04-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా
అవుతున్నారు, అందుకే సత్యయుగములో సత్సంగము చేయవలసిన అవసరము లేదు’’
ప్రశ్న:-
సత్యయుగములో దేవతల ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు, ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే
వారికి సత్యమైన తండ్రి యొక్క వరదానము లభించి ఉన్నది. రావణుడి శాపము లభించడము
మొదలైనప్పుడు వికర్మలు జరుగుతాయి. సత్య, త్రేతాయుగాలలో సద్గతియే ఉంటుంది, ఆ సమయములో
దుర్గతి అన్న మాటే ఉండదు. వికర్మలు జరిగేందుకు అసలు అక్కడ వికారాలే లేవు. ద్వాపర,
కలియుగాలలో అందరి దుర్గతి జరుగుతుంది, అందుకే వికర్మలు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా
అర్థం చేసుకోవలసిన విషయాలు.
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - వీరు
సుప్రీమ్ తండ్రి కూడా, సుప్రీమ్ టీచర్ కూడా, సుప్రీమ్ సద్గురువు కూడా. తండ్రి మహిమను
ఈ విధముగా వినిపించినట్లయితే, శ్రీకృష్ణుడు ఎవ్వరికీ తండ్రి కాలేరు అన్నది ఆటోమేటిక్
గా ఋజువవుతుంది. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, వారు సత్యయుగ రాకుమారుడు. వారు టీచర్
కూడా కాలేరు. వారు స్వయమే కూర్చుని టీచర్ వద్ద చదువుకుంటారు. గురువులైతే అక్కడ ఉండరు
ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు. అర్ధకల్పము సద్గతి, అర్ధకల్పము దుర్గతి.
అక్కడ సద్గతి ఉంటుంది, అందుకని అక్కడ జ్ఞానము యొక్క అవసరముండదు. జ్ఞానము అన్న మాట
కూడా ఉండదు ఎందుకంటే జ్ఞానముతో 21 జన్మల కొరకు సద్గతి లభిస్తుంది, మళ్ళీ ద్వాపరము
నుండి కలియుగాంతము వరకు దుర్గతి ఉంటుంది. మరి అటువంటప్పుడు శ్రీకృష్ణుడు
ద్వాపరములోకి ఎలా రాగలరు. ఈ విషయము కూడా ఎవరి ధ్యాసలోకి రాదు. ఒక్కొక్క విషయములో
చాలా గుహ్యమైన రహస్యము నిండి ఉంది, అది అర్థం చేయించడము చాలా అవసరము. వారు సుప్రీమ్
తండ్రి, సుప్రీమ్ టీచర్. ఇంగ్లీష్ లో సుప్రీమ్ అనే అంటారు. ఇంగ్లీష్ లో కొన్ని పదాలు
చాలా బాగుంటాయి. ఉదాహరణకు డ్రామా అనే పదముంది. డ్రామాను నాటకము అని అనరు,
నాటకములోనైతే మార్పులు-చేర్పులు జరుగుతాయి. ఈ సృష్టి చక్రము తిరుగుతుంది అని అంటారు
కూడా, కానీ అది ఎలా తిరుగుతుంది, యథావిధిగా తిరుగుతుందా లేక ఏమైనా మారుతుందా, ఇది
ఎవ్వరికీ తెలియదు. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది,
ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగకూడనిది ఏదీ జరగటము లేదు కావున ఇందులో
చింతించవలసిన అవసరమేముంది అని కూడా అంటారు. ఇది తప్పకుండా ఒక ఆట, ఇది మళ్ళీ రిపీట్
అవుతూ ఉంటుంది. ఈ చక్రములో మనుష్యులే తిరగవలసి ఉంటుంది. అచ్ఛా, ఈ చక్రము యొక్క
ఆయుష్షు ఎంత? ఇది ఎలా రిపీట్ అవుతుంది? దీనికి తిరగడానికి ఎంత సమయము పడుతుంది? ఇది
ఎవ్వరికీ తెలియదు. ఇస్లామ్ ధర్మస్థులు, బౌద్ధ ధర్మస్థులు మొదలైనవారి వంశాలు ఉన్నాయి,
డ్రామాలో వారికి పాత్ర ఉంది.
