03-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఆశీర్వాదాలను తీసుకోవాలంటే
సర్వీసబుల్ గా, సుపుత్రులైన పిల్లలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వండి, ఎవరికీ కూడా
దుఃఖాన్ని ఇవ్వకండి’’
ప్రశ్న:-
ధర్మరాజు
శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఏ ఈశ్వరీయ నియమాల పట్ల అటెన్షన్ పెట్టాలి?
జవాబు:-
ఎప్పుడూ కూడా
ఈశ్వరుని ఎదురుగా ప్రతిజ్ఞ చేసి దానిని ఉల్లంఘించకూడదు. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు,
క్రోధము చేయకూడదు, విసిగించకూడదు అనగా ఈశ్వరుని పేరును అప్రతిష్ఠపాలు చేసే నడవడికను
నడుచుకోకూడదు. అలా చేస్తే వారు చాలా శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. అందుకే, అటువంటి
కర్మలేవీ చేయకూడదు. మాయ తుఫానులు ఎన్ని వచ్చినా కానీ, అనారోగ్యము తిరగబడినా కానీ,
రైట్-రాంగ్ యొక్క బుద్ధితో నిర్ణయించి, రాంగ్ కర్మల నుండి సదా సురక్షితముగా ఉండండి.
పాట:-
నా మనసు అనే
ద్వారము వద్దకు ఎవరు వచ్చారు...
ఓంశాంతి
ఓంశాంతి అని ఎవరన్నారు? బాప్ మరియు దాదా. మన పారలౌకిక తండ్రి పరమపిత పరమాత్మ శివుడని
మరియు వీరు (బ్రహ్మా) పిల్లలందరికీ అలౌకిక తండ్రి అని, వీరినే ప్రజాపిత బ్రహ్మా
అంటారని పిల్లలకు తప్పకుండా నిశ్చయము ఉంటుంది. ఇంతమంది పిల్లలు ప్రజాపిత బ్రహ్మాకు
తప్ప ఇంకెవరికైనా ఉంటారా. ఇంతకుముందు ఇంతమంది పిల్లలు ఉండేవారు కాదు. అనంతమైన తండ్రి
వీరిలో ప్రవేశించిన తర్వాత వీరు దాదాగా అయ్యారు. మీకు పారలౌకిక తండ్రి యొక్క ఆస్తి
లభిస్తుందని ఈ దాదా స్వయంగా అంటారు. మనవలు ఎప్పుడూ తాతగారికి వారసులుగా ఉంటారు. వారి
బుద్ధియోగము తాతగారి వైపుకు వెళ్తుంది ఎందుకంటే తాతగారి ఆస్తిపై హక్కు లభిస్తుంది.
ఎలాగైతే రాజుల వద్ద జన్మ తీసుకున్న పిల్లలు, ఇది పెద్దల ఆస్తి అని అంటూ ఉంటారు.
పెద్దల ఆస్తిపై వారికి ఎలాగూ హక్కు ఉంటుంది. మేము అనంతమైన తండ్రి ద్వారా అత్యంత
గొప్ప ఆస్తిని అనగా స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు.
మనల్ని ఆ తండ్రి చదివిస్తున్నారు. మీరు ఇప్పుడు సమ్ముఖముగా కూర్చున్నారు. సమ్ముఖముగా
ఉన్న నషా కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ఉంటుంది. కొందరి హృదయాలలోనైతే చాలా
ప్రేమ ఉంటుంది. మనము ఉన్నతోన్నతమైన భగవంతునికి ఈ సాకార మాతా-పితల ద్వారా వారసులుగా
అవుతాము. అనంతమైన తండ్రి చాలా మధురమైనవారు, వారు మనల్ని రాజ్యానికి యోగ్యులుగా
తయారుచేస్తారు. మాయ అసలు ఏ మాత్రము యోగ్యత లేనివారిగా చేసేసింది. నిన్న బాబాను
కలుసుకునేందుకు ఎవరో వచ్చారు కానీ వారేమీ అర్థం చేసుకోలేదు. వారికి బాబా అర్థం
చేయించారు - వీరంతా బ్రహ్మాకుమారులు, మీరు కూడా బ్రహ్మాకు మరియు శివునికి బిడ్డ కదా.
