03-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - నిరాకారుడైన తండ్రి మీకు తమ మతాన్ని ఇచ్చి ఆస్తికులుగా తయారుచేస్తారు, ఆస్తికులుగా అయితేనే మీరు తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకోగలరు’’

ప్రశ్న:-
అనంతమైన రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఏ రెండు విషయాల పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి?

జవాబు:-
1. చదువు మరియు 2. సేవ. సేవ చేయడానికి లక్షణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. ఈ చదువు చాలా అద్భుతమైనది, దీని ద్వారా మీరు రాజ్యాన్ని పొందుతారు. ద్వాపరము నుండి ధనాన్ని దానం చేయడం ద్వారా రాజ్యము లభిస్తుంది, కానీ ఇప్పుడు మీరు చదువు ద్వారా రాకుమారులు-రాకుమారీలుగా అవుతారు.

పాట:-
మా తీర్థాలు అతీతమైనవి...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటలోని ఒక వాక్యాన్ని విన్నారు. ఇంట్లో కూర్చొని గుప్తముగా ముక్తిధామానికి చేరుకోవడమే మీ తీర్థయాత్ర. ప్రపంచములోనివారి తీర్థయాత్రలు సాధారణమైనవి, మీది అతీతమైనది. మనుష్యుల బుద్ధియోగమైతే సాధు-సత్పురుషులు మొదలైనవారివైపు ఎంతగానో తిరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీకు అయితే కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేయాలని ఆజ్ఞ లభిస్తుంది. వారు నిరాకారుడైన తండ్రి. భగవంతుడిని నిరాకారునిగా నమ్మేవారందరూ నిరాకారీ మతానికి చెందినవారని కాదు. ప్రపంచములో మత-మతాంతరాలు అయితే ఎన్నో ఉన్నాయి కదా. ఈ ఒక్క నిరాకారీ మతాన్ని నిరాకారుడైన తండ్రి ఇస్తారు, దీని ద్వారా మానవులు ఉన్నతోన్నతమైన పదవియైన జీవన్ముక్తిని మరియు ముక్తిని పొందుతారు. ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. మేము నిరాకారుడిని నమ్ముతాము అని ఊరికే అలా అనేస్తారు. అనేకానేక మతాలు ఉన్నాయి. సత్యయుగములోనైతే ఒకే మతము ఉంటుంది. కలియుగములో అనేక మతాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి, లక్షలాది, కోట్లాది అభిప్రాయాలు ఉంటాయి. ప్రతీ ఇంటిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క మతము. ఇక్కడ పిల్లలైన మీకు ఉన్నతోన్నతముగా తయారయ్యేందుకు ఆ ఒకే ఒక్క తండ్రి ఉన్నతోన్నతమైన మతాన్ని ఇస్తారు. మీ చిత్రాలు చూసి ఎంతోమంది అడుగుతారు - మీరు తయారుచేసింది ఏమిటి, ఇందులో ముఖ్యమైన విషయము ఏమిటి? మీరు చెప్పండి - ఇది రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము, ఈ జ్ఞానము ద్వారా మనము ఆస్తికులుగా తయారవుతాము. ఆస్తికులుగా అవ్వటము ద్వారా తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, నాస్తికులుగా అవ్వటము వలన వారసత్వాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ పదే ఇది - నాస్తికులను ఆస్తికులుగా తయారుచేయడము. ఈ పరిచయము మీకు తండ్రి నుండి లభించింది. త్రిమూర్తి చిత్రము అయితే చాలా స్పష్టముగా ఉంది. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా. బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞము నడుస్తుంది. ఇది చాలా పెద్ద యజ్ఞము. మొట్టమొదట అర్థం చేయించవలసినది ఏమిటంటే - ఉన్నతోన్నతమైనవారు తండ్రి, ఆత్మలందరూ పరస్పరం సోదరులు, అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. వారితో తండ్రి అంటున్నారు - వారసత్వము కూడా రచయిత అయిన తండ్రి నుండే లభిస్తుంది, రచన నుండైతే లభించదు, అందుకే ఈశ్వరుడిని అందరూ స్మృతి చేస్తారు. వాస్తవానికి తండ్రే స్వర్గ రచయిత మరియు వారు భారత్ లోనే వస్తారు, వచ్చి ఈ కార్యాన్ని చేస్తారు. త్రిమూర్తి చిత్రమైతే చాలా మంచి వస్తువు. వారు బాబా, వీరు దాదా. బ్రహ్మా ద్వారా బాబా సూర్యవంశాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. లక్ష్యము-ఉద్దేశ్యము పూర్తిగా ఉంది, అందుకే బాబా మెడల్స్ ను (బ్యాడ్జిలను) కూడా తయారుచేయిస్తారు. చాలా, చాలా క్లుప్తంగా రెండు మాటలలో మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. తండ్రి నుండి క్షణములో వారసత్వము లభించాలి కదా. తండ్రి స్వర్గ రచయిత. ఈ బ్యాడ్జీలు చాలా మంచివి. కానీ చాలా దేహాభిమానములో ఉన్న పిల్లలు వీటిని అర్థం చేసుకోరు. వీటిలో జ్ఞానమంతా ఉంది, ఒక్క సెకండుకు సంబంధించినది. బాబా వచ్చి భారత్ నే స్వర్గముగా తయారుచేస్తారు. కొత్త ప్రపంచాన్ని తండ్రియే స్థాపన చేస్తారు. ఈ పురుషోత్తమ సంగమయుగము కూడా మహిమ చేయబడి ఉంది. ఈ జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. కొందరికి యోగము ఉంటే జ్ఞానము ఉండదు, ధారణ జరగదు. సేవ చేసే పిల్లలకు జ్ఞాన ధారణ బాగా జరగగలదు. తండ్రి వచ్చి మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ చేస్తుంటే, పిల్లలు ఏ సేవా చేయకపోతే, వారు ఇక దేనికి పనికొస్తారు? వారు తండ్రి హృదయాన్ని ఎలా అధిరోహించగలరు? తండ్రి అంటారు - రావణ రాజ్యము నుండి అందరినీ విడిపించడమే డ్రామాలో నా పాత్ర. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి భారత్ లోనే చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాముడు ఎవరు, అది కూడా వారికి తెలియదు. పతిత-పావనుడు, భక్తులందరి భగవంతుడు ఒక్కరేనని మహిమ చేస్తారు. కనుక ఎవరైనా లోపలికి వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మనిషిని బట్టి అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి వచ్చేదే అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇవ్వడానికి. వారికి తన శరీరమంటూ ఏదీ లేనప్పుడు మరి వారసత్వాన్ని ఎలా ఇస్తారు? నేను ఈ బ్రహ్మా తనువు ద్వారా చదివించి, రాజయోగాన్ని నేర్పించి ఈ పదవిని ప్రాప్తింపజేయిస్తానని స్వయం తండ్రియే అంటున్నారు. ఈ బ్యాడ్జిలో ఒక్క సెకండులో అర్థం చేయించే వివరణ ఉంది. ఇది ఎంత చిన్న బ్యాడ్జి, కానీ అర్థం చేయించేవారు మంచి దేహీ-అభిమానులై ఉండాలి. అలాంటివారు చాలా తక్కువగా ఉన్నారు. అంతగా ఎవ్వరూ కష్టపడలేకపోతున్నారు, అందుకే తండ్రి అంటారు, మొత్తం రోజంతటిలో మేము ఎంత సమయము స్మృతిలో ఉంటున్నామని చార్టు పెట్టుకుని చూసుకోండి. రోజంతా ఆఫీసులో పని చేస్తూ స్మృతిలో ఉండాలి. కర్మనైతే చేయవలసిందే. ఇక్కడ యోగములో కూర్చోబెట్టి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. ఆ సమయములోనైతే కర్మలేమీ చేయరు. కానీ మీరు కర్మలు చేస్తూ స్మృతిలో ఉండాలి. లేకపోతే కూర్చోవడమే అలవాటైపోతుంది. కర్మలు చేస్తూ స్మృతిలో ఉన్నప్పుడే కర్మయోగులుగా నిరూపించబడతారు. పాత్రనైతే తప్పకుండా అభినయించాలి, ఇందులోనే మాయ విఘ్నాలను వేస్తుంది. కొందరు చార్టును కూడా సత్యతతో వ్రాయరు. కొందరు అరగంట, పావుగంట స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు. అది