బ్రాహ్మణులైన మీది వంశము ఉండదు, ఇది బ్రాహ్మణ కులము. సర్వోత్తమ బ్రాహ్మణ కులము
అని అంటారు. దేవీ-దేవతల కులము కూడా ఉంటుంది. ఇది అర్థం చేయించడం చాలా సహజము.
సూక్ష్మవతనములో ఫరిశ్తాలు ఉంటారు. అక్కడ ఎముకలు-మాంసము ఉండవు. దేవతలకైతే
ఎముకలు-మాంసము ఉంటాయి కదా. బ్రహ్మాయే విష్ణువు, విష్ణువే బ్రహ్మా. విష్ణు నాభి కమలము
నుండి బ్రహ్మాను ఎందుకు చూపించారు? సూక్ష్మవతనములోనైతే ఈ విషయాలు ఉండవు. ఆభరణాలు
మొదలైనవి కూడా ఉండవు. అందుకే బ్రహ్మాను శ్వేత వస్త్రధారీ బ్రాహ్మణుడిగా చూపించారు.
బ్రహ్మా సాధారణ మనిషి, వారు అనేక జన్మల అంతిమములో పేదవారిగా అయ్యారు కదా. ఈ సమయములో
ఉన్నవే ఖద్దరు వస్త్రాలు. పాపం వారికి సూక్ష్మ శరీరమంటే ఏమిటో తెలియదు. మీకు తండ్రి
అర్థం చేయిస్తున్నారు, అక్కడ ఉన్నదే ఫరిశ్తాలు, వారికి ఎముకలు-మాంసము ఉండవు.
సూక్ష్మవతనములోనైతే ఈ అలంకరణలు మొదలైనవి ఉండకూడదు, కానీ చిత్రాలలో చూపించారు కావున
బాబా ఆ రూపాలనే సాక్షాత్కారము చేయించి, ఆ తర్వాత అర్థం వివరిస్తారు. ఉదాహరణకు
హనుమంతుని సాక్షాత్కారము చేయిస్తారు. ఇప్పుడు హనుమంతుని వంటి మనుష్యులెవ్వరూ ఉండరు.
భక్తి మార్గములో అనేక రకాల చిత్రాలను తయారుచేసారు, ఎవరికైతే ఆ రూపాలపై విశ్వాసము
కూర్చుంటుందో, వారికి ఈ విధముగా ఏమైనా చెప్తే డిస్టర్బ్ అవుతారు. దేవీలు
మొదలైనవారిని ఎంతగా పూజిస్తారు, మళ్ళీ ముంచేస్తారు. ఇదంతా భక్తి మార్గము. భక్తి
మార్గపు ఊబిలో గొంతు వరకు మునిగిపోయి ఉన్నారు, మరి బయటకు ఎలా తీయగలరు. బయటకు తీయడము
కష్టమైపోతుంది. కొంతమందైతే ఇతరులను బయటకు తీసేందుకు నిమిత్తముగా అయి స్వయం
మునిగిపోతారు. స్వయం గొంతు వరకు ఊబిలో చిక్కుకుంటారు అనగా కామ వికారములో పడిపోతారు.
ఇది అన్నింటికన్నా పెద్ద ఊబి. సత్యయుగములో ఈ విషయాలు ఉండవు. ఇప్పుడు మీరు సత్యమైన
తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు. ఇక అక్కడ సత్సంగాలు ఉండవు. సత్సంగాలను
ఇక్కడ భక్తి మార్గములో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందరూ ఈశ్వరుని రూపాలే అని భావిస్తారు.
ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - కలియుగములో ఉన్నవారందరూ
పాపాత్ములు, సత్యయుగములో పుణ్యాత్ములు ఉంటారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది.
మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. కలియుగము మరియు సత్యయుగము, రెండింటి గురించి తెలుసు.
