04-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు ఈ ఛీ-ఛీ అశుద్ధమైన ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, అందుకే శరీర సహితముగా దేనినైతే మీరు నాది-నాది అని అంటారో - దానిని మర్చిపోవాలి, దానిపై మీ మనసు పెట్టుకోకూడదు’’

ప్రశ్న:-
తండ్రి మీకు ఈ దుఃఖధామము పట్ల అయిష్టాన్ని ఎందుకు కలిగిస్తారు?

జవాబు:-
ఎందుకంటే మీరు శాంతిధామములోకి, సుఖధామములోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన ప్రపంచములో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరము నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు, కావున ఈ శరీరాన్ని ఇక చూసేదేముంది. ఎవరి నామ-రూపాల వైపుకు కూడా బుద్ధి వెళ్ళకూడదు. అశుద్ధమైన ఆలోచనలు వచ్చినా సరే పదవి భ్రష్టమైపోతుంది.

ఓంశాంతి
శివబాబా తమ పిల్లలతో, ఆత్మలతో మాట్లాడుతారు. ఆత్మయే వింటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకొని, అందరినీ తీసుకువెళ్ళేందుకు అనంతమైన తండ్రి వచ్చారు అని అర్థం చేయించాలి. వారు దుఃఖపు బంధనాల నుండి విడిపించి సుఖపు సంబంధాలలోకి తీసుకువెళ్తారు. సంబంధము అని సుఖాన్ని, బంధనము అని దుఃఖాన్ని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి నామ-రూపాలు మొదలైనవాటిపై కూడా మనసు పెట్టుకోకూడదు. తమ ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు, అందుకే ఇక్కడ ఎవరి పైనా మనసు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఇక్కడి ఛీ-ఛీ బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రంగా అయ్యాము కావున మా శరీరముపై ఎవ్వరూ కూడా అశుద్ధమైన ఆలోచనలతో చేయి వేయకూడదు అని మీరు భావిస్తారు. ఆ అశుద్ధమైన ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికైతే వెళ్ళలేరు. ఒకవేళ బాగుపడకపోతే మరి శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆత్మలందరూ పాడైపోయి ఉన్నారు. శరీరముతో అశుద్ధమైన పనులు చేస్తున్నారు. ఛీ-ఛీ దేహధారులపై మనసు పెట్టుకుని ఉన్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు - ఈ అశుద్ధమైన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టండి. ఆత్మ శరీరము నుండి వేరై ఇంటికి వెళ్ళాలి. ఇదైతే చాలా అశుద్ధమైన ఛీ-ఛీ ప్రపంచము, ఇందులో ఇప్పుడిక మనం ఉండకూడదు. ఎవరినైనా చూడాలని కూడా మనసుకు అనిపించదు. ఇప్పుడైతే తండ్రి స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. తండ్రి అంటారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. ఏ దేహధారి పట్ల మనసు పెట్టుకోకండి. పూర్తిగా మమకారము తొలగిపోవాలి. భార్యా-భర్తలకు పరస్పరం ఎంతో ప్రేమ ఉంటుంది, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇప్పుడైతే మీరు పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించాలి, అశుద్ధమైన ఆలోచనలు ఉండకూడదు. తండ్రి అర్థం చేయిస్తారు - ఇప్పుడు ఇది వేశ్యాలయము. వికారాల కారణంగానే మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. తండ్రి వాటిపై ఎంతో అయిష్టాన్ని కలిగిస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళడం కోసం స్టీమర్ లో కూర్చున్నారు. ఇప్పుడు మనం తండ్రి వద్దకు వెళ్తున్నాము అని ఆత్మ భావిస్తుంది. మీకు ఈ మొత్తం పాత ప్రపంచమంతటి పైనా వైరాగ్యము ఉంది. ఈ ఛీ-ఛీ ప్రపంచమైన నరకములో, వేశ్యాలయములో మనం ఉండేదే లేదు. కావున విషం కొరకు అశుద్ధమైన ఆలోచనలు రావడం చాలా తప్పు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని పుష్పాల ప్రపంచములోకి, సుఖధామములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. నేను మిమ్మల్ని ఈ వేశ్యాలయము నుండి బయటకు తీసి శివాలయములోకి తీసుకువెళ్తాను, అందుకే ఇప్పుడు బుద్ధియోగము ఆ కొత్త ప్రపంచముతో ఉండాలి. ఎంతటి సంతోషము ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, ఈ అనంతమైన సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. సృష్టిచక్రాన్ని తెలుసుకోవడము ద్వారా అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఒకవేళ దేహధారులతో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. ఏ దేహ సంబంధము గుర్తుకు రాకూడదు. ఇది దుఃఖపు ప్రపంచము, ఇందులో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే ఉన్నారు.

