04-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు అశరీరిగా అయి ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో, అప్పుడు మీ కొరకు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది, దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు’’

ప్రశ్న:-
తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞానమనే మూడవ నేత్రము ఎందుకు లభించింది?

జవాబు:-
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, అదే రూపములో స్మృతి చేసేందుకు మూడవ నేత్రము లభించింది. కానీ ఎప్పుడైతే పూర్తిగా యోగయుక్తముగా ఉంటారో అప్పుడే ఈ మూడవ నేత్రము పని చేస్తుంది అనగా ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతి ఉండాలి, ఎవరి నామ-రూపాలలోనూ వేలాడుతూ ఉండకూడదు. మాయ ప్రీతిని ఉంచడములోనే విఘ్నాలను కలిగిస్తుంది. ఇందులోనే పిల్లలు మోసపోతారు.

పాట:-
నీ దారిలోనే మరణించాలి...

ఓంశాంతి
బ్రాహ్మణ పిల్లలైన మీరు తప్ప ఈ పాట అర్థాన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఏ విధంగానైతే వేద-శాస్త్రాలు మొదలైనవాటిని తయారుచేసారు కానీ అవేవైతే చదువుతారో వాటి అర్థాన్ని తెలుసుకోలేరు, అందుకే తండ్రి అంటారు, నేను బ్రహ్మా ముఖము ద్వారా సర్వ వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను, అలాగే ఈ పాటల అర్థాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, తండ్రే వీటి అర్థాన్ని అర్థం చేయిస్తారు. ఆత్మ ఎప్పుడైతే శరీరము నుండి అతీతముగా అవుతుందో అప్పుడు ప్రపంచముతో మొత్తం సంబంధమంతా తెగిపోతుంది. పాటలో కూడా ఉంది, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అశరీరిగా అయి తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచము సమాప్తమైపోతుంది అని. ఈ శరీరము ఈ భూమిపై ఉంది, ఆత్మ ఇందులో నుండి వెళ్ళిపోతే ఇక ఆ సమయములో ఆత్మకు మనుష్య సృష్టి లేనట్లే. ఆత్మ వివస్త్రగా అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే శరీరములోకి ప్రవేశిస్తుందో అప్పుడు పాత్ర మొదలవుతుంది. అప్పుడు ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరములోకి ప్రవేశిస్తుంది. తిరిగి మహాతత్వములోకి వెళ్ళదు. ఎగిరిపోయి ఇంకొక శరీరములోకి వెళ్తుంది. ఇక్కడ ఈ ఆకాశ తత్వములోనే ఆత్మ పాత్రను అభినయించాలి, మూలవతనములోకి వెళ్ళేది లేదు. ఎప్పుడైతే శరీరము వదులుతారో అప్పుడు ఈ కర్మబంధనాలూ ఉండవు, అలాగే ఆ కర్మబంధనాలూ ఉండవు. శరీరము నుండే వేరైపోతారు కదా. మళ్ళీ వేరొక శరీరము తీసుకున్నప్పుడు ఆ కర్మ బంధనాలు మొదలవుతాయి. ఈ విషయాలు మీకు తప్ప ఇతర మనుష్యులెవ్వరికీ తెలియవు. అందరూ పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారని తండ్రి అర్థం చేయించారు కానీ ఎవ్వరూ ఇలా భావించరు. తమను తాము ఎంత తెలివైనవారిగా భావిస్తారు, శాంతి పురస్కారాలు ఇస్తూ ఉంటారు. ఇది కూడా బ్రాహ్మణ కులభూషణులైన మీరు బాగా అర్థం చేయించగలరు. వారికి అసలు శాంతి అని దేనిని అంటారో కూడా తెలియదు. కొందరేమో మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని మహాత్ముల వద్దకు వెళ్తారు. వారు ప్రపంచములో శాంతి ఎలా లభిస్తుంది అని అంటారే కానీ నిరాకారీ ప్రపంచములో శాంతి ఎలా లభిస్తుంది అని అనరు. అది ఉన్నదే శాంతిధామము. ఆత్మలైన మనము శాంతిధామములో ఉంటాము కానీ వారు మనశ్శాంతి అని అంటారు. శాంతి ఎలా లభిస్తుంది అన్నది వారికి తెలియదు. శాంతిధామమైతే మన ఇల్లు. ఇక్కడ శాంతి ఎలా లభించగలదు? అయితే, సత్యయుగములో సుఖము, శాంతి, సంపద అన్నీ ఉన్నాయి, దాని స్థాపనను తండ్రి చేస్తారు. ఇక్కడైతే ఎంత అశాంతి ఉంది. ఇవన్నీ ఇప్పుడు పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. సుఖము, శాంతి, సంపద భారత్ లోనే ఉండేవి, ఆ వారసత్వము తండ్రి ఇచ్చినది మరియు దుఃఖము, అశాంతి, పేదరికము, ఈ వారసత్వము రావణుడిది. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి పరంధామములో ఉండే జ్ఞానసంపన్నులు, వారు సుఖధామము యొక్క వారసత్వాన్ని మనకు ఇస్తారు. వారు ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము ఆత్మలో ఉంటుందనైతే మీకు తెలుసు. వారినే జ్ఞానసాగరుడని అనడం జరుగుతుంది. ఆ జ్ఞానసాగరుడు ఈ శరీరము ద్వారా ప్రపంచ చరిత్ర, భూగోళము గురించి అర్థం చేయిస్తారు. ప్రపంచానికి ఆయువు అంటూ ఉండాలి కదా. ప్రపంచమైతే ఎల్లప్పుడూ ఉండనే ఉంది. కేవలం కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము అని అంటారు. ఇది కూడా మనుష్యులకు తెలియదు. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచముగా తయారయ్యేందుకు ఎంత సమయం పడుతుంది?