ముఖ్యమైన విషయము ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్ళడము. క్షీర సాగరము మరియు విషయ సాగరము
గురించి గాయనము కూడా ఉంది కానీ వాటి అర్థమేమీ తెలియదు. ఇప్పుడు తండ్రి కూర్చుని
కర్మ-అకర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. కర్మలనైతే మనుష్యులు చేస్తూనే ఉంటారు,
అయితే కొన్ని కర్మలు అకర్మలు అవుతాయి, కొన్ని వికర్మలు అవుతాయి. రావణ రాజ్యములో
అన్ని కర్మలు వికర్మలు అవుతాయి, సత్యయుగములో వికర్మలు జరగవు ఎందుకంటే అక్కడ ఉన్నది
రామ రాజ్యము. వారు తండ్రి నుండి వరదానము పొంది ఉన్నారు. రావణుడు శాపము ఇస్తాడు. ఇది
సుఖ-దుఃఖాల ఆట కదా. దుఃఖములో అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సుఖములో ఎవ్వరూ స్మృతి
చేయరు. అక్కడ వికారాలు ఉండవు. అంటు కడుతున్నారని పిల్లలకు అర్థం చేయించారు. ఈ అంటు
కట్టే ఆచారము కూడా ఇప్పుడే మొదలయ్యింది. తండ్రి అంటు కట్టడం ప్రారంభించారు.
ఇంతకుముందు బ్రిటీష్ ప్రభుత్వము ఉన్నప్పుడు వృక్షాలకు అంటు కట్టారని వార్తాపత్రికలలో
ఎప్పుడూ వచ్చేది కాదు. ఇప్పుడు తండ్రి కూర్చుని దేవీ-దేవతా ధర్మము యొక్క అంటును
కడతారు, ఇతరులెవ్వరూ అంటు కట్టరు. అనేక ధర్మాలు ఉన్నాయి, దేవీ-దేవతా ధర్మము
కనుమరుగైపోయింది. ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిన కారణముగా ధర్మము పేరునే
తప్పుగా పెట్టేసారు. దేవతా ధర్మానికి చెందినవారెవరైతే ఉంటారో, వారు మళ్ళీ అదే
దేవీ-దేవతా ధర్మములోకి రావాలి. ప్రతి ఒక్కరూ తమ ధర్మములోకే వెళ్ళాలి. క్రిస్టియన్
ధర్మము నుండి బయటకు వచ్చి దేవీ-దేవతా ధర్మములోకి రాలేరు. విముక్తులుగా అయితే
అవ్వలేరు. అయితే, ఒకవేళ దేవీ-దేవతా ధర్మము నుండి ఎవరైనా కన్వర్ట్ అయి క్రిస్టియన్
ధర్మములోకి వెళ్ళి ఉంటే, వారు మళ్ళీ తిరిగి తమ దేవీ-దేవతా ధర్మములోకి వచ్చేస్తారు.
వారికి ఈ జ్ఞాన-యోగాలు చాలా బాగా అనిపిస్తాయి, దీనితో వారు మన ధర్మానికి చెందినవారని
ఋజువవుతుంది. ఇది అర్థం చేసుకునేందుకు మరియు అర్థం చేయించేందుకు చాలా విశాలబుద్ధి
కావాలి. ధారణ చేయాలి, పుస్తకాలు చదివి వినిపించకూడదు. ఎవరైనా గీతను వినిపించేటప్పుడు,
మనుష్యులు కూర్చుని వింటారు. కొంతమందైతే గీతా శ్లోకాలను పూర్తిగా కంఠస్థము చేస్తారు.
అయితే ప్రతి ఒక్కరూ కూర్చుని వీటికి తమ-తమ అర్థాలను తీస్తారు. శ్లోకాలన్నీ
సంస్కృతములో ఉన్నాయి. సాగరాన్ని సిరాగా మార్చి, అడవినంతా కలముగా తయారుచేసినా కూడా
జ్ఞానానికి అంతము ఉండదు అని ఇక్కడైతే గాయనము ఉంది. గీత అయితే చాలా చిన్నది. 18
అధ్యాయాలు ఉన్నాయి. చాలా చిన్నని గీతను తయారుచేసి మెడలో ధరిస్తారు. అందులో పదాలు
చాలా చిన్నవిగా ఉంటాయి. మెడలో ధరించే అలవాటు కూడా ఉంటుంది. ఎంత చిన్న లాకెట్
తయారవుతుంది. వాస్తవానికి ఇది సెకండ్ యొక్క విషయము. తండ్రికి చెందినవారిగా అయ్యారంటే
విశ్వానికి యజమానిగా అయినట్లు. బాబా, నేను మీకు ఒక్క రోజు బిడ్డను అని ఇలా కూడా
వ్రాయడం మొదలుపెడతారు. ఒక్క రోజులో నిశ్చయము ఏర్పడితే, వెంటనే లెటర్ వ్రాస్తారు.
