03-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు రూప్ బసంత్ లు (యోగ స్వరూపులు,
జ్ఞాన స్వరూపులు), మీ నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి, కొత్తవారు ఎవరైనా
వచ్చినప్పుడు వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి’’
ప్రశ్న:-
మీ
అవస్థను ఏకరసముగా తయారుచేసుకోవడానికి సాధనము ఏమిటి?
జవాబు:-
సాంగత్యాన్ని
సంభాళించుకున్నట్లయితే అవస్థ ఏకరసముగా అవుతూ ఉంటుంది. సదా మంచి సర్వీసబుల్
విద్యార్థుల సాంగత్యాన్ని చేయాలి. ఒకవేళ ఎవరైనా జ్ఞానము మరియు యోగము గురించి కాకుండా
తప్పుడు మాటలను మాట్లాడుతున్నట్లయితే, నోటి నుండి రత్నాలకు బదులుగా రాళ్ళు
వెలువడుతున్నట్లయితే, అటువంటివారి సాంగత్యము విషయములో సదా జాగ్రత్తగా ఉండాలి.
పాట:-
రాత్రి
ప్రయాణీకుడా అలసిపోకు...
ఓంశాంతి
జ్ఞానము మరియు విజ్ఞానము. వీటిని అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికార వారసత్వము)
అని అంటారు. తండ్రి అల్ఫ్ మరియు బే యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. ఢిల్లీలో విజ్ఞాన్
భవన్ ఉంది కానీ వారెవ్వరికీ దాని అర్థం తెలియదు. దాని అర్థం జ్ఞానము మరియు యోగము అని
పిల్లలైన మీకు తెలుసు. యోగముతో మనము పవిత్రముగా అవుతాము, జ్ఞానముతో మన వస్త్రాలు
రంగరించబడతాయి. మనము మొత్తము చక్రమంతటినీ తెలుసుకుంటాము. యోగము యొక్క యాత్ర గురించి
కూడా ఈ జ్ఞానము లభిస్తుంది. వారెవ్వరూ యోగము గురించిన జ్ఞానాన్ని ఇవ్వరు. వారైతే
స్థూలమైన డ్రిల్ మొదలైనవి నేర్పిస్తారు. ఇది సూక్ష్మమైన మరియు ముఖ్యమైన విషయము. పాట
కూడా దీనికి సంబంధించినదే. తండ్రి అంటారు, ఓ పిల్లలూ, ఓ మూలవతన ప్రయాణీకులారా,
పతిత-పావనుడైన తండ్రియే సర్వుల సద్గతిదాత. వారే అందరికీ ఇంటికి వెళ్ళే మార్గాన్ని
తెలియజేస్తారు. మనుష్యులు మీ వద్దకు అర్థం చేసుకునేందుకు వస్తారు. ఎవరి వద్దకు
వస్తారు. ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీల వద్దకు వస్తారు. అప్పుడు, మీరు వారిని -
మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగాలి. మనుష్యులు సాధు-సన్యాసులు, మహాత్ముల వద్దకు
వెళ్తారు. ఫలానా మహాత్మ గారు అని వారికి పేరు కూడా ఉంటుంది. ఇక్కడైతే ప్రజాపిత
బ్రహ్మాకుమార, కుమారీలు అనే పేరే ఉంటుంది. బి.కె.లైతే అనేకమంది ఉన్నారు. మీరు ఎవరి
వద్దకు వచ్చారు, ప్రజాపిత బ్రహ్మా మీకు ఏమవుతారు అని మీరు వారిని అడగాలి. వారైతే
అందరికీ తండ్రి కదా. కొందరు ఏమంటారంటే - మీ మహాత్మగారిని, గురువుగారిని దర్శనము
చేసుకుంటాము అని. మీరు వారికి చెప్పండి - మీరు గురువు అని ఎలా అంటారు, ప్రజాపిత
బ్రహ్మాకుమారీ అన్న పేరు పెట్టడము జరిగిందంటే వారు తండ్రి అయినట్లు కదా, గురువు కాదు.
ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలు అంటేనే వీరికి ఎవరో తండ్రి ఉన్నట్లు. వారు మీకు
కూడా తండ్రియే. మేము బి.కె.ల తండ్రిని కలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పండి.
ప్రజాపిత అన్న పేరును ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది పుత్రులు మరియు పుత్రికలు ఉన్నారు.
