04-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బంధనముక్తులుగా అయి సేవలో తత్పరులై ఉండండి, ఎందుకంటే ఈ సేవలో చాలా ఉన్నతమైన సంపాదన ఉంది, 21 జన్మల కొరకు మీరు వైకుంఠానికి యజమానులుగా అవుతారు’’

ప్రశ్న:-
పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ అలవాటు చేసుకోవాలి?

జవాబు:-
మురళి పాయింట్లపై అర్థం చేయించే అలవాటు చేసుకోవాలి. బ్రాహ్మణి (టీచర్) ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినట్లయితే పరస్పరం కలుసుకుని క్లాస్ చేసుకోవాలి. ఒకవేళ మురళి వినిపించడము నేర్చుకోకపోతే తమ సమానముగా ఎలా తయారుచేస్తారు. బ్రాహ్మణి లేకపోతే తికమకపడకూడదు. ఈ చదువైతే సహజమైనదే. క్లాస్ చేస్తూ ఉండండి, ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి.

పాట:-
ముఖాన్ని చూసుకో ఓ ప్రాణీ...

ఓంశాంతి
పిల్లలు ఇక్కడ వినేటప్పుడు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని కూర్చోవాలి, అలాగే తండ్రి అయిన పరమాత్మ మనకు వినిపిస్తున్నారు అని కూడా నిశ్చయము చేసుకోవాలి. ఈ డైరెక్షన్ ను అనగా ఈ మతమును ఒక్క తండ్రియే ఇస్తారు. దీనినే శ్రీమతము అని అంటారు. శ్రీ అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన. వారు అనంతుడైన తండ్రి, వారినే ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారు. చాలామంది మనుష్యులు అంతటి ప్రేమతో పరమాత్మను తమ తండ్రిగా భావించరు కూడా. శివుని భక్తి చేస్తారు, ఎంతో ప్రేమతో తలచుకుంటారు, కానీ మనుష్యులు అందరిలోనూ పరమాత్మ ఉన్నారని అనే అనేసారు కావున వారు ఆ ప్రేమను ఎవరి పట్ల పెట్టుకోవాలి, అందుకే తండ్రి పట్ల విపరీత బుద్ధి (ప్రీతి లేని బుద్ధి) కలవారిగా అయిపోయారు. భక్తిలో ఏదైనా దుఃఖము లేక రోగము కలిగినప్పుడు ప్రీతిని చూపిస్తారు. భగవంతుడా, రక్షించండి అని అంటారు. గీత అనేది శ్రీమతమని, అది భగవంతుని నోటి నుండి గానం చేయబడిందని పిల్లలకు తెలుసు. భగవంతుడు స్వయంగా రాజయోగాన్ని నేర్పించి శ్రీమతమునిచ్చిన శాస్త్రము మరొకటేదీ లేదు. భారత్ యొక్క గీత మాత్రమే ఈ విధముగా ఉంది, దీని ప్రభావము కూడా ఎంతో ఉంది. ఒక్క గీత మాత్రమే భగవంతుని ద్వారా గానం చేయబడినది. భగవంతుడు అని అన్నప్పుడు ఒక్క నిరాకారుని వైపుకే దృష్టి వెళ్తుంది. వేలుతో పైకి చూపించడము జరుగుతుంది. శ్రీకృష్ణుని విషయములో ఎప్పుడూ ఈ విధముగా అనరు, ఎందుకంటే వారు ఒక దేహధారి కదా. ఇప్పుడు మీకు వారితో ఉన్న సంబంధము గురించి తెలిసింది, అందుకే తండ్రిని స్మృతి చేయండి, వారిపై ప్రీతిని ఉంచండి అని చెప్పడం జరుగుతుంది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇప్పుడు ఆ భగవంతుడు పిల్లలను చదివిస్తున్నారు. కావున ఆ నషా ఎంతగానో ఎక్కాలి. ఆ నషా కూడా స్థిరముగా ఎక్కి ఉండాలి. బ్రాహ్మణి ఎదురుగా ఉంటే నషా ఎక్కడము, బ్రాహ్మణి లేకపోతే నషా దూరమైపోవడము కాదు. బ్రాహ్మణి లేకపోతే మేము క్లాస్ చేయలేము అని భావించకూడదు. బాబా అర్థం చేయిస్తున్నారు - కొన్ని కొన్ని సెంటర్లలో 5-6 నెలలు కోసం బ్రాహ్మణి వెళ్ళిపోయినా పరస్పరము వారు సెంటరును సంభాళిస్తారు, ఎందుకంటే