04-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది, స్మృతితోనే మీరు మధురముగా తయారవుతారు, ఈ స్మృతిలోనే మాయ యుద్ధము జరుగుతుంది’’

ప్రశ్న:-
ఈ డ్రామాలో ఏ రహస్యము చాలా ఆలోచించదగినది? అది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు.

జవాబు:-
మీకు తెలుసు - ఈ డ్రామాలో ఒకే పాత్ర రెండు సార్లు జరుగదు. మొత్తం ప్రపంచములో ఏ పాత్ర అయితే జరుగుతుందో అది ఒకదాని కంటే ఒకటి కొత్తది. సత్యయుగము నుండి మొదలుకుని ఇప్పటివరకూ ఏ విధముగా రోజులు మారిపోతాయి అని మీరు ఆలోచిస్తారు. మొత్తం పాత్ర అంతా మారిపోతుంది. ఆత్మలో 5000 సంవత్సరాల పాత్ర గురించిన రికార్డు నిండి ఉంది, అది ఎప్పుడూ మారదు. ఈ చిన్న విషయము పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోకి రాలేదు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని, పురుషోత్తమ వస్త్రాన్ని చూస్తున్నారా? ఇది పురుషోత్తమ సంగమయుగము కదా. మేము మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యయుగములో వీరి వంశావళిలోకి వెళ్తాము అని మీరు అనుభవం చేస్తారు, దానిని సుఖధామము అని అంటారు. అక్కడి కోసమే మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు. మీకు కూర్చుంటూ, కూర్చుంటూ ఈ ఆలోచనలు రావాలి. విద్యార్థులు చదువుకునేటప్పుడు - రేపు మేము ఇలా అవుతాము అని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు - మేము విష్ణు యొక్క వంశావళిలోకి వెళ్తాము అన్నది మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు అలౌకికముగా ఉంది. ఇంకే మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండకపోవచ్చు. ఇది సామాన్యమైన సత్సంగమేమీ కాదు. మీరు ఇక్కడ కూర్చున్నారు. సత్యమైన బాబా, ఎవరినైతే శివ అని అంటామో, మనము వారి సాంగత్యములో కూర్చున్నాము అని మీరు భావిస్తారు. శివబాబాయే రచయిత, వారికే ఈ రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. అది నిన్నటి విషయమే అన్నట్లుగా వినిపిస్తారు. మీరు ఇక్కడ కూర్చున్నారు, మేము రెజువనేట్ అవ్వడానికి అనగా ఈ శరీరాన్ని వదిలి దైవీ శరీరాన్ని తీసుకునేందుకు వచ్చాము అనైతే మీకు గుర్తుంటుంది కదా. ఆత్మ అంటుంది, ఇది మా తమోప్రధానమైన పాత శరీరము, దీనిని మార్చుకుని ఇటువంటి శరీరాన్ని తీసుకోవాలి అని. ఇది ఎంత సహజమైన లక్ష్యము-ఉద్దేశ్యము. చదివించే టీచర్ తప్పకుండా చదువుకునే విద్యార్థుల కన్నా చురుకైనవారిగా ఉంటారు కదా. వారు చదివిస్తారు, మంచి కర్మలను కూడా నేర్పిస్తారు. మమ్మల్ని ఉన్నతోన్నతుడైన భగవంతుడు చదివిస్తున్నారు కావున తప్పకుండా దేవీ-దేవతలుగానే తయారుచేస్తారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ చదువు కొత్త ప్రపంచం కోసమే ఉంది. ఇంకెవరికీ కొత్త ప్రపంచము గురించి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. దేవీ-దేవతలు కూడా నంబరువారుగా ఉంటారు కదా. అందరూ ఒకేలా అయితే ఉండలేరు కూడా, ఎందుకంటే ఇది రాజధాని కదా. మీకు ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఆత్మయైన మనము ఇప్పుడు పతితము నుండి పావనముగా అయ్యేందుకు పావనుడైన తండ్రిని స్మృతి చేస్తాము. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి స్వయముగా అంటారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా, సతోప్రధానముగా అయిపోతారు. మొత్తం ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. పిల్లలూ, నన్ను ఎంత సమయము స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు. స్మృతియాత్రలోనే మాయ యుద్ధము జరుగుతుంది. ఇది యుద్ధము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇది యాత్ర కాదు, ఇది యుద్ధము వంటిది, ఇందులోనే చాలా అప్రమత్తముగా ఉండాలి. జ్ఞానములో మాయ తుఫానులు మొదలైనవాటి విషయమేదీ లేదు. పిల్లలు అంటారు కూడా - బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము కానీ మాయ యొక్క ఒక్క తుఫాను కింద పడేస్తుంది. నంబరు వన్ తుఫాను దేహాభిమానము. ఆ తర్వాత కామము, క్రోధము, లోభము, మోహము యొక్క తుఫానులు. పిల్లలు అంటారు - బాబా, మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నిస్తాము, ఎటువంటి విఘ్నాలూ రాకూడదని ప్రయత్నిస్తాము, అయినా కూడా తుఫానులు వచ్చేస్తాయి. ఈ రోజు క్రోధము, ఇంకోసారి లోభము యొక్క తుఫానులు వస్తాయి. బాబా, ఈ రోజు మా అవస్థ చాలా బాగుంది, రోజంతటిలో ఎటువంటి తుఫాను రాలేదు. చాలా సంతోషముగా ఉంది. తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేసాము. స్నేహపు అశృవులు కూడా వస్తూ ఉన్నాయి అని అంటారు. తండ్రి స్మృతితోనే చాలా మధురముగా అయిపోతారు.