కలియుగము తరువాత సత్యయుగము తప్పకుండా వస్తుంది అని పిల్లలైన మీకు తెలుసు, అందుకే కలియుగము మరియు సత్యయుగము యొక్క సంగమములో తండ్రి రావలసి ఉంటుంది. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను, శంకరుని ద్వారా వినాశనమును చేయిస్తారని కూడా మీకు తెలుసు. త్రిమూర్తి అంటే అర్థమే స్థాపన, వినాశనము, పాలన. ఇవి సామాన్యమైన విషయాలే. కానీ ఈ విషయాలను పిల్లలైన మీరు మర్చిపోయారు. లేదంటే మీకు ఎంతో సంతోషముండాలి. నిరంతరమూ స్మృతి ఉండాలి. బాబా మనల్ని ఇప్పుడు కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేస్తున్నారు. భారతవాసులైన మీరే యోగ్యులుగా తయారవుతారు, ఇంకెవ్వరూ అవ్వరు. అయితే, ఇతర ధర్మాలలోకి ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో, వారు తిరిగి రావచ్చు. అప్పుడు అందులోకి మారినట్లుగానే మళ్ళీ ఇందులోకి మారిపోతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచము ఇప్పుడు మారుతుందని మనుష్యులకు అర్థం చేయించాలి. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరగనున్నది. ఈ సమయములోనే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరైతే రాజయోగము నేర్చుకుంటారో, వారు కొత్త ప్రపంచములోకి వెళ్ళిపోతారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులని, ఆ తర్వాత ఇక్కడ చూస్తే ముఖ్యమైనవారు జగదంబ మరియు జగత్పిత అని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. తండ్రి రావడము కూడా ఇక్కడే వస్తారు, ఈ బ్రహ్మా తనువులోకి, ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడే ఉన్నారు కదా. బ్రహ్మా ద్వారా స్థాపన అనేది సూక్ష్మవతనములోనైతే జరగదు కదా. అది ఇక్కడే జరుగుతుంది. వీరు వ్యక్తము నుండి అవ్యక్తమవుతారు. వీరు రాజయోగాన్ని నేర్చుకుని విష్ణువు యొక్క రెండు రూపాలుగా తయారవుతారు. ప్రపంచ చరిత్రను, భూగోళమును అర్థం చేసుకోవాలి కదా. మనుష్యులే అర్థం చేసుకుంటారు. విశ్వాధిపతియే విశ్వ చరిత్ర, భూగోళములను అర్థం చేయించగలరు. వారు జ్ఞానసంపన్నుడు, పునర్జన్మ రహితుడు. ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ లేదు. పరిశీలించేందుకు కూడా బుద్ధి కావాలి కదా. బుద్ధిలో ఏమైనా కూర్చుంటుందా లేక అలాగే ఉన్నారా అని నాడిని చూడాలి. అజమల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవారు, వారికి చూడగానే రోగము ఏమిటో తెలిసిపోయేది అని అనేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా - వీరు యోగ్యులా, కాదా అన్నది అర్థం చేసుకోవాలి.

