ఓంశాంతి
ఇవి మనుష్యుల ద్వారా తయారుచేయబడిన పాటలు. వీటి అర్థము ఎవరికీ ఏమీ తెలియదు. భక్తులు
పాటలు, భజనలు మొదలైనవి పాడుతారు, మహిమ చేస్తారు, కానీ ఏమీ తెలియదు. చాలా మహిమ
చేస్తారు. పిల్లలైన మీరు ఎటువంటి మహిమ చేయకూడదు. పిల్లలు ఎప్పుడూ తండ్రి మహిమను
చేయరు. వీరు నా పిల్లలు అని తండ్రికి తెలుసు. వీరు మా తండ్రి అని పిల్లలకు తెలుసు.
ఇప్పుడు ఇది అనంతమైన విషయము. అయినా అందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు.
ఇప్పటివరకు కూడా స్మృతి చేస్తూనే ఉంటారు. ఓ బాబా, అని భగవంతుడిని అంటారు. వీరి పేరు
శివబాబా. ఆత్మలమైన మనము ఎలాగైతే ఉన్నామో, శివబాబా కూడా అలాగే ఉన్నారు. వారు పరమ
ఆత్మ, వారిని సుప్రీమ్ (ఉన్నతమైనవారు) అని అంటారు, మనము వారి పిల్లలము. వారిని
సుప్రీమ్ సోల్ (పరమ ఆత్మ) అని అంటారు. వారి నివాస స్థానము ఎక్కడ? పరంధామములో.
ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఆత్మలే పాత్రధారులు. నాటకములో పాత్రధారులు నంబరువారుగా
ఉంటారని మీకు తెలుసు. ప్రతి ఒక్కరి పాత్ర అనుసారముగా వారికి జీతము లభిస్తుంది.
అక్కడ ఉండే ఆత్మలన్నీ పాత్రధారులే, కానీ నంబరువారుగా అందరికీ పాత్ర లభించి ఉంది.
ఆత్మలలో అవినాశీ పాత్ర ఏ విధముగా నిండి ఉంది అనేది ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తున్నారు. ఆత్మలందరి పాత్ర ఒకే విధముగా ఉండదు. అందరిలో శక్తి ఒకే విధముగా
ఉండదు. ఎవరైతే శివుని రుద్ర మాలలోకి ముందు ఉంటారో, వారిదే అందరికన్నా మంచి పాత్ర అని
మీకు తెలుసు. నాటకములో ఎవరైతే చాలా మంచి-మంచి పాత్రధారులు ఉంటారో, వారికి ఎంత మహిమ
జరుగుతుంది. కేవలం వారిని చూడటానికి కూడా మనుష్యులు వెళ్తారు. ఇది అనంతమైన డ్రామా.
ఈ అనంతమైన డ్రామాలో కూడా ఉన్నతమైనవారు ఒక్క తండ్రియే. ఉన్నతోన్నతమైన యాక్టర్,
క్రియేటర్, డైరెక్టర్ అని కూడా అనవచ్చు. వారంతా హద్దులోని యాక్టర్లు, డైరెక్టర్లు
మొదలైనవారు. వారికి తమ చిన్న పాత్ర లభించి ఉంది. పాత్రను ఆత్మయే అభినయిస్తుంది కానీ
దేహాభిమానము కారణముగా మనుష్యుల పాత్ర ఇలా ఉందని అనేస్తారు. తండ్రి అంటారు, పాత్ర
అంతా ఆత్మదే. ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు,
సత్యయుగములో ఆత్మాభిమానులుగా ఉంటారు. వారికి తండ్రి గురించి తెలియదు. ఇక్కడ
కలియుగములోనైతే ఆత్మాభిమానులుగా కూడా లేరు మరియు తండ్రి గురించి కూడా తెలియదు.
ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. తండ్రిని కూడా తెలుసుకుంటారు.
బ్రాహ్మణులైన మీకు అతీతమైన జ్ఞానము లభిస్తుంది. ఆత్మలమైన మనమంతా పాత్రధారులమని
మీరు ఆత్మను గురించి తెలుసుకున్నారు. అందరికీ పాత్ర లభించి ఉంది, ఒకరి పాత్ర
మరొకరితో కలవదు. ఆ పాత్ర అంతా ఆత్మలోనే ఉంది. నాటకాలేవైతే తయారుచేస్తారో, ఆ పాత్రను
కూడా ఆత్మయే ధారణ చేస్తుంది. మంచి పాత్రను కూడా ఆత్మయే తీసుకుంటుంది. నేను గవర్నరును,
నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది. కానీ ఆత్మాభిమానులుగా అవ్వరు. సత్యయుగములో అర్థం
చేసుకుంటారు - నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలి అని.