తండ్రిని తెలుసుకున్నప్పుడే, వారు అనంతమైన తండ్రి అన్నది అర్థం చేసుకుంటారు.
ప్రజాపిత బ్రహ్మాకు కూడా తప్పకుండా ఎవరో తండ్రి ఉంటారు. కనుక ఎవరైనా వస్తే, వారిని
- ఎవరి వద్దకు వచ్చారు? బోర్డుపై ఏమి వ్రాసి ఉంది? అని అడగాలి. ఇన్ని సెంటర్లు
ఉన్నాయి, ఇంతమంది బ్రహ్మాకుమార, కుమారీలు ఉన్నారు అంటే తప్పకుండా బ్రహ్మా తండ్రి
అవుతారు, గురువు కాలేరు. ముందు ఈ విషయము వారి బుద్ధి నుండి తొలగాలి. ఇది ఒక ఇల్లు,
ఒక ఫ్యామిలీలోకి వచ్చాను అని భావించాలి. మేము ప్రజాపిత బ్రహ్మాకు సంతానము కావున
తప్పకుండా మీరు కూడా సంతానమే అవుతారు. అచ్ఛా, మరి ఆ బ్రహ్మా ఎవరి సంతానము? బ్రహ్మా,
విష్ణు, శంకరుల రచయిత అయితే పరమపిత పరమాత్మ శివుడు. వారు ఒక బిందువు, వారి పేరు శివ,
వారు మనకు తాతగారు. మీ ఆత్మ కూడా వారి సంతానమే. బ్రహ్మాకు మీరు కూడా సంతానము. కావున
మేము బాప్ దాదాను కలవాలనుకుంటున్నాము అని మీరు ఈ విధముగా అనండి. వారికి ఎలా అర్థం
చేయించాలంటే, వారి బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. నేను ఎవరి వద్దకు వచ్చాను,
ప్రజాపిత బ్రహ్మా నా తండ్రి, శివబాబా ఆత్మలందరికీ తండ్రి అని వారికి అర్థం కావాలి.
కావున ముందుగా - మేము ఎవరి వద్దకు వచ్చాము అన్నది అర్థం చేసుకోండి. యుక్తిగా ఏ
విధముగా అర్థం చేయించాలంటే, వారికి - మీరు శివబాబా సంతానమని, ఇది ఒక ఫ్యామిలీ అని
అర్థమవ్వాలి. వారికి తండ్రి మరియు తాతగారి పరిచయము లభించాలి. సర్వుల సద్గతిదాత
నిరాకార తండ్రి అని, వారు ప్రజాపిత బ్రహ్మా ద్వారా సర్వులకు సద్గతినిస్తారని, అందరూ
వారిని పిలుస్తారని మీరు అర్థం చేయించవచ్చు. తండ్రి వద్దకు వచ్చి వారి నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది మీరు చూస్తున్నారు కదా.
ముందు వారికి తండ్రి పరిచయము లభించాలి, అప్పుడు మేము బాప్ దాదాను కలుసుకునేందుకు
వచ్చామని వారు అర్థం చేసుకుంటారు. మీరు ఇలా చెప్పండి - మేము వారిని బాప్ దాదా అని
పిలుస్తాము. నాలెడ్జ్ ఫుల్, పతిత-పావనుడు ఆ శివబాబాయే కదా. ఆ తర్వాత అర్థం చేయించాలి
- భగవంతుడేమో సర్వుల సద్గతిదాత, నిరాకారుడు, జ్ఞానసాగరుడు, బ్రహ్మా ద్వారా మనము
అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కావున ఈ బ్రహ్మాకుమార, కుమారీలు శివబాబా
సంతానమని, వారే అందరికీ తండ్రి అని మనుష్యులు అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒక్కరే,
వారే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారు స్వర్గ రచయిత, సర్వులకు
తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. వారు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం
చేయిస్తారు అనగా త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. ఎవరైనా అర్థం చేసుకునేందుకు
యోగ్యులుగా కనిపిస్తే, వారికి ఈ విషయాలను అర్థం చేయించాలి. ముందుగా - మీకు ఎంతమంది
తండ్రులు అని అడగండి. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. తండ్రి అనేవారు
సర్వవ్యాపి అవ్వలేరు. లౌకిక తండ్రి నుండి ఆ వారసత్వము లభిస్తుంది, పారలౌకిక తండ్రి
నుండి ఈ వారసత్వం లభిస్తుంది, మరి వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు. ఈ పదాలను నోట్
చేసుకుని ధారణ చేయండి. ఇది తప్పకుండా అర్థం చేయించవలసి ఉంటుంది. అర్థం చేయించేవారు
మీరు. ఇది ఇల్లు, వీరు మనకు గురువు కాదు. వీరందరూ బ్రహ్మాకుమార, కుమారీలు అన్నది
మీరు చూస్తున్నారు. వారసత్వాన్ని మనకు నిరాకార శివబాబాయే ఇస్తారు, వారే సర్వుల
సద్గతిదాత. బ్రహ్మాను సర్వుల సద్గతిదాత, పతిత-పావనుడు, ముక్తిదాత అని అనలేము. ఇది
శివబాబా మహిమయే. ఎవరు వచ్చినా సరే, వారికి ఇదే అర్థం చేయించండి - వీరు సర్వుల బాప్
దాదా. ఆ తండ్రియే స్వర్గ రచయిత, ఈ బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారు. ఈ
విధముగా మీరెవరికి అర్థం చేయించినా సరే, ఇక వారికి బాబా వద్దకు వచ్చే అవసరమే ఉండదు.
