03-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు సత్యాతి-సత్యమైన రాజఋషులు,
రాజయోగులు, మీరు రాజ్యము కోసం పవిత్రముగా తప్పకుండా అవ్వాలి’’
ప్రశ్న:-
ఏ అటెన్షన్
రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది?
జవాబు:-
ఒకవేళ చదువు
పట్ల పూర్తి అటెన్షన్ ఉన్నట్లయితే, రాజ్యము లభిస్తుంది. తండ్రి ఏదైతే వినిపిస్తారో,
దానిని బాగా విని ధారణ చేయండి. తండ్రి వినిపించింది పిల్లలు విన్నట్లయితే రాజ్యము
లభిస్తుంది. ఒకవేళ వినే సమయములో ఆవలింతలు వస్తే లేక కునికిపాట్లు పడితే లేక బుద్ధి
భ్రమిస్తే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకే చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి.
పాట:-
మనము ఆ
మార్గములో నడవాలి...
ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ రోజు పిల్లలకు హఠయోగము మరియు
రాజయోగము గురించి అర్థం చేయిస్తాను. మనుష్యులు నేర్పించేవన్నీ హఠయోగాలేనని పిల్లలకు
తెలుసు, ఎందుకంటే వారు కర్మ సన్యాసులు. వాస్తవానికి గృహస్థులు హఠయోగాన్ని, కర్మ
సన్యాసాన్ని నేర్చుకోకూడదు. అది ఉన్నదే నివృత్తి మార్గము. ఆ ధర్మమే వేరు. మీ ధర్మము
దేవీ-దేవతా ధర్మము, ఆ దేవీ-దేవతలు రాజయోగము ద్వారానే రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు
మీరు రాజఋషులు. ఎవరైతే పవిత్రముగా ఉంటారో, వారిని ఋషి అని అంటారు. మీరు ఇప్పుడు
పవిత్రముగా ఉన్నారు. ఒకవేళ పవిత్రముగా ఉండకపోతే వారిని ఋషి అని అనరు. మీరు
రాజ్యాన్ని పొందేందుకు పవిత్రముగా అవుతారు. వారు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రముగా
ఏమీ అవ్వరు. పవిత్ర ప్రపంచములో మనకు పవిత్రమైన రాజ్యముండేదని మీకు తెలుసు. భారత్
లోనే 5000 సంవత్సరాల క్రితం దేవీ-దేవతల పూజ్య పవిత్ర ప్రవృత్తి మార్గముండేది.
ఇప్పుడు పూజారులుగా, పతితులుగా అయిపోయారు. పతితముగా ఎలా అయ్యారు? 84 జన్మల లెక్క
ఉంది కదా. ఏ తండ్రి అయితే సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారో, వారే మీకు 84 జన్మల
లెక్కను తెలియజేస్తారు. ఇతర ధర్మాల గురించి సన్యాస ధర్మము వారికి ఏమి తెలుస్తుంది.
ఇది దేవీ-దేవతల ప్రాచీన ధర్మము. సన్యాస ధర్మము తర్వాత వచ్చిన ధర్మము. గతించిపోయిన
కాలం గురించి సన్యాసులు అర్థం చేసుకోలేరు.