తండ్రి పిల్లలకు జ్ఞానపు మూడవ నేత్రాన్ని ఇచ్చారు, దానితో మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, వారిని అదే రూపములో స్మృతి చేస్తారు. కానీ ఎవరైతే పూర్తిగా యోగయుక్తముగా ఉంటారో, ఎవరికైతే తండ్రితో ప్రీతిబుద్ధి ఉంటుందో, వారికే ఇటువంటి బుద్ధి ఉంటుంది. అందరూ అలా లేరు కదా. ఒకరి నామ-రూపాలలో ఒకరు వేలాడుతూ ఉంటారు. తండ్రి అంటారు, ప్రీతిని నాతో పెట్టుకోండి కదా. మాయ ఎటువంటిదంటే, అది ప్రీతిని పెట్టుకోనివ్వదు. తన కస్టమర్లు వెళ్ళిపోతున్నారు అని మాయ కూడా చూస్తుంది, అప్పుడిక ఒక్కసారిగా ముక్కు, చెవులను పట్టుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మోసపోతారో, అప్పుడు మాయతో మోసపోయామని అర్థం చేసుకుంటారు. వారు మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవ్వలేరు, ఉన్నత పదవిని పొందలేరు. ఇందులోనే శ్రమ ఉంది. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పతిత బుద్ధి పావనమైపోతుంది అని శ్రీమతము చెప్తుంది. కానీ కొందరికి ఎంతో కష్టమనిపిస్తుంది. ఇందులో సబ్జెక్ట్ ఒక్కటే - అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు రాజ్యాధికారము), అంతే, ఈ రెండు పదాలను కూడా స్మృతి చెయ్యలేరా! భగవంతుడిని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు కానీ తమ దేహాన్ని మరియు ఇతరుల దేహాలను స్మృతి చేస్తూ ఉంటారు. బాబా అంటారు, దేహాన్ని చూస్తూ మీరు నన్ను స్మృతి చేయండి. నన్ను చూడటానికి, అర్థం చేసుకోవటానికి ఆత్మకు ఇప్పుడు మూడవ నేత్రము లభించింది, దానిని ఉపయోగించండి. పిల్లలైన మీరు ఇప్పుడు త్రినేత్రులుగా మరియు త్రికాలదర్శులుగా అవుతారు. కానీ త్రికాలదర్శులుగా కూడా నంబరువారుగా ఉన్నారు. జ్ఞానాన్ని ధారణ చేయడం ఏమంత కష్టము కాదు. చాలా బాగా అర్థం చేసుకుంటారు కానీ యోగబలము తక్కువగా ఉంది, దేహీ-అభిమానీ స్థితి చాలా తక్కువగా ఉంది. చిన్న విషయానికే క్రోధము, కోపము వచ్చేస్తుంది, ఇక పడిపోతూ ఉంటారు. లేస్తారు, పడిపోతారు. ఈ రోజు లేస్తారు, రేపు మళ్ళీ పడిపోతారు. దేహాభిమానము ముఖ్యమైనది, ఆ తర్వాత ఇతర వికారాలలో, లోభము, మోహము మొదలైనవాటిలో చిక్కుకుపోతారు. దేహము పట్ల కూడా మోహము ఉంటుంది కదా. మాతలలో మోహము ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి దాని నుండి విముక్తులుగా చేస్తారు. మీకు అనంతమైన తండ్రి లభించారు, ఇక మోహము ఎందుకు పెట్టుకుంటారు? ఆ సమయములో ముఖము, మాటతీరు అంతా కోతిలా అయిపోతుంది. తండ్రి అంటారు, నష్టోమోహులుగా అవ్వండి, నిరంతరమూ నన్ను స్మృతి చెయ్యండి. పాపాల భారము తలపై ఎంతో ఉంది, అది ఎలా తొలగుతుంది? కానీ మాయ ఎటువంటిదంటే అది అసలు స్మృతి చెయ్యనివ్వదు. ఎంత కష్టపడినా కానీ అది ఘడియ-ఘడియ బుద్ధి ఎగిరిపోయేలా చేస్తుంది. మేము కేవలం అతి ప్రియమైన బాబానే మహిమ చేస్తూ ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తారు. బాబా, ఇక మీ వద్దకు వచ్చేస్తున్నాము అని అంటారు, కానీ మళ్ళీ మర్చిపోతారు, బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది. నంబరు వన్ లోకి వెళ్ళే వీరు కూడా పురుషార్థియే కదా.

