ఓంశాంతి
ఆత్మిక పిల్లలు ఇక్కడ కూడా కూర్చున్నారు మరియు అన్ని సెంటర్లలో కూడా ఉన్నారు.
ఇప్పుడు ఆత్మిక తండ్రి వచ్చి ఉన్నారని, వారు మనల్ని ఈ పాత ఛీ-ఛీ పతిత ప్రపంచము నుండి
తిరిగి ఇంటికి తీసుకువెళ్తారని పిల్లలందరికీ తెలుసు. తండ్రి వచ్చిందే పావనముగా
తయారుచేయడానికి మరియు వారు ఆత్మలతోనే మాట్లాడుతారు. ఆత్మయే చెవుల ద్వారా వింటుంది.
తండ్రికి తన శరీరమంటూ ఏదీ లేదు కావుననే తండ్రి అంటారు - నేను ఈ శరీరాన్ని ఆధారముగా
తీసుకుని మీకు నా పరిచయాన్ని ఇస్తాను. నేను ఈ సాధారణ తనువులోకి వచ్చి పిల్లలైన మీకు
పావనముగా తయారయ్యేందుకు యుక్తిని తెలియజేస్తాను. ఇలా ప్రతి కల్పము వచ్చి మీకు ఈ
యుక్తిని తెలియజేస్తాను. ఈ రావణ రాజ్యములో మీరు ఎంత దుఃఖితులుగా తయారయ్యారు. మీరు
రావణ రాజ్యములో, శోకవాటికలో ఉన్నారు. కలియుగాన్ని దుఃఖధామము అని అంటారు. సుఖధామము
కృష్ణపురి, స్వర్గము. అది ఇప్పుడు లేదు. మనల్ని చదివించేందుకు ఇప్పుడు బాబా వచ్చి
ఉన్నారని పిల్లలకు బాగా తెలుసు.
తండ్రి అంటారు, మీ ఇంట్లో కూడా పాఠశాలను తయారుచేయవచ్చు. పావనముగా తయారవ్వాలి
మరియు తయారుచేయాలి. మీరు పావనముగా తయారైనట్లయితే ప్రపంచము కూడా పావనముగా తయారవుతుంది.
ఇప్పుడు ఇది భ్రష్టాచారీ పతిత ప్రపంచము. ఇప్పుడున్నది రావణుడి రాజధాని. ఈ విషయాలను
ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. తండ్రి
కేవలం ఇదే చెప్తారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి
చేయండి, ఇతరులకు కూడా ఇదే విషయాన్ని అర్థం చేయించండి - తండ్రి వచ్చి ఉన్నారు, వారు
నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు అని చెప్తున్నారు. ఏ విధమైన
ఆసురీ కర్మలు చేయకండి. మాయ మీ ద్వారా ఏ ఛీ-ఛీ కర్మలైతే చేయిస్తుందో, ఆ కర్మలు
తప్పకుండా వికర్మలుగానే అవుతాయి. మొట్టమొదటగా ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటారో,
అది కూడా మాయనే చెప్పించింది. మాయ మీ చేత ప్రతి విషయములోనూ వికర్మలే చేయిస్తుంది.
కర్మ-అకర్మ-వికర్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. శ్రీమతముపై అర్ధకల్పము మీరు
సుఖాన్ని అనుభవిస్తారు, అర్ధకల్పము మళ్ళీ రావణుడి మతముపై దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ
రావణ రాజ్యములో మీరు ఏదైతే భక్తి చేస్తారో, దాని ద్వారా కిందికే దిగుతూ వచ్చారు.