తండ్రి అశుద్ధమైన ప్రపంచము నుండి అందరినీ తీసుకువెళ్తారు, అందుకే ఇప్పుడు బుద్ధియోగాన్ని మీ ఇంటితో జోడించాలి. మనుష్యులు ముక్తిలోకి వెళ్ళేందుకని భక్తి చేస్తారు. ఆత్మలమైన మేము ఇక్కడ ఉండేది లేదు అని మీరు కూడా అంటారు. మనము ఈ ఛీ-ఛీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము, ఇది పాత చెప్పు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఇక ఈ శరీరము వదిలిపోతుంది. అంత్యకాలములో తండ్రి తప్ప ఇంకే ఇతర వస్తువూ గుర్తు ఉండకూడదు. ఈ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టాలి. శరీరము పోతే అంతా పోయినట్లే. దేహ సహితముగా ఏవేవైతే ఉన్నాయో, వేటినైతే మీరు నాది-నాది అని అంటారో, వాటన్నింటినీ మర్చిపోవాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, అందుకే దీనిపై ఇప్పుడు మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు - మధురాతి-మధురమైన పిల్లలూ, నేను మీ కొరకు స్వర్గ స్థాపనను చేస్తున్నాను. అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మీ ముఖము అటువైపు ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చేయాలి. దుఃఖధామము పట్ల అయిష్టం కలుగుతుంది. ఈ శరీరాల పట్ల అయిష్టం కలుగుతుంది. వివాహం చేసుకోవలసిన అవసరం కూడా ఏముంది. వివాహం చేసుకుంటే మళ్ళీ మనసు శరీరముతో జోడించబడుతుంది. తండ్రి అంటారు - ఈ పాత చెప్పుల పట్ల ఏ మాత్రమూ స్నేహము పెట్టుకోకండి. ఇది ఉన్నదే వేశ్యాలయము, అందరూ పతితులే పతితులు ఉన్నారు. ఇది రావణ రాజ్యము. ఇక్కడ ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైనా మనసు పెట్టుకోకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. ఇక ఆ తర్వాత శిక్షలు కూడా చాలా కఠినమైనవి ఉంటాయి, పదవి కూడా భ్రష్టమైపోతుంది. మరి ఎందుకు ఈ కలియుగీ బంధనాలను విడిచిపెట్టకూడదు? తండ్రి అందరి కొరకు ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. రజోప్రధాన సన్యాసులు ఉండేటప్పుడు ప్రపంచము అశుద్ధంగా ఉండేది కాదు, వారు అడవులలో ఉండేవారు, అందరికీ వారి పట్ల ఆకర్షణ కలిగేది. మనుష్యులు అక్కడకు వెళ్ళి వారికి భోజనాన్ని అందించి వచ్చేవారు. వారు నిర్భయులుగా ఉండేవారు. మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి, దీని కోసం చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు, పిల్లలకు సంతోషం కలుగుతుంది. మనము అనంతమైన తండ్రి నుండి సుఖధామము యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. ఇక్కడైతే ఎంతటి దుఃఖము ఉంది. ఎన్నో అశుద్ధమైన వ్యాధులు మొదలైనవి కూడా ఉంటాయి. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు - నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తానంటే, అక్కడ దుఃఖము, వ్యాధులు మొదలైనవాటి పేరు ఉండదు. అర్ధకల్పం కొరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారుచేస్తారు. ఇక్కడ ఎవరి పైనైనా మనసు పెట్టుకున్నట్లయితే ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది.

