05-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రికి జ్ఞాన స్వరూప ఆత్మలైన పిల్లలే ప్రియమైనవారు, అందుకే తండ్రి సమానముగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వండి’’

ప్రశ్న:-
కళ్యాణకారీ యుగములో తండ్రి పిల్లలందరికీ ఏ స్మృతిని ఇప్పిస్తారు?

జవాబు:-
పిల్లలూ, మీరు మీ ఇంటిని విడిచి 5 వేల సంవత్సరాలయ్యింది. మీరు 5 వేల సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడిది అంతిమ జన్మ, వానప్రస్థ అవస్థ, అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి, తర్వాత సుఖధామములోకి వస్తారు. గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అయి తండ్రిని స్మృతి చేయండి.

పాట:-
సభలో జ్యోతి వెలిగింది...

ఓంశాంతి
భగవంతుడు ఒక్కరే, గాడ్ ఈజ్ వన్ అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. సృష్టి రచయిత ఒక్కరే, అనేకమంది రచయితలు ఉండజాలరు. ఈ సిద్ధాంతము అనుసారముగా మనుష్యులు తమను తాము భగవంతుడిగా చెప్పుకోలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవకు నిమిత్తము అయ్యారు. ఈశ్వరుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు, దానిని సత్యయుగమని అంటారు, అక్కడి కోసమే మీరు యోగ్యులుగా అవుతున్నారు. సత్యయుగములో పతితులెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు పావనముగా అవుతూ ఉన్నారు. బాబా అంటారు - నేను పతిత-పావనుడిని మరియు పిల్లలైన మీకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నాను, అదేమిటంటే - నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు పతిత తమోప్రధానుల నుండి పావన సతోప్రధానులుగా అయిపోతారు. స్మృతి రూపీ యోగాగ్నితో మీ పాపాలు నశిస్తాయి. సాధువులు మొదలైనవారైతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఒకవైపు, భగవంతుడు ఒక్కరే అని అంటారు, కానీ ఇక్కడైతే అనేకమంది తమను తాము భగవంతునిగా చెప్పుకుంటారు. శ్రీ శ్రీ 108 జగద్గురువు అని చెప్పుకుంటారు. ఇప్పుడు జగత్తుకు గురువైతే ఒక్క తండ్రి మాత్రమే. మొత్తం జగత్తును పావనముగా చేసేవారు ఒక్క పరమాత్మ, వారు మొత్తం ప్రపంచాన్ని దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు. వారే దుఃఖహర్త-సుఖకర్త. మనుష్యులను అలా అనలేము. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. అందరూ పతితముగా ఉన్నారు. పావన ప్రపంచములో యథా మహారాజ-మహారాణి తథా ప్రజ ఉంటారు. సత్యయుగములో పూజ్య మహారాజులు, మహారాణులు ఉంటారు. తర్వాత భక్తి మార్గములో పూజారులుగా అయిపోతారు. సత్యయుగములో ఉండే మహారాజు, మహారాణులలో ఎప్పుడైతే రెండు కళలు తగ్గుతాయో అప్పుడు వారిని రాజు-రాణి అని అంటారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు, లేదంటే ఒక్క సెకెండులో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ ఈ అంతిమ జన్మ పవిత్రముగా ఉండండి. ఇప్పుడిది వానప్రస్థ అవస్థ. వానప్రస్థము అన్నా, శాంతిధామము అన్నా విషయము ఒక్కటే. అక్కడ ఆత్మలు బ్రహ్మతత్వములో ఉంటాయి, దానిని బ్రహ్మాండము అని అంటారు. వాస్తవానికి ఆత్మలేమీ అండాకారములో ఉండవు. ఆత్మ నక్షత్రము వంటిది. బాబా