04-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎవరైతే ప్రారంభము నుండి భక్తి చేసారో, 84 జన్మలు తీసుకున్నారో, వారు మీ జ్ఞానాన్ని చాలా అభిరుచితో వింటారు, సూచనలతోనే అర్థం చేసేసుకుంటారు’’

ప్రశ్న:-
దేవీ-దేవతా వంశానికి సమీపమైన ఆత్మలా లేక దూరముగా ఉండే ఆత్మలా అన్న విషయాన్ని ఎలా గుర్తించగలుగుతారు?

జవాబు:-
మీ దేవతా వంశానికి చెందిన ఆత్మలెవరైతే ఉంటారో, వారికి జ్ఞానములోని అన్ని విషయాలు విన్న వెంటనే హత్తుకుంటాయి, వారు తికమకపడరు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో, అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. కావున పిల్లలు నాడిని చూసి సేవ చేయాలి.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అర్థం చేసుకున్నారు - ఆత్మిక తండ్రి నిరాకారుడు, వారు కూర్చుని ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు, ఆత్మ అయిన మేము కూడా నిరాకారియే, ఈ శరీరము ద్వారా వింటున్నాము. కనుక ఇప్పుడు ఇద్దరు తండ్రులు కలిసి ఉన్నారు కదా. ఇద్దరు తండ్రులు ఇక్కడే ఉన్నారని పిల్లలకు తెలుసు. మూడవ తండ్రి గురించి తెలుసు, కానీ వారికంటే ఈ తండ్రి బాగున్నారు, ఈ తండ్రి కంటే ఆ తండ్రి బాగున్నారు, నంబరువారుగా ఉన్నారు కదా. అందుకే ఆ లౌకిక తండ్రి నుండి సంబంధము తొలగి, ఈ ఇద్దరు తండ్రులతో సంబంధము జోడించబడుతుంది. మనుష్యులకు ఎలా అర్థం చేయించాలి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మేళాలు, ప్రదర్శనీలలో మీ వద్దకు ఎంతోమంది వస్తారు. 84 జన్మలను అందరూ ఏమీ తీసుకోరు అని కూడా మీకు తెలుసు. ఫలానావారు 84 జన్మలు తీసుకునేవారా లేక 10 జన్మలు తీసుకునేవారా లేక 20 జన్మలు తీసుకునేవారా అన్నది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - ఎవరైతే ప్రారంభము నుండి మొదలుకుని ఎంతో భక్తి చేసారో, వారికి దాని ఫలము కూడా అంతే త్వరగా మరియు మంచిగా లభిస్తుంది. తక్కువ భక్తి చేసి ఉంటే మరియు అది ఆలస్యముగా చేసి ఉంటే, వారికి దాని ఫలము కూడా అంత తక్కువగానే మరియు ఆలస్యముగా లభిస్తుంది. బాబా ఈ విషయాలను సేవ చేసే పిల్లల కోసం అర్థం చేయిస్తున్నారు. మీరు ఇలా చెప్పండి - మీరు భారతవాసులు కావున మరి చెప్పండి, మీరు దేవీ-దేవతలను నమ్ముతారా? భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కదా. ఎవరైతే 84 జన్మలు తీసుకునేవారు ఉంటారో, ప్రారంభము నుండి భక్తి చేసి ఉంటారో, వారు - ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము తప్పకుండా ఉండేది అని వెంటనే అర్థం చేసుకుంటారు, ఎంతో అభిరుచితో వినడం మొదలుపెడతారు. కొందరైతే ఊరికే అలా చూసి వెళ్ళిపోతారు, ఏమీ అడగరు కూడా, వారి బుద్ధిలో ఏమీ కూర్చోనట్లే ఉంటుంది. అలాంటివారి గురించి ఏమనుకోవాలంటే - వీరు ప్రస్తుతానికి ఇక్కడికి చెందినవారు కాదు. వారు