వారు 3 నిమిషాలు మౌనంగా ఉండమని చెప్తారు, మీరు వారితో ఇలా చెప్పండి - కేవలం అలా మౌనంగా ఉండడం వలన ఏమవుతుంది, వాస్తవానికి అప్పుడు తండ్రిని స్మృతి చేయాలి, తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. సైలెన్స్ యొక్క వరాన్ని ఇచ్చేవారు తండ్రి. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? వారిని స్మృతి చేస్తేనే వారసత్వము లభిస్తుంది. టీచర్లు కూడా చాలా పాఠాలను చదివించాలి. మీరు లేచి నిలబడాలి, ఎవ్వరూ ఏమీ అనరు. తండ్రికి చెందినవారిగా అయినట్లయితే పొట్టకు కావాల్సినదైతే ఎలాగూ లభిస్తుంది, శరీర నిర్వహణ కోసం ఎంతో లభిస్తుంది. వేదాంతి బిడ్డ ఉన్నారు కదా, ఆమె ఒక పరీక్ష వ్రాశారు, అందులో - గీతా భగవంతుడు ఎవరు? అని ఒక పాయింట్ వచ్చింది. దానికి ఆమె పరమపిత శివ పరమాత్మ అని సమాధానము వ్రాశారు, దానితో ఆమెను ఫెయిల్ చేసారు మరియు ఎవరైతే శ్రీకృష్ణుని పేరును వ్రాశారో వారిని పాస్ చేసారు. ఆ బిడ్డ సత్యము చెప్పారు కానీ వారికది తెలియని కారణంగా ఆమెను ఫెయిల్ చేసారు. ఆ తర్వాత ఆమె - నేనైతే సత్యమే వ్రాసాను, గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మయే, దేహధారి అయిన శ్రీకృష్ణుడు కాజాలరు అని వారితో వాదించవలసి వచ్చింది. కానీ ఆ కుమార్తెకు ఈ ఆత్మిక సేవ చేయాలనే మనసు ఉంది, అందుకే దానిని వదిలేశారు.

ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మన ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి సైలెన్స్ ప్రపంచములోకి వెళ్ళాలని మీకు తెలుసు. స్మృతి చేయడం ద్వారా ఆరోగ్యము-ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. భారత్ లో శాంతి, సంపన్నత ఉండేవి కదా. ఇలాంటి-ఇలాంటి విషయాలను కుమారీలైన మీరు కూర్చొని అర్థం చేయించినట్లయితే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. ఒకవేళ ఎవరైనా ఎదిరించినట్లయితే మీరు చట్టమనుసారముగా పోరాడండి, పెద్ద-పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి. వారేమి చేస్తారు? మీరు ఆకలితో చనిపోతారనేమీ కాదు. అరటిపళ్ళతో, పెరుగుతో కూడా రొట్టెలు తినవచ్చు. మనుష్యులు పొట్ట కోసం ఎన్ని పాపాలు చేస్తారు. తండ్రి వచ్చి అందరినీ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తారు. ఇందులో పాపాలు చేయవలసిన, అబద్ధాలు చెప్పవలసిన అవసరమేమీ లేదు. మీకైతే మూడు వంతులు సుఖము లభిస్తుంది, మిగిలిన ఒక వంతు దుఃఖము అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. వేరే ఉపాయమేమీ లేదు. భక్తి మార్గములోనైతే ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. శివుని పూజనైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అయినా కానీ బయట మందిరాలలోకి తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రి లభించారు. మీరు చిత్రాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. తండ్రి గురించి మీకు తెలుసు. వారు మన అనంతమైన తండ్రి, పిల్లలకు స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు వచ్చిందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ చదవాల్సిన విషయం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా, ఇక మేము వచ్చేస్తున్నాము, అంతే... మీరు ఇంటిని విడిచిపెట్టి ఎంత సమయం గడిచింది? సుఖధామాన్ని వదిలి 63 జన్మల అయ్యాయి. ఇప్పుడు తండ్రి అంటారు - శాంతిధామానికి, సుఖధామానికి పదండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి, వేరే ఏ కష్టమూ లేదు. శివబాబాకు శాస్త్రాలు మొదలైనవేవీ చదవాల్సిన అవసరం లేదు. ఈ బ్రహ్మా అన్నీ చదివి ఉన్నారు. మిమ్మల్ని అయితే ఇప్పుడు శివబాబా చదివిస్తారు. ఈ బ్రహ్మా కూడా చదివించగలరు, కానీ మీరు ఎల్లప్పుడూ శివబాబాయే చదివిస్తున్నారని భావించండి. వారిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మధ్యలో వీరు కూడా ఉన్నారు.

