04-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ లోపాలను తొలగించుకోవాలనుకుంటే సత్యమైన హృదయముతో తండ్రికి వినిపించండి, బాబా మీకు లోపాలను తొలగించుకునే యుక్తిని తెలియజేస్తారు’’

ప్రశ్న:-
తండ్రి కరెంటు ఏ పిల్లలకు లభిస్తుంది?

జవాబు:-
ఏ పిల్లలైతే నిజాయితీతో సర్జన్ కు తమ రోగాన్ని వినిపిస్తారో, బాబా వారికి దృష్టిని ఇస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా దయ కలుగుతుంది. ఈ బిడ్డలోని ఈ భూతము తొలగిపోవాలి అని లోలోపల అనిపిస్తుంది. బాబా వారికి కరెంటు ఇస్తారు.

ఓంశాంతి
తండ్రి పిల్లలను ప్రశ్నిస్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి - తండ్రి నుండి ఏమైనా లభించిందా? ఏయే విషయాలలో లోటు ఉంది? ప్రతి ఒక్కరూ తమలో తాము చూసుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా, లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నావా అని నీ ముఖాన్ని నీవు అద్దములో చూసుకో అని అతనితో అన్నారు. కావున తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు - మీరు లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా, ఏమనుకుంటున్నారు? ఒకవేళ అవ్వనట్లయితే ఏమేమి లోపాలున్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థము చేస్తారు. లోపాలను తొలగించుకునేందుకు పురుషార్థము చేస్తున్నారా లేక అసలు చేయడమే లేదా? కొందరైతే పురుషార్థము చేస్తూ ఉంటారు. కొత్త, కొత్త పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది - మీలో మీరు చూసుకోండి, నాలో లోపాలు ఏమీ లేవు కదా? ఎందుకంటే మీరందరూ పర్ఫెక్ట్ గా అవ్వాలి. పర్ఫెక్ట్ తయారుచేసేందుకే తండ్రి వస్తారు, అందుకే లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క చిత్రాన్ని కూడా ఎదురుగా ఉంచారు. మిమ్మల్ని మీరు లోలోపల ప్రశ్నించుకోండి - మేము వీరిలా పర్ఫెక్ట్ గా అయ్యామా? ఆ భౌతికమైన విద్యను చదివించే టీచర్ మొదలైనవారంతా ఈ సమయములో వికారులుగా ఉన్నారు. వీరు (లక్ష్మీ-నారాయణులు) సంపూర్ణ నిర్వికారుల ఉదాహరణ. అర్ధకల్పము మీరు వీరి మహిమను చేశారు. కావున ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - మాలో ఏమేమి లోపాలున్నాయి, వాటిని తొలగించుకుని మేము మా ఉన్నతిని చేసుకోవాలి. మరియు తండ్రికి చెప్పాలి - బాబా, మాలో ఈ లోపముంది, అది మా నుండి తొలగడం లేదు, ఏదైనా ఉపాయము తెలియజేయండి. రోగము సర్జన్ ద్వారానే తొలగగలదు. కొందరు అసిస్టెంట్ సర్జన్లు కూడా చురుకుగా ఉంటారు. డాక్టర్ల నుండి కాంపౌండర్లు నేర్చుకుంటారు, చురుకైన డాక్టర్లుగా అయిపోతారు. కావున నిజాయితీగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - నాలో ఏమేమి లోపాలు ఉన్న కారణముగా నేను ఈ పదవిని పొందలేను అని నేను భావిస్తున్నాను? మీరు