మేము మాయతో ఓడిపోతూ, ఓడిపోతూ ఎక్కడికి వచ్చి చేరుకున్నాము అన్నది కూడా అర్థం చేసుకుంటారు. ఇది ఇంకెవరూ అర్థం చేసుకోరు. మనుష్యులైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు లేక పరంపర అని అనేస్తారు. మీరు అంటారు, మేము మళ్ళీ ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి ఇస్తారు. విచిత్రుడైన తండ్రే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రుడు అని నిరాకారుడినే అంటారు. నిరాకారుడు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు. నేను ఏ విధంగా ఈ తనువులోకి వస్తాను అని - తండ్రే స్వయంగా అర్థం చేయిస్తారు. అయినా కానీ మనుష్యులు తికమకపడతారు. ఈ ఒక్క తనువులోకే వస్తారా ఏమిటి? అని అంటారు. కానీ డ్రామాలో ఈ తనువే నిమిత్తము అవుతుంది. కొద్దిగా కూడా మార్పు జరుగదు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఆత్మయే చదువుతుంది. ఆత్మయే నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది. ఆత్మ అత్యంత విలువైనది. ఆత్మ అవినాశీ, కేవలం శరీరమే అంతమవుతుంది. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్మ ద్వారా రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఆత్మయైన మనము. ఆత్మయైన మీరే నాలెడ్జ్ ఫుల్ తండ్రి ద్వారా మూలవతనము, సూక్ష్మవతనముల గురించి తెలుసుకున్నారు. మనము స్వయాన్ని ఆత్మగా భావించాలి అని మనుష్యులకు తెలియనే తెలియదు. మనుష్యులైతే స్వయాన్ని శరీరముగా భావిస్తూ తలక్రిందులుగా వేలాడుతున్నారు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము అన్న గాయనము ఉంది. పరమాత్మకు అందరికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రికి ఎంత మహిమ ఉంది. వారే దుఃఖహర్త, సుఖకర్త. దోమలు మొదలైనవాటినైతే - నీవే దుఃఖహర్త, సుఖకర్త, జ్ఞానసాగరుడు అని మహిమ చేయరు కదా. అది తండ్రి మహిమయే. పిల్లలైన మీరు మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు ఈ జ్ఞానము ఉండేది కాదు, బేబీ బుద్ధి కలవారిగా ఉండేవారు. పిల్లల్లో జ్ఞానము ఉండదు, అలాగే ఇంకే అవగుణాలు కూడా ఉండవు, అందుకే వారిని మహాత్మ అని అంటారు ఎందుకంటే వారు పవిత్రముగా ఉంటారు. ఎంత చిన్నపిల్లలుగా ఉంటే అంత నంబరు వన్ పుష్పములా ఉంటారు. పూర్తిగా కర్మాతీత అవస్థ ఉన్నట్లుగా ఉంటుంది. కర్మ-అకర్మ-వికర్మల గురించి ఏమీ తెలియదు, అందుకే వారు పుష్పాలవంటివారు. వారు అందరినీ ఆకర్షిస్తారు. ఏ విధముగా ఆ ఒక్క తండ్రి అందరినీ ఆకర్షిస్తారు. తండ్రి అందరినీ ఆకర్షించి సుగంధమయమైన పుష్పాలుగా తయారుచేసేందుకే వచ్చారు. కొందరైతే ముళ్ళుగానే ఉండిపోతారు. పంచ వికారాలకు వశీభూతులయ్యేవారిని ముళ్ళు అని అంటారు. దేహాభిమానపు ముల్లు నంబర్ వన్ ముల్లు, దాని ద్వారా ఇతర ముళ్ళ యొక్క జన్మ జరుగుతుంది. ముళ్ళ అడవి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అడవిలో రకరకాల ముళ్ళు ఉంటాయి కదా, అందుకే దీనిని దుఃఖధామము అని అంటారు. కొత్త ప్రపంచములో ముళ్ళు ఉండవు, అందుకే దానిని సుఖధామము అని అంటారు. శివబాబా పూలతోటను తయారుచేస్తారు, రావణుడు ముళ్ళ అడవిని తయారుచేస్తాడు, అందుకే రావణుడిని ముళ్ళకంపలతో కాలుస్తారు మరియు తండ్రిపై పుష్పాలు అర్పిస్తారు. ఈ విషయాల గురించి తండ్రికి మరియు పిల్లలకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు.