ఈ చదువు అయితే సహజమైనది. కొందరు అయితే బ్రాహ్మణి లేకపోతే అంధులలా, కుంటివారిలా అయిపోతారు. బ్రాహ్మణి వెళ్ళిపోతే సెంటరుకు వెళ్ళడం మానేస్తారు, అరే, ఎంతోమంది కూర్చుని ఉన్నారు, మీరు క్లాస్ నడిపించలేరా. గురువు బయటికి వెళ్ళిపోతే వారి వెనుక శిష్యులు సంభాళిస్తారు కదా. పిల్లలు సేవ చేయాలి. విద్యార్థులలో నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. ఫస్ట్ క్లాస్ పిల్లలను ఎక్కడికి పంపించాలి అనేది బాప్ దాదాకు తెలుసు. పిల్లలు ఇన్ని సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నారు, కావున వారు పరస్పరము కలుసుకుని సెంటరును నడిపించగలగేలా ఎంతో కొంత ధారణ అయ్యే ఉంటుంది కదా. మురళి అయితే లభిస్తూనే ఉంటుంది. పాయింట్ల ఆధారముగానే అర్థం చేయిస్తారు. కేవలం వినడమే అలవాటయ్యింది, వినిపించడము అలవాటవ్వడం లేదు. స్మృతిలో ఉన్నట్లయితే ధారణ కూడా జరుగుతుంది. అచ్ఛా, ఒకవేళ బ్రాహ్మణి వెళ్ళినా ఆ సెంటరులో మేము సెంటరును సంభాళిస్తాము అని అనేవారు ఎవరైనా ఉండాలి. బాబా బ్రాహ్మణిని సేవ చేయడానికి ఇంకొక మంచి సెంటరుకు పంపించారు. బ్రాహ్మణి లేకపోతే తికమకపడకూడదు. బ్రాహ్మణిలా తయారవ్వకపోతే మరి ఇతరులను తమ సమానముగా ఎలా తయారుచేస్తారు, ప్రజలను ఎలా తయారుచేసుకుంటారు. మురళి అయితే అందరికీ లభిస్తుంది. మేము గద్దెపై కూర్చుని అర్థం చేయిస్తున్నాము అని పిల్లలకు సంతోషము కలగాలి. ప్రాక్టీస్ చేసినట్లయితే సర్వీసబుల్ గా అవ్వగలుగుతారు. సర్వీసబుల్ గా అయ్యారా అని బాబా అడిగితే ఎవ్వరూ ముందుకు రారు. సేవ కోసం సెలవు కూడా తీసుకోవాలి. ఎక్కడికైనా సేవ కోసం పిలుపు వస్తే సెలవు తీసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. బంధనముక్తులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు ఈ విధమైన సేవను చేయవచ్చు. ఆ ప్రభుత్వములో కన్నా ఈ ప్రభుత్వములో సంపాదన చాలా ఉన్నతమైనది. భగవంతుడే చదివిస్తున్నారు, దీని ద్వారా మీరు 21 జన్మల కొరకు వైకుంఠానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత గొప్ప సంపాదన. ఆ సంపాదన ద్వారా ఏమి లభిస్తుంది? అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. ఇక్కడైతే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎవరికైతే పూర్తి నిశ్చయము ఉందో, వారు - మేము ఈ సేవలోనే నిమగ్నమైపోతాము అని అంటారు. కానీ పూర్తి నషా కావాలి. నేను ఎవరికైనా అర్థం చేయించగలుగుతున్నానా అని చూసుకోవాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. కలియుగాంతములో ఇన్ని కోట్లమంది మనుష్యులు ఉన్నారు, సత్యయుగములో చాలా తక్కువమంది ఉంటారు. దానిని స్థాపన చేసేందుకు తప్పకుండా తండ్రి సంగమములోనే వస్తారు. పాత ప్రపంచము యొక్క వినాశనము కానున్నది. మహాభారత యుద్ధము కూడా ప్రసిద్ధమైనది. అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే - భగవంతుడు వచ్చి సత్యయుగము కొరకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారుచేసినప్పుడు మరియు కర్మాతీత అవస్థను ప్రాప్తింపజేయించినప్పుడు. వారు అంటారు, దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతూ ఉంటాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము - ఇదే శ్రమతో కూడిన విషయము. యోగము యొక్క అర్థము మనుష్యుల్లో ఒక్కరికి కూడా తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - భక్తి మార్గము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. భక్తి మార్గము కొనసాగవలసిందే. జ్ఞానము, భక్తి, వైరాగ్యము - ఇది ఒక ఆటగా రచింపబడి ఉంది. వైరాగ్యము కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దులోని వైరాగ్యము, రెండవది ఈ అనంతమైన వైరాగ్యము. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం పాత ప్రపంచమంతటినీ మరిచేందుకు పురుషార్థము చేస్తారు ఎందుకంటే మీకు తెలుసు, మనమిప్పుడు శివాలయమైన పావన ప్రపంచములోకి వెళ్తున్నాము. బ్రహ్మాకుమార, కుమారీలైన మీరందరూ సోదరీ-సోదరులు. మీకు వికారీ దృష్టి కలగడానికి వీల్లేదు. ఈ రోజుల్లోనైతే అందరి దృష్టి అశుద్ధముగా అయిపోయింది. తమోప్రధానముగా ఉన్నారు కదా. దీని పేరే నరకము. కానీ తమను తాము నరకవాసులుగా భావించరు. స్వయము యొక్క పరిచయమే లేని కారణముగా స్వర్గ-నరకాలు రెండూ ఇక్కడే ఉన్నాయి అని అంటారు. ఎవరి మనసులోకి ఏది వస్తే అది అనేస్తారు. ఇది స్వర్గమేమీ కాదు. స్వర్గములోనైతే రాజ్యము ఉండేది. అక్కడ ధార్మికముగా మరియు ధర్మయుక్తముగా ఉండేవారు. అక్కడ ఎంత బలము ఉండేది. ఇప్పుడు మీరు మళ్ళీ పురుషార్థము చేస్తున్నారు. విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇక్కడికి మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే వస్తారు. స్వర్గ రచయిత అయిన గాడ్ ఫాదర్ ను శివ పరమాత్మ అని అంటారు, వారు మిమ్మల్ని చదివిస్తున్నారు. పిల్లలకు ఎంత నషా ఉండాలి. ఇది చాలా సహజమైన జ్ఞానము. పిల్లలైన మీలో పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని వదిలేయాలి. ఈర్ష్య అలవాటు కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. మీ ఆధారమంతా మురళిపై ఉంది, మీరు ఎవరికైనా మురళిపై అర్థం చేయించవచ్చు. కానీ - వీరు ఏమీ బ్రాహ్మణి కాదు కదా, వీరికేమి తెలుసు అని లోలోపల ఈర్ష్య ఉంటుంది, ఇక అంతే, మరుసటి రోజు వారు రానే రారు. ఇటువంటి పాత అలవాట్లు కొన్ని ఉన్నాయి, వాటి వల్ల డిస్సర్వీస్ కూడా అవుతుంటుంది. జ్ఞానము అయితే చాలా సహజమైనది. కుమారీలకైతే వేరే ఉద్యోగము మొదలైనవి కూడా ఏవీ లేవు. వారిని - ఆ చదువు బాగుందా లేక ఈ చదువు బాగుందా అని అడిగితే, వారు అంటారు - ఈ చదువే చాలా బాగుంది, బాబా, ఇప్పుడు మేము ఆ చదువును చదవము, ఆ చదువుపై మనసు కలగడము లేదు అని అంటారు. లౌకిక తండ్రి జ్ఞానములో లేకపోతే దెబ్బలు తినవలసి వస్తుంది. కొందరు కుమార్తెలు బలహీనముగా కూడా ఉంటారు. ఈ చదువు ద్వారా నేను మహారాణిగా అవుతాను అని వారికి అర్థం చేయించాలి కదా. ఆ చదువు ద్వారా పెద్ద విలువ లేని ఉద్యోగము చేయవలసి వస్తుంది. ఈ చదువు అయితే భవిష్య 21 జన్మల కొరకు స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తుంది. ప్రజలు కూడా స్వర్గవాసులుగా అవుతారు కదా. ఇప్పుడు అందరూ నరకవాసులుగా ఉన్నారు.

ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, ఇప్పుడు మీరే ఎంత తమోప్రధానముగా అయిపోయారు. మెట్లు దిగుతూ వచ్చారు. భారత్ ను బంగారు పిచ్చుక అని అనేవారు, ఇప్పుడు అది రాయి అంత విలువ చేసేదిగా కూడా లేదు. భారత్ 100 శాతం సుసంపన్నముగా ఉండేది, ఇప్పుడు 100 శాతం దివాలా తీసింది. మనము విశ్వానికి యజమానులుగా, పారసనాథులుగా ఉండేవారమని మీకు తెలుసు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు రాతినాథులుగా అయిపోయాము. వాస్తవానికి ఇరువురూ మనుష్యులే కానీ పారసనాథులు మరియు రాతినాథులు అని అంటారు. పాట కూడా విన్నారు కదా - నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను అని మీరు లోలోపల చూసుకోండి. నారదుని ఉదాహరణ ఉంది కదా. రోజురోజుకు పడిపోతూనే ఉంటారు. అలా పడిపోతూ, పడిపోతూ పూర్తిగా గొంతు వరకు ఊబిలో చిక్కుకుపోయారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు అందరినీ పిలకతో పట్టుకుని ఊబి నుండి బయటకు తీస్తారు. పట్టుకునేందుకు ఇంకే స్థానమూ లేదు కావున పిలకతో పట్టుకోవడము సహజము. ఊబి నుండి బయటకు తీసేందుకు పిలకను పట్టుకోవలసి ఉంటుంది. ఊబిలో ఎంతగా చిక్కుకున్నారంటే ఇక చెప్పడానికి వీల్లేదు. ఇది భక్తి రాజ్యము కదా. బాబా, మేము రాజ్యభాగ్యాన్ని పొందేందుకు కల్పపూర్వము కూడా మీ వద్దకు వచ్చాము అని ఇప్పుడు మీరు అంటారు. లక్ష్మీ-నారాయణుల మందిరాలను తయారుచేస్తూ ఉంటారు కానీ వారు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అనేది వారికి తెలియదు. ఇప్పుడు మీరు ఎంత తెలివైనవారిగా అయ్యారు. వీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు, ఆ తర్వాత 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది మీకు తెలుసు. బిర్లా ఎన్ని మందిరాలను తయారుచేస్తుంటారు! బొమ్మలను తయారుచేసినట్లుగా తయారుచేస్తుంటారు. వాళ్ళు చిన్న-చిన్న బొమ్మలను తయారుచేస్తే, బిర్లా పెద్ద బొమ్మలను తయారుచేస్తుంటారు. మూర్తులను తయారుచేసి పూజిస్తూ ఉంటారు. ఆ మూర్తుల యొక్క చరిత్రను గురించి తెలియకపోవడమంటే మరి బొమ్మలను పూజించడం వంటిదే కదా. తండ్రి మనల్ని ఎంత షావుకారులుగా తయారుచేసారు, మళ్ళీ మనము ఎంత నిరుపేదలుగా అయ్యాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఒకప్పుడు పూజ్యులుగా ఉన్నవారే ఇప్పుడు పూజారులుగా అయ్యారు. భక్తులు భగవంతుని గురించి ఏమంటూ ఉంటారంటే - నీవే పూజ్యుడివి, నీవే పూజారివి, నీవే సుఖాన్ని ఇస్తావు, నీవే దుఃఖాన్ని ఇస్తావు, అన్నీ నీవే చేస్తావు అని అంటారు. ఇందులోనే నిమగ్నమైపోతారు. ఏమంటూ ఉంటారంటే - ఆత్మ నిర్లేపి, ఏమైనా తినండి, తాగండి, ఆనందముగా గడపండి, అంతా శరీరానికే అంటుకుంటుంది, అది గంగా స్నానము ద్వారా శుద్ధమైపోతుంది, ఏది కావాలనుకుంటే అది తినండి అని అంటారు. ప్రపంచములో ఏమేమి ఫ్యాషన్లు ఉన్నాయి. ఎవరు ఏ పద్ధతిని ప్రవేశపెడితే అది అలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, విషయసాగరము నుండి శివాలయములోకి పదండి. సత్యయుగాన్ని క్షీరసాగరము అని అంటారు, ఇది విషయ సాగరము. మనము 84 జన్మలను తీసుకుని పతితముగా అయ్యాము, అందుకే పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తున్నాము అని మీకు తెలుసు. చిత్రాలపై అర్థం చేయించడం ద్వారా మనుష్యులు సహజముగా అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రములో మొత్తము 84 జన్మల వృత్తాంతము ఉంది. ఇంత సహజమైన విషయాన్ని కూడా ఎవ్వరికీ అర్థం చేయించలేకపోతారు కావున బాబా అనుకుంటారు, వీరు పూర్తిగా చదవడం లేదు, తమ ఉన్నతిని చేసుకోవడము లేదు అని.