ఈ విధంగా తయారవ్వవచ్చు అని తండ్రి అయితే అంటారు కదా. లోపాలను తెలియజేస్తే తండ్రి సలహాను ఇవ్వగలరు. రోగాలైతే ఎన్నో ఉన్నాయి. అనేకులలో లోపాలు ఉన్నాయి. కొందరిలో చాలా క్రోధము ఉంది, లోభము ఉంది... ఇతరుల చేత ధారణ చేయించేందుకు స్వయం వారిలో జ్ఞాన ధారణ జరుగదు. తండ్రి రోజూ ఎంతో అర్థం చేయిస్తారు. వాస్తవానికి ఇంతగా అర్థం చేయించవలసిన అవసరమే కనిపించడం లేదు. మంత్రము యొక్క అర్థాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి అయితే ఒక్కరే. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి మరియు వారి నుండి ఈ వారసత్వాన్ని పొంది మనం ఈ విధంగా తయారవ్వాలి. ఇతర స్కూళ్ళలో పంచ వికారాలపై విజయాన్ని పొందే విషయమే ఉండదు. ఈ విషయము ఇప్పుడే ఉంటుంది, దీనిని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మీలో ఏవైతే భూతాలు ఉన్నాయో, ఏవైతే దుఃఖాన్ని ఇస్తున్నాయో, వాటిని వర్ణించినట్లయితే వాటిని తొలగించుకునేందుకు తండ్రి యుక్తిని తెలియజేస్తారు. బాబా, ఈ ఈ భూతాలు మమ్మల్ని విసిగిస్తున్నాయి అని చెప్పాలి. భూతాలను తొలగించేవారి ముందు వర్ణన చేయడం జరుగుతుంది కదా. మీలో ఆ భూతాలు ఏమీ లేవు. ఈ పంచ వికారాల రూపీ భూతాలు జన్మ-జన్మాంతరాలుగా ఉన్నాయని మీకు తెలుసు. నాలో ఏ భూతాలు ఉన్నాయి అని చూసుకోవాలి. వాటిని తొలగించుకునేందుకు మరి సలహా తీసుకోవాలి. కళ్ళు కూడా ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి, అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించే అభ్యాసము చేయండి. ఈ యుక్తితో మీ ఈ రోగము తొలగిపోతుంది. మనమందరమూ ఆత్మలము కావున ఆత్మలంతా పరస్పరం సోదరులు. శరీరమైతే లేదు. ఆత్మలమైన మనమందరమూ తిరిగి వెళ్ళనున్నామని కూడా మీకు తెలుసు. కనుక స్వయాన్ని చూసుకోవాలి - మేము సర్వ గుణ సంపన్నులుగా అయ్యామా? లేక మాలో ఏ అవగుణాలు ఉన్నాయి? అప్పుడు తండ్రి కూడా కూర్చుని ఆ ఆత్మను చూస్తారు, ఆ ఆత్మలో ఈ లోపాలు ఉన్నాయి కావున తనకు శక్తిని ఇద్దాము, ఈ బిడ్డ యొక్క ఈ విఘ్నము తొలగిపోవాలి అని. ఒకవేళ సర్జన్ నుండే దాచిపెడుతూ ఉన్నట్లయితే ఇక ఏమి చేయగలరు? మీరు మీ అవగుణాలను తెలియజేస్తూ ఉన్నట్లయితే తండ్రి కూడా సలహాను ఇస్తారు. ఏ విధంగా ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు - బాబా, మీరు ఎంత మధురమైనవారు, మమ్మల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తారు! ఇలా తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే భూతాలు పారిపోతూ ఉంటాయి. ఏదో ఒక భూతమైతే తప్పకుండా ఉంది. బాబా, మాకు దీని యుక్తిని తెలియజేయండి అని సర్జన్ అయిన తండ్రికి తెలియజేయండి. లేకపోతే ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలా వినిపించడం ద్వారా తండ్రికి కూడా - ఈ మాయ భూతాలు వీరిని