డ్రామాలో ఒకే పాత్ర రెండు సార్లు అభినయించబడదు అని పిల్లలైన మీకు తెలుసు. మొత్తము ప్రపంచములో ఏ పాత్ర అయితే జరుగుతూ ఉంటుందో అది ఒకదాని కంటే ఒకటి కొత్తగా జరుగుతుందని మీ బుద్ధిలో ఉంది. మీరు ఆలోచించండి -సత్యయుగము నుండి మొదలుకుని ఇప్పటివరకూ ఏ విధంగా రోజులు మారిపోతూ ఉంటాయి. మొత్తము పాత్ర అంతా మారిపోతుంది. 5000 సంవత్సరాల పాత్ర యొక్క రికార్డు ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడూ మారదు. ప్రతి ఆత్మలోనూ తన-తన పాత్ర నిండి ఉంది. ఈ చిన్న విషయము కూడా ఎవరి బుద్ధిలోకి రాదు. ఈ డ్రామా యొక్క భూత, భవిష్యత్, వర్తమానాల గురించి మీకు తెలుసు. ఇది స్కూల్ కదా. పవిత్రముగా అయి తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి చదివిస్తారు. తండ్రి వచ్చి ఈ విధంగా పతితుల నుండి పావనులుగా తయారుచేసే చదువును చదివిస్తారు అని మీరు ఎప్పుడైనా ఈ విషయాల గురించి ఆలోచించారా! ఈ చదువు ద్వారానే మనం విశ్వాధిపతులుగా అవుతాము. భక్తి మార్గపు పుస్తకాలే వేరు, వాటినెప్పుడూ చదువు అని అనరు. జ్ఞానము లేకుండా సద్గతి ఎలా జరుగుతుంది? సద్గతిని పొందేందుకు తండ్రి లేకుండా జ్ఞానము ఎక్కడి నుండి లభిస్తుంది. మీరు సద్గతిలో ఉన్నప్పుడు భక్తి చేస్తారా? లేదు. అక్కడ అంతా అపారమైన సుఖమే ఉంటుంది, మరి భక్తి దేని కొరకు చేయాలి? ఈ జ్ఞానము ఇప్పుడే మీకు లభిస్తుంది. మొత్తము జ్ఞానమంతా ఆత్మలో ఉంటుంది. ఆత్మకు ఎటువంటి ధర్మమూ ఉండదు. ఆత్మ శరీరాన్ని ధారణ చేసినప్పుడు, ఫలానా వారు ఈ, ఈ ధర్మానికి చెందినవారు అని అంటారు. ఆత్మ యొక్క ధర్మము ఏమిటి? ఒకటేమో ఆత్మ బిందువు వంటిది మరియు శాంతస్వరూపము, శాంతిధామ నివాసి.