బిడ్డగా అయ్యారంటే విశ్వానికి యజమానిగా అయినట్లు. ఇది కూడా కొంతమంది బుద్ధిలో
కష్టముగా కూర్చుంటుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. అక్కడ ఇంకే ఖండమూ
ఉండదు, వాటి నామ-రూపాలన్నీ మాయమైపోతాయి. ఒకప్పుడు ఈ ఖండాలన్నీ ఉండేవని కూడా అక్కడ
ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఉండి ఉంటే, తప్పకుండా వాటి చరిత్ర-భౌగోళికము ఉండాలి. అక్కడ
అవి ఉండనే ఉండవు. అందుకే మీరు విశ్వానికి యజమానులుగా అవ్వబోతున్నారు అని అంటారు.
తండ్రి అర్థం చేయించారు - నేను మీకు తండ్రిని కూడా, నేను జ్ఞానసాగరుడిని. ఇది చాలా
ఉన్నతోన్నతమైన జ్ఞానము, దీని ద్వారా మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. మన తండ్రి
సుప్రీమ్, వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, వారు సత్యమునే వినిపిస్తారు.
అనంతమైన శిక్షణను ఇస్తారు. వారు అనంతమైన గురువు, అందరికీ సద్గతిని ఇస్తారు. ఒకరిని
మహిమ చేసారంటే, ఆ మహిమ మరొకరికి ఉండదు. మళ్ళీ వారు తమ సమానముగా తయారుచేసినప్పుడే ఆ
మహిమ ఉంటుంది. కనుక మీరు కూడా పతిత-పావనులు. సత్ నామ్ (సత్యము యొక్క పేరు) అని
వ్రాస్తారు. ఈ మాతలు పతిత-పావని గంగలు. శివ శక్తులని అనండి లేక శివ వంశీయులని అనండి.
శివ వంశీ బ్రహ్మాకుమార-కుమారీలు. వాస్తవానికి అందరూ శివ వంశీయులే. ఇకపోతే, బ్రహ్మా
ద్వారా రచనను రచిస్తారు కనుక సంగమములోనే బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు. బ్రహ్మా
ద్వారా దత్తత తీసుకుంటారు. మొట్టమొదట అయితే బ్రహ్మాకుమార-కుమారీలు ఉంటారు. ఎవరైనా
అభ్యంతరము వ్యక్తపరిస్తే - వీరు ప్రజాపిత, వీరిలో ప్రవేశిస్తారని వారికి చెప్పండి.
తండ్రి అంటారు, అనేక జన్మల అంతిమములో నేను ప్రవేశిస్తాను. విష్ణు నాభి నుండి బ్రహ్మా
వెలువడినట్లుగా చూపిస్తారు. అచ్ఛా, మరి విష్ణువు ఎవరి నాభి నుండి వెలువడ్డారు?
అందులో బాణము గుర్తును వేసి - వీరివురూ ఒకరి నుండి ఒకరు వస్తారని చూపించవచ్చు.