దానికి అతను, అవును నిజమే అని అన్నారు. ఇది కేవలం విని, అవును అని అన్నారు కానీ అతని
హృదయానికి ఏమీ అనిపించలేదు. నిజంగా నేను వారి బిడ్డనే అనే బాణము తగలలేదు. వీరు (బ్రహ్మా)
కూడా తండ్రి సంతానమే, వారసత్వము తీసుకుంటున్నారు. ఈ విధముగా మన వద్ద కూడా కొంతమంది
పిల్లలకు చాలా కొంచెం మాత్రమే బుద్ధిలో కూర్చుంటుంది. వారిలో ఆ సంతోషము, ఆ ఆత్మిక
నషా కనిపించవు. లోపల సంతోషపు పాదరసము బాగా పైకి ఎక్కాలి. అదంతా ముఖముపై కూడా
కనిపిస్తుంది. ఇప్పుడు ప్రేయసులైన మీకు జ్ఞాన అలంకరణ జరుగుతుంది. మీరు ఆ ప్రియునికి
ప్రేయసులని మీకు తెలుసు. ఒక రైతు కూతురి కథ ఉంది కదా. ఒక రాజు, రైతు కూతురిని
రాజ్యానికి తీసుకువస్తారు కానీ ఆమెకు ఆ రాజ్యములో మజా అనిపించలేదు కనుక ఆమెను తిరిగి
పల్లెలో విడిచిపెట్టి వచ్చారు. నీవు రాజ్యానికి యోగ్యురాలివి కావు అని అన్నారు.
ఇక్కడ కూడా తండ్రి అలంకరిస్తున్నారు. మీరు భవిష్యత్తులో మహారాణిగా అవ్వండి అని
అంటారు. పట్టపురాణిగా చేయడానికి ఎత్తుకువెళ్ళారని శ్రీకృష్ణుడి గురించి కూడా అంటారు
కానీ ఏమీ అర్థం చేసుకోరు, అందరూ అధర్మయుక్తమైనవారే. ప్రపంచము ఇలాగే నడుస్తూ ఉంటుందని,
ఇది స్వాభావికమని అనుకుంటారు. చాలామంది మందిరాలకు కూడా వెళ్ళరు, శాస్త్రాలు
మొదలైనవాటిని కూడా నమ్మరు. గవర్నమెంట్ కూడా ధర్మాన్ని నమ్మదు. భారత్ ఏ ధర్మానికి
చెందినదిగా ఉండేది, ఇప్పుడు ఏ ధర్మానికి చెందినదిగా ఉంది అనేది అసలు తెలియదు.
ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ కులానికి చెందినవారు. ఎలాగైతే వారు క్రిస్టియన్ కులానికి
చెందినవారో, అలా మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. తండ్రి అంటారు, మొట్టమొదటగా
పిల్లలైన మిమ్మల్ని పతితులైన శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తాను. పావనముగా
అవుతూ-అవుతూ మళ్ళీ 21 జన్మల కోసం మీరు దైవీ సాంప్రదాయులుగా అయిపోతారు. దైవీ ఒడిలోకి
వెళ్తారు. ఇంతకుముందు ఆసురీ ఒడిలో ఉండేవారు. ఆసురీ ఒడి నుండి మీరు మళ్ళీ ఈశ్వరీయ
ఒడిలోకి వచ్చారు. మీరు ఒక్క తండ్రి పిల్లలు, సోదరీ-సోదరులు. ఇది ఒక అద్భుతము. అందరూ
మేము బ్రాహ్మణ కులానికి చెందినవారము అనే అంటారు. మనమైతే శ్రీమతముపై నడవాలి, అందరికీ
సుఖాన్ని ఇవ్వాలి, మార్గాన్ని తెలియజేయాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము
ఎలా తీసుకోవడము జరుగుతుంది అనేది నోటితో చెప్పగలిగేవారు ప్రపంచములో ఎవ్వరూ లేరు.
మీకు అనంతమైన తండ్రి లభించారు. మీరే వారికి పిల్లలుగా అయ్యారు. ఎవరైతే కల్పక్రితం
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని ఉంటారో, వారే వచ్చి తీసుకుంటారని బుద్ధి ద్వారా
తెలుసుకుంటారు. బుద్ధిలో కొద్దిగా ఉన్నా కూడా, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చేరుకుంటారు.
రావడము కూడా ఏదో ఒకటి తీసుకునేందుకే వస్తారు.
మీలో కూడా నంబరువారుగా తెలుసుకున్నారు. ఈ రోజు పావనముగా అయ్యేందుకు వస్తారు, రేపు
మళ్ళీ పతితముగా అయిపోతారు. ఎవరిదైనా చెడు సాంగత్యము అంటుకున్నప్పుడు - తండ్రికి
చెందినవారిగా అయి మళ్ళీ తండ్రిని విడిచిపెడితే చాలా పాపాత్ములుగా అయిపోతాము అనేది
మర్చిపోతారు. ఉదాహరణకు ఎవరినైనా హతమారిస్తే పాపం అంటుకుంటుంది కదా. ఆ పాపం కూడా
దీనికన్నా తక్కువే. ఇక్కడ ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ తండ్రిని వదిలి
పారిపోతారో, ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారులుగా అవుతారో, వారికి చాలా పాపం అంటుకుంటుంది.
జ్ఞాన మార్గములో అంటుకున్నంత పాపం అజ్ఞాన కాలములో అంటుకోదు. అజ్ఞాన కాలములోనైతే
మనుష్యుల్లో క్రోధమనేది కామన్. ఇక్కడ మీరు ఎవరిపైనైనా క్రోధము చేస్తే 100 రెట్లు
శిక్ష పడుతుంది, అవస్థ పూర్తిగా దిగజారిపోతుంది ఎందుకంటే ఈశ్వరుని ఆజ్ఞను పాటించలేదు.
పవిత్రముగా అవ్వాలి అని ధర్మరాజు ఆజ్ఞ లభిస్తుంది. మీరు ఈశ్వరునికి చెందినవారిగా అయి,
ఏ మాత్రం వారి ఆజ్ఞను ఉల్లంఘించినా 100 రెట్లు శిక్ష పడుతుంది. రచయిత అయితే
వారొక్కరే. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా వారి రచన. ధర్మరాజు కూడా రచనయే. ధర్మరాజు
రూపాన్ని కూడా బాబా సాక్షాత్కారము చేయిస్తారు. ఇక ఆ సమయములో ఋజువు చేసి చెప్తారు -
చూడు, నేను క్రోధము చేయను, ఎవరికీ దుఃఖము ఇవ్వను అని నువ్వు ప్రతిజ్ఞ చేసావు, అయినా
కూడా నువ్వు ఫలానావారికి దుఃఖము ఇచ్చావు, విసిగించావు, ఇప్పుడు శిక్ష అనుభవించు.
సాక్షాత్కారము చేయించకుండా శిక్షలు ఇవ్వరు. ఋజువైతే కావాలి కదా. నిజమే, నేను
తండ్రిని విడిచిపెట్టి ఈ చెడు కర్మలు చేసాను అని వారు కూడా అర్థం చేసుకుంటారు.
చెడ్డ పేరు తీసుకువస్తే చాలామందికి ఆపద కలుగుతుంది. దానివల్ల ఎంతమంది అబలలకు బంధనము
ఏర్పడుతుంది. ఆ శిక్ష అంతా ఆ చెడ్డ పేరు తీసుకువచ్చేవారికి పడుతుంది. అందుకే తండ్రి
అంటారు - అతి పెద్ద పాపాత్మను చూడాలంటే ఇక్కడే చూడండి. చాకలివాడి వద్ద చాలా మురికి
పట్టిన వస్త్రాలు ఉన్నప్పుడు వాటిని బాది ఉతికితే అవి చిరిగిపోతాయి. అలాగే ఇక్కడ
కూడా దెబ్బ సహించలేక వెళ్ళిపోతారు. ఈశ్వరుని ఒడిలోకి వచ్చి డైరెక్టుగా వారి ఆజ్ఞను
ఉల్లంఘించినట్లయితే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పార్టీని తీసుకువచ్చే హెడ్
బ్రాహ్మణిపై చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. పార్టీలో ఏ ఒక్కరైనా, ఒకవేళ చేతిని వదిలేసి
వికారీగా అయినట్లయితే ఆ పాపం తీసుకువచ్చిన వారిపైకి వస్తుంది. అటువంటివారెవరినీ
ఇంద్రసభలోకి తీసుకురాకూడదు. నీలం పరి, పుఖరాజ్ పరి అనే దేవ కన్యల కథలు కూడా ఉన్నాయి
కదా. ఇంద్రసభలోకి ఎవరినో రహస్యముగా తీసుకువస్తే ఇంద్రసభలో దుర్గంధము రావడము
మొదలయ్యింది. కనుక తీసుకువచ్చిన ఆమెకు శిక్ష పడింది. ఇలా ఏదో కథ ఉంది. ఆ
తీసుకువచ్చిన ఆమె రాయిగా అయిపోయింది. బాబా పారసనాథులుగా తయారుచేస్తారు కానీ ఒకవేళ
ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాయిగా అయిపోతారు. రాజ్యాన్ని పొందే సౌభాగ్యాన్ని కోల్పోతారు.
ఎవరైనా పేదవాడిని రాజు దత్తత తీసుకున్నారనుకోండి, ఒకవేళ అతడు యోగ్యుని లేకపోతే,
అతడిని రాజు తిరిగి పంపించేస్తే, అప్పుడు ఏమవుతుంది. మళ్ళీ పేదవాడిగా అయిపోతాడు.
ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడిక చాలా దుఃఖము అనుభవమవుతుంది, అందుకే తండ్రి
అంటారు - ఎప్పుడూ ఏ ఆజ్ఞను ఉల్లంఘించకండి. తండ్రి సాధారణముగా ఉంటారు, అందుకే
శివబాబాను మర్చిపోయి సాకారుని వైపుకు బుద్ధి వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు
శ్రీమతము లభిస్తుంది. ఎవరైతే అశుద్ధముగా అవుతారో, అటువంటివారు ఇక ఇంద్రసభలో
కూర్చోలేరు. ప్రతి సెంటరు ఇంద్రప్రస్థము, అక్కడ జ్ఞాన వర్షము కురుస్తూ ఉంటుంది. నీలం
పరి, పుఖరాజ్ పరి అనే పేర్లు అయితే ఉన్నాయి కదా. నీలం అని రత్నమును అంటారు. పిల్లలకు
ఈ పేర్లు పెట్టడము జరుగుతుంది. కొంతమంది చాలా మంచి రత్నాల వలె ఉన్నారు, ఎటువంటి
లోపము లేదు. వజ్రాలలో కొన్ని-కొన్ని చాలా మచ్చలు కలవి ఉంటాయి. కొన్ని పూర్తిగా
శుద్ధముగా ఉంటాయి. ఇక్కడ కూడా నంబరువారు రత్నాలు ఉన్నారు. కొంతమంది రత్నాలు చాలా
విలువైనవారిగా ఉన్నారు. చాలా మంచి సేవ చేస్తారు. కొంతమంది సర్వీస్ కు బదులుగా
డిస్సర్వీస్ చేస్తారు. గులాబి పుష్పాలకు మరియు జిల్లేడు పుష్పాలకు కూడా ఎంత తేడా
ఉంటుంది. శివునికి రెండింటినీ అర్పిస్తారు. మనలో ఎవరెవరు పుష్పాలు అనేది ఇప్పుడు
మీరు తెలుసుకున్నారు. బాబా, మాకు మంచి-మంచి పుష్పాలను ఇవ్వండి అని అందరూ వారినే
కోరుకుంటారు. ఇప్పుడు మంచి-మంచి పుష్పాలను ఎక్కడి నుండి తీసుకురావాలి. రత్న జ్యోతి
అనే పుష్పమైతే కామన్. ఇది పుష్పాల తోట కదా. మీరు జ్ఞాన గంగలు కూడా. బాబా అయితే
సాగరుడు కదా. ఈ బ్రహ్మా బ్రహ్మపుత్ర, వీరు అన్నింటికన్నా పెద్ద నది. కలకత్తాలో
బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. అక్కడ సాగరము మరియు నది యొక్క మేళా చాలా పెద్దగా
జరుగుతుంది. తప్పకుండా జ్ఞాన సాగరుడు బాబానే. వారు చైతన్య జ్ఞాన సాగరుడు. మీరు కూడా
చైతన్య జ్ఞాన నదులు. అవి నీటి గంగలు. వాస్తవానికి నదులకు పేర్లు ఉంటాయి కానీ ఆసురీ
సాంప్రదాయము వారు ఇది కూడా మర్చిపోయారు. హరిద్వార్ లో గంగా నది ఒడ్డున చతుర్భుజుని
చిత్రాన్ని చూపిస్తారు. దానిని కూడా గంగ అని అంటారు కానీ మనుష్యులు ఈ చతుర్భుజుడు
ఎవరు అనేది అర్థం చేసుకోరు. తప్పకుండా ఈ సమయములో మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు.
