03-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - విశ్వానికి యజమానులుగా తయారుచేసే తండ్రిని ఎంతో అభిరుచితో స్మృతి చేయండి, స్మృతి ద్వారానే మీరు సతోప్రధానముగా అవుతారు’’

ప్రశ్న:-
ఏ ఒక్క విషయం పట్ల పూర్తి ధ్యాసను ఉంచినట్లయితే బుద్ధి యొక్క కపాటము తెరుచుకుంటుంది?

జవాబు:-
చదువు పట్ల. భగవంతుడు చదివిస్తున్నారు, అందుకే ఎప్పుడూ కూడా చదువు మిస్ అవ్వకూడదు. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు అమృతాన్ని త్రాగాలి. చదువుపై అటెన్షన్ పెట్టాలి, ఆబ్సెంట్ అవ్వకూడదు. ఇక్కడ నుండి, అక్కడ నుండి వెతుక్కునైనా సరే, మురళిని తప్పకుండా చదవాలి. మురళిలో రోజూ కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి, వాటి ద్వారా మీ కపాటము తెరుచుకుంటుంది.

ఓంశాంతి
శివ భగవానువాచ - సాలిగ్రామాల కోసము. ఈ విధంగానైతే మొత్తం కల్పమంతటిలోనూ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, ఇది కూడా మీకే తెలుసు, ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. మనుష్యులకు ఈ రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాలను గురించి ఏమాత్రము తెలియదు. స్థాపనా కార్యములో విఘ్నాలైతే తప్పకుండా కలిగేదే ఉందని పిల్లలైన మీకు తెలుసు, దీనిని జ్ఞాన యజ్ఞము అని అంటారు. ఈ పాత ప్రపంచములో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా స్వాహా అయిపోనున్నదని తండ్రి అర్థం చేయిస్తారు. అందుకే దానిపై ఇక మమకారాన్ని పెట్టుకోకూడదు. తండ్రి వచ్చి కొత్త ప్రపంచం కోసం చదివిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇది వికారీ మరియు నిర్వికారీ ప్రపంచము యొక్క సంగమము, ఇప్పుడు పరివర్తన జరగనున్నది. కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచము అని అంటారు, అక్కడ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉండేది. ఈ పాయింట్లు అర్థం చేసుకోవాల్సినవాని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి రాత్రింబవళ్ళూ చెప్తూ ఉంటారు - పిల్లలూ, మీకు గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ఎప్పటివరకైతే తండ్రి ఉంటారో, అప్పటివరకూ చదువు కొనసాగవలసిందే. ఇక ఆ తర్వాత చదువు కూడా ఆగిపోతుంది. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు, అది బాప్ దాదాకే తెలుసు. ఎంతమంది పడిపోతారు, ఎంత కష్టం కలుగుతుంది. అందరూ సదా పవిత్రంగా ఉండగలరని కాదు. పవిత్రంగా ఉండకపోతే ఇక శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. మాలలోని మణులే పాస్ విత్ హానర్లుగా అవుతారు. ఆ తర్వాత ప్రజలు కూడా తయారవుతారు. ఇవి ఎంతగానో అర్థం చేసుకోవలసిన విషయాలు. మీరు ఎవరికైనా అర్థం చేయించినా సరే, వారు అర్థం చేసుకోగలరా, దాని కోసం సమయం పడుతుంది. అది కూడా ఎంతగానైతే తండ్రి అర్థం చేయించగలరో, అంతగా మీరు అర్థం చేయించలేరు. ఫలానావారు వికారాలలో పడిపోయారు, ఇది జరిగింది... అని రిపోర్టులు మొదలైనవేవైతే వస్తాయో - వాటి గురించి తండ్రికే తెలుసు. వారి పేర్లు అయితే చెప్పరు. పేర్లు చెప్పినట్లయితే ఇక వారితో మాట్లాడటానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు. అందరూ వారిని ద్వేష దృష్టితో చూస్తారు, వారు అందరి హృదయం నుండి దిగిపోతారు. చేసుకున్న సంపాదనంతా నష్టమైపోతుంది. ఈ విషయము గురించి, ఎవరైతే దెబ్బ తిన్నారో వారికే తెలుస్తుంది మరియు తండ్రికే తెలుస్తుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు.

మీరు అంటారు - ఫలానావారిని కలిసాము, వారికి చాలా బాగా అర్థం చేయించాము, వారు సేవలో సహాయం చేయగలరు అని. కానీ, వారు కూడా సమ్ముఖంలోకి వచ్చినప్పుడే అది సాధ్యం కదా. ఉదాహరణకు గవర్నర్ కు మీరు మంచి రీతిలో అర్థం చేయించినా, వారు ఏమైనా ఇతరులకు అర్థం చేయించగలరా. ఒకవేళ ఎవరికైనా అర్థం చేయించినా వాళ్ళు అంగీకరించరు. ఎవరైతే అర్థం చేసుకునేది ఉంటుందో, వారే అర్థం చేసుకుంటారు, ఇతరులకు అర్థం చేయించలేరు. ఇది ముళ్ళ అడవి అని, దీనిని మనం మంగళముగా తయారుచేస్తామని పిల్లలైన మీరు అర్థం చేయిస్తారు. మంగళం భగవాన్ విష్ణు అని అంటారు కదా. ఈ శ్లోకాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఎప్పుడైతే విష్ణువు యొక్క రాజ్యం ఉంటుందో, అప్పుడే మంగళముగా ఉంటుంది. విష్ణువు అవతరణను కూడా చూపిస్తారు. బాబా అయితే అంతా చూసారు, వారు అనుభవజ్ఞులు కదా, వారికి అన్ని ధర్మాల వారి గురించి బాగా తెలుసు. తండ్రి ఎవరి తనువులోకైతే వస్తారో, వారికి పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. అందుకే తండ్రి అంటారు - వీరి అనేక జన్మల అంతిమంలో, ఎప్పుడైతే వీరు ఇక్కడ పెద్ద అనుభవజ్ఞునిగా అవుతారో, అప్పుడు నేను వీరిలోకి ప్రవేశిస్తాను. వీరు కూడా సాధారణమైనవారు. పర్సనాలిటీ అనగా వారు రాజు లేదా రాజవంశానికి చెందినవారు అనేమీ కాదు. అలా కాదు, వీరికైతే ఎంతో అనుభవం ఉంది. వీరి రథములోకి అనేక జన్మల అంతిమంలో వస్తాను.

ఇక్కడ రాజధాని స్థాపన అవుతోందని, మాల తయారవుతోందని మీరు అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ రాజధాని ఎలా స్థాపన అవుతూ ఉంది, కొందరు రాజు-రాణీగా అవుతారు, మరికొందరు ఇంకేదో అవుతారు, ఈ విషయాలన్నింటినీ ఒకే రోజులోనైతే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భగవంతుడు వచ్చి అర్థం చేయిస్తారు, అయినా కానీ కష్టం మీద కొద్దిమందే పవిత్రంగా అవుతారు. ఇది అర్థం చేసుకోవడానికి కూడా సమయం కావాలి. ఎన్ని శిక్షలు అనుభవిస్తారు. శిక్షలు అనుభవించి కూడా ప్రజలుగా అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీరు చాలా-చాలా మధురంగా కూడా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రి వచ్చిందే అందరికీ సుఖము యొక్క దారిని తెలియజేయడానికి, దుఃఖము నుండి విడిపించడానికి. మరి అటువంటప్పుడు స్వయం ఇతరులకు దుఃఖాన్ని ఎలా ఇస్తారు. ఈ విషయాలన్నింటి గురించి పిల్లలైన మీకే తెలుసు. బయటివారు అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు.

సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారందరి నుండి మమకారాన్ని తొలగించాలి. ఇంట్లో ఉండాలి కానీ నిమిత్తమాత్రంగా ఉండాలి. ఈ మొత్తం ప్రపంచమంతా అంతమవ్వనున్నదని బుద్ధిలో ఉంది. కానీ, ఈ ఆలోచన కూడా ఎవరికీ ఉండదు. అనన్యులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అర్థం చేసుకుంటారు, వారు కూడా ఇప్పుడు నేర్చుకునే పురుషార్థాన్ని చేస్తూ ఉంటారు. చాలా మంది ఫెయిల్ కూడా అవుతారు. మాయ యొక్క పన్నాగాలు ఎంతగానో నడుస్తాయి. అది కూడా ఎంతో శక్తివంతమైనది. కానీ ఈ విషయాలను ఇతరులెవ్వరికీ అర్థం చేయించలేరు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ని రిపోర్టులు మొదలైనవి ఎందుకు వస్తున్నాయి - అన్నది తెలుసుకోవడానికి మీ వద్దకు వస్తారు. ఇప్పుడు వాళ్ళంతా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కావున మళ్ళీ ఒక్కొక్కరికి కూర్చొని అర్థం చేయించవలసి ఉంటుంది. అర్థం చేయించిన తర్వాత, ఇదైతే చాలా మంచి సంస్థ అని అంటారు. రాజధాని యొక్క స్థాపనా విషయాలు చాలా గుహ్యమైనవి మరియు గూఢమైనవి. అనంతమైన తండ్రి పిల్లలకు లభించారు కావున ఎంత హర్షితంగా ఉండాలి. మనం విశ్వాధిపతులుగా, దేవతలుగా అవుతాము కావున మనలో దైవీ గుణాలు కూడా తప్పకుండా ఉండాలి. లక్ష్యము-ఉద్దేశ్యమైతే ఎదురుగా నిలబడి ఉంది. వీరు కొత్త ప్రపంచానికి యజమానులు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటారు. మనం చదువుకుంటాము, జ్ఞానసాగరుడైన అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తారు, అమరపురిలోకి లేక స్వర్గములోకి తీసుకువెళ్ళడానికి మనకు ఈ జ్ఞానం లభిస్తుంది. ఎవరైతే కల్ప-కల్పమూ రాజ్యాన్ని తీసుకున్నారో వారే వస్తారు. కల్పపూర్వము వలె మనం మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. ఈ మాల నంబరువారుగా తయారవుతుంది. ఏ విధంగానైతే స్కూల్లో కూడా, ఎవరైతే బాగా చదువుకుంటారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది కదా. అవి హద్దులోని విషయాలు, మీకు అనంతమైన విషయాలు లభిస్తాయి. మీరు ఎవరైతే తండ్రికి సహాయకులుగా అవుతారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. వాస్తవానికైతే మీకు మీరే సహాయం చేసుకోవాలి, పవిత్రంగా అవ్వాలి. మీరే సతోప్రధానంగా ఉండేవారు, మళ్ళీ తప్పకుండా అలా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయవచ్చు. ఏ తండ్రి అయితే మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని ఎంతో అభిరుచితో స్మృతి చేయాలి. కానీ, మాయ విడిచిపెట్టదు. బాబా, మాకు మాయా వికల్పాలు ఎంతగానో వస్తున్నాయి అని అనేక విధాలుగా రకరకాల రిపోర్టులను వ్రాస్తారు. తండ్రి అంటారు - ఇది యుద్ధ మైదానము కదా. పంచ వికారాలపై విజయాన్ని పొందాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మేము సతోప్రధానంగా అవుతాము అని మీరు కూడా భావిస్తారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, భక్తి మార్గం వారెవ్వరికీ తెలియదు. ఇది చదువు. తండ్రి అంటారు - మీరు పావనంగా ఎలా అవుతారు! మీరు పావనంగా ఉండేవారు, మళ్ళీ అలా తయారవ్వాలి. దేవతలు పావనంగా ఉంటారు కదా. విద్యార్థులమైన మనం చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. భవిష్యత్తులో మళ్ళీ సూర్యవంశీ రాజ్యములోకి వస్తాము. దాని కోసం పురుషార్థము కూడా మంచి రీతిలో చేయాలి. అంతా మార్కులపైనే ఆధారపడి ఉంది. యుద్ధ మైదానములో ఫెయిల్ అవ్వడం వలన చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. వారేమో యుద్ధం అన్న మాటను విని విల్లు-బాణాలు మొదలైనవాటిని చూపించారు. విల్లు-బాణాలు మొదలైనవి ఉపయోగించడానికి, అక్కడేమైనా బాహుబల యుద్ధం జరిగిందా? అటువంటి విషయమేదీ లేదు. ఇంతకుముందు బాణాలతో యుద్ధాలు జరిగేవి. ఈ సమయం వరకూ కూడా వాటి గుర్తులు ఉన్నాయి. కొందరు బాణాలు వేయడంలో చాలా చురుకుగా ఉంటారు. ఇప్పుడు ఈ జ్ఞానములో యుద్ధం మొదలైనవాటి విషయమేదీ లేదు.

శివబాబాయే జ్ఞానసాగరుడని, వారి ద్వారా మనం ఈ పదవిని పొందుతామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి అంటారు - దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించివేయాలి. ఇవన్నీ పాతవి, కొత్త ప్రపంచము స్వర్ణిమయుగమైన భారత్. ఆ పేరు ఎంత ప్రసిద్ధముగా ఉండేది. ప్రాచీన యోగాన్ని ఎప్పుడు మరియు ఎవరు నేర్పించారు? ఇది ఎవ్వరికీ తెలియదు. ఎప్పటివరకైతే వారు స్వయమే వచ్చి అర్థం చేయించరో, అప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. ఇది కొత్త విషయము. కల్ప-కల్పము ఏదైతే జరుగుతూ వచ్చిందో, అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అందులో తేడా ఏమీ ఉండదు. తండ్రి అంటారు - ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉన్నట్లయితే ఇక మళ్ళీ 21 జన్మలు మీరు ఎప్పుడూ అపవిత్రంగా అవ్వరు. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, అయినా కానీ అందరూ ఒకే విధంగా చదువుకుంటారా. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. రావడం చదువుకోవడానికే వస్తారు, మళ్ళీ కొద్దిగా చదువుకుని మాయమైపోతారు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారు - తాము ఎలా వచ్చారు, మళ్ళీ ఏ విధంగా పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేసారు అని తమ అనుభవాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు - పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారైనా కూడా పతితులుగా అయినట్లయితే చేసుకున్న సంపాదనంతా నష్టమైపోతుంది. ఆ తర్వాత అది లోలోపల తింటూ ఉంటుంది. ఇక అప్పుడు తండ్రిని స్మృతి చేయండి అని ఇంకెవ్వరికీ చెప్పలేరు. ముఖ్యంగానైతే వికారాల గురించే అడుగుతారు. పిల్లలైన మీరు ఈ చదువును రెగ్యులర్ గా (క్రమం తప్పకుండా) చదువుకోవాలి. తండ్రి అంటారు, నేను మీకు కొత్త-కొత్త విషయాలను వినిపిస్తాను. మీరు విద్యార్థులు, మిమ్మల్ని భగవంతుడు చదివిస్తారు! మీరు భగవంతుని విద్యార్థులు. ఇటువంటి ఉన్నతోన్నతమైన చదువునైతే ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. ఒక్క రోజు మురళి వినకపోయినా సరే ఆబ్సెంట్ పడిపోతుంది. మంచి-మంచి మహారథులు కూడా మురళిని మిస్ చేసేస్తారు. మాకైతే అన్నీ తెలుసు కదా, కావున మురళి చదవకపోతే ఏమవుతుంది అని వారు భావిస్తారు. అరే, ఆబ్సెంట్ పడిపోతుంది, ఫెయిల్ అయిపోతారు. తండ్రి స్వయం అంటున్నారు - నేను రోజూ ఎటువంటి మంచి-మంచి పాయింట్లను వినిపిస్తానంటే, అవి ఇతరులకు అర్థం చేయించడానికి మీకు సమయానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని వినే వినకపోతే ఇక అవి ఎలా ఉపయోగిస్తారు. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకూ అమృతాన్ని త్రాగాలి, శిక్షణలను ధారణ చేయాలి. ఆబ్సెంట్ అయితే ఎప్పుడూ అవ్వకూడదు. ఇక్కడ నుండి, అక్కడ నుండి వెతుక్కునైనా సరే, ఎవరి నుండైనా తీసుకొని అయినా సరే మురళిని చదవాలి. స్వయం విషయములో అహంకారం ఉండకూడదు. అరే, భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు, కావున ఇక్కడ ఒక్క రోజు కూడా మిస్ చెయ్యకూడదు. ఎటువంటి పాయింట్లు వెలువడతాయంటే వాటి వలన మీదైనా లేక ఇంకెవరిదైనా బుద్ధి యొక్క కపాటము తెరుచుకోగలదు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు, పాత్ర ఎలా కొనసాగుతుంది, ఇవి అర్థం చేసుకోవడానికి సమయం కావాలి. చివరిలో కేవలం - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి అన్నదే గుర్తుంటుంది. కానీ, ప్రస్తుతం ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ, స్మృతి చేస్తూ వెళ్ళిపోవాలి - చివరిలో కేవలం ఇదే అవస్థ ఉంటుంది. స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. అలా మీరు ఎంతవరకు అయ్యారు అన్నది మీరు అర్థం చేసుకోగలరు. అపవిత్రంగా ఉన్నవారికి బలం కూడా తప్పకుండా తక్కువగా లభిస్తుంది. పాస్ విత్ హానర్లుగా అయ్యేవారు ముఖ్యంగా 8 రత్నాలే ఉంటారు. వారు ఎటువంటి శిక్షలను అనుభవించరు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది ఎంత ఉన్నతమైన చదువు. మేము దేవతలుగా అవ్వగలము అన్నది స్వప్నములో కూడా ఉండదు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీరు పదమాపదమ భాగ్యశాలురుగా అవుతారు. దీని ముందైతే ఆ వ్యాపారాలు మొదలైనవి ఎందుకూ పనికిరావు, ఏదీ ఉపయోగపడేది లేదు, అయినా కానీ అవి చెయ్యాల్సి అయితే వస్తుంది. మేము శివబాబాకు ఇస్తున్నాము అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. అరే, మీరు పదమాపదమపతులుగా అవుతారు. ఇస్తున్నాము అన్న ఆలోచన వచ్చినట్లయితే శక్తి తగ్గిపోతుంది. మనుష్యులు తీసుకోవడం కోసమని ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేస్తారు కావున అది ఇవ్వడమెలా అవుతుంది. భగవంతుడైతే దాత కదా. వారు మరుసటి జన్మలో ఎంతగా ఇస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. భక్తి మార్గములో అల్పకాలికమైన సుఖము ఉంది, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖపు వారసత్వాన్ని పొందుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకూ అమృతాన్ని త్రాగాలి, శిక్షణలను ధారణ చేయాలి. భగవంతుడు చదివిస్తున్నారు, అందుకే ఒక్క రోజు కూడా మురళిని మిస్ చేయకూడదు.

2. పదమాల రెట్ల సంపాదనను జమ చేసుకోవడానికి నిమిత్తమాత్రముగా ఇంట్లో ఉంటూ, కార్య-వ్యవహారాలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి.

వరదానము:-

ప్రసన్నత యొక్క ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సర్వులను అధికారులుగా తయారుచేసే గాయన మరియు పూజన యోగ్య భవ

ఎవరైతే సర్వుల సంతుష్టతా సర్టిఫికేట్ ను తీసుకుంటారో, వారు సదా ప్రసన్నంగా ఉంటారు, మరియు ఈ ప్రసన్నత యొక్క ఆత్మిక పర్సనాలిటీ కారణంగా ప్రసిద్ధమైనవారిగా అనగా గాయన యోగ్యంగా మరియు పూజన యోగ్యంగా అవుతారు. శుభచింతకులుగా, ప్రసన్నచిత్తులుగా ఉండే ఆత్మలైన మీ ద్వారా సర్వులకు సంతోషము, ఒక ఆధారము, ధైర్యము అనే రెక్కలు మరియు ఉల్లాస-ఉత్సాహాల ప్రాప్తి ఏదైతే కలుగుతుందో - ఆ ప్రాప్తి కొందరిని అధికారులుగా చేస్తుంది, మరికొందరు భక్తులుగా అవుతారు.

స్లోగన్:-

తండ్రి నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము - హృదయపూర్వకమైన స్నేహము.