వారు అలవాటు పడిపోయారు కావున గురువుగారి దర్శనము చేసుకుంటామని అంటారు... భక్తి
మార్గములో గురువులకు ఎంతో మహిమ చేస్తారు. వేద-శాస్త్రాలు, యాత్రలు మొదలైనవన్నీ
గురువులే నేర్పిస్తారు. మనుష్యులు గురువులు కాలేరని మీరు అర్థం చేయించాలి. మనము
బ్రహ్మాను కూడా గురువు అని అనము. సద్గురువు ఒక్కరే. మనుష్యులెవ్వరూ జ్ఞానసాగరునిగా
అవ్వలేరు. వారంతా భక్తి మార్గపు శాస్త్రాలను చదివేవారు, దానిని శాస్త్రాల జ్ఞానమని
అంటారు, దానినే ఫిలాసఫీ అని అంటారు. ఇక్కడ మనల్ని జ్ఞానసాగరుడైన తండ్రి చదివిస్తారు.
ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. జ్ఞానసాగరుడు అని బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా అనలేరు
అన్నప్పుడు మనుష్యులనెలా అనగలరు. మనుష్యులు జ్ఞానము యొక్క అథారిటీగా కాలేరు.
శాస్త్రాల అథారిటీ అని కూడా పరమపిత పరమాత్మనే అంటారు. పరమపిత పరమాత్మ ఈ బ్రహ్మా
ద్వారా అన్ని వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు అన్నట్లుగా చూపిస్తారు.
తండ్రి అంటారు, నా గురించి ఎవరికీ తెలియనే తెలియదు అన్నప్పుడు ఇక వారసత్వము ఎక్కడ
నుండి లభిస్తుంది. అనంతమైన వారసత్వము అనంతమైన తండ్రి ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు
ఈ బాబా ఏమి చేస్తున్నారు. ఇవి హోలీ మరియు ధురియా పండుగలు కదా. జ్ఞానము మరియు
విజ్ఞానము అని కేవలం రెండు పదాలే ఉన్నాయి. మన్మనాభవ జ్ఞానాన్ని కూడా ఇస్తారు. నన్ను
స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. కావున ఈ జ్ఞానము మరియు విజ్ఞానము -
హోలీ మరియు ధురియా వంటివి. మనుష్యులలో జ్ఞానము లేని కారణముగా వారు ఒకరి ముఖముపై ఒకరు
ధూళిని వేసుకుంటారు. వాస్తవానికి అలానే ఉన్నారు. గతి, సద్గతులు ఎవ్వరికీ లభించవు.
ముఖముపై ధూళినే వేసుకుంటారు. జ్ఞానము యొక్క మూడవ నేత్రము ఎవ్వరికీ లేదు. కల్పిత
కథలను వింటూ వచ్చారు. దానిని అంధ విశ్వాసమని అంటారు.
ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. పిల్లలైన మీరు
తండ్రి నుండి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇతరులకు సలహానివ్వాలి, అప్పుడు
వారికి తెలుస్తుంది - వీరు బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నారు, అది
ఇంకెవ్వరి నుండి లభించదు అని. అన్ని సెంటర్లపైనా ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలు
అన్న పేరు వ్రాయబడి ఉంది. ఒకవేళ గీతా పాఠశాల అని వ్రాసినట్లయితే, అది సామాన్యమైన
విషయమైపోతుంది. ఇప్పుడు మీరు కూడా బి.కె. అని వ్రాసినట్లయితేనే తండ్రి పరిచయాన్ని
ఇవ్వగలరు. మనుష్యులు బి.కె. అన్న పేరు విని భయపడిపోతారు, అందుకే గీతా పాఠశాల అన్న
పేరు వ్రాస్తారు. కానీ ఇందులో భయపడే విషయమేమీ లేదు. మీరు ఇలా చెప్పండి - ఇది ఇల్లు,
మీరు ఎవరి ఇంటికి వచ్చారో తెలుసా? వీరందరి తండ్రి ప్రజాపిత బ్రహ్మా. భారతవాసులు
ప్రజాపిత బ్రహ్మాను నమ్ముతారు. క్రిస్టియన్లు కూడా, ఒకప్పుడు ఆదిదేవ్ ఉండి వెళ్ళారని,
ఈ మనుష్య వంశావళి వారిదేనని భావిస్తారు. కానీ వారు నమ్మడమైతే తమ క్రైస్టునే
నమ్ముతారు. క్రైస్టును, బుద్ధుడిని ఫాదర్ గా భావిస్తారు. వారి వంశవృక్షము ఉంటుంది
కదా. వాస్తవానికి తండ్రి, బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన
చేసారు. బ్రహ్మా గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. మొదట తండ్రి పరిచయాన్ని
ఇవ్వాలి. మేము మీ తండ్రిగారిని కలవాలనుకుంటున్నామని వారు అంటే, మీరు వారికి చెప్పండి
- వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది, బ్రహ్మాబాబా నుండి కాదు. మీ తండ్రి ఎవరు?
గీతా భగవానుడు ఎవరు? ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేసారు? తండ్రి
అన్న మాట వినగానే ఈ బ్రహ్మాకుమార, కుమారీలంతా శివబాబా సంతానమని అర్థం చేసుకుంటారు.
గతి మరియు సద్గతుల వారసత్వము శివుడి నుండి బ్రహ్మా ద్వారా లభిస్తుంది. వారు ఈ
సమయములో మనకు జీవన్ముక్తిని ఇస్తున్నారు, మిగిలినవారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఈ
జ్ఞానము పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఎవరు వచ్చినా సరే వారికి అర్థం చేయించండి -
మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు, వారు మాకు కూడా మరియు మీకు కూడా తండ్రియే, ఇక్కడ
గురువులు, సన్యాసులు ఎవరూ లేరు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే హోలీ, ధురియా
పండుగలను జరుపుకుంటారు కదా, లేకపోతే హోలీ, ధురియాలకు ఎటువంటి అర్థం ఉండదు. జ్ఞానముతో
వస్త్రాలను రంగరించుకుంటారు. ఆత్మ ఈ వస్త్రము లోపల ఉంది. ఆత్మ పవిత్రముగా
అయినట్లయితే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఇది పవిత్రమైన శరీరము కాదు, ఇది
సమాప్తమవ్వనున్నది. గంగా స్నానము శరీరానికి చేయిస్తారు, కానీ పతిత-పావనుడు ఒక్క
తండ్రి తప్ప ఇంకెవ్వరూ కారు. పతితముగా ఆత్మ అవుతుంది, ఆత్మ నీటి స్నానముతో పావనముగా
అవ్వలేదు. ఇది ఎవరికీ తెలియదు. వారైతే ఆత్మయే పరమాత్మ, ఆత్మ నిర్లేపి అని అంటారు.
ఇప్పుడు ఎవరైతే తెలివైనవారిగా అయ్యారో, వారే ధారణ చేయగలరు మరియు చేయించగలరు. ఏ
పిల్లల నోటి ద్వారా సదా రత్నాలే వెలువడుతాయో, వారిని రూప్-బసంత్ (యోగ స్వరూపులు,
జ్ఞాన స్వరూపులు) అని అంటారు. జ్ఞానము-విజ్ఞానము తప్ప పరస్పరములో ఏది
ఇచ్చి-పుచ్చుకున్నా సరే, వారు రాళ్ళు విసురుకుంటున్నట్లే. సర్వీస్ కు బదులుగా
డిస్సర్వీస్ చేస్తారు. 63 జన్మలు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకుంటూ వచ్చారు. ఇప్పుడు
తండ్రి అంటారు, మీరు జ్ఞానము, విజ్ఞానము యొక్క విషయాలను మాట్లాడి వారి మనసును
సంతోషపెట్టాలి. వ్యర్థమైన పరచింతన విషయాలను వినకూడదు. ఇది జ్ఞానము కదా. మొత్తము
ప్రపంచమంతా ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకుంటున్నారు.
