03-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - కళంగీధరులుగా అయ్యేందుకు మీ అవస్థను అచలంగా, స్థిరంగా తయారుచేసుకోండి, ఎంతగా మీ పై కళంకాలు మోపబడతాయో, అంతగా మీరు కళంగీధరులుగా అవుతారు’’

ప్రశ్న:-
తండ్రి ఆజ్ఞ ఏమిటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడిచే పిల్లలు హృదయ సింహాసనాధికారులుగా అవుతారు?

జవాబు:-
తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - మధురమైన పిల్లలూ, మీరు ఎవ్వరితోనూ గొడవపడకూడదు. శాంతిగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా మీ మాట నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి. ఒకరినొకరు విసిగించుకోకండి. ఎప్పుడైతే లోపల ఎటువంటి భూతము ఉండదో, నోటి నుండి ఎప్పుడూ ఎటువంటి చేదు మాటలు వెలువడవో, మధురంగా మాట్లాడడం జీవిత ధారణగా అవుతుందో, అప్పుడు బాప్ దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలుగుతారు.

ఓంశాంతి
భగవానువాచ, ఆత్మాభిమానీ భవ - మొట్టమొదట తప్పకుండా ఇలా చెప్పవలసి ఉంటుంది. ఇది పిల్లలను అప్రమత్తం చేయడము. తండ్రి అంటారు, నేను పిల్లలూ-పిల్లలూ అని అనేటప్పుడు ఆత్మలనే చూస్తాను, శరీరమైతే పాత చెప్పు వంటిది, ఇది సతోప్రధానముగా అవ్వలేదు. సతోప్రధాన శరీరమైతే సత్యయుగంలోనే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ సతోప్రధానముగా అవుతోంది. శరీరమైతే పాతదే. ఇప్పుడు మీరు మీ ఆత్మను తీర్చిదిద్దుకోవాలి, పవిత్రంగా తయారుచేసుకోవాలి. సత్యయుగంలో శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మను శుద్ధముగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మనే చూస్తారు. కేవలం అలా చూడడం ద్వారా ఆత్మ శుద్ధముగా అవ్వదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా శుద్ధముగా అవుతూ ఉంటారు. ఇది మీ పని. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ సతోప్రధానముగా అవ్వాలి. తండ్రి దారిని తెలియజేసేందుకే వస్తారు. ఈ శరీరమైతే అంతిమం వరకు పాతగానే ఉంటుంది. కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంది. ఆత్మ పుష్పములా అయిపోతే, ఇక కర్తవ్యాలను కూడా మంచిగా చేస్తుంది. అక్కడ పక్షులు, జంతువులు కూడా మంచి-మంచివి ఉంటాయి. ఇక్కడ పక్షులు మనుష్యులను చూసి పారిపోతాయి, అక్కడైతే మంచి-మంచి పక్షులు మీ ముందు, వెనుక ఎగురుతూ, తిరుగుతూ ఉంటాయి, అది కూడా నియమానుసారంగానే తిరుగుతాయి. ఇంట్లోకి దూరిపోయి అశుద్ధం చేసి వెళ్తాయని కాదు. అది చాలా నియమబద్ధమైన ప్రపంచముగా ఉంటుంది. మున్ముందు మీకు అన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎంతో మార్జిన్ ఉంది. స్వర్గము యొక్క మహిమ అయితే అపారమైనది. తండ్రి మహిమ కూడా అపారమైనది, అలాగే తండ్రి ఇచ్చే ఆస్తి మహిమ కూడా అపారమైనది. పిల్లలకు ఎంతటి నషా ఉండాలి. తండ్రి అంటారు, ఎవరైతే సేవ చేస్తారో వారు తమంతట తామే గుర్తుకువస్తారు, నేను అటువంటి ఆత్మలను గుర్తు చేస్తాను. ఆత్మలో మనసు, బుద్ధి ఉన్నాయి కదా. మేము ఫస్ట్ నంబర్ సేవను చేస్తున్నామా లేక సెకండ్ నంబర్ సేవను చేస్తున్నామా అని స్వయమే అర్థం చేసుకుంటారు. ఇది అందరూ నంబరువారుగా అర్థం చేసుకుంటారు. కొందరు మ్యూజియంలు నిర్మిస్తారు, ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైనవారి వద్దకు వెళ్తారు, తప్పకుండా మంచిగా అర్థం చేయిస్తూ ఉండవచ్చు. అందరిలోనూ తమ-తమ గుణాలు ఉన్నాయి. ఎవరిలోనైతే మంచి గుణాలు ఉంటాయో వారిని వీరు ఎంత గుణవంతులు అని అంటారు. ఎవరైతే సేవాధారులుగా ఉంటారో, వారు సదా మధురంగా మాట్లాడుతారు, వారు ఎప్పుడూ చేదుగా మాట్లాడలేరు. ఎవరైతే చేదుగా మాట్లాడుతారో, వారిలో భూతాలు ఉన్నాయి. దేహాభిమానము నంబరు వన్ భూతము, ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు ప్రవేశిస్తాయి.