పిల్లలందరికీ తండ్రిపై హక్కు ఉందని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. వారందరూ మళ్ళీ బయటకు వచ్చి వారి నిజ ధర్మములోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీ-దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో, ఆ ఆకులన్నీ తిరిగి తమ స్థానములోకి వచ్చేస్తాయి. మీరు మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ విషయాలలోనే అందరూ తికమకపడుతున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి. శ్రీకృష్ణుడైతే దేహధారి, వీరిని (బ్రహ్మాబాబాను) కూడా దాదా అని అంటారు. మీరంతా పరస్పరం సోదరులు కదా. ఆ తర్వాత పదవిపై ఆధారపడి ఉంటుంది. సోదరుని శరీరము ఎలా ఉంటుంది, సోదరి శరీరము ఎలా ఉంటుంది. ఆత్మ అయితే ఒక చిన్న సితారలా ఉంటుంది. ఇంతటి జ్ఞానమంతా ఒక్క చిన్న సితారలో ఉంది. ఈ సితార శరీరము లేకుండా మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఈ సితారకు మాట్లాడేందుకు ఎన్నో ఇంద్రియాలు లభించాయి. సితారలైన మీ ప్రపంచమే వేరు. ఆత్మ ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తుంది. శరీరము చిన్నగా, పెద్దగా అవుతుంది. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటివరకైతే శరీరములో ఉంటుందో అప్పటివరకూ స్మృతి చేస్తుంది. ఇంట్లో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? లేదు. మేము ఎక్కడ ఉన్నాము అన్నదేమీ అక్కడ తెలియదు! ఆత్మ మరియు పరమాత్మ, ఇరువురూ ఎప్పుడైతే శరీరములో ఉంటారో, అప్పుడే ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మిలనము అని అనడం జరుగుతుంది. ఆత్మ మరియు పరమాత్మ ఎంతోకాలము వేరుగా ఉన్నారు... అన్న గాయనము కూడా ఉంది. ఎంతకాలము వేరుగా ఉన్నారు? ఎంత సమయము వేరుగా ఉన్నారు అన్నది మీకు గుర్తుకువస్తుందా? క్షణక్షణమూ గతిస్తూ అలా 5000 సంవత్సరాలు గతించిపోయాయి. మళ్ళీ మొదటి నంబరు నుండి ప్రారంభించాలి. ఏక్యురేట్ లెక్క ఉంది. ఫలానావారు ఎప్పుడు జన్మించారు? అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏక్యురేట్ గా చెప్పగలరు. శ్రీకృష్ణుడే మొదటి నంబరులో జన్మ తీసుకుంటారు. శివుని విషయములోనైతే నిమిషాలు, క్షణాలు ఏమీ చెప్పలేము. శ్రీకృష్ణుని విషయములో తిథి, తారీఖు, నిమిషాలు, క్షణాలు అన్నీ తీయవచ్చు. మనుష్యుల గడియారములో తేడా రావచ్చు కానీ శివబాబా అవతరణలో ఏమాత్రమూ తేడా రాదు. వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియను కూడా తెలియదు. సాక్షాత్కారము జరిగినప్పుడు వారు వచ్చారు అని కూడా కాదు. అలా కాదు. సుమారుగా చెప్పవచ్చు. నిముషములు, క్షణముల లెక్కను మాత్రం తెలియజేయలేరు. వారి అవతరణ కూడా అలౌకికమైనదే. వారు అనంతమైన రాత్రి సమయములోనే వస్తారు. మిగిలిన అవతరణలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో వాటి గురించి అయితే తెలుస్తుంది. ఆత్మ శరీరములోకి ప్రవేశిస్తుంది, చిన్న వస్త్రాన్ని ధరిస్తుంది, మళ్ళీ మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది. శరీరముతోపాటు ఆత్మ బయటకు వస్తుంది. ఈ విషయాలన్నింటి గురించి విచార సాగర మంథనము చేసి మళ్ళీ ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. ఎంతమంది మనుష్యులు ఉన్నారు, ఒకరు మరొకరితో కలవరు. ఇది ఎంత పెద్ద రంగస్థలము. ఇదొక పెద్ద హాలు వంటిది, ఇందులో అనంతమైన నాటకము జరుగుతూ ఉంది.