పరమాత్ముని గురించి అక్కడ ఎవరికీ తెలియదు. ఈ సమయములో మీకు అంతా తెలుసు. శూద్రులు
మరియు దేవతల కన్నా బ్రాహ్మణులైన మీరు ఉత్తములు. దేవతలుగా అయ్యేందుకు ఇంతమంది
బ్రాహ్మణులు ఎక్కడ నుండి వస్తారు. ప్రదర్శనీలకు లక్షలమంది వస్తారు. ఎవరైతే బాగా
అర్థం చేసుకుంటారో, జ్ఞానము వింటారో, వారు ప్రజలుగా అవుతారు. ఒక్కొక్క రాజుకు
ఎంతోమంది ప్రజలు ఉంటారు. మీరు ఎంతోమంది ప్రజలను తయారుచేస్తున్నారు. ప్రదర్శనీలు,
ప్రొజెక్టర్ ద్వారా కొందరు అర్థం చేసుకుని మంచిగా తయారవుతారు కూడా. నేర్చుకుంటారు,
యోగము జోడిస్తారు. ఇప్పుడు వారందరూ వెలువడుతూ ఉంటారు. ప్రజలు కూడా వెలువడుతారు, ఆ
తర్వాత షావుకారులు, రాజు-రాణి, పేదవారు మొదలైనవారందరూ వెలువడుతారు. రాకుమారులు,
రాకుమారీలు ఎంతోమంది ఉంటారు. సత్యయుగము నుండి మొదలుకొని త్రేతాయుగము వరకు రాకుమారులు,
రాకుమారీలు తయారవ్వనున్నారు. కేవలం 8 లేక 108 మంది మాత్రమే ఉండరు. ఇప్పుడు అందరూ
తయారవుతున్నారు. మీరు సేవ చేస్తూ ఉంటారు. ఇది కూడా నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు).
మీరు ఏదైనా ఫంక్షన్ చేసినా, అది కూడా కొత్త విషయమేమీ కాదు. అనేక సార్లు చేసారు,
మళ్ళీ సంగమములో ఇదే వ్యాపారము చేస్తారు, ఇంకేమి చేస్తారు! పతితులను పావనముగా
తయారుచేయడానికి తండ్రి వస్తారు. దీనిని ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికము అని అంటారు.
నంబరువారుగానైతే ప్రతి విషయములోనూ ఉండనే ఉంటారు. మీలో ఎవరైతే బాగా భాషణ చేస్తారో,
వారిని అందరూ - వీరు చాలా బాగా భాషణ చేసారు అని అంటారు. ఇంకొకరి భాషణ విన్నా కానీ,
ముందు మాట్లాడినవారే బాగా అర్థం చేయించేవారు అని అంటారు. మూడవవారు వారి కన్నా
చురుకుగా ఉన్నట్లయితే, వీరు వారి కన్నా చురుకుగా ఉన్నారు అని అంటారు. ప్రతి
విషయములోనూ - మేము ఇతరుల కన్నా ముందుకు వెళ్ళాలని పురుషార్థము చేయాలి. తెలివైనవారు
ఎవరైతే ఉంటారో, వారు భాషణ చేయడానికి వెంటనే చేయి ఎత్తుతారు. మీరందరూ పురుషార్థులు.