మనుష్యులు తప్పుడు నడవడిక కూడా ఎంతగానో నడుస్తారు. తండ్రి అంటారు, పాపం వారి దోషమేమీ లేదు. మీరు కల్పపూర్వం కష్టపడినట్లుగా కష్టపడాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఆ తర్వాత మెల్లమెల్లగా మొత్తం విశ్వము యొక్క తాడు (కంట్రోల్) మీ చేతుల్లోకి రానున్నాది. ఇది డ్రామా చక్రము, సమయాన్ని కూడా సరిగ్గా చెప్తారు. ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వారు స్వతంత్రత ఇచ్చినప్పుడు దేశాన్ని రెండు భాగాలుగా చేసేస్తారు, ఇక పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే వారి ఆయుధాలు మొదలైనవాటిని ఎవరు తీసుకుంటారు? ఇది కూడా వారి వ్యాపారమే కదా. డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే. ఇక్కడ కూడా ముక్కలు-ముక్కలుగా చేసేసారు. ఏమంటూ ఉంటారంటే - ఈ భాగము మాకు లభించాలి, దీన్ని ఇంకా పూర్తిగా పంచలేదు, అటువైపు నీరు బాగా వెళ్తోంది, పంటలు బాగా పండుతున్నాయి, ఇటువైపు నీరు తక్కువగా ఉంది... అంటూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు, దానితో ఇక గృహ యుద్ధాలు జరుగుతాయి. గొడవలైతే ఎన్నో జరుగుతాయి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక మీరు కూడా నిందలు పడతారు. తండ్రి అర్థం చేయించారు - ఇప్పుడు మీరు కళంగీధరులుగా అవుతారు. ఏ విధంగా బాబా నిందలు పడతారో, అలా మీరు కూడా నిందలు పడతారు. పాపం వారికి అసలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు అన్నది తెలియదు అని మీకు తెలుసు. 84 జన్మల విషయమైతే చాలా సహజమైనది. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా కూడా అవుతారు. కొందరి బుద్ధిలో ధారణ జరగదు, అది కూడా డ్రామాలో వారి పాత్ర. ఇందులో ఏం చేయగలరు? ఎంతగా కష్టపడినా పైకి ఎక్కలేకపోతారు. పురుషార్థమునైతే చేయించడం జరుగుతుంది, కానీ వారి భాగ్యములో లేదు. రాజధాని స్థాపన అవుతోంది, అందులో అందరూ కావాలి, అలా భావిస్తూ శాంతిగా ఉండాలి, ఎవరితోనూ గొడవపడే విషయమేదీ లేదు. ఇలా చేయకండి, దాని వలన పదవి ఇంకా తగ్గిపోతుంది అని ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇలా ఆత్మ వింటుంది. ఎవరికైనా మంచి విషయాన్ని అర్థం చేయించినా వారు అశాంతిగా అయిపోతారు, అందుకే వారిని వదిలివేయాలి. వారు స్వయమూ అలాగే ఉంటే ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు. ఇది చివరి వరకూ ఉంటుంది. మాయ కూడా రోజురోజుకు కఠినముగా అవుతూ ఉంటుంది. మహారథులతో మాయ కూడా మహారథిగా అయి కొట్లాడుతుంది. మాయ తుఫానులు వస్తూ ఉంటాయి, కానీ తండ్రిని స్మృతి చేయడం అభ్యాసమైపోతుంది, అప్పుడు పూర్తిగా అచలంగా, స్థిరంగా ఉంటారు. మాయ హెరైనా పరుస్తుంది అని అర్థం చేసుకుంటారు, కానీ భయపడకూడదు. కళంగీధరులుగా అయ్యేవారిపై కళంకాలు మోపబడతాయి, ఇందులో అసంతుష్టులుగా అవ్వకూడదు. వార్తాపత్రికలవారు ఏదో ఒకటి విరుద్ధంగా వ్రాస్తారు ఎందుకంటే ఇది పవిత్రత విషయము. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అకాసురులు, బకాసురులు అన్న పేర్లు కూడా ఉన్నాయి. పూతన, శూర్పణఖ మొదలైన స్త్రీల పేర్లు కూడా ఉన్నాయి.

ఇప్పుడు పిల్లలు మొట్టమొదట మహిమ కూడా తండ్రిదే వినిపిస్తారు. మీరు ఒక ఆత్మ అని అనంతమైన తండ్రి చెప్తారు. ఈ జ్ఞానమును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇది రచయిత మరియు రచనల జ్ఞానము, ఇది చదువు, దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అయి చక్రవర్తి రాజులుగా అవుతారు. అలంకారాలు కూడా మీవే, కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు, అందుకే ఈ అలంకారాలను విష్ణువుకు ఇచ్చేసారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు అనే ఈ విషయాలన్నింటినీ ఇంకెవరూ తెలియజేయలేరు. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుంది? ఒక్కొసారి కళ్ళ నుండి వెళ్ళిపోతుందని, ఒక్కోసారి భృకుటి నుండి వెళ్ళిపోతుందని, ఒక్కోసారి నుదుటి నుండి వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు. దానిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ శరీరాన్ని ఇలా వదులుతుందని, కూర్చుంటూ-కూర్చుంటూ తండ్రి స్మృతిలో దేహాన్ని త్యజించేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వద్దకైతే సంతోషంగా వెళ్ళాలి. పాత శరీరాన్ని సంతోషంగా వదిలివేయాలి. సర్పం ఉదాహరణ ఉంది కదా. జంతువులలో ఉన్న తెలివి కూడా మనుష్యులలో లేదు. ఆ సన్యాసులు మొదలైనవారైతే కేవలం ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఏ విధంగా భ్రమరము పురుగులను మార్చివేస్తుందో, మీరు అలా తయారవ్వాలి. మీరు కూడా మనుష్యుల రూపీ పురుగులను మార్చివేయాలి. కేవలం ఉదాహరణలను ఇవ్వడం మాత్రమే కాదు, ప్రాక్టికల్ గా అలా చేయాలి. ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు కావున లోలోపల సంతోషము ఉండాలి. వారికి వారసత్వము గురించి తెలియనే తెలియదు. శాంతి అయితే అందరికీ లభిస్తుంది, అందరూ శాంతిధామములోకి వెళ్తారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ సర్వులకూ సద్గతిని ఇవ్వరు. మీది నివృత్తి మార్గము, మీరు బ్రహ్మములో లీనమయ్యేందుకు పురుషార్థం చేస్తారు అని వారికి ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. కానీ తండ్రి అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారుచేస్తారు. ఇది చాలా గుహ్యమైన విషయము. ఎవరికైనా మొట్టమొదట భగవంతుడు మరియు రాజ్యాధికారము గురించి చదివించవలసి ఉంటుంది. వారికి ఇలా చెప్పండి - మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఎన్ని అపారమైన దుఃఖాలు లభిస్తాయి. సత్యయుగములోనైతే అపారమైన సుఖము ఉంది. అక్కడ జన్మయే వెన్నలా ఉంటుంది, అక్కడ ఎటువంటి దుఃఖము కలిగించే విషయము ఉండదు. దాని పేరే స్వర్గము. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారమనే వారసత్వము లభిస్తుంది. మొదట సుఖము ఉంటుంది, ఆ తర్వాత దుఃఖము ఉంటుంది. మొదట దుఃఖము, ఆ తర్వాత సుఖము అని అనడం తప్పు. మొదట కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది, అంతేకానీ పాత ప్రపంచ స్థాపన జరగదు. పాత ఇంటిని ఎవరైనా నిర్మిస్తారా? కొత్త ప్రపంచములోనైతే రావణుడు ఉండడు. ఈ విషయాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు, కావున బుద్ధిలో ఈ యుక్తులు ఉండాలి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు, మీరు వస్తే వారు ఎలా ఇస్తారో వివరిస్తాము అని చెప్పాలి. ఇలా చెప్పేందుకు కూడా యుక్తి కావాలి. దుఃఖధామము యొక్క దుఃఖాలను కూడా మీరు సాక్షాత్కరింపజేయండి. ఎన్ని అపారమైన దుఃఖాలు ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి, దీని పేరే దుఃఖధామము. దీనిని ఎవరూ సుఖధామము అని అనలేరు. సుఖధామములో శ్రీకృష్ణుడు ఉంటారు. శ్రీకృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. వారు సుఖధామానికి యజమానిగా ఉండేవారు, వారికి మందిరాలలో ఇప్పుడు పూజ జరుగుతోంది. ఇప్పుడు ఈ బాబా లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్తే - ఓహో, నేను ఈ విధంగా అవుతాను అని అంటారు, అంతేకానీ వారి పూజ చేయరు. నంబర్ వన్ అవుతారు, మరి రెండవ, మూడవ నంబర్ వారిని ఎందుకు పూజించాలి. మనము సూర్యవంశీయులుగా అవుతాము. అది మనుష్యులకు తెలియదు. వారైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు. అంధకారము ఎంతగా ఉంది. మీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు. అందుకు సమయం పడుతుంది. కల్పపూర్వం ఎంత సమయమైతే పట్టిందో అంతే సమయం పడుతుంది, త్వరగా ఏమీ చేయలేరు. ఇప్పటి మీ ఈ జన్మయే వజ్రతుల్యమైన జన్మ. దేవతల జన్మను కూడా వజ్రతుల్యమైన జన్మ అని అనరు. వారు ఈశ్వరీయ పరివారములో ఏమీ లేరు. ఇది మీ ఈశ్వరీయ పరివారము. అది దైవీ పరివారము. ఇవి ఎంత కొత్త-కొత్త విషయాలు. గీతలోనైతే పిండిలో ఉప్పంత జ్ఞానము ఉంది. శ్రీకృష్ణుని పేరును వేసి ఎంత పొరపాటు చేశారు. మీరు దేవతలను దేవతలు అని అంటారు, మరి శ్రీకృష్ణుడిని భగవంతుడు అని ఎందుకు అంటున్నారు అని మీరు అడగండి. విష్ణువు ఎవరు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులు జ్ఞానము లేకుండా ఏదో అలా పూజ చేస్తూ ఉంటారు. ప్రాచీనమైనవారు కూడా దేవీ-దేవతలే, వారు ఒకప్పుడు స్వర్గములో ఉండి వెళ్ళారు. సతో, రజో, తమోలోకి అందరూ రావాలి. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. పిల్లలకు పాయింట్లు అయితే ఎన్నో అర్థం చేయిస్తూ ఉంటారు. బ్యాడ్జిపై కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు. తండ్రిని మరియు చదివించే టీచరును స్మృతి చేయవలసి ఉంటుంది. కానీ మాయతో కూడా ఎంతగా పెనుగులాట జరుగుతూ ఉంటుంది. ఎన్నో మంచి-మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు వినకపోతే మరి ఎలా వినిపించగలరు. చాలా వరకు పెద్ద మహారథులు బయటకు అటూ ఇటూ వెళ్ళినప్పుడు మురళిని మిస్ చేసేస్తారు, మళ్ళీ చదవరు. కడుపు నిండి ఉంది. తండ్రి అంటారు, నేను మీకు ఎంత గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తాను, వాటిని మీరు విని ధారణ చేయాలి. ధారణ జరగకపోతే అపరిపక్వముగానే ఉండిపోతారు. చాలామంది పిల్లలు కూడా విచార సాగర మంథనం చేసి మంచి-మంచి పాయింట్లను వినిపిస్తారు. బాబా చూస్తారు, వింటారు. అవస్థ ఎలా-ఎలా ఉంటుందో, అలాంటి-అలాంటి పాయింట్లను తీయగలుగుతారు. ఏ పాయింట్లనైతే వీరు ఎప్పుడూ వెలికితీయలేదో, అటువంటి పాయింట్లను సర్వీసబుల్ పిల్లలు వెలికితీస్తారు. వారు సేవలోనే నిమగ్నమై ఉంటారు. మ్యాగజైన్లలో కూడా మంచి పాయింట్లను వేస్తారు.

పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. తండ్రి ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు, మొత్తం విశ్వము యొక్క తాడు మీ చేతిలో ఉంటుంది అని పాటలో కూడా ఉంది కదా. దానిని ఎవ్వరూ లాక్కోలేరు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. వారిని చదివించేవారు తప్పకుండా తండ్రియే. అది కూడా మీరు అర్థం చేయించవచ్చు. వారు రాజ్యపదవిని ఎలా పొందారు అన్నది మందిరములోని పూజారులకు తెలియదు. మీకైతే అపారమైన సంతోషము ఉండాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అన్నది కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఈ సమయములో ఐదు భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి. మాయ యొక్క ఐదు భూతాలు ఉన్నాయి. మాయ సర్వవ్యాపిగా ఉంది. మీరేమో ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు, ఇది పొరపాటు కదా. ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? వారు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు, ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. అర్థం చేయించే ప్రాక్టీస్ కూడా పిల్లలు చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరైనా అశాంతిని వ్యాపింపజేస్తే లేక విసిగిస్తే మీరు శాంతిగా ఉండాలి. ఒకవేళ వివరణ లభిస్తూ కూడా ఎవరైనా తమను తాము తీర్చిదిద్దుకోకపోతే ఇక వారి భాగ్యము అంతే అని అనడం జరుగుతుంది, ఎందుకంటే రాజధాని స్థాపన అవుతోంది.

2. విచార సాగర మంథనము చేసి జ్ఞానము యొక్క కొత్త-కొత్త పాయింట్లను వెలికి తీసి సేవ చేయాలి. తండ్రి ప్రతిరోజూ మురళిలో ఏవైతే గుహ్యమైన విషయాలను వినిపిస్తారో, వాటిని ఎప్పుడూ మిస్ చేయకూడదు.

వరదానము:-

పవిత్రతను ఆది-అనాది విశేష గుణము రూపములో సహజముగానే అలవరచుకునే పూజ్య ఆత్మా భవ

పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేష ఆధారము పవిత్రతపై ఉంది. ఎంతగా అన్ని విధాల పవిత్రతను అలవరచుకుంటారో, అంతగా సర్వ విధాలుగా పూజ్యనీయులుగా అవుతారు. ఎవరైతే విధిపూర్వకంగా ఆది-అనాది విశేష గుణ రూపముతో పవిత్రతను అలవరచుకుంటారో, వారే విధిపూర్వకంగా పూజింపబడతారు. ఎవరైతే జ్ఞానీ మరియు అజ్ఞానీ ఆత్మల సంపర్కములోకి వస్తూ పవిత్ర వృత్తి, దృష్టి, వైబ్రేషన్ల ద్వారా యథార్థ సంపర్క-సంబంధాలను నిర్వహిస్తారో, స్వప్నములో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితము కాదో, వారే విధిపూర్వకముగా పూజ్యులుగా అవుతారు.

స్లోగన్:-

వ్యక్తములో ఉంటూ అవ్యక్త ఫరిశ్తాగా అయ్యి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యము తీవ్రగతితో సంపన్నమవుతుంది.