. విరాట రూపాన్ని
తయారుచేస్తారు కూడా, కానీ రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు. రాతిబుద్ధి ఎందుకుంది?
ఎందుకంటే పతితముగా ఉన్నారు. భారతవాసులే పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, సంపూర్ణ
నిర్వికారులుగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం, భారత్ స్వర్గముగా ఉండేది,
ఇంకే ఖండమూ ఉండేది కాదు. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. ఈ రాజయోగాన్ని ఎవరు
నేర్పిస్తారు? శివాచార్యుడు. వారు జ్ఞానసాగరుడు. మనుష్యులెవ్వరినీ జ్ఞాన సాగరుడు,
సర్వుల పతిత-పావనుడు అని అనలేరు. సర్వుల ముక్తిప్రదాత ఒక్క తండ్రి మాత్రమే. దుఃఖము
సమయములో రావణుడి నుండి విముక్తులుగా చేయడానికి తండ్రి స్వయమే వస్తారు, తర్వాత వారు
గైడ్ గా అయ్యి తీసుకువెళ్తారు. వారిని ఆత్మిక పండా అని అంటారు. తండ్రి అంటారు - నేను
ఆత్మలైన మీ అందరికీ పండాను, అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. నా వంటి గైడ్ ఇంకెవ్వరూ
ఉండరు. గాడ్ ఫాదర్ యే ముక్తిప్రదాత, గైడ్, ఆనంద స్వరూపుడు... అని అంటారు కూడా. వారు
అందరిపైన దయ చూపిస్తారు, ఎందుకంటే సాగరుని పిల్లలందరూ కామచితిపై కూర్చుని కాలిపోయి
మరణించారు. అందులో కూడా విశేషముగా ఇది భారత్ కు సంబంధించిన విషయము. తండ్రి అంటారు -
మీరు 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు కామచితిపై
కూర్చుని మీరు ఎలా తయారయ్యారు! ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వృక్షపతి అయిన తండ్రి
వచ్చి మనుష్యమాత్రులపై బృహస్పతి దశను కూర్చోబెడతారు. పూర్తి విశ్వముపై, ముఖ్యముగా
భారత్ పై ఈ సమయములో రాహు గ్రహణము పట్టి ఉంది. తండ్రి అంటారు - నేనే వచ్చి పూర్తి
ప్రపంచానికి, ముఖ్యముగా భారత్ కు గతి, సద్గతులను ఇస్తాను. మీరు ఇక్కడకు పారసబుద్ధి
కలవారిగా అయ్యేందుకే వచ్చారు. వారు అత్యంత ప్రియమైన తండ్రి. ప్రేయసులందరి ప్రియుడు
ఒక్కరే. అన్ని దేశాలలో లింగాన్ని తప్పకుండా తయారుచేస్తారు, ఎందుకంటే వారు అందరికీ
తండ్రి కదా. శివుని మందిరాలు భారత్ లో చాలా ఉన్నాయి, వాటిని శివాలయాలు అని అంటారు,
అనగా వారు నివసించే స్థానము. సత్యయుగములో దేవీ-దేవతా ధర్మానికి చెందిన మనుష్యులు
ఉన్నారు, కానీ ఆ ధర్మము ఎప్పుడుండేది, వారి రాజ్యము ఎప్పుడుండేది... అనేది తెలియదు.
సత్యయుగము ఆయువును ఎక్కువగా వ్రాసేసారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మీపై
ఇప్పుడు 21 జన్మల కోసం బృహస్పతి దశ కూర్చుంటుంది. వృక్షపతియే జ్ఞాన సాగరుడు,
పతిత-పావనుడు, వారిని అందరూ పిలుస్తారు. నీవే తల్లివి, తండ్రివి, మేము నీ పిల్లలము
అని అందరూ వారి మహిమను చేస్తారు. తప్పకుండా సత్య, త్రేతాయుగాలలో అపారమైన సుఖము
ఉండేది. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత అన్నప్పుడు, తప్పకుండా మనము కూడా
స్వర్గములోనే ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు,
ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము భారత్ కు చెందినదే.
క్రిస్టియన్ ధర్మానికి చెందినవారు ఆ క్రిస్టియన్ ధర్మములోనే కొనసాగుతూ వస్తారు. మీరు
దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, మరి దేవీ-దేవతా ధర్మానికి చెందిన మీరు
మీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోయారు అని తండ్రి అంటారు!
తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - మీ ధర్మము, కర్మలు అందరికన్నా శ్రేష్ఠముగా ఉండేవి.