మేము గాడ్ ఫాదర్ కు విద్యార్థులము అని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. గీతలో కూడా - నేను నిన్ను రాజులకే రాజుగా తయారుచేస్తాను అని భగవానువాచ ఉంది. కేవలం శివునికి బదులుగా శ్రీకృష్ణుని పేరు వేసేశారు. వాస్తవానికి శివబాబా జయంతిని మొత్తం ప్రపంచమంతటా జరుపుకోవాలి. శివబాబా అందరినీ దుఃఖము నుండి విముక్తులుగా చేసి మార్గదర్శకుడై తనతోపాటు తీసుకువెళ్తారు. వారు ముక్తిదాత మరియు మార్గదర్శకుడు అనైతే అందరూ అంగీకరిస్తారు. అందరి పతిత-పావనుడు తండ్రి, వారు అందరినీ శాంతిధామము, సుఖధామములోకి తీసుకువెళ్ళేవారు, మరి వారి జయంతిని ఎందుకు జరుపుకోరు? భారతవాసులే జరుపుకోరు, అందుకే భారత్ కు ఇంత దుర్గతి పట్టింది. మృత్యువు కూడా చాలా దుర్గతిలో జరుగుతుంది. వారు ఎలాంటి బాంబులు తయారుచేస్తారంటే, గ్యాస్ బయటకు రాగానే అంతమైపోతారు, క్లోరోఫామ్ (స్పృహ కోల్పోయేలా చేసే ఒక పదార్థము) ఇచ్చినట్లు అయిపోతారు. ఇవి కూడా వారు తయారుచేయవలసిందే. ఇది ఆగిపోవడం అసంభవము. కల్పపూర్వము ఏదైతే జరిగిందో, అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఈ మిసైల్స్ మరియు ప్రకృతి వైపరీత్యాల ద్వారా పాత ప్రపంచము వినాశనమైంది, అది మళ్ళీ ఇప్పుడూ జరుగుతుంది. వినాశన సమయము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారముగా వినాశనము పాత్రలోకి వచ్చే తీరుతుంది. డ్రామా వినాశనమును తప్పకుండా చేయిస్తుంది. రక్తపు నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. గృహ యుద్ధాలలో ఒకరినొకరు హతమార్చుకుంటారు కదా. ఈ ప్రపంచము మారుతోందని మీలో కూడా కొందరికే తెలుసు. ఇప్పుడు మనము సుఖధామములోకి వెళ్తాము. కావున సదా జ్ఞానము యొక్క అతీంద్రియ సుఖములో ఉండాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సుఖము పెరుగుతూ ఉంటుంది, ఛీ-ఛీ దేహము నుండి నష్టోమోహులుగా అవుతూ ఉంటారు. తండ్రి కేవలం అంటారు, భగవంతుడిని స్మృతి చేస్తే రాజ్యాధికార వారసత్వము మీదవుతుంది. క్షణములో రాజ్యాధికారము లభిస్తుంది, ఎవరైనా చక్రవర్తికి కొడుకు పుడితే, ఆ కొడుకు చక్రవర్తి అయినట్లే కదా. కావున తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉండండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి, అప్పుడు చక్రవర్తి మహారాజులుగా అవుతారు, అందుకే సెకండులో జీవన్ముక్తి, సెకండులో బికారి నుండి రాకుమారుడు అని గానం చేయబడుతుంది. ఇది ఎంత బాగుంది. కావున శ్రీమతముపై బాగా నడుచుకోవాలి. అడుగడుగులో సలహా తీసుకోవలసి ఉంటుంది.