విసిగిస్తున్నాయే అని దయ కలుగుతుంది. భూతాలను పారద్రోలేవారైతే ఒక్క తండ్రే. యుక్తిగా పారద్రోలుతారు. ఈ 5 భూతాలను పారద్రోలండి అని అర్థం చేయించడం జరుగుతుంది. అయినా అన్ని భూతాలూ పారిపోవు. కొందరిలో విశేషంగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. కానీ ఉండడమైతే తప్పకుండా ఉన్నాయి. వీరిలో ఈ భూతము ఉంది అని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయములో లోపల అనిపిస్తుంది కదా. ఇతనైతే చాలా మంచి బిడ్డ, ఇతనిలో వేరే మంచి-మంచి గుణాలన్నీ ఉన్నాయి కానీ ఇతను ఏమీ మాట్లాడరు, ఎవరికీ అర్థం చేయించలేరు, మాయ గొంతు మూసేసినట్లయ్యింది, ఇతని గొంతు తెరుచుకున్నట్లయితే ఇతరుల సేవను కూడా చేయడం మొదలుపెడతారు. ఇతరుల సేవలో స్వయం యొక్క సేవ ఉంది. మీరు శివబాబా సేవను చేయరు, శివబాబా తాను స్వయం సేవ చేయడానికి వచ్చారు. ఈ జన్మ-జన్మాంతరాల భూతాలను పారద్రోలాలి అని వారు చెప్తారు.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు - వృక్షం మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుందని, ఆకులు రాలిపోతూ ఉంటాయని కూడా మీకు తెలుసు. మాయ విఘ్నాలను కలిగిస్తుంది. కూర్చుని, కూర్చుని ఆలోచనలు మారిపోతాయి. ఏ విధంగా సన్యాసులకు ద్వేషం కలిగితే ఒక్కసారిగా మాయమైపోతారు, ఏ కారణమూ ఉండదు, ఏ మాటా ఉండదు. కనెక్షన్ అయితే అందరికీ తండ్రితోనే ఉంది. పిల్లలైతే నంబరువారుగా ఉన్నారు. వారు కూడా తండ్రికి సత్యముగా తెలియజేసినట్లయితే ఆ లోపాలు తొలగిపోగలవు మరియు ఉన్నత పదవిని పొందగలుగుతారు. కొందరు తెలియజేయని కారణముగా తమను తాము చాలా నష్టపరచుకుంటారని తండ్రికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా కానీ అదే పని చేయడం మొదలుపెడతారు. మాయ పట్టేసుకుంటుంది. మాయ రూపీ కొండచిలువ ఉంది, అది అందరినీ కడుపులో వేసుకుని కూర్చుంది. ఊబిలో గొంతువరకూ కూరుకుపోయారు. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. ఇంకే విషయమూ లేదు, కేవలం ఇద్దరు తండ్రులు ఉన్నారు అని చెప్పండి. ఒక లౌకిక తండ్రి అయితే సదా లభిస్తూనే ఉంటారు, సత్యయుగములో కూడా లభిస్తారు, అలాగే కలియుగములో కూడా లభిస్తారు. సత్యయుగములో పారలౌకిక తండ్రి లభిస్తారని కాదు. పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గముగా తయారుచేస్తారు. భక్తి మార్గములో వారిని ఎంత పూజిస్తారు, తలచుకుంటారు. శివుని మందిరాలైతే ఎన్నో ఉన్నాయి. సేవ లేదు అని పిల్లలు అంటారు. అరే, శివుని మందిరాలైతే అన్నిచోట్లా ఉన్నాయి, అక్కడకు వెళ్ళి - వీరిని ఎందుకు పూజిస్తున్నారు అని మీరు అడుగవచ్చు. వీరు శరీరధారి అయితే కాదు, మరి వీరు ఎవరు? పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప ఇంకెవరినీ అలా అనరు. కావున ఇలా చెప్పండి - ఈ పరమాత్మ తండ్రి కదా, వీరిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. ఎక్కువగా పరమపిత పరమాత్మ అని అంటారు, వారి నుండి ఏమి లభిస్తుంది అన్నది మీకేమైనా తెలుసా? భారత్ లో శివుడి నామాన్ని ఎంతగానో తలచుకుంటారు. శివ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి వివిధ రకాలుగా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎవరివద్దకైనా వెళ్ళవచ్చు. కానీ చాలా శీతలతతో, నమ్రతతో మాట్లాడాలి. మీ పేరు అయితే భారత్ లో ఎంతగానో వ్యాపించి ఉంది. మీరు కొద్దిగా మాట్లాడినా - వీరు బి.కే.లు అని వెంటనే అర్థం చేసుకుంటారు. గ్రామాలు మొదలైన చోట్ల అయితే చాలా అమాయకులుగా ఉంటారు. కావున మందిరాలలోకి వెళ్ళి సేవ చేయడం చాలా సహజము. మీరు వచ్చినట్లయితే మేము మీకు శివబాబా జీవిత గాథను వినిపిస్తాము, మీరు శివుడిని పూజిస్తారు, వారిని ఏమి కోరుకుంటారు, మేమైతే మీకు వారి పూర్తి జీవిత గాథను తెలియజేయగలము అని చెప్పండి. తర్వాత రోజు మళ్ళీ లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్ళండి. మీ లోపల సంతోషము ఉంటుంది. గ్రామాల్లో సేవ చేయాలి అని పిల్లలు కోరుకుంటారు. అందరికీ తమ-తమ వివేకము ఉంది కదా. తండ్రి అంటారు, మొట్టమొదట శివబాబా మందిరములోకి వెళ్ళండి, ఆ తర్వాత లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్ళి వారిని అడగండి - వీరికి ఈ వారసత్వము ఎలా లభించింది? మీరు వచ్చినట్లయితే మేము మీకు ఈ దేవీ-దేవతల 84 జన్మల కథను వినిపిస్తాము అని చెప్పండి. గ్రామవాసులను కూడా మేల్కొలపాలి. మీరు వెళ్ళి ప్రేమగా అర్థం చేయిస్తారు. ఇలా చెప్పాలి - మీరు ఒక ఆత్మ, ఆత్మయే మాట్లాడుతుంది, ఈ శరీరమైతే అంతమైపోనున్నది, ఇప్పుడు ఆత్మలమైన మనము పావనముగా తయారై తండ్రి వద్దకు వెళ్ళాలి, నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలను వినడంతోనే వారిలో ఆకర్షణ కలుగుతుంది. ఎంతగా మీరు దేహీ-అభిమానులుగా ఉంటారో అంతగా మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు అంతగా ఈ దేహము మొదలైనవాటిపై, పాత ప్రపంచముపై పూర్తి వైరాగ్యము రాలేదు. ఈ పాత శరీరాన్ని వదిలేయాలనైతే మీకు తెలుసు. దీనిపై ఏం మమకారము పెట్టుకోవాలి. శరీరము ఉన్నా కూడా శరీరముపై ఎటువంటి మమకారమూ ఉండకూడదు. లోలోపల ఇదే తపన ఉండాలి - ఇప్పుడు ఆత్మలైన మేము పావనంగా అయి మా ఇంటికి వెళ్ళాలి అని. మళ్ళీ మనసుకు ఇలా కూడా అనిపిస్తుంది - ఇటువంటి బాబాను ఎలా వదలగలము, ఇటువంటి బాబా అయితే మళ్ళీ ఎప్పుడూ లభించరు. కావున ఇటువంటి ఆలోచనలను చేయడం ద్వారా తండ్రి కూడా గుర్తుకువస్తారు, ఇల్లు కూడా గుర్తుకువస్తుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తయ్యాయి. పగలుపూట మీ వ్యాపారాలు మొదలైనవాటిని చేసుకోండి, గృహస్థ వ్యవహారములో అయితే ఉండవలసిందే, అందులో ఉంటూ కూడా మీరు బుద్ధిలో ఇది ఉంచుకోండి - ఇవన్నీ అంతమైపోనున్నాయి, ఇప్పుడిక మనం తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్పారు, గృహస్థ వ్యవహారములో కూడా తప్పకుండా ఉండాలి, లేకపోతే ఎక్కడకు వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చేయండి, బుద్ధిలో ఇది గుర్తుండాలి. ఇవన్నీ అంతమైపోనున్నాయి. మొదట మనము ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వస్తాము. మీకు ఎంత సమయం లభిస్తే అంత మీతో మీరు మాట్లాడుకోవాలి. ఎంతో సమయం ఉంది, 8 గంటలు వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి, మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి వెళ్ళి ఈశ్వరీయ సేవ చేయాలి. ఎంత సమయం లభిస్తే అంత సమయం శివబాబా మందిరములోకి, లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్ళి సేవ చేయండి. మందిరాలైతే మీకు ఎన్నో లభిస్తాయి. మీరు ఎక్కడకు వెళ్ళినా శివుని మందిరాలైతే తప్పకుండా ఉంటాయి. పిల్లలైన మీ కొరకు ముఖ్యమైనది స్మృతియాత్ర. స్మృతిలో ఎక్కువగా ఉంటే మీరు ఏది కోరుకుంటే అది లభించగలదు. ప్రకృతి దాసిగా అయిపోతుంది. వారి ముఖము కూడా ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది, ఇక ఏమీ అడగవలసిన అవసరం ఉండదు. సన్యాసుల్లో కూడా కొందరు పక్కాగా ఉంటారు. మేము బ్రహ్మములోకి వెళ్ళి లీనమైపోతాము అన్న నిశ్చయముతో కూర్చుంటారు. ఈ నిశ్చయములో చాలా పక్కాగా ఉంటారు. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము అన్న అభ్యాసము వారికి ఉంటుంది, కానీ వారు తప్పుడు మార్గములో ఉన్నారు. బ్రహ్మములో లీనమయ్యేందుకు ఎంతో కష్టపడతారు. భక్తిలో సాక్షాత్కారాల కొరకు ఎంతగా కష్టపడతారు. తమ జీవితాన్ని కూడా ఇచ్చేస్తారు. ఆత్మహత్య అనేది ఉండదు, జీవహత్యయే ఉంటుంది. ఆత్మ అయితే సదా ఉంటుంది, అది వెళ్ళి ఇంకొక జీవితాన్ని అనగా శరీరాన్ని తీసుకుంటుంది.

పిల్లలైన మీరు సేవా అభిరుచిని ఎంతగానో ఉంచండి, అప్పుడు తండ్రి కూడా గుర్తుకువస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మీరు యోగములో పూర్తిగా ఉంటూ ఎవరికైనా ఏదైనా చెప్తే ఎదుటివారికి ఇక వేరే ఆలోచన ఏదీ రాదు. యోగము చేసేవారి బాణం పూర్తిగా తగులుతుంది. మీరు ఎంతో సేవ చేయవచ్చు. ప్రయత్నించి చూడండి, కానీ మొదట తమలో తాము చూసుకోవాలి - నాలో మాయ భూతాలేమీ లేవు కదా? మాయ భూతాలు ఉన్నవారు విజయవంతులు కాలేరు. సేవ అయితే ఎంతో ఉంది. బాబా అయితే వెళ్ళలేరు కదా ఎందుకంటే వీరితోపాటు శివబాబా ఉన్నారు. ఈ తండ్రిని మనము చెత్తలోకి ఎక్కడకు తీసుకువెళ్తాము! వారు ఎవరితో మాట్లాడాలి? తండ్రి అయితే పిల్లలతోనే మాట్లాడాలనుకుంటారు. కావున పిల్లలు సేవ చేయాలి. సన్ షోస్ ఫాదర్ అన్న గాయనము కూడా ఉంది. తండ్రి అయితే పిల్లలను చురుకైనవారిగా తయారుచేసారు కదా. సేవా అభిరుచి ఉన్న మంచి-మంచి పిల్లలు ఉన్నారు. మేము పల్లెటూర్లలోకి వెళ్ళి సేవ చేస్తాము అని అంటారు. బాబా అంటారు, మంచిది, చేయండి. కేవలం ఫోల్డింగ్ చిత్రాలు మీతోపాటు ఉండాలి. చిత్రాలు లేకుండా ఎవరికైనా అర్థం చేయించడం కష్టమనిపిస్తుంది. రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన ఉంటుంది - ఇతరుల జీవితాన్ని ఎలా తయారుచేయాలి, మాలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని ఎలా తొలగించుకోవాలి, ఉన్నతిని ఎలా పొందాలి? మీకు సంతోషము కూడా కలుగుతుంది. బాబా, వీరు 8-9 నెలల బిడ్డ అని చెప్తారు. ఇటువంటివారు ఎంతోమంది వెలువడుతారు. త్వరగా సేవకు యోగ్యులుగా అయిపోతారు. ప్రతి ఒక్కరికీ ఈ ఆలోచన కూడా ఉంటుంది - మేము మా గ్రామాన్ని పైకి తీసుకురావాలి, మా సహచరులైన సోదరులకు సేవను చేయాలి అని. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. సేవా అభిరుచి ఎంతో ఉండాలి. ఒకేచోట ఉండిపోకూడదు, చుట్టూ తిరుగుతూ ఉండాలి. సమయమైతే చాలా తక్కువగా ఉంది కదా. వాళ్ళవి ఎంత పెద్ద-పెద్ద ఆశ్రమాలు తయారవుతాయి. కొత్త ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది, తాను కూర్చుని ఏదో ఒక శిక్షణను ఇస్తుంది, దానితో పేరు ప్రఖ్యాతమైపోతుంది. ఇక్కడైతే అనంతమైన తండ్రి కూర్చుని కల్పపూర్వము వలె శిక్షణను ఇస్తారు. ఈ ఆత్మిక కల్పవృక్షము వృద్ధి చెందుతుంది. నిరాకారీ వృక్షము నుండి నంబరువారుగా ఆత్మలు వస్తాయి. శివబాబా యొక్క పెద్ద మాల లేక వృక్షము తయారై ఉంది. ఈ విషయాలన్నింటినీ తలచుకోవడం ద్వారా కూడా తండ్రి స్మృతి కలుగుతుంది. అప్పుడు ఉన్నతి త్వరగా జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణను చేస్తూ చాలా శీతలతతో మరియు నమ్రతతో ఆత్మిక సేవను చేయాలి. సేవలో సఫలతను పొందేందుకు లోపల మాయకు చెందిన ఎటువంటి భూతమూ ఉండకూడదు.

2. మీతో మీరు మాట్లాడుకోవాలి - ఇది ఏదైతే మేము చూస్తున్నామో, ఇదంతా వినాశనమవ్వనున్నది, మేము మా ఇంటికి వెళ్తాము, మళ్ళీ సుఖధామములోకి వస్తాము.

వరదానము:-
అచంచల నిశ్చయము ద్వారా సహజ విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత, నిశ్చింత భవ

నిశ్చయానికి గుర్తు సహజ విజయము. కానీ నిశ్చయము అన్ని విషయాలలోనూ కావాలి. కేవలం తండ్రిపై నిశ్చయమే కాదు, స్వయముపై, బ్రాహ్మణ పరివారముపై మరియు డ్రామాలోని ప్రతి దృశ్యముపై సంపూర్ణ నిశ్చయము ఉండాలి. చిన్న విషయానికే నిశ్చయము చలించేదిగా ఉండకూడదు. సదా ఈ స్మృతి ఉండాలి - విజయము అనే తలరాత చెదరదు. ఇటువంటి నిశ్చయబుద్ధిగల పిల్లలు - ఏమైంది, ఎందుకైంది... అనే ఈ ప్రశ్నలన్నింటి నుండి కూడా అతీతముగా సదా నిశ్చింతగా, సదా హర్షితముగా ఉంటారు.

స్లోగన్:-
సమయాన్ని నష్టపరిచేందుకు బదులుగా వెంటనే నిర్ణయము తీసుకుని విషయాన్ని పరిష్కరించండి.