ఇప్పుడు మీరు నీచులుగా, పాపులుగా, నిరుపేదలుగా అయిపోయారు. మీరు దేవతల పూజారులు
అన్నప్పుడు మరి స్వయాన్ని హిందువులుగా ఎందుకు చెప్పుకుంటున్నారు? భారత్ కు ఎలాంటి
పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే దేవతా ధర్మానికి చెందినవారో, వారు వికారులుగా అయిన
కారణముగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోరు. తండ్రి అంటారు - ఇప్పుడిది ఈ పతిత ప్రపంచము
యొక్క అంతిమము, మహాభారత యుద్ధము కూడా నిలబడి ఉంది. భగవానువాచ - నేను మీకు సత్యయుగము
కోసం రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడైతే ఒక్కరే, వారి పిల్లలమైన మనము
సాలిగ్రామాలము. తండ్రి అంటారు - పూజ్యులుగా ఉన్న మీరే పూజారులుగా, భక్తులుగా అయ్యారు.
ఇప్పుడు మళ్ళీ పూజ్య దేవతలుగా అయ్యేందుకని జ్ఞానము తీసుకుంటారు. మళ్ళీ ద్వాపరము
నుండి పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు.
ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, వారే వచ్చి బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు.
బ్రహ్మా ద్వారా ఆది సనాతన ధర్మము యొక్క స్థాపన జరుగుతుందని కూడా గాయనము చేయబడింది.
ప్రజాపిత ఉన్నప్పుడు, మరి చాలామంది పిల్లలు కూడా ఉంటారు. వారైతే తప్పకుండా ఇక్కడే
ఉండాలి. ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. తండ్రి
వచ్చి శూద్రులను మార్చి, బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగమయుగములోనే ఆది
సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇది కళ్యాణకారీ సంగమయుగము. ఈ యుద్ధాన్నే
కళ్యాణకారీ యుద్ధమని అంటారు. ఈ వినాశనము తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.
మీరు ఇక్కడకు స్వర్గవాసులుగా అయ్యేందుకు మరియు విష్ణుపురిలోకి వెళ్ళేందుకు వచ్చారు.
పిల్లలైన మీపై ఇప్పుడు అవినాశీ బృహస్పతి దశ ఉంది. 16 కళల సంపూర్ణులు అని అంటారు,
తర్వాత 2 కళలు తగ్గిపోతాయి, అప్పుడు శుక్ర దశ అని అంటారు. సత్యయుగములో బృహస్పతి దశ
ఉంటుంది, తర్వాత త్రేతాలో శుక్ర దశ ఉంటుంది, తర్వాత కిందకు పడిపోతూ వచ్చారు. మంగళ
దశ, శని దశ, రాహు దశ కూడా ఉంటాయి. జన్మజన్మలుగా తప్పుడు దశలు ఏర్పడుతూ వచ్చాయి.
ఇప్పుడు తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చుని ఉంది. ఈ అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడు,
పతిత-పావనుడు. వారే మీకు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా.
మిగిలినవారంతా అసత్యమైనవారు, వాళ్ళు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. దీనిని వికారీ
ప్రపంచమని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడు వికారీ ప్రపంచములో అందరూ చాలా
దుఃఖితులుగా ఉన్నారు. యుద్ధాలు, గొడవలు ఏమేమో జరుగుతున్నాయి. దీనినే అనవసర రక్తపాతము...
అని అంటారు. ఏ తప్పు లేకపోయినా కూడా, ఏమేమో చేస్తూ ఉంటారు. ఒకే ఒక్క బాంబును
వేస్తారు, అది ఎటువంటిదంటే, ఒక్కదానితో అంతా వెంటనే సమాప్తమైపోతుంది. ఇది అదే
సంగమయుగ సమయము. దేవతలైన మీ కోసం, మళ్ళీ కొత్త ప్రపంచము కావాలి. ఇప్పుడు తండ్రి
అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మన్మనాభవ. ఇలా ఏ తండ్రి చెప్పారు? శివబాబా. వారు
నిరాకారుడు. వాస్తవానికి మీరు కూడా నిరాకారియే. కానీ మీరు పునర్జన్మలలోకి వస్తారు,
నేను రాను. ఈ సమయములో అందరూ పతితముగా ఉన్నారు, ఒక్కరు కూడా పావనమైనవారు లేరు.
పతితముగా అవ్వాల్సిందే. సతో, రజో, తమోలలోకి దిగవలసి ఉంటుంది. ఈ సమయములో మొత్తం
వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ప్రపంచము పూర్తిగా పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ
దీనిని కొత్తదిగా తయారుచేయవలసి ఉంటుంది. పతిత ప్రపంచములో ఎంతమంది మనుష్యులు ఉన్నారో
చూడండి. పావన ప్రపంచములో చాలా కొద్దిమంది రాజ్యము చేస్తారు. అక్కడ ఒకే ధర్మముండేది,
ఇంకే ధర్మము ఉండేది కాదు. భారత్ నే హెవెన్ అని అంటారు. ఒక్క సెకండులో సూర్యుడే
చంద్రునిగా మారుతాడు... అని అంటూ ఉంటారు. సత్యయుగములో 9 లక్షల మంది ఉంటారు, తర్వాత
వృద్ధి జరుగుతుంది. ముందు పుష్పాల వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత
పెద్ద ముళ్ళ అడవిగా ఉంది. ఢిల్లీలో మొఘల్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి. దాని కంటే
పెద్ద గార్డెన్ ఏదీ లేదు. అడవి ఎంత పెద్దదిగా ఉంటుందో చూడండి. సత్యయుగపు పుష్పాల
తోట కూడా చాలా చిన్నది. తర్వాత వృద్ధి చెందుతూ-చెందుతూ పెద్దదవుతూ ఉంటుంది.
ఇప్పుడైతే ముళ్ళ అడవిగా అయిపోయింది. రావణుడు రావడముతో ముళ్ళుగా అయిపోతారు. ఇది
ముళ్ళ అడవి. పరస్పరములో కొట్లాడుకుంటూ ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. ఎంత
క్రోధముంది, కోతి కన్నా కూడా నీచమైనవారని అంటారు. తండ్రి అంటారు - నా ప్రియమైన
పిల్లలూ, మీపై ఇప్పుడు వృక్షపతి దశ ఉంది. ఇప్పుడు దానము ఇచ్చినట్లయితే గ్రహణము
తొలగిపోతుంది. సంపూర్ణ నిర్వికారులుగా ఇప్పుడు ఇక్కడే అవ్వాలి. తర్వాత ఈ శరీరాన్ని
వదిలి వెళ్ళి శివాలయములోకి వస్తారు. శివాలయములో చాలా సుఖము ఉంటుంది. దేవీ-దేవతల
రాజ్యము ఉంటుంది. సత్యయుగాన్ని శివాలయమని అంటారు, కలియుగాన్ని వేశ్యాలయమని అంటారు.
ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపన చేసాడు. ఇప్పుడు తండ్రి అంటారు - పతితము నుండి
పావనముగా అవ్వాలి, ఎలా అవుతారు? త్రివేణిలో, గంగలో స్నానము చేయడముతో పావనముగా
అవుతారా? ఇలా అయితే జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. కోట్లాదిమంది మనుష్యులు వెళ్ళి
స్నానాలు చేస్తారు. చాలా నదులు, కాలువలు, చెరువులు మొదలైనవి ఉన్నాయి, ఎక్కడ నీటిని
చూస్తే అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు ఎందుకంటే తమను తాము పతితులుగా భావిస్తారు.
ఇప్పుడు పారసనాథుడు మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా చేస్తున్నారు. మరి ఇటువంటి
పారసనాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ ముళ్ళ ప్రపంచము నుండి పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు, ఏవైతే ముళ్ళు (వికారాలు)
ఉన్నాయో, వాటిని తొలగించుకోవాలి. పారసముగా తయారుచేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి
చేయాలి.
2. ఈ కళ్యాణకారీ సంగమయుగములో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, తర్వాత దేవతలుగా అయ్యే
పురుషార్థము చేయాలి. రాహు గ్రహణాన్ని తొలగించుకునేందుకు వికారాలను దానము చేయాలి.
వరదానము:-
సంగమయుగములో ప్రతి కర్మను కళ రూపములో చేసే 16 కళల సంపన్న భవ
సంగమయుగము విశేషముగా కర్మ రూపీ కళను చూపించే యుగము. ఎవరి
ప్రతి కర్మ కళ రూపములో ఉంటుందో, వారి ప్రతి కర్మకు మరియు గుణానికి గాయనము జరుగుతుంది.
16 కళల సంపన్నులు అనగా ప్రతి నడవడిక సంపూర్ణ కళా రూపముగా కనిపించాలి, ఇదే సంపూర్ణ
స్థితికి గుర్తు. సాకార బాబా యొక్క మాటలు, నడక... అన్నింటిలోనూ విశేషతను చూసారు కదా,
అది కళగా ఉండేది కదా. లేవడములోనూ, కూర్చోవడములోనూ, చూడడములోనూ, నడవడములోనూ,
అన్నింటిలోనూ కళ ఉండేది, అన్నింటిలోనూ అతీతమైన స్థితి మరియు విశేషత ఉండేది. కావున
అలా బాబాను ఫాలో చేస్తూ 16 కళల సంపన్నులుగా అవ్వండి.
స్లోగన్:-
ఎవరైతే వెంటనే
పరిశీలించి నిర్ణయము తీసుకుంటారో, వారే శక్తివంతులు.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
పిల్లలైన మీ యోగము
ఎప్పుడైతే జ్వాలా స్వరూపముగా, శక్తిశాలిగా అవుతుందో, అప్పుడు పవిత్రతా అగ్ని సెకండ్
లో విశ్వములోని చెత్తను భస్మము చెయ్యగలదు. పవిత్రతకు చెందిన ఈ శక్తి గొప్ప శక్తి.
అంతిమములో ఎప్పుడైతే మీరు సంపూర్ణ పవిత్రముగా అయిపోతారో, అప్పుడు మీ శ్రేష్ఠ
సంకల్పాల లగనమనే అగ్ని ద్వారా ఈ చెత్త అంతా భస్మమైపోతుంది.