కూడా ఉదయమే స్మృతిలో కూర్చుంటూ ఉండవచ్చు. భక్తి మార్గములో కూడా ఉదయాన్నే లేచి కూర్చుని రాముని మాలను జపిస్తారు. అలాగని, ఆ సమయములో అదే ధ్యాసలో నిమగ్నమై ఉంటారని కూడా కాదు. అలా కాదు, ఇతర సంకల్పాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. తీవ్ర భక్తుల బుద్ధి కాస్త నిలుస్తుంది. ఇదైతే అజపాజపము (నిరంతర జపము). ఇది కొత్త విషయము కదా. గీతలో కూడా మన్మనాభవ అన్న పదము ఉంది. కానీ శ్రీకృష్ణుని పేరు వేయడం వలన వారు శ్రీకృష్ణుడిని తలచుకుంటారు, ఏమీ అర్థం చేసుకోరు. బ్యాడ్జి తప్పకుండా మీతోపాటు ఉండాలి. తండ్రి బ్రహ్మా తనువు ద్వారా కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మేము ఆ తండ్రి పట్ల ప్రీతి పెట్టుకుంటాము అని చెప్పండి. మనుష్యులకైతే ఆత్మ జ్ఞానమూ లేదు, పరమాత్మ జ్ఞానము లేదు. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ త్రిమూర్తి శివుని చిత్రము అన్నింటికన్నా ముఖ్యమైనది. తండ్రి మరియు వారసత్వము. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడమైతే చాలా సహజము. ప్రదర్శని ద్వారా ప్రజలైతే లక్షలలో తయారవుతూ ఉంటారు కదా. రాజులు కొద్దిమందే ఉంటారు, కానీ వారి ప్రజలైతే కోట్ల సంఖ్యలో ఉంటారు. ప్రజలు ఎంతోమంది తయారవుతారు, ఇకపోతే రాజులను తయారుచేయడానికి పురుషార్థము చేయాలి. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో, వారు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. కొందరు పిల్లలకు సేవ చేసే అభిరుచి చాలా ఉంది. మాకు తినడానికి ఉంది కదా, ఉద్యోగం వదిలేసి సేవ చేయనా అని అడుగుతారు. బాబాకు చెందినవారిగా అయిపోతే, ఇక శివబాబా పాలననే తీసుకుంటారు. కానీ బాబా అంటారు - నేను వానప్రస్థావస్థలో ప్రవేశించాను కదా. మాతలు కూడా యుక్త వయసులో ఉంటే ఇంటిలో ఉంటూ రెండు సేవలనూ చేయాలి. బాబా ప్రతి ఒక్కరి పరిస్థితులనూ చూసి సలహా ఇస్తారు. వివాహము మొదలైనవాటికి అనుమతి ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది, అందుకే ప్రతి ఒక్కరి లెక్కాచారాలను చూసి సలహా ఇస్తారు. కుమారులకైతే - మీరు సేవ చేయవచ్చు, సర్వీస్ చేసి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్తారు. లౌకిక తండ్రి నుండి మీకు ఏం లభిస్తుంది? దుమ్ము-ధూళి. అదంతా మట్టిలో కలిసిపోవలసిందే. రోజురోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. కొందరు తమ ఆస్తికి తమ పిల్లలు వారసులు అవుతారని భావిస్తారు. కానీ తండ్రి అంటారు, దాని ద్వారా లభించేదేమీ లేదు. మొత్తం ఆస్తి అంతా బూడిదలో కలిసిపోతుంది. తర్వాత తరాలవారు తింటారని వారు భావిస్తారు. ధనవంతుల ధనము అంతమవ్వడములో పెద్ద సమయమేమీ పట్టదు. మృత్యువైతే ఎదురుగానే నిలబడి ఉంది. ఆ వారసత్వాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. పూర్తిగా అర్థం చేయించగలిగినవారు చాలా తక్కువమంది ఉన్నారు. సేవ ఎక్కువగా చేసేవారే ఉన్నత పదవిని పొందుతారు. కావున వారిపై గౌరవము కూడా ఉంచాలి, వారి నుండి నేర్చుకోవాలి. 21 జన్మల కొరకు గౌరవించవలసి ఉంటుంది. వారు స్వతహాగా తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు, కనుక వారికి అంతటా గౌరవము లభిస్తుంది. అది వారు స్వయమూ అర్థం చేసుకోగలరు, ఏది లభిస్తే అదే మంచిదని భావిస్తారు, అందులోనే సంతోషపడతారు.