హఠయోగము అనేక రకాలుగా ఉంటుందని మీకు తెలుసు. ద్వాపరము నుండి భక్తి మార్గముతో పాటు
హఠయోగము కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడిది రాజయోగము. ఆ హఠయోగాన్ని జన్మజన్మలుగా
నేర్చుకుంటూ వచ్చారు. రాజయోగాన్ని మీరు ఈ ఒక్క జన్మలోనే నేర్చుకుంటారు. వారు
జన్మజన్మాంతరాలు పునర్జన్మలు తీసుకుంటూ హఠయోగాన్ని నేర్చుకోవాల్సిందే. మీరు
రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలు తీసుకోవాల్సిన అవసరము ఉండదు. ఈ రాజయోగాన్ని
మీరు కేవలం సంగమములోనే నేర్చుకుంటారు. రాజ్యము లభించింది, స్వర్గము వచ్చింది అంటే
ఇక మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు రాజఋషులు. రాధా-కృష్ణులు కూడా
పవిత్రమైనవారు కదా. శ్రీకృష్ణుడిని మహాత్మ అని కూడా అంటారు. మహాత్ములు పవిత్రముగా
ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మహాత్ములు మరియు రాజఋషులు. మహాత్మ అనగా పవిత్రమైన మహాన్
ఆత్మ. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. వాటిని
కూర్చుని కథలుగా వ్రాస్తారు. ఏదైతే గతిస్తుందో, దానిని కూర్చుని నాటకములా
తయారుచేస్తారు. అందులో సత్యమేమీ లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రాక్టికల్ గా
చదివిస్తున్నారు. దానిని మళ్ళీ చరిత్రగా తయారుచేసారు. యాదవులు, కౌరవులు, పాండవులు
ఉండేవారు అని అంటారు, వారు తప్పకుండా సంగమములోనే ఉంటారు. సంగమయుగ చరిత్రను కూర్చుని
తయారుచేసారు. పండుగలన్నీ కూడా సంగమయుగానికి చెందినవే. రక్షా బంధనము కూడా పవిత్రత
విషయములో జరుపుకునే పండుగ. తర్వాత దాని స్మృతిచిహ్నము కొనసాగుతుంది. ఇక్కడ తండ్రి
కూడా అందరినీ పవిత్రముగా తయారుచేసి, ప్రతిజ్ఞను చేయిస్తారు. సిక్కులు కంకణాన్ని
ధరిస్తారు, అది కూడా పవిత్రతకే గుర్తు. హిందువులు జంధ్యము ధరిస్తారు, అది కూడా
పవిత్రతకే గుర్తు, కానీ వారు పవిత్రముగా ఉండరు. రాఖీ కట్టించుకుంటారు కానీ దాని
అర్థం తెలియదు. పూర్వము బ్రాహ్మణులు రాఖీ కట్టేవారు. ఇప్పుడు సోదరి, సోదరునికి రాఖీ
కడుతుంది. అతను ఆమెకు కానుకగా డబ్బులిస్తారు. ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.
వాస్తవానికి ఇది పవిత్రతకు సంబంధించిన విషయము. తండ్రి అంటారు - పిల్లలూ, కామము
మహాశత్రువు. ఆ బ్రాహ్మణులెవరూ ఇలా అర్థం చేయించరు. ఇప్పుడు అనంతమైన తండ్రి
చెప్తున్నారు - పిల్లలూ, మేము పవిత్రముగా అవుతాము, ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని
ప్రతిజ్ఞ చేయండి. మీరు వచ్చి పతితులను పావనముగా చేయండి అని దీని కోసమే పిలుస్తారు.
సత్య, త్రేతాయుగాలలో ఎవరూ పిలవరు. అది ఉన్నదే రామ రాజ్యము, ఇది రావణ రాజ్యము. రామ
రాజ్యములో 5 వికారాలు ఉండవు. యథా రాజా రాణి, తథా ప్రజ... మనము బాబా నుండి స్వర్గ
రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ నరకము నుండి
తప్పకుండా వెళ్ళిపోవాలి. పావనముగా తయారుచేసి స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకే బాబా
వచ్చారు. అలాంటప్పుడు మనము పావనముగా ఎందుకు అవ్వకూడదు. వారి హఠయోగాలైతే అనేక రకాలుగా
ఉంటాయి. ఎన్ని వెరైటీల హఠయోగులు ఉంటారు అనేది జైపూర్ మ్యూజియంకు వెళ్ళి చూడండి. వాటి
ద్వారా ఏమీ లభించదు. మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు.
తండ్రి అర్థం చేయించారు - భారత్ పతితముగా అయినప్పుడు, రావణ రాజ్యము ఏర్పడినప్పుడు
భూమి కంపించడము మొదలవుతుంది. బంగారు మహళ్ళు మొదలైనవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి.
మహళ్ళు మొదలైనవాటిని ఎవరూ దోచుకోరు. వారు కేవలం మందిరాలను దోచుకున్నారు. కొన్ని నగలు,
బంగారము మొదలైనవాటిని తీసుకువెళ్ళిపోయారు. నగల పట్ల అందరికన్నా ఎక్కువ అభిరుచి మీకు
ఉంటుంది. మీరు స్వర్గములోకి వచ్చిన వెంటనే నగలు ధరిస్తారు, రాజ్యము చేస్తారు. ఇతర
ధర్మాల వారు వచ్చిన వెంటనే రాజ్యము చేయరు. మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ
రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తారు, అంతేకానీ గీతను చదివి వినిపించరు. గీతలో వ్రాసినవన్నీ నేను చెప్పినవి
కావు, మనుష్యులు తర్వాత కూర్చుని నా మహావాక్యాలను శాస్త్రాలుగా తయారుచేసారు. నేను
మీకేదైతే వినిపించానో, దానిని మీరు మాత్రమే విన్నారు, తర్వాత వెళ్ళి రాజ్యము చేసారు.
అక్కడ ఈ జ్ఞానము ఉండదు. ఇక్కడైతే తండ్రి, టీచర్ కూర్చుని శిక్షణను ఇస్తున్నారు.
తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఇక్కడ అందరూ హిందీయే మాట్లాడుతూ ఉంటారు కదా
ఎందుకంటే ఇదే వారి భాష. వాస్తవానికి ప్రాచీన భాష హిందీయే, అంతేకానీ సంస్కృతము కాదు.
ఈ సంస్కృతము శంకరాచార్యుని తర్వాత వెలువడింది. ఎవరు వస్తే, వారు తమ భాషను
నడిపిస్తారు. అంతేకానీ, బాబా గీతను సంస్కృతములో వినిపించారని కాదు. అలా కాదు.
గురునానక్ కు తమ గ్రంథ్ ఉంది. వారు సిక్కు ధర్మాన్ని స్థాపన చేసారు. వారిని కూడా
అవతారముగా భావిస్తారు. ఆ ధర్మములో రాజులు కూడా ఉంటారు. సన్యాసుల్లో రాజ్యాలు లేవు.
బాబా అర్థం చేయించారు - బుద్ధుడు, క్రైస్టు మొదలైనవారు ముందు గృహస్థ ఆత్మలుగా
ఉండేవారు. కానీ గృహస్థులైన పతితాత్మలు ధర్మ స్థాపన చేయలేరు. వారిలో పవిత్రాత్మ
ప్రవేశించి ధర్మ స్థాపన చేసింది. ఇతర ధర్మాలైతే రకరకాలవి చాలా ఉన్నాయి. వారు వచ్చి
తమ చిన్న మఠాలను, ఆశ్రమాలను స్థాపన చేస్తారు. వృక్షములో కూడా చూపించారు కదా. కనుక
హఠయోగానికి మరియు రాజయోగానికి చాలా తేడా ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి,
ఎవరికైతే అర్థం కావో వారు కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే
మీకు ఖజానా లభిస్తుంది. ఇది చాలా భారీ సంపాదన. మీరు రత్నాలతో జోలిని నింపుకుంటారు.
కావున ఇక్కడ కళ్ళు తెరుచుకుని వినవలసి ఉంటుంది. కునికిపాట్లు పడుతూ ఉంటే లేక బుద్ధి
బయట భ్రమిస్తూ ఉంటే వారు రాజధానిని పొందలేరు.
మీరు రాజఋషులు, రాజ్యాన్ని పొందేవారు. తండ్రి రాజధానిని స్థాపన చేస్తారు.
శ్రీకృష్ణుడు చేయరు. శ్రీకృష్ణుడైతే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు
మీ తండ్రి నిరాకారుడు, వారి నుండి విశ్వ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని
తీసుకుంటున్నారు. మీరు ఎంత షావుకారులుగా అవుతారు. ఇక్కడ ఒక్క తండ్రియే వచ్చి
రాజయోగాన్ని నేర్పిస్తారు. విహరించండి, తిరగండి, తినండి, తాగండి కేవలం తండ్రిని
స్మృతి చేయండి. షావుకారులు తప్పకుండా బాగా తింటారు. వారైతే తమ సంపాదన యొక్క ఫలాన్ని
తింటారు. మాల్పుడా (పాలపురీ) తినండి లేదా రోటీ తినండి, కానీ తండ్రిని స్మృతి చేయండి.
ఏదైనా తినండి. మరి ధనమంతా దేని కోసముంది. బాబా వద్దు అని ఏమీ అనరు. కేవలం తండ్రితో
యోగాన్ని జోడించాలి. ఈ రాజ్యాన్ని స్థాపన చేయడములో ఖర్చు ఏమీ లేదు. ఆ యుద్ధాలు
మొదలైనవాటిలో ఎంత ఖర్చవుతుంది. విమానాలు తయారుచేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. అవి
కూలిపోతే పూర్తిగా సమాప్తమైపోతాయి. ఎంత నష్టము జరుగుతుంది. కనుక తండ్రి అంటారు -
నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి.
మనము 84 జన్మలను పూర్తి చేసాము. ఇప్పుడు వతనానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి తిరిగి
వచ్చి రాజ్యము చేస్తాము. మీరు పాత్రధారులు కదా. ఆ బయోస్కోప్ (సినిమా) అయితే
రెండున్నర గంటల పాటు నడుస్తుంది. ఈ అనంతమైన నాటకము 5000 సంవత్సరాలు నడుస్తుంది, దీని
గురించి మనుష్యులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ ప్రపంచము ముళ్ళ అడవి. అన్నింటికంటే
పెద్ద ముల్లు వికారాలది. ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. రెండవ నంబరు ముల్లు
క్రోధము. దీనికి గుర్తుగానే ఈ మహాభారత యుద్ధాన్ని చూడండి. ఏ విషయములోనైనా కోపం వస్తే
వెంటనే బాంబులు వేయడము మొదలుపెడతారు. ఇప్పుడైతే ఎలాంటి బాంబులు తయారుచేసారంటే, ఇక
అడగకండి. సత్యయుగములో ఎటువంటి యుద్ధాలు మొదలైనవి ఉండవు. సంగమయుగములోనే ఈ మహాభారత
యుద్ధాన్ని చూపించారు. ఇంకే శాస్త్రములోనూ ఈ యుద్ధము గురించి వర్ణన లేదు. అక్కడైతే
మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉంటారు. యుద్ధమనే మాటే ఉండదు. శాస్త్రాలలో
అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధము జరిగినట్లుగా చూపించారు. కానీ దేవతలు
అహింసకులు. మీరు యోగబలముతో విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది సైలెన్స్ బలం. ఇందులో
మీరేమీ మాట్లాడాల్సిన అవసరము లేదు. స్మృతి బలముతో మీరు బాబా నుండి విశ్వ
రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. సైన్స్ బలముతో వినాశనము
జరుగుతుంది. మళ్ళీ అదే సైన్స్ ద్వారా సత్యయుగములో సుఖాన్ని చూస్తారు. సైన్స్ ద్వారా
ఆవిష్కరణలు చేస్తారు, వాటిని సుఖము కోసమే చేస్తారు. వారు కూడా వచ్చి కొంత జ్ఞానము
తీసుకుంటారు. ప్రదర్శనీలకైతే అందరూ వస్తారు, మున్ముందు అందరూ వస్తారు. మీ ఈ సైలెన్స్
బలం ప్రఖ్యాతమవుతుంది.
గీతా భగవానుడు ఎవరు అని మీరు ప్రశ్న అడుగుతారు. ఇటువంటి ప్రశ్నను ఇంకెవరూ అడగలేరు.
ఈ ప్రశ్న వ్రాసిన చోట దానితో పాటు చిత్రాన్ని కూడా పెట్టండి - గీతా భగవానుడు పరమపిత
పరమాత్మనా లేక పూర్తి 84 జన్మలను తీసుకునే శ్రీకృష్ణుడా? పతితము నుండి పావనముగా
చేసేవారైతే తండ్రి మాత్రమే. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలను తీసుకుని నల్లగా
అయిపోయింది. నీవు 84 జన్మలను తీసుకున్నావు, నీకు నీ జన్మల గురించి తెలియదు అని
తండ్రి కూర్చుని వారికి అర్థం చేయిస్తారు. మనము 84 జన్మలను ఎలా తీసుకుంటాము అనేది
పాత్రధారులకు తెలిసి ఉండాలి కదా. సన్యాసుల ధర్మము వేరు. భారతవాసులకు తమ ధర్మము
గురించి తెలియని కారణముగా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా గురువు
ఆశీర్వాదముతో ఎవరికైనా ధనము లభిస్తే ఇక ఆ గురువు వెనుక అతుక్కుపోతారు. మళ్ళీ దివాలా
తీస్తే భగవంతుడి వ్రాత అని అంటారు. కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు. మరి, 10-12
రోజుల తర్వాత ఆ కొడుకు మరణిస్తే ఈశ్వరుడి వ్రాత, ఇతడిని బ్రతికించడము మన చేతుల్లో
లేదు అని అంటారు. బాబా ఇలాంటి ఉదాహరణలను చాలా చూసారు. ఇలాంటివి చాలా జరుగుతాయి.
ఇక్కడైతే తండ్రి కూర్చుని ఉన్నారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు -
మధురాతి-మధురమైన పిల్లలూ, పావనముగా అవ్వండి. మీకు గుర్తుందా, మహాభారీ మహాభారత
యుద్ధము జరిగినప్పుడు ద్రౌపది ఇలా పిలిచింది - బాబా, నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా
చేస్తున్నాడు, నన్ను ఇతడి నుండి రక్షించండి అని. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. ఈ
విషము కారణముగానే అబలలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్త్రీలు కూడా ఎలా
ఉంటారంటే ఇక విషము లేకుండా ఉండలేకపోతారు. అటువంటివారికి శూర్పణఖ, పూతన అని పేర్లు
పెట్టడము జరిగింది. ఎవరైతే విషము కోసం విసిగిస్తారో వారు కంసుడు, జరాసంధుడు,
శిశుపాలుడు... వీరంతా వినాశనమవ్వాల్సిందే. ఈ సమయములో ఆసురీ రావణ రాజ్యముంది, తర్వాత
ఈశ్వరీయ రాజ్యము ఉంటుంది. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని మీరు ఈ మొత్తం చక్రమంతటి
గురించి తెలుసుకున్నారు. వికారాలలోకి వెళ్ళినప్పుడు వీటిని మర్చిపోతారు. వికారాలలోకి
వెళ్ళేవారి ముఖము పాలిపోతుంది. నేను ఇలా చేసేసానేమిటి అని స్వయం కూడా భావిస్తారు.
తండ్రి అంటారు, పిల్లలూ, ఈ విషయ వికారాల బురదలోకి వెళ్ళకండి, ఇది మీకు ఆదిమధ్యాంతాలు
దుఃఖాన్ని ఇస్తుంది, ఇందులో పడిపోకండి. మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని
ప్రతిజ్ఞ చేయండి. భగవానువాచ, కామము మహాశత్రువు. ప్రతి చిత్రములోనూ ముందు ఈ విషయము
వ్రాయండి - జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, గీతా జ్ఞాన దాత అయిన శివ భగవానువాచ అని.
అప్పుడు శ్రీకృష్ణుని పేరు తొలగిపోతుంది. మనకు ఈ విషయాలను గీతా భగవానుడు కూర్చుని
తెలియజేస్తున్నారు. ఆ జ్ఞానాన్నే మనము తీసుకుంటున్నాము. భగవంతుడే వచ్చి కొత్త
ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మరియు పాత ప్రపంచము వినాశనమవుతుంది. ఇది రుద్ర జ్ఞాన
యజ్ఞము కదా. వాస్తవానికి వారు శివబాబా. రుద్రబాబా అని అనరు. బొంబాయిలో బాబురీనాథ్ (బబుల్
నాథ్) మందిరము కూడా ఉంది. బబుల్ అని ముళ్ళను అంటారు. బాబురీనాథ్ అనే పేరు ఎందుకు
పెట్టారు, ఇది ఎవరూ అర్థం చేసుకోరు. అక్కడ ఉన్న చిత్రము శివునిదే. అలా అనేక పేర్లు
పెట్టేసారు. శివబాబాయే వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారుచేస్తారు. వారే మీ
తండ్రి, వారి పేరు శివ. శివ పరమాత్మాయ నమః, బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు. ఈ
పదాలు చాలా స్పష్టముగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరమపిత పరమాత్మ కూర్చుని ఈ రథము ద్వారా
అర్థం చేయిస్తున్నారు. ఎలాగైతే లౌకిక తండ్రి - పిల్లలూ, మన కులానికి కళంకాన్ని
తీసుకురాకండి, ఎటువంటి తప్పుడు పనులు చేయకండి అని అర్థం చేయిస్తారో, అలా ఈ తండ్రి
కూడా - పిల్లలూ, వికారాలలోకైతే ఎప్పుడూ వెళ్ళకండి అని చెప్తారు. పవిత్రముగా
అవ్వకుండా స్వర్గములో ఉన్నత పదవిని పొందలేరు. మీరు చాలా గొప్ప సంపాదన
చేసుకుంటున్నారు. మిగిలినవారంతా పోగొట్టుకుంటున్నారు. కొందరి వద్ద కోటానుకోట్లు
ఉండవచ్చు, వారు పెద్ద-పెద్ద మహళ్ళను నిర్మిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.
ఇదంతా టైమ్ వేస్ట్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఇవేవీ పనికి రావు, అంతా
సమాప్తమైపోతుంది. 10-12 వేల సంవత్సరాలు కొనసాగుతుందని వారు భావిస్తారు. మృత్యువైతే
ఎదురుగా ఉందని, తలపైనే ఉందని పిల్లలైన మీకు తెలుసు. కొద్ది సమయములో ఈ భూకంపాలు
మొదలైనవి జరిగి అంతా అస్తవ్యస్తమైపోతుంది. భూకంపాలు మొదలైనవాటిలో లెక్కలేనంతమంది
చనిపోతారు. ఇప్పుడిక వినాశనము జరగాల్సిందే. వినాశన సాక్షాత్కారాన్ని మరియు స్థాపన
యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. భక్తి
మార్గములో ఎంత చేసినా కానీ ఎవరూ వైకుంఠానికి వెళ్ళలేరు. జ్ఞానము లేకుండా సద్గతి
కలగదు. ఇవన్నీ భక్తి మార్గపు ఆట బొమ్మలు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కులాన్ని కళంకితం చేసే చెడు పనులేవీ చేయకూడదు. పవిత్రముగా అవుతామని మీతో మీరు
ప్రతిజ్ఞ చేసుకోవాలి.
2. ఇప్పుడు మీ సమయాన్ని, ధనాన్ని... వ్యర్థం చేసుకోకూడదు. పుష్పాల తోటలోకి
వెళ్ళేందుకు ముళ్ళను తొలగించివేయాలి.
వరదానము:-
అలౌకిక ఆట బొమ్మలతో అలౌకిక ఆటను ఆడుతూ సదా శక్తిశాలిగా అయ్యే
అచల్-అడోల్ భవ (చలించనివారిగా, స్థిరమైనవారిగా కండి)
అలౌకిక జీవితములో మాయ విఘ్నాలు రావడము కూడా ఒక అలౌకిక ఆట,
ఏ విధముగా శారీరక శక్తి కోసం ఆటలు ఆడించడము జరుగుతుందో, అదే విధముగా అలౌకిక యుగములో
పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ, ఈ అలౌకిక ఆటను ఆడండి. వీటికి భయపడకండి లేక
గాభరా పడకండి. సర్వ సంకల్పాల సహితముగా, స్వయాన్ని బాప్ దాదాపై బలిహారము చేసుకోండి,
అప్పుడిక మాయ ఎప్పుడూ దాడి చేయలేదు. రోజు అమృతవేళలో సాక్షీగా అయి, స్వయాన్ని
సర్వశక్తులతో అలంకరించుకున్నట్లయితే, చలించకుండా-స్థిరముగా ఉంటారు.
స్లోగన్:-
ఎటువంటి
ప్రాపంచిక సమాచారాలనైనా వినడము, వినిపించడము - ఇది కూడా స్వయములో చెత్తను జమ
చేసుకోవడమే.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
బాప్ దాదా యొక్క
ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే - నిరంతర స్మృతిలో ఉండండి మరియు మనసు, వాణి, కర్మల ద్వారా
పవిత్రముగా అవ్వండి. సంకల్పములో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండకూడదు - దీనినే
సంపూర్ణ పవిత్రత అంటారు. సంకల్పములోనైనా సరే, ఒకవేళ అశుద్ధ సంస్కారము టచ్ చేసినా,
వ్యర్థ సంకల్పాలు వచ్చినా లేక వ్యర్థ స్వప్నాలు వచ్చినా కూడా సంపూర్ణ పవిత్రత అని
అనరు. అందుకే పవిత్ర భవ మరియు యోగీ భవ అన్న మొదటి పాఠాన్ని స్వరూపములోకి తీసుకురండి,
అప్పుడే బాబా సమానముగా అయ్యేందుకు మరియు బాబాకు సమీపముగా వచ్చేందుకు అధికారులుగా
అవ్వగలరు.