అర్థం చేయించారు, ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో, వారు ఈ డ్రామాలోని పాత్రధారులు. ఏ విధముగా నాటకములో పాత్రధారులు డ్రెస్ లు మారుస్తారో, రకరకాల పాత్రలను అభినయిస్తారో, అలాగే ఇది కూడా అనంతమైన నాటకము. ఆత్మలు ఈ సృష్టిపై 5 తత్వాలతో తయారుచేయబడిన శరీరాలలోకి ప్రవేశించి ప్రారంభము నుండి మొదలుకుని పాత్రను అభినయిస్తాయి. పరమాత్మ మరియు బ్రహ్మా, విష్ణు, శంకరులు, అందరూ పాత్రధారులే. నాటకములో పాత్రను అభినయించేందుకు రకరకాల డ్రెస్సులు లభిస్తాయి. ఇంటిలో ఆత్మలన్నీ శరీరము లేకుండా ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే 5 తత్వాల శరీరము తయారవుతుందో అప్పుడు అందులోకి ప్రవేశిస్తుంది. 84 శరీరాలు లభిస్తాయి కావున పేర్లు కూడా అన్ని మారుతాయి. ఆత్మ పేరు ఒక్కటే. ఇప్పుడు శివబాబా అయితే పతిత-పావనుడు, వారికి తమదంటూ శరీరము లేదు. శరీరము యొక్క ఆధారాన్ని తీసుకోవలసి ఉంటుంది. వారు అంటారు, నా పేరు శివ మాత్రమే. నేను పాత శరీరములోకి వస్తాను. వీరి శరీరానికంటూ పేరు ఉంటుంది. వీరికి వ్యక్త నామముంది, తర్వాత అవ్యక్త నామము పెట్టడము జరిగింది. ఒక ధర్మానికి చెందినవారు వేరే ధర్మాల్లోకి వెళ్ళినప్పుడు పేరు మారిపోతుంది. మీరు కూడా శూద్ర ధర్మము నుండి మారి బ్రాహ్మణ ధర్మములోకి వచ్చారు కావున పేరు మారింది. మీరు శివబాబా త్రూ బ్రహ్మా (శివబాబా బ్రహ్మా ద్వారా) అని వ్రాస్తారు. శివబాబా పరమపిత పరమాత్మ, వారి పేరు మారదు. శివబాబా బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు, అది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఎవరైతే పావన పూజ్యులుగా ఉండేవారో, వారే పతిత పూజారులుగా అవుతారు. 84 జన్మలను పూర్తి చేసారు. ఇప్పుడు మళ్ళీ దేవీ-దేవతా ధర్మము స్థాపన అవుతుంది. పరమపిత పరమాత్మ వచ్చి బ్రహ్మా ద్వారా మళ్ళీ స్థాపన చేయిస్తారని అంటూ ఉంటారు, కనుక బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రహ్మా మరియు బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు. శివబాబా వచ్చి బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. మీరు నా వారు అని అంటారు. మీరు శివబాబాకు ఎలాగూ పిల్లలే, ఆ తర్వాత బ్రహ్మా ద్వారా మనవులుగా అవుతారు. మొత్తం ప్రజలందరికీ పిత ఒక్కరే. ఇంతమంది పిల్లలందరూ కుమార, కుమారీలు. వారిని శివబాబా బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. ఇది మనుష్యులకు తెలియదు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అలాగని ఆత్మలు కొత్తగా వస్తూ ఉంటారని కాదు. ప్రళయము జరిగిందని, ఆ తర్వాత సాగరములో రావి ఆకుపై వచ్చారని చూపిస్తారు... ఇప్పుడు ఈ కథలన్నీ తయారుచేయబడినవి. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికము రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మ అమరమైనది, అందులోని పాత్ర కూడా అమరమైనదే. పాత్ర ఎప్పుడూ అరిగిపోదు. సత్యయుగములో ఆ లక్ష్మీ-నారాయణులదే సూర్యవంశీ రాజధాని కొనసాగుతూ వస్తుంది. అది ఎప్పుడూ మారదు. ప్రపంచము కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ అవినాశీ పాత్ర లభించి ఉంది.