మున్ముందు అర్థం చేసుకోవచ్చు. కొందరు ఎలా ఉంటారంటే, ఎవరైనా అర్థం చేయించిన వెంటనే తల ఊపుతారు, తప్పకుండా ఈ లెక్కన 84 జన్మలు ఉంటాయి అన్నది సరైనదే అని భావిస్తారు. మేము మొత్తము 84 జన్మలు తీసుకున్నాము అని ఎలా అర్థం చేసుకోవాలి? అని అడిగితే ఇలా చెప్పండి - అచ్ఛా, 84 కాకపోతే 82 జన్మలు తీసుకుని ఉంటారు, దేవతా ధర్మములోకైతే వచ్చే ఉంటారు. అయితే చూడండి, అంతగా బుద్ధిలో కూర్చోవటం లేదు అంటే, వీరు 84 జన్మలు తీసుకునేవారు కాదు అని అర్థం చేసుకోండి. దూరము వారైతే తక్కువ అర్థం చేసుకుంటారు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటే వారు అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు, వెంటనే అర్థం చేసుకుంటారు. తక్కువగా అర్థం చేసుకుంటే వారు ఆలస్యముగా వచ్చేవారు అని అర్థం చేసుకోండి, వారు భక్తి కూడా ఆలస్యముగా చేసి ఉంటారు. చాలా భక్తి చేసినవారు కేవలం సూచనలతోనే అర్థం చేసేసుకుంటారు. డ్రామా అయితే రిపీట్ అవుతుంది కదా. మొత్తము అంతా భక్తిపై ఆధారపడి ఉంది. వీరు (బాబా) అందరికంటే నంబర్ వన్ భక్తి చేసారు కదా. తక్కువ భక్తి చేసి ఉంటే ఫలము కూడా తక్కువగా లభిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. మందబుద్ధి కలవారు వీటిని ధారణ చేయలేరు. ఈ మేళాలు, ప్రదర్శనీలైతే జరుగుతూనే ఉంటాయి. ఇవి అన్ని భాషలలోనూ వెలువడుతాయి. మొత్తము ప్రపంచమంతటికీ అర్థం చేయించాలి కదా. మీరు సత్యాతి-సత్యమైన సందేశకులు మరియు దూతలు. ఆ ధర్మ స్థాపకులైతే ఏమీ చేయరు. అలాగే వారు గురువులు కూడా కాదు. వారిని గురువు అని అంటారు కానీ వారు ఏమీ సద్గతిదాత కాదు కదా. వారు వచ్చినప్పుడు వారి సంస్థయే లేదు కదా, మరి వారు ఎవరి సద్గతిని చేస్తారు. గురువు అనగా సద్గతినిచ్చేవారు, దుఃఖ ప్రపంచము నుండి శాంతిధామానికి తీసుకువెళ్ళాలి. క్రైస్టు మొదలైనవారు గురువులు కారు, వారు కేవలం ధర్మ స్థాపకులు మాత్రమే. వారికి వేరే ఏ పొజిషిన్ లేదు. ఎవరైతే మొట్టమొదట సతోప్రధానములోకి వచ్చి, ఆ తర్వాత సతో, రజో, తమోలోకి వస్తారో, వారికే పొజిషన్ ఉంది. ధర్మ స్థాపకులైతే కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేసి ఇక పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అందరి అవస్థ తమోప్రధాన అవస్థగా తయారవుతుందో, అప్పుడు తండ్రి వచ్చి అందరినీ పవిత్రముగా తయారుచేసి తీసుకువెళ్తారు. పావనముగా అయిన తర్వాత ఇక ఈ పతిత ప్రపంచములో ఉండలేరు. పవిత్ర ఆత్మలు ముక్తిలోకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. వారు ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు కూడా, కానీ దాని అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. అర్థం తెలుసుకున్నట్లయితే ఇక వారిని తెలుసుకుంటారు. సత్యయుగములో భక్తి మార్గపు పదాలు కూడా సమాప్తమైపోతాయి.