మీకు ఇంతకుముందు ఈ విషయాల గురించి తెలిసేది కాదు, పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా
ఉండేవారు. రాతిబుద్ధి మరియు పారసబుద్ధి అని అంటూ ఉంటారు కదా. భక్తి మార్గములో - ఓ
ఈశ్వరా, ఇతను గొడవలు చేయడం ఆపుచేసేలా ఇతనికి మంచి బుద్ధిని ప్రసాదించండి అని అంటారు
కూడా కదా. బాబా చాలా మంచి బుద్ధిని ఇప్పుడు ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బాబా
అంటారు - మధురమైన పిల్లలూ, పతితముగా అయిపోయిన మీ ఆత్మను స్మృతియాత్ర ద్వారా పావనముగా
తయారుచేసుకోవాలి. తిరగండి, విహరించండి, తండ్రి స్మృతిలో మీరు ఎంత దూరము కాలినడకన
వెళ్ళినా మీరు శరీరాన్ని కూడా మర్చిపోతారు. సంతోషము వంటి ఔషధము లేదు అని అంటూ ఉంటారు
కదా. మనుష్యులు ధనాన్ని సంపాదించేందుకు ఎంత దూరదూరాలకు సంతోషముగా వెళ్తూ ఉంటారు.
ఇక్కడ మీరు ఎంత ధనవంతులుగా, సంపత్తివంతులుగా అవుతారు. తండ్రి అంటారు, నేను
కల్ప-కల్పమూ వచ్చి ఆత్మలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఈ సమయములో అందరూ పతితముగా
ఉన్నారు, అందుకే, పావనముగా తయారుచేయడానికి రండి అని పిలుస్తూ ఉంటారు. ఆత్మయే
తండ్రిని పిలుస్తుంది. రావణ రాజ్యములో, శోకవాటికలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. రావణ
రాజ్యము మొత్తము ప్రపంచములో ఉంది. ఈ సమయములో ఉన్నదే తమోప్రధాన సృష్టి. సతోప్రధానమైన
దేవతల చిత్రాలు ఎదురుగా ఉన్నాయి. మహిమ కూడా వారికే ఉంది. శాంతిధామానికి, సుఖధామానికి
వెళ్ళేందుకు మనుష్యులు ఎంత కష్టపడుతూ ఉంటారు. భగవంతుడు ఏ విధంగా వచ్చి భక్తి ఫలాన్ని
మనకు ఇస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మనకు భగవంతుడి నుండి ఫలము లభిస్తుంది అని మీరు
ఇప్పుడు భావిస్తారు. భక్తికి రెండు ఫలాలు ఉన్నాయి - 1. ముక్తి, 2. జీవన్ముక్తి. ఇవి
అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఎవరైతే ప్రారంభము నుండి మొదలుకుని చాలా
భక్తి చేసి ఉంటారో, వారు జ్ఞానాన్ని బాగా తీసుకుంటారు మరియు ఫలాన్ని కూడా బాగా
పొందుతారు. భక్తి తక్కువగా చేసి ఉన్నట్లయితే జ్ఞానము కూడా తక్కువగా తీసుకుంటారు,
ఫలము కూడా తక్కువగా పొందుతారు. లెక్క ఉంది కదా. నంబరువారు పదవులు ఉన్నాయి కదా. నా
వారిగా అయి వికారాలలోకి వెళ్ళినట్లయితే ఇక నన్ను వదిలేసినట్లే. ఒక్కసారిగా కిందకు
వెళ్ళి పడతారు. కొందరు కిందపడి మళ్ళీ లేచి నిలబడతారు. కొందరు పూర్తిగా మురికిలో
పడిపోతారు, వారి బుద్ధి ఇక ఎన్నటికీ బాగుపడదు. కొందరికి లోలోపల మనసు తింటూ ఉంటుంది,
దుఃఖము కలుగుతూ ఉంటుంది - నేను భగవంతుడికి ప్రతిజ్ఞ చేసి, మళ్ళీ వారిని మోసము చేశాను,
వికారాలలోకి పడిపోయాను. తండ్రి చేతిని వదిలి మాయకు చెందినవారిగా అయిపోయారు.