ఇప్పుడు తండ్రి అంటున్నారు - సమయం తక్కువగా ఉంది, ఎక్కువేమీ లేదు. భాగ్యములో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అన్న ఆలోచన చేయకండి. స్కూల్లో చదువుకునే పురుషార్థం చేస్తారు కదా. భాగ్యములో ఏది ఉంటే అది అనైతే అనరు కదా. ఇక్కడ చదువుకోకపోతే అక్కడ జన్మ-జన్మాంతరాలు సేవలు చేస్తూ ఉంటారు. రాజ్యము లభించదు. మహా అయితే చివరిలో కిరీటం పెడతారు, అది కూడా త్రేతాలో. ముఖ్యమైన విషయము - పవిత్రంగా అయి ఇతరులను అలా తయారుచేయడము. సత్యనారాయణుని సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సహజమైనది. ఇద్దరు తండ్రులు ఉన్నారు, హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ దేవతల్లా అవుతారు. కానీ మళ్ళీ అందులో కూడా ఉన్నత పదవిని పొందాలి. పదవి పొందడం కోసం ఎన్ని గొడవలు చేస్తారు. చివరిలో బాంబుల విషయములో కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పూర్వము ఇన్ని ధర్మాలేమైనా ఉండేవా. అవి ఇకపై ఉండవు కూడా. మీరు రాజ్యం చేయబోతున్నారు కావున మీపై మీరు దయ చూపించుకోండి కదా - తక్కువలో తక్కువ ఉన్నత పదవినైతే పొందాలి. కుమార్తెలు, మాది ఒక ఇటుకను పెట్టండి అని 8 అణాలు కూడా ఇస్తారు. సుదాముని ఉదాహరణను విన్నారు కదా. పిడికెడు బియ్యానికి బదులుగా మహళ్ళు లభించాయి. పేదవారి వద్ద ఉన్నవే 8 అణాలు కావున అవే ఇస్తారు కదా. బాబా, మేము పేదవారము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. ఇక్కడ అందరిదీ అసత్యమైన సంపాదన. దాన-పుణ్యాలు మొదలైనవేవైతే చేస్తారో, అవి పాపాత్ములకే చేస్తారు. కావున పుణ్యానికి బదులుగా పాపం జరుగుతుంది. ఆ డబ్బును ఇచ్చేవారికే ఆ పాపం అంటుకుంటుంది. ఆ విధంగా చేస్తూ అందరూ పాపాత్ములుగా అయిపోతారు. పుణ్యాత్ములు సత్యయుగములోనే ఉంటారు. అది పుణ్యాత్ముల ప్రపంచము. దానిని తండ్రియే తయారుచేస్తారు. పాపాత్ములుగా రావణుడు తయారుచేస్తాడు, అశుద్ధముగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు - అశుద్ధమైన కర్మలను చేయకండి. కొత్త ప్రపంచములో అశుద్ధత ఉండనే ఉండదు. దాని పేరే స్వర్గము, ఇంకేమిటి, స్వర్గము అని అనడంతోనే నోటిలో నీరు ఊరుతుంది. దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు, అందుకే వారి స్మృతిచిహ్నాలు ఉన్నాయి. ఆత్మ అవినాశీ. ఎంతమంది పాత్రధారులు ఉన్నారు. ఎక్కడో ఒక చోట కూర్చొని ఉంటారు, అక్కడి నుండి పాత్రను అభినయించడానికి వస్తారు. ఇప్పుడు కలియుగములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు. దేవీ-దేవతల రాజ్యము ఇక్కడ లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. ఇప్పుడు మళ్ళీ ఏక ధర్మము యొక్క స్థాపన జరుగుతోంది, మిగిలినవన్నీ అంతమైపోతాయి. మీరు స్వర్గములో ఉండేటప్పుడు ఇంకే ఇతర ధర్మమూ లేదు. చిత్రములో రామునికి బాణాలను చూపించారు. అక్కడ బాణాలు మొదలైనవాటి విషయమేమీ ఉండదు. కల్ప పూర్వము ఎవరు ఏ సేవనైతే చేసారో, ఇప్పుడు కూడా అదే చేస్తారు అని కూడా అర్థం చేసుకుంటారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో, వారు తండ్రికి కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. లౌకిక తండ్రి యొక్క పిల్లల్లో కూడా ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో, వారిపై తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎవరైతే కొట్లాడుకుంటూ, తింటూ ఉంటారో వారిని ఏమైనా ప్రేమిస్తారా, సేవ చేసేవారు ఎంతో ప్రియమనిపిస్తారు.