బ్రహ్మా నుండి విష్ణు, విష్ణువు నుండి బ్రహ్మా. వీరు వారి నుండి, వారు వీరి నుండి
జన్మించారు. వీరికి ఒక్క సెకండు పడుతుంది, వారికి 5 వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి
అద్భుతమైన విషయాలు కదా. మీరు కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు,
లక్ష్మీ-నారాయణులు 84 జన్మలు తీసుకుంటారు, మళ్ళీ వారి అనేక జన్మల అంతిమములో నేను
ప్రవేశించి వారిని ఈ విధముగా తయారుచేస్తాను. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. మీరు
కూర్చుంటే వీరిని బ్రహ్మా అని ఎందుకు అంటారో అర్థం చేయిస్తాము. మొత్తము
ప్రపంచమంతటికీ చూపించేందుకు ఈ చిత్రాలను తయారుచేసారు. మనము అర్థం చేయించవచ్చు, అర్థం
చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోనివారిని, వీరు మన కులానికి చెందినవారు
కారు అని అంటారు. పాపం వారు అక్కడకు వస్తారు కానీ ప్రజలలోకి వస్తారు. మనకైతే అందరూ
పాపం అనే అనిపిస్తారు కదా - పేదవారిని పాపం అని అంటారు. పిల్లలు ఎన్ని పాయింట్లను
ధారణ చేయాలి. టాపిక్స్ పై భాషణ చేయవలసి ఉంటుంది. ఈ టాపిక్ ఏమైనా తక్కువా. ప్రజాపిత
బ్రహ్మా మరియు సరస్వతి, నాలుగు భుజాలను చూపిస్తారు. రెండు భుజాలు కుమార్తెవి. వారు
యుగళులు కారు కాదు. వాస్తవానికి యుగళులు అయితే కేవలం విష్ణువు మాత్రమే. బ్రహ్మాకు
కుమార్తె సరస్వతి. శంకరునికి కూడా యుగల్ లేరు, ఈ కారణముగా శివ-శంకరులని అంటారు.
ఇప్పుడు శంకరుడు ఏం చేస్తారు? వినాశనమైతే అటామిక్ బాంబుల ద్వారా జరుగుతుంది. తండ్రి
కూర్చుని పిల్లల మృత్యువును ఎలా చేయిస్తారు, అది పాపమవుతుంది. వాస్తవానికి తండ్రి
అయితే శ్రమ లేకుండా అందరినీ శాంతిధామానికి తిరిగి తీసుకువెళ్తారు. లెక్కాచారాలను
తీర్చుకుని అందరూ ఇంటికి వెళ్తారు ఎందుకంటే ఇది వినాశన సమయము. తండ్రి సేవ కోసమే
వస్తారు. వారు అందరికీ సద్గతిని ఇస్తారు. మీరు కూడా మొదట గతిలోకి, ఆ తర్వాత
సద్గతిలోకి వస్తారు. ఈ విషయాలు అర్థం చేసుకోవలసినవి. ఈ విషయాల గురించి కొద్దిగా కూడా
ఎవ్వరికీ తెలియదు. మీరు చూస్తూ ఉంటారు, కొందరైతే చాలా తల తినేస్తారు, అస్సలు అర్థం
చేసుకోరు. ఎవరైతే బాగా అర్థం చేసుకోగలరో, వారు వచ్చి అర్థం చేసుకుంటారు. ఒక్కొక్క
విషయము గురించి అర్థం చేసుకోవాలనుకుంటే సమయము కేటాయించండి అని వారికి చెప్పండి.
ఇక్కడైతే కేవలం ఆజ్ఞ ఉంది - అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఇది ఉన్నదే ముళ్ళ
అడవి, ఎందుకంటే ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు, దీనిని దుఃఖధామమని అంటారు.
సత్యయుగము సుఖధామము. దుఃఖధామము నుండి సుఖధామముగా ఎలా తయారవుతుంది అనేది మీకు అర్థం
చేయించారు. లక్ష్మీ-నారాయణులు సుఖధామములో ఉండేవారు, వారే మళ్ళీ 84 జన్మలను తీసుకుని
దుఃఖధామములోకి వస్తారు. ఈ బ్రహ్మా పేరును కూడా ఎలా పెట్టారు. తండ్రి అంటారు, నేను
వీరిలోకి ప్రవేశించి అనంతమైన సన్యాసము చేయిస్తాను. వెంటనే సన్యాసము చేయిస్తారు,
ఎందుకంటే తండ్రి సేవ చేయించాలి, వారే చేయిస్తారు. వీరి వెనుక చాలా మంది వెలువడ్డారు,
వారికి పేర్లు పెట్టారు. వాళ్ళేమో పిల్లి పిల్లలను చూపిస్తారు. అవన్నీ కట్టుకథలు.
పిల్లి పిల్లలు ఎలా ఉంటాయి. పిల్లి కూర్చుని జ్ఞానమేమీ వినదు. బాబా ఎన్నో యుక్తులను
తెలియజేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏ విషయమైనా అర్థం కాకపోతే, వారికి ఇలా చెప్పండి -
ఎప్పటివరకైతే భగవంతుడి గురించి అర్థం చేసుకోరో అప్పటివరకు ఇంకేమీ అర్థం చేసుకోలేరు.