అటువంటివారు వాయుమండలాన్ని కూడా పాడు చేస్తారు, శ్రాపితులవుతారు. తండ్రితోపాటుగా
ధర్మరాజు కూడా ఉన్నారు కదా. ఆ సమయములో వారేమి చేస్తున్నారో వారికే తెలియదు, ఆ
తర్వాత పశ్చాత్తాపము కలుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఎవరినైనా హత్య
చేస్తే జైలుకి వెళ్ళవలసి వస్తుంది, అప్పుడు పశ్చాత్తాపము కలుగుతుంది, అనవసరముగా
అతడిని చంపానే అని. క్రోధములోకి వచ్చి ఎంతగానో కొడుతూ ఉంటారు కూడా. ఎన్నో సమాచారాలు
వార్తాపత్రికలలో వస్తూ ఉంటాయి. మీరైతే వార్తాపత్రికలు చదవరు. ప్రపంచములో ఏమేమి
జరుగుతుందో మీకు తెలియదు. రోజురోజుకు పరిస్థితులు పాడైపోతూ ఉంటాయి. మెట్ల కిందకు
దిగవలసిందే. మీకు ఈ డ్రామా రహస్యము తెలుసు. మేము బాబానే స్మృతి చేయాలి అన్న విషయము
బుద్ధిలో ఉంది. రిజిస్టరు పాడయ్యే విధంగా ఎటువంటి ఛీ-ఛీ కర్మలు చేయకూడదు. తండ్రి
అంటారు, నేను మీకు టీచరును కదా. టీచరు వద్ద విద్యార్థుల చదువు మరియు నడవడిక యొక్క
రికార్డు ఉంటుంది కదా. కొందరి నడవడిక చాలా బాగుంటుంది, కొందరిది తక్కువగా ఉంటుంది,
కొందరిది పూర్తిగా చెడ్డగా ఉంటుంది. నంబరువారుగా ఉంటారు కదా. ఈ సుప్రీమ్ తండ్రి కూడా
ఎంత ఉన్నతముగా చదివిస్తున్నారు. వారికి కూడా ప్రతి ఒక్కరి నడత-నడవడిక గురించి తెలుసు.
నాలో ఈ అలవాట్లు ఉన్నాయి, ఈ కారణము చేత నేను ఫెయిల్ అయిపోతాను అని మీరు స్వయం కూడా
తెలుసుకోగలరు. బాబా ప్రతి విషయాన్ని స్పష్టము చేసి అర్థం చేయిస్తారు. పూర్తిగా
చదవకపోతే, ఎవరికైనా దుఃఖము ఇస్తే దుఃఖితులై మరణిస్తారు. పదవి కూడా భ్రష్టమవుతుంది.
శిక్షలు కూడా ఎన్నో పొందుతారు.
మధురమైన పిల్లలూ, స్వయం మరియు ఇతరుల యొక్క భాగ్యాన్ని తయారుచేయాలంటే దయా హృదయ
సంస్కారాన్ని ధారణ చేయండి. ఏ విధంగా తండ్రి దయార్ద్ర హృదయులైన కారణముగా టీచరుగా అయి
మిమ్మల్ని చదివిస్తున్నారు. కొందరు పిల్లలు బాగా చదువుతారు మరియు చదివిస్తారు,
ఇందులో దయార్ద్ర హృదయులుగా అవ్వవలసి ఉంటుంది. టీచరు దయార్ద్ర హృదయులు కదా. మీరు ఏ
విధంగా ఉన్నతమైన స్థానాన్ని పొందవచ్చు అంటూ వారు సంపాదన కొరకు మార్గము తెలియజేస్తారు.
ఆ చదువులోనైతే అనేక రకాల టీచర్లు ఉంటారు. ఇక్కడ ఒకే టీచరు ఉన్నారు. చదువు కూడా
ఒక్కటే - మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువు. ఇందులో ముఖ్యమైనది పవిత్రతా
విషయము. పవిత్రతనే అందరూ కోరుకుంటారు. తండ్రి అయితే మార్గాన్ని తెలియజేస్తున్నారు
కానీ ఎవరి భాగ్యములోనైతే లేనే లేదో వారు ఇక పురుషార్థము ఏం చేయగలరు! ఉన్నతమైన
మార్కులు పొందేదే లేదన్నప్పుడు ఇక టీచరు కూడా వారి వెనుక ఏం పురుషార్థము చేస్తారు.