భ్రమరము వలె భూ-భూ చేస్తూ పురుగుల వంటివారిని మీ సమానముగా తయారుచేయడమే బ్రాహ్మణులైన మీ కర్తవ్యము. మరియు మీ పురుషార్థము ఏమిటంటే - సర్పము వలె పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవడము. ఇది పాత, కుళ్ళిపోయిన శరీరమని మీకు తెలుసు, దీనిని వదిలివేయాలి. ఈ ప్రపంచము కూడా పాతదే, శరీరము కూడా పాతదే. దీనిని వదిలి ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. మీ ఈ చదువు కొత్త ప్రపంచమైన స్వర్గము కొరకు. ఈ పాత ప్రపంచము అంతము కానున్నది. సాగరము యొక్క ఒక్క అలతో మొత్తమంతా అల్లకల్లోలమైపోతుంది. వినాశనమైతే అవ్వవలసిందే కదా. ప్రకృతి వైపరీత్యాలు ఎవ్వరినీ విడిచిపెట్టవు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోపల ఈర్ష్య మొదలైన పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని వదిలి పరస్పరం చాలా ప్రేమగా కలిసి-మెలిసి ఉండాలి. ఈర్ష్య కారణముగా చదువును వదలకూడదు.

2. ఈ పాత కుళ్ళిపోయిన శరీర భానాన్ని విడిచిపెట్టాలి. భ్రమరము వలె జ్ఞానాన్ని భూ-భూ చేసి, పురుగులను తమ సమానముగా తయారుచేసే సేవను చేయాలి. ఈ ఆత్మిక సేవలో నిమగ్నమవ్వాలి.

వరదానము:-
మనసా బంధనాల నుండి ముక్తులుగా, అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని చేసే ముక్తిదాత భవ

అతీంద్రియ సుఖములో ఊగడము - ఇది సంగమయుగీ బ్రాహ్మణుల విశేషత. కానీ మనసా సంకల్పాల బంధనాలు ఆంతరిక సంతోషాన్ని మరియు అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయనివ్వవు. వ్యర్థ సంకల్పాలు, ఈర్ష్య, నిర్లక్ష్యము మరియు సోమరితనముతో కూడిన సంకల్పాల బంధనములో బంధింపబడడమే మనసా బంధనము, ఇటువంటి ఆత్మ తన అభిమానానికి వశమై ఇతరుల దోషమునే ఆలోచిస్తూ ఉంటుంది, వారి యొక్క రియలైజేషన్ శక్తి సమాప్తమైపోతుంది, అందుకే ఈ సూక్ష్మ బంధనము నుండి ముక్తులుగా అవ్వండి, అప్పుడు ముక్తిదాతలుగా అవ్వగలరు.

స్లోగన్:-
సంతోషాల ఖజానాతో ఎంత సంపన్నులుగా ఉండండి అంటే మీ వద్దకు దుఃఖపు అల కూడా రాకూడదు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

ఏ శ్రేష్ఠ సంకల్పము రూపీ బీజాన్ని అయినా ఫలీభూతము చేసేందుకు సహజ సాధనము ఒక్కటే, అదేమిటంటే - సదా బీజరూపుడైన బాబా నుండి ప్రతి సమయము సర్వ శక్తుల బలాన్ని ఆ బీజములో నింపుతూ ఉండండి. బీజరూపుడు ద్వారా మీ సంకల్పము రూపీ బీజము సహజముగా మరియు స్వతహాగా వృద్ధిని పొందుతూ ఫలీభూతమవుతుంది. సంకల్ప శక్తి జమ అవుతుంది.