అనంతమైన రాజ్యము కొరకు చదువు మరియు సేవ పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. ఇది అనంతమైన చదువు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది కదా. ఈ చదువును ద్వారా ఇక్కడ మీరు చదువుకుని యువరాజులుగా అవుతారు. మనుష్యులు ఎవరైనా ధనాన్ని దానం చేస్తే రాజుల వద్ద లేక షావుకారుల వద్ద జన్మ తీసుకుంటారు. కానీ అది అల్పకాలికమైన సుఖము. కావున ఈ చదువు పట్ల చాలా అటెన్షన్ పెట్టాలి. సేవ పట్ల తపన ఉండాలి. నేను మా ఊరికి వెళ్ళి సర్వీస్ చేయాలి, దాని వలన చాలామంది కళ్యాణము జరుగుతుంది అని తపన ఉండాలి. ఇటువంటి సేవా అభిరుచి ప్రస్తుతం ఎవరిలోనూ అంతగా లేదని తండ్రికి తెలుసు. లక్షణాలు కూడా మంచిగా ఉండాలి కదా. అంతేకానీ డిస్సర్వీస్ చేసి యజ్ఞము పేరును కూడా అప్రతిష్ఠపాలు చేసి, తమను తాము కూడా నష్టపరచుకోవడం కాదు. బాబా అయితే ప్రతి విషయాన్నీ బాగా అర్థం చేయిస్తారు. బ్యాడ్జిలు మొదలైనవాటి కోసం ఎంత చింత ఉంటుంది. కానీ డ్రామానుసారముగా వాటికి ఇంకా కొద్ది సమయం ఉందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణుల ట్రాన్స్ లైట్ చిత్రము కూడా ఫస్ట్ క్లాస్ అయినది. కానీ పిల్లలపై ఈ రోజు బృహస్పతి దశ కూర్చుంటే, రేపు రాహు దశ కూర్చుంటుంది. డ్రామాలో సాక్షీగా అయి పాత్రను చూడవలసి ఉంటుంది. ఉన్నత పదవి పొందేవారు చాలా తక్కువమంది ఉంటారు. కొందరి గ్రహచారము తొలగిపోయే అవకాశము కూడా ఉంది. గ్రహచారము తొలగిపోతే వారు మళ్ళీ పైకి గెంతుతారు. పురుషార్థము చేసి మీ జీవితాన్ని తయారుచేసుకోవాలి, లేకపోతే కల్ప-కల్పాంతరాల కొరకు సర్వనాశనమైపోతుంది. కల్పపూర్వము వలె గ్రహచారము వచ్చిందని అర్థం చేసుకుంటారు. శ్రీమతముపై నడవకపోతే పదవి కూడా లభించదు. ఉన్నతోన్నతమైనది భగవంతుని శ్రీమతము. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు కేవలం ఈ చిత్రాన్ని చాలా బాగా తయారుచేసారు అని అంటారు. కానీ మీకు ఈ చిత్రాన్ని చూడడంతోనే మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, మొత్తం సృష్టి చక్రము బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు నంబరువారు పురుషార్థానుసారముగా నాలెడ్జ్ ఫుల్ గా తయారవుతారు. బాబాకైతే ఈ చిత్రాన్ని చూస్తూనే చాలా సంతోషము కలుగుతుంది. నేను చదువుకుని ఇలా తయారవ్వబోతున్నాను అని విద్యార్థులకైతే సంతోషము కలగాలి కదా. చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. అంతేకానీ భాగ్యములో ఏముంటే అదే లభిస్తుందిలే అని అనుకోకూడదు. పురుషార్థము ద్వారానే ప్రారబ్ధము లభిస్తుంది. పురుషార్థము చేయించే తండ్రి లభించారు, వారి