వీరు అనంతమైన టీచరు కదా. తండ్రి అంటారు, మీకు ఇంకెవ్వరూ సృష్టి ఆదిమధ్యాంతాల చరిత్ర
మరియు భూగోళములను అర్థం చేయించలేరు. మీకు అనంతమైన ప్రతి విషయమూ అర్థం చేయించడము
జరుగుతుంది. మీది అనంతమైన వైరాగ్యము. ఎప్పుడైతే పతిత ప్రపంచ వినాశనము, పావన ప్రపంచ
స్థాపన జరగవలసి ఉందో, అప్పుడు మీకు ఈ విషయాలను కూడా నేర్పించడము జరుగుతుంది.
సన్యాసులైతే నివృత్తి మార్గానికి చెందినవారు, వాస్తవానికి వారు అడవులలో ఉండాలి.
ప్రారంభములో ఋషులు, మునులు మొదలైనవారంతా అడవులలో ఉండేవారు, వారిలో సతోప్రధానమైన
శక్తి ఉండేది కావున మనుష్యులను ఆకర్షించేవారు. ఎక్కడెక్కడో ఉన్న వారి కుటీరాల వరకు
కూడా వెళ్ళి వారికి భోజనాన్ని అందించేవారు. సన్యాసులకు ఎప్పుడూ మందిరాలను నిర్మించరు.
మందిరాలు ఎల్లప్పుడూ దేవతలకు నిర్మిస్తారు. మీరేమీ భక్తి చేయరు. మీరు యోగములో ఉంటారు.
వారి జ్ఞానమే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయడము. కేవలము బ్రహ్మములో లీనమైపోవాలి అని
కోరుకుంటారు. కానీ తండ్రి తప్ప ఇంకెవ్వరూ అక్కడికి తీసుకువెళ్ళలేరు. తండ్రి వచ్చేదే
సంగమయుగములో, వచ్చి దేవి-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ తిరిగి
వెళ్ళిపోతారు ఎందుకంటే మీ కొరకు కొత్త ప్రపంచము కావాలి కదా. పాత ప్రపంచానికి
చెందినవారెవరూ ఉండకూడదు. మీరు మొత్తము విశ్వానికి యజమానులుగా అవుతారు. మన రాజ్యము
ఉన్నప్పుడు మొత్తము విశ్వముపై మనము మాత్రమే ఉండేవారమని మీకు తెలుసు, అప్పుడు ఇతర
ఖండాలేవీ లేవు. అక్కడ భూమి ఎంతగానో ఉంటుంది. ఇక్కడ భూమి ఎంతో ఉంది, మళ్ళీ
సముద్రాన్ని ఎండబెట్టి భూమిని తయారుచేస్తూ ఉంటారు ఎందుకంటే మనుష్యుల సంఖ్య పెరుగుతూ
ఉంటుంది. ఈ విధంగా భూమిని తయారుచేయడము మొదలైనవి విదేశీయుల నుండి నేర్చుకున్నారు.
బొంబాయి పూర్వము ఎలా ఉండేది, అది మళ్ళీ చివరిలో ఉండదు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా.
భూకంపము వస్తే లేక కుండపోతగా వర్షము కురిస్తే అప్పుడు ఏమి చేస్తారు! బయటికైతే రాలేరు.
ప్రకృతి వైపరీత్యాలైతే చాలా వస్తాయి. లేకపోతే ఇంత వినాశనము ఎలా జరుగుతుంది.
సత్యయుగములోనైతే కేవలము కొద్దిమంది భారతవాసులు మాత్రమే ఉంటారు. ఈ రోజు ఎలా ఉంది,
రేపు ఎలా ఉంటుంది. ఇవన్నీ పిల్లలైన మీకే తెలుసు. ఈ జ్ఞానాన్ని ఇంకెవరూ ఇవ్వలేరు.
తండ్రి అంటారు, మీరు పతితముగా అయ్యారు, అందుకే - మీరు వచ్చి పావనముగా తయారుచేయండి
అని ఇప్పుడు నన్ను పిలుస్తారు కావున తప్పకుండా వస్తాను, అప్పుడే కదా పావన ప్రపంచము
స్థాపన అవుతుంది. బాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. యుక్తిని ఎంత బాగా
తెలియజేస్తున్నారు. భగవానువాచ - మన్మనాభవ. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను తెంచి
నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. జ్ఞానమైతే చాలా సహజమైనది. దీనిని
చిన్న పిల్లలు కూడా వెంటనే గుర్తు చేసుకోగలుగుతారు. కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేయడము, ఇది అసంభవము. పెద్దవాళ్ళ బుద్ధిలోనే ఈ విషయము కూర్చోదు
అన్నప్పుడు మరి చిన్న పిల్లలు ఎలా స్మృతి చేయగలరు? శివబాబా, శివబాబా అని అంటూ ఉంటారు,
కానీ వారి బుద్ధి ఇంకా వికసించలేదు కదా. మనమూ బిందువే, బాబా కూడా బిందువే, ఇది
స్మృతిలోకి రావడము కష్టముగా అనిపిస్తుంది. ఇదే యథార్థ రీతిగా స్మృతి చేయడము. ఇది
స్థూలమైన విషయమైతే కాదు. తండ్రి అంటారు, యథార్థ రూపములో నేను ఒక బిందువును, అందుకే
నేను ఎవరినో, ఎలా ఉన్నానో అదే విధంగా స్మృతి చేయడము - ఇది చాలా శ్రమతో కూడినది.
వారేమో పరమాత్మ బ్రహ్మ తత్వమని అంటారు, కానీ మనము వారు ఒక బిందువు అని అంటాము.
రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. ఆత్మలైన మనము ఉండే ఆ బ్రహ్మతత్వాన్ని
పరమాత్మ అని అనేస్తారు. బుద్ధిలో ఇది ఉండాలి - నేను ఆత్మను, బాబా బిడ్డను, ఈ చెవుల
ద్వారా వింటాను, బాబా ఈ నోటి ద్వారా - నేను పరమాత్మను, ఈ ప్రపంచానికి దూరముగా ఉంటాను
అని వినిపిస్తారు. మీరు కూడా ఈ ప్రపంచానికి దూరముగా ఉండేవారు కాకపోతే మీరు
జనన-మరణాలలోకి వస్తారు, నేను రాను. మీరు ఇప్పుడు మీ 84 జన్మలను కూడా అర్థం
చేసుకున్నారు. అలాగే తండ్రి పాత్రను కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మ ఏమీ పెద్దగా లేక
చిన్నగా అవ్వదు. ఇకపోతే ఇనుపయుగములోకి రావడముతో మలినమైపోతుంది. ఇంత చిన్న ఆత్మలో
మొత్తము జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా ఎంతో చిన్నగా ఉంటారు కదా. కానీ వారిని పరమ
ఆత్మ అని అంటారు. వారు జ్ఞానసాగరుడు, మీకు వచ్చి అర్థం చేయిస్తారు. ఈ సమయములో మీరు
ఏదైతే చదువుతున్నారో, దానిని కల్పపూర్వము కూడా చదివారు, దీని ద్వారా మీరు దేవతలుగా
తయారయ్యారు. మీలో అందరికంటే దుర్భాగ్యము ఎవరిదంటే - ఎవరైతే పతితులుగా అయి తమ
బుద్ధిని మురికిగా చేసుకుంటారో వారిది, ఎందుకంటే వారిలో ధారణ అవ్వదు. మనసు లోలోపల
తింటూ ఉంటుంది. వారు పవిత్రముగా అవ్వండి అని ఇతరులకు చెప్పలేరు. వారు లోలోపల
ఏమనుకుంటారంటే - పావనముగా అవుతూ, అవుతూ నేను ఓడిపోయాను, చేసుకున్న సంపాదనంతా నాశనము
అయిపోయింది. ఇక ఆ తర్వాత చాలా సమయము పడుతుంది. ఒకే దెబ్బ గట్టిగా గాయపరుస్తుంది,
దానితో రిజిస్టరు పాడైపోతుంది. తండ్రి అంటారు, నీవు మాయతో ఓడిపోయావు, నీ భాగ్యము
చాలా చెడ్డగా ఉంది. మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవ్వాలి. జగత్ జీతులు అని
మహారాజులను, మహారాణులనే అంటారు. ప్రజలను అనరు. ఇప్పుడు దైవీ స్వర్గ స్థాపన
జరుగుతోంది. ఎవరైతో తమ కోసం తాము చేసుకుంటారో, వారు పొందుతారు. ఎంతగా పావనముగా అయి
ఇతరులను తయారుచేస్తే అంత. బాగా దానము చేసేవారికి ఫలము కూడా లభిస్తుంది కదా. దానము
చేసేవారికి పేరు కూడా వస్తుంది. మరుసటి జన్మలో అల్పకాలికమైన సుఖము పొందుతారు. ఇక్కడ
ఇది 21 జన్మల విషయము. పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఎవరైతే ఒకప్పుడు
పావనముగా అయ్యారో వారే మళ్ళీ అవుతారు. నడుస్తూ, నడుస్తూ మాయ చెంపదెబ్బ వేసి
ఒక్కసారిగా కింద పడేస్తుంది. మాయ కూడా తక్కువ శక్తివంతమైనదేమీ కాదు. ఎనిమిది, పది
సంవత్సరాలు పవిత్రముగా ఉన్నారు, పవిత్రతపై గొడవలు జరిగాయి, ఇతరులను కూడా పడిపోకుండా
రక్షించారు, కానీ స్వయమే కింద పడిపోతారు. తలరాత అనే అంటారు కదా. తండ్రికి
చెందినవారిగా అయి మళ్ళీ మాయకు చెందినవారిగా అయిపోతే, వారు శత్రువులైనట్లే కదా. ఖుదా
దోస్త్ (భగవంతుడు స్నేహితుడు) అనే ఒక కథ కూడా ఉంది కదా. తండ్రి వచ్చి పిల్లలకు
ప్రేమను ఇస్తారు, సాక్షాత్కారము చేయిస్తారు, ఇక్కడ భక్తి చేయకుండా కూడా
సాక్షాత్కారము జరుగుతుంది, మరి భగవంతుడు తన మిత్రునిగా చేసుకున్నట్లే కదా. ఎన్ని
సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి, వాటిని ఇంద్రజాలముగా భావించి గొడవ చేసిన కారణముగా
సాక్షాత్కారాలను ఆపి వేసారు, మళ్ళీ చివరిలో మీరు చాలా సాక్షాత్కారాలను పొందుతూ
ఉంటారు. ప్రారంభములో ఎంత మజా ఉండేది. కానీ వాటిని చూస్తూ, చూస్తూ కూడా ఎంతమంది వదిలి
వెళ్ళిపోయారు. భట్టీలో నుండి కొన్ని ఇటుకలు బాగా కాలి బయటకు వచ్చాయి, కొన్ని
కాలకుండానే ఉండిపోయాయి. కొన్ని అయితే పూర్తిగా విరిగిపోయాయి. ఎంతమంది వెళ్ళిపోయారు.
ఇప్పుడు వాళ్ళు లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా అయిపోయారు. మేమైతే స్వర్గములో
కూర్చున్నాము అని భావిస్తున్నారు. ఇక్కడ స్వర్గము ఎలా ఉంటుంది. స్వర్గము ఉండేదే
కొత్త ప్రపంచములో. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.