మున్ముందు మెయిల్ ట్రెయిన్ లా అయిపోతారు (లేఖలను, పార్సిళ్ళను అందించే వేగవంతమైన
మెయిల్ ట్రెయిన్ లా సందేశాన్ని ప్రతి ఆత్మకు అందించే పిల్లలు). ఉదాహరణకు మమ్మా
స్పెషల్ మెయిల్ ట్రెయిన్ లా ఉండేవారు. బాబా విషయములోనైతే తెలియదు ఎందుకంటే ఇద్దరూ
కలిసి ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోలేరు. శివబాబాయే అర్థం
చేయిస్తున్నారని మీరు సదా భావించండి. బాబా మరియు దాదా, ఇరువురికీ తెలుసు కానీ బాబా
అంతర్యామి. ఇతను చాలా తెలివైనవారని బయటకు అంటారు. తండ్రి కూడా మహిమను విని
సంతోషిస్తారు. లౌకిక తండ్రికి కూడా వారి బిడ్డ బాగా చదువుకుని, ఉన్నత పదవిని పొందితే
- ఈ బిడ్డ మంచి పేరు తీసుకువస్తాడు అని భావిస్తారు. ఫలానా బిడ్డ ఈ ఆత్మిక సేవలో
చురుకుగా ఉన్నారని కూడా అర్థం చేసుకుంటారు. ముఖ్యమైన విషయము భాషణ ఇవ్వడము, ఎవరికైనా
తండ్రి సందేశాన్ని ఇవ్వడము, వారికి అర్థం చేయించడము. బాబా ఉదాహరణను కూడా చెప్పారు -
ఒకరికి 5 మంది పిల్లలు ఉండేవారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని ఎవరో అడిగితే,
ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. అదేంటి, మీకు 5 మంది పిల్లలు ఉన్నారు కదా అని అంటే,
సుపుత్రులు ఇద్దరే అని అన్నారు. ఇక్కడ కూడా అంతే. పిల్లలైతే చాలామంది ఉన్నారు. బాబా
అంటారు, ఈ డాక్టర్ నిర్మల బచ్చీ చాలా మంచివారు. చాలా ప్రేమగా లౌకిక తండ్రికి అర్థం
చేయించి సెంటరు తెరిపించారు. ఇది భారత్ యొక్క సేవ. మీరు భారత్ ను స్వర్గముగా
తయారుచేస్తారు. ఈ భారత్ ను నరకముగా రావణుడు చేసాడు. జైలులో ఉన్నది ఒక్క సీత మాత్రమే
కాదు, కానీ సీతలైన మీరంతా రావణుని జైలులోనే ఉండేవారు. ఇకపోతే శాస్త్రాలలో అన్నీ
కల్పిత కథలు ఉన్నాయి. ఈ భక్తి మార్గము కూడా డ్రామాలో ఉంది. సత్యయుగము నుండి
మొదలుకొని ఏదైతే గడిచిందో, అదంతా మళ్ళీ రిపీట్ అవుతుందని మీకు తెలుసు. మీరే
పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. తండ్రి అంటారు, నేను వచ్చి పూజారుల నుండి
పూజ్యులుగా చేయాలి. మొదట బంగారుయుగము వారిగా, ఆ తర్వాత ఇనుపయుగము వారిగా అవ్వాలి.
సత్యయుగములో సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. రామరాజ్యమైతే చంద్రవంశీయులది.
ఈ సమయములో మీరంతా ఆత్మిక క్షత్రియులు (యోధులు). యుద్ధ మైదానములోకి వచ్చేవారిని
క్షత్రియులని అంటారు. మీరు ఆత్మిక క్షత్రియులు. ఇకపోతే వారు దైహిక క్షత్రియులు.
వారిది బాహుబలముతో కొట్లాడడము, గొడవపడడము అని అంటారు. పూర్వము బాహువులతో మల్ల
యుద్ధాలు జరిగేవి. పరస్పరములో యుద్ధము చేసుకునేవారు, విజయము పొందేవారు. ఇప్పుడు
చూడండి, బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి. మీరు కూడా క్షత్రియులే, వారు కూడా
క్షత్రియులే. మీరు శ్రీమతముపై నడుస్తూ మాయపై విజయము పొందుతారు. మీరు ఆత్మిక
క్షత్రియులు. ఆత్మలే ఈ శరీరము యొక్క కర్మేంద్రియాల ద్వారా అన్నీ చేస్తున్నారు.
తండ్రి వచ్చి ఆత్మలకు నేర్పిస్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే ఇక
మాయ తినదు, మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీకు తప్పుడు సంకల్పాలు రావు. తండ్రిని
స్మృతి చేసినట్లయితే సంతోషము కూడా కలుగుతుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు,
ఉదయాన్నే లేచి అభ్యాసము చేయండి. బాబా, మీరు ఎంత మధురమైనవారు. ఆత్మ - బాబా అని
అంటుంది. బాబా తన పరిచయాన్ని ఇచ్చారు - నేను మీ తండ్రిని, మీకు సృష్టి ఆదిమధ్యాంతాల
జ్ఞానాన్ని వినిపించడానికి వచ్చాను. ఇది మనుష్య సృష్టి యొక్క తలక్రిందులుగా ఉన్న
వృక్షము. ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి, దీనిని విరాట లీల అని అంటారు. తండ్రి
అర్థం చేయించారు - ఈ మనుష్య వృక్షానికి నేను బీజరూపుడను. నన్ను స్మృతి చేస్తారు.
ఒకరు ఒక వృక్షానికి చెందినవారు, ఇంకొకరు ఇంకొక వృక్షానికి చెందినవారు. అలా
నంబరువారుగా వెలువడుతారు. ఈ డ్రామా తయారై ఉంది. ఫలానా ధర్మస్థాపకుడిని, సందేశకుడిని
పంపించారని అంటూ ఉంటారు కానీ అక్కడ నుండి పంపించరు. ఇది డ్రామానుసారముగా రిపీట్
అవుతుంది. బాబా ఒక్కరే ధర్మాన్ని మరియు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇది
ప్రపంచములో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇది సంగమము. వినాశ జ్వాల ప్రజ్వలితమవ్వనున్నది.
ఇది శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞము. వారు రుద్ర యజ్ఞము అన్న పేరును పెట్టారు. ప్రజాపిత
బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులైన మీరు జన్మించారు. మీరు ఉన్నతమైనవారు కదా. మీ వెనుక ఇతర
వంశాలు వెలువడుతాయి. వాస్తవానికైతే మీరందరూ బ్రహ్మా యొక్క సంతానమే. బ్రహ్మాను
గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇది వంశవృక్షము. మొట్టమొదట బ్రహ్మా
ఉన్నతమైనవారు, ఆ తర్వాత వంశవృక్షము వెలువడుతుంది. భగవంతుడు సృష్టిని ఎలా రచిస్తారు
అని అంటారు. రచన అయితే ఉంది కదా. ఎప్పుడైతే అందరూ పతితముగా అవుతారో, అప్పుడు వారిని
పిలుస్తారు. వారే వచ్చి దుఃఖమయముగా ఉన్న సృష్టిని సుఖమయముగా తయారుచేస్తారు, అందుకే,
దుఃఖహర్త-సుఖకర్త అయిన బాబా రండి అని పిలుస్తారు. హరిద్వార్ అన్న పేరును పెట్టారు.
హరిద్వార్ అనగా హరి యొక్క ద్వారము. అక్కడ గంగ ప్రవహిస్తుంది. మేము గంగలో స్నానము
చేయడముతో హరి యొక్క ద్వారములోనికి వెళ్ళిపోతామని భావిస్తారు. కానీ హరి యొక్క ద్వారము
ఎక్కడ ఉంది? వారేమో శ్రీకృష్ణుడిని అలా అంటారు. హరి యొక్క ద్వారమైతే శివబాబాయే. వారే
దుఃఖహర్త-సుఖకర్త. మొదటైతే మీరు మీ ఇంటికి వెళ్ళాలి. పిల్లలైన మీకు మీ తండ్రి
గురించి మరియు ఇంటి గురించి ఇప్పుడే తెలిసింది. తండ్రి యొక్క సింహాసనము కాస్త పైన
ఉంటుంది. పైన పుష్పముంటుంది, ఆ తర్వాత జంట పూసలు దాని కింద ఉంటాయి. ఆ తర్వాత వైజయంతి
మాల ఉంటుంది, అదే విష్ణుమాల. విష్ణు మెడలో హారముగా ఉన్నవారే మళ్ళీ విష్ణుపురిలో
రాజ్యము చేస్తారు. బ్రాహ్మణుల మాల తయారవ్వదు ఎందుకంటే పదే-పదే తెగిపోతూ ఉంటుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఈ రోజు బాగుంటారు, రేపు
తుఫాను వస్తుంది, గ్రహచారము రావడముతో చల్లబడిపోతారు. తండ్రి అంటారు, నాకు
చెందినవారిగా అవుతారు, ఆశ్చర్యముగా వింటారు, వినిపిస్తారు, ధ్యానములోకి వెళ్తారు,
మాలలో పూసగా అవుతారు... ఆ తర్వాత ఒక్కసారిగా పారిపోతారు, చండాలురుగా అవుతారు, ఇక
మాల ఎలా తయారవుతుంది? అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని తండ్రి అర్థం
చేయిస్తున్నారు. భక్త మాలలోని ముఖ్యులు, స్త్రీలలో మీరా మరియు పురుషులలో నారదుడు.
సంగమములో తండ్రియే వచ్చి ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. మేమే స్వర్గానికి
యజమానులుగా ఉండేవారమని, ఇప్పుడు నరకములో ఉన్నామని పిల్లలు భావిస్తారు. తండ్రి అంటారు,
నరకాన్ని కాలదన్నండి, రావణుడు మీ నుండి దోచుకున్న మీ స్వర్గ రాజ్యాధికారాన్ని
తీసుకోండి. ఇదైతే తండ్రియే వచ్చి తెలియజేస్తారు. వారికి ఈ శాస్త్రాలు, తీర్థ
స్థానాలు మొదలైనవాటి గురించి తెలుసు. వారు బీజరూపుడు కదా. వారు జ్ఞానసాగరుడు,
శాంతిసాగరుడు... ఆత్మ ఈ విధముగా అంటుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగ యజమానులుగా ఉండేవారు.
వారికన్నా ముందు ఏముండేది? తప్పకుండా కలియుగము యొక్క అంతిమము వచ్చినప్పుడే సంగమయుగము
వచ్చి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ స్వర్గము తయారవుతుంది. తండ్రిని స్వర్గ రచయిత అని
అంటారు, వారు స్వర్గాన్ని స్థాపన చేసేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి
యజమానులుగా ఉండేవారు. వీరికి వారసత్వము ఎక్కడ నుండి లభించింది? స్వర్గ రచయిత అయిన
తండ్రి నుండి లభించింది. ఇది తండ్రి వారసత్వమే. ఈ లక్ష్మీ-నారాయణులకు సత్యయుగ
రాజధాని ఉండేది, దానిని వారు ఎలా తీసుకున్నారు అని మీరు ఎవరినైనా అడుగవచ్చు. ఎవ్వరూ
చెప్పలేకపోతారు. ఈ దాదా కూడా అంటారు - ఇంతకుముందు నాకు కూడా తెలియదు, పూజ చేసేవాడిని
కానీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఈ సంగమములో రాజయోగాన్ని
నేర్చుకుంటారు. గీతలోనే రాజయోగము యొక్క వర్ణన ఉంది. గీతలో తప్ప ఇంకే శాస్త్రములోనూ
రాజయోగము యొక్క విషయము లేదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా
తయారుచేస్తాను. భగవంతుడే వచ్చి నరుని నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానాన్ని ఇచ్చారు.
భారత్ యొక్క ముఖ్యమైన శాస్త్రము గీత. గీత ఎప్పుడు రచింపబడింది అన్నది తెలియదు.
తండ్రి అంటారు, కల్ప-కల్పము సంగమములో వస్తాను. నేను ఎవరికైతే రాజ్యాన్ని ఇచ్చానో,
వారు రాజ్యాన్ని పోగొట్టుకుని తమోప్రధానముగా, దుఃఖితులుగా అయ్యారు. ఇది రావణుడి
రాజ్యము. ఇది మొత్తం భారత్ కు సంబంధించిన కథ. భారత్ ఆల్రౌండ్ అయినది, మిగిలినవన్నీ
తర్వాత వస్తాయి. తండ్రి అంటారు, మీకు 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తాను. 5 వేల
సంవత్సరాల క్రితం మీరు దేవీ-దేవతలుగా ఉండేవారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. ఓ
భారతవాసులారా, తండ్రి అంతిమములో వస్తారు. ఆదిలో వస్తే వారు ఆది-అంతిమము యొక్క
జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు! సృష్టి యొక్క వృద్ధియే జరగకపోతే ఇక ఎలా అర్థం
చేయిస్తారు? అక్కడైతే జ్ఞానము యొక్క అవసరమే ఉండదు. తండ్రి ఇప్పుడు సంగమములోనే
జ్ఞానాన్ని ఇస్తారు. వారు నాలెడ్జ్ ఫుల్ కదా. తప్పకుండా జ్ఞానాన్ని వినిపించేందుకు
అంతిమములో రావలసి ఉంటుంది. ఆదిలో మీకు ఏమి వినిపిస్తారు! ఇవి అర్థం చేసుకోవలసిన
విషయాలు. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది పాండవ గవర్నమెంట్
యొక్క యూనివర్సిటీ. ఇప్పుడిది సంగమము. యాదవులు, కౌరవులు మరియు పాండవుల సైన్యాలను
చూపించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, యాదవులు మరియు కౌరవులు వినాశన సమయములో
విపరీత బుద్ధి కలిగి ఉంటారు. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. తండ్రిపై ప్రీతి లేదు.
కుక్క-పిల్లి అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. ఇకపోతే పాండవులకు
ప్రీతిబుద్ధి ఉండేది. పాండవులకు స్వయముగా పరమాత్మయే సహచరుడిగా ఉండేవారు. పాండవులు
అనగా ఆత్మిక పండాలు. వారు దైహిక పండాలు, మీరు ఆత్మిక పండాలు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.