శ్రీమతముపై నడవకపోతే దుర్గతి పొందుతారు. మొట్టమొదటైతే ఎవరికైనా ఈ బ్యాడ్జ్ పైనే అర్థం చేయించండి, అప్పుడు ఎవరైతే యోగ్యులో వారు వెంటనే - ఇవి మాకు లభిస్తాయా అని అడుగుతారు. ఆ, ఎందుకు లభించవు అని చెప్పండి. ఈ ధర్మానికి చెందినవారికి బాణము తగులుతుంది. వారి కళ్యాణము జరగగలదు. తండ్రి అయితే క్షణములో అరచేతి నుండి వైకుంఠాన్ని అందిస్తారు, ఇందులోనైతే చాలా సంతోషము ఉండాలి. మీరు శివుని భక్తులకు ఈ జ్ఞానాన్ని ఇవ్వండి. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు రాజులకే రాజులుగా తయారవుతారని శివబాబా చెప్తున్నారని వారికి తెలియజేయండి. రోజంతా ఇదే సేవ చేయండి. విశేషముగా బెనారస్ లో శివుని మందిరాలు చాలా ఉన్నాయి, అక్కడ సేవ బాగా జరిగే అవకాశము ఉంది. ఎవరో ఒకరు వెలువడుతారు. ఇది చాలా సహజమైన సేవ. ఎవరైనా ఈ సేవ చేసి చూడండి, భోజనం ఎలాగైనా దొరుకుతుంది, సేవ చేసి చూడండి, అక్కడ సెంటర్ అయితే ఉంది కదా. మందిరానికి ఉదయాన్నే వెళ్ళండి, రాత్రికి తిరిగి రండి. సెంటర్ తయారుచేయండి. అన్నింటికన్నా ఎక్కువగా మీరు శివుని మందిరాలలో సేవ చేయగలుగుతారు. ఉన్నతోన్నతమైనది శివుని మందిరమే. బొంబాయిలో బబుల్ నాథ్ మందిరము ఉంది. రోజంతా అక్కడకు వెళ్ళి సేవ చేసి అనేకుల కళ్యాణము చేయవచ్చు. ఈ బ్యాడ్జియే సరిపోతుంది. ప్రయత్నించి చూడండి. బాబా అంటారు, ఈ బ్యాడ్జిలు లక్ష ఏమిటి 10 లక్షలు తయారుచేయించండి. వృద్ధాప్యములో ఉన్నవారైతే చాలా మంచి సేవ చేయగలరు. ఎంతోమంది ప్రజలు తయారవుతారు. తండ్రి కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అంటారు. మన్మనాభవ అనే పదాన్ని మర్చిపోయారు. ఇది భగవానువాచ కదా. శివబాబా ఈ శ్రీకృష్ణునికి కూడా ఆ పదవిని ప్రాప్తి చేయిస్తారు, ఇక ఎదురుదెబ్బలు తినవలసిన అవసరమేముంది. తండ్రి అయితే, కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి అని అంటారు. మీరు శివుని మందిరాలలో అన్నింటికన్నా మంచి సేవ చేయగలుగుతారు. సేవా సఫలత కొరకు దేహీ-అభిమానీ అవస్థలో స్థితులై సేవ చేయండి. హృదయము స్వచ్ఛముగా ఉంటే సర్వ మనోకామనలు స్వతహాగా నెరవేరతాయి. బెనారస్ కొరకు బాబా విశేషంగా సలహా ఇస్తున్నారు - అక్కడ వానప్రస్థుల ఆశ్రమాలు కూడా ఉన్నాయి. మేము బ్రహ్మా పిల్లలమైన బ్రాహ్మణులము అని చెప్పండి. తండ్రి బ్రహ్మా ద్వారా తెలియజేస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయమూ లేదు. ఉదయం నుండి రాత్రి వరకూ శివుని మందిరములో కూర్చుని సేవ చెయ్యండి. ప్రయత్నం చేసి చూడండి. శివబాబాయే స్వయంగా అంటారు, నా మందిరాలైతే ఎన్నో ఉన్నాయి, మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు, వీరు శివబాబాను మహిమ చేస్తున్నారు అని ఇంకా సంతోషిస్తారు. ఇతను బ్రహ్మా, వీరు బ్రాహ్మణులు, వీరేమీ దేవత కారు అని చెప్పండి. వీరు కూడా శివబాబాను స్మృతి చేసి ఈ పదవిని పొందుతారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా వీరి ద్వారా చెప్తారు. ఇది ఎంత సహజము. వృద్ధులను ఎవ్వరూ అవమానించరు. బెనారస్ లో ఇంతవరకు అంత సేవ ఏమీ జరగలేదు. బ్యాడ్జీలు లేక చిత్రాలపై అర్థం చేయించడమైతే చాలా సహజము. ఎవరైనా పేదవారు ఉంటే వారికి - మీకు ఇది ఉచితముగా ఇస్తాము అని చెప్పండి. షావుకారులైతే, మీరు ఇస్తే అనేకమంది కళ్యాణము కోసం ఇంకా ఎక్కువగా ముద్రిస్తాము, అప్పుడు మీ కళ్యాణము కూడా జరుగుతుంది అని చెప్పండి. మీ ఈ వ్యాపారము అన్నింటికన్నా లాభదాయకమైనది. ఎవరైనా ప్రయత్నించి చూడండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానాన్ని జీవితములో ధారణ చేసి, ఆ తర్వాత సేవ చేయాలి. ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తారో, మంచి లక్షణాలు ఉన్నాయో, వారికి తప్పకుండా గౌరవాన్ని ఇవ్వాలి.

2. కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. సేవలో సఫలత కొరకు తమ అవస్థను దేహీ-అభిమానిగా తయారుచేసుకోవాలి. హృదయాన్ని స్వచ్ఛముగా ఉంచుకోవాలి.

వరదానము:-
సర్వ సమస్యల వీడ్కోల సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూప భవ

ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో, అప్పుడు సమాధాన స్వరూప ఆత్మల మాల తయారవుతుంది. సంపూర్ణ స్థితిలో సమస్యలనేవి బాల్యపు ఆటలా అనుభవమవుతాయి అనగా సమాప్తమైపోతాయి. ఏ విధంగా బ్రహ్మాబాబా ఎదురుగా పిల్లలు ఎవరైనా సమస్యను తీసుకుని వచ్చినట్లయితే, వారికి సమస్యకు సంబంధించిన విషయాలను మాట్లాడేందుకు ధైర్యము కూడా ఉండేది కాదు, వారు ఆ విషయాలనే మర్చిపోయేవారు. అదే విధంగా పిల్లలైన మీరు కూడా సమాధాన స్వరూపులుగా అయినట్లయితే అర్ధకల్పము కొరకు సమస్యల వీడ్కోల సమారోహము జరుగుతుంది. విశ్వము యొక్క సమస్యలకు సమాధానమే పరివర్తన.

స్లోగన్:-
ఎవరైతే సదా జ్ఞానాన్ని స్మరిస్తారో, వారు మాయా ఆకర్షణ నుండి రక్షింపబడతారు.

తమ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చేయండి

మీ డబల్ లైట్ ఫరిశ్తా స్వరూపములో స్థితులై సాక్షీగా అయ్యి పాత్రనంతటినీ చూస్తూ సకాష్ అనగా సహయోగాన్ని ఇవ్వండి ఎందుకంటే మీరు సర్వుల కళ్యాణానికి నిమిత్తులు. ఈ విధంగా సకాష్ను ఇవ్వడమే నిర్వర్తించడము, కానీ ఉన్నతమైన స్టేజ్పై స్థితులై సకాష్ను ఇవ్వండి. వాణి సేవతోపాటు మనసా శుభ భావనల వృత్తి ద్వారా సకాష్ను ఇచ్చే సేవ చేయండి.