ఒక్క విషయాన్ని నిశ్చయము చేసుకోండి మరియు వ్రాయండి, లేకపోతే మర్చిపోతారు. మాయ
మరపింపజేస్తుంది. ముఖ్యమైన విషయము, తండ్రి పరిచయము. మన తండ్రి సుప్రీమ్ తండ్రి,
సుప్రీమ్ టీచర్, వారు మొత్తము విశ్వమంతటి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు,
దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది అర్థం చేయించేందుకు సమయము కావాలి. ఎప్పటివరకైతే
తండ్రిని అర్థం చేసుకోరో, అప్పటివరకు ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. భగవంతుడి గురించి
అర్థం చేసుకోకపోతే ఇక వారు ఇచ్చే వారసత్వము గురించి ఏమీ అర్థం చేసుకోరు. ఇలా ఎందుకు,
శాస్త్రాలలోనైతే ఇలా చెప్పారు అని ఊరికే అలా డౌట్లు అడుగుతూ ఉంటారు. అందుకే మొదట
అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కర్మ, అకర్మ మరియు వికర్మల గుహ్య గతిని బుద్ధిలో ఉంచుకుని ఇప్పుడు ఎలాంటి
వికర్మలు చేయకూడదు, జ్ఞాన-యోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి.
2. సత్యమైన తండ్రి యొక్క సత్యమైన జ్ఞానమునిచ్చి మనుష్యులను దేవతలుగా తయారుచేసే
సేవ చేయాలి. వికారాల ఊబి నుండి అందరినీ బయటకు తీయాలి.
వరదానము:-
అలౌకిక నషా యొక్క అనుభూతి ద్వారా నిశ్చయము యొక్క ఋజువును
ఇచ్చే సదా విజయీ భవ
అలౌకిక ఆత్మిక నషా నిశ్చయము యొక్క దర్పణము. నిశ్చయానికి
గుర్తు నషా మరియు నషాకు గుర్తు సంతోషము. ఎవరైతే సదా సంతోషము మరియు నషాలో ఉంటారో,
వారి ఎదురుగా మాయ యొక్క ఏ ఆటలు నడవవు. నిశ్చింత చక్రవర్తి యొక్క రాజ్యములోకి మాయ
ప్రవేశించలేదు. అలౌకిక నషా సహజముగానే పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను
మరపింపజేస్తుంది, అందుకే సదా ఆత్మిక స్వరూపము యొక్క నషాలో, అలౌకిక జీవితము యొక్క
నషాలో, ఫరిశ్తా స్థితి యొక్క నషాలో మరియు భవిష్యత్తు యొక్క నషాలో ఉండండి, అప్పుడు
విజయులుగా అవుతారు.
స్లోగన్:-
మధురత
యొక్క గుణమే బ్రాహ్మణ జీవితము యొక్క మహానత, అందుకే మధురముగా అవ్వండి మరియు మధురముగా
తయారుచేయండి.
అవ్యక్త సూచనలు -
అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
ఏ విధముగా విదేహీ
అయిన బాప్ దాదాకు తన పిల్లలను విదేహీగా తయారుచెయ్యటానికి దేహాన్ని ఆధారముగా
తీసుకోవలసి ఉంటుందో, అదే విధముగా మీరందరూ జీవితములో ఉంటూ, దేహములో ఉంటూ, విదేహీ
ఆత్మను అనే స్థితిలో స్థితులై ఈ దేహము ద్వారా చేయించేవారిగా అయ్యి కర్మలు చేయించండి.
ఈ దేహము చేసేది, దేహీ అయిన మీరు చేయించేవారు. ఈ స్థితినే ‘‘విదేహీ స్థితి’’ అని
అంటారు. దీనినే ఫాలో ఫాదర్ చేయడము అని అంటారు. బాబాను ఫాలో చేసే స్థితి ఏమిటంటే -
సదా అశరీరి భవ, విదేహీ భవ, నిరాకారీ భవ!
| | | |