తండ్రి అంటారు, భక్తి మార్గములో భక్తులు ఏయే భావనలతో భక్తి చేస్తూ ఉంటారో, ఆ విధముగానే సాక్షాత్కారాలు చేయిస్తాను. కొంతమందికి హనుమంతుడి సాక్షాత్కారము, కొంతమందికి గణేశుడి సాక్షాత్కారము కూడా చేయిస్తాను, వారి ఆ శుభ భావనలను నెరవేరుస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. కానీ మనుష్యులు భగవంతుడు అందరిలోనూ ఉన్నారని భావిస్తారు, అందుకే సర్వవ్యాపి అని అంటారు. భక్త మాల కూడా ఉంది, పురుషులలో నారదుడిని శిరోమణిగా, స్త్రీలలో మీరాను శిరోమణిగా చెప్పుకుంటూ ఉంటారు. భక్త మాల వేరు, రుద్ర మాల వేరు, జ్ఞాన మాల వేరు. భక్తుల మాల ఎప్పుడూ పూజింపబడదు. రుండ మాల (వైజయంతి మాల) పూజింపబడుతుంది. పైభాగములో పుష్పము ఉంటుంది, ఆ తర్వాత జంటపూసలు... ఆ తర్వాత రాజ్య సింహాసనముపై కూర్చునే పిల్లలు ఉంటారు. వైజయంతి మాలయే విష్ణుమాల. భక్తుల మాలకు కేవలం గాయనము జరుగుతుంది. ఈ రుద్రమాలనైతే అందరూ తిప్పుతారు. మీరు భక్తులు కారు, జ్ఞానులు. తండ్రి అంటారు, నాకు జ్ఞాన స్వరూప ఆత్మలు ప్రియమనిపిస్తారు. తండ్రియే జ్ఞాన సాగరుడు, వారు పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మాల కూడా మీదే పూజింపబడుతుంది. 8 రత్నాలకు కూడా పూజ జరుగుతుంది, ఎందుకంటే వారు జ్ఞాన స్వరూప ఆత్మలు కావున వారికి పూజ జరుగుతుంది. 8 రత్నాల ఉంగరాన్ని చేయించుకుని ధరిస్తారు ఎందుకంటే వారు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. వారు పాస్ విత్ ఆనర్ అవుతారు కావున వారి గాయనము ఉంది. 9వ పూసగా మధ్యలో శివబాబాను పెడతారు. వాటిని నవరత్నాలని అంటారు. ఇది విస్తారముగా వివరించడము. తండ్రి అయితే కేవలం ఇదే మాట చెప్తున్నారు - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు. పతితాత్మలు పావన ప్రపంచములోకి వెళ్ళలేరు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. దేవతల శరీరాలైతే పవిత్రముగా, నిర్వికారిగా ఉంటాయి. వారు పూజ్యులు, యథా రాజా-రాణి తథా ప్రజ అందరూ పూజ్యులే. ఇక్కడ అందరూ పూజారులు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. దానిని స్వర్గము, సుఖధామము అని అంటారు. అక్కడ సుఖము, సంపద, శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడు అవేవీ లేవు, అందుకే దీనిని నరకమని, దానిని స్వర్గమని అంటారు. ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. అక్కడ నుండి పాత్రను అభినయించడానికి వస్తాము. 84 జన్మలను పూర్తిగా అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడిది దుఃఖధామము, తర్వాత మనము శాంతిధామానికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వస్తాము. తండ్రి సుఖధామానికి యజమానులుగా తయారుచేయడానికి, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి పురుషార్థము చేయిస్తున్నారు. ఇది మీ సంగమయుగము. తండ్రి అంటారు, నేను కల్పము యొక్క సంగమయుగములో వస్తాను, అంతేకానీ ప్రతి యుగములోనూ రాను. నేను సంగమయుగములో ఒక్కసారి మాత్రమే సృష్టిని పరివర్తన చేయడానికి వస్తాను. సత్యయుగము ఉండేది, ఇప్పుడిది కలియుగము, మళ్ళీ సత్యయుగము రావాలి. ఇది కళ్యాణకారీ సంగమయుగము. అందరి కళ్యాణము జరగాలి, అందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. వారిని దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు. మీరు సుఖధామములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తారు. సుఖధామములోకి వెళ్ళాలంటే ముందు శాంతిధామానికి వెళ్ళాలి. మీరు పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ 5 వేల సంవత్సరాలు గడిచిపోయింది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మీ ఇంటిని వదిలి 5 వేల సంవత్సరాలయ్యింది. ఇందులో భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ, అందరిదీ వానప్రస్థ అవస్థ. అందరూ వెళ్ళాల్సిందే. జ్ఞాన సాగరుడు మరియు రుద్రుడు అని గాయనము కూడా ఉంది. ఇది శివ జ్ఞాన యజ్ఞము. పతిత-పావనుడు శివుడు, పరమాత్మ కూడా శివుడే. రుద్రుడు అన్న పేరును భక్తులు పెట్టారు, వారి అసలు పేరు ఒక్క శివ మాత్రమే. శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మా ఒక్కరే. పతితముగా ఉన్న ఈ బ్రహ్మాయే పావనముగా అయినప్పుడు ఫరిశ్తాగా అయిపోతారు. సూక్ష్మవతనములో చూపించే బ్రహ్మా వేరే బ్రహ్మా కాదు. బ్రహ్మా ఒక్కరే. వీరు వ్యక్తములో ఉన్నవారు, వారు అవ్యక్తమైనవారు. వీరు సంపూర్ణ పావనముగా అయినప్పుడు వీరిని సూక్ష్మవతనములో చూస్తారు. అక్కడ ఎముకలు మొదలైనవి ఉండవు.

బాబా అర్థం చేయించారు, ఏ ఆత్మకైతే శరీరము లభించదో, అది భ్రమిస్తూ ఉంటుంది, దానిని భూతమని అంటారు. ఎప్పటివరకైతే శరీరము లభించదో, అప్పటివరకు భ్రమిస్తుంది. వాటిలో కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. తండ్రి ప్రతి విషయము యొక్క వివరణను ఇస్తారు. వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా అర్థం చేయిస్తారు కదా. ఒక్క క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది. అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికార వారసత్వము) ను స్మృతి చేసినట్లయితే క్షణములో జీవన్ముక్తి యొక్క వారసత్వము లభిస్తుంది. ఇది ఎంత సహజము. దీని పేరే సహజ రాజయోగము. భారత్ యొక్క యోగము అదే అని వారు భావిస్తారు. కానీ అది సన్యాసుల హఠయోగము. ఇది చాలా సహజమైనది. యోగము అనగా స్మృతి. వారిది హఠయోగము, ఇది సహజయోగము. తండ్రి అంటారు, నన్ను ఈ విధముగా స్మృతి చేయండి. లాకెట్ మొదలైనవి ధరించే అవసరమేమీ లేదు. మీరైతే తండ్రికి పిల్లలు. తండ్రిని కేవలం స్మృతి చేయండి. మీరు ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అదే పాత్రను అభినయించాలి. భారతవాసులే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అవుతారు. ఈ మధ్యలో వేరే ధర్మాల వారు కూడా వస్తారు. 84 జన్మలను మీరు తీసుకుంటారు. మళ్ళీ మీరే నంబరువన్ లోకి వెళ్ళాలి. తర్వాత మీరు సత్యయుగములోకి వచ్చినప్పుడు, మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. ఇతర ధర్మాల వారికి వర్ణాలు లేవు. వర్ణాలు భారత్ లో మాత్రమే ఉన్నాయి. మీరే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణములో ఉన్నారు. బ్రహ్మావంశీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరి బుద్ధిలోనైతే ధారణ జరగదో, వారికి - కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రిని తెలుసుకోవడముతో కొడుకులకు ఇది నా ఆస్తి అన్నది తెలుస్తుంది కదా. కూతురులకైతే వారసత్వము లభించదు. ఇక్కడ మీరందరూ శివబాబాకు సంతానము, మీ అందరికీ హక్కు ఉంది. స్త్రీలు, పురుషులు, అందరికీ హక్కు ఉంది. శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ నేర్పించాలి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి, పతితము నుండి పావనముగా అవుతారు. ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరిందో, అది ఎలా తొలగుతుంది. తండ్రి అంటారు, యోగముతోనే మీ మాలిన్యము సమాప్తమైపోతుంది. ఈ పతిత శరీరాన్ని అయితే ఇక్కడే వదిలేయాలి. ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్ళిపోతాయి. సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ వినాశనములో ఎంతమంది మనుష్యులు మరణిస్తారు. కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రాజులైతే కొద్దిమందే ఉంటారు, మిగిలిన 9 లక్షల మంది ప్రజలు సత్యయుగములో ఉంటారు. 9 లక్షల సితారలు అని దీని గురించి పాడుతారు కూడా కదా, ఇక్కడ సితారలు అనగా ప్రజలు. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. ఇప్పుడైతే ఎంతమంది ఆత్మలు ఉన్నారు. తండ్రి వచ్చి అందరికీ గైడ్ గా అయి తీసుకువెళ్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగాగ్ని ద్వారా వికర్మల మాలిన్యాన్ని భస్మము చేసుకుని పావనముగా అవ్వాలి. ఇప్పుడిది వానప్రస్థ అవస్థ, అందుకే తిరిగి ఇంటికి వెళ్ళేందుకు సంపూర్ణ సతోప్రధానముగా అవ్వాలి.