అందరూ తమ-తమ పాత్రలను అభినయిస్తూ ఉంటారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. సద్గతిని ఒక్కరు కూడా పొందలేరు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము లభిస్తూ ఉంది. తండ్రి కూడా అంటారు, నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. దీనినే కళ్యాణకారి సంగమయుగము అని అంటారు, ఇంకే యుగమూ కళ్యాణకారి యుగము కాదు. సత్య, త్రేతాయుగాలకు మధ్యన ఉన్న సంగమానికి మహత్వమేమీ లేదు. సూర్యవంశీయులు గతించి, చంద్రవంశీయుల రాజ్యము నడుస్తుంది. మళ్ళీ చంద్రవంశీయుల నుండి వైశ్య వంశీయులుగా అయిన తర్వాత ఇక చంద్రవంశీయులు గతించిపోతారు. ఆ తర్వాత వారు ఏమయ్యారు అనేది ఎవరికీ తెలియనే తెలియదు. చిత్రాలు మొదలైనవి ఉండడము ద్వారా - ఈ సూర్యవంశీయులు మా పూర్వీకులు, అలాగే ఈ చంద్రవంశీయులు కూడా ఉండేవారు, వారు మహారాజులు, వీరు రాజులు, వారు చాలా ధనవంతులుగా ఉండేవారు అని భావిస్తారు. ఎంతైనా చంద్రవంశీయులు పాస్ అవ్వలేదు కదా. ఈ విషయాలు శాస్త్రాలు మొదలైనవాటిలో ఏమీ లేవు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మమ్మల్ని విముక్తులుగా చేయండి, పతితుల నుండి పావనులుగా చేయండి అని అందరూ అంటారు. ఈ మాటను సుఖము కొరకు అనరు ఎందుకంటే శాస్త్రాలలో సుఖాన్ని నిందించారు. కానీ మానసిక శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అడుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - మీకు సుఖమూ, శాంతి రెండూ లభిస్తాయి. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖము ఉంటుంది, ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ దుఃఖము ఉంటుంది. సత్యయుగములో సుఖము, శాంతి ఉన్నాయి, ఇక్కడ దుఃఖము, అశాంతి ఉన్నాయి. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మిమ్మల్ని మాయా రావణుడు ఎంత తుచ్ఛబుద్ధి కలవారిగా తయారుచేసాడు, ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. తండ్రి అంటారు, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర కూడా ఇప్పుడే ఉంది, దానిని అభినయిస్తున్నాను. బాబా, కల్ప-కల్పమూ మీరే వచ్చి భ్రష్టాచారులైన పతితుల నుండి శ్రేష్ఠాచారులైన పావనులుగా తయారుచేస్తారు అని అంటారు కూడా. రావణుడి ద్వారా భ్రష్టాచారులుగా తయారయ్యారు. ఇప్పుడు తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఈ గాయనము ఏదైతే ఉందో, దీని అర్థాన్ని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. సిక్కుల యొక్క ఆ అకాల సింహాసనముపై కూర్చునేవారికి కూడా దాని అర్థము తెలియదు. బాబా మనకు ఏమని అర్థం చేయించారంటే - ఆత్మలే అకాలమూర్తులు. ఆత్మకు ఈ శరీరము ఒక రథము, దీనిపైన ‘అకాల్’ అనగా మృత్యువు లేని ఆత్మ విరాజమానమై ఉంది. సత్యయుగములో మిమ్మల్ని కాలుడు కబళించడు. అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు. అది ఉన్నదే అమరలోకము, ఇది మృత్యులోకము. అమరలోకము మరియు మృత్యులోకము యొక్క అర్థం కూడా ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, నేను మీకు చాలా సింపుల్ గా అర్థం చేయిస్తాను - కేవలం నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. పతిత-పావనా... అని సాధు-సన్యాసులు మొదలైనవారు కూడా పాడుతారు, పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తారు, ఎక్కడికి వెళ్ళినా పతిత-పావనా... అని తప్పకుండా అంటారు. సత్యము