తండ్రి అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, ట్రస్టీగా అయి ఉన్నట్లయితే మమకారము తొలగిపోతుంది. కానీ ట్రస్టీగా అవ్వడమనేది అంత సులువైన విషయము కాదు. బాబా స్వయం ట్రస్టీగా అయ్యారు, పిల్లలను కూడా ట్రస్టీలుగా తయారుచేస్తారు. వీరు ఏమైనా తీసుకుంటారా? మీరు ట్రస్టీలుగా అయి సంభాళించండి అని అంటారు. ట్రస్టీలుగా అయితే మమకారము తొలగిపోతుంది. అంతా ఈశ్వరుడు ఇచ్చిందే అని అంటారు కూడా. కానీ ఏదైనా నష్టం వస్తే లేదా ఎవరైనా చనిపోతే, ఇక రోగగ్రస్తులైపోతారు. ఏదైనా దొరికితే సంతోషము కలుగుతుంది. మరి ఈశ్వరుడే ఇచ్చారు అని అన్నప్పుడు, ఒకవేళ చనిపోతే ఏడవవలసిన పనేముంది. కానీ మాయ తక్కువేమీ కాదు, ఇది అంత సులువైన విషయము కాదు. ఈ సమయములో తండ్రి అంటారు - మాకు ఈ పతిత ప్రపంచములో ఉండాలని లేదు, మమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి, మీతోపాటు తీసుకువెళ్ళండి అని మీరు నన్ను పిలిచారు, కానీ దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోలేరు. పతిత-పావనుడు వస్తే, మరి ఈ శరీరము తప్పకుండా అంతమైపోతుంది కదా, అప్పుడే ఆత్మలను తీసుకువెళ్ళగలరు. కావున ఇటువంటి తండ్రిపై ప్రీతిబుద్ధి కలిగి ఉండాలి. ఒక్కరి పైనే ప్రేమ పెట్టుకోవాలి, వారినే స్మృతి చేయాలి. మాయ తుఫానులైతే వస్తాయి. కానీ కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకూడదు. చేస్తే అది నియమవిరుద్ధమైపోతుంది. తండ్రి అంటారు, నేను వచ్చి ఈ శరీరాన్ని ఆధారముగా తీసుకుంటాను. ఇది వీరి శరీరము కదా. మీరు స్మృతి చేయవలసినది తండ్రిని. మీకు తెలుసు, బ్రహ్మా కూడా తండ్రియే, శివుడు కూడా తండ్రియే. విష్ణువును మరియు శంకరుడిని తండ్రి అని అనరు. శివుడు నిరాకార తండ్రి. ప్రజాపిత బ్రహ్మా సాకార తండ్రి. ఇప్పుడు మీరు సాకారుని ద్వారా నిరాకార తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. దాదా వీరిలోకి ప్రవేశిస్తారు, అందుకే దాదా (తాతగారి) వారసత్వాన్ని తండ్రి ద్వారా మనము తీసుకుంటాము అని అంటారు. దాదా (తాతగారు) నిరాకారుడు, తండ్రి సాకారుడు. ఇవి అద్భుతమైన కొత్త విషయాలు కదా. త్రిమూర్తిని చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. శివుడిని మాయం చేసేసారు. తండ్రి ఎంత మంచి-మంచి విషయాలను అర్థం చేయిస్తారు కావున మేము విద్యార్థులమని సంతోషముండాలి. బాబా మనకు తండ్రి, టీచర్, సద్గురువు. ఇప్పుడు మీరు ప్రపంచ చరిత్ర, భూగోళములను అనంతమైన తండ్రి నుండి వింటున్నారు, మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు. ఇది 5000 సంవత్సరాల చక్రము. కాలేజ్ పిల్లలకు ప్రపంచ చరిత్ర, భూగోళముల గురించి అర్థం చేయించాలి. 84 జన్మల మెట్లు అంటే ఏమిటి, భారత్ యొక్క ఎక్కేకళ మరియు దిగేకళ ఎలా జరుగుతుంది, ఇది అర్థం చేయించాలి. క్షణములో భారత్ స్వర్గము తయారవుతుంది, మళ్ళీ 84 జన్మలకు భారత్ నరకముగా తయారవుతుంది. ఇది చాలా సహజముగా అర్థం చేసుకోవాల్సిన విషయము. భారత్ స్వర్ణిమ యుగము నుండి ఇనుప యుగములోకి ఎలా వచ్చింది - ఇది భారతవాసులకు అర్థం చేయించాలి. టీచర్లకు కూడా అర్థం చేయించాలి. అది భౌతిక జ్ఞానము, ఇది ఆత్మిక జ్ఞానము. దానిని మనుష్యులు ఇస్తారు, దీనిని గాడ్ ఫాదర్ ఇస్తారు. వీరు మనుష్య సృష్టికి బీజరూపుడు కావున వీరి వద్ద మనుష్య సృష్టి యొక్క జ్ఞానమే ఉంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఛీ-ఛీ దేహము నుండి పూర్తిగా నష్టోమోహులుగా అయ్యి జ్ఞానపు అతీంద్రియ సుఖములో ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచము మారనున్నదని, ఇక మేము మా సుఖధామములోకి వెళ్తామని బుద్ధిలో ఉండాలి.

2. ట్రస్టీగా అయి అన్నీ సంభాళిస్తూ తమ మమకారాన్ని తొలగించాలి. ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఏ వికర్మలు చేయకూడదు.

వరదానము:-
బ్రహ్మాబాబా సమానముగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన చిత్రాన్ని తయారుచేసుకునే పరోపకారీ భవ

శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్ఠ కర్మల ద్వారా భాగ్యపు చిత్రాన్ని అయితే పిల్లలందరూ తయారుచేసుకున్నారు, ఇప్పుడు కేవలం చివరి టచింగ్ ఏమిటంటే - సంపూర్ణత అనగా బ్రహ్మాబాబా సమానముగా శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా తయారవ్వడము, దీని కొరకు పరోపకారులుగా అవ్వండి అనగా స్వార్థ భావము నుండి సదా ముక్తులుగా ఉండండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యములో, ప్రతి సహయోగీ సంగఠనలో ఎంత నిస్వార్థత ఉంటుందో, అంతగానే పరోపకారులుగా అవ్వగలుగుతారు. సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు. సదా ప్రాప్తి స్వరూపపు స్థితిలో స్థితులై ఉంటారు. స్వయం కోసం ఏదీ స్వీకరించరు.

స్లోగన్:-
సర్వస్వ త్యాగిగా అయినట్లయితేనే సరళత మరియు సహనశీలతా గుణాలు వస్తాయి.

తమ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

ఈ సకాష్ ను ఇచ్చే సేవను నిరంతరం చేయవచ్చు, ఇందులో ఆరోగ్యము లేక సమయము యొక్క విషయము లేదు. రాత్రింబవళ్ళు ఈ అనంతమైన సేవలో నిమగ్నమవ్వచ్చు. ఏ విధంగా బ్రహ్మాబాబాను చూసారు, రాత్రి సమయములో కూడా కళ్ళు తెరవగానే అనంతమైన సకాష్ ను ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది, ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయండి. ఎప్పుడైతే పిల్లలైన మీరు అనంతములో సకాష్ ను ఇస్తారో, అప్పుడు మీ దగ్గర ఉన్నవారు ఆటోమేటిక్ గా సకాష్ ను తీసుకుంటూ ఉంటారు. ఈ అనంతమైన సకాష్ ను ఇవ్వడముతో వాయుమండలము స్వతహాగా తయారవుతుంది.