మీరు సత్యమైన జ్ఞాన నదులు. అవి నీటి నదులు. అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు కానీ
ఏమీ అర్థం చేసుకోరు. ఈ నది ఒక దేవి అని భావిస్తారు. మనుష్యులకైతే ఎప్పుడూ 4-8 భుజాలు
ఉండవు. అర్థాన్ని ఏ మాత్రం తెలుసుకోరు. బాబా మనల్ని ఏ విధముగా తయారుచేస్తున్నారు
అనేది పిల్లలైన మీకు తెలుసు. మనమైతే 100 శాతం తెలివిహీనులుగా ఉండేవారము. బాబా ఒడి
తీసుకోవడముతో మనము స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఇక్కడ ఎవరైనా రాజుగా ఉన్నా సరే,
స్వర్గ సుఖాలకు మరియు ఇప్పటి సుఖాలకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీలో కూడా
కొంతమంది ఎలా ఉన్నారంటే, అటు తండ్రిని అర్థం చేసుకోరు, ఇటు స్వయాన్ని కూడా అర్థం
చేసుకోరు. స్వయాన్ని చూసుకోవాలి - నేను ఎంత సుగంధాన్ని ఇస్తున్నాను? నేను తప్పుడు
మాటలు మాట్లాడటము లేదు కదా? క్రోధమైతే చేయడము లేదు కదా? ఈ బిడ్డ ఎటువంటివాడు అనేది
నడవడికతో తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. సర్వీసబుల్ పిల్లలు తండ్రికి చాలా
ప్రియమనిపిస్తారు. అందరూ ఒకే విధముగా ప్రియముగా అనిపించరు. అటువంటి పిల్లల కోసం
లోపల నుండి స్వతహాగా ఆశీర్వాదాలు వెలువడతాయి. ఒక తండ్రి ఆజ్ఞలను పాటించని పిల్లలుంటే,
ఆ తండ్రి అంటారు - ఇటువంటి బిడ్డ మరణిస్తే మేలు. అటువంటివారు పేరును ఎంతగా
అప్రతిష్ఠపాలు చేస్తారు, దీనిని ఇక వారి వ్రాత అని అంటారు. ఎవరి భాగ్యములో ఏముంది
అనేది వెంటనే తెలిసిపోతుంది.
ఫలానావారు సుపుత్రులు, ఫలానావారు కుపుత్రులు అని బాబా అర్థం చేయిస్తారు. ఒకవేళ బాప్
దాదాను గుర్తించకపోతే, భాగ్యములో వారసత్వము తీసుకోవడమనేది లేకపోతే ఏమి చేస్తారు. ఈ
జ్ఞాన మార్గములోని నియమాలు చాలా కఠినముగా ఉన్నాయి. తండ్రి పవిత్రముగా అయి, పిల్లలు
అవ్వకపోతే ఆ పిల్లలు హక్కుదారులుగా కాలేరు. అటువంటివారిని పిల్లలుగా భావించరు.
మేమైతే శివబాబాను వారసునిగా చేసుకుంటామని, అప్పుడు బాబా మాకు 21 జన్మల కోసం రిటర్న్
ఇస్తారని అంటారు. అలాగని బాబా వద్దకు వచ్చి కూర్చుండిపోవాలని కాదు. అలా కాదు.
గృహస్థ వ్యవహారములో ఉంటూ అందరినీ సంభాళించాలి కూడా, కానీ ట్రస్టీగా అయి ఉండాలి. మీ
పిల్లలు మొదలైనవారిని తండ్రి కూర్చుని సంభాళిస్తారని కాదు. అలా కాదు. ఇటువంటి
ఆలోచనలు ఉన్నవారు భ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా వద్దనైతే పూర్తిగా పవిత్రముగా ఉండాలి.
అపవిత్రులెవ్వరూ కూర్చోలేరు. లేదంటే రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. తండ్రి శాపమేమీ
ఇవ్వటం లేదు. ఇది ఒక నియమము. తండ్రి అంటారు - జాగ్రత్తగా ఉండండి. కర్మేంద్రియాలతో
ఏదైనా పాపం చేసినట్లయితే చనిపోయినట్లే. ఇది చాలా భారీ గమ్యము. బాబాకు పిల్లలైన
తర్వాత, అనారోగ్యమంతా తిరగబడుతుంది, భయపడకూడదు. ఫలానా మందుతో మీ అనారోగ్యం
తిరగబడుతుంది, మీరు భయపడకండి అని వైద్యులు కూడా చెప్తారు. తండ్రి కూడా స్వయంగా
చెప్తున్నారు - మీరు తండ్రికి చెందినవారిగా అయినట్లయితే మాయా రావణుడు మిమ్మల్ని చాలా
ఇబ్బంది పెడతాడు, చాలా తుఫానులు తీసుకువస్తాడు. ఇప్పుడు మీకు రాంగ్ మరియు రైట్
యొక్క బుద్ధి లభించింది. ఇంకెవ్వరికీ రాంగ్-రైట్ యొక్క బుద్ధి లేదు, అందరిదీ
వినాశకాలే విపరీత బుద్ధి. మీలో కూడా ప్రీతి బుద్ధి అనేది నంబరువారు
పురుషార్థానుసారముగా ఉంది. ప్రీతి బుద్ధి కలవారు తండ్రి సేవను చాలా బాగా చేస్తారు.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈశ్వరుని పిల్లలుగా అయి కొద్దిగా కూడా వారి ఆజ్ఞలను ఉల్లంఘించకూడదు. ఈ
కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. తప్పుడు మాటలు మాట్లాడకూడదు.
సుపుత్రులుగా అయి తండ్రి ఆశీర్వాదాలను తీసుకోవాలి.
2. ట్రస్టీగా అయి తమ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి. జ్ఞాన మార్గములో ఏ
నియమాలైతే ఉన్నాయో, వాటిని పూర్తిగా అనుసరించాలి. రైట్ మరియు రాంగ్ లను అర్థం
చేసుకుని మాయతో జాగ్రత్తగా ఉండాలి.
వరదానము:-
తపిస్తూ ఉన్న బికారీ, దాహార్తితో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చే
సర్వ ఖజానాలతో సంపన్న భవ
ఏ విధముగా అలలలో కొట్టుకుపోయే లేక మునిగిపోయే ఆత్మ ఒక
గడ్డిపోచ అయినా ఆధారముగా దొరుకుతుందేమోనని వెదుకుతుందో, అలాగే దుఃఖపు అల ఒక్కటి
రానివ్వండి, అప్పుడు చూడండి, అనేకమంది సుఖ-శాంతుల కొరకు బికారులుగా ఉన్న ఆత్మలు
తపిస్తూ మీ ముందుకు వస్తారు. ఇటువంటి దాహార్తితో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు
స్వయాన్ని అతీంద్రియ సుఖముతో మరియు సర్వ శక్తులతో, సర్వ ఖజానాలతో సంపన్నముగా
చేసుకోండి. సర్వ ఖజానాలు ఎంతగా జమ అవ్వాలంటే, వాటి ద్వారా మీ స్థితి కూడా నిలిచి
ఉండాలి మరియు ఇతర ఆత్మలను కూడా సంపన్నము చేయగలగాలి.
స్లోగన్:-
కళ్యాణ భావనను
ఉంచుకుని శిక్షణను ఇచ్చినట్లయితే ఆ శిక్షణలు హృదయానికి హత్తుకుంటాయి.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
సదా హర్షితముగా ఉండటము
అనేది జ్ఞానానికి చెందిన గుణము, ఇందులో కేవలం ఆత్మికతను చేర్చాలి. హర్షితముగా ఉండే
సంస్కారము కూడా ఒక వరదానము, ఇది అవసరమైన సమయములో చాలా సహయోగము ఇస్తుంది. ఎవరైతే
స్వయం సదా హర్షితముగా ఉంటారో వారు ఎటువంటి మనసు కలవారినైనా హర్షితముగా చేస్తారు. ఈజీ
నేచర్ కలవారు తమ సంతోషకరమైన హర్షిత ముఖముతో గంభీరమైన వాయుమండలాన్ని కూడా తేలికగా
చేసేస్తారు.