ఎప్పుడూ దాగి ఉండదు. ఇప్పుడు పతిత-పావనుడైన తండ్రి వచ్చి ఉన్నారని, మనకు దారిని తెలియజేస్తున్నారని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానముగా అయిపోతారు అని కల్పపూర్వము కూడా చెప్పారు. మీరందరూ ప్రియుడినైన నాకు ప్రేయసులు. ఆ ప్రేయసీ, ప్రియులు ఒక్క జన్మ కొరకు మాత్రమే అలా ఉంటారు, మీరు జన్మ-జన్మాంతరాల ప్రేయసులు. ఓ ప్రభూ అని తలచుకుంటూ వచ్చారు. ఇచ్చేవారైతే ఆ ఒక్క తండ్రే కదా. పిల్లలందరూ తండ్రి నుండే కోరుకుంటారు. ఆత్మ దుఃఖము పొందినప్పుడు తండ్రిని తలచుకుంటుంది. సుఖములో ఎవరూ తలచుకోరు, దుఃఖములో ఉన్నప్పుడు - బాబా, మీరు వచ్చి మాకు సద్గతినివ్వండి అని తలచుకుంటారు. గురువుల వద్దకు వెళ్ళి - మాకు బిడ్డను ప్రసాదించండి అని అడుగుతారు. అచ్ఛా, బిడ్డ పుడితే చాలా సంతోషము కలుగుతుంది, ఒకవేళ సంతానము కలగకపోతే ఇక ఈశ్వరుడి వ్రాత అని అంటారు. డ్రామా గురించి వారు అర్థమే చేసుకోరు. దీనిని వారు డ్రామా అని అన్నట్లయితే, మరి మొత్తము తెలిసి ఉండాలి. మీకు డ్రామా గురించి తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. దీని గురించి ఏ శాస్త్రాలలోనూ లేదు. డ్రామా అంటే డ్రామాయే. దాని ఆదిమధ్యాంతాల గురించి తెలిసి ఉండాలి. తండ్రి అంటారు, నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. ఈ నాలుగు యుగాలు సరిగ్గా సమానముగా ఉంటాయి. స్వస్తిక్ కు కూడా మహత్వము ఉంది కదా. ఖాతా పుస్తకాలు వ్రాసినప్పుడు దానిలో స్వస్తిక్ గీస్తారు. ఇది కూడా ఖాతాయే కదా. మనకు లాభము ఎలా కలుగుతుంది, మళ్ళీ నష్టము ఎలా కలుగుతుంది. నష్టము కలుగుతూ, కలుగుతూ ఇప్పుడు పూర్తిగా నష్టపోయారు. ఇది గెలుపు-ఓటముల ఆట. ధనము ఉంది మరియు ఆరోగ్యము ఉంది అంటే, సుఖము ఉంటుంది. ధనము ఉండి ఆరోగ్యము లేకపోతే సుఖము ఉండదు. మీకు ఆరోగ్యము మరియు ధనము, రెండింటినీ ఇస్తాను, కావున సంతోషము దానంతటదే ఉంటుంది.

ఎప్పుడైనా ఎవరైనా శరీరము వదిలితే ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ లోలోపల దుఃఖపడుతూ ఉంటారు. స్వర్గానికి వెళ్తే ఇంకా ఎక్కువ సంతోషించాలి కదా, మరి వారి ఆత్మను నరకములోకి ఎందుకు పిలుస్తారు? ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు. బీజము మరియు వృక్షము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇటువంటి వృక్షాన్ని ఇంకెవ్వరూ తయారుచేయలేరు. ఈ చిత్రాన్ని ఈ బ్రహ్మా తయారుచేయలేదు. ఇతనికి గురువు ఎవరూ లేరు. ఒకవేళ గురువు ఉంటే, ఆ గురువుకు ఇంకా ఎందరో శిష్యులు ఉండేవారు కదా. ఇతనికి ఎవరో గురువు నేర్పించారని లేక పరమాత్మ శక్తి ప్రవేశిస్తుందని మనుష్యులు భావిస్తారు. అరే, పరమాత్మ శక్తి ఎలా ప్రవేశిస్తుంది! పాపము వారికి ఏ మాత్రమూ తెలియదు. తండ్రి స్వయంగా కూర్చుని చెప్తున్నారు - నేను ఒక సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను, వచ్చి మిమ్మల్ని చదివిస్తాను అని నేను మీతో చెప్పాను కదా. ఇతను కూడా వింటూ ఉంటారు. అటెన్షన్ అయితే నాపై ఉంది. ఇతను కూడా విద్యార్థియే. ఇతను తన గురించి తాను ఏమీ చెప్పుకోరు. వీరు ప్రజాపిత, వీరే విద్యార్థి కూడా. వీరు వినాశనాన్ని చూసారు కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటూ ఉంటారో, అలా వీరు కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నారు. తండ్రి మీకు అర్థం చేయిస్తారు, మధ్యలో వీరు కూడా అర్థం చేసుకుంటారు, చదువుకుంటూ ఉంటారు. ప్రతి విద్యార్థీ చదువుకునేందుకు పురుషార్థము చేస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనవాసులు. వారి పాత్ర ఏమిటి, ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని తమంతట తామే అర్థం చేయిస్తారు. మీరు ప్రశ్నలేవీ అడగవలసిన అవసరము లేదు. పైన ఉన్నది శివ పరమాత్మ, ఆ తర్వాత దేవతలు, కావున వారిరువురినీ ఎలా కలపగలరు. తండ్రి వీరిలోకి ప్రవేశిస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, అందుకే బాప్ దాదా అని అంటారు. బాప్ (తండ్రి) వేరు, దాదా వేరు. తండ్రి శివుడు, దాదా ఈ బ్రహ్మా. వారసత్వము శివుడి నుండి లభిస్తుంది, ఇతని ద్వారా లభిస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మా సంతానము. తండ్రి డ్రామా ప్లాన్ అనుసారముగా దత్తత తీసుకున్నారు. తండ్రి అంటారు, నంబర్ వన్ భక్తుడు వీరే. 84 జన్మలు కూడా వీరే తీసుకున్నారు. నల్లనివారు మరియు తెల్లనివారు అని కూడా వీరినే అంటారు. శ్రీకృష్ణుడు సత్యయుగములో తెల్లగా ఉండేవారు, కలియుగములో నల్లగా ఉన్నారు. ఇప్పుడు పతితముగా ఉన్నారు కదా, మళ్ళీ పావనముగా అవుతారు. మీరు కూడా అలాగే తయారవుతారు. ఇది ఇనుపయుగ ప్రపంచము, అది బంగారుయుగ ప్రపంచము. మెట్ల వరుస గురించి ఎవరికీ తెలియదు, ఎవరైతే చివరిలో వస్తారో వారు 84 జన్మలు తీసుకోరు కదా. వారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు, కావున వారిని మెట్ల వరుసలో ఎలా చూపించగలరు. అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు, అలాగే అందరికంటే తక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు అనేది బాబా అర్థం చేయించారు. ఇది జ్ఞానము. తండ్రియే నాలెడ్జ్ ఫుల్, పతిత-పావనుడు. వారు ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారంతా నేతి-నేతి (తెలియదు, తెలియదు) అని అంటూ వచ్చారు. తమ ఆత్మ గురించే తెలియకపోతే ఇక తండ్రి గురించి ఎలా తెలుసుకుంటారు? కేవలం మాట వరసకు అలా అంటారే కానీ, ఆత్మ అంటే ఏమిటి అనేది ఏ మాత్రమూ తెలియదు. ఆత్మ అవినాశీ అని, అందులో 84 జన్మల అవినాశీ పాత్ర నిశ్చితమై ఉందని మీకు ఇప్పుడు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిశ్చితమై ఉంది, ఎవరైతే ఈ విషయాలను బాగా వింటారో మరియు అర్థం చేసుకుంటారో, వారు దగ్గరివారు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. బుద్ధిలో కూర్చోవడం లేదు అంటే వారు ఆలస్యముగా వచ్చేవారై ఉంటారు. వినిపించే సమయములో నాడిని చూడడము జరుగుతుంది. అర్థం చేయించేవారు కూడా నంబరువారుగా ఉన్నారు కదా. ఇది మీ చదువు, రాజధాని స్థాపన అవుతోంది. కొందరు ఉన్నతోన్నతమైన రాజ్య పదవిని పొందుతారు, కొందరు ప్రజలలో నౌకరులుగా అవుతారు. అయితే ఒకటి, సత్యయుగములో దుఃఖము అంటూ ఏమీ ఉండదు. దాని పేరే సుఖధామము, స్వర్గము. గతించిపోయింది కావుననే దానిని గుర్తు చేసుకుంటారు కదా. స్వర్గము అంటే పైన ఆకాశములో ఉంటుందని మనుష్యులు భావిస్తారు. దిల్వాడా మందిరములో మీ పూర్తి స్మృతిచిహ్నము నిలబడి ఉంది. ఆదిదేవ్, ఆదిదేవి మరియు పిల్లలు కింద యోగములో కూర్చున్నారు, పైన రాజ్యము ఉంది. మనుష్యులు దర్శనము చేసుకుని, డబ్బులు వేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. మీరు అన్నిటికంటే ముందుగా తండ్రి యొక్క చరిత్రను గురించి తెలుసుకున్నారు, ఇక ఇంకేమి కావాలి. తండ్రిని తెలుసుకోవడము ద్వారానే అంతా అర్థమవుతుంది. కావున సంతోషము ఉండాలి. ఇప్పుడు మేము సత్యయుగములోకి వెళ్ళి బంగారు మహళ్ళను తయారుచేస్తాము, రాజ్యము చేస్తాము అని మీకు తెలుసు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి ఇస్తున్నారని సేవా యోగ్యులైన పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఆత్మల తండ్రిని ఆత్మిక తండ్రి అని అంటారు. వారే సద్గతిదాత. వారే సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. మీరు ఇలా అర్థం చేయించవచ్చు - ఇది 84 జన్మలు తీసుకునే భారతవాసుల యొక్క మెట్ల వరుస చిత్రము, మీ ధర్మము వారు వచ్చేదే మధ్యలో కదా, మరి 84 జన్మలు ఎలా తీసుకుంటారు? అందరికంటే ఎక్కువ జన్మలు మనము తీసుకుంటాము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. పతితము నుండి పావనముగా అయ్యేందుకు బుద్ధియోగాన్ని జోడించాలి అన్నదే ముఖ్యమైన విషయము. పావనముగా అవుతామని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ఒకవేళ పతితముగా అయితే ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. 5 అంతస్థుల నుండి కింద పడినట్లు అవుతుంది. బుద్ధి పూర్తిగా మలినమైపోతుంది, మనసు లోలోపల తింటూ ఉంటుంది, నోటి నుండి ఇక ఏమీ రాదు. అందుకే తండ్రి అంటారు, జాగ్రత్తగా ఉండండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ డ్రామాను యథార్థముగా అర్థం చేసుకుని మాయ బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ పావనముగా అవ్వాలి.

2. సత్యాతి, సత్యమైన సందేశకులుగా మరియు దూతలుగా అయి అందరికీ శాంతిధామము మరియు సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేయాలి. ఈ కళ్యాణకారి సంగమయుగములో సర్వాత్మల కళ్యాణము చేయాలి.

వరదానము:-
తండ్రి మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసే సర్వ ఆకర్షణముక్త భవ

ఏ విధంగా సేవకులకు సదా తమ సేవ మరియు యజమాని గుర్తుంటారో అలా విశ్వ సేవకులు, సత్యమైన సేవాధారులైన పిల్లలకు కూడా తండ్రి మరియు సేవ తప్ప ఇంకేమీ గుర్తుండదు, దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవం కలుగుతుంది. వారికి ఒక్క తండ్రి యొక్క రసము తప్ప మిగిలిన రసాలన్నీ సారము లేనట్లుగా అనిపిస్తాయి. ఒక్క తండ్రి రసము యొక్క అనుభవము ఉన్న కారణముగా వారి ఆకర్షణ ఇంకెటువైపుకూ వెళ్ళలేదు, ఈ ఏకరస స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేస్తుంది. ఇదే శ్రేష్ఠమైన గమ్యము.

స్లోగన్:-
నాజూకు పరిస్థితుల యొక్క పరీక్షలలో పాస్ అవ్వాలంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా చేసుకోండి.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

ఎప్పుడైనా ఏదైనా అసత్య విషయాన్ని చూసినప్పుడు లేక విన్నప్పుడు అసత్య వాయుమండలాన్ని వ్యాపింపజేయకండి. ఇది పాప కర్మ కదా, పాప కర్మను చూడలేము అని చాలా మంది అంటారు కానీ వాయుమండలములో అసత్యత యొక్క విషయాలను వ్యాపిపంపజేయటము, ఇది కూడా పాపమే కదా. లౌకిక పరివారములో కూడా ఒకవేళ ఎవరైనా అటువంటి విషయాలను చూసినా లేక విన్నా వాటిని వ్యాపింపజేయరు. చెవితో వింటారు మరియు మనసులో పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా వ్యర్థ విషాయలను వ్యాపింపజేస్తే ఆ చిన్న-చిన్న పాపాలు ఎగిరే కళ యొక్క అనుభవాన్ని సమాప్తము చేసేస్తాయి, అందుకే ఈ కర్మల లోతైన గతిని అర్థం చేసుకుని యథార్థ రూపములో సత్యతా శక్తిని ధారణ చెయ్యండి.