పిల్లలైన మీరైతే రూప్-బసంత్ లు. మీరు జ్ఞానము-విజ్ఞానము తప్ప ఇంకేదీ వినకూడదు,
వినిపించకూడదు. ఎవరైతే తప్పుడు మాటలను మాట్లాడుతారో, వారి సాంగత్యము చెడ్డది. చాలా
సేవ చేసేవారు ఎవరైతే ఉంటారో, వారి సాంగత్యము తీరానికి చేరుస్తుంది... కొంతమంది
బ్రాహ్మణులు రూప్-బసంత్ లుగా (యోగ స్వరూపులు, జ్ఞాన స్వరూపులు) ఉన్నారు, కొంతమంది
బ్రాహ్మణులై ఉండి తప్పుడు మాటలను మాట్లాడుతూ ఉంటారు. అటువంటివారి సాంగత్యము చేయకూడదు,
వారు మరింత నష్టపరుస్తారు. బాబా పదే-పదే సావధానపరుస్తూ ఉంటారు. పరస్పరము ఎప్పుడూ
తప్పుడు మాటలను మాట్లాడుకోకండి. లేదంటే, స్వయము కూడా సర్వనాశనము అవుతారు, ఇతరులను
కూడా సర్వనాశనము చేస్తారు, అప్పుడిక పదభ్రష్టులైపోతారు. బాబా ఎంత సహజముగా
వినిపిస్తారు. బాబా, మేము వెళ్ళి అనేకులకు ఈ జ్ఞానాన్ని ఇస్తామని చెప్పేటువంటి
అభిరుచి ఉండాలి. అటువంటివారే తండ్రికి సత్యమైన పిల్లలు. సర్వీసబుల్ పిల్లలను తండ్రి
కూడా మహిమ చేస్తారు. వారి సాంగత్యము చేయాలి. మంచి విద్యార్థుల సాంగత్యములో ఎవరు
ఉన్నారు మరియు ఎవరి సాంగత్యములో ఉండాలి అనేది బాబాను అడిగినట్లయితే చెప్పగలరు. బాబా
హృదయాన్ని ఎవరు అధిరోహించారని అడిగినట్లయితే, వారు వెంటనే చెప్తారు. సేవ చేసేవారి
పట్ల బాబాకు కూడా గౌరవము ఉంటుంది. కొంతమందైతే సేవను కూడా చేయలేరు. ఇలా చాలామందికి
చెడు సాంగత్యము లభించడముతో అవస్థ కింద-మీద అయిపోతుంది. అయితే, కొంతమంది స్థూల సేవలో
బాగున్నారు, వారు కూడా మంచి వారసత్వాన్ని పొందుతారు. అల్ఫ్ మరియు బే లను (భగవంతుడిని
మరియు రాజ్యాధికార వారసత్వాన్ని) అర్థం చేసుకోవడమైతే చాలా సహజము. ఎవరికైనా సరే,
కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్పండి. కేవలం రెండే పదాలు
ఉన్నాయి - అల్ఫ్ మరియు బే. ఇది పూర్తిగా సహజము. ఎవరు వచ్చినా సరే వారికి కేవలం ఇదే
చెప్పండి - నన్నొక్కరినే స్మృతి చేయండి అన్నది బాబా ఆజ్ఞ, అంతే. అన్నింటికన్నా
గొప్ప మర్యాద ఇదే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు స్వర్గ వారసత్వము
లభిస్తుంది. ప్రతి సెంటర్ లోనూ ఈ విధముగా నంబరువారుగా ఉన్నారు. కొంతమంది వివరముగా
అర్థం చేయించగలరు. ఒకవేళ అర్థం చేయించలేకపోతే, కేవలం ఈ విషయాన్ని చెప్పండి -
కల్పక్రితము కూడా తండ్రి చెప్పారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకే దేహధారులు,
దేవతలు మొదలైనవారిని కూడా స్మృతి చేయకండి అని. ఇకపోతే, వ్యర్థమైన పరచింతన విషయాలను,
ఫలానావారు ఇలా అంటారు, ఇది చేస్తారు... అన్న విషయాలను, ఇవేవీ మాట్లాడుకోకండి. ఈ బాబా
మీ చేత హోలీ మరియు ధురియాలను ఆడించారు. ఇకపోతే, రంగులు మొదలైనవి వేసుకోవడమైతే ఆసురీ
మనుష్యుల పని. ఎవరైనా ఇతరుల నిందను వినిపిస్తే వినకూడదు. బాబా ఎంత మంచి విషయాలను
వినిపిస్తారు - మన్మనాభవ, మధ్యాజీభవ. ఎవరు వచ్చినా సరే, వారికి ఇదే అర్థం చేయించండి
- శివబాబా అందరికీ తండ్రి, నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వము లభిస్తుందని
వారు చెప్తున్నారు. గీతా భగవానుడు కూడా వారే. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. కావున
పిల్లలైన మీ పని సేవ చేయడము, తండ్రి స్మృతిని ఇప్పించడము. ఇది మహామంత్రము, దీనితో
రాజధాని యొక్క తిలకము లభిస్తుంది. ఎంత సహజమైన విషయము - తండ్రిని స్మృతి చేయండి మరియు
చేయించండి, అప్పుడు నావ తీరానికి చేరిపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తెలివైనవారిగా అయి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ నోటి ద్వారా
రాళ్ళను విసిరి డిస్సర్వీస్ చేయకూడదు. జ్ఞాన-యోగాల గురించి తప్ప ఇంకేమీ చర్చించకూడదు.
2. ఎవరైతే రూప్-బసంతులుగా (యోగ స్వరూపులుగా, జ్ఞాన స్వరూపులుగా) ఉంటారో,
సర్వీసబుల్ గా ఉంటారో, వారి సాంగత్యమే చేయాలి. ఎవరైతే తప్పుడు మాటలను వినిపిస్తారో,
వారి సాంగత్యాన్ని చేయకూడదు.
వరదానము:-
జ్ఞానము ద్వారా రావణుడి బహురూపాలను తెలుసుకుని అతడి ఆకర్షణ
నుండి ముక్తులుగా ఉండే ధైర్యశాలి భవ
ఏ పిల్లలైతే జ్ఞానము ద్వారా రావణుడి బహురూపాలను బాగా
తెలుసుకున్నారో, వారి ఎదురుగా అతడు దగ్గరకు కూడా రాలేడు. బంగారు రూపాన్ని ధరించినా,
వజ్రతుల్యమైన రూపాన్ని ధరించినా కానీ అతడి ఆకర్షణలోకి రారు. అటువంటి సత్యమైన సీతలుగా
అయి గీత లోపల ఉండే లక్ష్యము పెట్టుకుని ధైర్యశాలులుగా కండి. అప్పుడు ఈ రావణుడి
యొక్క పెద్ద సైన్యము దాడి చేసేందుకు బదులుగా మీకు సహయోగిగా అవుతుంది. ప్రకృతి యొక్క
పంచ తత్వాలు మరియు పంచ వికారాలు ట్రాన్స్ఫర్ అయి మీ సేవ కొరకు అక్కడికి వస్తాయి.
స్లోగన్:-
సేవలలో
సఫలతను ప్రాప్తి చేసుకోవాలంటే నిర్మానచిత్తము యొక్క విశేషతను ధారణ చేయండి.
అవ్యక్త సూచనలు -
‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’
విజయులుగా అయ్యేందుకు
పునాది - ‘‘నిశ్చయము’’. పునాది ఒకవేళ పక్కాగా ఉన్నట్లయితే భవనము కదలలేదు, నిశ్చింతగా
ఉంటారు. ఒకవేళ పునాది కచ్చాగా ఉన్నట్లయితే కొద్దిపాటి తుఫాను వచ్చినా కానీ, కొద్దిగా
భూమి కంపించినా కానీ, మా భవనము కూలిపోదు కదా లేక పగుళ్ళు ఏమీ రావు కదా అని
భయమేస్తుంది. కానీ నిశ్చయమనే పునాది పక్కాగా ఉన్నట్లయితే నిర్భయులుగా మరియు
నిశ్చింతగా ఉంటారు.
| | | |