ఒక కథ ఉంది - రెండు పిల్లులు కొట్లాడుకున్నాయి, వెన్నను కృష్ణుడు తినేసాడు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారం రూపీ వెన్న మీకు లభిస్తుంది. కావున ఇప్పుడు ఇక నిర్లక్ష్యం చేయకూడదు, ఛీ-ఛీగా అవ్వకూడదు. దీని వెనుక రాజ్యాన్ని పోగొట్టుకోకండి. తండ్రి యొక్క డైరెక్షన్లు లభిస్తాయి, స్మృతి చేయకపోతే పాప భారము పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. వెక్కి-వెక్కి ఏడుస్తారు. 21 జన్మల రాజ్యాధికారము లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే ఎంతగానో ఏడుస్తారు. తండ్రి అంటారు - అత్తవారింటిని గాని, పుట్టింటిని గాని గుర్తు చేయకూడదు. భవిష్య కొత్త ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవ్వరినీ చూసి ఆకర్షితమవ్వకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. దేవతలు పుష్పాలు వలె ఉండేవారు, కలియుగములో ముళ్ళలా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమములో పుష్పాలుగా అవుతున్నారు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ ఆ విధంగా తయారైనప్పుడే సత్యయుగములోకి వెళ్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంత్యకాలములో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు, దాని కోసం ఈ ప్రపంచములో ఎవ్వరిపైనా మనసు పెట్టుకోకూడదు. ఛీ-ఛీ శరీరాలను ప్రేమించకూడదు. కలియుగీ బంధనాలను తెంచివేయాలి.

2. విశాలబుద్ధి కలవారిగా అయి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇప్పుడిక ఎటువంటి పాపాలూ చేయకూడదు. పొట్ట కోసం అబద్ధాలు చెప్పకూడదు. పిడికెడు బియ్యాన్ని సఫలం చేసుకొని సత్యాతి-సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి, మీపై మీరు దయ చూపించుకోవాలి.

వరదానము:-

పరమాత్ముని పట్ల ప్రేమతో స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వీమూర్త భవ

ఒక్క పరమాత్ముని ప్రేమలో ఉండడమే తపస్య. ఈ తపస్యా బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కాలము కొరకు నిర్విఘ్నంగా చెయ్యగలదు. నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా తయారుచెయ్యడమే మీ సత్యమైన సేవ, అది అనేక రకాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులుగా చేస్తుంది. అటువంటి సేవాధారీ పిల్లలు తపస్య యొక్క ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకొని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులు అవుతారు.

స్లోగన్:-

చెల్లాచెదురైపోయిన స్నేహాన్ని పోగు చేసి ఒక్క తండ్రి పట్ల స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు.