02-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ దీపాన్ని స్వయమే సంభాళించుకోవాలి, తుఫానుల నుండి రక్షించుకునేందుకు జ్ఞాన-యోగాలు అనే తైలము తప్పకుండా కావాలి’’

ప్రశ్న:-
ఏ పురుషార్థము గుప్తమైన తండ్రి నుండి గుప్త వారసత్వాన్ని ఇప్పిస్తుంది?

జవాబు:-
అంతర్ముఖులుగా అనగా మౌనముగా ఉంటూ తండ్రిని స్మృతి చేసినట్లయితే గుప్త వారసత్వము లభిస్తుంది. స్మృతిలో ఉంటూ శరీరాన్ని వదిలినట్లయితే చాలా మంచిది, ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. స్మృతితోపాటుగా జ్ఞాన-యోగాల సేవను కూడా చేయాలి, ఒకవేళ అది చేయలేకపోతే కర్మణా సేవను చేయండి. అనేకులకు సుఖాన్ని ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. నడవడిక మరియు మాటతీరు కూడా చాలా సాత్వికముగా ఉండాలి.

పాట:-
నిర్బలునితో బలవంతుని యుద్ధము... (నిర్బల్ సే లడాయీ బలవాన్ కీ...)

ఓంశాంతి
బాబా అర్థం చేయించారు - ఇటువంటి పాటలు విన్నప్పుడు ప్రతి ఒక్కరూ తమకు తామే విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది. మనుష్యులు మరణించినప్పుడు 12 రోజులు దీపాన్ని వెలిగిస్తారు అని అయితే పిల్లలకు తెలుసు. మీరేమో మరణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరియు పురుషార్థము చేసి మీ జ్యోతిని మీరే వెలిగించుకుంటున్నారు. పురుషార్థము కూడా మాలలోకి వచ్చేవారే చేస్తారు. ప్రజలు ఈ మాలలోకి రారు. మేము విజయమాలలో ముందుకు వెళ్ళాలి అని పురుషార్థము చేయాలి. ఎక్కడా మాయా పిల్లి తుఫానులు తీసుకువచ్చి దీపము ఆరిపోయేలా వికర్మలను చేయించకూడదు. ఇప్పుడు ఇందులో జ్ఞానము మరియు యోగము, రెండు బలాలూ కావాలి. యోగముతో పాటు జ్ఞానము కూడా తప్పనిసరి. ప్రతి ఒక్కరూ తమ దీపాన్ని తామే సంభాళించుకోవాలి. చివరివరకూ పురుషార్థము జరుగుతూనే ఉండాలి. రేస్ జరుగుతూ ఉంటుంది కావున జ్యోతి ఎక్కడా తగ్గిపోకుండా లేక ఆరిపోకుండా ఉండేందుకు చాలా సంభాళించవలసి ఉంటుంది, అందుకే యోగము మరియు జ్ఞానము అనే తైలాన్ని రోజూ వేస్తూ ఉండవలసి ఉంటుంది. యోగబలము యొక్క శక్తి లేకపోతే పరుగు తీయలేరు, చివరిలోనే ఉండిపోతారు. స్కూల్లో సబ్జెక్టులు ఉంటాయి. మేము ఫలానా సబ్జెక్టులో చురుకుగా లేము అని చూసుకుంటారు, కావున మరొక సబ్జెక్టులో (లెక్కల్లో) ఎక్కువ కృషి చేస్తారు. ఇక్కడ కూడా అలాగే. స్థూల సేవ యొక్క సబ్జెక్ట్ కూడా చాలా మంచిది. అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. కొందరు పిల్లలు జ్ఞాన-యోగాల సేవను చేస్తారు. రోజురోజుకు సేవ యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క వ్యాపారికి 6-8 దుకాణాలు కూడా ఉంటాయి. అన్నీ ఒకేలా నడవవు. కొన్నింటిలో తక్కువమంది గ్రాహకులు వస్తే, కొన్నింటిలో ఎక్కువమంది వస్తారు. మీకు కూడా ఒకానొక సమయము ఎటువంటిది రానున్నదంటే, ఇక రాత్రివేళ కూడా తీరిక దొరకదు. జ్ఞానసాగరుడైన బాబా అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలెను నింపేందుకు వచ్చి ఉన్నారని అందరికీ తెలుస్తుంది. అప్పుడు చాలామంది పిల్లలు వస్తారు. ఇక అడగకండి. ఇక్కడ ఈ వస్తువు చాలా బాగా, తక్కువ ధరకు లభిస్తోంది అని ఒకరికొకరు చెప్పుకుంటారు కదా. ఈ రాజయోగ శిక్షణ చాలా సహజము అని పిల్లలైన మీకు కూడా తెలుసు. అందరికీ ఈ జ్ఞాన రత్నాల గురించి తెలిసినట్లయితే ఇక వస్తూ ఉంటారు. మీరు ఈ జ్ఞాన-యోగాల సేవను చేస్తారు. ఎవరైనా ఈ జ్ఞాన-యోగాల సేవను చేయలేకపోతే, కర్మణా సేవకు కూడా మార్కులు ఉన్నాయి. అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చుకోవాలి. ఇది చాలా, చాలా తక్కువ ధరకు లభించే గని. ఇది అవినాశీ వజ్ర-వైఢూర్యాల గని. అష్ట రత్నాల మాలను తయారుచేస్తారు కదా. పూజిస్తూ ఉంటారు కూడా, కానీ ఈ మాల ఎవరిది తయారయ్యింది అన్నది ఎవరికీ తెలియదు.

ఏ విధంగా మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానము, దీని గురించి ప్రపంచములో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదృష్టతారలైన పిల్లలైన మీకే నిశ్చయము ఉంది - మేము స్వర్గాధిపతులుగా ఉండేవారము, ఇప్పుడు నరకాధిపతులుగా అయిపోయాము, స్వర్గాధిపతులుగా ఉన్నట్లయితే పునర్జన్మలను కూడా అక్కడే తీసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ మనము స్వర్గాధిపతులుగా అవుతున్నాము. బ్రాహ్మణులైన మీకే ఈ సంగమయుగము గురించి తెలుసు. ఇంకొకవైపు మొత్తం ప్రపంచమంతా కలియుగములో ఉంది. యుగాలైతే వేర్వేరుగా ఉన్నాయి కదా. సత్యయుగములో ఉంటే పునర్జన్మలను సత్యయుగములోనే తీసుకుంటారు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. మీలో ఎవరైనా శరీరాన్ని వదిలినట్లయితే సంస్కారాల అనుసారముగా మళ్ళీ ఇక్కడికే వచ్చి జన్మ తీసుకుంటారు. బ్రాహ్మణులైన మీరు సంగమయుగానికి చెందినవారు. ఆ శూద్రులు కలియుగానికి చెందినవారు. ఈ జ్ఞానము కూడా మీకు ఈ సంగమయుగములోనే లభిస్తుంది. జ్ఞాన గంగలైన బి.కే.లైన మీరు ప్రాక్టికల్ గా ఇప్పుడు సంగమయుగములో ఉన్నారు. ఇప్పుడు మీరు రేస్ చేయాలి. దుకాణాలను సంభాళించాలి. జ్ఞాన-యోగాల ధారణ లేకపోతే దుకాణాలను సంభాళించలేరు. సేవా ఫలాన్ని అయితే బాబా ఇవ్వనున్నారు. యజ్ఞము రచింపబడినప్పుడు రకరకాల బ్రాహ్మణులు వస్తారు. అందులో కొందరికి దక్షిణ ఎక్కువ లభిస్తుంది, కొందరికి తక్కువ లభిస్తుంది. ఇప్పుడు పరమపిత పరమాత్మ ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. మనము బ్రాహ్మణులము. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడమే మన వ్యాపారము. మేము ఈ యజ్ఞము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాము అని అనగలిగే యజ్ఞము ఇంకేదీ ఉండదు. ఇప్పుడు దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞము లేక పాఠశాల అని కూడా అంటారు. జ్ఞానము మరియు యోగముల ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరూ దేవీ-దేవతా పదవిని పొందగలుగుతారు. బాబా సలహా కూడా ఇస్తారు. మీరు పరంధామము నుండి బాబాతోపాటు వచ్చారు. మేము పరంధామ నివాసులము అని మీరు అంటారు. ఈ సమయములో బాబా మతము ద్వారా మనము స్వర్గ స్థాపనను చేస్తున్నాము. ఎవరైతే స్థాపన చేస్తారో వారే తప్పకుండా యజమానులుగా అవుతారు. ఈ ప్రపంచములో మనము అతి అదృష్టవంతులమని, వారు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు మనం వారి జ్ఞాన సితారలమని మీకు తెలుసు. అలా తయారుచేసేవారు జ్ఞాన సాగరుడు. ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలైతే స్థూలమైనవి కదా. వాటితో మనల్ని పోల్చడం జరుగుతుంది. కావున మనము కూడా జ్ఞాన సూర్యునిగా, జ్ఞాన చంద్రునిగా, జ్ఞాన సితారలుగా అవుతాము. మనల్ని ఆ విధముగా తయారుచేసేవారు జ్ఞాన సాగరుడు. పేరు అయితే అలా ఉంటుంది కదా. మనం జ్ఞాన సూర్యునికి లేక జ్ఞాన సాగరునికి పిల్లలము. వారు ఇక్కడి నివాసి కాదు. బాబా అంటారు, నేను వస్తాను, మిమ్మల్ని నా సమానముగా తయారుచేస్తాను. జ్ఞాన సూర్యులుగా, జ్ఞాన సితారలుగా మీరు ఇక్కడే తయారవ్వాలి. తప్పకుండా మనం భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడే స్వర్గాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. మొత్తం ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. మనం మాయపై విజయాన్ని పొందే యోధులము. హఠయోగులైతే మనస్సును వశము చేసుకునేందుకు ఎన్ని హఠాలు మొదలైనవి చేస్తారు. మీరైతే హఠయోగాలు మొదలైనవి చేయలేరు. బాబా అంటారు, మీరు ఎటువంటి కష్టమూ పడనఖ్కర్లేదు. నేను కేవలం - మీరు నా వద్దకు రావాలి కావున నన్ను స్మృతి చేయండి అని మాత్రమే అంటాను. నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఈ విధంగా ఇంకే మనుష్యులు అనలేరు. స్వయాన్ని ఈశ్వరునిగా పిలుచుకున్నా కానీ తమను తాము మార్గదర్శకులుగా పిలుచుకోలేరు. బాబా అంటారు, నేను ముఖ్యమైన పండాను, కాలుడికే కాలుడిని. సావిత్రి-సత్యవంతుల కథ ఒకటి ఉంది కదా! ఆమెకు దైహికమైన ప్రేమ ఉన్న కారణముగా దుఃఖితురాలయ్యేది. మీరైతే సంతోషిస్తారు. నేను మీ ఆత్మను తీసుకువెళ్తాను, మీరు ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. మన బాబా మధురమైన ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు అని మీకు తెలుసు. దానిని ముక్తిధామము లేక నిర్వాణధామము అని అంటారు. నేను కాలుడికే కాలుడిని అని అంటారు. ఆ కాలుడు అయితే కేవలం ఒక్క ఆత్మనే తీసుకువెళ్తాడు, కానీ నేనైతే ఎంత పెద్ద కాలుడిని. 5000 సంవత్సరాల క్రితము కూడా నేను గైడ్ గా అయి అందరినీ తీసుకువెళ్ళాను. ప్రియుడు ప్రేయసులందరినీ తిరిగి తీసుకువెళ్తారు కావున వారిని స్మృతి చేయవలసి ఉంటుంది.

ఇప్పుడు మనం చదువుతున్నామని, మళ్ళీ ఇక్కడకు వస్తామని మీకు తెలుసు. మొదట స్వీట్ హోమ్ కు (మధురమైన ఇంటికి) వెళ్తాము, ఆ తర్వాత కిందకు వస్తాము. పిల్లలైన మీరు స్వర్గము యొక్క సితారలు. ఇంతకుముందు నరకము యొక్క సితారలుగా ఉండేవారు. సితారలు అని పిల్లల్నే అంటారు. లక్కీ సితారలుగా నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. మీకు తాతగారి ఆస్తి లభిస్తుంది. ఈ గని చాలా గొప్పది మరియు ఈ గని ఒకేసారి వెలువడుతుంది. ఆ గనులైతే ఎన్నో ఉన్నాయి కదా. అవి వెలువడుతూనే ఉంటాయి. ఎవరైనా కూర్చుని వాటిని వెతికినట్లయితే అవి ఎన్నో ఉంటాయి. ఇక్కడైతే ఈ అవినాశీ జ్ఞాన రత్నాల ఏకైక గని ఒకేసారి లభిస్తుంది. ఆ పుస్తకాలైతే ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని రత్నాలు అని అనరు. బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. వారు అవినాశీ జ్ఞాన రత్నాల నిరాకారీ గని. ఈ రత్నాల ద్వారా మనం జోలెలను నింపుకుంటూ ఉంటాము. పిల్లలైన మీకు సంతోషము ఉండాలి. ప్రతి ఒక్కరికీ నషా కూడా ఉంటుంది. దుకాణములో వ్యాపారము ఎక్కువగా జరుగుతూ ఉంటే పేరు కూడా లభిస్తుంది. ఇక్కడ ప్రజలను కూడా తయారుచేస్తున్నారు, అలాగే వారసులను కూడా తయారుచేస్తున్నారు. ఇక్కడి నుండి రత్నాల జోలెను నింపుకుని తిరిగి వెళ్ళి దానము చేయాలి. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు, వారు జ్ఞాన రత్నాలతో జోలెను నింపుతారు. అంతేకానీ ఇది పళ్ళాలను రత్నాలతో నింపి దేవతలకు ఇచ్చినట్లుగా చూపించే ఆ సాగరము యొక్క విషయము కాదు. ఆ సాగరము నుండి రత్నాలు లభించవు. ఇది జ్ఞాన రత్నాల విషయము. డ్రామానుసారముగా మీకు మళ్ళీ రత్నాల గనులు కూడా లభిస్తాయి. అక్కడ ఎన్నో వజ్ర-వైఢూర్యాలు ఉంటాయి, వాటితో మళ్ళీ భక్తి మార్గములో మందిరాలు మొదలైనవాటిని తయారుచేస్తారు. భూకంపాలు మొదలైనవి వస్తే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అక్కడ మహళ్ళు మొదలైనవి అయితే అనేకము తయారవుతాయి, ఒక్కటి కాదు. ఇక్కడ కూడా రాజుల కాంపిటీషన్ ఎంతగానో జరుగుతుంది. పిల్లలైన మీకు తెలుసు - కల్పపూర్వము ఎటువంటి ఇళ్ళను నిర్మించారో, అలాంటివే మళ్ళీ తయారుచేస్తారు. అక్కడైతే ఇళ్ళు మొదలైనవి చాలా సహజముగా తయారవుతూ ఉంటాయి. సైన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అక్కడ సైన్స్ అనే పదము ఉండదు. సైన్స్ ను హిందీలో విజ్ఞాన్ అని అంటారు. ఈ రోజుల్లోనైతే విజ్ఞాన భవన్ అన్న పేరును కూడా పెట్టారు. విజ్ఞానము అన్న పదము జ్ఞానముతో కూడా కలుస్తుంది. జ్ఞానమును మరియు యోగమును విజ్ఞానము అని అంటారు. జ్ఞానముతో రత్నాలు లభిస్తాయి, యోగముతో మనము సదా ఆరోగ్యవంతులుగా అవుతాము. ఇది జ్ఞానము మరియు యోగముల నాలెడ్జ్, దీని ద్వారా మళ్ళీ వైకుంఠములో పెద్ద-పెద్ద భవనాలు తయారవుతాయి. మనకు ఇప్పుడు ఈ జ్ఞానమంతా తెలుసు. మనము భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నామని మీకు తెలుసు. మీకు ఈ దేహముపై ఎటువంటి మమకారమూ లేదు. ఆత్మయైన మనము ఈ శరీరాన్ని వదిలి స్వర్గములోకి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటాము. ఒక పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్తదానిని తీసుకుంటాము అని అక్కడ కూడా భావిస్తారు. అక్కడ ఎటువంటి దుఃఖము లేక శోకమూ ఉండదు. కొత్త శరీరాన్ని తీసుకుంటే మంచిదే కదా. మనల్ని బాబా ఈ విధంగా తయారుచేస్తున్నారు, కల్పపూర్వము కూడా ఇలాగే తయారయ్యాము. మనము మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. తప్పకుండా కల్పపూర్వము కూడా అనేక ధర్మాలు ఉండేవి. గీతలో ఇదేమీ లేదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన బ్రహ్మా ద్వారా - అని అంటూ ఉంటారు. అనేక ధర్మాల వినాశనము ఎలా జరుగుతుంది అనేది మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడు స్థాపన జరుగుతోంది. ఎప్పుడైతే దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయిందో, అప్పుడే బాబా వచ్చారు. మరి అది పరంపరగా ఎలా నడిచి ఉంటుంది? ఇవి చాలా సహజమైన విషయాలు. దేని వినాశనము జరిగింది? అనేక ధర్మాల వినాశనము. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి కదా. ఈ సమయములో ఇది అంతిమము. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. శివబాబాయే అర్థం చేయిస్తారు అని కాదు. ఈ బాబా ఏమీ తెలియజేయరా ఏమిటి. వీరి పాత్ర కూడా ఉంది. బ్రహ్మా యొక్క శ్రీమతము కూడా గానం చేయబడింది. శ్రీకృష్ణుని విషయములోనైతే శ్రీమతము అని అనరు. అక్కడ అయితే అందరూ శ్రీ (శ్రేష్ఠము) గానే ఉంటారు, వారికి మతము (డైరెక్షన్లు) యొక్క అవసరమే లేదు. ఇక్కడ బ్రహ్మా యొక్క మతము కూడా లభిస్తుంది. అక్కడైతే యథా రాజా రాణి తథా ప్రజ, అందరిదీ శ్రేష్ఠ మతమే. తప్పకుండా దానిని ఎవరో ఇచ్చి ఉంటారు. దేవతలు శ్రీమతము కలవారు. శ్రీమతము ద్వారానే స్వర్గము తయారవుతుంది, ఆసురీ మతము ద్వారా నరకము తయారయ్యింది. శ్రీమతము శివునిది. ఈ విషయాలన్నీ సహజముగా అర్థం చేసుకోవలసినవి. ఇవన్నీ శివబాబా దుకాణాలు. పిల్లలైన మనము వాటిని నడిపించేవారము. ఎవరైతే దుకాణాన్ని బాగా నడుపుతారో వారి పేరు ప్రఖ్యాతమవుతుంది. ఏ విధంగా వ్యాపారాలలో జరుగుతుందో అలాగే జరుగుతుంది. కానీ ఈ వ్యాపారాన్ని అరుదుగా ఏ ఒక్కరో చేస్తారు. వ్యాపారాన్ని అయితే అందరూ చేయాలి. చిన్న పిల్లలు కూడా జ్ఞాన-యోగాల వ్యాపారాన్ని చేయవచ్చు. శాంతిధామము మరియు సుఖధామము - బుద్ధిలో వీటినే స్మృతి చేయాలి, అంతే. వారు రామ, రామ అని అంటూ ఉంటారు. ఇక్కడ మౌనముగా ఉంటూ స్మృతి చేయాలి, ఏమీ మాట్లాడకూడదు. శివపురి, విష్ణుపురి, ఇవి చాలా సహజమైన విషయాలు. మధురమైన ఇల్లు, మధురమైన రాజధాని గుర్తున్నాయి. వారు స్థూల మంత్రాన్ని ఇస్తారు, ఇది సూక్ష్మమైన మంత్రము. అతి సూక్ష్మమైన స్మృతి. కేవలం ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా మనం స్వర్గాధిపతులుగా అవుతాము. ఇక్కడ జపించడమంటూ ఏదీ లేదు, కేవలం స్మృతి చేయాలి. ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. గుప్తమైన బాబా నుండి గుప్తమైన వారసత్వాన్ని మౌనముగా ఉండడము ద్వారా, అంతర్ముఖులుగా ఉండడము ద్వారా మనం పొందుతాము. ఇదే స్మృతిలో ఉంటూ శరీరము వదిలినట్లయితే చాలా మంచిది. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. ఎవరికైతే స్మృతి నిలవదో వారు తమ అభ్యాసమును చేయాలి. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది అని బాబా చెప్పారని అందరికీ చెప్పండి. స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి మరియు నేను స్వర్గములోకి పంపిస్తాను. బుద్ధియోగాన్ని శివబాబాతో జోడించడము చాలా సహజము. పత్యము మొదలైనవాటిని కూడా అన్నీ ఇక్కడే చేయాలి. సతోప్రధానముగా అవుతారు కావున అంతా సాత్వికముగా ఉండాలి - నడవడిక సాత్వికముగా, మాటలు సాత్వికముగా ఉండాలి. ఇది మీతో మీరు మాట్లాడుకోవడము. తోటివారితో ప్రేమగా మాట్లాడాలి. పరమాత్ముని మాటలు సదా అమూల్యమైనవి... అని పాటలో కూడా ఉంది కదా.

మీరు రూప్-బసంత్ (యోగీ మరియు జ్ఞానీ). ఆత్మ రూప్ గా అవుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు కావున తప్పకుండా వారు వచ్చి జ్ఞానాన్నే వినిపిస్తారు. నేను ఒకేసారి వచ్చి శరీరాన్ని ధారణ చేస్తాను అని వారు అంటారు. ఇది తక్కువ ఇంద్రజాలమేమీ కాదు! బాబా కూడా రూప్-బసంత్. కానీ నిరాకారుడు మాట్లాడలేరు కావున శరీరాన్ని తీసుకున్నారు. కానీ వారు పునర్జన్మలలోకి రారు. ఆత్మలైతే పునర్జన్మలలోకి వస్తాయి.

పిల్లలైన మీరు బాబాపై బలిహారమవుతారు కావున బాబా అంటారు, ఇక మమకారాన్ని పెట్టుకోకండి. దేనినీ మీదిగా భావించకండి. మమకారాన్ని తొలగించేందుకనే బాబా యుక్తిని రచిస్తారు. అడుగడుగులోనూ తండ్రిని అడగవలసి ఉంటుంది. మాయ ఎటువంటిదంటే అది దెబ్బ వేసేస్తుంది. ఇది పూర్తిగా బాక్సింగ్. చాలామంది అయితే దెబ్బ తిని మళ్ళీ లేచి నిలబడిపోతారు. బాబా, మాయ చెంపదెబ్బ వేసింది, నల్ల ముఖము చేసేసుకున్నాము అని వ్రాస్తారు కూడా. అది నాలుగో అంతస్థు నుండి పడిపోవడం వంటిది. క్రోధము చేసినట్లయితే మూడవ అంతస్తు నుండి పడిపోవడం వంటిది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు చూడండి, పిల్లలు టేప్ కోసము కూడా కావాలని అడుగుతూ ఉంటారు. బాబా, టేప్ పంపించండి, మేము మురళిని ఏక్యురేట్ గా వినాలి అని అంటారు. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అనేకులు వింటే అనేకుల కపాటము తెరుచుకుంటుంది. అనేకుల కళ్యాణము జరుగుతుంది. మనుష్యులు కాలేజీలు తెరిస్తే వారికి మరుసటి జన్మలో విద్య ఎక్కువగా లభిస్తుంది. బాబా కూడా అంటారు - టేప్ మెషిన్ ను కొన్నట్లయితే అనేకుల కళ్యాణము జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సతోప్రధానముగా అయ్యేందుకు చాలా-చాలా పథ్యముతో, నిగ్రహముతో నడచుకోవాలి. తమ అన్నపానాదులు, మాటలు, వ్యవహారము, అన్నింటినీ సాత్వికముగా ఉంచుకోవాలి. తండ్రి సమానముగా రూప్-బసంత్ గా అవ్వాలి.

2. అవినాశీ జ్ఞాన రత్నాల నిరాకారీ గని ద్వారా మీ జోలెను నింపుకుని అపారమైన సంతోషములో ఉండాలి మరియు ఇతరులకు కూడా ఈ రత్నాలను దానం చేయాలి.

వరదానము:-
నష్టోమోహులుగా అయ్యి దుఃఖ-అశాంతుల నామ-రూపాలను కూడా సమాప్తము చేసే స్మృతి స్వరూప భవ

ఎవరైతే సదా ఒక్కరి స్మృతిలోనే ఉంటారో, అటువంటి వారి స్థితి ఏకరసముగా అయిపోతుంది. ఏకరస స్థితి అనగా అర్థము ఒక్కరి ద్వారా సర్వ సంబంధాల, సర్వ ప్రాప్తుల రసాన్ని అనుభవము చెయ్యటము. ఎవరైతే తండ్రిని సర్వ సంబంధాలతో తమవారిగా చేసుకుని స్మృతి స్వరూపులుగా ఉంటారో, వారు సహజముగానే నష్టోమోహులుగా అవుతారు. ఎవరైతే నష్టోమోహులుగా ఉంటారో వారికి ఎప్పుడూ సంపాదనలో, ధనాన్ని సంభాళించటములో, ఎవరైనా అనారోగ్యము పాలవ్వటములో... దుఃఖపు అల రాదు. నష్టోమోహా అనగా దుఃఖ-అశాంతులు నామ-రూపాలు కూడా ఉండకూడదు, సదా నిశ్చింతులు.

స్లోగన్:-
ఎవరైతే దయా హృదయులై అందరికీ ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారో వారే క్షమాశీలురు.