2. ఈ కళ్యాణకారీ యుగములో తండ్రి సమానముగా దుఃఖహర్త-సుఖకర్తగా అవ్వాలి.

వరదానము:-
సదా కంబైండ్ స్వరూపపు స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని సహజము చేసే డబల్ లైట్ భవ

ఏ పిల్లలైతే నిరంతరము స్మృతిలో ఉంటారో వారు సదా తోడును అనుభవము చేస్తారు. వారి ఎదురుగా ఏ సమస్య వచ్చినా కానీ వారు స్వయాన్ని కంబైండ్ గా అనుభవము చేస్తారు, గాభరా పడరు. ఈ కంబైండ్ స్వరూపపు స్మృతి ఎటువంటి కష్టమైన కార్యాన్ని అయినా సహజము చేసేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయము ఎదురుగా వస్తే మీ భారాన్ని బాబాపై ఉంచి స్వయం డబుల్ లైట్ గా అయిపోండి, అప్పుడు ఫరిశ్తా సమానముగా పగలు-రాత్రి సంతోషములో మనసు ద్వారా నాట్యము చేస్తూ ఉంటారు.

స్లోగన్:-
ఏ కారణాన్ని అయినా నివారణ చేసి సంతుష్టముగా ఉండే మరియు సంతుష్టము చేసేవారే సంతుష్టమణులు.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ప్రతి అడుగు శ్రీమతమనుసారముగా ఉన్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు మరియు నిశ్చింతగా ఉన్నట్లయితే సదా యథార్థ నిర్ణయము ఇస్తారు. ఎప్పుడైతే నిర్ణయము యథార్థముగా ఉంటుందో అప్పుడు విజయులు అవుతారు. త్రికాలదర్శీ ఆత్మ సదా నిశ్చింతగా ఉంటుంది ఎందుకంటే మా విజయము లభించే ఉంది అని వారికి నిశ్చయము ఉంటుంది.