పిల్లలైన మీరు ఇక్కడకు నరుని నుండి నారాయణిగా అయ్యేందుకు వస్తారు. తండ్రి ఏ కొత్త సృష్టినైతే రచిస్తారో అందులో ఉన్నత పదవిని తీసుకునేందుకు వస్తారు. ఇకపోతే ఈ పాత ప్రపంచమేదైతే ఉందో అదైతే వినాశనమవ్వనున్నది. బాబా ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. బాబా మళ్ళీ పాలన కూడా చెయ్యాలి. తప్పకుండా ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదులుతారో, అప్పుడు మళ్ళీ సత్యయుగములో కొత్త శరీరాన్ని తీసుకుని పాలన చేస్తారు. దానికంటే ముందు ఈ పాత ప్రపంచము యొక్క వినాశనము కూడా అవ్వాలి. ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. చివరిలో ఈ భారత్ యే ఉంటుంది, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. భారత్ లో కూడా కొంతే మిగులుతుంది. వినాశనము తరువాత శిక్షలు అనుభవించకుండా ఉండాలని ఇప్పుడు మీరు కృషి చేస్తున్నారు. ఒకవేళ వికర్మలు వినాశనమవ్వకపోతే శిక్షలు కూడా అనుభవిస్తారు మరియు పదవి కూడా లభించదు. మీరు ఎవరి వద్దకు వెళ్తారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే మీరు చెప్పండి - బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్న శివబాబా వద్దకు మేము వెళ్తున్నాము అని. ఈ బ్రహ్మా శివుడేమీ కాదు. ఎంతగా తండ్రిని తెలుసుకుంటారో అంతగా తండ్రితో ప్రేమ కూడా ఉంటుంది. బాబా అంటారు - పిల్లలూ, మీరు ఇతరులెవ్వరినీ ప్రేమించకండి, ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి. ఏ విధంగా ప్రియుడు, ప్రేయసి ఉంటారు కదా. ఇది కూడా అటువంటిదే. 108 మంది సత్యమైన ప్రేయసులుగా అవుతారు, అందులో కూడా 8 మంది సత్యాతి-సత్యముగా అవుతారు. 8 తో కూడిన మాలయే ఉంటుంది కదా. 9 రత్నాలు మహిమ చేయబడ్డారు. 8 మణులు, 9వవారు బాబా. ముఖ్యమైనవారు 8 మంది దేవతలు, ఆ తర్వాత త్రేతా అంతిమము కల్లా 16,108 మంది రాకుమారులు, రాకుమారీల కుటుంబము తయారవుతుంది. బాబా అయితే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు. మేమైతే సృష్టికి యజమానులుగా అవుతాము అని పిల్లలైన మీకు నషా ఉంది. బాబాతో అటువంటి వ్యాపారాన్ని చెయ్యాలి. ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు అని చెప్తారు. ఇటువంటి వ్యాపారులు ఇంకెవ్వరూ లేరు. కావున పిల్లలూ - మేము బాబా వద్దకు వెళ్తాము అన్న ఉల్లాసములో ఉండండి. పైనున్నవారు బాబా. ప్రపంచానికి ఇది తెలియదు, వారైతే అంతిమములో వస్తారు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇది అదే కలియుగ అంతిమము, అదే గీత, మహాభారత సమయము, అదే మిసైల్స్ ను కనుగొనే యాదవులు, అదే కౌరవ రాజ్యము మరియు ఆ పాండవులైన మీరే నిలబడి ఉన్నారు.

పిల్లలైన మీరు ఇప్పుడు ఇంటిలో కూర్చునే మీ సంపాదన చేసుకుంటున్నారు. భగవంతుడు ఇంట్లో కూర్చుని ఉండగానే వచ్చారు, అందుకే బాబా అంటారు - మీ సంపాదనను చేసుకోండి. ఈ వజ్రతుల్యమైన జీవితమే విలువైనది అని గానం చేయబడింది. ఇప్పుడు దీనిని గవ్వల వెనుక పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఈ మొత్తము ప్రపంచాన్ని రామ రాజ్యముగా తయారుచేస్తారు. మీకు శివుడి నుండి శక్తి లభిస్తూ ఉంది. ఇకపోతే ఈ రోజుల్లో చాలామందికి అకాల మృత్యువు కూడా జరుగుతుంది. బాబా బుద్ధి తాళాన్ని తెరుస్తారు మరియు మాయ బుద్ధి తాళాన్ని మూసేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకే జ్ఞాన కలశము లభించి ఉంది. అబలలకు బలాన్ని ఇచ్చేవారు వారు. ఇదే జ్ఞానామృతము. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతము అని అనరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి ఆకర్షణలో ఉంటూ సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేస్తూ దేహాభిమానమనే ముళ్ళను కాల్చివేయాలి.

2. ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి, గవ్వల వెనుక పడి వీటిని పోగొట్టుకోకూడదు. ఒక్క తండ్రిని సత్యముగా ప్రేమించాలి, ఒక్కరి సాంగత్యములో ఉండాలి.

వరదానము:-

బ్రాహ్మణ జీవితములో సదా సంతోషమనే ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే అదృష్టవంతులుగా కండి

ఈ ప్రపంచములో బ్రాహ్మణులైన మీ వంటి అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు ఎందుకంటే ఈ జీవితములోనే మీ అందరికీ బాప్ దాదా యొక్క హృదయ సింహాసనము లభిస్తుంది. మీరు సదా సంతోషమనే ఔషధాన్ని తింటారు మరియు సంతోషాన్ని పంచుతారు. ఈ సమయములో మీరు నిశ్చింత చక్రవర్తులు. ఇటువంటి నిశ్చింత జీవితము మొత్తము కల్పములో మరే ఇతర యుగములోనూ లేదు. సత్యయుగములో నిశ్చింతగా ఉంటారు కానీ అక్కడ జ్ఞానము ఉండదు, ఇప్పుడు మీకు జ్ఞానము ఉంది, అందుకే నా వంటి అదృష్టవంతులు మరెవ్వరూ లేరు అన్న మాట మనస్ఫూర్వకముగా వెలువడుతుంది.

స్లోగన్:-

సంగమయుగపు స్వరాజ్య అధికారులే భవిష్య విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు.